2.2 మతతత్వం/వాదం (Communalism) - GNANA SAMHITHA

GNANA SAMHITHA

DONT WORRY!!! WE HELP YOU TO REACH YOUR GOAL 😊

Breaking

Post Top Ad

Friday, July 14, 2023

2.2 మతతత్వం/వాదం (Communalism)

2.2 మతతత్వం/వాదం (Communalism)


    సామాజిక సాంస్కృతిక వైరుధ్యాల ఫలితంగా వివిధ మతాల మధ్య ఉత్పన్నమయ్యే విరోధ భావనల తుది రూపమే మతతత్వం. వివిధ మతాల మధ్య ఉన్న వైరుధ్యమైన సాంప్రదాయాలు, చారిత్రక, రాజకీయ మరియు సాంస్కృతిక కారణాలతో పాటు మత ఛాందసవాదం మతతత్త్వానికి మరియు మతతత్త్వ ఫలితమైన మత సంఘర్షణలు, మత మార్పిడిలు మరియు మతపరమైన ఉగ్రవాదం లాంటి అంశాలకు కారణాలు అవుతున్నవి. జాతీయ సమైక్యతకు, సమగ్రతకు మరియు విశ్వశాంతికి ఆటంకం కలిగిస్తున్న మతతత్వం గురించిన అన్ని అంశాలు ఈ పాఠ్యాంశం నందు వివరించడమైనది.


    నిర్వచనాలు మరియు అర్థం


    • ఆధునిక భారతదేశంలో మతతత్వం అనే గ్రంథంలో బిపిన్ చంద్ర, మతతత్వానికి ప్రధాన కారణం ఇతర మతాల పట్ల కుల ఘర్షణ పూరితమైన వైఖరిని కల్గి ఉండడం అని తెలిపాడు.
    • మతవాదం ఒక రాజకీయ సిద్ధాంతం ఇది రాజకీయ ప్రయోజనాలను సాధించడం కోసం వివిధ మతాల మధ్య ఉన్న మతసాంస్కృతిక వ్యత్యాసాలను వినియోగించుకుంటుంది - ప్రభాదీక్షిత్.
    • సమస్యను సృష్టించే సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ దృక్పథంను అర్థం చేసుకునే సామాజిక స్థితుల ఫలితమే మతవాదం - బిపిన్ చంద్ర.
    • కె.యం. అష్రఫ్ అభిప్రాయంలో రాజకీయ ప్రయోజనాలు పొందేందుకు మాత్రమే వ్యక్తుల్లోని మతం అనే మానసిక భావననే మతతత్వంగా మారుస్తారు.
    • మతపరమైన ఉమ్మడి ఆచరణలు, సంస్కారాలు, సామాజిక రాజకీయ & ఆర్థికపరమైన విలువలలో తలెత్తే వైరుధ్యాలను ఆసరగా చేసుకొని రాజకీయ లబ్ధికోసం & ఆర్థిక లబ్ధికోసం ప్రదర్శించేదే మతతత్వం.
    • సెక్యులరిజం అనే పదాన్ని మతవాదానికి వ్యతిరేక అర్థానిచ్చేదిగా ఉపయోగిస్తున్నారు, లాటిన్ భాషలో సెక్యులం అనగా ప్రస్తుత కాలానికి సంబంధించిన అనే అర్థం కలదు కాని సాధారణ పరిభాషలో అన్ని మతాల పట్ల సమానత్వ వైఖరిని కలిగి ఉండడాన్నే సెక్యులరిజంగా లేదా లౌకికవాదంగా పరిగణిస్తారు.


    మతతత్వం యొక్క లక్షణాలు


    • మతభావజాలం వ్యాప్తితో కూడుకుని ఉంటుంది. ప్రజలలో శత్రుత్వం, హింస మరియు తన్యతలు ఏర్పడటానికి దారితీస్తుంది.
    • మతంలోని ఉన్నతవర్గాలు తమ ప్రయోజనాల కోసం పెంచి పోషించే ధోరణి కనపడుతుంది.
    • మత పరమైన రాజకీయ ఏకీకరణ కోసం చేసే ప్రయత్నాలు ఉంటాయి.
    • ప్రజాస్వామ్యం, లౌకికవాదం మరియు జాతిసమైక్యతలకు ఆటంకంగా ఉంటుంది.
    • ఒక ప్రాంతంలో మత అల్లర్లు చెలరేగినట్లయితే అవి మరల అవే ప్రాంతంలో చెలరేగే అవకాశం ఉంటుంది.


