2.6 బాల కార్మికత - GNANA SAMHITHA

GNANA SAMHITHA

DONT WORRY!!! WE HELP YOU TO REACH YOUR GOAL 😊

Breaking

Post Top Ad

Sunday, July 16, 2023

2.6 బాల కార్మికత

2.6 బాల కార్మికత


    ఇంట్లో తల్లిదండ్రులకు సహాయపడితే కూడా బాలకార్మికులు అవుతారా? తల్లిదండ్రులతో పాటు సొంత పొలంలో పనిచేస్తే బాలకార్మికులు అవుతారా? అసలు బాలకార్మిక వ్యవస్థ అంటే ఏమిటి? దీని వల్ల బాలలపై మరియు సమాజంపై పడుతున్న ప్రభావమేంటి? అసలు బాలకార్మికతీవ్రత ఎంత ఉంది? ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి...... ఈ ప్రశ్నలన్నింటికి మీరు సమాధానాలను ఈ పాఠ్యాంశం నందు పొందవచ్చు.


    ఎవరు బాలలు మరియు ఎవరు బాలకార్మికులు


    • యూనిసెఫ్ వారి ప్రకారం 5 నుండి 11 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలు ఒక వారంలో 21 గంటలు ఇంటికి సంబంధించిన పనిలో పాల్గొన్న లేదా ఒక వారంలో కనీసం ఒక గంట ఆర్థిక కార్యకలాపంలో పాలుపంచుకున్న బాలకార్మికుడిగా పరిగణింపబడతాడు.
    • యూనిసెఫ్ వారి ప్రకారం 12 నుండి 14 సంవత్సరాల మధ్య గల బాలలు వారానికి 21 గంటలు ఇంటికి సంబంధించిన కార్యక్రమాలలో పాల్గొన్న లేదా వారానికి 24 గంటల పాటు ఆర్థిక కార్యకలాపాలలో పాలుపంచుకున్న బాల కార్మికుడిగానే పరిగణింపబడతాడు.
    • ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ బాలల హక్కుల సంప్రదాయం (యునైటెడ్ నేషన్స్ చైల్డ్ రైట్స్ కన్వెషన్) ప్రకారం 18 సంవత్సరాల లోపు వారు ఆర్థిక కార్యకలాపాలలో పాల్గొన్నట్టయితే బాలకార్మికులుగా పరిగణింపబడతారు.
    • బాలకార్మిక నిషేధ చట్టం 1986 ప్రకారం 14 సంవత్సరాల లోపు వారు బాలలు, వీరు డబ్బు రూపంలో లేదా వస్తురూపంలో వేతనం తీసుకొని పనిచేస్తే బాలకార్మికులుగా పరిగణింపబడతారు.
    • జాతీయ బాలల విధానం-2013 ప్రకారం 18 సం||లోపు వారు బాలలు.
    • వివాహ చట్టాల ప్రకారం బాలలైతే 21 సంవత్సరాల లోపు వారు మరియు బాలికలైతే 18 సంవత్సరాల లోపు వారు మైనర్లుగా గుర్తించబడతారు. (నోట్: డిసెంబర్ 2021న బాల బాలికల ఇద్దరికి వివాహ వయస్సు 21 సంవత్సరాలు ఉండాలని కేంద్ర కేబినేట్ తీర్మానం చేసింది).
    • ఓటు హక్కు ప్రకారం 18 సంవత్సరాల లోపు వారు బాలలు.
    • సవరించిన బాలకార్మిక నిషేధ చట్టం 1986 ప్రకారం 18 సంవత్సరాల లోపు బాలలను 2 రకాలుగా వర్గీకరించారు. (1) 15 సంవత్సరాల లోపు వారు. (2) 15 నుండి 18 సంవత్సరాల మధ్య వయస్సు గల వారు. ఈ చట్టం 15 సంవత్సరాల లోపు బాల, బాలికలు గృహం బయట ఆర్థిక కార్యకలాపాలలో పాల్గొన్న లేదా గృహంలో వారి విద్యకు ఆటంకం కలిగే విధంగా పనిచేసిన బాలకార్మికులుగానే పరిగణింపబడతారు. మరియు 15 నుండి 18 సంవత్సరాలలోపు వారు ఫ్యాక్టరీ చట్టం 1948 నంద పేర్కొన్న హానికరమైన పరిశ్రమలలో పనిచేసిన లేదా ప్రేళులు, గనులు మరియు వేడిమి అధికంగా ఉద్భవించే ప్రాంతాలలో పనిచేసినచో కౌమార పనివారలుగా (ఎడాలిసెంట్ వర్కర్స్) గా పరిగణింపబడతారు.
    • బాలన్యాయ చట్టం (జువైనల్ జస్టిస్ యాక్ట్) ప్రకారం, సాధారణ నేరాలు అనగా 7 సంవత్సరాల కంటే తక్కువ శిక్ష పడే నేరాలకు పాల్పడినప్పుడు 18 సంవత్సరాలలోపు వారిని బాలలుగా పరిగణిస్తూ బాలాపరాధులని (జువైనెల్ డెలిక్వెంట్స్) పిలుస్తారు. వీరిని శిక్షించరు కాని ఈ చట్టం ప్రకారం జిల్లా స్థాయిలో ఏర్పడినటువంటి చట్టబద్ధ సంస్థ అయిన జువైనల్జ స్టిస్ బోర్డు మార్గదర్శకత్వంలో స్పెషల్ హెూమ్స్ నందు వీరికి ప్రవర్తనా మార్పు మరియు సంస్కరణ సేవలు అందిస్తారు.
    • ఈ చట్టం ప్రకారం 7 సంవత్సరాల కంటే ఎక్కువ శిక్షపడే అవకాశం ఉన్న నేరాలకు పాల్పడినప్పుడు 16 సంవత్సరాల లోపు వారిని మాత్రమే బాలలుగా పరిగణిస్తారు.
    • మాతృత్వ సంక్షేమ చట్టం 1961 మరియు సవరించిన మాతృత్వ సంక్షేమ చట్టం 2016 ప్రకారం బాలలంటే గర్భం దాల్చిన నాటి నుండే పరిగణలోకి తీసుకుంటారు.
    • జనాభా లెక్కల ప్రకారం 14 సంవత్సరాల లోపు వారు ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొన్నట్లయితే వారిని బాలకార్మికులుగా పరిగణిస్తారు.
    • రాజ్యాంగ నిబంధన 24 ప్రకారం 14 సంవత్సరాల లోపు బాల, బాలికలు హానికరమైన పరిశ్రమలలో పనిచేసినట్లయితే వారిని బాలకార్మికులుగా పరిగణిస్తారు.
    • కర్మాగారాల చట్టం 1948 ప్రకారం 14 సంవత్సరాల లోపు వారికి పని నిషేధించడం జరిగింది మరియు 15 నుండి 18 సంవత్సరాల మధ్యగల బాలలకు ప్రభుత్వ వైధ్యుడు ధృవీకరించిన ఫిట్నెస్ సర్టిఫికేట్ ఆధారంగా పనికల్పింవచ్చు అది కూడా కేవలం ఒకరోజునకు నాలుగున్నర గంటలు మాత్రమే.
    • గనుల చట్టం 1952 ప్రకారం గనులలో 18 సంవత్సరాలలోపు వారికి పనిచేయడం నిషేధించడం జరిగింది.
    • తోటల చట్టం (ప్లాంటేషన్) 1951 ప్రకారం 12 సంవత్సరాలలోపు వారికి పని నిషేధం.
    • మోటారు రవాణా కార్మిక చట్టం 1961 ప్రకారం మోటారు రవాణా పరిశ్రమ యందు 15 సంవత్సరాల లోపు వారికి పనినిషేధం.
    • బిడి మరియు సిగరేట్ కార్మికుల చట్టం 1966 ప్రకారం 14 సంవత్సరాల లోపు వారికి పని నిషేధించడం జరిగింది.
    • అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్) వారి ప్రకారం 18 సంవత్సరాలలోపు వారందరూ బాలలే కాని పనిచేయడానికి కావలసిన కనీస వయస్సు మాత్రం 15 సంవత్సరాలు అయితే 14 సంవత్సరాల వయస్సు తర్వాత శిక్షకుడి (అప్రెంటిస్)గా శిక్షణ పొందవచ్చు.
    • అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్) వారి 138వ సాంప్రదాయం ప్రకారం 18 సంవత్సరాలలోపు వారు హానికరమైన పనిచేయడం నిషేధించడం జరిగింది.


