2.5 బాలల దుర్వినియోగం (Child Abuse) - GNANA SAMHITHA

GNANA SAMHITHA

DONT WORRY!!! WE HELP YOU TO REACH YOUR GOAL 😊

Breaking

Post Top Ad

Sunday, July 16, 2023

2.5 బాలల దుర్వినియోగం (Child Abuse)

2.5  బాలల దుర్వినియోగం (Child Abuse)


    ♦ బాలల హక్కుల సాంప్రదాయం నవంబర్ 20, 1989 ప్రకారం, జాతీయ నూతన బాలల విధానం -2013 ప్రకారం, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ చట్టం-2012 ప్రకారం, బాలన్యాయ చట్టం-2015 ప్రకారం 18 సంవత్సరాలలోపు వారిని బాలలుగా పరిగణిస్తారు.


    ♦ సవరించిన బాలకార్మిక నిషేధ చట్టం - 1986 ప్రకారం 14 సం॥లలోపు వారు ఎలాంటి పనిని వారి విద్యకు ఆటంకం కలిగించే విధంగా చేపట్టిన బాలకార్మికుడిగా మరియు 15-18 సం॥ల వారిని కౌమార పనివారలుగా నిర్వచించింది.


    బాలల దుర్వినియోగం: నిర్వచనం, అర్థం మరియు భావన


    ♦ మానవ సమాజం ఆవిర్భవించినప్పటి నుండే బాలలను శారీరక, మానసిక, ఉద్వేగ మరియు సామాజికపరమైన దుర్వినియోగమునకు గురిచేయడం అనునది కుటుంబ స్థాయి నుండి సమాజస్థాయి వరకు గోచరిస్తున్నది. ఆధునికత, పట్టణీకరణ, ఉమ్మడి కుటుంబాల విచ్ఛిన్నం, మురికివాడల వృద్ధి, వలసలు, సాంకేతిక పరిజ్ఞానం యొక్క దుర్వినియోగం లాంటివి బాలల దుర్వినియోగం రోజురోజునకు తీవ్రతరం అయ్యేందుకు కారణభూతాలవుతున్నవి.


    ♦ భ్రూణ హత్యలు, శిశు హత్యలు, బాలల కొనుగోలు అమ్మకాలు, తల్లిదండ్రుల చేతిలో హింసకు గురవ్వడం, పాఠశాలల్లో తీవ్రమైన శిక్షలు, విద్యాపరమైన ఒత్తిడులు, వీధి బాలలు, బాలల అక్రమ రవాణా, బాలకార్మికత, బాలలపై వెట్టిచాకిరి, బాలలను జోగినీలుగా మార్చడం, హింసాత్మక కార్యక్రమాల్లో బాలలను వినియోగించడం (చైల్డ్ పోలిసింగ్), బాలలను వదిలించుకోవడం, బలవంతంగా భిక్షాటన వైపు మరల్చడం, ఛైల్డ్ ప్రోనోగ్రఫి, సర్కస్ మరియు ఇతర వినోద పరిశ్రమలల్లో వారిని దుర్వినియోగపర్చడం, విద్యకు దూరం చేయడం లాంటి వివిధ రూపాలలో ప్రస్తుతం బాలల దుర్వినియోగం సమాజం నందు గోచరిస్తున్నది.


    ♦ ఛైల్డ్ అబ్యూస్ అనే భావనని ఛైల్డ్ మాల్ట్రీట్మెంట్, ఛైల్డ్ నెగెక్ట్ లాంటి భావనలతో కూడా పిలుస్తారు. ఇది ప్రపంచ స్థాయి మరియు ప్రజారోగ్య సమస్య. ఈ యొక్క సామాజిక దురాచారం అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న మరియు వెనుకబడిన దేశాలలో కూడా వివిధ రూపాలలో గోచరిస్తున్నది.


    ♦ ప్రపంచ ఆరోగ్యసంస్థ వారి ప్రకారం చైల్డ్ అబ్యూస్ అనగా...

    1. బాలలకు ఉన్నటువంటి హక్కులను కాలరాయడం

    2. శారీరక హింస

    3. ఉద్వేగపరమైనటువంటి హింస

    4. లైంగిక హాని/లైంగిక దాడులు

    5. నిరాధారణకు గురిచెయ్యడం

    6. వ్యాపార మార్గంలో వారియొక్క శరీరాన్ని వినియోగించడం

    7. బాలల యొక్క ఆరోగ్యం, మనుగడ, వికాసం, గౌరవం, ఉద్వేగం లాంటి అంశాలకు హానికలిగించే ఏ చర్య అయిన చైల్డ్ అబ్యూస్ గానే పరిగణించవచ్చు.


    NIPCCD వారి ప్రకారం...


    ♦ 1988వ సంవత్సరంలో National Institute of Public Cooperation and Child Development వారు నిర్వహించిన జాతీయ సదస్సులో ఈ క్రింది విధంగా వివరించడం జరిగింది.

    1. బాలలను ఉద్దేశ పూర్వకంగా నిర్లక్ష్యానికి మరియు నిరాధరణకు గురిచెయ్యడం లేదా అలాంటి పరిస్థితిని కృత్రిమంగా సృష్టించడం.

    2. తల్లిదండ్రుల చేత నిరాధరణకు, హింసకు గురవ్వడం

    3. కేర్ టేకర్స్ (సంరక్షకులు) చేతిలో నిరాధరణకు గురికావడం

    4. ప్రమాదం లేకపోయిన సరే గాయాలు బాలుడికి కనిపించినప్పుడు చైల్డ్ అబ్యూస్ గానే పరిగణించవచ్చు.

    5. ఎవరి చేతిలోనైనా సరే (తల్లిదండ్రులతో సహా) బాలుడికి యొక్క హక్కులకు, మనుగడకు, వికాసానికి, ఉద్వేగానికి, శరీరానికి, సామాజిక సంబంధాలకు, మానసిక ఆరోగ్యానికి ఆటంకాలు లేదా ఇబ్బందులు కలుగజేసే ఏ చర్య అయిన చైల్డ్ అబ్యూస్ గానే పరిగణించబడుతుంది

    6. బాలుడిని వికలాంగుడిగా మారేందుకు ప్రత్యక్షంగా, పరోక్షంగా కారణభూతమైన చర్యలు కూడా చైల్డ్ అబ్యూస్గడ్గానే పరిగణించబడుతుంది.

    7. మానసిక మరియు శారీరక వికలాంగ బాలులను నిరాధరణకు గురిచెయ్యడం కూడా ఛైల్డ్ అబ్యూస్ గానే పరిగణింపబడుతుంది.


    నోట్ : సుస్థిరాభివృద్ధి లేదా ఎజెండా 2030 నందు గల 16.2వ టార్గెట్ ప్రకారం బాలలపై జరుగుతున్న హింస, వేధింపులు, అక్రమ రవాణా, దోపిడీ మరియు బాలల దుర్వినియోగంను అంతం చేయాలి.


    బాలల దుర్వినియోగ రూపాలు


    ♦ బాలల దుర్వినియోగ రూపాలు ప్రధానంగా ...

    1. సామాజిక దుర్వినియోగం (సోషల్ అబ్యూస్)

    2. శారీరకపరమైన దుర్వినియోగం (ఫిజికల్ అబ్యూస్)

    3. శారీరకేతర దుర్వినియోగం (నాన్-ఫిజికల్ అబ్యూస్)


    1. సామాజిక దుర్వినియోగం (సోషల్ అబ్యూస్)


    ♦ సమాజం నందు ప్రజలు వారి యొక్క సంస్కృతి, విలువలు, సాంప్రదాయం మరియు ఆచారాలలో భాగంగా బాలల యొక్క హక్కులకు భంగం కలిగించే చర్యలను మరియు కార్యక్రమాలను చేపట్టడాన్నే సామాజిక దుర్వినియోగం అంటారు.

