1.4 కులం (Caste) - GNANA SAMHITHA

GNANA SAMHITHA

DONT WORRY!!! WE HELP YOU TO REACH YOUR GOAL 😊

Breaking

Post Top Ad

Wednesday, July 5, 2023

1.4 కులం (Caste)

1.4 కులం (Caste)


    భారతదేశంలో మాత్రమే కనపడే అదనపు సామాజిక సంస్థ కులం, ఇది భారతదేశంలోనే జనించింది. దాదాపు భారతీయసమాజానికే మాత్రమే పరిమితమైనది, ఇది ఒక ఇన్వాలెంటరి సమూహం ఎందుకంటే పుట్టుకతోనే మన ప్రమేయం లేకుండా ఇందులో సభ్యులం అవుతున్నాము మరియు ఇది సంవృత సమూహం. కులం అనేటువంటి సామాజిక సంస్థకు సంబంధించిన ప్రాథమిక భావనలు, శాస్త్రవేత్తల దృక్పథాలు, కులం యొక్క వికార్యాలు మరియు ప్రకార్యాలు, కులవ్యవస్థలో వచ్చినటువంటి మార్పులు మరియు కులం యొక్క అశక్తతలను తొలగించడానికి ఇంతవరకు జరిగిన ప్రయత్నాలు లాంటి అంశాలను ఈ పాఠ్యాంశం నందు వివరించడం జరిగింది.


    కులం ప్రాథమిక భావనలు మరియు నిర్వచనాలు


    • హిందూ సామాజిక వ్యవస్థకు కులం 'ఉక్కు కవచం' - A.R. Deshai.
    • 'భారతదేశం' మతాల ప్రయోగశాల, జాతుల ప్రదర్శనశాల.
    • 'Caste' అనే ఆంగ్ల పదం 'Casta' అనబడే Spanish పదం నుండి మరియు 'Castus' అనబడే Latin పదం నుండి ఉద్భవించిందని కేట్కర్ అనునతడు తన యొక్క గ్రంథం 'History of Caste in India' లో తెలిపాడు.
    • 'Casta' అనగా వంశక్రమం లేదా జాతి అని Spanish భాషలో అర్థం కలదు. అలాగే 'Castus' అనగా Latin లో స్వచ్ఛ అని అర్థం.
    • కులం అనే పదాన్ని మొదటగా Portugese వారు 17వ శతాబ్ధంలో ఉపయోగించినారు.
    • యం.ఎన్.శ్రీనివాస్ ప్రకారం పరిమిత సమూహాలు, సన్నిహిత సంబంధాలు కల జన సమూహాన్ని 'కులం' అంటారు.
    • 'T. Madhan, Majunder ల ప్రకారం కులం అనునది సంవృత సమూహం.
    • కులం అనేది సామాజిక గతిశీలతకి అవకాశం లేకుండా చేసిన సామాజికస్థిరీకరణ రూపం - A.N.Green


    భారతదేశ సమాజంలో సామాజిక స్థరీకరణకి ప్రధాన కారణం 'Caste'. ప్రపంచంలో సామాజిక స్థిరీకరణ సంస్థానాలు, సామాజిక వర్గాలు, వర్ణము మరియు లింగము లాంటి రూపాలలో కనిపిస్తుంది, కాని భారతదేశంలో పై రూపాలతో పాటుగా ప్రధానంగా కనిపించే సామాజిక స్థరీకరణ రూపం కులం.


    ఎస్.సి. దూబే, ఎం.ఎన్.శ్రీనివాస్ మొదలగు శాస్త్రవేత్తలు కులాన్ని ఒక సామాజిక సంస్థగా మరియు సామాజిక సమూహంగా అధ్యయనం చేశారు.


    నోట్: సామాజిక స్థరీకరణ అనగా సమాజంలోని వ్యక్తులను ఎక్కువ మరియు తక్కువ హెూదాలు కల్గిన వ్యక్తులుగా లేదా ఉన్నతులు, మధ్యములు మరియు అధములు అనేటువంటి ర్యాంకులుగా క్రమశ్రేణి పరంగా విభజించడాన్నే సామాజిక స్థరీకరణ అంటారు.


    వివిధ రకాల జీవన విషయాలలో అనగా అలవాట్లు, కట్టుబాట్లు మరియు వృత్తులు లాంటి విషయాలలో అధిక సాదర్యతను కలిగియున్న సమూహాన్నే కులంగా భావించవచ్చు.


    భారతదేశంలో సామాజిక స్థాయి లేదా 'సామాజిక హెూదా' అనేది Caste ద్వారా ఆపాదించబడుతుంది లేదా Asscribed చేయబడుతుంది కావున కులం అనేది వ్యక్తికి ఆపాదించిన అంతస్థును ఇస్తుంది.


    కులం అనేది పుట్టుకతోనే వస్తుంది అందుకనే కూలే వర్గం కొంత వరకు వారసత్వం అయినప్పుడు దానిని కులం అనవచ్చని తెలిపాడు, ఇలా కులం అనేది హెూదా అనే నిచ్చెన మీద గతిశీలత ఏమాత్రం లేని స్థరీకరణగా చెప్పుకోవచ్చు.


    నోట్: సామాజిక గతిశీలత అనగా సమాజంలో ఒక వ్యక్తి తనకున్న హెూదా నుండి ఇతర హెూదాను పొందడం.సామాజిక హెూదా అనేటువంటి పదాన్ని మొదటిసారిగా సోర్కిన్ అనునతడు తన యొక్క సామాజిక గతిశీలత అనేగ్రంథంలో ఉపయోగించాడు. సామాజిక గతిశీలత అనునది వివిధ రూపాలలో ఉంటుంది.


    1. సమస్థరీయ గతిశీలత: వ్యక్తి హెూదాలో గాని అతడు నిర్వహించేటువంటి పాత్రల స్థాయిలో గాని ఎలాంటి మార్పు ఉండదు. ఉదా: వ్యవసాయ కూలీలు పారిశ్రామిక కూలీలుగా మారడం.

    2. విషమస్థరీయ గతిశీలత: ఈ విధానంలో వ్యక్తియొక్క హెూదాలో మరియు నిర్వహించే పాత్రల స్థాయిలో మార్పు వస్తుంది. ఆ మార్పు రుణాత్మకంగా కాని ధనాత్మకంగా కాని ఉండవచ్చు. ఉదా: కార్మికుడు యజమానిగా మారడం, యజమాని కార్మికుడుగా మారడం. పై ఉదాహరణలలో కార్మికుడు యజమానిగా మారడం ఊర్ధ్వముఖ గతిశీలత మరియు యజమాని కార్మికుడుగా మారడం అధోముఖ గతిశీలత.

    3. తరాలమధ్య గతిశీలత: ఒక కుటుంబంలోని రెండు తరాల మధ్యగల హెూదా మరియు స్థాయిలలో ఉన్నటువంటి భేదాన్నే తరాల మధ్య గతిశీలత అంటారు. ఉదా: తండ్రి వ్యవసాయ కూలీగా ఉండగా కొడుకు గ్రూప్-1 ఆఫీసర్ గా మారడం.