    బాలకార్మిక వ్యవస్థ తీవ్రత


    • 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశం మొత్తం మీద 14 సంవత్సరాల వయస్సులోపు గల బాలకార్మికుల సంఖ్య 43,53,247.
    • 2011 జనాభా లెక్కల ప్రకారం బాలకార్మికులు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నందు అధిక సంఖ్యలో ఉన్నారు. 2వ స్థానంలో మహారాష్ట్ర కలదు.
    • 2011 జనాభా లెక్కల ప్రకారం అతితక్కువ బాలకార్మికులు ఉన్నటువంటి రాష్ట్రం సిక్కిం.
    • 2011 జనాభా లెక్కల ప్రకారం అన్ని కేంద్రపాలిత ప్రాంతాలలో కెల్లా ఢిల్లీ నందు బాలకార్మికులు అధిక సంఖ్యలో ఉన్నారు మరియు అత్యల్పంగా బాలకార్మికులున్నటువంటి కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీప్.
    • జాతీయ నేర నమోదు సంస్థ వారి ప్రకారం 2020వ సంవత్సరానికి దేశవ్యాప్తంగా 476 బాలకార్మిక కేసులు బాలకార్మిక నిషేధ చట్టం ప్రకారం నమోదైనవి, ఇవి అధికంగా తెలంగాణ రాష్ట్రం (147 కేసులు) మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఛండీఘర్ నందు నమోదైనవి.
    • ప్రపంచ వ్యాప్తంగా పరిశీలించినప్పుడు అధిక సంఖ్యలో బాలకార్మికులు భారతదేశం నందే కలరు, ప్రపంచంలో ఉన్న మొత్తం బాలకార్మికుల సంఖ్యలో 4వ వంతు భారతదేశంలో ఉన్నారు.
    • ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఫ్రీ ట్రేడ్ యూనియన్ వారి యొక్క అంచనాల ప్రకారం భారతదేశంలో 6 కోట్ల మంది బాలకార్మికులు ఉన్నారు.
    • అంతర్జాతీయ కార్మిక సంస్థ వారి అంచనాల ప్రకారం భారతదేశంలో బాలకార్మికులు అధిక సంఖ్యలో వ్యవసాయరంగం నందు ఉన్నారు.


    బాలకార్మికతను ప్రేరేపిస్తున్న కారకాలు


    బాలకార్మిక వ్యవస్థ పురాతన కాలం నుండి కొనసాగుతూ వస్తున్నది. ఇందులకు సామాజిక, ఆర్థిక, మరియు రాజకీయ కారణాలు దోహదమవుతున్నవి.


    సామాజిక ఆర్థిక కారణాలు: నిరక్షరాస్యత, కడుపేదరికం, వెనుకబాటుతనం, విద్యాసౌకర్యాలు లేకపోవడం, తల్లిదండ్రులకు సరైన జీవనోపాధులు లేకపోవడం, నిరంతర కరువులు, వ్యవసాయ రంగం మరియు చేతి వృత్తుల వైఫల్యం లాంటివి బాలకార్మికతకు కారణమవుతున్నాయి.


    రాజకీయ కారణాలు: బాలకార్మిక చట్టాల అమలులో నిరాసక్తత మరియు నిర్లప్తత, కాలం చెల్లిన చట్టాలు, ప్రభుత్వాలు బాలలు, బాలకార్మికులుగా మారకుండ వారికి విద్యా సౌకర్యాలు కల్పించడంలో మరియు బాలల తల్లిదండ్రుల యొక్క జీవనోపాధులను అభివృద్ధి చెందించడంలో మరియు పేదరికాన్ని నిర్మూలించడంలో వైఫల్యం చెందడం కూడా ప్రధాన కారణం.


    ఇతర కారణాలు: కొన్ని రకాల పనులు బాలలు మాత్రమే సరిగ్గా చేయగలరు కావున ఆయా రంగాలలో బాలలు బాలకార్మికులుగా మగ్గుతున్నారు. ఉదాహరణకి తేయాకు చిగుళ్ళు తెంపడం లాంటి పనులు మరియు బాలలు అతితక్కువ వేతనంకి పనికి లభిస్తారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు కనీసం భోజనం పెట్టలేని సందర్భంలో ఆయా బాలలకు భోజనం పెట్టి పనిచేయించుకునే దుష్ట సంస్కృతి కూడా ఒక కారణం.


    బాలకార్మికత అధికంగా ఉన్న రంగాలు


    దేశవ్యాప్తంగా కొన్ని రంగాలు లేదా పరిశ్రమల యందు బాలలు అధికంగా కేంద్రీకృతమై ఉన్నారు అవి..

    1. తమిళనాడు రాష్ట్రం నందు గల శివకాశీ ప్రాంతంలోని టపాసులు పరిశ్రమలు

    2. పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ నందు గల చేపల పరిశ్రమలు

    3. తెలంగాణ నందు గల బిడీలు మరియు బిడి ఆకుల పరిశ్రమలు

    4. ఉత్తరప్రదేశ్ నందు గల ఆలిఘర్ తాళాల పరిశ్రమలు, ఫిరోజాబాద్ నందు గల గాజుల పరిశ్రమలు

    5. జమ్ముకాశ్మీర్ మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నందు గల తివాచీల పరిశ్రమలు

    6. దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగం నందు బాలకార్మికత అధికంగా కలదు.

    7. దేశవ్యాప్తంగా బాలురు వ్యవసాయరంగం నందు మరియు బాలికలు గృహసంబంధిత పనుల యందు అధిక సంఖ్యలో బాలకార్మికులుగా ఉన్నారు.


    బాలకార్మికత వ్యవస్థపై అంతర్జాతీయ స్థాయిలో తీసుకున్న చర్యలు


    • 1924వ సంవత్సరంలో నానాజాతి సమితి బాలల హక్కులపై తొలిసారి ప్రకటనను జారీచేసినది.
    • 1946వ సంవత్సరంలో అంతర్జాతీయ బాలల నిధిని ఏర్పాటుచేశారు.
    • డిసెంబర్ 10, 1948 ఐక్యరాజ్యసమితి రూపొందించి మరియు తీర్మానం చేసిన విశ్వమానవ హక్కుల ప్రకటనలో బాలల హక్కులు కూడా భాగమే.
    • నవంబర్ 20, 1959న ఐక్యరాజ్యసమితి సాధారణ సభ బాలల హక్కుల తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించి ప్రకటించినది.

