1.3 - భారతీయ సామాజిక నిర్మితి - లక్షణాలు - GNANA SAMHITHA

GNANA SAMHITHA

DONT WORRY!!! WE HELP YOU TO REACH YOUR GOAL 😊

Breaking

Post Top Ad

Tuesday, July 4, 2023

1.3 - భారతీయ సామాజిక నిర్మితి - లక్షణాలు

1.3 భారతీయ సామాజిక నిర్మితి - లక్షణాలు


ప్రపంచంలోని మిగతా సమాజాల కంటే భారతీయ సమాజం విశిష్టమైనది, భారతీయ సమాజం యొక్క ప్రధాన లక్షణం భిన్నత్వం మరియు భిన్నత్వంలో ఏకత్వం, ఈ లక్షణమే భారతీయ సమాజంను ప్రపంచంలో ప్రత్యేక స్థానం నందు నిలబెట్టింది. భారతీయ సమాజం యొక్క ప్రత్యేక లక్షణాలకు చారిత్రక, భౌగోళిక, సామాజిక మరియు సాంస్కృతిక కారణాలు దోహదపడినవి.


భారతీయ సమాజం నందు వివిధ రకాలైన ప్రత్యేక సామాజిక సంస్థలు, ఏ సమాజం నందు కనపడని సామాజిక స్థిరీకరణ రూపం మరియు సంస్కృతిక జీవన విధానాలు కలవు. వీటియొక్క నిర్మాణం మొత్తంనే భారతీయ సామాజిక నిర్మితిగా పేర్కొంటారు.


భారతీయ సమాజం అతిపురాతనమైనది మరియు సంక్లిష్టమైనది, ఈ సమాజంనకు సుమారు 7 వేల సంవత్సరాల చారిత్రక నేపథ్యం కలదు మరియు కొన్ని వేల సంవత్సరాలకు పైగా పౌరాణిక చారిత్రక నేపథ్యం కలదు.


ప్రస్తుతం భారత్ లేదా ఇండియాగా పిలవబడుతున్న మనదేశంను పూర్వం భరతవర్షం, భరతఖండం మరియు జంబూద్వీపం గా వ్యవహరించేవారు. భరతుడు పాలించిన దేశం కావున భరత వర్షం అనే పేరు వచ్చింది అనే అభిప్రాయం కలదు. ఈ యొక్క భరతవర్షాన్నే బ్రిటీష్ వారు ఇండియాగా మరియు ముస్లిం పాలకులు హిందూస్థాన్గా పిలవడం జరిగింది.


భారత రాజ్యాంగం నందు గల 1వ అధికరణ ప్రకారం మనదేశం యొక్క పేరు ఇండియా దట్ ఈజ్ భారత్.


భారతదేశాన్ని సందర్శించిన మెగస్తనీస్ భారతీయ సమాజం 7 వర్గాలుగా విభజించబడిందని పేర్కొన్నాడు. అవి...

1. తత్వవేత్తలు: పవిత్ర సంస్కారాలు నిర్వహించేవారు మరియు యజ్ఞయాగాదులు చేసేవారు.