    • రిస్లే గారి ప్రకారం కులం అనునది ఏకరూపకత కలిగిన సముదాయం.
    • కులం ఒక బంధిత సామాజిక వర్గం, దీనిలో సభ్యులు జన్మద్వారా సభ్యులవుతారు, ఈ సభ్యత్వం నుండి వ్యక్తులు తప్పించుకోలేరు. గతిశీలత, అంతస్థు విభేదాల విషయంలో చాలా బంధితంగా ఉండే స్థిరీకరణ వ్యవస్థగా కులాన్ని నిర్వచించవచ్చు - లుండ్ బర్గ్.
    • కులం ఒక సజాతి సమూహం లేదా సజాతి సమూహాల మొత్తం. కులానికి ఒక పేరు ఉంటుంది మరియు కుల సభ్యత్వం వారసత్వం ద్వారా వస్తుంది. కులంలో కొన్ని నియమ నిబంధనలు, కుల వృత్తులు లాంటివి గోచరిస్తాయి - బ్లంట్.
    • వంశపారపర్యంగా వచ్చే ప్రత్యేకతలతో క్రమానుగతశ్రేణిలో అమర్చబడిన సమూహాలే కులాలు -  భోగ్.
    •  కులాలు జన్మ ద్వారా ఏర్పడిన అంతస్థు సమూహాలు, ఒక క్రమశ్రేణిలో అమర్చబడి అంతర్వివాహాన్ని పాటిస్తూ తమదైన వృత్తిని నిర్వహిస్తూ ఉంటాయి - కాథలిన్ గఫ్.


    సమాజంలో ఉన్నటువంటి వివిధ సమూహాల మధ్యగల బేధాలతో కూడిన హెూదా వ్యవస్థనే సామాజిక స్థిరీకరణ అంటారు. కులం శుచి మరియు అశుచి అనే లక్షణాలను కలిగి ఉంటుంది.


    ఏ కులం అయిన ఒంటరిగా బతకలేదు ఒక కులం సేవలు మరొక కులానికి అవసరం ఇలా ఒక కులానికి మరొక కులానికి మధ్య వృత్తిపరమైన సేవల వినిమయాన్ని వ్యవస్థలో భాగంగా ఏర్పాటు చేయబడినవి.


    ప్రపంచ వ్యాప్తంగా సామాజిక స్థిరీకరణ జాతి పరంగా ఎస్టేట్ల పరంగా, లింగం పరంగా మరియు వర్గాల పరంగా కన్పిస్తుంది కాని భారతదేశంలో పై 3 రూపాలతో పాటు కులపరమైన సామాజిక స్థరీకరణ ప్రధానంగా కన్పిస్తుంది. ఫలితంగా కులవ్యవస్థలో ఉన్నత కులాలు, మధ్యస్త కులాలు, పవిత్ర కులాలు, అపవిత్ర కులాలు, అంటరాని కులాలు లాంటి భావనలు కనపడతాయి.


    కులవ్యవస్థ భారతదేశంలోనే జన్మించింది మరియు భారతదేశానికే పరిమితమైనది మరియు భారతీయ సమాజంలో మాత్రమే కనపడే అదనపు ప్రాథమిక సామాజిక సంస్థ. అలవాట్లు, కట్టుబాట్లు, వృత్తులు, సంస్కారాలు, ఆహారం లాంటి విషయాలలో ఏకరూపత ఉన్నటువంటి సామాజిక సమూహాన్నే కులము అంటారు.


    భారతదేశంలో మానవుని యొక్క హెూదా పుట్టుకతోనే కులం ద్వారా నిర్ధారించబడుతుంది మరియు ఎలాంటి సామాజిక గతిశీలతకు అవకాశం లేని స్థితిని కల్పిస్తుంది. ఒక కులాన్ని ఆశ్రయించి జీవించే కులాన్ని ఆధారకులం లేదా డిపెడెంట్ క్యాస్ట్ లేదా ఆశ్రిత కులం అందురు. భారతీయ సమాజంలో ప్రతికులానికి ఒక ప్రత్యేకమైన ఆశ్రిత కులం కలదు.


    కొన్ని కులాలు తిరిగి ఉపశాఖలుగా కూడా ఉంటాయి. వీటినే ఉపకులాలు అంటారు. తెలంగాణలో యాదవుల యందు ఈ పోకడ కన్పిస్తుంది. ఒక ప్రాంతంలో ఏ కులమైతే రాజకీయంగా, ఆర్థికంగా, తన ఆధిపత్యాన్ని చూపెడుతుందో ఆ కులాన్నే పద్మశాలీల ఆశ్రిత కులం సాధన శూరులు ఆధిపత్యకులం అని అంటారని మొదటిసారి యం.ఎన్. శ్రీనివాస్ గారు తెలిపారు, వీరే డామినెంట్ కాస్ట్ ఇన్ రాంపూర్ విలేజ్ అనే గ్రంథాన్ని రచించారు.


    భారతీయ గ్రామాలలో వివిధ కులాల మధ్య గల పరస్పర సేవల వినిమయాన్నే జజ్మానీ వ్యవస్థ అని అంటారు. ఇది వస్తుమార్పిడి పద్ధతి లేదా సేవల మార్పిడి పద్ధతిని పోలి ఉంటుంది.


    కులం యొక్క లక్షణాలు


    A.L Krober: వీరు కులానికి సంబంధించి ఈ క్రింది లక్షణాలను తెలిపాడు.

    1. వారసత్వము ద్వారా కులం ఒకతరం నుండి ఇంకోతరానికి అందించబడుతుంది.

    2. Endogamy లేదా కుల అంతర్వివాహం అనే నియమాన్ని పాటిస్తుంది.

    3. ప్రతి కులం తనకంటూ ప్రత్యేకమైన కులవృత్తిని కలిగి ఉంటుంది.

    4. ప్రతి కులానికి ఆహార నియమాలు (Food Habits) ఉంటాయి.

    5. ప్రతికులం తమకంటూ ప్రత్యేకమైన వేషధారణను కలిగి ఉంటాయి.

    6. కులాల మధ్య పవిత్రత మరియు అపవిత్రత అనేభావం కనపడుతుంది.

    7. కొన్ని కులాలకే మతపరమైన, కర్మపరమైన కార్యక్రమాలు పరిమితమవుతాయి.

    8. కుల సభ్యుల యొక్క వ్యక్తిగత వివాదాలు అనునవి కుల పంచాయితీల ద్వారా మాత్రమే పరిష్కరించబడతాయి.


    G.S. ఘర్యే అనునతడు తన గ్రంథం అయిన 'Caste and Race' నందు కులానికి గల ఈ క్రింది 6 ప్రధాన లక్షణాలు తెలిపాడు.