    మతతత్వ రూపాలు (Forms of Communalism)


    రామ్ అహుజా అభిప్రాయంలో ప్రధానంగా మతతత్వం ఈ క్రింది 3 రూపాల్లో కనిపిస్తుంది.

    1. రాజకీయ మతతత్వం

    2. ఆర్థిక మతతత్వం

    3. మతపరమైన మతతత్వంగా ఉంటుంది.


    టి.కె. ఉమెన్ అనునతడు మతతత్వాన్ని 6 రకాలుగా వర్గీకరించాడు. అవి...


    1. విళీనీకరణ మతతత్వం: సాధారణంగా మతమార్పిడులు మరియు మతాంతీకరణ మరియు విలీనకరణ లాంటి రూపాలలో ఈ మతతత్వం గోచరిస్తుంది. ఉదా: భారతదేశంలోని గిరిజనులందరు హిందూమతం నందు విలీనమవడం, ప్రపంచంలోని గిరిజన జాతులు అధికంగా క్రైస్తవంలో విలీనమవడం.


    2. సంక్షేమాత్మక మతతత్వం: మత సంఘాలను స్థాపించి వాటిని ఆయా మత సభ్యుల యొక్క సంక్షేమం కోసం అమలు పరుస్తూ మరియు సంక్షేమాన్ని అందిస్తూ మతమార్పిడులకు పాల్పడడాన్ని కూడా సంక్షేమాత్మక మతతత్వం అంటారు. ఉదా: క్రిస్టియానిటి


    3. పురోగమన మతతత్వం: నూతన మత సిద్ధాంతాలను మరియు విశ్వాసాలను బోధించి సాంప్రదాయ మతాలను విమర్శించే లేదా విభేదించే ధోరణిని పురోగమన మతతత్వం అంటారు.


    4. వైరుధ్యపూరిత లేదా ప్రతీకారాత్మక మతతత్వం: ఒక మత సమూహం ఇతర మత సమూహాల పట్ల తీవ్ర సంఘర్షణను కలిగి ఉండి వారికి హానికలిగించాలనే ధోరణితో ఉన్నట్లయితే దానిని వైరుధ్యపూరిత మతతత్వం అంటారు. ఉదా: ఇస్లాం జీహాదీ దాడులు.


    5. ప్రత్యేకవాద మతతత్వం: ఒక మత సమూహం తమ సమూహానికి, మతానికి ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని చూపే సంఘర్షణాత్మక ధోరణే ప్రత్యేకవాద మతతత్వం అంటారు. ఉదా: అస్సాంనందు గల బోడోల్యాండ్ ఉద్యమం మరియు పశ్చిమబెంగాల్ నందు గల గూర్ఖాలాండ్ ఉద్యమం.


    6. వేర్పాటువాద మతతత్వం: మా మతస్థులకు ప్రత్యేక దేశం కావాలని దేశాన్ని వ్యతిరేకించే మతతత్వాన్ని వేర్పాటువాద మతతత్వం అంటారు. ఉదా: ఖలిస్థాన్ వేర్పాటువాద ఉద్యమం


    మతతత్వం - కారణాలు


    మైనారిటీలకు ఉన్న అరక్షణ వైఖరి మరియు స్వంత అస్థిత్వ ధోరణులు

    జాతీయత భావంలో కలిసి ముందుకు వెళ్ళడానికి అల్పసంఖ్యాక వర్గాలు వెనుకబడడానికి ప్రధాన కారణం. మెజారిటీ మతస్థుల సంస్కృతిలో వారియొక్క సొంత సంస్కృతి విలీనమయిపోతుందేమోననే అభిప్రాయం కలిగి ఉండటం.


    మత ఛాందస వాదం

    మత ఛాందస వాదం అనగా గుడ్డిగా మరియు హేతువాద దృక్పథం లేకుండా కాలం చెల్లిన నమ్మకాలని పాటించడం.


    చారిత్రక కారణాలు & మతపరమైన సంస్థల ఏర్పాట్లు


    ♦ అజీవకులపై అశోకుడి దాడి చేసి తీవ్రమైన మతహింసకు పాల్పడ్డాడు.

