1.10 మహిళ - GNANA SAMHITHA

GNANA SAMHITHA

DONT WORRY!!! WE HELP YOU TO REACH YOUR GOAL 😊

Breaking

Post Top Ad

Monday, July 10, 2023

1.10 మహిళ

1.10 మహిళ


    ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి సామాజిక స్థరీకరణ రూపాలలో లింగపరమైన స్థరీకరణ కూడా ఒకటి. భారతదేశం నందు వేద నాగరికత నుండి మొదలు ప్రస్తుత కాలం వరకు మహిళ స్థరీకరణకు మరియు సామాజిక వెలికి గురవుతుంది. కొన్ని వేల సంవత్సరాల పాటు విద్యావకాశాలు, వారసత్వ హక్కులు, రాజకీయ హక్కులు, ఉద్యోగ అవకాశాలు లేకుండా వివిధ రకాల శారీరక, మానసిక మరియు సాంస్కృతిక హింసకు గురయ్యినారు. మహిళలపై జరుగుతున్న అకృత్యాలు సమాజానికి సమస్యలుగా అనిపించవు ఉదాహరణకు, జోగినీ వ్యవస్థని రాజ్యాంగ అధికరణం 23 నిషేధించినప్పటికి కూడా తెలంగాణ రాష్ట్ర పండుగ అయిన బోనాల ఉత్సవాలలో జోగినీ వ్యవస్థ ఆనవాళ్ళను మనం గమనించవచ్చు. పురుషాధిక్య విలువలు మరియు పితృస్వామ్య మతపద్ధతులు మహిళలని తరతరాల నుండి రెండవ లింగం వారిగా పరిగణిస్తున్నవి. భారతీయ సమాజంలో మహిళ యొక్క అంతస్థు వివిధ యుగాలలో వివిధ రూపాలలో గోచరిస్తుంది, ఈ పాఠ్యాంశం నందు పురాతన కాలం నుండి ప్రస్తుత కాలం వరకు భారతీయ సమాజంలో మహిళల యొక్క అంతస్థును మరియు లింగపరమైన దత్తాంశాన్ని మరియు సూచికలను వివరించడం జరిగింది.


    ప్రాథమికంగా మానవ సమాజం లింగం ఆధారంగా మహిళలు మరియు పురుషులుగా విభజించబడింది. ప్రపంచంలోని అన్ని రకాల సామాజిక స్థరీకరణ రూపాలలో కెల్లా లింగపరమైన సామాజిక స్థరీకరనే అత్యంత పురాతనమైనదని రిచర్డ్ ప్లెక్స్నర్ అనే శాస్త్రవేత్త తెలిపాడు.


    ఆదిమ సమాజాలన్ని కూడా వేట, వ్యవసాయం లాంటి అధిక శ్రమతో కూడుకొని ఉన్న వృత్తులు కాబట్టి స్త్రీ, పురుషులు ఉత్పత్తి సామర్థ్యాలలో తేడాలుండటం వల్ల స్త్రీ, పురుషుడి మీద ఆధారపడి ఉండటం ఆరంభమైనది మరియు ఆయా సమాజాలలో రక్షణ నిమిత్తం కూడా స్త్రీ, పురుషుడి మీద ఆధారపడటం జరిగింది.


    ప్రపంచంలో ఏ సమాజంలోను స్త్రీ మరియు పురుషులు సమానంగా ఆదరించబడిన దాఖలాలు లేవు, మహిళలకు ఒక రకమైన జీవన విధానాన్ని మరియు పురుషులకు స్వతంత్ర జీవన విధానాన్ని అందించినవి.


    మహిళను గౌరవించని సమాజం, దేశం, ఎన్నడూ గొప్పది కాలేదు మరియు భవిష్యత్తులో కూడా కాదు అని స్వామి వివేకానంద పేర్కొన్నాడు. ఒక సమాజంలో స్త్రీలకు ఇస్తున్న స్థానాన్నే బట్టి ఆ సమాజం యొక్క స్థాయిని అంచనా వేస్తారు.