    1. కులం అనునది సమాజం నందు గల సాంప్రదాయ విభజన.

    2. కులం అనునది క్రమశ్రేణి విభజన

    3. ప్రతి కులానికి వృత్తిపరంగా, తమ ఆహార నియమాలలో తమదైన హద్దులు ఉంటాయి.

    4. ప్రతి కులం నందు మంచి, చెడు మరియు ప్రత్యేకతలు ఉన్నవి.

    5. వృత్తి ఎంపికను కులం పరిమితం చేస్తుంది.

    6. వివాహ నియమాలను కలిగి ఉంటుంది.


    పై లక్షణాలతో పాటుగా కులం ఈ క్రింది లక్షణాలను కలిగి ఉంటుంది.

    1. కులం తీసివేయలేనిది, మార్చివేయలేనిది, పంపిణీచేయలేనిది

    2. కులంని కులమే పరిపాలించుకుంటుంది.

    3. కులాలు ఉపకులాల సమూహాలతో ఏర్పడినవి.

    4. ప్రతి కులానికి ఒక ఆశ్రిత కులం ఉంటుంది, ప్రత్యేక సంస్కృతి ఉంటుంది.

    5. Untouchability అనేది అన్ని కులాల మధ్యలో కన్పిస్తూ ఉంటుంది.

    6. ప్రతికులం వృత్తి ధర్మాన్ని పాటిస్తుంది.

    7. భోగ్ అనునతని ప్రకారం కులానికి 3 ప్రధాన లక్షణాలు ఉంటాయి.

    1. క్రమానుగతశ్రేణి 2. వంశపారంపర్యంగా వచ్చే ప్రత్యేకీకరణ 3. ఇతర కులాలను వ్యతిరేకించే వికర్షణభావం.


    కులం యొక్క ప్రకార్యాలు లేదా విధులు (Caste Functions /Duties/Positive aspects): కులం అనునది సమాజంపై వివిధ రూపాలలో రుణాత్మక ప్రభావాన్ని చూపెడుతున్నప్పటికి కులం అనేటువంటి దానివల్ల ఈ క్రింది ప్రయోజనాలు కూడా కలవు.

    1. సేవల వినిమయంతో కూడిన వివిధ కులాల సామూహిక జీవనం కనపడుతుంది.

    2. కులం వల్లనే సమాజం నందు శ్రమ విభజన (Division of Labour) సాధ్యమైనది.

    3. కులం తన కుల సభ్యులకు Social Security & Social assitance (సామాజిక రక్షణ, భద్రత) అందిస్తున్నది.

    4. కులం తన సభ్యులను సామాజీకరణకు గురిచేస్తున్నది.

    5. కులం అనునది ఒక అనియత సామాజిక నియంత్రణ సాధనంగా కుల సభ్యుల ప్రవర్తను నియంత్రిస్తుంది.

    6. ప్రత్యేక సంస్కృతి, చేతివృత్తులు, కళలు, జానపదాలు లాంటి లలితకళలు కుల ఆచారాలలో భాగంగా కొనసాగుతున్నవి.

    7. చేతివృత్తులు మరియు సాంప్రదాయ కళలు సంరక్షింపబడతాయి మరియు సాంస్కృతిక వైవిద్యాన్ని కొనసాగేలా చేస్తుంది.

    8. కుల పంచాయితీలు, కుల సభ్యుల యొక్క వివాదాలను తీరుస్తాయి.

    9. కులం వల్ల జాతిపరమైన స్వచ్ఛత సాధ్యమవుతుంది.


    కులం సమాజంపై పై రూపాలలో మంచి ప్రభావాన్ని చూపెడుతున్నప్పటికి కులవ్యవస్థ వల్ల సమాజం నందు ఈ క్రింది దుష్పరిణామాలు కనపడుతున్నవి.


    సమాజంపై కులం యొక్క రుణాత్మక ప్రభావాలు


    1. అంటరానితనానికి కారణమైంది.

    2. వృత్తి ఎంపికలో స్వేచ్ఛను పరిమితం చేసింది.

    3. సామాజిక అసమానతలకు కారణమయ్యింది.

    4. కొన్ని వర్గాలను విద్యకు దూరం చేసింది.

    5. కొన్ని వర్గాలను సామాజిక వెలికి గురిచేసింది.

    6. నిమ్నకులాలుగా భావించబడుతున్న వారిని సామాజిక, విద్య మరియు ఆర్థిక అవకాశాలకు దూరం చేసి వారిని తరతరాలుగా వెట్టిచాకిరి బాలకార్మికత, జోగిని, దేవదాసీ వ్యవస్థ, మానవ హక్కుల ఉల్లంఘన, బాల్య వివాహాలు, మనుషుల అక్రమ రవాణా లాంటి అమానవీయమైన స్థితికి గురిచేసింది.

    7. సమాజంలోని మనుషులని నిట్టనిలువుగా వర్గీకరించి జాతి సమైఖ్యతకు భంగం కలిగిస్తున్నది.

    8. వ్యక్తులకు సామాజిక గతిశీలత లేకుండా చేసింది.

    9. కులాంతర వివాహాలు జరిగినప్పుడు పరువు హత్యలకు దారితీస్తున్నది. (అత్యధికంగా పరువు హత్యలు హర్యానా రాష్ట్రంలో జరుగుతున్నవి). ఈ పరువు హత్యలకు ప్రధాన కారణం ఖాప్ పంచాయితీలు.

    10. కులపరమైన రాజకీయాలు మరియు కులాలు ఓటుబ్యాంకులుగా మారుతున్నవి.

    11. కొన్ని కులాల ఆధిపత్య ధోరణి వల్ల వివిధ కులాల మధ్య కుల సంఘర్షణలు తలెత్తుతున్నవి.


    కుల ఆవిర్భావ సిద్ధాంతాలు (Theories of Origin of Caste)


    కులం యొక్క పుట్టుక, అభివృద్ధి లాంటి అంశాలపై వివిధ శాస్త్రవేత్తలు తమ యొక్క పరిశోధన ఫలితాలను ఈ క్రింది సిద్ధాంతాల రూపంలో వ్యక్తపరచారు.


    దైవ సిద్ధాంతం లేదా సాంప్రదాయ సిద్ధాంతం: Traditional theory లేదా Divine theory లేదా దైవ సిద్ధాంతం ప్రకారం ‘Rigvedam’ లోని 'Purusha suktam' నందు పేర్కొనబడిన విధంగా దేవుడి నుండి 4 వర్ణాలు ఏర్పడినవి అని వర్ణాలే కులాలుగా మారినవి అని తెలుపుతుంది. ఈ నాలుగు వర్ణాల మధ్యలో అనులోమ వివాహం వల్ల దాసిపుత్రులు (Shudras) ప్రతిలోమ వివాహం వల్ల పంచమాస్ (Panchamas) ఉద్భవించారు అని చెప్పడం వల్ల ఈ సిద్ధాంతం తీవ్ర విమర్శకు గురయ్యింది.