    ♦ మహ్మద్ అలీజిన్నా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ని కేవలం హిందువుల పార్టీగా భావించిన ఫలితంగా మహమ్మదీయులకోసం ముస్లిం లీగ్ అనే పార్టీ మతం ఆధారంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ క్రమంలోనే హిందూ ముస్లిం సంఘర్షణలు తీవ్రరూపం దాల్చినవి.

    ♦ స్వాతంత్రోద్యమంలో భాగంగా ప్రజల యొక్క భావోద్వేగాలను అంకురార్పణ చేసి ఉద్యమంలో భాగస్వాములను చేసేందుకై తప్పనిసరి పరిస్థితులలో గణపతి, శివాజీలాంటి మతపరమైన ఉత్సవాలు చోటు చేసుకోవడం జరిగింది.

    ♦ 1906లో ముస్లింలీగ్ ఏర్పాటుతో హిందూ ముస్లింల మధ్య విభజన పూర్తిస్థాయిలో తేటతెల్లమైంది.

    ♦ 1909 మింటోమార్లే సంస్కరణలు హిందువులలో అసంతృప్తిని రేపినవి మరియు బెంగాల్ విభజనకు ముస్లిం లీగ్ సహకారం అందించడం కూడా హిందూ ముస్లిం ఘర్షణలను తీవ్రతరం చేసినవి.

    ♦ యం.డి. అలీ జిన్నా యొక్క 'ద్విజాతి సిద్ధాంతం' అనునది కేవలం హిందూవులు వేరు మరియు ముస్లింలు వేరు అనే సిద్ధాంతం ఆధారంగా ఏర్పడింది.

    ♦ మహ్మద్ అలీ జిన్నా ముస్లిం లీగ్ను ఏర్పాటు చేయడంతో హిందూ సంస్థల ఏర్పాటు ప్రారంభమైంది. అందులో భాగంగా 1914లో హరిద్వార్ నందు మదన్ మోహన్ మాలవ్య గారు హిందూమహాసభను స్థాపించారు. 1925లో కె.బి. హెగ్దేవార్ గారు నాగపూర్ నందు హిందూ సంస్కృతి మరియు ధర్మ పరిరక్షణ కోసం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అనే సంస్థను ఏర్పాటు చేశారు మరియు 1964లో గోల్వాల్కర్, ఆప్టే & స్వామి చిన్మయానందలు కలిసి అంతర్జాతీయ స్థాయిలో హిందూ ధర్మ పరిరక్షణ కోసం విశ్వహిందూపరిషత్ అనే సంస్థను ఏర్పాటు చేశారు.

    ♦ 72 ఇస్లాం తెగలను ఏకం చేయడానికి బహదూర్ యార్ జంగ్ అధ్యక్షతన 1927లో యం.ఐ.యం. అనే సంస్థ ఏర్పాటైంది. తర్వాతి కాలంలో ఈ సంస్థే రజాకార్ల చేతిలోకి వెళ్ళి తీవ్రమైన హిందూ-ముస్లిం మత ఘర్షణలకు కారణమైంది.

    ♦ ఇంగ్లాండ్ నందు రహమత్ అలీ చేసిన 1. పాకిస్థాన్ 2. బంగే ఇస్లాం 3. ఉస్మానిస్తాన్ అనే 3 దేశాల ప్రతిపాదన అనునది ఇరువర్గాల మధ్య తీవ్రఘర్షణలకు దారితీసినది.

    ♦ చారిత్రకంగా జరిగినటువంటి హిందూ సంస్కృతి మరియు ఆలయాలపై జరిగినటువంటి దాడులు కూడా హిందువులలో అసంతృప్తి భావాలను పాదుకొల్పినవి. హిందూ కట్టడాలపై జరిగిన ముఖ్యమైన దాడులు

    1. 1311లో శ్రీరంగం టెంపుల్పై మాలిక్ కాఫర్ దాడి

    2. 1194లో వారణాసిపై ఘోరిమహ్మద్ దాడులు

    3. 1024లో సోమనాథ్ టెంపుల్పై ఘజినీ మహ్మద్ దాడి

    4. దేశవ్యాప్తంగా వేలాది గుడులు ముస్లింల పాలనలో నేలమట్టమైనవి

    ♦ ఆంగ్ల చరిత్రకారుడు అయినటువంటి జేమ్స్ మిల్ యొక్క చరిత్ర వక్రీకరణ రచనలు కూడా హిందూ-ముస్లింల సంఘర్షణలకు కారణమైనవి.