2. గృహ యజమానులు: సాధారణ పౌరులు

3. పశుపాలకులు మరియు వేటగాళ్ళు

4. వ్యాపారస్థులు మరియు శారీరక శ్రమ చేసేవాళ్ళు

5. యుద్ధం చేసేవారు లేదా సైనికులు

6. తనిఖీ దారులు

7. మంత్రులు మరియు రాజు యొక్క సలహాదారులు


ద్యుర్టే బార్బోసా అనే పోర్చుగీసు యాత్రికుడు కూడా భారతీయ సమాజపు సాంస్కృతిక లక్షణాలపై అధ్యయనం చేసినాడు. భారతీయ సమాజం తీవ్రమైన వైవిధ్యాన్ని కలిగి ఉంది. వివిధ రకాల స్థాయిలకు చెందిన సామాజిక పరిణామాలు మన సమాజంలో ఒకే కాలంలో కానవస్తాయి. (ఆదిమ జాతులు, ఆహార సేకరణ సమూహాలు, విస్తాపన వ్యవసాయ సమూహాలు, సాధారణ వ్యవసాయ సమూహాలు, చేతివృత్తుల సమూదాయాలు, భూస్వాములు, పారిశ్రామిక వేత్తలు, నిరుపేదలు, నిలువనీడలేని వారు మరియు అధిక ధనవంతులు ఇలా వివిధ రకాల భిన్న లక్షణాలు, సంస్కృతులు, ఆదాయ వనరులు మరియు శారీరక నిర్మాణ వైవిధ్యాలు గల వివిధ సమూహాలు ఒక భారతీయ సమాజంలోనే కనిపిస్తాయి). ఇన్ని వైవిద్యాలు మరియు వైరుధ్యాలు ఉన్నప్పటికి భారతీయులంతా ఒకే సమాజంగా వ్యవహరించుటకు కారణం మనమంతా భారతీయులం అనే భావనను కలిగి ఉండటమే.


భారతీయ సమాజం యొక్క నిర్మితి లక్షణాలను ఈ క్రింది విధంగా పేర్కొనవచ్చు. అవి...

  • భిన్నత్వం (Diversity)
  • ఏకత్వం (Unity)
  • భిన్నత్వంలో ఏకత్వం (Unity in Diversity)
  • కుల రూప సామాజిక స్థిరీకరణ (Caste based Social Stratification)
  • గ్రామీణ సామాజిక నిర్మాణం (Rural Social Structure)
  • ఉమ్మడి కుటుంబ వ్యవస్థ (Traditional Joint Family System)
  • జజ్మానీ వ్యవస్థ (Jajmani System)
  • హిందూ సామాజిక నిర్మాణం (Hindu Social Organization)
  • గిరిజనులు (Tribals)
  • మైనారిటీ వర్గాల ప్రత్యేక సామాజిక వ్యవస్థీకరణ (Minority Social Organization)
  • పితృస్వామ్య సమాజం (Patriarchal Society)


1. భిన్నత్వం (Diversity)


సాధారణ అర్థంలో భిన్నత్వం అనగా ఒకే కాలమాన పరిస్థితుల యందు సమాజం నందు భిన్న రూపమైన సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక మరియు రాజీకయపరమైన భేదాలతో కూడిన స్వరూపాలు ఆయా సమాజం నందు గోచరించడంగా అర్థం చేసుకోవచ్చు.


భిన్నత్వం అనగా వ్యక్తుల మధ్య భిన్నత్వం అని అర్థం కాదు. సమాజంలో నివసిస్తున్న వివిధ సమూహాల మధ్య కన్పించే మరియు వారివారి జీవన రీతులలో ఉమ్మడిగా గోచరించే భేదాలు (Collective Differences).


సమాజంలో ఇలాంటి వైవిధ్యాలకు మరియు భిన్నత్వంనకు ప్రధాన కారణంగా వివిధ రూపాలలో ఉన్న బహుళత్వంను పేర్కొనవచ్చు. భారతీయ సమాజం నందు మతపరమైన బహుళత్వం, సాంస్కృతిక బహుళత్వం, భాషాపరమైన బహుళత్వం, జాతిపరమైన బహుళత్వం, ఆవాసపరమైన బహుళత్వం లాంటివి భిన్నత్వంనకు దోహదపడినవి.


నోట్: బహుళత్వం అనగా ఒక ప్రాంతం నందు ఒక కాలం నందు వివిధ రూపాలలో జీవన విధానాలుండటం


భారతీయ సమాజంలో విభిన్న జాతులు, భాషలు, సాంస్కృతిక మూలాలు గల ప్రజలు నివసిస్తున్నారు అందువలన ప్రజలయందు భిన్న సామాజిక, సాంఘిక మరియు ఆచార వ్యవహారాలు కన్పిస్తాయి.


భారతదేశం విశాలమైన భూభాగం కావున ఇది వివిధ రేఖాంశాలు మరియు వివిధ అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది, ఆయా విస్తరణకు అనుకూలంగా భిన్నమైన శీతోష్ణస్థితి పరిస్థితులు మరియు ఆయా పరిస్థితులకు అనుకూలమైన జీవన విధానాలు కలవు.


ఉదా: మైదాన జీవన విధానాలు, తీర ప్రాంత జీవన విధానాలు మరియు ఎడారి ప్రాంత జీవన విధానాలు.