    నోట్: విరాట్ పురుషుడి తల నుండి నాలుగు వర్ణాలుగా బ్రాహ్మణులు, భుజాల నుండి క్షత్రియులు, తొడల నుండి వైశ్యులు మరియు పాదాల నుండి శూద్రులు ఉద్భవించారని కావున ఆయా వృత్తులను వారు నిర్వహించాలని పురుషసూక్తం తెలుపుతుంది దీనినే చాతుర్వర్ణ సిద్ధాంతం అంటారు.


    వృత్తిపరసిద్ధాంతం: వృత్తులే కులాలు ఏర్పడడానికి కారణం అని 'Nesfield' తనయొక్క 'Occupational theory' ద్వారా తెలిపాడు. ద హిస్టరీ ఆఫ్ హ్యుమన్ ఇండస్ట్రీ అనే గ్రంథంలో న్స్ఫెల్డ్ ఈ సిద్ధాంతాన్ని తెలియజేశాడు. ఈ సిద్ధాంతం ప్రకారం ఒక్కొక్క వృత్తిని చేపట్టేవారు ఒక్కొక్క కులంగా ఏర్పడినారని మరియు ఆయా వృత్తులకు ఉన్నటువంటి విలువ ఆదరణ మరియు పవిత్రతల ఆధారంగా ఆయా కులాలకు సమాజం నందు హెూదాలు ఏర్పడినవని అభిప్రాయపడ్డారు.


    జాతి సిద్ధాంతం: జాతులే కులానికి కారణం అని 'Racial theory' ద్వారా హెర్బర్ట్ రిస్లే గారు తన యొక్క గ్రంథమైన పీపుల్ ఆఫ్ ఇండియా ద్వారా తెలిపారు. భారతదేశంలోని వివిధ జాతుల వారు వివిధ కులాలుగా మారారని అభిప్రాయపడ్డారు. తెలుపు రంగు ఉన్నత కులాలుగా మరియు నలుపు రంగు వారు నిమ్న కులాలుగా పరిగణించబడ్డారని వీరే కాలక్రమంలో పవిత్రకులాలుగా మరియు అంటరాని కులాలుగా మారారని అభిప్రాయపడ్డారు. వీరి సిద్ధాంతం ప్రకారం జాతులే కులాలుగా మారినట్టయితే 7 లేదా 8 కులాలు మాత్రమే ఉండాలి కాని కొన్ని వేల రకాల కులాలను దేశవ్యాప్తంగా గమనించవచ్చు.


    రాజకీయ సిద్ధాంతం: Brahamanical thoughts యే కులానికి కారణం అని 'Political theory' చెపుతుంది. బ్రాహ్మణులు తమ యొక్క సామాజిక మరియు సాంస్కృతిక ఆధిపత్యం కోసం కులవ్యవస్థను ఏర్పాటుచేశారని ఈ సిద్ధాంతం అభిప్రాయపడుతుంది.


    సాంస్కృతిక సమీకృత సిద్ధాంతం: వివిధ రకాల సంస్కృతులు సమీకృతం కావడం వల్ల కులాలు ఏర్పడినవని ‘Sharath Chandra Rai' అనునతడు తనయొక్క 'Cultural Integration Theory' ద్వారా తెలిపాడు. కులాలు ఏర్పడక ముందు వివిధ జాతులుగా ఉన్నటువంటి ప్రజల యొక్క సంస్కృతులన్ని విలీనీకరణం చెందడం వల్ల కులాలు ఏర్పడ్డాయని ఈ సిద్ధాంతం యొక్క సారాంశం.


    పరిణామ సిద్ధాంతం: పరిణామ క్రమంలో కులాలు ఏర్పడ్డాయి అని 'Dangil Ebbestan’ అనునతడు తన యొక్క పరిణామ సిద్ధాంతంలో తెలిపాడు. ఇతని ప్రకారం జాతులన్నింటిలో తెగలు వ్యవస్థీకరించబడి క్రమంగా వృత్తి సంఘాలుగా (గిల్డ్స్)గా ఏర్పడి, ఆయా వృత్తి సంఘాలు వృత్తినియమాలను ఏర్పాటు చేసుకొని మరియు వివాహం లాంటి విషయాలలో నియమ నిబంధనలు రూపొందించుకోవడం, కాలక్రమంలో ఉమ్మడి జీవనాన్ని మరియు సంస్కృతిని పెంపొందించుకోవడం లాంటి సంఘటనలు ఒక పరిణామ క్రమంలో సంబవించి ఆయా వృత్తి సంఘాలు కులాలుగా ఏర్పడడానికి దారి తీసినవని ఈ సిద్ధాంతం తెలుపుతుంది.


    భౌగోళిక సిద్ధాంతం: భారతదేశం నందు గల భిన్నమైన భౌగోళిక పరిస్థితులే కులాల యొక్క పుట్టుకకు కారణం అని ‘Gillbert’ అనునతడు తన యొక్క 'Geographical theory' లో తెలిపాడు. వివిధ విభిన్నమైన భౌగోళిక ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు వారివారి భౌగోళిక పరిస్థితులకు తగినట్టుగా తమ యొక్క జీవన విధానాలను మరియు వృత్తులను కలిగి ఉన్నారని వారే తర్వాత కాలంలో కులాలుగా మారారని ఈ సిద్ధాంతం అభిప్రాయపడుతుంది. ఉదాహరణ: తీరప్రాంతాలలో చేపలు పట్టే కులాలు ఏర్పడడం, గడ్డిమైదానాలలో పశువులను పెంచే కులాలు ఏర్పడడం లాంటివి.


    పై సిద్ధాంతాలతో పాటు ఈ క్రింది వాదనలు కూడా కలవు. అవి....

    1. కులానికి సంబంధించి సంస్కార సిద్ధాంతాన్ని సెనార్ట్ అనునతడు తెలిపాడు మరియు ఇతని అభిప్రాయం ప్రకారం ఆర్యుల మూలంగానే కులవ్యవస్థ ఏర్పడింది.

    2. కేట్కర్ అనునతడు అభిప్రాయం ప్రకారం దేశం నందు గల వివిధ తెగలు మరియు వర్గాలు హిందూ సమాజంలోకి రావడం వల్ల ఆయా వర్గాలు మరియు తెగలు కులాలుగా మారినవి.

    3. పై సిద్ధాంతాలన్నింటిని పరిశీలించి హట్టన్ అనునతడు కులం అనేది ఏ ఒక్క కారకం వల్ల ఆవిర్భవించలేదని అందుకు పలురకాల కారకాలు దోహదపడినవని తమ యొక్క బహుళ కారక సిద్ధాంతంలో తెలిపాడు మరియు వీరు మన అనే సిద్ధాంతంలో ఏ సామాజిక సమూహం అయితే తనదైన జీవన విధానాన్ని తరతరాలుగా పరిరక్షించుకునే ప్రయత్నం చేస్తుందో దానినే కులం అని అభిప్రాయపడ్డాడు.