    ఈ తీర్మానం ద్వారా బాలలు సరైన దిశలో అభివృద్ధి చెందేందుకు ఐక్యరాజ్యసమితి సభ్యదేశాలు పాటించవలసిన 10 సూత్రాలను పేర్కొన్నది. ఈ యొక్క 10 సూత్రాలే తర్వాతి కాలంలో ఐక్యరాజ్యసమితి బాలల హక్కుల ఒడంబడిక లేదా సాంప్రదాయంనకు దారితీస్తాయి.


    బాలల హక్కుల ఒడంబడిక


    నవంబర్ 20, 1989న ఐక్యరాజ్యసమితి సాధారణ సభ బాలల హక్కుల ఒడంబడిక లేదా సాంప్రదాయంను (యునైటెడ్నే షన్స్ చైల్డ్ రైట్స్ కన్వెషన్) రూపొందించింది. దీనినే సిఆర్సి అని పిలుస్తారు. ఇది బాలల హక్కులకు సంబంధించిన సమగ్రమైన సాంప్రదాయం. బాలల హక్కుల సాంప్రదాయం 1989లో రూపొందించగా సెప్టెంబర్ 02, 1990 నుండి అమలులోనికి వచ్చింది, కాగా దీనిపై భారతదేశం డిసెంబర్ 11, 1992న సంతకంచేసింది. సిఆర్సి నందు గల ముఖ్యాంశాలు:

    1. దీని ప్రకారం 18 సంవత్సరాల లోపు వారందరు బాలలే

    2. ఈ ఒడంబడిక బాలల హక్కులను 52 నిబంధనల కింద 4 ప్రధాన విభాగాలలో అందించింది. అవి...

         ఎ. మనుగడ పొందే హక్కు (Right to Survive)

         బి. రక్షణ పొందే హక్కు (Right to Protection)

         సి. అభివృద్ధి చెందే హక్కు (Right to Development)

         డి. పాల్గొనే హక్కు (Right to Participation)

    ♦ ఐక్యరాజ్యసమితి వారు 1990వ సంవత్సరంలో బాలల ప్రపంచ శిఖరాగ్ర సదస్సుని నిర్వహించారు.

    ♦ ఐక్యరాజ్యసమితి 1979వ సంవత్సరాన్ని అంతర్జాతీయ బాలల సంవత్సరంగా ప్రకటించింది.


    అంతర్జాతీయ కార్మిక సంస్థ (ILO) వారు 1983వ సంవత్సరంలో బాలకార్మికులను వారు పనిచేసే ప్రదేశాలను బట్టి ఈ క్రింది 5 రకాలుగా వర్గీకరించారు.

    1. గృహ సంబంధ బాలకార్మికులు

    2. వేతనం లేకుండా పనిచేస్తున్న బాలకార్మికులు

    3. వేతనం తీసుకొని పనిచేస్తున్న బాలకార్మికులు

    4. వెట్టి చాకిరిలో ఉన్న బాలకార్మికులు

    5. ఇతర చిన్నా, చితక పనులలో ఉన్న బాలకార్మికులు


    బాలకార్మికత వ్యవస్థను నిర్మూలించేందుకై రాజ్యం తీసుకుంటున్న చర్యలు

    (State Intiatives for Eradicating Child Labour):

    బాలకార్మిక వ్యవస్థని నిర్మూలించేందుకు రాజ్యం ఈ క్రింది మార్గాలు చర్యలను చేపడుతున్నది.

    1. బాలలకు రాజ్యాంగపరమైన రక్షణలు

    2. బాలకార్మిక నిషేధ చట్టాలు

    3. బాలలకు సంబంధించిన సామాజిక మరియు బాలకార్మిక విధానాలు

    4. బాల కార్మిక నిరోధ మరియు పునరావాస కార్యక్రమాలు.

    5. బాలల సంక్షేమం కోసం పనిచేస్తున్న చట్టబద్ధ సంస్థలు


    1. బాలలకు రాజ్యాంగపరమైన రక్షణలు (Constitutional Safegaurds for Children)


    భారతీయ సమాజంలో పురాతన కాలం నుండి బాలలు మరియు ముఖ్యంగా బలహీన వర్గాలకు చెందిన బాలల యొక్క హక్కులు వివిధ రకాల సామాజిక దురాచారాలైన బాలకార్మికత, వెట్టిచాకిరి, జోగినీ, విద్యాఅవకాశాలు లేకపోవడం, బాల్యవివాహాలు, కుల వివక్షత మరియు మనుషుల అక్రమరవాణా లాంటి కారణాల వల్లను మరియు పేదరికం, నిరుద్యోగం, నిరక్షరాస్యత మరియు వెనుకబాటుతనం లాంటి సమస్యల వల్లను కాలరాయబడినవి. అందువల్ల రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగం రచించే కాలం నాటికి బాలల హక్కులకి సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి వివిధ రకాల హక్కులను భారతీయ సామాజిక స్థితిగతులకు అనుగుణంగా మార్చి రాజ్యాంగం నందు పొందుపర్చారు. అవి...

    • నిబంధన 14 సమానత్వపు హక్కు.
    • నిబంధన 15 బాలలపట్ల వివక్షత చూపరాదు.
    • నిబంధన 15(3) ప్రకారం రాజ్యం మహిళా మరియు బాలల సమానత్వం కోసం ప్రత్యేక అవకాశాలు లేదా సదుపాయాలు కల్పించవచ్చు.
    • నిబంధన 21 వ్యక్తిగత స్వేచ్ఛ & గౌరవంగా జీవించే హక్కు బాలలకుంటుంది.
    • నిబంధన 21(ఎ) ప్రకారం 6-14 సం|| వయస్సు గల పిల్లలకు ప్రాథమిక విద్య అనునది ప్రాథమిక హక్కు.
    • నిబంధన 23 బాలల్లో కూడా మనుషుల అక్రమ రవాణా, జోగినీ దేవదాసీ మరియు వెట్టిచాకిరిలను నిషేధించింది.
    • నిబంధన 24: 14సం||లోపు బాలలని హానికరమైన పరిశ్రమలలో పనిచేయడాన్ని నిషేదిస్తుంది.
    • నిబంధన 39(A): ప్రకారం ఆర్థిక మరియు ఇతర కారణాల వల్ల బాలల యొక్క బాల్యం శ్రమ దుర్వినియోగం అయ్యేటట్లుగా కల్పించబడే పరిస్థితుల నుండి రాజ్యం వారిని రక్షించాలి.
    • నిబంధన 39 ప్రకారం ఆరోగ్యకరమైన రీతిలో బాలలు వృద్ధి చెందేలా రాజ్యం చర్యలు తీసుకోవాలి.
    • నిబంధన 39(F) ప్రకారం స్వేచ్ఛాయుతమైన, గౌరవప్రదమైన పరిస్థితులలో మరియు ఆరోగ్యకరమైన పద్ధతిలో పిల్లల అభివృద్ధికి తగిన అవకాశాలను, సౌకర్యాలను కల్పించడం రాజ్యం బాధ్యత మరియు రాజ్యం బాలల యొక్క బాల్యం, యవ్వనం దోపిడీకి గురికాకుండా చర్యలు తీసుకోవాలి.
    • నిబంధన 51 (K) 6 నుండి 14 సంవత్సరాలలోపు బాలబాలికలందరికి విద్యావకాశాలు కల్పించడం వారి తల్లిదండ్రులు మరియు సంరక్షితులయొక్క బాద్యత.
    • నిబంధన 45 ప్రకారం 6 సం॥లోపు పిల్లలకి రాజ్యం పూర్వ బాల్యదశ సంరక్షణ మరియు పూర్వ ప్రాథమిక విద్యను అందించాలి.
    • పై అధికరణల క్రింద లభించిన హక్కులతోపాటు ప్రజలందరికీ వర్తించే ఈ క్రింది నిబంధనలు కూడా బాలల విషయంలో అన్వయమౌతాయి.
    • నిబంధన 46 రాజ్యము బలహీన వర్గాలను సంరక్షించాలని చెబుతుంది. ఇది బాలలకు కూడా వర్తిస్తుంది.
    • నిబంధన 47 బాలల్లో పోషకాహారం మరియు బాలల్లో ఆరోగ్యాన్ని పెంచాలని సూచిస్తుంది.