    ♦ ఇది ప్రధానంగా భ్రూణ హత్యలు, శిశు హత్యలు, బాల్య వివాహాలు, బాలలచే వ్యభిచారం చేయించడం, బాలలచే భిక్షాటన మరియు బాలకార్మికత లాంటి రూపాలలో కనబడతాయి.

    ♦ ఆర్థికంగా వెనుకబడి ఉండటం, నిరక్షరాస్యత, అవగాహన లేమి, సాంప్రదాయల కొనసాగింపు లాంటివి ఈ దుర్వినియోగానికి ప్రధాన కారణాలు.


    నోట్ : ఛైల్డ్ లేబర్ అనే అంశంపై ప్రత్యేక ఛాప్టర్ కలదు.


    2. శారీరకపరమైన దుర్వినియోగం (ఫిజికల్ అబ్యూస్)


    ♦ తిట్టడం, కొట్టడం, వికలాంగత్వానికి గురిచెయ్యడం, తీవ్రమైన శిక్షలు వేయడం, వాతలు పెట్టడం, మంటలకు గురిచెయ్యడం లాంటి శారీరక హింసలు మరియు బాలుడిని గాయాలకు గానీ, వికలాంగత్వానికి గాని లేదా మరణానికి గాని గురిచేసే అంశాలన్ని శారీరకపరమైన దుర్వినియోగంగానే పరిగణించబడతాయి.

    ♦ బాలలకు కావాల్సిన సరియైన పెంపకాన్ని అందివ్వకపోవడం, వారి ఆరోగ్యపరమైన అవసరాలను తీర్చకపోవడం, వారి ఆహారం పట్ల నిర్లక్ష్యానికి గురిచెయ్యడం. వారికి కావాల్సిన కనీస మనుగడ పరమైన అవసరాలు అందివ్వకపోవడం కూడా లాంటి శారీరక నిర్లక్ష్యంతో కూడిన చర్యలు కూడా ఇందులో భాగమే.

    ♦ పిల్లల పెంపకంలో భాగంగా తల్లిదండ్రులు సరియైన విధానంలో పిల్లల్ని పెంచకుండా వారిని తీవ్రమైన నిర్లక్ష్యానికి మరియు గాలికి వదిలేయడం తద్వారా పిల్లల్లో సామాజీకరణ సరియైన విధానంలో జరగకుండా వారు ప్రజ్ఞాపరమైన వికలాంగులుగా, ఉద్వేగపరమైన సమస్యలతో, కుటుంబ ఆప్యాయతకు దూరమై బాల్యం విజయవంతమవ్వదు. ఇలాంటి హింసను నిరాపయమైన నిర్లక్ష్యం (Benign neglect) అని అంటారు.


    నోట్ :


    1. బాలల్ని ఉత్తమ పౌరులుగా తయారుచేయడంలో కుటుంబానిది ప్రధానపాత్ర, బాలలకు కావల్సిన అన్ని రకాల శారీరక, మానసిక, సామాజిక, ఉద్వేగపరమైన మరియు ఆర్థికపరమైన అవసరాలను తీరుస్తూ, వారికి వాత్సల్యం, ప్రేమ మరియు అనుబంధాలను అందిస్తూ వారిని పెంచడాన్నే పేరేంటింగ్ అని పిలుస్తారు.


    2. పిల్లల పెంపక నమునాలు (Parenting styles/Approaches): ఆయా సంస్కృతులు మరియు జీవన విధానాలు, విద్యాస్థాయిలు మరియు కుటుంబ ఆర్థిక స్థితిగతులు మరియు పిల్లల యొక్క వయస్సు దశలు లాంటి వాటి ఆధారంగా పిల్లల్ని పెంచేందుకు వివిధ రకాల నమూనాలు తెలుపబడినవి. అవి...

    1. Authoritative parent: పిల్లలకు నిబంధనలతో కూడిన parenting

    2. Authoritian parent: చాలా కఠినంగా punishment తో కూడుకొని ఉంటుంది.

    3. Permissive parent: పిల్లలపై నియంత్రణ లేని విధానం

    4. Uninvolved parent: పిల్లలని పటించుకోకపోవడం

    5. Helicopter parent: అతిజాగ్రత్తలతో కూడిన పెంపకం

    6. Norsistic parent: అహంకార పూరితమైన

    7. Positive parent: Best parenting

    8. Strict parent: Almost authoritian

    9. Toxic parent: విషపూరితంగా పెంచడం. ఉదా: పిల్లల్ని విపరీతంగా హింసించడం.

    10. Democratic parenting : ప్రజాస్వామ్య పద్ధతిలో పెంపకం.


    నోట్ : పై అన్ని రకాల నమూనాల యందు పాజిటివ్ పేరెంటింగ్ మరియు డెమోక్రటిక్ పేరెంటింగ్ ఉత్తమమైనవి.


    3. శారీరకేతర దుర్వినియోగం (నాన్-ఫిజికల్ అబ్యూస్)

    మాటలతో తిట్టడం, విద్యకు దూరం చేయడం, ఉద్వేగానికి గురిచేయడం, కుటుంబం హింసాయుతంగా ఉండటం, బాలల్లో నేరాన్ని ప్రేరేపించడం, కుటుంబంలో విచ్చలవిడి తనం ఉండటం, తల్లిదండ్రుల విశృంఖల లైంగిక చర్యలు, కుటుంబంలో మధ్యపానం మరియు ఇతర డ్రగ్స్ వినియోగించడం మరియు ఆప్యాయత, అనురాగాలు లేకపోవడం దీని పరిధిలోకి వస్తాయి.


    నోట్ : పైన వివరించిన అంశాలతో పాటుగా సాధారణ కోణంలో ఆలోచించినప్పుడు బాలలకు హానికల్గించే ఏ చర్య అయిన బాలల యొక్క దుర్వినియోగంగానే భావిస్తారు. ఇవి...

    1. బాలకార్మికత

    2. బాలలపై హింస

    3. బాలలకు చెడు అలవాట్లు నేర్పించడం

    4. బాలపరాదం

    5. బాల్యవివాహాలు

    6. చైల్డ్ పోలిసింగ్

    7. బాలల అక్రమరవాణా

    8. బాలల చేత సర్కస్లు మరియు జోగినీ లాంటి ఆచారాలు పాటింపచేయడం.

    9. బాలలను భిక్షాటకులుగా మార్చడం

    10. తీవ్రవాదంను మరియు డ్రగ్స్ మాఫియాలో బాలల్ని వినియోగించడం

    11. బాలల్ని వస్తువులుగా ఎగుమతికి మరియు దిగుమతికి గురిచేయడం

    12. బాలలచేత వెట్టిచాకిరి చేయించుకోవడం లాంటివి కూడా చైల్డ్ అబ్యూస్ పరిధిలోనికే వస్తాయి. కావున బాలల యొక్క శారీరక, మానసిక, ఉద్వేగపరమైన, విద్యాపరమైన, సామాజిక పరమైన, వికాసమునకు, ఆటంకం కలిగించే మరియు హాని కల్గించే ఏ చర్య అయిన బాలల యొక్క దుర్వినియోగంగానే పరిగణించబడుతుంది.


    బాలల దుర్వినియోగం యొక్క తీవ్రత


    ♦ 2020 సంవత్సరంలో రూపొందించబడిన గ్లోబల్ స్టేటస్ రిపోర్టు ఆన్ ప్రివెంటింగ్ వయోలెన్స్ ఎగెనెస్ట్ చిల్డ్రన్ నివేదిక ప్రకారం, ప్రపంచ వ్యాప్తంగా సుమారుగా 4 బాలల్లో 3 బాలలు (లేదా) 300 మిలియన్ల బాలలు ఏదో ఒక రూపంలో బాలపరాధమునకు గురవుతున్నారు. 5 గురు మహిళల్లో 1 మహిళ బాల్యంలో లైంగిక వేధింపుల బాధను అనుభవించి ఉంటున్నారు. అలాగే 13 మంది పురుషుల్లో 1 బాల్యంలో లైంగిక వేధింపులను ఎదుర్కొని ఉన్నారు.