    ♦ 1924లో హిందూ ముస్లిం ఐక్యతకోసం గాంధి చేసిన నిరాహార దీక్ష వైఫల్యం చెందడం కూడా హిందూ-ముస్లిం సమస్యలకు కారణమైనది.

    ♦ మహ్మద్ అలీ జిన్నా 1946 ఆగస్టు 16న పిలుపునిచ్చిన ప్రత్యక్షా చర్య దినం తీవ్రమైన హిందూ ముస్లిం సంఘర్షణలకు కారణమైంది.


    మానసిక కారణాలు

    అపనమ్మకం, భయం, వ్యతిరేక భావన మరియు ఆందోళనలు లాంటివి కూడా ఇతర మతాల పట్ల ద్వేషభావాన్ని పెంపొందించే అవకాశం ఉంటుంది.


    భౌగోళిక కారణాలు

    ఏ ప్రాంతంలోనైతే వివిధ మతసమూహాలు నివసిస్తాయో ఆ ప్రాంతంలో ఆయా మతాల మధ్య కొన్ని సందర్భాలలో ఘర్షణలు చెలరేగే అవకా ఉంటుంది.


    అంతర్జాతీయ కారణాలు

    శత్రుదేశాల ప్రోద్బలం, అంతర్జాతీయ మతమార్పిడి మాఫియ, దేశాల మధ్య గల ఆర్థికపోటీ కూడా అంతర్గతంగా ఉన్నటువంటి మతస్పర్ధలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తాయి.


    రాజకీయపరమైన మరియు ఇతర కారణాలు


    • 1970లో మహారాష్ట్రలో జరిగిన మత అల్లర్లపై వేసిన 'మదన్ కమీషన్', మతము, రాజకీయాలు కలవడం వల్లనే మతతత్వం ఉద్భవిస్తుందని అభిప్రాయపడింది.
    • మతపరమైన పార్టీల స్థాపన, మత పరమైన వెనుకబాటుతనం మరియు మైనారిటి బుజ్జగింపు రాజకీయాలు.
    • హిందూ తీవ్ర జాతీయ వాదం.
    • రాజకీయ పరమైన దురుద్ధేశాలతో మతపరమైన అల్లర్లు చెలరేగడం.
    • పరస్పర విరుద్ధమైన సంస్కృతిని కలిగి ఉండడం. ఉదా: హిందువులకు గోవు పవిత్రమైనది కాని మరొక మతం వారికి అది ఆహారంగా పరిగణించబడుతుంది.
    • మత అల్లర్లు తరచుగా జరిగే సునిశిత ప్రాంతాల పర్యవేక్షణ సరిగా లేకపోవడం.
    • అంతర్జాతీయ కారణాల వల్ల మత అల్లర్లు చెలరేగడం. ఉదా: పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదం.


    భారతదేశంలో సంభవించిన తీవ్రమైన మత సంఘర్షణలు


    గోద్రా అల్లర్లు (2002)


    ♦ అయోధ్య నుండి అహ్మదాబాద్కు వస్తున్న సబర్మతి ఎక్స్ప్ర్సెస్ యొక్క ఎస్. 6 భోగిపై గోద్రా రైల్వేస్టేషన్ వద్ద 27 ఫిబ్రవరి 2002న దాడి జరిగింది, ఈ దాడిలో భాగంగా ఎస్.6 భోగిపై దుండగులు పెట్రోల్ చల్లి నిప్పంటించడం వల్ల 59 మంది సజీవ దహనం చెందారు.

    ♦ ఈ సంఘటనపై విచారణ నిమిత్తం 6 మార్చి 2002 కె.జి. షా కమీషన్ని & మే 21, 2002న నానావతి కమీషన్ ను ఏర్పాటుచేశారు. ఈ కమీషన్ 2008వ సంవత్సరంలో నివేదికను సమర్పించింది.

    ♦ గోద్రా సంఘటన అనంతరం హిందూ-ముస్లింల మధ్య అల్లర్లు తీవ్రతరమైనవి. వీటినే పోస్ట్ గోద్రా అల్లర్లు అంటారు.