    2. బాలకార్మికత నిషేధంనకు సంబంధించిన చట్టాలు (Laws Relating to Child Labour)

     

    స్వాతంత్ర్యానికి పూర్వం కూడా బ్రిటీష్ వారు కొద్ది వరకు బాలకార్మికత నిషేధం కోసం ప్రయత్నించారు. కాని అప్పుడున్న సామాజిక ఆర్థిక పరిస్థితులు, పేదరికం లాంటి కారణాల వల్ల బాలకార్మికత అత్యంత తీవ్రంగా ఉండేది. రాజ్యాంగం రూపొందించుకున్న తర్వాత బాలల హక్కులకు రాజ్యాంగపరమైన భద్రత లభించడం మరియు బాలలహక్కులకు సంబంధించి అంతర్జాతీయ ఒడంబడికులపై భారతదేశం సంతకం చేయడం లాంటి కారణాల వల్ల భారతదేశం బాలల హక్కుల పరిరక్షణ కోసం మరియు బాలకార్మికత నిర్మూలన కోసం ఈ క్రింది చట్టాలు రూపొందించి అమలుచేస్తున్నది.

    1. The Children (Pledging of Laour) Act, 1933

    2. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ చట్టం-2005 :

    3. The Factories Act, 1948.

    4. The Apprentices Act, 1961

    5. The Child Labour Adolescent Workers (Prohibition and Regulation) Act, 1986 (Ammended in 2016)

    6. Right of Children to Free and Compulsory Education (RTE) Act, 2009


    బాలకార్మికనిషేధ చట్టం 1986


    1. రాజ్యాంగంలోని నిబంధన 24 మరియు 39 ల ఆధారంగా ఈ చట్టాన్ని రూపొందించారు.

    2. 1979వ సంవత్సరంలో బాలకార్మిక వ్యవస్థపై ఏర్పాటు చేసిన గురుపాద స్వామికమిటీ కూడా బాలకార్మిక నిషేధ చట్టం ఉండాలని సూచించింది.

    3. ఈ చట్టం డిసెంబర్ 23, 1986 నుండి అమలులోనికి వచ్చింది.

    4. ఈ చట్టం ప్రకారం 14 సంవత్సరాలలోపు వారు బాలలు

    5. ఈ చట్టం 14 సంవత్సరాలలోపు వారిని 18 రకాల వృత్తులు మరియు 65 రకాల ఉత్పాదిక ప్రక్రియలో పాల్గొనకుండా నిషేధించింది.

    6. అక్టోబర్ 2006లో ఈ చట్టాన్ని సవరించి దేశీయ రంగంలో అనగా మార్కెట్లు, కిరాణ షాపులు, ఇతరాత్ర అవ్యవస్థీకృత రంగంలో కూడా 14 సంవత్సరాలలోపు బాలలు పనిచేయకుండా నిషేధించింది.

    7. ఈ చట్టాన్ని అతిక్రమించిన వారికి 3 నెలల నుండి 1 సంవత్సరం వరకు జైలుశిక్ష మరియు 10 నుండి 20 వేల వరకు జరిమానా విధించబడుతుంది.


    బాలకార్మిక నిషేధ చట్టం 1986ను 2016వ సంవత్సరంలో సమగ్రంగా సవరించి బాలకార్మిక నిషేధ చట్టంను మరింత సమర్ధవంతంగా రూపొందించి అమలుచేస్తున్నది.


    సవరించిన బాల కార్మిక నిషేధ చట్టం - 1986


    బాలకార్మిక నిషేధ చట్టం-1986ను 2016వ సంవత్సరంలో సమగ్రంగా సవరించారు. ఈ చట్టాన్నే ఛైల్డ్ & అడాలిసెంట్ లేబర్ యాక్ట్ 1986 అని పిలుస్తారు.


    ఈ చట్టం నందలి నిర్వచనాలు

    • 14-18 సంవత్సరాల మధ్య ఉన్నవారిని కౌమారులు అని పిలుస్తారు, 14 సంవత్సరాల లోపువారిని లేదా విద్యాహక్కు చట్టంలో పేర్కొన్న వయస్సులోపు వారిని బాలలు అని పిలుస్తారు.
    • ఒక రోజు అనగా మధ్యరాత్రి 12 గంటలకు ప్రారంభం నుండి మరలా మధ్యరాత్రి 12 గంటల వరకు గల కాలం అనగా 24 గంటలు.
    • వారము అనగా శనివారం మధ్యరాత్రి 12 గంటల నుండి ప్రారంభమై వరుసగా 7 రోజుల కాలం.
    • ఈ చట్టం ప్రకారం 15 సంవత్సరాలలోపు వారు ఏ రకమైన పనిచేసిన, చివరకు వారి విద్యకు ఆటంకం కలిగే విధంగా ఇంట్లో పనిచేసిన కూడా బాలకార్మికులుగానే పరిగణింపబడతారు. మరియు 15 నుండి 18 సంవత్సరాల మధ్యవయస్సు గల వారు నిర్దేశించిన ప్రదేశాలలో పనిచేసినట్లయితే వారిని కౌమార పనివారలు (Adolecent Workers) అంటారు.