    ♦ కేంద్ర నేరపరిశోధన సంస్థ 2021 నివేదికను 2022వ సం||లో విడుదల చేయడం జరిగింది. ఈ నివేదిక ప్రకారం...

    1. 2021 సంవత్సరానికి గాను 1,49,404 నేరాలు బాలలపై జరిగినవి. గత సంవత్సరంతో పోలిస్తే ఇది 16.2% అధికం. బాలలపై జరుగుతున్నటువంటి నేరాలలో మొదటి స్థానంలో అపహరణకు గురిచెయ్యడం, రెండవ స్థానంలో పోక్సో నేరాలు కలవు.

    2. 2021 సంవత్సరానికి గాను పోక్సో నేరాలు 53,874 నమోదయినవి.

    3. 2021 సంవత్సరానికి గాను బాలలపై నేరాలరేటు 33.6గా నమోదవగా, 2020వ సంవత్సరానికి ఇది 28.9గా ఉండేది.


    నోట్ : ప్రతి లక్ష మంది బాలల్లో ఎంత మంది బాలలు నేరానికి గురవుతున్నారో తెలిపేదే బాలలపై నేరాల రేటు.


    ♦ భ్రూణ హత్యల విషయంలో మధ్యప్రదేశ్, గుజరాత్ సంయుక్తంగా మొదటి స్థానంలో ఉన్నవి. వీటి తర్వాత ఛత్తీస్ ఘడ్ మరియు రాజస్థాన్ కలవు.

    ♦ బాలల్ని నిర్బంధించిన నేరాలు మహారాష్ట్రలో అధికంగా జరుగుతున్నవి.

    ♦ బాలలపై జరుగుతున్న నేరాలలో ప్రతి 3వ నేరం పోక్సోనేరానికి సంబంధించినదే.

    ♦ పోక్సో నేరాలు అధికంగా ఉత్తరప్రదేశ్ నందు నమోదవుతున్నవి.

    ♦ బాలన్యాయం చట్టం కింద అధికంగా రాజస్థాన్ నందు నమోదవుతున్నవి.

    ♦ బాలలపై నేరాల రేటు అధికంగా సిక్కిం నందు కలదు.

    ♦ బాలలపై లైంగిక నేరాలు సిక్కిం నందే అధికంగా నమోదైనవి.

    ♦ 2020-21 సంవత్సరానికి గాను బాలలపై నేరాల సంఖ్యలో 16.2% అధికంగా నమోదైంది.

    ♦ అపహరణ కేసులు మహారాష్ట్రలో అధికంగా నమోదవుతున్నవి.

    ♦ శిశువుల హత్యలు తమిళనాడులో అధికంగా నమోదవుతున్నవి. ఈ నేరాలలో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో కలదు.

    ♦ బాలల పట్ల నేరాల సంఖ్య అధికంగా మధ్యప్రదేశ్లో నమోదవుతున్నవి.


    బాలల యొక్క దుర్వినియోగం - చట్టపరమైన చర్యలు మరియు కార్యక్రమాలు


    భారతీయ శిక్షాస్మృతి మరియు సామాజిక శాసనాల ద్వారా బాలల పట్ల జరుగుతున్న దుర్వినియోగాన్ని అరికట్టేందుకై చర్యలు చేపడుతున్నారు.


    నోట్ : మహిళలపై హింస అనే ఛాప్టర్ నందు భారతీయ శిక్షాస్మృతికి సంబంధించిన సెక్షన్లను పొందుపరచడం జరిగింది గమనించగలరు.


    శాసనపరమైన చర్యలు 


    1. బాల్యవివాహాలను అరికట్టేందుకై 1929లో శారద చట్టాన్ని రూపొందించారు. 2006లో బాల్యవివాహ నిషేధ చట్టాన్ని రూపొందించారు. ఆయా చట్టాల యొక్క పూర్తి వివరాలు వివాహం అనే ఛాప్టర్ నందు పొందుపర్చడం జరిగింది.

    2. బాలకార్మికతను నిర్మూలించేందుకు గాను సవరించిన బాలకార్మిక నిషేధ చట్టాన్ని 2016వ సంవత్సరంలో రూపొందించారు. వివరాలు బాలకార్మికత అనే ఛాప్టర్ యందు వివరించడమైనది. 

    3. SITA చట్టం 1956 మరియు ITPI చట్టం 1986 ద్వారా అనైతిక కార్యక్రమాలను నివారించేందుకు ప్రయత్నిస్తున్నారు.

    4. బాలన్యాయ చట్టం 2015 ద్వారా అనాద బాలలు, రక్షణ అవసరం ఉన్న బాలలు, అపరాద బాలలు, భిక్షాటన బాలలు మరియు చట్టపరమైన దత్తత అలాగే బాలలపై జరుగుతున్న హింసలకు సంబంధించి చర్యలు చేపడుతున్నారు.

    5. బాలలపై జరుగుతున్నటువంటి లైంగిక దాడులను నివారించేందుకు పోక్సో చట్టాన్ని 2012వ సంవత్సరంలో పొందుపర్చారు.


    శారద చట్టం (1929)


    • దీనినే బాల్యవివాహ నిరోధక చట్టం అని కూడా అంటారు. ఈ చట్టం 1927లో ఏర్పాటు చేసిన హరబిలాస్ శారదా కమిటీ సూచనల మేరకు ఏర్పాటు చేశారు.
    • ఏప్రిల్ 01, 1930న అమలులోకి వచ్చినది.
    • బాల్య వివాహాలపై సూచనలు చేసిన శారద కమిటీకి అనుగుణంగా రూపొందించారు.
    • వివాహ వయస్సు బాలికకు 14, బాలుడికి 18. బాలికకు దాంపత్య వయస్సు 15 సంవత్సరాలు.
    • 1949లో బాలిక వివాహ వయస్సు 15 సంవత్సరాలుగా మార్చారు.
    • 1978లో సవరించి వివాహ వయస్సుని 18,21 గా మార్చారు.
    • సెక్షన్ 16 ప్రకారం, బాల్య వివాహ నిరోధక అధికారి ఎంపిక జరుగుతుంది. 3 నెలలు & 1000/- జరిమానా.


    బాల్య వివాహ నిషేధ చట్టం (2006)


    • 10 జనవరి, 2007 నుండి అమలులోకి వచ్చినది.
    • వివాహ వయస్సు - బాలికలకు 18, మరియు బాలురకు 21.
    • చట్టం అతిక్రమించిన వారికి 2 సం॥ జైలు శిక్ష & 1,00,000/- జరిమానా (వరుడు మేజర్ అయినప్పుడు మాత్రమే వర్తిస్తుంది. కానీ వరుడి తండ్రి వధువు తండ్రి + అయ్యగారు అందరూ శిక్షార్హులే).


    PCPNDT Act - 1994 (గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టం)


    • ఈ చట్టంనే The Pre - Conception and Pre-Natal Diagnostic Techniques (Prohibition of Sex Selection) Act అందురు. ఈ చట్టాన్ని 1994లో రూపొందించారు, 1 జనవరి 1996 నుండి అమలులోనికి వచ్చింది.
    • గర్భస్థ లింగనిర్ధారాన్ని చేసిన తరువాత, ఆడ శివువులను భ్రూణ హత్యలకు గురిచేయడం వల్లనే లింగనిష్పత్తి బాగా తగ్గిపోతున్నది అందువల్లనే ఈ చట్టంను రూపొందించారు.
    • బేటి బచావో మరియు బేటి పడావో కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాల్లో లింగ నిర్ధారాన్ని పరీక్షల నిషేద చట్టంను సమర్థవంతంగా అమలు చేసి భ్రూణ హత్యలను నివారించడం అనునది ముఖ్యమైనది.
    • ఈ చట్టం ప్రకారం గర్భస్థ లింగ నిర్ధారాన్ని పరీక్షలు నిషేధం మరియు నేరుగా పరిగణించబడుతుంది. కాని జన్యుపరమైన వ్యాధులు ఉన్నప్పుడు, ఇంతకు మునుపు అబార్షన్ అయిఉంటే స్కానింగ్ చేసి శిశువు ఆరోగ్యంను తెలుసుకోవచ్చు.
    • ఈ చట్టంలోని సెక్షన్ 3ఎ ప్రకారం Sex Selective Abortions నిషేదం మరియు సెక్షన్ 4 ప్రకారం క్రింది సందర్భాలలో స్కానింగ్ చేయవచ్చును.

