2.3 ప్రాంతీయ తత్వం/ప్రాంతీయ వాదం (Regionalism) - GNANA SAMHITHA

GNANA SAMHITHA

DONT WORRY!!! WE HELP YOU TO REACH YOUR GOAL 😊

Breaking

Post Top Ad

Saturday, July 15, 2023

2.3 ప్రాంతీయ తత్వం/ప్రాంతీయ వాదం (Regionalism)

2.3 ప్రాంతీయ తత్వం/ప్రాంతీయ వాదం (Regionalism)


    ఒక నిర్ధిష్ట ప్రాంతంలో నివసిస్తున్న ప్రజా సమూహం వారు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల గాని లేదా వారి భాష పట్లగాని లేదా వారి సంస్కృతి పరిరక్షణ పట్లగాని లేదా వారందరి పురోభివృద్ధికోసం కాని తమ ప్రాంతం అనేటువంటి భౌగోళిక, మానసిక మరియు సామాజిక భావనతో కలసి కట్టుగా ఒక స్వరాన్ని వినిపించడాన్నే ప్రాంతీయతత్వం అంటారు. ప్రాంతీయతత్వం అనేది రుణాత్మకమైన భావన లేదా ధనాత్మకమైన భావన అనునది ఆయా ప్రాంతీయ తత్వాల వెనుకఉన్న కారణాలను బట్టి చెప్పవచ్చు. ఉదాహరణకు తెలంగాణలో ఉన్న ప్రాంతీయ తత్వం, ఈ ప్రాంత ప్రజలకు జరిగిన అన్యాయాలను ప్రతిస్పదించింది. అలాగే జమ్ముకాశ్మీర్ రాష్ట్రంలో కనబడే ప్రాంతీయతత్వంనందు మతతత్వం మరియు వేర్పాటు వాదం కలగలిపి ఉంటాయి. ఈ పాఠ్యాంశం నందు ప్రాంతీయతత్వం యొక్క ప్రాథమిక భావనలు ప్రాంతీయతత్వం నందు గల వివిధ రూపాలు, కారణాలు, ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాంతీయ వాదనలు మరియు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించడం జరిగింది.


    నిర్వచనం మరియు భావము


    ♦ బెర్కీ మరియు హన్కిన్ల ప్రకారం ప్రాంతం అనే భావననందు 3 అంశాలు ఇమిడి ఉంటాయి. అవి...

    1. ప్రాంతానికి ప్రాధాన్యం ఇవ్వడం వలన ఏర్పడిన ప్రాంతం

    2. సామాజిక మరియు సాంస్కృతిక ఏకరూపతను కలిగిన ప్రాంతం లేదా సజాతీయ ప్రాంతం

    3. వ్యవస్థాపన అధికంగా ఉన్నటువంటి ప్రాంతం లేదా ప్రకార్యవంతమైన ప్రాంతం

    ♦పరిసర సంబంధమైన, ఆర్థిక, సామాజిక మరియు ప్రభుత్వపరమైన కారకాలన్ని కలిసి ఒక ప్రత్యేకమైన అస్థిత్వం గల చైతన్యంగా తయారుకావడమే ప్రాంతీయవాదం మరియు ఇది ఒక ఆత్మచైతన్య ప్రక్రియ - మార్షల్ ఇ.డిమోక్.

    ♦మానవుడికి మరియు అతని చుట్టూ ఉన్న భౌతిక పరిసరానికి మధ్యగల సంబంధాన్ని ప్రముఖంగా పరిగణిస్తూ భౌగోళిక ప్రాంతాన్ని విశ్లేషణా యూనిట్గా తీసుకొని ప్రవర్తనను అధ్యయనం చేసే ఉపగమమే ప్రాంతీయవాదం.

    ప్రాంతీయవాదం నందు సమూహ అస్థిత్వభావన, ప్రాంతీయ విశ్వాసం మరియు ఇతర ప్రాంతాలపై కనీస ఆపేక్ష లేకుండా ఉండటం లాంటివి ఉంటాయి.

    ♦ఒక నిర్ధిష్ట ప్రాంతంలోని ప్రజలు తమ ప్రయోజనాలను రాజకీయ అధికారమును ప్రకటించి వాటి సాధనకు ఉమ్మడిగా చేసే ప్రయత్నాన్నే ప్రాంతీయవాదం లేదా ప్రాంతీయ తత్వం అని అంటారు.

    ♦శ్రీరామ్ మహేశ్వరి గారి అభిప్రాయంలో ఒక ప్రాంతంనకు చెందినవారు సంఘటితంగా తమ యొక్క ఐక్యతా భావాన్ని వెలిబుచ్చి ఇతరుల నుండి వేరుగా ప్రకటించుకునే వైఖరినే ప్రాంతీయతత్వం అంటారు. ఈ వైఖరి ఒక రాష్ట్రం పట్ల గాని, దేశం పట్ల గాని లేదా జిల్లా పట్ల గాని ప్రదర్శించవచ్చు.

