2.7 యువతలో అశాంతి మరియు ఆందోళన (Youth Unrest and Agitation) - GNANA SAMHITHA

GNANA SAMHITHA

DONT WORRY!!! WE HELP YOU TO REACH YOUR GOAL 😊

Breaking

Post Top Ad

Sunday, July 16, 2023

2.7 యువతలో అశాంతి మరియు ఆందోళన (Youth Unrest and Agitation)

2.7 యువతలో అశాంతి మరియు ఆందోళన (Youth Unrest and Agitation)


    ఏ దేశానికైనా అత్యంత విలువైన వనరు యువతే, ఆ యువత యొక్క నైపుణ్యాలు, పరిజ్ఞానం, అలవాట్లు మరియు శారీరక, మానసిక, ఆరోగ్య స్థాయిలను బట్టి, ఆయా సమాజాల యొక్క ప్రగతి ఉంటుంది కావున ఏ దేశంలోనైనా రూపొందించే విధానాలు ప్రధానంగా ఆయా యువత యొక్క భవిష్యత్ను దృష్టిలో ఉంచుకునే రూపొందిస్తారు. అయినప్పటికి అపోహలు, పరిపాలన సరిగ్గా లేకపోవడం, విభిన్న భావజాలాలు, సంక్షేమ యంత్రాంగం సరిగ్గా లేకపోవడం, హక్కుల ఉల్లంఘన, రాజకీయ ప్రేరేపణలు, ప్రాంతీయ వెనుకబాటు తనాలు, నిరుద్యోగం, విద్యాసౌకర్యాలు సరిగ్గా లేకపోవడం, రాజకీయ పార్టీలు సమాజం యొక్క ఆకాంక్షలను తీర్చలేకపోవడం, అవినీతి, బందుప్రీతి లాంటివి పెచ్చుమీరడం... మొదలగు కారణాల వలన సహజంగానే ఆయా ప్రాంతాల్లోని యువతలో అశాంతి మరియు ఆందోళనలు పెల్లుబికి కొన్ని సార్లు ఉద్యమ రూపంలోకి కూడా మారవచ్చు.


    యువత అంటే ఎవరు?


    • నూతన జాతీయ యువజన విధానం 2014 ప్రకారం 15-29 సంవత్సరాల మధ్యవయస్సు గల వారిని యువజనులుగా పరిగణిస్తారు. (మొదటి జాతీయ యువజన విధానం 2003 ప్రకారం 13-35 సం॥ వయస్సు గల వారిని యువతగా పరిగణించేవారు).
    • ఐక్యరాజ్యసమితి ప్రకారం 15-24 సంవత్సరాల మధ్యవయస్సు గల వారిని యువతగా పరిగణిస్తారు.
    • ప్రపంచంలోనే యువత జనాభా అధికంగా కలిగి ఉన్నది భారతదేశం, దేశ జనాభాలోని 65% జనాభా 35 సంవత్సరాల లోపే ఉన్నారు. 15-29 సంవత్సరాల వయస్సు గల వారు దేశ జనాభాలో 27.5% కలరు.
    • టి.కె. ఊమెన్ వారి ప్రకారం భారతదేశంలో యువత అనగా 15-30 సంవత్సరాల మధ్య గల వారు, వీరి ప్రకారం భారతీయ యువతలో మానసిక మరియు శారీరక సామర్థ్యాలు అధికం మరియు వీరి ప్రకారం యువత సాంప్రదాయ వాదానికి మరియు అభ్యుదయ వాదానికి మధ్యస్థంగా ఉంటారు. సాహసాలు చేయడానికి ఇష్టపడతారు, నూతన విషయాల పట్ల మక్కువ ఉంటుంది. సమాజంలో చొచ్చుకుపోయే ప్రయత్నం చేస్తారు.