              1. తల్లికి 35 సంవత్సరాలు దాటి ఉన్నప్పుడు

              2. ఇంతకు మునుపు అబార్షన్ అయి ఉన్నట్లయితే

              3. తల్లి తీవ్రమైన వ్యాధులు, రేడియేషన్లకు గురైనప్పుడు

              4. కుటుంబంలో జన్యువ్యాధులు ఉన్నప్పుడు.

    • ఈ చట్టం ప్రకారం, మొదటి సారి నేరం చేసినప్పుడు 3 సంవత్సరాల జైలు శిక్ష మరియు 10 వేల జరిమానాని మరియు రెండవసారి నేరంనకు పాల్పడితే 5 సంవత్సరాల జైలుశిక్ష మరియు 50 వేల జరిమానా విధించబడుతుంది మరియు ఆయా ఆస్పత్రులు మరియు వైధ్యుల గుర్తింపు రద్దుచేస్తారు. దేశంలో మొదటిసారి ఇలాంటి చట్టాన్ని 1988లో మహారాష్ట్ర రూపొందించింది.


    లైంగిక దాడుల నుండి బాలుల సంరక్షణ చట్టం 2012


    • దీనినే పోక్సో చట్టం లేదా Protection of Children from Sexual Offenses Act, 2012.
    • ఈ చట్టం నవంబర్ 14, 2012 నుండి అమలులోనికి వచ్చింది. బాలలను లైంగిక దాడులు, వేదింపులు మరియు ప్రోనోగ్రఫి నుండి రక్షించడం మరియు నిందితులను త్వరితగతిన శిక్షించడం ఈ చట్టం యొక్క లక్ష్యం.
    • ఈ చట్టం ప్రకారం 18 సంవత్సరాల లోపు వారు బాలలు, ఈ చట్టం లింగ తటస్థతను పాటిస్తుంది అనగా ఒక మహిళ బాలుడిపై లైంగిక దాడిచేసిన లేదా ఒక పురుషుడు బాలికపై లైంగిక దాడి చేసిన లేదా ఒక స్త్రీ బాలికపై లైంగిక దాడిచేసిన లేదా ఒక పురుషుడు బాలుడిపై లైంగిక దాడి చేసిన శిక్షింపబడతారు.
    • ఈ చట్టం బాలుడిపై జరిగే లైంగిక దాడులను లైంగిక వేదింపులు, ప్రోనోగ్రఫి, అంగప్రవేశం జరిగిన నేరాలు మరియు అంగప్రవేశం జరగని నేరాలుగా నిర్వచించింది.
    • ఈ చట్టాన్ని 2019వ సంవత్సరంలో సవరించారు. ఈ చట్టం క్రింద విదిస్తున్న శిక్షలు.
    • అంగప్రవేశంతో కూడిన లైంగిక వేదింపులకు కనీసం 7సం॥ నుండి 10 సం॥ జైలుశిక్ష మరియు 16 సంవత్సరాలలోపు బాలలపై దాడి జరిగినప్పుడు 20 సంవత్సరాల నుండి జీవితకాలం వరకు జైలుశిక్ష విధించవచ్చు.
    • తీవ్రమైన హింసతో కూడిన అంగప్రవేశ లైంగిక వేదింపులకు కనీసం 10 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల వరకు మరియు జీవిత కాలం జైలుశిక్ష కూడా విధించవచ్చు.
    • బాలలు నటించిన నీలిచిత్రాలను నిల్వచేసిన లేదా పంపిణీ చేసినా 3 నుండి 5 సంవత్సరాల వరకు జైలుశిక్ష మరియు జరిమానా విధించబడును.
    • పిల్లల్ని అశ్లీల చిత్రాల కోసం వినియోగించినట్లయితే కనీసం 10 సంవత్సరాల జైలు శిక్ష నుండి జీవిత ఖైదు విధించబడుతుంది. ఇదే నేరం తీవ్రంగా ఉన్నట్లయితే కనీస జైలుశిక్ష 20 సంవత్సరాల వరకు ఉంటుంది.


    జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమీషన్ చట్టం - 2005


    • జాతీయ స్థాయిలో బాలల హక్కులను సంరక్షించేందుకు చట్టబద్ధ సంస్థను ఏర్పాటు చేయడం కోసం ఈ చట్టాన్ని రూపొందించారు. ఈ చట్టాన్ని 2006లో సవరించారు.
    • ఈ చట్టం ఆధారంగా 2007లో జాతీయ బాలల హక్కుల సంరక్షణ కమిషన్ని ఏర్పాటు చేశారు.


    బాల న్యాయచట్టం (రక్షణ మరియు భద్రత)-2015


    ఈ చట్టంనే The Juvenile Justice (Care and Protection) Act 2015 అని అందురు.

    ఈ చట్టం 15 జనవరి 2016 నుండి అమలులోనికి వచ్చింది. బెస్ట్ ఇంట్రస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్ అనునది ఈ చట్టం యొక్క తత్వం.

    బాలల సంరక్షణ, వికాసం, చికిత్స, సామాజిక మరియు మానసిక పునారావాసం, చట్టపరమైన దత్తత, బిక్షాటనను అరికట్టడం, బాలపరాధుల యొక్క సంస్కరణ, రక్షణ అవసరం ఉన్న పిల్లలను సంరక్షించడం అనునవి ఈ చట్టం యొక్క లక్ష్యాలు.

    నవంబర్ 20, 1989న UNO రూపొందించి Child Rights Convention పైన డిసెంబర్ 11, 1992 భారత్ సంతకం చేసింది, ఐక్యరాజ్యసమితి బాలన్యాయ నియమాలు (బీజింగ్ నియమాలు) 1985, దత్తత పైన హెగ్ Convention 1993పై భారత్ సంతకం చేసింది కావున ఆయా నియమాలను అనుగుణంగా పాత బాలన్యాయ చట్టం స్థానంలో ఈ నూతన బాలన్యాయ చట్టం - 2015 ని రూపొందించింది.


    (నోట్: బాలన్యాయ చట్టం మొదటి సారి 1986వ సంవత్సరంలో రూపొందించారు అప్పటినుండి కాలక్రమంగా అవసరం మేరకు సవరిస్తూ వస్తున్నారు, ఆ క్రమంలో చివరగా 2015వ సంవత్సరంలో సమగ్రంగా సవరించి పాతచట్టం స్థానంలో జె.జె. యాక్ట్ 2015ని రూపొందించారు. ఈ చట్టాన్ని ఇటీవల 2021 సంవత్సరంలో సవరించారు).


    ఈ చట్టం ద్వారా క్రింది చట్టబద్ధ సంస్థలు ఏర్పడినవి.

    1. బాల అపరాధుల సంస్కరణ కోసం జువైనల్ జస్టిస్ బోర్డులు (JJB)

    2. రక్షణ అవసరం ఉన్న బాలల కోసం Child Welfare Committee (CWC) లు

    3. District Child Protection Units (DCPU)

    4. దత్తత సంబంధించిన పర్యవేక్షణ కోసం (Central Adoption Resource Authority-CARA)

    ♦ పై సంస్థలలో JJB, CWC, DCPU లు జిల్లాస్థాయిలో మరియు CARA లు జాతీయ స్థాయిలో సేవలందిస్తాయి.