    ♦ఉమ్మడి అన్యాయాలకు వ్యతిరేకంగా ఒక ప్రాంత ప్రజలు చూపే వేర్పాటు ధోరణినే ప్రాంతీయ తత్వం అంటారు.

    ♦తమ ప్రాంతానికి చెందిన వారిపైన అధికమైన ప్రేమ, వ్యామోహాన్ని కలిగి ఉండి తమ ప్రాంతం కాని వారి పట్ల ద్వేశాన్ని ప్రకటించడాన్ని కూడా ప్రాంతీయతత్వంగా భావించవచ్చు.


    ప్రాంతీయతత్వం - కారణాలు


    • హర్డ్ గో అభిప్రాయంలో భారతీయ సంస్కృతి & భాషాపరమైన వైవిధ్యంలోనే ప్రాంతీయతత్వం కలదు.
    • మిచ్చెల్ హెచ్చర్ అభిప్రాయంలో అంతర్గత వలసవాదాలే ప్రాంతీయతత్వంనకు ప్రధాన కారణం.
    • జాతీయోద్యమం వరకు భారతదేశంలో జాతీయత అనే భావం బలంగా లేదు.
    • అసమతుల అభివృద్ధి, భాషా వైవిధ్యం, సాంస్కృతిక వైవిద్యం బలమైన ప్రాంతీయ అస్థిత్వాలు, తీవ్రమైన వెనుకబాటుతనం, అభివృద్ధిని వికేంద్రీకరించకపోవడం, వలసలు, సాంస్కృతిక పెత్తనం లాంటివి ప్రాంతీయతత్వానికి దారితీస్తాయి.
    • జాతిపరమైన కారణాలు (ద్రవిడుల కోసం ద్రవిడస్థాన్, సిక్కుల కోసం ఖలిస్థాన్, కుకీల కోసం కుకీలాండ్) కూడా ప్రాంతీయతత్వానికి దారితీస్తాయి.
    • ఒక ప్రాంతం వారి యొక్క వనరులు దోపిడీకి గురికావడం, ఒక ప్రాంతం వారు తీవ్రంగా వెనుకబాటు తనానికి లోనవడం మరియు అంతర్గత వలసదారుల పెత్తనం కూడా ప్రాంతీయతత్వానికి దారితీస్తుంది. స్థానిక భాషలను విస్మరించినప్పుడు కూడా ప్రాంతీయతత్వానికి దారి తీస్తుంది.
    • ఒకే ప్రాంతంలో పెత్తనదారులు & స్థానికులు కలిసి నివసించడం & ఆధునికతకు మరియు భూమి పుత్రులకు మధ్య వచ్చే సంఘర్షణలు.
    • వివిధ రాష్ట్రాలకు కలిపి వనరులు ఉమ్మడిగా ఉండడం (ఉదా: నదీజలాల వివాదం) మరియు రాష్ట్రాల మధ్య సరిహద్దు వాదాలు.
    • భారత రాజకీయ నిర్మాణంలో ఏక కేంద్రక రాజ్య ప్రభావం ఉండటం కూడా ప్రాంతీయ తత్వానికి దారితీస్తుంది.
    • ప్రభుత్వ రంగ పెట్టుబడులలో ప్రాంతీయవ్యత్యాసాలు, మానవ అభివృద్ధిలో ప్రాంతీయ వ్యత్యాసాలు మరియు రాజకీయ భాగస్వామ్యంలో సమాన అవకాశాలు లేకపోవడం.
    • ఆర్థిక పంపిణీలో గల వ్యత్యాసాలు ప్రజలయందు సాపేక్ష వెనుకబాటుతనమునకు గురయ్యినట్టుగా భావనలకు గురిచేస్తాయి.


    ప్రాంతీయవాదం - లాభాలు


    • అభివృద్ధి వికేంద్రీకరణ జరిగి ప్రగతికి కారణం అవుతుంది.
    • అంబేద్కర్ అభిప్రాయం ప్రకారం చిన్న రాష్ట్రాలలోనే బలహీన వర్గాల హక్కుల సంరక్షణ విజయవంతమవుతుంది.
    • ప్రాంతం, ప్రజల మధ్య ఐకమత్యం వృద్ధి చెందుతుంది.
    • పరిపాలనలో ప్రజల భాగస్వామ్యం పెరుగుతుంది.
    • విభిన్న భాషా సంస్కృతులు సంరక్షించబడతాయి.
    • అంతర్గత వలస దోపిడీ ఉండదు.
    • ప్రాంతీయవాదంను గౌరవించడం వల్ల ప్రజల్లో జాతీయవాదం పెరుగుతుంది.
    • సమాఖ్య విధానం విజయవంతం అవడానికి సమతుల్యతతో కూడిన ప్రాంతీయ వాదాన్ని గుర్తించాలి.