    స్త్రీ, పురుషుల మధ్య ఉన్నటువంటి లింగపరమైన స్థరీకరణ ఒక తరం నుండి మరో తరంనకు సామాజీకరణ మరియు సాంస్కృతీకరణలో భాగంగా పయనిస్తున్నది. బాలికలను ఒక రకంగా మరియు బాలురను మరో రకంగా పెంచడాన్నే లింగపరమైన సామాజీకరణ అంటారు.


    లింగంను బట్టి స్త్రీలకు మరియు పురుషులకు వేరువేరు కుటుంబ, సామాజిక మరియు ఆర్థిక పాత్రలను అందించడాన్నే లింగపరమైన శ్రమ విభజన (జెండర్ బేస్డ్ డ్ డివిజన్ ఆఫ్ లేబర్) అని అంటారు.


    స్త్రీ పురుషుల మధ్యగల భేదాలు


    స్త్రీలు మరియు పురుషుల మధ్యగల ఈ రకమైన తేడాలకు 4 ప్రధానమైన కారకాలు కలవని స్మెల్సన్ అనునతడు పేర్కొన్నాడు. అవి...


    1. జైవిక పరమైన తేడాలు (Biological Differences): శారీరక పరంగా ప్రత్యేక లక్షణాలను కలిగి ఉండటం వలన స్త్రీలు గర్భధారణకు లోనవడం, శిశువులకు క్షీరమునివ్వడం, శిశు సంరక్షణ, జన్యుపరమైన తేడాలు, సుకుమారత్వాన్ని కలిగి ఉండటం లాంటి జైవిక తేడాలుంటాయి.

    2. లింగ పరమైన గుర్తింపు (Gender Identity): 3 సం||లలోపే పిల్లల యందు లింగ పరమైన గుర్తింపు భావన ప్రారంభమవుతుంది, అనగా నేను బాలికను లేదా నేను బాలుడను, నేను ఇలాంటి పనులు చేయాలి, నేను ఇలా ఉండాలి మరియు అలా ఉండకూడదు లాంటి భావనలు అంతర్లీనం చేసుకొని ఆచరించడం కొనసాగుతుంది.

    3. లింగపరమైన ఆదర్శాలు (Gender Ideals): స్త్రీలు చూపించవలసిన ప్రవర్తన మరియు నడవడిక, పురుషులు చూపించవలసిన ప్రవర్తన మరియు నడవడిక అనునవి ఆయా సమాజాలు ఆచరించే సాంస్కృతి మరియు ఆచరణలు ఆధారంగా స్త్రీలు మరియు పురుషుల ప్రవర్తనపై నియంత్రణను కలిగి ఉంటాయి. ఆయా నియంత్రణలే లింగ పరమైన ఆదర్శాలుగా అనగా స్త్రీలు పాటించవలసినవి మరియు పురుషులు పాటించవలసినవిగా చలామణి అవుతాయి.

    ఉదా: స్త్రీలు పద్ధతిగా, సుకుమారంగా మరియు అనుకువగా ఉండాలని ఆశించడం.

    4. లింగపరమైన పాత్రలు (Gender Roles): స్త్రీలు చేయవల్సిన పనులు మరియు పురుషులు చేయవలసిన పనులుగా విభజించడాన్నే లింగపరమైన పాత్రలకు ఉదాహరణలుగా తెలుపవచ్చు.


    పురుషులను ప్రధానమైన పనులకు మరియు స్త్రీలను ఇంటి సంబంధమైన పనులకు పరిమితం చేసాడు అందువలన పురుషుడు స్వేచ్ఛను, విద్యను మరియు ఆధిపత్యాన్ని పొందగలిగినాడని అలాగే స్త్రీలు అనుకువగా ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది. అని టాల్కట్ పర్సన్ మరియు రాబర్ట్ బేల్స్ అనువారు తమ యొక్క ప్రకార్యాత్మక వాదన నందు తెలిపారు.


    కారల్ మార్క్స్ ప్రకారం సంపద అధికంగా సృష్టించబడే పాత్ర పోషణ స్త్రీలు చేయడం లేదు కాబట్టే అణచివేతకు గురవుతున్నారని తెలుపుతారు.