    హిందూయేతరులలో కులవ్యవస్థ: వర్ణము మరియు కులం ప్రాతిపదికన ఏర్పడిన హిందూ సామాజిక వ్యవస్థను విమర్శించిన ఇస్లాం, క్రిస్టియానిటి మరియు ఇతర మతాలకు సంబంధించిన సమాజాలలోను కులవ్యవస్థను పోలిన సామాజిక విభజన కనపడుతుంది ఇందుకు గల ప్రధాన కారణం మత మార్పిడిలు.


    ముస్లిములలో కులమును పోలిన వ్యవస్థ: మొగలుల పరిపాలన కాలంలో ముస్లిం సమాజం నందు ఆష్రఫాలు మరియు అజ్ఞఫాలు అనేటువంటి విభజన కనపడేది. వీరిలో ఆష్రఫాలు అనగా విదేశాల నుండి వచ్చిన ముస్లింలు మరియు వారి యొక్క సంతానం, అజ్లఫాలు అనగా హిందూ మతం నుండి ఇస్లాంలోకి మతం మారినవారు, వీరిలో అజ్లఫాలు నిమ్నమైన హెూదాని అనుభవించేవారు.


    నజ్మల్ కరీమ్ అనే ఇస్లాం పండితుడి అభిప్రాయంలో ఇస్లాం సమాజం నందు హిందూ సామాజిక వ్యవస్థలో గల కులవ్యవస్థను పోలిన స్థరీకరణతో కూడిన వర్గీకరణ ఈ క్రింది రూపంలో కలదు. అవి...

    1. సయ్యద్లు: వీరు మహ్మద్ ప్రవక్త యొక్క కూతురి వారసులుగా మరియు అరబ్బులుగా పరిగణింపబడతారు. అక్బర్చ క్రవర్తి కాలంలో బ్రాహ్మణ వర్గం నుండి ఇస్లాంలో చేరిన వారిని సయ్యద్లుగా పరిగణించేవారు.

    2.షేక్ లు: వీరు కూడా అరబ్బులే కాని ప్రవక్త యొక్క వారసులు కారు కాని వీరు ఇస్లాం పుట్టిన వెంటనే మొదటి తరం మత మార్పిడి చేసుకున్న వారు.

    3. మొగల్స్: టర్కీ నుండి వచ్చిన షేక్ల తర్వాత స్థానాన్ని మరియు హెూదాను పొందారు.

    4. పఠాన్లు: ఇస్లాంలో చేరినటువంటి స్థానిక గిరిజన సమూహాలను పఠాన్లుగా వ్యవహరించేవారు.


    కేరళ నందు గల మోప్లా ముస్లింలలో కూడా కులాన్ని పోలిన స్థరీకరణ వ్యవస్థ కలదు అవి...

    1. థంగల్స్: వీరు మహ్మద్ ప్రవక్త సంతానంగా చెప్పుకునేవారు.

    2. అరబ్బులు: అరేబియా నుండి వలసవచ్చినవారు.

    3. పుసాలర్లు: వీరు హిందూ మతం నుండి ఇస్లాంలో చేరిన జాలరి వర్గం.

    4. ఒస్సాన్లు: వీరు చివరి వర్గంగా పరిగణించబడి తక్కువ హెూదాను పొందేవారు.


    క్రిస్టియన్లలో కులాలను పోలిన వ్యవస్థ: క్యాథిలిక్ ఇండియన్లలో పూర్వకాలంలోనే కులరూప వ్యవస్థ అలాగే కొనసాగింది. ప్రస్తుత సమాజంలో ఉన్నత కులాల నుండి మతాంతరీకరణ చెందినవారు మరియు నిమ్న కులాల నుండి మతాంతరీకరణ చెందినవారు అనబడే స్పష్టమైన విభజన క్రైస్తవ వ్యవస్థలో గోచరిస్తున్నది. ఉదాహరణ: బ్రాహ్మణ క్రిస్టియన్, రెడ్డి క్రిస్టియన్, నంబూద్రి క్రిస్టియన్, చౌదరి క్రిస్టియన్ లాంటి పోకడలు విరివిగా ఆచరింపబడుతున్నవి.


    కేరళ రాష్ట్రం నందు మొదటగా మతాంతరీకరణం చెంది ఏర్పడిన సిరియన్ క్రిస్టియన్లలో కులవ్యవస్థను పోలిన ఆచారాలు మరియు స్థిరీకరణలు గోచరిస్తాయి.


    సిక్కిజం నందు కులాన్ని పోలిన వ్యవస్థలు: సమానత్వం అనేది సిక్కిం యొక్క ముఖ్య లక్షణం అయినప్పటికి సిక్కుల యందు స్థరీకరణతో కూడిన ఈ క్రింది ప్రధాన సామాజిక విభాగాలు గమనించవచ్చు. అవి....

    1. ఉన్నత వర్గంగా భావించబడే సర్ధార్లు

    2. నిమ్న వర్గంగా భావించబడే మజ్బిలు


    భారతదేశంలో కులవ్యవస్థ కొనసాగుటకు దోహదపడుతున్న పరిస్థితులు


    భారతీయ సామాజిక వ్యవస్థకు మూలస్థంభమైన హిందూసామాజిక వ్యవస్థకు కులం అనేది ఉక్కు కవచంగా పనిచేస్తుందని ఎ.ఆర్.దేశాయ్ అనునతడు పేర్కొన్నాడు. హిందూ మత సంరక్షణలో భాగంగా కులవ్యవస్థ కూడా సంరక్షించబడుతున్నది.


    విదేశీయులు భారతదేశంపై దండెత్తి ఇక్కడ నివాసం ఉన్నప్పటికి యురోపియన్లు వచ్చేంతవరకు కూడా ఏ విదేశీయులు కూడా భారతదేశంలోని కులవ్యవస్థని మార్చలేకపోయినారు పైగా వారే భారతీయకరణ చెంది వారే ఇక్కడి కులవ్యవస్థలో భాగమైనారు.

    ఉదాహరణ: కుషానులు, పార్థీయన్లు... మొదలగువారు.


    భారతదేశంలోని వివిధ తెగలు వారివారి సంస్కారాలను బలంగా పాటించడం. ప్రతికులం నందు గల కులసభ్యులు వారి కులం పట్ల గర్వాన్ని (క్యాస్ట్డ్), ఒక కులపరమైన ఇతిహాసిక గాధలను మరియు ప్రత్యేక ఆచారాలు మరియు కట్టుబాట్లను కలిగి ఉండటం మరియు ఆయా అంశాలను ఆశ్రిత కులాల ద్వారా ముందు తరాలకు వివిధ కళారూపాలలో అందింపజేయడం కూడా కారణం.