    యువతలో అశాంతి మరియు ఆందోళన


    • అశాంతి అనగా చెదిరిఉన్న మానసిక, ఉద్వేగపరమైన మరియు శారీరక పరమైన స్థితి, ఇలాంటి స్థితికి యువత చాలా సులువుగా లోనవుతారు. సమాజంలో జరిగే ప్రతిమార్పు వీరిని ధనాత్మకంగానో లేదా రుణాత్మకంగానో ప్రభావితం చేస్తుంది.
    • నిరుద్యోగం, ధరల పెరుగుదల, ఫీజుల పెంపు, సీట్ల తగ్గింపు, అవినీతి రాజకీయాలు, రౌడీయిజం, కాలేజీలలో రాజకీయాలు, అసమర్థ పాలన లాంటి అంశాలు సహజంగానే యువతలో ఉమ్మడి అశాంతికి లోనవుతారు.
    • సామాజిక అశాంతి అనునది యువతలో అశాంతితో దగ్గరి సంబంధాన్ని కలిగి ఉంటుంది. ఒకవేళ సామాజిక అశాంతిలో యువత పాల్గొన్నప్పుడు అది ఉద్యమంగా మార్పు చెందుతుంది. తెలంగాణ సాధన ఉద్యమంలో, విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు ఉద్యమంలో, ప్రత్యేకాంధ్ర ఉద్యమంలో, సమైఖ్యాంధ్ర ఉద్యమంలో, అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమంలో, నిర్భయ ఉద్యమంలో యువత ఆందోళనే ఉద్యమ రూపంగా దాల్చింది.
    • యువత యొక్క అశాంతి మరియు ఆందోళనలో ప్రధానంగా ఉమ్మడి తత్వం, రాజకీయాలకు అతీతంగా మద్దతు, ప్రజాబలం అనునవి ప్రధానంగా చేయూతనందిస్తుంటాయి.


    యువతలో అశాంతి మరియు ఆందోళన రూపాలు (Forms of Youth Unrest in India)


    1. రాజకీయ కార్యకలాపాలతో కూడిన యువత ఉద్యమాలు. ఉదా: ప్రతిపక్ష పార్టీలకు చెందిన యువ విభాగాలు అధికార పక్షంపై చేసే ఉద్యమాలు.

    2. విద్యా-విషయేతర ఉద్యమాలు. ఉదా : దీనిలో ఉపాధిపరమైన ఉద్యమాలు, స్వయం ఉపాధి పథకాలకు సంబంధించిన ఉద్యమాలు, అవినీతికి సంబంధించిన ఉద్యమాలు మొ||నవి.

    3. విద్యకు సంబంధించిన ఉద్యమాలు. ఉదా: ఫీజులు, స్కాలర్షిప్ లు, రీయింబర్స్మెంట్లు, హాస్టల్ సౌకర్యాలు, బోధన అభ్యసన సౌకర్యాలకు సంబంధించిన ఉద్యమాలు.

    4. హఠాత్తుగా చేసే ఉద్యమాలు. ఉదా: పోలీసు చర్యలకు వ్యతిరేకంగా లేదా కాలేజీ యాజమాన్యాలకు వ్యతిరేకంగా హఠాత్తుగా చేసే ఉద్యమాలు.

    5. ప్రతిఘటన ఉద్యమాలు. ఉదా: ప్రభుత్వాలు మరియు కాలేజీ యాజమాన్యాలు తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకించే ఉద్యమాలు.

    6. ప్రభావ ఉద్యమాలు : యువత తమ ఆక్షాంక్షలను నెరవేర్చుకునేందుకు ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే ఉద్యమాలు.

    7. విప్లవాత్మక ఉద్యమాలు : వ్యవస్థలో అకస్మాత్తుగా మార్పులను తీసుకువచ్చేందుకై ఉద్ధేశించిన ఉద్యమాలు. ఉదా: ఆల్ అస్సాం స్టూడెంట్స్ ఉద్యమం 1994, బోడో విద్యార్థుల ఉద్యమం అస్సాం 1989-96 వరకు.