    లింగం(Gender) మరియు లైంగికత (Sex)కు మధ్య గల తేడాలు



    సమాజం నందు గల వివిధ రకాల రంగాలలో మరియు సామాజిక ప్రక్రియల యందు అనగా సామాజిక రంగంలో, ఆర్థిక రంగంలో, రాజకీయ రంగంలో కటుంబస్థాయిలో యిలా అన్ని జీవన రంగాలలో మహిళలు ఆ సమాజం చేత ఎలా పరిగణించబడుతున్నారు ఎలాంటి సమానత్వంను అందిస్తున్నారు లేదా ఎలాంటి వివక్షతకు, హింస మరియు అసమానతలకు గురవుతున్నారు అనే విషయాలను అర్థం చేసుకోవాలంటే ఆయా సమాజాలయందు మహిళల యొక్క స్థితిగతులను పరిశీలించాలి. యిలా మహిళల యొక్క స్థితిగతులను అర్థం చేసుకునేందుకై జనాభా లెక్కలు, జాతీయ మరియు అంతర్జాతీయ లింగపరమైన సూచికలు, మహిళలపై జరుగుతున్న హింసకు సంబంధించిన గణాంకాలు పరిశీలించాలి మరియు చారిత్రాక్మంగా, అలాగే ప్రస్తుత మహిళలు ఎదుర్కొంటున్న వివిధ రకాల సమస్యలను అవగతం చేసుకోవలసి ఉంటుంది.


    పురాతన భారత సమాజంలో మహిళల యొక్క అంతస్థు


    పురాతన, చారిత్రక గ్రంథాలు మరియు రచనలు పరిశీలించినపుడు మహిళల యొక్క అంతస్థు కొన్ని సందర్భాలలో పురుషులలో సమానంగా మరియు మరికొన్ని సందర్భాలలో అసమానతలకు మరియు వివక్షతకు గురయినట్లు అర్థం చేసుకోవచ్చును. అపస్తంబుడు తన యొక్క రచనల యందు ఏ విషయాలలోనైనా మహిళలకు మొదట అవకాశం యివ్వాలని తెలిపారు.


    మనువు మహిళల పట్ల భిన్న వైఖరులు ప్రదర్శించాడు. ఒక వైపు మహిళలను గౌరవిస్తేనే దేవుళ్ళు సంతోషపడతారు అని చెపుతునే మహిళలకు స్వాతంత్ర్యం యివ్వకూడదు (నస్త్రీ స్వాంతత్ర్య మర్హతి) అని వాఖ్యానించాడు & స్త్రీలు, బాలికగా ఉన్నప్పుడు తల్లిదండ్రుల సంరక్షణలో, యవ్వనంలో భర్త సంరక్షణలో మరియు వృద్ధాప్యంలో సంతానం యొక్క సంరక్షణలో ఉండాలని వ్యాఖ్యానించారు.


    నేలపై తిరుగాడే దేవతా స్వరూపాలే స్త్రీలు అని యజ్ఞవల్కుడు వ్యాఖ్యానించాడు. మహాభారతం నందు బీష్ముడు, భార్య భర్త యొక్క ఆస్తి అని తెలిపాడు. వేద కాలం నందు స్త్రీలు కూడా పురుషులతో సమానంగా విద్యా అవకాశాలుండేవి, స్త్రీలకు కూడా బ్రహ్మచర్యం మరియు ఉపనయన సంస్కారాలు నిర్వహించేవారు.


    పురాణాల యందు మైత్రి, అపల, దాత్రి, లోపాముద్ర, గోష, విశ్వవర, ఇంద్రాణి, గార్గి, లాంటి ఋషిణీల యొక్క వృత్తాంతాలు కూడా కలవు. హిందూ మతంలో మాత్రమే దేవతలు స్త్రీల రూపంలో కూడా కలరు. వేద కాలం నందు బాల్యవివాహాలు లేవు పైగా స్త్రీల అంతస్థుకు సూచికగా స్వయంవర విధానాలుండేవి. పురాతన హిందూ వివాహ రూపాలలో గంధర్వవివాహం ద్వారా ప్రేమ వివాహాలు కూడా ఉండేవి.