వివిధ రకాల సంస్కృతులు, మతాలకు సంబంధించిన మానవ సమూహాలు భారతదేశంనకు వలసల రూపంలో మరియు సామ్రాజ్యాలను స్థాపించడం వలన ఇక్కడ స్థిరపడినారు. అందువల్ల ఆయా సంస్కృతుల రీతులు భారతదేశంనకు భిన్నత్వంను ఆపాదించినవి.


ఉదా: గ్రీకులు, బ్యాక్టీయన్లు, పహ్లవులు, శకులు, టర్కులు, అరబ్బులు మరియు ఆంగ్లేయులు ఇక్కడ స్థిరపడి సమాజంలో భాగమైనందున భిన్నత్వంనకు దారితీసింది.


భారతదేశంలో భిన్నత్వం అనునది సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక, మతపరమైన మరియు జాతిపరమైన దృగ్విషియాల యందు గోచరిస్తుంది. ఈ నేల యొక్క భిన్నత్వం, ఈ నేల యందు గల భిన్నమైన జాతులు, మతాలు, కులాలు, తెగలు, భాషలు మరియు మాండలికాలు, సామాజిక రీతులు, సాంస్కృతిక మరియు ఉపసాంస్కృతిక నమ్మకాలు, రాజకీయ తత్త్వాలు మరియు చింతనా ధోరణులు... ఇలా వివిధ రూపాలలో కొనసాగుతూ ఈ నేల యందు భిన్నత్వాన్ని చాటుతున్నవి.


పైన తెలిపిన భిన్నత్వాలకు తోడుగా ప్రజల ఆవాసం ఆధారంగా భారతీయ సమాజంలో గ్రామీణ సముదాయం, పట్టణ సముదాయం, గిరిజన సముదాయం, సంచార సముదాయాలు, అర్థ సంచార సముదాయాలు లాంటి వాటితో కూడిన సాముదాయిక నివాస భిన్నత్వం కలదు.


భారతదేశ సమాజం నందు ప్రముఖంగా కానవచ్చే భిన్నత్వ రూపాలు (Forms of Diversity in India)

1. జాతిపరమైన వైవిధ్యం లేదా భిన్నత్వం (Racial Diversity)

2. మతపరమైన భిన్నత్వం (Religious Diversity)

3. సాంస్కృతిక పరమైన భిన్నత్వం (Culutral Diversity)

4. భౌగోళిక పరమైన భిన్నత్వం (Geographical Diversity)

5. వృత్తిపరమైన భిన్నత్వం (Occupational Diversity)

6. ఆవాస పరమైన భిన్నత్వం (Habitational Diversity)

7. ఆర్థికపరమైన భిన్నత్వం (Ecnomical Diversity)

8. కులపరమైన భిన్నత్వం (Caste Diversity)

9. భాషాపరమైన భిన్నత్వం (Linguistics Diversity)


1. జాతిపరమైన వైవిధ్యం లేదా భిన్నత్వం (Racial Diversity):

భారతదేశంను భిన్న జాతుల ప్రదర్శనశాలగా (Ethnological Museum) వి.ఎ. స్మిత్ గారు అభివర్ణించారు, ఎందుకంటే ఉత్తరం నుండి దక్షిణం వరకు మరియు పడమర నుండి తూర్పు వరకు వివిధ రకాల జాతులకు సంబంధించిన జన సమూహాలను మనం గమనించవచ్చు. అందువల్లనే భారతీయులందరి శరీర నిర్మాణం, శరీరఛాయ మరియు అవయవాల అమరికల యందు స్పష్టమైన తేడాలను మనం గమనించవచ్చు. ఇందుకు గల కారణం విశాలమైన మరియు వనరుల పరంగా సుసంపన్నమైన భరత ఖండం ప్రపంచం నందు గల వివిధ జాతులను ఆకర్షించింది. భారతదేశంపై వివిధ ప్రాంతాలకు చెందిన మరియు వివిధ జాతి మూలాలకు సంబంధించిన చక్రవర్తులు దండెత్తి ఇక్కడ స్థిరనివాసాలు ఏర్పరచుకోవడం వలన కూడా ఆయా జాతులు భారతదేశం నందు స్థిరపడటం వల్ల భారతదేశం నందు జాతిపరమైన భిన్నత్వం ఏర్పడింది.