    కులం అనేది ఓటుబ్యాంకుగా మారిన తర్వాత, కుల సంఘాలు విచ్చలవిడిగా రాజకీయాలు మరియు ఆర్థిక కార్యకలాపాలపై ప్రభావాన్ని చూపెట్టడం మూలంగా కులం అనేది మరింతగా బలపడుతుంది. దేశచరిత్రలో సింధూనాగరికత మొదలు ప్రస్తుత కాలం వరకు ఏ ప్రభుత్వం కూడా కులాన్ని నిర్మూలించే ప్రయత్నం చేయలేదు పైగా కులం అనే భావన బలపడే విధంగా ప్రభుత్వ విధానాలు ఏర్పడుతున్నవి. కుల అంతర్వివాహాన్ని దృఢంగా పాటించడం, కులపరమైన దేవుళ్ళు మరియు ఉత్సవాలు కూడా కులం కొనసాగడానికి దోహదపడుతున్నవి.


    కులవ్యవస్థలో వచ్చిన మార్పులు, అందులకై దోహదపడిన అంశాలు:


    మజుందార్, కుప్పుస్వామి, ఆర్.కె.ముఖర్జీ మరియు ఎం.ఎన్ శ్రీనివాస్ లాంటి వారు కులవ్యవస్థ అత్యంత వేగంగా మారుతున్నది మరియు బలహీనమైతున్నది కాని అంతమవడం లేదు అని అభిప్రాయపడినారు.


    ఐ.పి. దేశాయ్, జి.ఎస్. ఘర్యే, కపాడియా, యోగేంద్రసింగ్ లాంటి వారు కులవ్యవస్థ చాలా నెమ్మదిగా మార్పులకు లోనవుతుందని అభిప్రాయపడుతున్నారు.


    ఘర్యే గారి ప్రకారం కులం ప్రస్తుత రోజుల్లో వ్యక్తుల వృత్తిని నిర్ణయించడం లేదు కాని ఎవరిని వివాహమాడాలన్న విషయాన్ని ఇంకా ప్రభావితం చేస్తున్నది.


    ఆర్.కె.ముఖర్జీ గారి అభిప్రాయంలో కుల పరివర్తనకు ఆర్థిక మరియు సామాజిక కోణాలుంటాయి. అవి....

    1. ఆర్థిక కోణంలో పరివర్తన: కుల వృత్తుల ప్రత్యేకీకరణలో వస్తున్న మార్పులు అనగా అశుభ్రమైన వృత్తులను వదిలివేయడం కులానికి సంబంధం లేనటువంటి వృత్తులను చేపట్టడం తద్వారా కులపరమైన గుర్తింపు కంటే ఆదాయపరమైన గుర్తింపు పొందడం జరుగుతున్నది.

    2. సామాజిక కోణంలో పరివర్తన: సామాజిక కోణంలో చూసినప్పుడు హీనంగా భావించబడుతున్న ఆచారాలు, సాంప్రదాయాలు వదిలివేసి ఉన్నతమైన జీవన విధానాలను అనుసరించడం జరుగుతున్నది, దీనినే సాంస్కృతీకరణ అని పిలుస్తారు.


    కులం తన కుల సభ్యులు కష్టకాలంలో ఉన్నప్పుడు తాను నిర్వర్తించవలసిన పాత్రలని నిర్వహించడం కొనసాగిస్తున్నది దీనితో పాటు కులసభ్యుల సామాజిక, ఆర్థిక సాధికారిత కోసమై ఒక రాజకీయ ఒత్తిడి సమూహంగా తన పాత్రలను నిర్వహిస్తున్నది ఆ క్రమంలోనే నేడు కులసంఘాలు విశేష ప్రాధాన్యతను సంతరించుకుంటున్నవి.


    కులం ఒకప్పుడు నిర్వహించిన కుల పంచాయితీల స్థానంలో ప్రజలు న్యాయస్థానం వైపు మళ్ళుతున్నారు అయినను ఉత్తర భారతదేశంలో ప్రత్యేకంగా హర్యానాలో కులపంచాయితీలైన ఖాప్ పంచాయితీలు గణనీయమైన ప్రభావాన్ని చూపెడుతున్నవి.


    ప్రస్తుతం కులవ్యవస్థ నందు ఆహార నియమాల విషయంలో, వేషధారణ విషయంలో, వృత్తి ఎంపిక విషయంలో, వివాహ విషయంలో, అంటరానితనం విషయంలో చాలా వరకు మార్పులు సంభవించినవి. ఆయా కట్టుబాట్లు అంతరించి నూతన విలువలు  వాటి స్థానంలో ఆచరించబడుతున్నవి. ఇందుకు దోహదపడిన కారణాలు.

    1. సంఘ సంస్కర్తల కృషి

    2. రాజ్యాంగపరమైన ఏర్పాట్లు

    3. సామాజిక శాసనాలు

    4. విద్యాస్థాయిలు పెరగడం

    5. పారిశ్రామికీకరణ

    6. ఆధునీకరణ

    7. నగరీకరణ

    8. నూతన విలువల సృష్టి


    నోట్: కులతత్త్వం అనే ఛాప్టర్ నందు మరియు కులపరమైన ఉద్యమాలు అనే ఛాప్టర్ల యందు పై అంశాలు సవివరింగా వివరించడమైనది.


    కులంపై సామాజిక పరివర్తన ప్రభావం


    సమాజంలోని విలువలు, సామాజిక సంస్థలు, సాంప్రదాయాలు, విధానాలు మరియు పాత్రలు ఇలా మొదలగు సామాజిక అంశాలలో వచ్చే పరివర్తననే సామాజిక పరివర్తన అంటారని మొదటిసారిగా ఎం.ఎన్. శ్రీనివాసన్ అనునతడు తెలిపాడు. వీరినే ఫాదర్ ఆఫ్ సోషల్ ఛేంజ్ ఇన్ మోడ్రన్ ఇండియా అని వ్యవహరిస్తారు. సంస్కృతీకరణ, పాశ్చాత్యీకరణ, సామాజిక మార్పు, ప్రాబల్య కులం అనే భావనలను మొదటి సారిగా వివరించినది ఎం.ఎన్. శ్రీనివాస్ గారు. వీరు తమ యొక్క గ్రంథాలైన 'Social change in Modern India', ఇండియన్ విలేజెస్ అనే గ్రంథాలయందు ఈ భావనలను తెలిపారు. వీరి ప్రకారం సామాజిక పరివర్తన ప్రభావం కులంపై ఈ క్రింది 3 రూపాలలో కనిపిస్తుందని అభిప్రాయపడ్డారు. అవి..

    1. సాంస్కృతీకరణ (Sanskritization) 2. పాశ్చాత్తీకరణ (Westernization) 3. ఆధునీకరణ (Modernization)


    1. సాంస్కృతీకరణ (Sanskritization)


    ఒక కులం ఉమ్మడిగా తమకంటే ఉన్నతంగా భావించబడుతున్న కులం యొక్క ఆచారాలను, సంస్కృతిని మూకుమ్మడిగా అనుసరించడాన్నే సంస్కృతీకరణ అని ఎం.ఎన్. శ్రీనివాస్ తెలిపారు. ఈ ఆచరణలో ఆర్థికపరమైన గతిశీలత కనిపించదు కాని సాంస్కృతికపరమైన గతిశీలత కనిపిస్తుంది.