    అశాంతి బహిర్గతమయ్యే దశలు

    యువతలో అశాంతి ఈ క్రింది దశలలో బహిర్గతమవుతుంది.

    1. ప్రస్తుత పరిస్థితులపై అసంతృప్తి దశ

    2. కార్యాచరణ ఆరంభ దశ

    3. కార్యాచరణ అభివృద్ధి దశ

    4. ప్రజల యొక్క మద్దతు దశ


    యువతలో అశాంతికి మరియు ఆందోళనలకు గల కారణాలు


    ♦ రామ్ అహుజా గారు తన గ్రంథమైన సోషల్ ప్రాబ్లమ్స్ ఇన్ ఇండియా నందు యువతలో అశాంతికి ముందు గోచరించే పరిస్థితులను ఈ క్రింది దశలలో తెలిపాడు.

    1. నిర్మాణాత్మకమైన ఒత్తిడి

    2. ఒత్తిడికి కారణాలను గుర్తించండం

    3. చర్యలను ప్రారంభించడం

    4. ప్రజాసమీకరణ


    ♦ 1960వ సంవత్సరంలో యూనివర్సిటీ నిధుల సంఘం వారు యువతలో ఆందోళనపై వేసిన కమిటీ యొక్క నివేదిక ప్రకారం ప్రధాన కారణాలు

    1. ఫీజుల తగ్గింపు, స్కాలర్షిప్ పెంపు, సౌకర్యాలు లాంటి మొ|| ఆర్థికపరమైన కారణాలు.

    2. విద్యాపరమైన అంశాలైన అడ్మిషన్లు, పరీక్షల నిర్వహణ, మూల్యాంఖనం, భోదనా మరియు సీట్ల సంఖ్య లాంటి సమస్యలపై అశాంతి.

    3. విద్యాసంస్థల పరిపాలన సరిగ్గా లేకపోవడం, అవినీతి మరకలు అంటడం.

    4. సమాజంలో ఉన్న దురాచారాలైన కులతత్వం, మతతత్వం మరియు ప్రాంతీయతత్వం లాంటి అంశాలు కాలేజీ ఆవరణలోకి ప్రవేశించడం.

    5. కాలేజీలలో రాజకీయ అనుబంధ సంఘాలు


    ♦ పైన తెలిపిన కారణాలతో పాటు వెనుకబాటుతనం, యువత పట్ల వివక్షత, లోపాలతో కూడిన ఉద్యోగ కల్పన మరియు జీవనోపాధుల విధానాలు, అవినీతి, అసమర్థ ప్రభుత్వాలు, నిరుద్యోగం, ఆశ్రిత పక్షపాతం, రాజకీయ ప్రేరేపణలు, లోపభూయిష్టమైన విద్యావిధానాలు, యువత శక్తిని రాజకీయ నాయకులు దారిమళ్ళించడం, సామాజిక-రాజకీయ-ఆర్థిక అసమానతలు, సోషల్ మీడియాలో రెచ్చగొట్టే ధోరణులు లాంటివి, ప్రోనోగ్రఫి కూడా కారణమవుతున్నవి.


    భారతదేశంలో ముఖ్యమైన యువత ఆందోళనలు


    • 1984 అస్సాం రాష్ట్రంలో సంభవించిన ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ ఎజిటేషన్.
    • 1985లో గుజరాత్ రాష్ట్రంలో జరిగిన రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమాలు.
    • 1990 ప్రాంతంలో ఉత్తరభారతదేశంలో సంభవించిన మండల్ రిజర్వేషన్స్ వ్యతిరేక పోరాటాలు.
    • 1991లో ఆల్ ఝార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ ఉద్యమం.
    • 1994లో ఉత్తరప్రదేశ్లో సంభవించిన యువత ఉద్యమాలు.
    • నా ప్రారంభించిన అవినీతి వ్యతిరేక ఉద్యమంలో యువత అధికంగా పాల్గొన్నాడు.
    • 2013లో సంభవించిన నిర్భయ ఉద్యమం.
    • గుజరాత్లో హార్థిక్ పటేల్ నాయకత్వంలో యువత నడిపించిన పాటీదార్ అనామత్ ఆందోళన్ ఉద్యమం.