    ప్రాంతీయవాదం - నష్టాలు


    • జాతీయ సమైక్యతకి భంగం కల్గించవచ్చు.
    • రాజకీయ నిరుద్యోగులు ప్రాంతీయవాదం సహాయంతో ప్రజల ఉద్వేగాలను రెచ్చగొట్టవచ్చు.
    • వలస ప్రజల్లో అభద్రతాభావం కల్గుతుంది.
    • ప్రగతికి అవరోధంగా తయారుకావచ్చు.
    • ప్రాంతీయతత్వాలు మరిన్ని పెరిగే అవకాశాలు కలవు.


    ప్రాంతీయతత్వం యొక్క రూపాలు


    ప్రాంతీయతత్వం అనేది అనేక కారణాల వల్ల సంభవించవచ్చు. ప్రాంతీయతత్వం ఏ కారణం చేత సంభవిస్తున్నది అనే అంశం ఆధారంగా ప్రాంతీయవాదాన్ని ఈ క్రింది విధంగా వర్గీకరించవచ్చు.


    1. వేర్పాటువాదం (సెషనిజం): ఇది అత్యంత ప్రమాదకరమైన ప్రాంతీయతత్వం, దీనిని ప్రాంతీయ తత్వం అనడం కంటే, దేశం నుండి విడిపోయే ప్రయత్నంగా భావించవచ్చు. మతపరమైన కారణాలు, వెనుకబాటు తనం లేదా మరే ఇతర కారణం వల్ల ఒక ప్రాంతంలోని ప్రజలు మేము దేశం నుండి విడిపోయి స్వతంత్ర దేశంగా ఉంటాము అనే వాదననే వేర్పాటు వాదం అంటారు. ఇలాంటి వేర్పాటు వాదం వల్ల అశాంతి, తీవ్రవాదం, అధికమయ్యే అవకాశం కలదు. ఏ సార్వభౌమ దేశం కూడా వేర్పాటు వాదాన్ని సహించదు. వేర్పాటు వాదమునకు ఉదాహరణలు.

    1. మిజో నేషనల్ ఫ్రంట్ (అస్సాం)

    2. నాగాలాండ్ సోషలిస్ట్ కాన్ఫరెన్స్

    3. ఆజాద్ కాశ్మీర్

    4. శ్రీలంకలో ఎల్.టి.టి.ఇ పోరాటం లాంటివి


    2. రాష్ట్రాంతర ప్రాంతీయ వాదం (సుప్రాస్టేట్ రీజియోనలిజం): ఒకటికంటే ఎక్కువ రాష్ట్రాలు ఉమ్మడిగా కేంద్రాన్ని గానీ ఇతర రాష్ట్రాలకు గానీ వ్యతిరేకంచడాన్ని రాష్ట్రాంతర ప్రాంతీయవాదం అందురు. ఫెడరల్ తరహా పాలనలో రాజకీయ కారణాల వల్ల అభివృద్ధికి నోచుకోని లేదా శీతకన్ను వేయబడిన రాష్ట్రాలు ఉమ్మడిగా తమ హక్కుల సాధన కోసం కేంద్రంతో పోరాడటం కాని లేదా ఒకే దేశంలోని వివిధ రాష్ట్రాల మధ్య అనగా ఉత్తరభారతదేశ రాష్ట్రాలు మరియు దక్షిణ భారతదేశ రాష్ట్రాల మధ్య గనక సంఘర్షణ ఉన్నట్టయితే దానిని రాష్ట్రాంతర ప్రాంతీయవాదం అంటారు. 

    ఉదా: నార్త్ ఇండియన్ స్టేట్ వర్సెస్ సౌత్ ఇండియన్ స్టేట్స్


    3. అంతర్ రాష్ట్ర ప్రాంతీయవాదం (ఇంటర్ స్టేట్ రీజియోనలిజం): ఒక రాష్ట్రం మరొక రాష్ట్రంతో వివిధ కారణాల వల్ల ఘర్షణలు పడే క్రమంలో అంతర్ రాష్ట్ర ప్రాంతీయవాదం బయటపడుతుంది. ముఖ్యంగా వనరుల విషయంలో, ప్రాజెక్టుల విషయంలో, సరిహద్దుల విషయంలో ఒక రాష్ట్రం తన యొక్క ప్రయోజనాలకు కాపాడుకునే నిమిత్తం తన పక్క రాష్ట్రాలతో నిర్మాణాత్మక ఘర్షణ వైఖరిని చూపే అవకాశం ఉంటుంది అలాంటి ఘర్షణలనే అంతర్ రాష్ట్ర ప్రాంతీయవాదం అంటారు.

    ఉదా: రాష్ట్రాల మధ్యగల నదీ జలాల వివాదాలు, ఆనకట్టలకు సంబంధించిన వివాదాలు, అంతరాష్ట్ర వలసల వివాదాలు మరియు సరిహద్దు వివాదాలు.