    రామాయణం ఏక వివాహం, ఏకపత్నీవ్రతంను ఆదర్శంగా తెలిపింది మరియు వేదకాలం నందు నియోగ అనే పద్ధతిలో వితంతు పునర్వివాహాలు కూడా ఉండేవి. ఋగ్వేదం నందు స్త్రీ దేవతా రూపమైన గాయత్రీ మాత గురించి అనేకసార్లు ప్రస్తావించడం జరిగింది. ధర్మశాస్త్రాల ప్రకారం విడాకులకు అవకాశం లేదు, కానీ కౌటిల్యుడు విడాకులకు సంబంధించిన నియమాలు తెలిపారు. వేద కాలం నందు సతీసహగమనం లేదు.


    సతీసహగమనం, బాల్యవివాహాలు, కన్యాశుల్కం, బహుభార్యత్వం, జోహర్ పద్ధతి, పరదాపద్ధతి అనునవి మధ్యయుగాలలో తీవ్రంగా ఆచరింపబడిన దురాచారాలు. ద్రావిడ నాగరికత యందు కొద్ది వరకు మాతృస్వామ్య లక్షణాలు కన్పిస్తాయి.


    వేదకాలం నందు దంపతి అనే భావన దృఢంగా ఉండేది. ధంపతిలనగా కుటుంబంనకు భర్త మరియు భార్య యిద్దరు కూడా సంయుక్తంగా బాధ్యతలు వహించడం మరియు స్త్రీలకు ప్రత్యేకంగా స్త్రీధనం కూడా ఉండేది. రాజకీయ సంస్థలైన సభలనే సంస్థలో స్త్రీలకు సభ్యత్వం ఉండేది కాదు.


    మహిళలకు ప్రాతివత్యం మరియు ఆదర్శ మహిళలు మరియు పతివ్రత జీవన విధానం అనునది పురాణాల కాలం నందు బాగా అమలు చేయబడింది. రామాయణం పురుషులు ఎలా ఉండాలి మరియు స్త్రీలు ఎలా ఉండాలి అనే ఆదర్శాలను పేర్కొన్నది.


    ఇతిహాసాల కాలం నందు మహిళల యొక్క అంతస్థు తగ్గించబడింది. విద్య మరియు రాజకీయ అవకాశాలు మరియు ఆస్థి హక్కులు యివ్వబడలేదు. ఇతిహాసాల కాలం తరువాత మహిళలకు వేదవిద్య అవకాశాలు లేవు మరియు బాల్యవివాహాలు ప్రారంభమైనవి, వితంతు పునర్వివాహం కూడా లేదు. బౌద్ధ సాహిత్యం ప్రకారం, మహిళలకు విద్య అవకాశాలు కలవు మరియు బౌద్ధ బిక్షణులు కూడా కలరు.


    మధ్య యుగాల కాలం నందు దిగజారిన మహిళల అంతస్థు


    • మధ్యయుగాల కాలం నందు మహిళల పట్ల సమాజం నందు తీవ్రమైన వివక్షత మరియు అసమానతలు మరియు వివిధ రకాల దురాచారాలు సంప్రదాయం పేరుతో సుదీర్ఘకాలం పాటు కొనసాగినవి.
    • వితంతు వివాహాలు అనుమతించలేదు మరియు వితంతువుల యొక్క పరిస్థితి చాలా దుర్భరంగా ఉండేది మరియు ఆస్తి హక్కులు కూడా అనుమతించలేదు.
    • కన్యాశుల్కం, బహుభార్యత్వం, బాల్యవివాహాలు, సతీసహగమనం, జోగినీ, దేవదాసీవ్యవస్థ, ఉంపుడుగత్తెల వ్యవస్థ చాలా తీవ్రంగా ఉండేది.
    • ఇస్లాం నందు కూడా మహిళలు, తలాఖ్్వల్ల, పరదావ్యవస్థ వల్ల బహుభార్యత్వం వల్ల మరియు విద్య అవకాశాలు లేకుండా దుర్భర పరిస్థితులను ఎదుర్కుకున్నారు.
    • భక్తి మరియు సూఫీ ఉద్యమాల వల్ల కొద్ది వరకు స్త్రీల యొక్క అంతస్థు నందు మార్పువచ్చింది.