    యువతలో సామర్థ్యాల పెంపుదల ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమాలు


    నూతన జాతీయ యువజన విధానం-2014


    • అంతర్జాతీయ యువజన సంవత్సరం 1985 సం॥ నందు తీసుకున్న నిర్ణయం మేరకు 1988లో మొదటి జాతీయ యువజన విధానాన్ని మరియు దీనిస్థానంలో 2003లో 2వ విధానంను రూపొందించారు. ప్రస్తుతం 2014ను రూపొందించిన నూతన జాతీయ యువజన విధానం అమలులో కలదు. ఈ విధానం 2003 స్థానంలో ఫిబ్రవరి 2014న తీసుకువచ్చారు. 
    • దీని ప్రకారం 15-29 సం॥ల మధ్య వయస్సు గల వారు యువత.
    • యువత సాధికారత ద్వారా ప్రపంచ దేశాలలో భారతదేశం అత్యున్నత స్థానంలో నిలబడేలా చేయడమే ఈ విధానం యొక్క ప్రధాన లక్ష్యం. ఇందుకోసమై ఈ విధానం నందు 5 లక్ష్యాలను మరియు 11 ప్రాధాన్యత రంగాలను గుర్తించడం జరిగింది.


    5 లక్ష్యాలు మరియు 11 ప్రాధాన్య రంగాలు


    1. ఉత్పత్తి దాయకతతో కూడిన శ్రామిక వర్గాలను నిర్మించడం, తద్వారా భారత ఆర్థిక వ్యవస్థ సుస్థిరంగా కొనసాగడం. ఈ లక్ష్యాన్ని అధిగమించేందుకై (1) విద్య (2) ఉపాధి మరియు నైపుణ్యాభివృద్ధి (3) ఉద్యమతత్వం అనబడే ప్రాధాన్య రంగాలను ఎంచుకున్నారు.

    2. భవిష్యత్లో ఎదురయ్యే సవాళ్ళను స్వీకరించే దమ్మున్న యువతను తయారుచేయడం. ఈ లక్ష్యాన్ని అధిగమించేందుకు గాను (1) ఆరోగ్యం & జీవనశైలి (2) క్రీడలు అనే ప్రాధాన్యరంగాలను ఎంచుకోవడం జరిగింది.

    3. యువత నందు సామాజిక విలువలు మరియు సాముదాయ సేవాభావనలను పెంపొందించడం. ఈ లక్ష్యాన్ని అధిగమించేందుకు గాను (1) సముదాయ కార్యక్రమాలు (2) సామాజిక విలువల పెంపు అనే రంగాలను ఎంచుకున్నారు.

    4. పరిపాలనలో యువత భాగస్వామ్యాన్ని పెంపొందించడం. ఈ లక్ష్యాన్ని అధిగమించేందుకు గాను (1) పరిపాలనలో యువత (2) యూత్ ఎంగేజ్మెంట్ అనే రంగాలను ఎంచుకున్నారు.

    5. బలహీన వర్గాలకు చెందిన యువతకు సమాన అవకాశాలు కల్పించడం. ఈ లక్ష్యాన్ని అధిగమించేందుకు గాను (1) సంలీన చర్యలు (2) సామాజిక న్యాయం అనే అంశాలను ఎంచుకున్నారు.


    Rashtriya Yuva Sashaktikaran Karyakram Scheme (RYSK)


    ఇంతకు మునుపు అమలుచేస్తున్న యువజన సంక్షేమ పథకాలన్నింటిని కలిపి 2016వ సంవత్సరంలో RYSK అనే గొడుగు పథకమును ప్రారంభించారు. ప్రస్తుతం 2021-22 నుండి 2025-26 ఆర్థిక సం|| అమలుకోసమై 2710.65 కోట్లు కేటాయించారు.