    గమనిక: రాష్ట్రాంతర ప్రాంతీయ వాదం నందు కొన్ని రాష్ట్రాలు మూకమ్మడిగా కేంద్రంపై గాని మరే ఇతర రాష్ట్రాల కూటమిపై గాని తమ ఘర్షణ వైఖరిని ప్రకటించడం కాని అంతరాష్ట్ర ప్రాంతీయ వాదం రాష్ట్రంతో ఘర్షణ పడడంగా గమనించాలి.


    4. అంతఃరాష్ట్ర ప్రాంతీయ వాదం (ఇంట్రా స్టేట్ రీజినలిజం): దీనినే ఉపప్రాంతీయవాదం అనికూడా అంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నందు ఒక ప్రాంతానికి సంబంధించిన వారు తెలంగాణపై చూపెట్టిన సామాజిక, రాజకీయ మరియు ఆర్థిక వలస దోపిడీ ఫలితంగా తెలంగాణ ప్రాంతంలో ఉప ప్రాంతీయ వాదం బయలుదేరింది మరియు స్వరాష్ట్ర కాంక్షను వెలిబుచ్చి నూతన రాష్ట్రాన్ని సాధించుకుంది.

    ♦ ఒకే రాష్ట్రంలోని భిన్నమైన ప్రాంతాల మధ్య అసమతుల అభివృద్ధి వలన, అంతర్గత వలస దోపిడీ వలన వెనుకబడ్డ ప్రాంతాలలో ఈ రకమైన వాదం సంభవిస్తుంది.

    ♦ భిన్న సామాజిక సంస్కృతులు కలిసిన రాష్ట్రంలో మరియు అంతర్గత వలసలు తీవ్రమైన సందర్భంలో కూడా ఈ రకమైన ప్రాంతీయ వాదాలు ఉద్భవిస్తాయి. ఉదా: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ వాదం, మహారాష్ట్రలో విధర్భావాదం.


    5. ప్రత్యేక హెూదాను కోరే వాదాలు (Demand for Special Status) : ఉదా: ఆంధ్రప్రదేశ్


    ♦ కొన్ని రాష్ట్రాలకు వాటికున్నటువంటి భౌగోళిక మరియు వనరుల పరమైన లేమి కారణంగా ప్రత్యేక హెూదాను కేంద్రం ఆపాదిస్తుంది.


    ♦ ప్రత్యేక కేటగిరి రాష్ట్రాలను 5వ ఫైనాన్స్ కమీషన్ వారు 1969వ సంవత్సరంలో ఏర్పాటు చేయాలని సూచించారు. వారి సూచనల మేరకు ఇప్పటివరకు 11 రాష్ట్రాలకు ప్రత్యేక హెూదా ఇవ్వడం జరిగింది. ప్రత్యేక హెూదాను గాద్గిల్ ఫార్ములా ఆధారంగా ఇస్తారు. గాద్గిల్ ఫార్ములా నందు ఈ క్రింది అంశాలను పేర్కొనడం జరిగింది.

    1. అధికంగా కొండ ప్రాంతాలను కలిగిఉన్న రాష్ట్రం

    2. అతి తక్కువ జనసాంద్రత మరియు అతిఎక్కువ గిరిజన జనాభాను కలిగిఉన్న రాష్ట్రాలు

    3. సరిహద్దు రాష్ట్రాలు

    4. ఆర్థికపరమైన మౌలిక సౌకర్యాలలో తీవ్రంగా వెనుకబడిన రాష్ట్రాలు

    5. సొంతగా రాష్ట్రాన్ని నిర్వహించుకునేంత ఆర్థిక వనరులు లేనటువంటి రాష్ట్రాలు


    ♦ 1969లో మొదటగా జమ్ముకాశ్మీర్, అస్సాం మరియు నాగాలాండ్ రాష్ట్రాలకు ప్రత్యేకహోదానిచ్చారు. తర్వాతి కాలంలోcహిమాచల్ ప్రదేశ్నకు, ఉత్తరాఖండనకు మరియు మిగతా ఈశాన్య రాష్ట్రాలకు ఈ హెూదానిచ్చారు.


    ♦14వ ఆర్థికసంఘం వారు ఈశాన్య రాష్ట్రాలకు మరియు 3 పర్వత రాష్ట్రాలైన హిమాచల్ ప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్ మరియు జమ్ముకాశ్మీర్లకే పరిమితం చేయాలని సూచించింది మరియు ప్రత్యేకహోదాకు బదులుగా కేంద్ర పన్నుల రాబడిలో రాష్ట్రాలవాటాను 32% నుండి 42%నికి పెంచాలని సూచించింది. ఈ సూచనను 2015 నుండి 2020 వరకు అమలుపరిచారు. ప్రస్తుతం 2021-26 కాలానికిగాను కేంద్ర పన్నుల్లో 41% వాటా ఇస్తున్నారు.


    ప్రత్యేక హెూదాను ఇవ్వడం వల్ల ఆయా రాష్ట్రాలకు మరియు ప్రాంతాలకు ఈ క్రింది ప్రయోజనాలు చేకూరుతాయి.