    • 3 నెలల పాటు కొనసాగి 1100 మంది మరణానికి కారణమైంది.
    • మార్చి 01, 2002న వడోదర నగరంలో బెస్ట్ బేకరిపై బాంబు దాడి జరిగింది.
    • 28 ఫిబ్రవరి 2002న అహ్మద్ నగర్ దగ్గర్లోని నరోడా పాటియా అనే గ్రామంపై ఎల్.పి.జి. సిలిండర్లతో దాడి జరిగింది. ఫలితంగా 97 మంది మరణించారు.
    • 28 ఫిబ్రవరి 2002న గుల్బర్గా సొసైటీపై దాడి జరిగింది ఫలితంగా 31 మంది సజీవ దహనం అయ్యారు.


    అయోధ్య సంఘటన


    • 1528లో రామాలయంపై మసీదు నిర్మించినారనే భావన కలదు. (దీనికి పురావస్తు శాఖవారి చారిత్రక ఆధారాలు లభించాయి).
    • 1992 మే నెలలో అప్పటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ రామమందిర నిర్మాణంనకు అనుమతినిచ్చారు.
    • డిసెంబర్ 06, 1992 అద్వానీగారి యొక్క రధయాత్ర అయోధ్యకు చేరింది. అదే రోజు కరసేవకుల చేతిలో బాబ్రీ మసీదు విధ్వంసం జరిగింది.
    • ఈ సంఘటనపై ఏర్పాటు చేసిన లిబర్హాన్ కమీషన్ 2009లో నివేదికను ఇచ్చింది.


    గమనిక: 2019లో అయోధ్యపై సుప్రీంకోర్టు తుదితీర్పునిస్తూ వివాదాస్పద 2.77 ఎకరాల రామజన్మభూమిని రామజన్మభూమి ట్రస్టుకి ఇవ్వాలని తీర్పునిచ్చింది.


    ఇతర మత సంఘర్షణలు


    • 1893లో గోసంరక్షణ నిమిత్తం బొంబాయిలో కార్మికుల మధ్య ఘర్షణ.
    • శివసేన ఓటమి వల్ల ఏర్పడిన 1986 ఔరంగాబాద్ మత సంఘర్షణలు.
    • 1988లో బీదర్ లో జరిగిన సిక్కు హిందూ మత సంఘర్షణలు.
    • 1987లో జరిగిన మీరట్ మత సంఘర్షణలు (పంది కారణం).
    • 1984 ఢిల్లీలో ఇందిరాగాంధీ హత్యానంతరం సిక్కుల ఊచకోత జరిగింది. ఈ సంఘటనపై నానావతి కమీషన్ని నియమించారు.
    • 2007లో క్రైస్తవులపై ఒరిస్సాలోని కందమాల్లో దాడులు జరిగినవి.
    • 1989 భాగల్పూర్ మతసంఘర్షణలు రామశిల ఊరేగింపు సందర్భంగా జరిగినవి.
    • 2014 ఉత్తరప్రదేశ్లోని షహరాంపూర్లో ముస్లింలకు & సిక్కులకు మధ్య జరిగిన ఘర్షణలు తీవ్రరూపం దాల్చినవి.
    • 2013లో హిందూ ముస్లింల మధ్య జరిగిన 'నలికేలి' సంఘర్షణలు జరిగినవి.
    • 22 జనవరి 1999న ఒరిస్సాలో 'ధారాసింగ్' చేతిలో క్రైస్తవ మతప్రచారకుడు గ్రహం స్టెయిన్ హత్య గావింపబడ్డాడు.
    • 2013 ఆగస్టు నుండి సెప్టెంబర్ మధ్యలో ఉత్తరప్రదేశ్లోని ముజఫర్ నగర్ లో హిందూ ముస్లింల మధ్య సంఘర్షణలు (ఈవ్ టీజింగ్ కారణం జరిగినవి.


    సమాజంపై మతతత్వం యొక్క ప్రభావం


    సమాజంపై మతతత్వం మరియు మతహింస తీవ్రమైన ప్రభావాన్ని చూపెడుతుంది. అవి...

    1. సామాజిక అశాంతికి దారితీస్తుంది.

    2. సామాజిక వృద్ధికి ఆటంకంగా ఉంటుంది.

    3. ద్వితీయ & తృతీయ రంగాలకు చెందిన పరిశ్రమలపై తీవ్ర ప్రభావాన్ని చూపెడుతుంది.

    4. ఉగ్రవాదం పెచ్చురిల్లుతుంది.

    5. మతహింస చెలరేగిన ప్రాంతాల్లో మహిళలపై హింస అధికమవుతుంది.

    6. ప్రజా మరియు ప్రైవేటు ఆస్తి నష్టం సంభవిస్తుంది.