    ప్రస్తుతం ఈ గొడుగు పథకంలో భాగంగా అమలవుతున్న కార్యక్రమాలు

    1. నెహ్రు యువకేంద్ర సంఘటన్

    2. నేషనల్ యూత్ క్రాప్స్

    3. నేషనల్ ప్రోగ్రామ్ఫర్ యూత్ & అడాలిసెంట్ డెవలప్మెంట్

    4. యూత్ హాస్టల్స్

    5. అంతర్జాతీయ సహకారం

    6. స్కౌటింగ్ మరియు గైడింగ్ సంస్థలకు సహాయం

    7. నేషనల్ డిసిప్లైన్ స్కీమ్

    8. నేషనల్ యంగ్ లీడర్స్ ప్రోగ్రామ్


    ♦ పై పథకాలతో పాటుగా నేషనల్ సర్వీస్ స్కీమ్ మరియు రాజీవ్ గాంధీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూత్ డెవలప్మెంట్ అనే సంస్థ అందిస్తున్న సేవలు కూడా కలవు.

    1. నెహ్రు యువకేంద్ర సంఘటన్ : 1972లో ప్రారంభించారు. ఇది అతిపెద్ద యువజన సంస్థ. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 623 జిల్లాల్లో నెహ్రు యువకేంద్రాలు కలవు. యువతలో వ్యక్తిత్వాన్ని పెంపొందించడం మరియు జాతినిర్మాణ కార్యక్రమాలల్లో పాల్గొనేలా చెయ్యడం ఈ పథకం యొక్క లక్ష్యం.

    2. నేషనల్ యూత్ క్రాప్స్ : దేశవ్యాప్తంగా వాలంటర్లను ఎంపికచేసి వారిలో జాతీయతను వృద్ధిచేయడం.

    3. నేషనల్ ప్రోగ్రామ్ఫర్ యూత్ & అడాలిసెంట్ డెవలప్మెంట్ : 01-04-2008లో ప్రారంభించారు. ఈ పథకంలో భాగంగా యువత మరియు కౌమారులకోసం సేవలు అందించే వివిధ రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు, ఎన్.జి.ఓలకు ఆర్థిక పరమైన సహాయాన్ని అందిస్తారు.

    4. నేషనల్ సర్వీస్ స్కీమ్ (ఎన్.ఎస్.ఎస్) : 1969లో ప్రారంభించారు. స్వచ్ఛంద సముదాయ సేవ ద్వారా విద్యార్థుల్లో సరైన మూర్తిమత్వాన్ని పెంపొందించడమే ఈ పథకం యొక్క ముఖ్యలక్ష్యం. అనగా సేవద్వారా విద్య అనుసూత్రాన్ని ఈ పథకం అనుసరిస్తుంది. 'నాట్ మి బట్ యు' అనునది ఎన్.ఎస్.ఎస్ పథకం యొక్క నినాదం. ఈ పథకంలో భాగంగా విద్యార్థులను వాలంటరీ సేవకులుగా సముదాయంలో సేవలందించే వారిగా రూపొందిస్తారు.

    5. రాజీవ్ గాంధీ నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ యూత్ డెవలప్మెంట్ : తమిళనాడు రాష్ట్రంలోని స్త్రీ పెరంబదూర్ నందు ఈ సంస్థను 1993లో ఏర్పాటు చేశారు. కానీ 2012వ సంవత్సరంలో ఈ సంస్థను చట్టబద్ధ సంస్థగా మార్చారు. వతకు సంబంధించిన అంశాల పరిశోధన మరియు శిక్షణ కార్యక్రమాలను ఈ సంస్థ నిర్వహిస్తుంది.