    1. అన్ని కేంద్ర ప్రాయోజిత సంక్షేమ కార్యక్రమాల అమలుకు కావలసిన నిధులలో 90% లభిస్తుంది.

    2. పారిశ్రామిక అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రోత్సహకాలను అందిస్తుంది.

    3. ఖర్చు చేయనటువంటి కేంద్రం అందించిన నిధులను మరుసటి సంవత్సరానికి జమచేస్తారు.


    ♦ప్రత్యేక హెూదాను పొందేందుకు ఉండవలసిన లక్షణాలు లేనప్పటికి అసంబద్ధమైన మరియు రాజకీయ ప్రేరేపితమైన కారణాలతో కొన్ని రాష్ట్రాలు సుదీర్ఘ కాలం నుండి ప్రత్యేక హెూదా కావాలని తమ యొక్క ప్రాంతీయ వాదాన్ని వినిపిస్తున్నాయి.

    ఉదా: ప్రస్తుతం బీహార్, ఒరిస్సా మరియు ఆంధ్రప్రదేశ్లు బలంగా ప్రత్యేక హెూదా కోసం తమ వాదనలు వినిపిస్తున్నాయి.


    ప్రాంతీయతత్వం - రాజ్యం తీసుకుంటున్న చర్యలు


    5 మరియు 6వ షెడ్యూల్:


    5 మరియు 6వ షెడ్యూల్ల ఏర్పాటు ద్వారా గిరిజన ప్రాంతాలలో గిరిజనుల యొక్క సంస్కృతికి, జీవనోపాధికి మరియు వారి ఆవాసానికి ఎలాంటి ఆటంకం కలిగించని రీతిలో పరిపాలనా విధానాన్ని రూపొందించింది. తద్వారా గిరిజన ప్రాంతాలలో జాతిపరమైన ప్రాంతీయవాదం రాకుండా చర్యలు చేపట్టింది. అయినా కూడా ఈశాన్య రాష్ట్రాలలో జాతిపరమైన ప్రాంతీయవాదం బలంగా కలదు.

    ఉదా: గారో తెగ గారోలాండ్ కోసం, ఖాసా తెగ ఖాసాలాండ్ కోసం, కర్బి తెగ కర్బింగ్లింగ్ కోసం, కూకీ తెగ కూకీలాండ్ కోసం మరియు ఇతర గిరిజన తెగలు కూడా ప్రతి గిరిజన తెగకు ఒక ప్రత్యేక ప్రాంతం లేదా రాష్ట్రం ఉండాలని మితవాద మరియు అతివాద పద్ధతులలో తమ వాదనలు వినిపిస్తున్నాయి.


    గమనిక: జాతి ఆధారంగా ఏర్పడిన మొట్టమొదటి రాష్ట్రం నాగాలాండ్


    ఆర్టికల్ 3


    స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో భారతదేశంలో ఎ, బి మరియు సి అనబడే కేటగిరీలకు చెందిన రాష్ట్రాలు ఉండేవి, రాజ్యాంగ నిర్మాతలు ఆరోజు ఈ యొక్క ప్రాంతీయవాదంలోని న్యాయబద్ధతను ఊహించి సులభమైన రీతిలో నూతన రాష్ట్రాల ఏర్పాటు ఉండాలని భావించి ఆర్టికల్ 3 ద్వారా సులభమైన పద్ధతిలో, పార్లమెంటులో ప్రత్యేక మెజారిటీ అవసరం లేకుండానే నూతన రాష్ట్రాల ఏర్పాటుకు అవకాశం కల్పించారు.


    ఆర్టికల్ 370 తొలగింపు


    ఆర్టికల్ 370 (3) ద్వారా సంక్రమించిన అధికారంతో కాన్సిట్యూషనల్ ఆర్డర్ని 2019లో భారత రాష్ట్రపతి వెలువరించి ఇంతకుముందు 1954 సంవత్సరంలో కాన్సిట్యూషనల్ ఆర్డర్ ద్వారా ఆర్టికల్ 370 కింద జమ్ముకాశ్మీర్ రాష్ట్రానికి ఇచ్చినటువంటి ప్రత్యేకతలను తొలగించడం జరిగింది.


    ద జమ్ము&కాశ్మీర్ రీ ఆర్గనైజేషన్ యాక్ట్ 2019 ద్వారా (9 ఆగస్టు, 2019న రాష్ట్రపతి ఆమోదం లభించింది) జమ్ముకాశ్మీర్ అనబడే శాసనసభ కలిగిన కేంద్రపాలిత ప్రాంతాన్ని మరియు లఢక్ అనబడే శాసనసభ కలిగి ఉండని కేంద్రపాలితప్రాంతాన్ని ఏర్పాటుచేయడం జరిగింది.


    ఆర్టికల్ 371 నుండి 371J



    ప్రాంతీయవాదం సంభవించే అవకాశం ఉన్న ప్రాంతాలలో దానిని అరికట్టేందుకే ఆయా ప్రాంతాలకు సంబంధించి ప్రత్యేక రక్షణలను రాజ్యాంగంలోని ఆర్టికల్ 371 నుండి 371 జె ద్వారా కల్పించడం జరిగింది.