    ఈ చట్టం నందలి ముఖ్యాంశాలు


    1. సాధారణ నేరాలు చేసిన సందర్భంలో 18 సంవత్సరాల లోపు వారు బాల అపరాదులుగా పరిగణింపబడతారు, కాని 7 సంవత్సరాల కంటే ఎక్కువ శిక్షపడే అవకాశమున్న తీవ్రమైన నేరాలు చేసినప్పుడు 16 సంవత్సరాల లోపు వారే బాలపరాధులుగా పరిగనింపబడతారు. వీరికి JJB మార్గదర్శకత్వాలలో సంస్కరణ సేవలు అందిస్తారు.

    2. రక్షణ అవసరం ఉన్న పిల్లలు అనగా అనాదలు, బాల్య వివాహం, బాల కార్మికత, వెట్టి చాకిరి, అక్రమ రవాణా, బిక్షాటన లాంటి సమస్యలకు లోనయ్యే పిల్లలు. ఇలాంటి పిల్లల కోసం NGO ల సహకారంతో మరియు Child Protection Services Scheme సిబ్బంది సమన్వయంతో మరియు 1098 హెల్ప్ లైన్ సహాయంతో ఆయా బాలలను సంరక్షించి Child Welfare Committee వారి పర్యవేక్షణలో Childrens Home, Place of Saftey, బాలసదన్ లాంటి సంస్థలలో ఆయా బాలలకు విద్య, వైద్యం, ఆహారం, నివాసం లాంటి సౌకర్యాలు అందిస్తారు.

    3. Foster కుటుంబాల సహాయంతో Foster Care కూడా అందిస్తారు.

    4. 18 సంవత్సరాల తరువాత కూడా పిల్లలకు సంరక్షణ అవసరం అనుకుంటే 21 సంవత్సరాల వరకు కూడా సేవలందిస్తారు. వీటినే After Care Services అందురు.

    5. బాలపరాధులకు జువైనల్ జస్టిస్ బోర్డు ద్వారా Special Homes నందు మరియు Observation Homes నందు సంస్కరణ సేవలు అందించి వారిలో ప్రవర్తనా మార్పు తీసుకువస్తారు.

    6. ఈ చట్టం ప్రకారం బాధిత బాలల యొక్క వివరాలు, ఫోటోలు బహిర్గతం చేసిన వారికి మరియు మీడియా వారికి కూడా 6 నెలల జైలు శిక్ష మరియు 2 లక్షల వరకు జరిమానా విధించవచ్చును.

    7. ఈ చట్టం ప్రకారం శిక్షలు

    • పిల్లలపై క్రూరత్వం చూపినట్లయితే - 3 సంవత్సరాలు + లక్ష ఫైన్
    • సంరక్షణ సిబ్బంది క్రూరత్వం చూపినట్లయితే - 5 సంవత్సరాలు + 5 లక్షలు ఫైన్
    • పిల్లలపై క్రూరత్వం వల్ల పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడినట్లయితే 3 నుండి 10 సంవత్సరాలు జైలు శిక్ష + 5 లక్షల ఫైన్
    • పిల్లలచే బిక్షాటన చేపిస్తే - 5 సంవత్సరాలు + లక్ష ఫైన్
    • బిక్షాటన కోసం అంగవిచ్ఛేదన చేస్తే - 7 సం|| నుండి 10 సం॥ + 5 లక్షల ఫైన్
    • పిల్లలకు మత్తు పదార్థాలు అలవాటు చేస్తే - 7 సంవత్సరాలు + లక్ష ఫైన్
    • పిల్లలచే మత్తు పదార్థాల రవాణా చేస్తే - 7 సంవత్సరాలు + లక్ష ఫైన్
    • నిబంధనలు అతిక్రమించి దత్తతకు పాల్పడితే - 3 సంవత్సరాలు + లక్ష రూపాయలు
    • బాలల కొనుగోలు మరియు విక్రయం - 5 సంవత్సరాలు + లక్ష రూపాయలు ఫైన్
    • బాలల సంరక్ష సిబ్బంది బాలల అమ్మకంనకు పాల్పడితే 3 నుండి 7 సం|| జైలు శిక్ష
    • బాలలను చదువు పేరుతో క్రమశిక్షణ పేరుతో తీవ్రంగా శిక్షిస్తే - 10 వేల జరిమానా, రెండవసారి నేరం చేస్తే 3 నెలల జైలు మరియు జరిమానా విధిస్తారు.
    • బాలలచే హింసాయుత కార్యక్రమాలు చేపించినట్లయితే (ఉదా: తీవ్రవాద కార్యకలాపాలలో నిమగ్నం చేసినట్లయితే) - 7 సం|| జైలు శిక్ష మరియు 5 లక్షల జరిమానా విధిస్తారు.
    • వికలాంగ బాలలపై నేరాలకు పాల్పడితే శిక్షలు రెట్టింపు అవుతాయి.
    • ఈ చట్టంను జాతీయస్థాయిలో అమలు తీరుపై 'National Commission for Protection of Child Rights' సంస్థ పర్యవేక్షిస్తుంది.


    వెట్టిచాకిరి నిషేధ చట్టం 1976


    అక్టోబర్ 24, 1975న వెట్టిచాకిరిని నిషేధించుకై రాష్ట్రపతి ఆర్డినెన్సును జారీచేయడం జరిగింది. ఈ ఆర్డినెన్స్ 25 అక్టోబర్ 1975 నుండి అమలులోనికి వచ్చింది. అనగా భారతదేశంలో వెట్టిచాకిరిని 1975వ సంవత్సరం నుండి మొదటిసారి చట్టప్రకారం నిషేధించారు.


    పైన తెలిపిన ఆర్డినెన్స్ని చట్టంగా 1976వ సంవత్సరంలో రూపొందించారు. ఈ చట్టం అమలు యొక్క బాధ్యత ఆయా రాష్ట్రాలదే.


    ఈ చట్టంలోని ముఖ్యాంశాలు


    ♦ సెక్షన్ 2 ప్రకారం అగ్రిమెంట్ అనగా వెట్టిచాకిరి కోసం చేసుకున్న అగ్రిమెంట్, తెలంగాణలో పాటిస్తున్న పాలేరు వ్యవస్థ, భగేలా వ్యవస్థ కూడా అగ్రిమెంట్ పరిధిలోకి వస్తుందని ఈ సెక్షన్ నందు పేర్కొనడం జరిగింది మరియు ఈ సెక్షన్ నందు దేశవ్యాప్తంగా ఆయా ఒప్పందాలకు ఉన్నటువంటి పేర్లను కూడా పేర్కొన్నారు.

    ♦ ఈచట్టంలోని సెక్షన్ 4 ప్రకారం వెట్టిచాకిరి వ్యవస్థను నిషేధించడమైనది.

    ♦ ఈ చట్టాన్ని జిల్లాస్థాయిలో అమలు పరిచే బాధ్యతను ఆయా జిల్లా మెజిస్ట్రేట్లకు అప్పజెప్పారు.
    సెక్షన్ 5, 6 ప్రకారం, ఈ చట్టం అమలులోకి వచ్చిన తక్షణ సమయం నుండి వెట్టిచాకిరి వ్యవస్థలో భాగంగా చేసుకున్న ఒప్పందాలు కుదవపెట్టిన ఆస్తులు మరియు తీసుకున్న అప్పుల నుండి వెట్టిచాకిరి కార్మికులకు విముక్తి లభిస్తుంది. మరియు ఆయా ఒప్పందాలన్ని మరియు అప్పులన్ని రద్దయ్యయి.