    సవరించిన బాల కార్మిక నిషేధ చట్టం 1986 నందు పొందుపర్చిన ముఖ్యాంశాలు

    • 14 సం||లోపు వారు అన్ని రకాల పరిశ్రమలలో పనిచేయకుండా నిషేదించారు మరియు స్వగృహాలలో కూడా వారి యొక్క చదువుకు భంగం కలగనంతవరకు మాత్రమే పనిచేయాలి. (ఎందుకంటే విద్యాహక్కు చట్టం 2009 ప్రకారం & నిబంధన 21(A) ప్రకారం బాలలకు చదువుకోవడం ఓ హక్కు).
    • సెక్షన్ 03 ప్రకారం, 14 సం||లలోపు పిల్లలని అన్ని రకాల పరిశ్రమలలో పనిచేయడం నిషేదించనప్పటికే కళారంగం, TV కార్యక్రమాలు, గృహ సంబంధమైన కార్యక్రమాలు చేయవచ్చును. కానీ ఇది కూడా వారి చదువుకు భంగం కలిగించకూడదు. అనగా సెలవులో మాత్రమే పని చేసుకోవచ్చును.
    • సెక్షన్ 03 (ఎ) ప్రకారం, ఈ చట్టం 15-18 సం॥ల వయస్సు వారు కూడా గనులు, ప్రేలుడు స్వభావం, మంటలు మండే స్వభావం వున్న పరిశ్రమలు మరియు కర్మాగారాల చట్టం 1948 ప్రకారం హానికరమైన పరిశ్రమలను గుర్తించిన పరిశ్రమలలో పని చేయడం నిషేధించడమైనది మరియు ఈ వయస్సు వారిని Adolescent workers అని పిలువడం జరిగింది.
    • సెక్షన్ 5 ప్రకారం కేంద్ర ప్రభుత్వం టెక్నికల్ అడ్వైజరి కమిటీని ఏర్పాటు చేస్తుంది. ఈ కమిటీ ఈ చట్టానికి సంబంధించిన బాలకార్మికులు పనిచేయకూడని ప్రదేశాలతో కూడిన షెడ్యూలకు ఇతర పనిరంగాలను కలపడానికి సంబంధించిన అంశాలపై కేంద్రానికి సలహాలిస్తుంది.
    • సెక్షన్ 7 ప్రకారం హానికరం కాని పరిశ్రమలలో కూడా రాత్రి 7 నుండి ఉదయం 8 గంటల వరకు పనిచేయడం నిషేధం, అధిక సమయం పనిచేయడం నిషేధం.
    • 2016లో సవరించిన తర్వాత ఎవరైన ఉల్లంఘనకు పాల్పడితే ఈ క్రింది శిక్షలు విధించబడతాయి. మొదటి సారి నేరానికి పాల్పడితే 6 నెలల నుండి 2 సం||ల వరకు జైలుశిక్ష మరియు Rs. 20,000 - Rs.50,000/- వరకు జరిమానా.
    • రెండవసారి నేరాన్ని పునరావృత్తం చేస్తే ఒక్క సం॥ నుండి 3 సం||ల వరకు కూడా జైలుశిక్ష విధించవచ్చు. సవరించిన బాలకార్మిక చట్టానికి అనుగుణంగా 2017లో బాలకార్మిక నిబంధనలు రూపొందించారు.
    • ఈ చట్టంలోని సెక్షన్ 14(బి)ని అనుసరించి చైల్డ్ & అడాలిసెంట్ లేబర్ పునరావాస నిధిని ప్రతి జిల్లాలో లేదా రెండు జిల్లాలకు కలిపి కాని ఏర్పాటు చేయాలి. ఈ నిధిని ఆ జిల్లాలలో బాలకార్మికతకు పాల్పడిన వారికి విధించిన జరిమానాలతో ఏర్పాటు చేయాలి. ఈ నిధికి అదనంగా ప్రభుత్వం ఒక్కొక్క బాలకార్మికుడికి 15,000 రూపాయలు పునరావాసం కోసం కేటాయిస్తుంది. ఉదా: ఎ అనేవాడు తన కంపెనీలో ఒకబాలకార్మికుడిని నియమించుకున్నందుకు గాను 20,000 రూపాయలు ఫైన్ వేయగా ఆ యొక్క ఫైన్ని జిల్లా బాలకార్మిక నిధిలో భాగంగా ఆ బాలకార్మికుడి యొక్క పునరావాసానికి వినియోగిస్తారు. మరియు ప్రభుత్వం దీనికి అదనంగా 15,000 రూపాయలు కూడా పునరావాస నిమిత్తం అందిస్తుంది.
    • సెక్షన్ 17ను అనుసరించి బాలకార్మికతకు సంబంధించిన కేసులను స్వీకరించి విచారణ చేసేందుకు ఇన్స్పెక్టర్ స్థాయి అధికారిని నియమించాలి.
    • ఈ చట్టంలో జిల్లా స్థాయిలో అమలుపర్చేందుకు డిస్ట్రిక్ మెజిస్ట్రేట్ కు బాధ్యతలు అందజేశారు. సెక్షన్ 17(బి) ప్రకారం కర్మాగారాలను తనిఖీ చేసి బాలకార్మికత లేకుండా చూస్తారు.
    • సవరించిన బాలకార్మిక నిషేధ చట్టం నందు షెడ్యూల్ని ఏర్పరచి అందులో గనులు, ప్రేలుడు స్వభావం ఉన్న పనులు మరియు హానికరమైన ప్రక్రియలు ఉన్నటువంటి పనులు మరియు కర్మాగారాల చట్టం 1948 నందు హానికరమైన పరిశ్రమలుగా పేర్కొన్న పరిశ్రమల యందు బాలలు మరియు అడాలిసెంట్ వర్కర్లు కూడా పనిచేయకుండా నిషేధించారు.


    జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమీషన్ చట్టం - 2005


    • జాతీయ స్థాయిలో బాలల హక్కులను సంరక్షించేందుకు చట్టబద్ధ సంస్థను ఏర్పాటు చేయడం కోసం ఈ చట్టాన్ని రూపొందించారు. ఈ చట్టాన్ని 2006లో సవరించారు.
    • ఈ చట్టం ఆధారంగా 2007లో జాతీయ బాలల హక్కుల సంరక్షణ కమిషన్ని ఏర్పాటు చేశారు.


    Note: కమిషన్కి సంబంధించిన అన్ని వివరాలు Women & Child Welfare ఛాప్టర్లో వివరించడం జరిగింది. కావున గమనించగలరు.


    విద్యాహక్కు చట్టం-2009


    • దీనిని Right of Children to Free and Compulsory Education (RTE) ACT-2009 అని అంటారు. ఈ చట్టం 6-14 సం||ల మధ్య వయస్సుగల పిల్లలకు ప్రాథమిక విద్యను ఉచితంగా పొందే హక్కును కల్పించింది.
    • 86వ రాజ్యాంగ సవరణ చట్టం 2002 ద్వారా నిబంధన 21కి (A)ని చేర్చి, 21(ఎ), అనే అధికరణాన్ని ఏర్పర్చి దీని క్రింద ప్రాథమిక విద్యను, ప్రాథమిక హక్కుగా కల్పించారు. దీనిని అమలు చేసేందు కోసమే 'విద్యాహక్కు' చట్టాన్ని తీసుకోవచ్చారు.
    • విద్యాహక్కు చట్టం 1st April, 2010 నుండి అమలులోనికి వచ్చింది.
    • విద్యాహక్కు చట్టం 2009ని 2012 & 2019వ సం॥లో సవరించారు.
    • ఈ చట్టం ప్రకారం బలహీన వర్గాలకు సంబంధించిన బాలలకు పాఠశాలల్లో కనీసం 25% సీట్లు ఇవ్వాలి, విద్యార్థులను శిక్షించకూడదు.


    3. బాలలకు సంబంధించిన సామాజిక మరియు బాలకార్మికతకు సంబంధించిన విధానాలు


    బాల కార్మికత సామాజిక విధానాలు: బాలల యొక్క రక్షణ, విద్యా, పోషణ మరియు సమగ్ర అభివృద్ధి నిమిత్తం ఈ క్రింది సామాజిక విధానాలు రూపొందించి అమలుచేస్తున్నారు.