    నదీ జలాల వివాదాల పరిష్కారం


    అంతరాష్ట్ర ప్రాంతీయవాదాలకు ప్రధానకారణం నదీ జలాల వివాదాలే ఈ వివాదాలను రాజ్యాంగ బద్ధంగా పరిష్కరించేందుకే రాజ్యాంగంలోని ఆర్టికల్ 262 ద్వారా అంతరాష్ట్ర నదీ జలాల వివాదాలకు సంబంధించి పార్లమెంట్ చర్యలు చేపడుతుంది. ఈ అధికరణం ప్రకారమే కేంద్రం క్రింద రివర్ బోర్డు యాక్ట్ - 1956 మరియు నదీ జలాల వివాదాల చట్టం - 1956 ని రూపొందించింది


    నదీజలాల వివాద చట్టం 1956ను అనుసరించి ప్రస్తుతం 8 ట్రిబ్యునల్స్ దేశవ్యాప్తంగా రాష్ట్రాల మధ్యగల నదీజలాల సమస్యలను పరిష్కరిస్తుంది.



    అయిననూ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల మధ్య ముళ్ళపెరియార్ వివాదం, ఒరిస్సా, ఛత్తీస్ఫుడ్ & ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఇందిరాసాగర్ లేదా పోలవరం వివాదం మరియు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర మధ్య బాబ్లీ వివాదం కలవు.


    ఈశాన్య ప్రాంతాల మండలి ఏర్పాటు


    • ఈశాన్య మండలి చట్టం - 1971 ప్రకారం, 1972 లో ఈశాన్య ప్రాంతాల మండలి ఏర్పడింది.
    • దీని ప్రధాన కేంద్రం - షిల్లాంగ్, 8 రాష్ట్రాలు కలవు. 
    • ఈశాన్య ప్రాంతాలలో కూడా దేశవ్యాప్తంగా జరిగే అభివృద్ధి జరగాలని ఫలితంగా ఈశాన్య రాష్ట్రాలలో ప్రాంతీయవాదం లేకుండా చేయాలని మరియు ఈశాన్య ప్రాంతాల అభివృద్ధికై ప్రత్యేక కృషి జరిపేందుకై ఈ మండలి ఏర్పడింది.


    జాతీయ అభివృద్ధి మండలి ఏర్పాటు (నేషనల్ డవలప్మెంట్ కౌన్సిల్లు)


    06-ఆగస్టు-1952న దేశంలోని అన్ని ప్రాంతాలను సమగ్రంగా, సమతుల్యతతో అభివృద్ధి చేసేందుకు జాతీయ అభివృద్ధి మండలి (ఎన్.డి.సి) ని ఏర్పాటు చేసారు.


    ప్రాంతీయ మండలుల ఏర్పాటు (జోనల్ కౌన్సిల్లు)


    రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం 1956 ప్రకారం దేశవ్యాప్తంగా 5 ప్రాంతీయ మండలాలను ఏర్పాటు చేయడం జరిగింది.

    1. ఢిల్లీ కేంద్రంగా ఉత్తర ప్రాంతీయ మండలి

    2. అలహాబాద్ కేంద్రంగా మధ్య ప్రాంతీయ మండలి

    3. కలకత్తా కేంద్రంగా తూర్పు ప్రాంతీయ మండలి

    4. బాంబే కేంద్రంగా పశ్చిమ ప్రాంతీయ మండలి

    5. చెన్నై కేంద్రంగా దక్షిణ ప్రాంతీయ మండలిని ఏర్పాటు చేశారు.


    అంతరాష్ట్ర మండలి ఏర్పాటు (ఇంటర్ స్టేట్ కౌన్సిల్)


    ఆర్టికల్ 263 (ఎ) ప్రకారం, & సర్కారియా కమీషన్ సూచనల మేరకు మే 28, 1990న ఇంటర్ స్టేట్ కౌన్సిల్ని ఏర్పాటు చేశారు. ప్రధానమంత్రి దీనికి అధ్యక్షుడు.

    ప్రాంతీయవాదం రాకుండా ఉండేందుకు కేంద్రం పై ఏర్పాట్లు చేసినప్పటికీ ప్రస్తుతం భారతదేశంలో ఈ క్రింది ప్రాంతీయ వాదాలు బలంగా వినిపిస్తున్నాయి. అవి....


    ప్రస్తుతం ఉన్న ప్రాంతీయ వాదాలు


    1. ఉత్తరప్రదేశ్ నందు బుందేల్ ఖండ్, పూర్వాంచల్, హరితప్రదేశ్ (పశ్చిమాంచల్) మరియు అవధ్ ప్రదేశ్ డిమాండ్లు కలవు.