    కులం అనేది సంస్కృతీకరణకు గురవుతుంది అని యం.ఎన్. శ్రీనివాస్ తన యొక్క గ్రంథం 'Social Change in Modern India'నందు పేర్కొన్నాడు.


    Sanskritization లేదా సంస్కృతీకరణ అనగా ఉన్నత కులాలుగా భావింపబడుతున్నవారిని, వారి యొక్క సంస్కృతిని గుడ్డిగా అనుసరించడంగా భావించవచ్చు. ఉదా: నాయిబ్రాహ్మణులు బ్రాహ్మణులను అనుసరించడం. ఈ అనుకరణ 4 ప్రధాన రూపాలలో ఉంటుందని ఎం.ఎన్. శ్రీనివాస్ తెలిపారు. అవి...

    1. బాహ్మణ నమూనా సంస్కృతీకరణ: బ్రాహ్మణుల యొక్క అలవాట్లను అనుసరించడం. ఉదాహరణ కర్ణాటకలోని కూర్గులు బ్రాహ్మణులని అనుసరిస్తారు. తెలుగు రాష్ట్రాలలో విశ్వబ్రాహ్మణులు కూడా ఈ రకమైన సంస్కృతీకరణకే లోనయినారు.

    2. వైశ్య నమూనా సంస్కృతీకరణ: ఒరిస్సా నందుగల తేలీలు మరియు గుజరాత్ నందు గల కనాబిలు వ్యాపారం చేస్తూ వైశ్యులుగా సంస్కృతీకరణం చెందారు.

    3. క్షత్రియ నమూనా సంస్కృతీకరణ: గుజ్జర్లు మరియు కాయస్థుల వంటివారు సంస్కృతీకరణ చెందిన విధానం.

    4. శూద్ర నమూనా సంస్కృతీకరణ: అంటరాని వారిగా భావింపబడిన కులాలు భూమిని పొంది వ్యవసాయం చేసి మరియు అంటరాని వృత్తులను వదిలి శూద్రులుగా పరిణామం చెందినారు.


    కులంపై పాశ్చాత్రీకరణ మరియు ఆధునీకరణ ప్రభావం


    పాశ్చాత్య దేశాల యొక్క విలువలు, వృత్తులు మరియు ఇతర జీవన పోకడలను అనుసరించడాన్నే పాశ్చాత్యీకరణం అంటారు. ఈ పాశ్చాత్యీకరణం వల్ల సమాజంలోని అన్ని సామాజిక సంస్థలలో మార్పులు సంభవించినట్లుగానే కులవ్యవస్థ నందు కూడా మార్పులు సంభవించినవి.


    మోడ్రనైజేషన్ అనే పదం మోడో అనే ఫ్రెంచ్ పదం నుండి ఉద్భవించింది. మోదో అనగా ప్రస్తుతం అని అర్థం. శాస్త్ర సాంకేతిక మరియు శాస్త్రీయ పరిజ్ఞానాన్ని విరివిగా వినియోగించుకుంటూ జీవించే విధానాన్నే మోడ్రనైజేషన్ అంటారు. ఈ యొక్క మోడ్రనైజేషన్ వల్ల వ్యక్తుల యొక్క భౌతికేతర సంస్కృతి అయిన ఆచారాలు, నమ్మకాలు మరియు సాంప్రదాయాలలో మార్పులు తీవ్రంగా వస్తాయి ఫలితంగానే ఈ యొక్క ఆధునీకరణం వల్ల కులవ్యవస్థలో మార్పులు జరిగినవి.


    ఆధునిక వృత్తులు అందుబాటులోకి రావడం, సేవల రంగం గణనీయంగా అభివృద్ధి చెందడం, నగరీకరణ వేగవంతమవడం, స్త్రీ, పురుషులిద్దరూ విద్యాదికులుగా మారడం మరియు ప్రచార సాధనాల ప్రభావం వల్ల కూడా కులవ్యవస్థలో మార్పులు సంభవిస్తున్నవి.


    నేడు కులం అనేది కులపంచాయితీలకు, రిజర్వేషన్లకు మరియు కులపరమైన గర్వానికి మాత్రమే పరిమితమైనది, కులవృత్తులు, వేశధారణలు, సంస్కృతులు మరియు కొద్ది వరకు కుల అంతర్వివాహాలు కూడా అంతమవుతున్నవి.


    ప్రాబల్య కులం (Dominant Caste)


    ప్రాబల్య కులం అనగా ఒక ప్రాంతంలో జనాభా పరంగా కాని, ఆర్థికంగా కాని, రాజకీయంగా కాని మరియు సాంస్కృతికంగా కాని అన్ని కులాల కంటే ముందంజలో ఉన్నటువంటి కులాన్ని ప్రాబల్య కులం అంటారు. ఉదాహరణ: తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో రెడ్డి కులం ప్రాబల్య కులం, కర్ణాటకలో లింగాయత్లు మరియు ఒక్కలిగ కులస్థులు.


    టేబుల్: 1.4.1 వర్ణవ్యవస్థకు మరియు కులవ్యవస్థమునకు మధ్యగల తేడాలు



    కులవ్యవస్థ అధ్యయనం నందు గల దృక్పథాలు


    డి.డి. కోం అనునతడు కులవ్యవస్థను చారిత్రక దృక్పథంలో పరిశోధన చేసారు. వీరి యొక్క గ్రంథం ద కల్చర్ & సివిలైజేషన్ ఆఫ్ అనిసెంట్ ఇండియా.


    కులాన్ని భారత సమాజ దృక్పథంలో లేదా ఇండోలాజికల్ దృక్పథంలో అధ్యయనం చేసిన వారు రాధా కమల్ ముఖర్జీ, జి.ఎస్. ఘర్యే, లూయిస్ డ్యూమాంట్ గారు, వీరు మతపరమైన, ధార్మికపరమైన తాత్విక గ్రంథాల ప్రాతిపదికపైన భారతీయ సమాజంలోని కులవ్యవస్థను అధ్యయనం చేసారు.


    కులవ్యవస్థను నిర్మితి ప్రకార్యవాద దృక్పథంలో అధ్యయనం చేసినవారు, యం. ఎన్.శ్రీనివాస్, ఎస్.సి. దుబే, మారిట్, ఐ.పి. దేశాయ్ మరియు బి.ఎన్. మజుందార్లు.


    సంఘర్షణాత్మక దృక్పథం లేదా మార్క్సిస్టు దృక్పథంలో అధ్యయనం చేసినవారు ఎ.ఆర్.దేశాయ్ మరియు డి.పి. ముఖర్జీ గారు, యోగేందర్ సింగ్ లాంటి వారు సాంస్కృతిక దృక్పథంలో కులాన్ని అధ్యయనం చేశారు.


