1.2 సమాజం లక్షణాలు మరియు ప్రకార్యాలు - GNANA SAMHITHA

GNANA SAMHITHA

DONT WORRY!!! WE HELP YOU TO REACH YOUR GOAL 😊

Breaking

Post Top Ad

Tuesday, July 4, 2023

1.2 సమాజం లక్షణాలు మరియు ప్రకార్యాలు

1.2 సమాజం లక్షణాలు మరియు ప్రకార్యాలు


సమాజం నిర్వచనాలు మరియు స్వభావం


Society అనబడే ఆంగ్లపదం 'Socious' అనే లాటిన్ పదం నుండి ఉద్భవించింది, Socious అనగా సామాజిక సహచరత్వం (Companionship) లేదా Friendship అని అర్థం. మనష్యులు మరియు వారి మధ్య ఉన్న సంబంధ బాంధవ్యాలు అమరి ఉన్న తీరునే ఉమ్మడిగా సమాజం అని పిలువచ్చును. సమాజం అనే భావన యందు మనష్యులు, వారు ఆచరించే వస్తు సంస్కృతి లాంటివి కనిపించేవిగా ఉంటాయి కాని మనుషుల మధ్య సంబంధాలు, పరస్పర ఆధారంను కలిగి ఉండడం, విలువలు, ప్రమాణాలు మొదలగునవన్ని కంటికి కనిపించనిగా ఉంటాయి కాని ఆచరణలో ఉంటాయి. కావున సమాజం అనగా మనష్యులు, వారు ఏర్పరచుకున్న సంఘజీవనం, సామాజిక సంస్థలు, వ్యవస్థలు, సంస్కృతి, ఆచరణాలు అన్నింటిని కలిపి ఉమ్మడిగా సమాజం అని పిలువచ్చును.


సామాజిక శాస్త్రవేత్తలు సమాజంను వివిధ కోణాలలో నిర్వచించారు. అవి....

  • 'సామాజిక సంబంధాల అల్లిక లేదా గూడునే సమాజం' అందురు - మకైవర్
  • ‘మనుష్యుల మధ్య సంక్లిష్ట నిర్మాణంలో వివిధ రకాల ప్రక్రియలతో అన్యోన్య చర్యలతో ఏకీకృతంగా ఏర్పడేదే సమాజం - సి.హెచ్. కూలే
  • 'సమాజం అనే భావనలోనే ఒక సమిష్టి దృక్పథం నిబిడీకృతం అయి వుంటుంది. సమాజం అనునది వ్యవస్థా పూరకమైనది. అందులోని వ్యక్తులందరూ శిరసావహించవలసిన సంబంధాలు కలిగి ఉన్నదే సమాజం - గిడ్డింగ్స్
  • సమాజం అంటే కేవలం వ్యక్తులతో కూడిన సమూహం మాత్రమే కాదు, వారి మధ్య నిరంతరం నెలకొని ఉండే పరస్పర చర్యల సంక్లిష్ట రూపం - లేపియర్


సమాజం యొక్క స్వభావం మరియు లక్షణాలు (Nature and Characteristics of the Society)


మానవ సమాజం స్తబ్ధుగా ఉండదు, ఇది నిరంతరం మార్పులు మరియు పరివర్తనకు గురవుతూ నిరంతరం కొనసాగే వ్యవస్థ. సమాజం అనునది విశ్వవ్యాప్తంగా మరియు నిరంతరంగా ఉంటుంది కాని సమాజం నందు గల సభ్యులు మరణిస్తారు. సమాజం నందలి ఆచారాలు, వ్యవహారాలు, కట్టుబాట్లు, సంప్రదాయాలు, విలువలు ఒక తరం నుండి మరొకతరంనకు సామాజీకరణ ద్వారా సంస్కృతి ద్వారా అందించబడుతూ నిరంతరం కొనసాగుతాయి. మానవ సమాజం నందు అనేక విభాగాలుంటాయి మరియు అనేక సామాజిక వ్యవస్థాపనాలుంటాయి.


సమాజం నందు వ్యక్తుల మధ్య పరస్పర సంబంధాలు, పరస్పర ఆధారంతో కూడిన ఉమ్మడి ప్రవర్తనారీతులు ఉంటాయి. ఇలాంటి ఉమ్మడి జీవన విధానాలు సామాజిక సంస్థల ద్వారా నిర్ధేషించబడతాయి. మనిషి పుట్టినప్పటి నుండి చనిపోయేంతవరకు వ్యక్తి యొక్క అవసరాలు సమాజమే తీరుస్తుంది.


వ్యక్తులు పరస్పరం తమ పాత్రలను నిర్వహిస్తూ ఒకరిపై ఒకరు ఆధారపడి ప్రవర్తించడమే సమాజం. ఈ యొక్క పరస్పర ఆధారతనే సామాజిక సంబంధం లేదా పరస్పర జాగురుకత (Mutual Awareness) అని పిలుస్తారు. దీనినే గిడ్డింగ్స్ అనునతడు చేతనత్వం అని, కూలే అనునతడు 'మేము-మనం' మరియు We-feeling అని తెలిపారు, థామస్ అనునతడు దీనినే Common Personality అని పేర్కొన్నాడు.