    2. ఉత్తరప్రదేశ్లోని కొద్ది భూభాగం మరియు రాజస్థాన్లోని మరికొద్ది భూభాగం కలిసి బ్రజ్ ప్రదేశ్ ఏర్పడాలనే డిమాండ్ కలదు.

    3. బీహార్ లోని కొద్ది భూభాగం మరియు జార్ఖండ్ రాష్ట్రంలోని మరికొద్ది భూభాగం కలిసి మిథిలాంచల్ రాష్ట్రం ఏర్పాటు చేయాలనే డిమాండ్ కలదు.

    4. బీహార్ ని కొద్ది భూభాగం, ఛత్తీసడ్ ని కొద్ది భూభాగం మరియు ఉత్తరప్రదేశ్లోని మరికొద్ది భూభాగం కలిపి భోజ్పూర్ రాష్ట్రంను ఏర్పాటు చేయాలనే డిమాండు కలదు.

    5. అస్సాంలోని కొద్ది భూభాగం మరియు నాగాలాండ్ లోని కొద్ది భూభాగంను కలిపి థింసా రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనే డిమాండ్ కలదు.

    6. కర్ణాటక రాష్ట్రంలో కూర్గ్ ప్రాంతీయ వాదం బలంగా కలదు.

    7. తమిళనాడు లోని కొద్ది భూభాగం, కర్ణాటక లోని కొద్ది భూభాగం మరియు కేరళ లోని మరికొద్ది భూభాగంని కలిపి కొంగునాడు రాష్ట్రమును ఏర్పాటు చేయాలనే డిమాండ్ కలదు.

    8. కర్ణాటకలోని కొద్ది భూభాగం మరియు కేరళ లోని మరికొద్ది భూభాగంని కలిపి తుళునాడు రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనే డిమాండ్ కలదు.

    9. ఒరిస్సా లోని కొద్ది భూభాగం, జార్ఖండ్ లోని కొద్ది భూభాగం మరియు ఛత్తీస్గడ్ లోని మరికొద్ది భూభాగం కలిపి కోసల రాష్ట్రం ఏర్పాటు చేయాలనే డిమాండు కలదు.

    10. మణిపూర్ రాష్ట్రంలో కూకీ గిరిజన తెగ అధికంగా నివసించే ప్రాంతం నందు కూకీలాండ్ రాష్ట్రం ఏర్పాటు చేయాలనే డిమాండు కలదు.

    11. మేఘాలయా రాష్ట్రంలో గారో గిరిజన తెగ అధికంగా నివసించే ప్రాంతం నందు గారోలాండ్ రాష్ట్రం ఏర్పాటు చేయాలనే డిమాండు కలదు.

    12. మహారాష్ట్ర యొక్క తూర్పు భాగంలో ఉన్నటువంటి ప్రాంతమైన విదర్భ కరువు కాటకాల వల్ల తీవ్రంగా వెనుకబడింది మరియు వ్యవసాయ రంగం కుదేలవడం వల్ల దేశంలో రైతుల ఆత్మహత్యలు అధికంగా ఈ ప్రాంతంనందే జరుగుతున్నవి. ఈ తీవ్రమైన వెనుకబాటు దృష్ట్యా విదర్భా రాష్ట్రం ఏర్పాటు చేయాలనే డిమాండు కలదు.

    13. గుజరాత్ రాష్ట్రం నందు గల సౌరాష్ట్ర ప్రాంతంలో సౌరాష్ట్ర రాష్ట్రం ఏర్పాటు చేయాలనే డిమాండు కలదు.

    14. మహారాష్ట్ర మరియు గోవాలకు సంబంధించిన భూభాగాను కలిపి కొంకణి రాష్ట్రం ఏర్పాటు చేయాలనే డిమాండు కలదు.

    15. పశ్చిమబెంగాల్ రాష్ట్రం నందు తీవ్రంగా వెనుకబడిన మరియు సాంస్కృతిక ప్రత్యేకతలు కలిగి ఉన్న గూర్ఖాలు నివసించే ప్రాంతమైన గుర్ఖాలాండ్ని ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలనే డిమాండు కలదు.

    16. అస్సాం రాష్ట్రంలో బోడో గిరిజన తెగ అధికంగా నివసించే ప్రాంతంలో తమకోసం ప్రత్యేక రాష్ట్రమైన బోడోలాండ్ కావాలని ప్రస్తుతం ఉద్యమం చేస్తున్నారు.

    17. అస్సాం రాష్ట్రంలో కర్బీ గిరిజన తెగ అధికంగా నివసించే ప్రాంతంలో కర్బీ అంగ్లాంగ్ రాష్ట్రం ఏర్పాటు చేయాలనే డిమాండు కలదు.