    ♦ సెక్షన్ 7 ప్రకారం వెట్టిచాకిరిలో భాగంగా తీసుకున్న అప్పులకై కుదువలు (మార్టిగేజ్ పెట్టిన లేదా తాకట్టు పెట్టినవన్నీ తిరిగి ఇవ్వవలసి ఉంటుంది.

    ♦ సెక్షన్ 11 ప్రకారం వెట్టిచాకిరి నుండి విముక్తి పొందినవారి యొక్క సంక్షేమాన్ని చూసుకోవాల్సిన బాధ్యత జిల్లా మెజిస్ట్రేట్మ రియు సెక్షన్ 12 ప్రకారం వారివారి జిల్లా పరిధిలో ఈ చట్టం అమలు తీరును పర్యవేక్షించవలసిన బాధ్యత మరియు వెట్టిచాకిరి సంఘటనలపై విచారణ చేసే బాధ్యత ఆయా జిల్లాల మెజిస్ట్రేట్లదే.

    ♦ ఈ చట్టం అమలులోకి వచ్చిన తక్షణ సమయంనుండి వెట్టిచాకిరిలో భాగంగా చేసుకున్న ఒప్పందాలను పాటించాలని ఒత్తిడి చేయడం లేదా అప్పులు చెల్లించాలని అడగడం లాంటి చర్యలు ఈ చట్టం ప్రకారం నేరంగా పరిగణించబడతాయి.

    ♦ సెక్షన్ 13 ప్రకారం వెట్టిచాకిరిని నిర్మూలించేందుకు జిల్లాస్థాయిలో ఈ క్రింది సభ్యులతో కలిపి జిల్లా విజిలెన్స్ కమిటీలను ఏర్పాటుచేశారు. వారు...

    1. ఛైర్మన్ గా జిల్లా మేజిస్ట్రేట్

    2. జిల్లా మేజిస్ట్రేట్ ఎంపికకాబడిన ఎస్.సి, ఎస్.టి. వర్గాలకు చెందిన ముగ్గురు సభ్యులు

    3. జిల్లాకు చెందిన ఇద్దరు సంఘసేవకులు

    4. గ్రామీణాభివృద్ధి రంగానికి చెందిన ముగ్గురు వ్యక్తులు

    5. గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై అవగాహన కలిగిన ఒక్కరు ఉంటారు.

    ♦ సెక్షన్ 16 ప్రకారం ఎవరైనా వెట్టిచాకిరికి పాల్పడి ఈ చట్టాన్ని అతిక్రమించినచో వారికి 3 సంవత్సరాల జైలుశిక్ష మరియు 2,000 వరకు జరిమానా విధించబడుతుంది.

    ♦ సెక్షన్ 17 ప్రకారం ఎవరైనా వెట్టిచాకిరి కోసం అప్పులనిస్తే వారికి కూడా 3 సంవత్సరాల జైలు శిక్ష మరియు 2 వేల నుండి 20 వేల వరకు జరిమానా విధించబడుతుంది.


    దేవదాసీ మరియు జోగినీ వ్యవస్థలో బాలలు - ప్రభుత్వం తీసుకున్న చట్టపరమైన చర్యలు


    ద్రవిడ సంస్కృతిలో భాగంగా గ్రామదేవతలైన సప్తమాతృకలకి పోతురాజు ద్వారా ఒక గ్రామం నందు దళిత బాలికను ఇచ్చి వివాహం చేయడాన్నే జోగినీ వ్యవస్థ అంటారు. ఈ దురాచారంలో బాలిక 5 సంవత్సరాల వయస్సుకు రాకముందే బలవుతుంది. ఆర్యసంస్కృతిలో భాగంగా దేవాలయాలకు స్త్రీలు అంకితమవడాన్నే దేవదాసీ వ్యవస్థ అంటారు. ఈ వ్యవస్థలో కూడా ఒకప్పుడు బాలికలు మగ్గిపోయేవారు.


    ప్రాథమిక హక్కుల్లోని అధికరణ 23 ప్రకారం జోగినీ & దేవదాసీ వ్యవస్థలు మరియు వీటిని పోలిన ఇతర ఆచారాలన్ని కూడా మనుషుల అక్రమ రవాణాగా పరిగణింపబడతాయి. ఈ అధికరణం ఆధారంగానే అనైతిక కార్యకలాపాల నిరోధక చట్టం 16 రూపొందించడం జరిగింది.


    అధికరణం 21 ప్రకారం గౌరవంగా జీవించడం అనేది జీవించే హక్కులో అంతర్భాగంగా ఉంటుంది. అధికరణం 19 ప్రకారం తమకు ఇష్టమైన వృత్తిని చేపట్టవచ్చు, ఏ స్త్రీని కూడా దేవదాసీగా జీవనం కొనసాగించమని, బలవంత పెట్టే హక్కు ఎవరికి లేదు.


    1947వ సంవత్సరంలో దేవదాసీ నిర్మూలన చట్టం ద్వారా మద్రాసు రాష్ట్రంలో దేవదాసీ వ్యవస్థను నిషేధించారు. ఈ చట్టం రావడానికి ప్రధాన కారకులు ముత్తు లక్ష్మి రెడ్డి గారు.


    1988వ సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ జోగినీ వ్యవస్థ నిషేధ చట్టాన్ని రూపొందించారు. ఈ చట్టం దేవదాసీ మరియు ఇతర ఇలాంటి వ్యవస్థలను సమగ్రంగా నిర్వచించింది మరియు ఇలాంటి చర్యలు చట్ట వ్యతిరేక చర్యలుగా నిర్ధారించింది. ఈ చట్టం ప్రకారం ఎవరైనా దేవదాసీ లేదా దానిని పోలిన ఆచారాలలో నేరుగా గాని, చాటు మాటుగా గాని పాలుపంచుకున్న లేదా ప్రోత్సహించినా 2 నుండి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు 2 నుండి 3 వేల వరకు జరిమానా విధిస్తారు. ఒక వేళ తల్లిదండ్రులు లేదా బందువులే ఈ చర్యకు పాల్పడితే వారికి 2 నుండి 5 సంవత్సరాల జైలుశిక్ష మరియు 3 నుండి 5 వేల వరకు జరిమానా కూడా విధించవచ్చు. ఈ వ్యవస్థలకు ప్రాచుర్యం కలిగేలా ప్రచారం చేస్తే 1 నుండి 3 సం||ల వరకు జైలు శిక్ష మరియు 1 నుండి 5 వేల వరకు జరిమానా కూడా విధించవచ్చు. క్షేత్రస్థాయిలో ఈ చట్టం అమలు బాధ్యత జిల్లా కలెక్టర్లకు మరియు తహశీల్దార్లకు అప్పగించడం జరిగింది.


    పైన తెల్పిన చట్టపరమైన చర్యలతో పాటుగా ప్రభుత్వం దుర్వినియోగానికి గురవుతున్న బాలలను సంరక్షించేందుకై ఈ క్రింది పథకాలను అమలుపరుస్తున్నది.

    1. మిషన్ వాత్సల్య (ICPS - Integrated Child Protection Scheme)

    2. జాతీయ బాలకార్మిక ప్రాజెక్టు

    3. ఉజ్జవాల

    4. భేటి బచావో భేటి పడావో

    5. స్వధార్ గృహ

    6. కోయపాయ

    7. రక్షణ మరియు భద్రత అవసరం ఉన్న బాలలకోసం అమలుపరుస్తున్న సేవలు

    8. బాలాపరాదుల కోసం అమలుపరుస్తున్న సేవలు

    9. బాలల హెల్ప్ లైన్ సేవలు (1098 సర్వీసెస్)


    నోట్ : జాతీయ బాలకార్మిక ప్రాజెక్టు గురించి బాలకార్మికత అనే ఛాప్టర్ నందు, ఇతర పథకాలను ఉమెన్ & ఛైల్డ్ వెల్ఫేర్ అనే ఛాప్టర్ నందు వివరించడం జరిగింది.