మకైవర్ అనునతడు తన యొక్క 'Society' అనే గ్రంథం నందు సమాజంనకు ఉండే ప్రధాన లక్షణాలను క్రింది విధంగా తెలిపారు. అవి...

1. వ్యక్తులు మరియు సమూహాలతో కూడి ఉంటుంది.

2. నిర్దిష్టమైన ప్రత్యేక భూభాగాలుంటాయి

3. వ్యక్తుల మధ్య సమాజం నందు పరస్పర చర్యలుంటాయి

4. ఏకత్వ భావన ఉంటుంది

5. వ్యవస్థీకృతమై ఉంటుంది.

6. ప్రకార్యాలుంటాయి

7. ప్రతీ సమాజంనకు ఒక ప్రత్యేక సంస్కృతి ఉంటుంది.

8. సమాజం నందు సహకారం, స్పర్థ, ఘర్షణ, సర్దుబాటు, విలీనీకరణ లాంటి సామాజిక ప్రక్రియలుంటాయి.


మకైవర్ తెలిపినటువంటి లక్షణాలతో పాటుగా ప్రతీ సమాజం కూడా ఈ క్రింది లక్షణాలను కలిగి ఉంటుంది.

1. జనాభా లేదా మనుష్యులను కలిగి ఉంటుంది.

2. ఒక భౌగోళిక ప్రాంతం, అన్యోనాశ్రయత, పరస్పర చర్యలు, సంఘర్షణలు మరియు ప్రజల మధ్య వ్యవస్థీకృతమైన సంబంధాలుంటాయి

3. సామాజిక సంస్థలు, సముదాయాలు, సమూహాలు, సంస్కృతి, సంప్రదాయాలు సామాజిక వ్యవస్థలు అనునవి ప్రతీ సమాజం నందు కనిపిస్తాయి.

4. సమాజం నిరంతరమైనది, విశ్వవ్యాప్తమైనది మరియు గతిశీలమైనది

5. సమాజం శాశ్వతమైనది ప్రజలు అశాశ్వతమైనవారు

6. ప్రతి సమాజం నందు ఏకత్వం మరియు వైవిధ్యం కూడా ఉంటుంది.

7. సమాజం నందు సామాజిక విభేదీకరణ, స్తరీకరణ, సామాజిక గతిశీలత, శ్రమవిభజన లాంటి అంశాలుంటాయి.

ప్రతీ సమాజం కూడా స్వతంత్రమైనదని మరియమ్ జాన్సన్ అనునతడు పేర్కొన్నాడు.


సమాజం యొక్క ప్రకార్యాలు (Functions of Society)


సామాజిక లేదా సంఘజీవనం లేకుండా మానవ మనుగడ సాధ్యం కాదు పుట్టినప్పటి నుండి చనిపోయేంత వరకు మానవుడు తన యొక్క వివిధ అవసరాలను సమూహ జీవనం ద్వారా నెరవేర్చుకుంటాడు. అలా వివిధ వ్యక్తుల మధ్య ఉన్న సంబంధ బాందవ్యాలనే సమాజం అని అంటున్నాం. కావున సమాజం మనిషిని జైవిక జంతువు (Biological Animal) నుండి సామాజిక జంతువు (Social Animal) గా పరివర్తన చెందిస్తుంది. కావున సమాజం తన సభ్యులైన మనుష్యుల పట్ల ఈ క్రింది వివిధ రకాల ప్రకార్యాలను నిర్వహిస్తుంది.

1. భౌతిక అవసరాలు తీరుస్తుంది.

2. సామాజీకరణ కలిగిస్తుంది.

3. అభ్యసన అనుభవాలు కల్పిస్తుంది.

4. సంస్కృతి, నాగరికత, భాషలను అందిస్తుంది

5. వృత్తిని, ఆర్థిక భద్రతను, భౌతిక భద్రత మరియు రక్షణను అందిస్తుంది.

6. సామాజిక సంస్థల ద్వారా ఉమ్మడి జీవనం క్రమబద్ధం చేస్తుంది మరియు సామాజిక నియంత్రణను అందిస్తుంది.

7. వ్యక్తుల యొక్క అన్ని రకాల అవసరాలు సమాజం నందే నెరవేరుతాయి

8. జనాభా పూరణమును చేస్తుంది.


సమాజాల యొక్క వర్గీకరణ (Classifications (or) Types of Societies)


ఆయా సమాజాల యొక్క లక్షణాల ఆధారంగా మానవ సమాజంను సమాజ శాస్త్రవేత్తలు వివిధ రకాలుగా వర్గీకరించారు. జర్మనీకి చెందిన ఫెర్డినాండ్ టోనిస్ అనే శాస్త్రవేత్త సమాజాలను సమాజం నందు గల మనష్యుల మధ్య గల సంబంధాల ఆధారంగా రెండు రకాలుగా వర్గీకరించారు. అవి...