    ఈశాన్య ప్రాంతాల్లో - ప్రాంతీయ అస్థిరతకు కారణం అవుతున్న సంస్థలు


    ఈశాన్య రాష్ట్రాలు చైనా, బర్మా, నేపాల్, బంగ్లాదేశ్ మరియు భూటాన్ సరిహద్దులలో ఉండటం, దట్టమైన అటవీ ప్రాంతాలుండటం, అక్రమ వలసలు, ఆ ప్రాంతంలో తీవ్రమైన జాతిపరమైన వైవిధ్యాలు మరియు వైరుధ్యాలుండటం, ప్రధాన భారత భూభాగానికి దూరంగా ఉండటం మరియు సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడి ఉండటం లాంటి కారణాల వల్ల ప్రజలలో చెలరేగిన అసంతృప్తి జాతిపరమైన ప్రాంతీయవాదంగా రూపాంతరం చెందుతున్నది, అందువల్లనే జాతుల మధ్య సంఘర్షణలు, ప్రత్యేక రాష్ట్రం కోసం సంఘర్షణలు మరియు వేర్పాటు వాదానికి సంబంధించిన సంఘర్షణలు కన్పిస్తున్నవి మరియు అందులో కొన్ని అతివాద లేదా హింసా మార్గంలో పయణిస్తున్నవి. అందువలన ఈశాన్య ప్రాంతాలలో నిరంతరం అస్థిరత చోటుచేసుకుంటున్నది. ఈ అస్థిరతకు కారణమవుతున్న సంస్థలు.....


    1. త్రిపుర రాష్ట్రం నందు                   1. All Tripura Tigers Force (ATTF)

                                                                2. National Liberation Front of Tripura (NLFT)

    2. మిజోరాం రాష్ట్రం నందు              1. Mijo National Front (MNF)

    3. మేఘాలయ రాష్ట్రం నందు          1. Achik National Valunters Council (ANVC)

                                                                2. Garo National Liberation Army (GNLA)

    4. మణిపూర్ రాష్ట్రం నందు              1. United Peoples Front (UPF)

                                                                2. Kuki National Organization (KNO)

    5. నాగాలాండ్ రాష్ట్రం నందు           1. National Socialist Council of Nagaland (NSCN)

                                                                2. Eastern Naga People Organisation (ENPO)

    6. అస్సాం రాష్ట్రం నందు                 1. United Liberation front of Assam (ULFA)

                                                                 2. Kabi People Liberation Tigers (KPLT)

                                                                 3. National Democratic Front of Bodoland (NDFB)

    ♦ఈశాన్య రాష్ట్రాలలోని అశాంతికి ప్రధాన కారణం ఈ 8 రాష్ట్రాలలో గల సుమారు 200 తెగల మధ్య గల సంఘర్షణలు.


    పునశ్చరణ


    • ప్రాంతం అనే భావననందు 3 ముఖ్యమైన అంశాలు అంతర్లీనంగా ఉంటాయని బెర్కి మరియు హస్కిన్లు తెలిపారు.
    • అన్యాయానికి గురైన లేదా వెనుకబాటు తనానికి గురైన లేదా వలసదోపిడీకి గురైన ఒక ప్రాంతం ప్రజలు ఉమ్మడిగా తమ ప్రాంత ఆకాంక్షలను వెలువరించడాన్నే ప్రాంతీయ తత్వం అని భావించవచ్చు.
    • చిన్న రాష్ట్రాలలోనే బలహీన వర్గాల హక్కుల సంరక్షణ మెరుగ్గా ఉంటుందని బి.ఆర్. అంబేద్కర్ అభిప్రాయపడ్డారు.
    • ప్రత్యేకదేశం కావాలనే ప్రమాదకరమైన ప్రాంతీయతత్వాన్నే వేర్పాటు వాదం అంటారు.
    • ఒక రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల మధ్య గల వాదాలనే అంతఃరాష్ట్ర ప్రాంతీయతత్త్వం అని పిలుస్తారు.
    • జాతి ఆధారంగా ఏర్పడిన మొదటి రాష్ట్రం నాగాలాండ్.
    • ఆర్టికల్ 3 ద్వారా సాధారణ పద్ధతిలోనే పార్లమెంట్ నూతన రాష్ట్రాలను ఏర్పాటు చేయడం లేదా రాష్ట్రాలను కలపడం లేదా పేర్లను మార్చడం కూడా చేయవచ్చు.
    • జమ్ముకాశ్మీర్కి ప్రత్యేక ప్రతిపత్తిని ఇచ్చిన ఆర్టికల్ 370 ని 2019వ సంవత్సరంలో జమ్ముకాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా తొలగించడం జరిగింది.
    • అధికరణం 262 ద్వారా అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలను పరిష్కరించేందుకై పార్లమెంట్ చర్యలు చేపడుతుంది.
    • 1972లో ఈశాన్య ప్రాంత మండలి ఏర్పడింది.
    • 1990లో అంతర్రాష్ట్ర మండలి ఏర్పడింది.


Tags: Caste system, gender roles, joint families, arranged marriages, diversity, cultural festivals, social hierarchy, economic disparities, religious practices, education system, urbanization, rural traditions, globalization, modernization


No comments:

Post a Comment

Post Bottom Ad