    1. మొదట జాతీయ బాలల విధానము 1974 (National Policy on Children)

    2. సవరించిన జాతీయ బాలల విధానము 2013 (New National Policy On Children)

    3. 1979వ సంవత్సరంను అంతర్జాతీయ బాలల సంవత్సరంను జరుపుకుంటున్నాం (International Year of Children)

    4. జాతీయ విద్యావిధానం 1986 నందు బాలల విద్యకు సంబంధించిన ప్రణాళికలు ఏర్పాటు చేశారు. (National Policy on Education)

    5. మొదటి జాతీయ పోషణ విధానము 1993 (National Nutrition Policy)

    6. నూతన జాతీయ పోషణ విధానము 2013 (New Nutrition Policy)

    7. National Charter of Children - 2003

    8. జాతీయ బాలల కార్యాచరణ ప్రణాళిక (National Plan of Action for Children - 2005 & 2016)

    9. జాతీయ పూర్వ బాల్యదశ సంరక్షణ మరియు పూర్వ బాల్యదశ విద్యావిధానము (National Early Child hood care and Education policy) - 2013

    10. India New Born Action Plan - 2014

    11. జాతీయ నూతన విద్యావిధానం 2020

    12. జాతీయ బాలకార్మిక విధానం - 1987


    జాతీయ బాలల విధానము 2013 (National Policy for Children)


    ♦ 26 ఏప్రిల్ 2013 ఆమోదించారు.

    ♦ రాజ్యాంగ పరంగా మరియు ఐక్యరాజ్యసమితి బాలల హక్కుల సాంప్రదాయం (UNCRC) నందు పిల్లలకు గల హక్కులు, అవకాశాలు పూర్తి స్థాయిలో అందుబాటులోనికి తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది.

    ♦ పిల్లల అభివృద్ధి విషయంలో Need - Based అనే వ్యూహం కాకుండా Rights-Based అనే వ్యూహంను అమలుపరుస్తుంది.


    జాతీయ బాలల విధానం 2013 ప్రకారం


    1. 18 సంవత్సరాలలోపు వారు బాలలు

    2. బాల్యం అనేది జీవితం నందు ఒక కీలక దశ

    3. అందరు బాలలను ఒకే రకంగా చూడలేము వారిలో వైవిధ్యత ఉంటుంది మరియు వారి వారి సామాజిక ఆర్థిక పరిస్థితులను బట్టి వారి యొక్క సమస్యలుంటాయి.

    ♦ బాలల యొక్క వికాసంకోసం సుదీర్ఘ, సుస్థిర, బహుళ, రంగాల, సమీకృత మరియు సంలీన విధానంను పాటించాలి.


    జాతీయ బాలల విధానము 2013 మరియు జాతీయ బాలల కార్యాచరణ ప్రణాళిక 2016 ప్రకారం ఎంపిక చేసిన ప్రాముఖ్య అంశాలు

    1. బాలల మనుగడ, ఆరోగ్యం మరియు పోషణ 

    2. విద్య మరియు వికాసం

    3. బాలల రక్షణ

    4. బాలలను భాగస్వాములను చేయడం


    4. బాల కార్మిక నిరోధ మరియు పునరావాస కార్యక్రమాలు


    బాల కార్మికతను నిరోధించడానికి మరియు బాలకార్మికతకు లోనయినవారిని రక్షించి వారిని తిరిగి ఆరోగ్యవంతంగా అందరి బాలల్లాగే వికాసం చెందేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నవి. అవి...


    ఎ. జాతీయ బాలకార్మిక ప్రాజెక్టు (National Child Labour Project)


    1. ఈ ప్రాజెక్టుని 1988వ సంవత్సరంలో దేశవ్యాప్తంగా బాలకార్మికత అధికంగా ఉన్న 12 జిల్లాలలో ప్రారంభించారు.

    2. ఈ పథకం కింద బాలకార్మికత నుంచి రక్షించబడిన ప్రతిబాలుడికి ఒక నెలకు 150 రూపాయల స్టెయిఫండ్ని అందిస్తారు.

    3. బాలకార్మికత తీవ్రతపై సర్వేలు చేపడుతారు.

    4. పునరావాసంతో కూడిన ప్రత్యేక బ్రిడ్జ్ స్కూళ్ళను ఏర్పాటు చేసారు.

    5. 9 నుండి 14 సంవత్సరాల మధ్యగల వయస్సుగల వారికి నేషనల్ ఛైల్డ్ లేబర్ ప్రాజెక్టునికి సంబంధించిన పాఠశాలల ద్వారా సేవలందిస్తారు.

    6. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నేషనల్ ఛైల్డ్ లేబర్ ప్రాజెక్టులో భాగంగా 6000 ల ప్రత్యేక బాలకార్మిక పాఠశాలలు పనిచేస్తున్నవి.


    బి. నేషనల్ స్కీమ్ ఫర్ పి.యం. పోషణ (మధ్యాహ్న భోజన పథకం)


    • ప్రస్తుతం మధ్యాహ్న భోజన పథకాన్ని పి.యం. పోషణ పథకం నందు విలీనం చేసారు.
    • ఈ పథకానికి 29 సెప్టెంబర్ 2021న కేంద్ర కేబినేట్ రూపకల్పన చేసింది. ఈ పథకం కింద 2021 నుండి 2026 సంవత్సరం వరకు 54061.73 కోట్లతో కేంద్రం మరియు 31,733.17 కోట్లతో రాష్ట్ర మరియు కేంద్రపాలిత ప్రభుత్వాలు ఈ పథకాన్ని అమలుచేయనున్నాయి మరియు కేంద్రం 45,000 కోట్ల ఆహారధాన్యాలను అదనంగా అందించనుంది అనగా మొత్తం ఈ పథకానికి 1,30,794.90 కోట్లను ఖర్చుపెట్టనున్నారు. ఈ పథకం కింద ప్రభుత్వ పాఠశాలలు మరియు ఎయిడెడ్ పాఠశాలలో చదువుతున్న 1 నుండి 8వ తరగతి విద్యార్థులకు మధ్యాహ్నా భోజనాన్ని అందించనున్నారు. ఇంతకుముందు ఉన్నటువంటి నేషనల్ స్కీమ్ ఫర్ మిడ్డే మీల్స్ స్కీమ్ స్థానంలో ఈ యొక్క పి.యం. పోషణ పథకాన్ని తీసుకువచ్చారు.
    • ఈ పథకం కింద పాఠశాలల్లో న్యూట్రిషియన్ గార్డెన్స్ని పెంచి వాటిలో ఆకుకూరలని మరియు ఇతర పోషకాలు లభించే చిరు పంటలను పండించనున్నారు మరియు అనిమియా తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాలలో అనుబంధ పోషణను అందించనున్నారు.


    సి. విద్యాపరమైన మరియు ఇతర సంక్షేమ పథకాలు


    చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలని చదివించే స్థోమత లేక, చదివించడానికి కావలసిన అవస్థాపనా సౌకర్యాలు అందుబాటులో లేకపోవడం వల్ల మరియు పేదరికం లాంటి కారణాల వల్ల తమతో పాటు పనికి తీసుకువెళ్తున్నారు అందువలన విద్యాపరమైన సౌకర్యాలు మరియు గురుకుల సౌకర్యాలు కల్పించడం వల్ల బాలకార్మికతను తగ్గించవచ్చు అనే ఉద్దేశ్యంతో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ విద్యాసంబంధిత పథకాలను అమలుచేస్తూ బాలకార్మికత నిరోధానికి కృషిచేస్తున్నాయి. అవి....

    1. విద్యాలక్ష్మి

    2. విద్యాంజలి

    3. కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయ

    4. సర్వశిక్షా అభియాన్

    5. పెన్సిల్ పోర్టల్

    6. ICPS మరియు 1098 సేవలు

    7. ఆపరేషన్ మిలాప్, ముస్కాన్ లాంటి నిరోధక చర్యలు


    గమనిక: పై పథకాలు మహిళలు మరియు బాలల సంక్షేమం అనే పాఠ్యాంశంలో వివరించబడినవి.