    7. ఒక మత సంఘర్షణ భవిష్యత్తులో మరోమత సంఘర్షణకు దారి తీస్తుంది.

    8. మతపరమైన రాజకీయాలు చెలరేగి, ప్రజాస్వామ్యం పతనమవుతుంది.


    మతసంఘర్షణలు - నివారణ


    • మతంనకు & పేదరికానికి, నిరుద్యోగానికి మధ్యగల సంబంధాలని తెంచాలి.
    • విద్య ద్వారా లౌకిక సామాజీకరణను చేపట్టాలి.
    • రాష్ట్ర & జాతీయ స్థాయిలో శాంతి కమిటీలను ఏర్పాటు చేయడం.
    • మత సంబంధిత అంశాలకు సంబంధించి ప్రచార సాధనాలను అదుపులో పెట్టాలి.
    • మతతత్వాన్ని నిరోధించేందుకు ప్రధానమంత్రి అధ్యక్షతన 1962లో జాతీయ సమైక్యతా మండలి (నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్)ని స్థాపించారు.
    • మతప్రాతిపదికన గల పార్టీలను రద్దుచేయడం, మతాంతర వివాహాలు ప్రోత్సహించడం, మతపరమైన పేదరికాన్ని మరియు వెనుకబాటుతనాన్ని నిర్మూలించడం లాంటి చర్యల ద్వారా మతతత్వాన్ని నివారించవచ్చు.


    నేషనల్ ఫౌండేషన్ ఫర్ కమ్యూనల్ హార్మోని


    మతసంఘర్షణలను అరికట్టేందుకు వసుదైక కుటుంబం & సర్వధర్మ సంభవ అనే నినాదాలతో నేషనల్ ఫౌండేషన్ ఫర్ కమ్యూనల్ హార్మోని అనే స్వచ్ఛంద సంస్థని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ సంస్థ మతహింసకు గురైన వారికి స్కాలర్షిప్స్ నేషనల్ ఫౌండేషన్ ఫర్ కమ్యూనల్ హార్మోని ఇస్తూ విద్యాపరమైన పునరావాసాన్ని ఏర్పాటు చేస్తుంది. మరియు ఈ సంస్థ ప్రతి సంవత్సరం 19 నవంబర్ నుండి 25 నవంబర్ వరకు క్వామి ఏక్తా వారంను జరుపుతుంది. ఈ సంస్థకు చైర్మన్ కేంద్ర హెూంమంత్రి వ్యవహరిస్తారు.


    ఉగ్రవాద సూచికలు


    గ్లోబల్ పీస్ ఇండెక్స్ (GPI) 2022


    • భారతదేశం ఈ సూచికలో 135వ స్థానంలో ఉంది, మొదటిస్థానంలో ఐలాండ్, తర్వాత స్థానాలలో నార్వే మరియు డెన్మార్క్ కలవు.
    • ఈ సూచిక చివరి స్థానంలో అఫ్ఘనిస్థాన్ దేశం కలదు కాగా పాకిస్థాన్ 150వ స్థానంలో ఉంది.
    • గ్లోబల్ పీస్ ఇండెక్స్ని ఇన్సిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ & పీస్ వారు రూపొందిస్తారు. మొత్తం 163 దేశాలకు గాను ఈ సూచికను రూపొందించారు.


    ప్రపంచ ఉగ్రవాద సూచీ (జియోగ్రాఫికల్ టెర్రరిజమ్ ఇండెక్స్) 2023


    ఈ సూచికని ఇన్సిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ & పీస్ వారు రూపొందిస్తారు.

    ఈ సూచిక ప్రకారం భారతదేశం యొక్క స్థానం 13, మొదటిస్థానంలో అఫ్ఘనిస్థాన్ కలదు.