    రక్షణ మరియు భద్రత అవసరం ఉన్న బాలలకోసం (Children in Need of Care Protection) అమలుపరుస్తున్న సేవలు

    ♦ సెక్షన్ 1 (14), బాలన్యాయ చట్టం 2015 ప్రకారం, ఈ క్రింది విపత్కర పరిస్థితులలోనున్న బాలలను సంరక్షణ అవసరం ఉన్న బాలలుగా పరిగణిస్తారు.

    ♦ అనాధ పిల్లలు.

    ♦ తల్లిదండ్రులు వదిలేసిన పిల్లలు.

    ♦ మనుషుల అక్రమ రవాణాకి మరియు బాలకార్మికులకు లోనయ్యే అవకాశం గల బాలలు.

    ♦ వీధి బాలలు బిక్షాటనకు గురవుతున్న పిల్లలు.

    ♦ మాధక ద్రవ్యాల అక్రమ రవాణాలో భాగం అవుతున్న పిల్లలు.

    ♦ విధ్వంసక కార్యాకలాపాలలో భాగం కాబడుతున్న పిల్లలు.

    ♦ గృహం నుండి పారిపోయిన బాలలు.

    ♦ విపత్తుల వల్ల అనాధలైన బాలలు.

    ♦ తల్లిదండ్రులు లేదా సంరక్షకుల చేతిలో హింసకు గురవుతున్న బాలలు.

    ♦ బాల్య వివాహంనకు గురయ్యే అవకాశం గల పిల్లలు.

    ♦ బాల న్యాయ చట్టం - 2015 ఈ క్రింది రకాల ఇబ్బందులకు గురవుతున్న బాలలకు సంరక్షణ కల్పిస్తుంది.

    1. బాలాపరాదులు

    2. సంరక్షణ అవసరం ఉన్న పిల్లలు

    3. దత్తతకు సంబంధించిన అంశాలు

    4. బాలల కొనుగోలు మరియు అమ్మకం

    5. బిక్షాటన మరియు బాలల అవయవాలతో వ్యాపారం.

    ♦ తరచుగా నేరాలకు పాల్పడుతున్న 18 సం॥లలోపు బాలలను బాల అపరాధులు అందురు కాని 7 సం॥లకు పైగా శిక్ష పడే అవకాశం ఉన్న నేరాలు చేసినప్పుడు 16 సం॥లలోపు వారినే బాలాపరాదులుగా పరిగణిస్తారు.

    ♦ సంరక్షణ అవసరం ఉన్న పిల్లలకు కూడా హక్కులు ఉంటాయి. ఐక్యరాజ్యసమితి బాలల హక్కుల సాంప్రదాయం - 1989, రాజ్యాంగం మరియు వివిధ చట్టాల ద్వారా బాలలకు సంరక్షనను పొందే హక్కు, చదువుకునే హక్కు, అభివృద్ధి చెందే హక్కు,పీడనంనకు వ్యతిరేక హక్కు, బాలకార్మిక మరియు మనుష్యుల అక్రమ రవాణా నుండి రక్షణ పొందే హక్కును కలిగి ఉన్నారు. కావున కుటుంబ సంరక్షణ లేని పిల్లలు మరియు కుటుంబం నందు సరైన సంరక్షణ లేని పిల్లలందరికి సంబంధించిన రక్షణను ప్రభుత్వం ప్రధానంగా ఈ క్రింది సంస్థలను స్థాపించి అందిస్తుంది.

    1. Child Welfare Committees (CWC's)

    2. Juvinile Justice Boards (JJB's)

    3. District Child Protection Units (DCPU's)

    4. Children's Homes (CCIS)

    5. Open Shelters

    6. After Care Facility

    7. Foster Familiy

    8. Observation Home

    9. Special Home

    10. Place of Safety

    ♦ బాల న్యాయ చట్టం (Care & Protection) 2015 ప్రకారం, రక్షణ అవసరం ఉన్న బాలలు (Children in Need of care & Protection) యొక్క సంరక్షణ, విద్య లాంటి మొదలయిన కార్యక్రమాల అమలు కోసం జిల్లా స్థాయిలో Child Welfare Committee లను ఏర్పాటు చేశారు. వీరి ఆధ్వర్యంలో రక్షణ అవసరం ఉన్న బాలలకు క్రింది సంస్థలలో సంస్థాగత సేవలు అందిస్తారు.

    1.Childrens Home (CCIS) : రక్షణ అవసరం ఉన్న బాలలకు ఈ గృహాల యందు విద్య, వైద్యం, ఆహారం లాంటి అన్ని సౌకర్యాలు కల్పిస్తూ రక్షణను కల్పిస్తూ వారికి 18 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు సేవలందిస్తారు.

    2. After Care Services: 18 సంవత్సరాలు నిండిన తరువాత Children కి Home నందు సేవలు అందించరు, కాని ఇంకా వారికి రక్షణ అవసరం ఉన్నట్లయితే 18 నుండి 21 సంవత్సరాల వరకు ప్రత్యేక కేంద్రాల యందు సేవలందిస్తారు. దానినే After Care services అందురు.

    3. Open Shelters: ఇది Community Based అనే విధానంలో తాత్కాలికంగా రక్షణ అవసరం ఉన్న బాలల సేవలు అందిస్తారు.

    4. Foster Families: తాత్కాలికంగా కొద్దికాలం పాటు అనాధలకు సేవలు అందించేందుకు ముందుకు వచ్చిన కుటుంబాలను Foster Families అందురు. అనాధలు కొద్ది కాలంపాటు ఆయా కుటుంబాలలో సభ్యులుగా ఉంటారు.

    ♦ బాల న్యాయ చట్టం (2015) ప్రకారం, చట్టంలో సంఘర్షణ పడుతున్న (Children in Conflict With law) బాలల (బాలాపరాదులు) లేదా Juvenile Deliquents అంటారు. వీరి యొక్క ప్రవర్తన మార్చి వారి యందు సంస్కరణ తీసుకువచ్చేందుకు ఈ క్రింది సంస్థల ద్వారా సేవలందిస్తారు. వీటినే బాలల సంస్కరణాలయాలు (Reformatory Institutes) అని అందురు లేదా Homes for Children in Confilet with Law అని కూడా అందురు. అవి...

    ♦ Observation Home (పరిశీలన గృహాలు): బాలఅపరాదుల యొక్క అంశాలపై విచారించేందుకు, బాల న్యాయ చట్టం 2015 ప్రకారం జిల్లా స్థాయిలో Juvenile Justice Board (JJB) ఏర్పాటు చేస్తారు వీరి ఆధ్వర్యంలోనే Observation Homes, Special Homes మరియు Place of Saftey లు నిర్వహించబడతాయి. అయితే పరిశీలనా గృహాల యందు విచారణ ప్రక్రియ కొనసాగుతున్న బాల అపరాధుల కోసం పరిశీలనా గృహాలు నిర్వహిస్తారు.

    ♦ Special Homes (ప్రత్యేక గృహాలు): బాల అపరాదులుగా JJB చేత నిర్ధారింపబడిన పిల్లలు, ప్రత్యేక గృహాలకు పంపివేయబడతారు, ఇక్కడ వీరికి మానసిక పునరావాసం కల్పించి వారిలో గల నేర స్వభావంను పరివర్తన చెందించి వారిని సంస్కరిస్తారు. (నిర్భయ చట్టం తీసుకువచ్చిన తరువాత తీవ్రమైన నేరాలు అనగా 7 సంవత్సరాలకు పైగా శిక్షపడే అవకాశం ఉన్న నేరం చేసినప్పుడు 16 సంవత్సరాలు దాటితే, పెద్దవారిని శిక్షించినట్టుగానే శిక్షిస్తారు. ఒక వేళ మాములు మరియు ఇతర సాధారణ నేరాలు చేసినప్పుడు మాత్రం 18 సంవత్సరాల లోపు వారిని బాలఅపరాదులుగా గుర్తించి Special Homes కి పంపిస్తారు.