    5. బాలల సంక్షేమం కోసం పనిచేస్తున్న చట్టబద్ధ సంస్థలు 


    బాలల సంక్షేమం కోసం పనిచేస్తున్న చట్టబద్ధ సంస్థలు ప్రధానంగా

    1. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమీషన్

    2. జువైనల్ జస్టిస్ బోర్డులు

    3. చైల్డ్ వెల్ఫేర్ కమీటీలు

    4. సెంట్రల్ అడాప్షన్ రీసోర్స్ అథారిటీ


    • జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమీషన్ చట్టం 2005 ఆధారంగా 2007వ సంవత్సరంలో ఈ కమీషన్ ఏర్పాటు చేశారు. (ఈ కమీషన్ యొక్క వివరాలను బాలలు మరియు మహిళా సంక్షేమం అనే పాఠ్యాంశాలలో వివరించడం జరిగింది).
    • బాలన్యాయ చట్టం - 2015 ప్రకారం, బాలఅపరాధుల కోసం జిల్లాస్థాయిలో జువైనైల్ జస్టిస్ బోర్డులు మరియు జిల్లా స్థాయిలో రక్షణ అవసరం ఉన్న పిల్లల కోసం చైల్డ్ వెల్ఫేర్ కమిటీలను చట్టబద్ధ సంస్థలుగా ఏర్పాటు చేశారు.
    • సెంట్రల్ అడాప్షన్ మరియు రీసోర్స్ అథారిటీని 1990లో ఏర్పాటు చేశారు. కాని బాలన్యాయ చట్టం 2015 ప్రకారం, ఈ సంస్థని చట్టబద్ధ సంస్థగా మార్చారు. దత్తతకు సంబంధించిన అంశాలను పర్యవేక్షించే చట్టబద్ధ సంస్థగా ఈ సంస్థ పనిచేస్తుంది.


    బాల కార్మిక వ్యవస్థపై సుప్రీంకోర్టు యొక్క ముఖ్యమైన తీర్పులు మరియు మార్గదర్శకాలు


    యం.సి. మెహతా వర్సెస్ తమిళనాడు రాష్ట్రం కేసులో డిసెంబర్ 10, 1996న వేసిన పిటిషన్కు బదులుగా సుప్రీంకోర్టు ఈ క్రింది మార్గదర్శకాలు జారీచేసినది.

    1. బాలకార్మికులను గుర్తించేందుకు సమగ్రమైన సర్వే చేపట్టాలి.

    2. ప్రమాదకర పరిస్థితులలో పనిచేస్తున్న బాలకార్మికులను వెంటనే రక్షించాలి.

    3. బాలకార్మికులను పనిలో పెట్టుకున్న వారికి ఒక్కొక్క బాలకార్మికునికిగాను 20,000 చొప్పున అపరాధ రుసుమును వసూలు చేసి బాలల సంక్షేమ నిధిలో జమచేయాలి.

    4. బాలకార్మిక చట్టం అతిక్రమిస్తే కనీసం 3 సంవత్సరాల జైలు శిక్ష మరియు 20,000 నుండి 50,000 వరకు జరిమానా విధించేలా చట్టాలు ఉండాలని సూచించినది.

    ♦ 18 ఏప్రిల్ 2011న సుప్రీంకోర్టు సర్కస్లలో కూడా బాలలను వినియోగించడాన్ని నిషేధించినది.


    వివిధ సందర్భాలలో సుప్రీంకోర్టు ఈ క్రింద తెలుపబడిన 9 రకాల పరిశ్రమలలో బాలకార్మిక నిషేధ చట్టాన్ని కఠినంగా అమలుచేయాలని సూచించినది. అవి...

    1. సూరత్ డైమండ్ పరిశ్రమలు

    2. జైపూర్ పాలిషింగ్ పరిశ్రమలు

    3. శివకాశి అగ్గిపెట్టలు మరియు టపాసుల పరిశ్రమలు

    4. మీర్జాపూర్ తివాచీల పరిశ్రమలు

    5. అలీఘర్ తాళాల పరిశ్రమలు

    6. రాజస్థాన్ రాష్ట్రంలోని మాండాసోర్ పలకల పరిశ్రమలు

    7. రాజస్థాన్లోని జైపూర్ నందు గల గాజుల పరిశ్రమలు

    8. ఉత్తరప్రదేశ్లోని మోర్దాబాద్ నందు గల బ్రాంజ్ పరిశ్రమలు

    9. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లానందు గల మార్కాపురం పలకల పరిశ్రమలు


    బాలకార్మికత వల్ల సమాజం నందు కలిగే పర్యవసనాలు (Consequences of Child Labour in the Society)


    బాలకార్మిక వ్యవస్థ వలన వ్యక్తిగత స్థాయి మరియు కుటుంబ స్థాయి నుండి సమాజ స్థాయి వరకు వివిధ రకాల దుష్పరినామాలు ఏర్పడతాయి.


    వ్యక్తిగత మరియు కుటుంబస్థాయి: బాలకార్మికుల యొక్క అనారోగ్యం దెబ్బతింటుంది, విద్యా మరియు ఆరోగ్యంనకు దూరమై జీవితాంతం నైపుణ్యలేమితో, అక్షరాస్యతలేమితో మరియు శారీరక శ్రమకు నమ్ముకున్న కార్మిక జీవులుగానే బతకవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కుటుంబంలోని బాలలు, బాలకార్మికులుగా ఉండడం వల్ల ఆయా కుటుంబాలు తరతరాలు విద్యకు దూరమై పేదరికంలోనే మగ్గిపోవలసి వస్తుంది కావున బాలకార్మికత అనేది వ్యక్తికి మరియు కుటుంబానికి సామాజికపరమైన మరియు ఆర్థికపరమైన గతిశీలత లేకుండా చేస్తుంది.


    సమాజ స్థాయిలో బాలకార్మికత ప్రభావం: ఏ దేశానికైనా అత్యంత విలువైన వనరులు బాలలు, నేటి బాలలే రేపటి సమాజానికి కావలసిన పౌరులు కావున భవిష్యత్తు తరాలకు అవసరమైనటువంటి వివిధ రకాల వృత్తినిపుణులు మరియు ఇతర విలువైన మానవ వనరులు ఆయా బాలల నుండే ఉద్భవిస్తారు. కాని బాల్యం నందు బాలకార్మికతకు లోనవడం వల్ల దేశం నందు విలువైన మానవ వనరులుగా మారవలసిన బాలలు ఆరోగ్యాన్ని మరియు విద్యను కోల్పోయి నైపుణ్యం లేని మానవ వనరులుగా తయారయ్యే అవకాశం కలదు.


    బాలకార్మికత మరియు బాలల ఆరోగ్యం


    సరియైన శారీరక వికాసం జరగక ముందే కార్మికులుగా మారడం వలన బాలల యందు శారీరక వికాసం, మానసిక వికాసం, ఉద్వేగ వికాసం మరియు బౌద్ధిక వికాసం కుంటుపడుతుంది.


    ఆయా పరిశ్రమల యొక్క స్వభావాన్ని బట్టి బాలలు పెద్దవారికంటే సులువుగా అనారోగ్యానికి గురయ్యే అవకాశం కలదు. బాల కార్మికుల యందు ఈ క్రింది ఆరోగ్య సమస్యలు అధికంగా కనపడతాయి.

    1. బెలూన్ల పరిశ్రమ వల్ల బాల కార్మికుల్లో నిమోనియా మరియు ఊపిరితిత్తుల వ్యాధులు సంభవిస్తాయి.