    గాంధీ దృక్కోణం కులవ్యవస్థ వల్ల శ్రమవిభజన జరిగినదని తెలుపుతుంది. వీరు కులవ్యవస్థను సమర్థించారు కాని కులం నందు గల అస్పృశ్యతను మరియు అంటరానితనాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.


    మహాత్మాగాంధీ హరిజన సేవక్ సంఘ్ అనే సంస్థద్వారా హరిజనోద్ధరణకు కృషిచేశాడు, వీరే కేరళకు చెందిన అయ్యనాకాళీలను ఉద్ధేశించి హరిజనులు అని పిలిచాడు. అంటరానివారంటే నా వెంటరానివారే మరియు అంటరానితనమనేదే హిందూ మతంలో ఉన్నటువంటి రాచపుండు లాంటిదని, ఇది దేవునికి మరియు మానవునికి చేసే పాపం లాంటిదని అభిప్రాయపడ్డారు.


    ఎం.ఎన్ శ్రీనివాస్ అనునతడు కులాన్ని సామాజిక పరివర్తనా కోణంలో అధ్యయనం చేశారు.


    నోట్: కులానికి మరియు కులతత్వానికి సంబంధించిన వివిధ సంఘ సంస్కర్తల దృక్కోణాలు కులతత్వం అనే పాఠ్యాంశం నందు వివరించడం జరిగింది.


    కులం - ముఖ్యమైన గ్రంథాలు


    1. Caste and Class in India: G.S Garhye

    2. Marriage and Family in India: Kapadia KM

    3. History of Caste in India: Ketkar S.V

    4. Races and Castes in India: D.N. Manjunda

    5. Review of Caste in India: Murdock.J

    6. Hindu Social Organization: Prabhu P.H.

    7. Indian Social System: Ram Ahuja

    8. Indian Heritage and Culutre: Rao P.R

    9. Caste in Modern India & Other Essays: M.N. Srinivas

    10. Indian Villages: M.N. Srinivas

    11. Social Change in India: Kuppu Swami

    12. Social Change in Modern India: M.N. Srinivas

    13. Caste, Class and Occupation: G.S. Ghurye

    14. Inter Caste and Inter Community Marriages in India: Kannan

    15. The Myth of the Caste System: Narmadeshwar Prasad

    16. Caste and Economic Frontier: Bailey

    17. Tribe, Caste, Nation: Bailey

    18. Indian Village: S.C. Dube

    19. A Description of the People in India: Dubois

    20. Origin and Growth of Caste in India: Dutt NK

    21. Caste and Race in India: Ghurye G.S

    22. The Hindu Caste System: Gould and Harald

    23. Caste Adoptation in Modernising Indian Society: Gould and Harold

    24. Caste in India - Its Nature, Functions and Origin: Hutton J.H

    25. Caste in Indian Politics : Kothari and Rajni

    26. Aspects of Caste in India: Leach

    27. Races and Culture in India : Majumdar DN

    28. Caste and Communication in an Indian Village : Majumdar DN

    29. Tribe, Caste and Religion in India: Thapor and Ramesh

    30. Modernization of Indian Tradition: Yogendra singh

    31. Annihilation of Caste: Dr. BR Ambedkar


    పునశ్చరణ


    • కులం అనునది ప్రాథమిక సామాజిక సంస్థ, బంధిత సమూహం, వారసత్వ సమూహం, ఇన్వాలెంటరీ సమూహం, అంతర్వివాహ సమూహం.
    • క్యాస్ట్ అనబడే ఆంగ్లపదం కాస్టా అనబడే స్పానిష్ పదం నుండి తీసుకోబడింది, దీనియొక్క అర్థం వంశక్రమం లేదా జాతి.
    • క్యాస్ట్ అనబడే ఆంగ్లపదం కాస్టస్ అనబడే లాటిన్ పదం నుండి తీసుకోబడింది, దీని యొక్క అర్థం స్వచ్ఛత.
    • క్యాస్ట్ అనే పదాన్ని మొదటగా ఉపయోగించిన వారు పోర్చుగీసువారు.
    • కులం బంధిత సమూహం అని తెలిపిన వారు - మజుందార్ & మదన్.
    • భారతదేశంలో సామాజిక స్థిరీకరణ ప్రధాన రూపం మరియు కారణం కులం.
    • ఏకరూపకత కలిగిన సముదాయమే కులం అని రిస్లే తెలిపారు.
    • ప్రపంచ వ్యాప్తంగా సామాజిక స్థిరీకరణ, వర్ణం, లింగం, ఎస్టేట్, వర్గం రూపంలో కనపడుతుంది.
    • కేవలం ఒక కులంపైననే పూర్తిగా ఆధారపడి జీవనోపాధిని కొనసాగించే కులాన్ని ఆశ్రిత కులం లేదా డిపెండెంట్ కాస్ట్ అంటారు.
    • ఒక ప్రాంతంలో రాజకీయంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా మరియు జనాభా పరంగా ఆధిపత్యాన్ని చెలాయించే కులాన్నే ఆధిక్య కులం లేదా డామినెంట్ కాస్ట్ అని అంటారు. ఈ భావనను తెలిపినది ఎం.ఎన్.శ్రీనివాస్.
    • క్యాస్ట్ & రేస్ అనే గ్రంథం నందు ఘర్యే గారు కులానికి 6 ప్రధాన లక్షణాలు ఉంటాయని తెలిపినారు.
    • పరువు హత్యలు అధికంగా కాప్ పంచాయితీల వలన జరుగుతున్నది.
    • కులం పుట్టుక గురించి దైవ సిద్ధాంతం ద్వారా ఋగ్వేదం, వృత్తి సిద్ధాంతం ద్వారా నెన్ఫీల్డ్, జాతి సిద్ధాంతం ద్వారా రిస్లే, సాంఘిక సమీకృత సిద్ధాంతం ద్వారా శరత్చంద్ర, పరిణామ సిద్ధాంతం ద్వారా ఎబ్బేస్టన్, భౌగోళిక సిద్ధాంతం గిల్బర్ట్సం స్కార సిద్ధాంతం ద్వారా సేనార్ట్, బహుళకారక సిద్ధాంతం ద్వారా హట్టన్ అనునతడు వివరించారు.
    • సాంస్కృతీకరణ, ఆధునీకరణ, పాశ్చాత్రీకరణ, సామాజిక పరివర్తన, ఆధిపత్య కులం అనే భావనలను మొదటగా తెలిపిన వారు ఎం.ఎన్.శ్రీనివాస్.
    • అనాలేషన్ ఆఫ్ కాస్ట్ అనే గ్రంథాన్ని రచించిన వారు - డా|| బి.ఆర్.అంబేద్కర్.



Tags: Caste system, gender roles, joint families, arranged marriages, diversity, cultural festivals, social hierarchy, economic disparities, religious practices, education system, urbanization, rural traditions, globalization, modernization


1 comment:

Post Bottom Ad