    మతపరమైన ఉగ్రవాదం


    • డిసెంబర్ 13, 2001న భారత పార్లమెంటుపై దాడి జరిగింది.
    • ఫిబ్రవరి 18, 2007న పాకిస్థాన్ మరియు భారత్ మధ్య నడిచే రైలైన సంఝౌత ఎక్సైస్పై దాడి జరిగింది.
    • ఆగస్టు 25, 2007న హైద్రాబాద్ నగరం నందు గోకుల్చాట్, కోఠి, లుంబినిపార్క్ ప్రాంతాలలో బాంబు పేళులు జరిగినవి.
    • నవంబర్ 26, 2008న ముంబాయిలోని హెూటల్ తాజ్ మరియు ఇతర ప్రాంతాలలో ఉగ్రవాద దాడి జరిగింది.
    • మార్చి 12, 1993 ముంబాయిలో వరుస బాంబు ప్రేళులు జరిగినవి.
    • మే 18, 2007న హైద్రాబాద్ నందు మక్కామసీదు ప్రేళులు సంభవించినవి.
    • ఫిబ్రవరి 21, 2013న హైద్రాబాద్ నగరం నందు దిల్సుఖ్నగర్ ప్రాంతంలో బాంబు ప్రేళులు సంభవించినవి.


    ఉగ్రవాద నిరోధక చట్టాలు


    1. జాతీయ భద్రతా చట్టం - 1980

    2. ఉగ్రవాదం & విచ్ఛిన్నకర కార్యకలాపాల నిరోధక చట్టం - 1985

    3. ఉగ్రవాద నిరోధక చట్టం (పోటా) - 2002

    4. Terrorist and Disruptive Activities (Prevention) Act (TADA)-1985

    5. మేయిన్టెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్టు (MISA) - 1971

    6. ద ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్ టు నేషనల్ హానర్ యాక్టు - 2005

    7. నేషనల్ ఇన్విస్టిగేషన్ ఏజెన్సీ యాక్టు - 2008

    8. అన్లాఫుల్ యాక్టివిటీస్ (ప్రివెన్షన్) యాక్టు - 1967, నోట్: ఈ చట్టం 2019వ సం॥లో సవరించారు

    9. ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్టు - 1990

    10. Prevention of Terrorism Act (POTA) - 2002


    గమనిక: భారతదేశం నందు ఒడిశా, మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్ ఘడ్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, ఉత్తర ఖండ్, ఉత్తర ప్రదేశ్, కర్ణాటక మరియు హరియాణా రాష్ట్రాల యందు మత మార్పిడి నిరోదక చట్టం అమలులో కలదు.


    పునశ్చరణ


    • ఆధునిక భారతదేశంలో మతతత్త్వం అనే గ్రంథాన్ని రాసిన వారు బిపిన్ చంద్ర.
    • మతతత్త్వాన్ని రామ్హుజ 3 రూపాలలో మరియు టి.కె. ఉమెన్ 6 రూపాలలో వర్గీకరించారు.
    • కాలం చెల్లిన నమ్మకాలను గుడ్డిగా పాటించడాన్నే మతఛాందస వాదం అంటారు.
    • మహారాష్ట్ర మతఅల్లర్లపై మదన్ కమీషన్ని, గోద్రా అల్లర్లపై కె.జి. షా మరియు నానావతి కమీషన్ని, అయోధ్య సంఘటనపై లిబర్ హన కమీషన్ని మరియు ముంబాయి అల్లర్లపై శ్రీకృష్ణ కమీషన్ని నియమించారు.
    • ద్విజాతి సిద్ధాంతాన్ని తీసుకొని వచ్చి ప్రత్యక్ష చర్య దినానికి పిలుపునిచ్చి తీవ్రమైన హిందూ-ముస్లిం మత సంఘర్షణలకు కారణమైనవాడు - మహ్మద్ అలీ జిన్నా.
    • పాకిస్థాన్, బంగే ఇస్లామ్ మరియు ఉస్మానిస్థాన్ అనే దేశాల ప్రతిపాదన చేసినవారు - రెహ్మత్ అలీ.
    • మతపరమైన సంఘర్షణలు అరికట్టేందుకు నేషనల్ ఫౌండేషన్ ఫర్ కమ్యూనల్ హార్మోని అనే సంస్థని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
    • మతతత్వాన్ని మరియు వేర్పాటువాదాన్ని నిరోధించేందుకు 1962లో జాతీయ సమైక్యతా మండలిని ఏర్పాటుచేశారు.
    • 2023 ప్రపంచ ఉగ్రవాద సూచీలో భారతదేశం 13వ స్థానంలో కలదు.

    • 2022 ప్రపంచ శాంతి సూచికలో భారతదేశం 135వ స్థానంలో కలదు.


Tags: Caste system, gender roles, joint families, arranged marriages, diversity, cultural festivals, social hierarchy, economic disparities, religious practices, education system, urbanization, rural traditions, globalization, modernization


No comments:

Post a Comment

Post Bottom Ad