    2. గనులు మరియు పలకల పరిశ్రమల వల్ల బాలకార్మికుల్లో సిలికోసిస్ వ్యాధి సంభవిస్తుంది.

    3. గ్లాస్ పరిశ్రమలలో పనిచేసే బాలల్లో సిలికోసిస్ మరియు వేడిసింకో అనే వ్యాధి సంభవిస్తుంది.

    4. వివిధ రకాల పరిశ్రమల్లో పనిచేసే బాలల్లో క్షయ వ్యాధి మరియు తరచుగా అగ్ని ప్రమాదానికి గురయ్యే అవకాశం

    ఉంటుంది.

    5. అగ్గిపెట్టెలు, మందుగుండు లాంటి పరిశ్రమలలో పనిచేసే బాలకార్మికులు తీవ్రమైన చర్మ సమస్యను ఎదుర్కోవడం మరియు తరచుగా అగ్ని ప్రమాదాలకు లోనయ్యే అవకాశం కలదు.

    6. వ్యవసాయ రంగంలో పనిచేసే బాలలు ప్రధానంగా ఫైబ్రోసిస్, చర్మవ్యాధులు, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు, ఫార్మస్ కాఫ్, మరియు వివిధ రకాల ఎలర్జీలకు లోనయ్యే అవకాశం కలదు.

    7. బిడి మరియు సిగరేట్ పరిశ్రమలలో పనిచేసే బాలలు ఆస్తమా మరియు నికోటిన్ సంబంధిత వ్యాధులకు లోనయ్యే అవకాశం కలదు

    8. బాలకార్మికుల యొక్క సామాజిక మరియు ఉద్వేగపరమైన ఆరోగ్యం కూడా సరియైన రీతిలో ఉండక పోవచ్చును, ఎందుకనగా వారు పనిచేస్తున్నందుకు ఎంతో కొంత డబ్బు చేతిలో ఉండటం వల్ల మరియు అధికమైన శారీరక కష్టాన్ని చేసిఉండటం వల్ల మరియు తమ చుట్టూ ఉన్నవారి యొక్క ప్రభావంతో మధ్యపానం మరియు ధుమపానం లాంటి అలవాట్లకు సులభంగా లోనయ్యే అవకాశం కలదు, వీరిలో బాల్యవివాహాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది.


    బాలకార్మికతను ఎదుర్కోవడంలో స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న సహకారం


    మామిడిపూడి వెంకటరంగయ్య ఫౌండేషన్


    హైద్రాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అయిన శాంతాసిన్హా గారు ఈ సంస్థని స్థాపించి బాలకార్మికత మరియు బాలల సంక్షేమంపై కృషిచేసారు. వీరు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సంస్థ మొదటి చైర్మన్ గా సేవలందించారు. వీరికి భారత ప్రభుత్వం 1998లో పద్మశ్రీతో సత్కరించగా 2003లో వీరిని ఫిలిఫ్ఫిన్ ప్రభుత్వపు రామన్మెగాసెస్ అవార్డు లభించింది.


    బాలల హక్కుల పోరాట యోధుడు కైలాష్ సత్యార్ధి


    వీరిని బాలకార్మికత వ్యతిరేకతకు ఛాంపియన్ గా వ్యవహరిస్తారు. వీరిని 2014లో నోబెల్ శాంతి బహుమతి లభించింది. వీరు బచన్ బచావో ఆందోళన్ అనే సంస్థను స్థాపించి బాలకార్మికత మరియు ఇతర బాలల సమస్యలపై పోరాడారు. వీరు బాలల అక్రమ రవాణా, బాలల విద్య మరియు వెట్టిచాకిరి నిర్మూలన కార్యక్రమాలపై సుదీర్ఘకాలం నుండి పోరాటం చేస్తున్నారు.


    సమాజంలో బాలల హక్కులపై అవగాహన పెంపొందించేందుకు వీరు పైన తెలిపిన సంస్థతో పాటు గ్లోబల్ మార్చ్ అగెనెస్ట్ ఛైల్డిబర్ మరియు గ్లోబల్ క్యాంపెయిన్ ఫర్ ఎడ్యుకేషన్ మరియు కైలాష్ సత్యార్ధి చిల్డ్రన్ ఫౌండేషన్ని స్థాపించారు.


    పై సంస్థలతో పాటు రెడ్డిఫౌండేషన్, కేర్ ఇండియా, ఆజీమ్ ప్రేమ్ ఫౌండేషన్, ప్రథమ్ లాంటి సంస్థలు బాలల హక్కులు మరియు విద్యా అవకాశాలపై పోరాడుతున్నవి.


    పునశ్చరణ


    • సవరించిన బాలకార్మిక నిషేధ చట్టం 1986 ప్రకారం 14 సంవత్సరాలలోపు వారు ఉత్పాదక ప్రక్రియలో పాల్గొన్నట్టయితే బాలకార్మికులు అని మరియు 15 నుండి 18 సంవత్సరాల మధ్యవారు ఉత్పాదక ప్రక్రియలో పాల్గొన్నట్టయితే వీరిని కౌమార పనివారలు (అడాలిసెంట్ వర్కర్స్) అని పిలుస్తారు.
    • పై చట్టం ప్రకారం 14 సంవత్సరాలలోపు వారు అన్ని రకాల ఆర్థిక కార్యకలాపాలలో పాల్గొనకుండా నిషేధించడం జరిగింది మరియు 15 నుండి 18 సంవత్సరాల మధ్యవారు హానికరమైన పరిశ్రమలలో పనిచేయకుండా నిషేధించడమైనది కాని బాలలు వారి విద్యకు ఆటంకం కలగకుండ ఇంటిలో మరియు వినోద పరిశ్రమలలో పనిచేయవచ్చు.
    • భారతదేశంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నందు బాలకార్మికులు అధికంగా కలరు.
    • బాలలు వ్యవసాయ రంగంలో మరియు బాలికలు గృహరంగంలో అధికంగా బాలకార్మికులుగా ఉన్నారు.
    • బాలకార్మిక విధానాన్ని 1987లో, బాలకార్మిక ప్రాజెక్టుని 1988లో, బాలకార్మిక చట్టాన్ని మొదటగా 1986లో రూపొందించారు.
    • ఐక్యరాజ్యసమితి బాలల హక్కుల ఒడంబడిక నవంబర్ 20, 1989న రూపొందించారు. ఇది సెప్టెంబర్ 1990 నుండి అమలులోనికి వచ్చింది, దీనిపై భారతదేశం డిసెంబర్ 11, 1992న సంతకం చేసింది.
    • రాజ్యాంగ అధికరణం 24 ద్వారా 14 సంవత్సరాలలోపు బాలలు హానికరమైన పరిశ్రమలలో పనిచేయడం నిషేధించారు.
    • నూతన జాతీయ బాలల కార్యచరణ ప్రణాళికను 2016వ సంవత్సరంలో రూపొందించారు.

    • కైలాష్ సత్యార్థిని బాలకార్మికత వ్యతిరేకతకు చాంపియన్గా పరిగణిస్తారు. వీరు 2014లో నోబెల్ శాంతిబహుమతిని పొందారు.


Tags: Caste system, gender roles, joint families, arranged marriages, diversity, cultural festivals, social hierarchy, economic disparities, religious practices, education system, urbanization, rural traditions, globalization, modernization


No comments:

Post a Comment

Post Bottom Ad