1. జెమిన్ షాఫ్ట్ 

2. జెషల్ షాఫ్ట్

సమాజం నందు వ్యక్తుల మధ్య సంబంధ బాంధవ్యాలు అధికంగా ఉన్నట్లయితే ఆ సమాజంను 'జెమిన్ షాఫ్ట్' అనగా సముదాయం లేదా Community అని తెలిపారు. అలాగే ఏ సమాజంనందైతే మనుష్యుల మధ్య సంబంధాలు దృఢంగా లేనట్టయితే అలాంటి సమాజంను 'జెషల్ షాఫ్ట్' అనగా సమాజం లేదా Association అని పేర్కొన్నారు.


హెర్బర్ట్ స్పెన్సర్ ప్రకారం సమాజాలు ప్రధానంగా 3 రకాలు అవి....

1. మిలట్రీ సమాజాలు 2. పారిశ్రామిక సమాజాలు 3. ఆధునిక సమాజాలు


రాబర్ట్ రెడ్ఫీల్డ్ గారి ప్రకారం సమాజాలు ప్రధానంగా రెండు రకాలు అవి...

1. జానపద సమాజాలు (Folk Societies)

2. పట్టణ సమాజాలు (Urban Societies)


అంథోని గిడ్డింగ్స్ అనునతడు సమాజంను క్రింది విధాలుగా వర్గీకరించారు. అవి...

1. వేట సమాజాలు లేదా ఆహార సేకరణ సమాజాలు(Hunting/Food gathering Societies)

2. పశుపోషక సమాజం (Pastoral Societies)

3. హార్టికల్చర్ సమాజం (Horticultural Societies)

4. వ్యవసాయ సమాజాలు (Agraian Societies)

5. సంప్రదాయ లేదా పౌర సమాజాలు (Traditional Civil Societies)

6. ఆధునిక సమాజాలు (Modern Societies)

7. ఆధునిక అనంతర లేదా ఉత్తర ఆధునిక సమాజాలు (Post Moderns Societies)

పై సమాజాలన్ని ఒక దాని తరువాత మరొకటి కాలక్రమంలో ఏర్పడినవని గిడ్డింగ్స్ తెలిపారు.


మోర్గాన్ అనే శాస్త్రవేత్త ప్రకారం, హింసాత్మకమైన సమాజం (సావెజరి సమాజం) నుండి అనాగరిక సమాజం (Barbarian Society) అటుపైన నాగరిక సమాజాలు (Civil Society) పరిణామ క్రమంలో ఏర్పడినవని తెలిపారు.


కారల్ మార్క్స్ యొక్క అభిప్రాయం ప్రకారం మొదట సమాజంను ఆదిమ కమ్యూనిజం లక్షణం (Primitive Communisam) ఉండేదని అనగా ఎవరికి సొంత ఆస్థి లేదని, అందిరికి ఉమ్మడిగా వేటాడి ఆహారం సంపాదించి ఉమ్మడిగా పంచుకునేవారని తెలిపాడు. తరువాత కాలంలో జనాభా పెరగడం, సాంకేతిక, ఆధునికత రావడం, స్వార్థం పెరగడం లాంటి కారణాల వల్ల ఆదిమ కమ్యూనిజంతో కూడిన సమాజాల స్థానంలో Ancient Society Feudal Society Captalistic Society Socialism ఇలా క్రమంగా ఆవిర్భవించినవని తెలిపారు.


పునశ్చరణ


  • సామాజిక సంబంధాల అల్లిక లేదా గూడునే సమాజమని పిలిచినవారు - మకైవర్
  • సొసైటీ అనే గ్రంథం నందు సమాజంయొక్క లక్షణాలు తెల్పినవారు - మకైవర్
  • జెమీన్ షాఫ్ట్ మరియు జెషెల్ షాఫ్ట్ అనే భావనను తెలిపినవారు -  ఫెర్డినాండ్ టోనిస్
  • సామాజిక సంబంధాన్నే చేతనత్వం అని గిడ్డింగ్స్ తెలిపారు.
  • సామాజిక సంబంధాన్నే మేము - మనం అని కూలే తెలిపారు.
  • సామాజిక సంబంధాన్నే కామన్ పర్సనాలిటీ అని థామస్ తెలిపారు.
  • జానపద సమాజాలు అనే భావనను మొదటగా తెలిపినవారు - రాబర్ట్ రెడ్ఫీల్డ్.



Tags: Caste system, gender roles, joint families, arranged marriages, diversity, cultural festivals, social hierarchy, economic disparities, religious practices, education system, urbanization, rural traditions, globalization, modernization


1 comment:

Post Bottom Ad