    Place of Saftey: ఇది పరిశీలనా గృహం లేక ప్రత్యేక గృహంనకు అనుబంధంగా ఉంటుంది.

    ♦ పై సంస్థలు ప్రభుత్వం నేరుగా లేదా NGO's స్వచ్ఛంద సంస్థలు లేదా సముదాయ ఆధారిత సంస్థలు (Community Based Organizations) లాంటి వాని భాగస్వామ్యంతో నడుపుతుంది. ఇందుకోసమై District Child Protection Unit వారి సహకారం తీసుకుంటుంది.


    బాలాపరాదుల కోసం అమలుపరుస్తున్న పునారావస సేవలు (Rehabilitation Services for Juveniles Delinquents)


    • తరచుగా నేరాలకు పాల్పడుతున్న 18 సం||లోపు బాలల్ని బాలాపరాదులు అని పిలుస్తారు.
    • బడిమానివేయడం, చిన్న చిన్న దొంగతనాలు చేయడం, సమవయస్కు పిల్లలపై దాడులు చేయడం, ఇంటి నుండి పారిపోవడం, గ్యాంబ్లింగ్ లాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం, హింసాత్మక ప్రవృత్తిని కల్గి ఉండటం, చిన్న వయస్సులోనే లైంగిక చర్యలకు అలవాటవడం, చిన్న వయస్సులోనే మధ్యపానం, డ్రగ్స్ వినియోగించడం లాంటి అలవాట్లు ఉన్నటువంటి 18 సం॥లోపు వారిని బాలపరాదులు అంటారు. కానీ 7 సం||ల కంటే ఎక్కువ శిక్షపడే అవకాశం ఉన్న తీవ్రమైన నేరాలకు పాల్పడినప్పుడు బాలపరాదుల వయస్సు గరిష్టంగా 16 సం॥ల వరకే పరిగణిస్తారు.
    • జువైనల్ అంటే బాలుడు మరియు డెలిక్వింట్ అంటే అపరాధి. అందువలన వీరిని నేరస్తులుగా కాకుండా అపరాధులుగా భావించి వీరి యొక్క సంస్కరణ కోసమై స్థాపించినటువంటి పరిశీలన గృహాల యందు వీరికి ప్రవర్తనా మార్పు మరియు సంస్కరణ సేవలు అందిస్తారు.
    • బాల న్యాయ చట్టం 2015 ప్రకారం ప్రతి జిల్లా కేంద్రం నందు బాలపరాదులకు సంస్కరణ సేవలను నిర్దేశించేందుకై జువైనల్ జస్టిస్ బోర్డును చట్టబద్ధ సంస్థగా జిల్లా కేంద్రాలలో ఏర్పాటు చేశారు. వీరి ఆధ్వర్యంలోనే బాలాపరాదులకు సంస్కరణ సేవలు అందించబడతాయి.


    వెట్టిచాకిరి బాధితులు పునరావాస పథకం


    ♦ 1975లో ఏర్పాటు చేసిన 20 సూత్రాల పథకంలోనే వెట్టిచాకిరి నిర్మూలనను కూడా చేర్చారు. అందువల్లనే అక్టోబర్ 25, 1975న రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా భారతదేశంలో వెట్టిచాకిరి నిషేధించారు మరియు ఈ ఆర్డినెన్సును చట్టంగా రూపొందించి 1976వ సంవత్సరంలో వెట్టిచాకిరి నిర్మూలన చట్టాన్ని తీసుకొని వచ్చారు. ఈ చట్టం అమలులోకి రావడంతోటే వెట్టిచాకిరి ఒప్పందాలు మరియు అందుకు సంబంధించిన రుణాలు అన్ని రద్దయినవి మరియు వెట్టిచాకిరిని పాటించడం నేరంగా కూడా పరిగణించడం ప్రారంభమయింది.


    ♦ వెట్టిచాకిరి నిషేధచట్టం అమలులోకి రావడంతో దేశవ్యాప్తంగా ఈ వ్యవస్థలో మగ్గిపోయిన వారికి స్వేచ్ఛ లభించింది, దీనితో పాటుగా వీరికి పునరావాసం అందించాలనే ఉద్దేశ్యంతో వెట్టిచాకిరి బాధితుల పునరావాస పథకాన్ని 1978వ సంవత్సరంలో ప్రారంభించారు.


    ♦ 1978లో ఈ పథకం ప్రారంభించినప్పుడు ఒక్కొక్క వెట్టిచాకిరి బాధితుడికి 4,000 రూపాయలు సహాయంతో పునరావాసం అందించేవారు. ఈ యొక్క సహాయం 1986వ సంవత్సరంలో 6,250 రూపాయలకు పెంచారు. మరలా 1990వ సంవత్సరంలో ఈ సహాయాన్ని 10,000 లకు పెంచారు. మరలా 1999వ సంవత్సరంలో ఈ సహాయాన్ని 20,000 రూపాయలకు పెంచారు.


    ♦ 17 మే, 2016న ఈ పథకాన్ని సమీక్షించి నూతన పునరావాస సహాయాన్ని అందిస్తున్నారు. సవరించిన పథకం ప్రకారం

    ఎ. 21 సంవత్సరాలు నిండిన పురుషుడు వెట్టిచాకిరికి లోనయితే ఒక లక్ష రూపాయలు అతడికి పునరావాసం కోసం అందిస్తున్నారు.

    బి. అనాధ పిల్లలు, బలవంతంగా భిక్షాటనకు గురైనవారు మరియు బాలకార్మికులు మరియు మహిళలు వెట్టిచాకిరికి లోనయిన సందర్భంలో వీరిలో ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలు అందించి పునరావాసం కల్పిస్తున్నారు అయితే ఇందులో 1,25,000 రూపాయలు లబ్ధిదారుల పేరుమీద బ్యాంకులో జమ చేస్తారు.

    సి. అతిహీనమైన వెట్టిచాకిరికి లోనయిన సందర్భంలో అనగా 3వ లింగం వారు, మహిళలు మరియు బాలలు లైంగిక పరమైన వెట్టిచాకిరి నుండి, వ్యభిచార గృహాల నుండి, మసాజ్పార్లర్ల నుండి, మనుషుల అక్రమ రవాణా నుండి రక్షించబడ్డ సందర్భంలో ఆయా వర్గాల వారికి మరియు వికలాంగులకు కూడా వెట్టిచాకిరి పునరావాసం నిమిత్తం ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయలు అందిస్తున్నారు. ఇందులో 2 లక్షల రూపాయలు బాధితుడి పేరుమీద బ్యాంకులో డిపాజిట్ చేస్తారు.


    నోట్: పై వర్గం కాకపోయినా సరే ఎవరైనా తీవ్ర వెట్టిచాకిరికి లోనయినప్పుడు జిల్లా మెజిస్ట్రేట్ దానిని తీవ్రమైన వెట్టిచాకిరిగా భావించినప్పుడు ఎవరికైననూ 3 లక్షల రూపాయలు పునరావాసం కోసం అందించవచ్చు.


    ♦ పై ఆర్థిక సహాయంతో పాటు వీరికి పాడిపరిశ్రమ, వ్యవసాయం, కనీస వేతనాల కల్పన మరియు ఇతర స్వయం ఉపాధి కల్పన పథకాలలో ప్రాధాన్యతనిస్తారు మరియు వీరి పిల్లలకు విద్యావకాశాలు కల్పిస్తారు.

    ♦ పై పునరావాస కార్యక్రమానికి 100% నిధులను కేంద్రమే అందిస్తున్నది.



Tags: Caste system, gender roles, joint families, arranged marriages, diversity, cultural festivals, social hierarchy, economic disparities, religious practices, education system, urbanization, rural traditions, globalization, modernization


No comments:

Post a Comment

Post Bottom Ad