    ఆధునిక కాలంలో మహిళల యొక్క అంతస్థు


    బ్రిటీషువారి పరిపాలన, సంఘసంస్కరణ ఉద్యమాలు, నూతన చట్టాలు, క్రైస్తవం వల్ల, పట్టణీకరణ మరియు పారిశ్రామికీకరణ పెరగడం లాంటి కారణాల వలన స్త్రీల యొక్క అంతస్థులో మార్పు వచ్చింది మరియు కొన్ని శాసనాల వలన స్త్రీలపై రుద్దుతున్న దురాచారాలు కొద్దివరకు రూపుమాసిపోయినవి.


    రాజారామ్మోహన్ రాయ్ కృషి వల్ల సతీసహగమన నిషేధ చట్టం, ఈశ్వరచంద్ర విద్యాసాగర్ కృషివల్ల వితంతు పునర్వివాహం, శారద చట్టం వల్ల బాల్యవివాహాలు, డి.కె. కార్వే వల్ల మహిళలకు ఉన్నత విద్య లాంటి మార్పులు జరిగినవి.


    స్వాతంత్య్ర ఉద్యమంలో భాగంగా మహాత్మాగాంధి, సరోజినినాయుడు, దుర్గాభాయ్ దేశ్ముఖ్, అనిబిసెంట్, ముత్తులక్ష్మి రెడ్డి లాంటివారి కృషివల్ల కొన్ని సమస్యలు ఎదుర్కోబడినవి.


    తెలుగు రాష్ట్రాలలోని సంఘసంస్కర్తలైన గురజాడ అప్పారావ్ గారి కన్యాశుల్కం నాటకం, కందుకూరి వీరేశలింగం పంతులు లాంటి వారి కృషి వల్ల బాలికా విద్య, వితంతు పునర్వివాహం మరియు ముత్తు లక్ష్మిరెడ్డి, భాగ్యరెడ్డి వర్మ లాంటి వారి కృషి వల్ల సంస్కరణలు అమలు చేయబడినవి. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత స్త్రీల యొక్క స్థితిగతులు మరియు సమస్యలను దృష్టిలో పెట్టుకొని రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులలో, ఆదేశిక సూత్రాలలో భాగంగా మహిళలకు కొన్ని హక్కులను పొందుపరచడం జరిగింది.


    ప్రస్తుతం మహిళల యొక్క స్థితిగతులకు సంబంధించిన సూచికలు (2011 జనాభా లెక్కలు)


    1. భారతదేశంలో లింగనిష్పత్తి                                                         943

    2. గ్రామీణ భారతదేశంలో లింగనిష్పత్తి                                           949

    3. పట్టణ భారతదేశంలో లింగనిష్పత్తి                                             929

    4. లింగనిష్పత్తిలో మొదటిస్థానంలో ఉన్న రాష్ట్రం                       కేరళ (1084)

    5. లింగనిష్పత్తి అత్యల్పంగా ఉన్న రాష్ట్ర                                      హర్యానా (877)

    6. లింగనిష్పత్తిలో మొదటిస్థానంలో ఉన్న యు.టి.                      పుదుచ్చేరి

    7. లింగనిష్పత్తి చివరిస్థానంలో ఉన్న యు.టి.                               డయ్యు డామన్

    8. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లింగనిష్పత్తి                                          997 (పట్టణ 1004, గ్రామీణ 994)

    9. భారతదేశంలో బాలల యందు లింగనిష్పత్తి                             918 (0-6 సం||)

    10. గ్రామీణ భారతంలో బాలలయందు లింగనిష్పత్తి                    923

    11. పట్టణ భారతంలో బాలలయందు లింగనిష్పత్తి                       905

    12. ఆంధ్రప్రదేశ్లో బాలలయందు లింగనిష్పత్తి                            944 (పట్టణ 940, గ్రామీణ 946)