    6. నేషనల్ యంగ్ లీడర్స్ ప్రోగ్రామ్ : డిసెంబర్ 2014న ప్రారంభించారు. యువతలో లీడర్షిప్ లక్షణాలు పెంపొందించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం.


    నోట్:

    • నేషనల్ అడ్వైజరీ బోర్డు ఆన్ యూత్ని 1969లో ఏర్పాటు చేశారు.
    • జాతీయ యువజన దినోత్సవంను స్వామి వివేకానంద జన్మదినం అయిన జనవరి 12 న జరుపుకుంటారు.
    • 1985వ సంవత్సరాన్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ యూత్గా జరుపుకుంటారు.
    • 12 ఆగస్టును అంతర్జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటారు.
    • ఆంధ్రప్రదేశ్ యువజన విధానాన్ని 2017వ సంవత్సరంలో రూపొందించారు.
    • జూలై 15ని అంతర్జాతీయ యువజన నైపుణ్యాల దినోత్సవంగా జరుపుకుంటారు.


    యువతలో నైపుణ్యాల వృద్ధి


    • జాతీయ నైపుణ్యాభివృద్ధి మరియు ఉద్యమతత్వ విధానం మొదటిసారిగా 2009లో రూపొందించారు. ఈ విధానం స్థానంలో 15-జూలై-2015న నూతన విధానాన్ని రూపొందించారు.
    • 15 జూలై 2015న నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ మిషన్ని ప్రధానమంత్రి ప్రారంభించారు.
    • 1956లో నేషనల్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ట్రైనింగ్ని స్థాపించారు.
    • 2013లో నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ ఏజెన్సీని స్థాపించారు.
    • 2009లో నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ ఫండ్ని ఏర్పాటుచేశారు.
    • యువతలో నైపుణ్యాభివృద్ధి కోసం 15 జూలై 2015న ప్రధానమంత్రి కౌశల్వికాస్ యోజన పథకాన్ని ప్రారంభించారు.
    • సంకల్ప్ అనే కార్యక్రమాన్ని 19 జనవరి 2018న ప్రారంభించారు. ఈ పథకం మార్చి 2023 వరకు అమలులో ఉంటుంది. యువతలో నైపుణ్యాల పెంపుదలకు మరియు మార్కెట్ అవసరాలకు అనుగుణమైన శిక్షణ పొందేందుకు కావల్సిన సంస్థాగత ఏర్పాట్లను ఈ పథకంలో భాగంగా అమలుపరుస్తున్నారు. ఈ పథకం 6 సంవత్సరాల కాలం పాటు అమలులో ఉంటుంది.
    • జమ్ముకాశ్మీర్ యువతలో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు 'ఉడాన్' అనే పథకాన్ని అమలుచేస్తున్నారు.
    • జూలై 31, 2008న నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ని ప్రారంభించారు.
    • మే 14, 2015న ప్రారంభించిన ఉస్తాద్ అనే పథకం ద్వారా ముస్లిం మైనార్టీ వర్గాలకు చెందిన యువతలోని హస్తకళా నైపుణ్యాలను వెలికి తీస్తున్నారు.
    • 2013లో ప్రారంభించిన 'సీకో ఔర్ కామో' అనే పథకం ద్వారా మైనార్టీ యువతలో నైపుణ్యాన్ని పెంపొందిస్తున్నారు.
    • 2015లో ప్రారంభించిన 'నయి మంజిల్' అనే పథకం ద్వారా నియత విద్య లేని మైనార్టీ యువతకు జీవనోపాధులుఅందేలా చేస్తున్నారు.
    • 2017 సంవత్సరం బి.డి. కార్మికుల నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించారు.


Tags: Caste system, gender roles, joint families, arranged marriages, diversity, cultural festivals, social hierarchy, economic disparities, religious practices, education system, urbanization, rural traditions, globalization, modernization


No comments:

Post a Comment

Post Bottom Ad