    13. బాలల లింగనిష్పత్తిలో మొదటిస్థానంలో ఉన్న రాష్ట్రం         మిజోరాం 970  

    14. బాలల లింగ నిష్పత్తిలో చివరిస్థానంలో ఉన్న రాష్ట్రం            హర్యాణ 834

    15. జాతీయస్థాయిలో మహిళా అక్షరాస్యత                                       64.64%

    16. గ్రామీణ భారతంలో మహిళా అక్షరాస్యత                                   57.93%

    17. పట్టణ భారతంలో మహిళా అక్షరాస్యత                                     79.11%

    18. మహిళా అక్షరాస్యతలో మొదటిస్థానంలో ఉన్నరాష్ట్రం           కేరళ (92%)

    19. మహిళా అక్షరాస్యతలో చివరి స్థానంలో ఉన్నరాష్ట్రం              రాజస్థాన్ (52.7%)

    20. ఆంధ్రప్రదేశ్లో మహిళా అక్షరాస్యత                                              59.96%


    Table: NFHS-5 Status of Children in India and Andhra Pradesh



    రాజకీయ రంగంలో మహిళలు


    1. 17వ లోక్‌సభ నందు కేవలం 81 మహిళా ఎం.పిలు మాత్రమే కలరు. జనాభాలో సుమారు 50% ఉన్న మహిళలు మొత్తం లోక్‌సభ ఎంపిలలో కేవలం 14.94% మాత్రమే ఉన్నారు.

    2. ప్రస్తుతం (2022 జనవరి) రాజ్యసభలో 29 మంది మహిళలు మాత్రమే ఎం.పి.లుగా ఉన్నారు.


    మహిళల యొక్క అంతస్థుపై కమిటీలు


    ఇప్పటివరకు భారతదేశంలో మహిళల యొక్క అంతస్థును వాస్తవికంగా అధ్యయనం చేసి నివేదికలు రూపొందించేందుకుగాను రెండు High Power Committee లను ఏర్పాటు చేసారు. అవి...

    1. The First Committee on the Status of Women in India : ఈ కమిటిని విద్య మరియు సామాజిక సంక్షేమ మంత్రిత్వశాఖ 22 సెప్టెంబర్, 1971న ఏర్పాటు చేశారు. ఈ యొక్క కమిటి తన యొక్క నివేదికను "Towards Equality" అనే పేరుతో డిసెంబర్ 31, 1974న రూపొందించింది.


    2. రెండవ High Power Committee High level Committee on the Status of Women in India (HLCSW) అనే పేరుతో మహిళా సంక్షేమ మంత్రిత్వ శాఖ వారు మే 24, 2013న ఏర్పాటు చేశారు. ఈ యొక్క కమిటీ తన నివేదికను జూన్ 01, 2015న సమర్పించింది.


    అంతర్జాతీయ స్థాయిలో లింగ సమానత్వ సూచీకలు


    1. జెండర్ ఇనిక్వాలిటీ ఇండెక్స్ (GII) - 2021

    ఈ సూచికని ఐఖ్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం వారు మానవాభివృద్ధి నివేదికలో భాగంగా (UNDP) రూపొందిస్తారు. ఈ సూచిక ద్వారా మానవ అభివృద్ధిలో లింగపరమైన అసమానతలని మూడు ప్రధాన రంగాలలోని అసమానతల ఆధారంగా గణిస్తారు. అవి....

    (ఎ) ప్రత్యుత్పత్తి ఆరోగ్యం  

    (బి) సాధికారత రంగం  

    (సి) ఆర్థికపరమైన రంగం

    ♦ 2021 సంవత్సరానికి గాను 191 దేశాలలో లింగపరమైన అసమానతలని గణించారు. ఈ గణాంకాలలో భారతదేశం 191 దేశాలకు గాను 122వ స్థానాన్ని (0.490 విలువతో) పొందింది.

    ♦ ఈ సూచికలో మొదటి స్థానంలో డెన్మార్క్ రెండవస్థానంలో నార్వే కలవు మరియు యెమెన్ దేశం చిట్టచివరి స్థానంలో కలదు.


    2. లింగ వికాస సూచీ/ జెండర్ డెవలప్మెంట్ ఇండెక్స్ (GDI) - 2021

    ♦ దీనిని కూడా UNDP వారు రూపొందిస్తున్నారు.

    ♦ ఈ సూచికలో వచ్చిన విలువ ఆధారంగా ప్రపంచ దేశాలను 5 సమూహాలుగా వర్గీకరించారు. భారతదేశం (0.849 విలువ) 5వ సమూహ దేశంగా ఉంది.


    3. ప్రపంచ లింగపర వెనుకబాటు నివేదిక/ గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ - 2022

    ♦ దీనిని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వారు 2006వ సంవత్సరం నుండి రూపొందిస్తున్నారు.

    ♦ 0 నుండి 1 వరకు స్కోర్లని కేటాయించి వీటి ఆధారంగా ర్యాంకులు తయారుచేస్తారు.

    ♦ ఈ నివేదిక ప్రకారం భారతదేశం 146 దేశాలకు గాను 135వ స్థానంలో (0.625స్కోర్) ఉంది.

    ♦ మొదటి స్థానంలో ఉన్నదేశము స్వీడన్, చివరి స్థానంలో అఫ్ఘనిస్తాన్ కలదు.

    ♦ భారత్ ఈ సూచీక యందు గల ఉప సూచికలైన ఆర్థిక భాగస్వామ్యం నందు 143వ స్థానం, విద్య స్థాయి యందు 107వ స్థానం, ఆరోగ్యము మరియు మనుగడ విషయంలో 146వ స్థానమును మరియు రాజకీయ సాధికారతలో 48వ స్థానమును పొందడం జరిగింది.


    మహిళలకు సంబంధించిన దినోత్సవాలు, సంవత్సరాలు మరియు దశాబ్ధాలు


    1. జవనరి 24           :   జాతీయ బాలికల సంరక్షణ దినోత్సవం

    2. మార్చి 08              :   అంతర్జాతీయ మహిళా దినోత్సవం

    3 అక్టోబర్ 15             :   గ్రామీణ మహిళా దినోత్సవం

    4. ఫిబ్రవరి 13           :   జాతీయ మహిళా దినోత్సవం

    5. మే 15                    :   అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం

    6. 1994                      :   అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం

    7. 2001         :   అంతర్జాతీయ మహిళా సాధికారత సంవత్సరం

    8. 1976-85                 :   అంతర్జాతీయ మహిళా దశాబ్ధం

    9. 1990                      :   బాలికల సంవత్సరం 

    10. 1975                    :   ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఉమెన్

    11. అక్టోబర్ 11          :   అంతర్జాతీయ బాలికల దినోత్సవం

    12. 11 ఫిబ్రవరి    :   విజ్ఞాన రంగంలో మహిళలు మరియు బాలికల అంతర్జాతీయ దినోత్సవం

    13. 1990-2000           :   సార్క్ డికెడ్ ఆఫ్ గర్ల్ ఛైల్డ్

    14. 2001-10               :   సార్క్ డికెడ్ ఆఫ్ ద రైట్స్ ఆఫ్ చిల్డ్రన్

    15. నవంబర్ 25     :   మహిళలపై జరుగుతున్న హింసకు వ్యతిరేక అంతర్జాతీయ దినోత్సవం

    16. ఫిబ్రవరి 2వ ఆదివారం :   ప్రపంచ వివాహా దినోత్సవం

    17. నవంబర్ 20       :   అంతర్జాతీయ బాలల దినోత్సవం

    18. నవంబర్ 14       :   జాతీయ బాలల దినోత్సవం

    19. మే 2వ ఆదివారం :   ప్రపంచ తల్లుల దినోత్సవం

    20. జూన్ 12          :   ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం



Tags: Caste system, gender roles, joint families, arranged marriages, diversity, cultural festivals, social hierarchy, economic disparities, religious practices, education system, urbanization, rural traditions, globalization, modernization


6 comments:

Post Bottom Ad