సాధారణ పరిభాషలో ఒకేరకమైన జన్యుపరమైన లక్షణాల ఫలితంగా సంతరించుకున్న ఒకేరకమైన శారీరక నిర్మాణం కలిగియున్న జనసమూహంనే జాతి (Race) అని అంటారు. ఇలాంటి వివిధ జాతులు కాలక్రమంలో భారతదేశంలోకి ప్రశేశించి మరలా వెనక్కి వెళ్ళలేదు (ఆంగ్లేయులు తప్ప) ఫలితంగా భారతీయ సమాజం భిన్న జాతుల కలయికను తనలో ఇముడ్చుకుంది. 


సామాజిక శాస్త్రాల పరిభాషలో జాతి అనగా.....

  • వారసత్వం ఆధారంగా చేసుకొని కొన్ని ప్రత్యేక శరీర లక్షణాలను కలిగియున్న మానవ సమూహాలను జాతి అందురు - రేమండ్ ఫర్త్
  • ప్రత్యేక వారసత్వం మరియు జైవిక లక్షణాల ఆధారంగా ఏర్పడిన అతిపెద్దదైన మానవ సమూహాన్నే జాతి అందురు - ఎ.డబ్ల్యు. గ్రీన్
  • జైవిక లేదా భాషా లేదా మత ప్రాతిపదికన ప్రజా సమూహంను తెలిపేదే జాతి అనే భావన -  యం.ఎన్. శ్రీనివాస్


పైన తెలిపిన నిర్వచనాలను బట్టి జాతి అనునది వారసత్వ, శారీరక, భాషా మరియు మత ప్రాతిపదికన ఏర్పడినటువంటి మానవ సమూహంగా అర్థం చేసుకోవచ్చు.


బ్లూమెన్ బాచ్ అనునతడు మానవుల రంగు మరియు శారీరక ధారుఢ్యాలను ఆధారంగా చేసుకొని మానవ జాతులను 5 రకాలుగా వర్గీకరించారు. అవి...

1. ఎరుపు రంగు జాతి                       2. శ్వేత జాతి

3. నల్లజాతి                                        4. పసుపుజాతి

5. గోధుమ వర్ణపు జాతి


భౌతిక లక్షణాలు మరియు శరీర నిర్మాణం ఆధారంగా స్థూలంగా వర్గీకరించినప్పుడు

1. నీగ్రాయిడ్ జాతి (నలుపు వర్ణం)

2. మంగోలాయిడ్ జాతి (పసుపు వర్ణం)

3. కాకసాయిడ్ జాతి (తెలుపు వర్ణం) రూపంలో జాతులు కనిపిస్తాయి.


భారతదేశ జనాభాను మొట్టమొదటి సారిగా సర్ర్బర్ట్ రిస్లే గారు తన గ్రంథం 'ద పీపుల్ ఆఫ్ ఇండియా' శాస్త్రీయపద్ధతిలో జాతులుగా వర్గీకరించారు. అవి....

1. టర్కో ఇరానియన్లు      2. ఇండో ఆర్యన్లు       3. సైథో ద్రవిడియన్లు

4. ఆర్యో ద్రవిడియన్లు      5. మంగోల్ ద్రవిడియన్లు   6. మంగోలాయిడ్లు

7. ద్రవిడియన్లు.....


ఈ జాతులను స్థూలంగా 1. ఇండో ఆర్యన్లు 2. మంగోలియన్లు 3. ద్రవిడియన్లుగా తెలుపవచ్చు.


పై వర్గీకరణ యందు మంగోలియన్లు మరియు ద్రవిడియన్ల యందు గిరిజన సముదాయాలు అధికంగా మిళితమైనవి. రుగ్గరి అనునతడి అభిప్రాయం ప్రకారం భారతీయ సమాజం 6 రకాల జాతులతో నిర్మితమైనది. అవి...

1. నీగ్రిటోలు        2. ప్రీ ద్రవిడియన్లు (వీరినే ఆస్ట్రలాయిడ్లు లేదా వెడ్డాయిడ్లు అందురు)

3. ద్రవిడియన్లు  4. డొలిసెఫాలిక్లు

5. డోలి సెఫాలిక్ ఆర్యన్లు

6. ఆర్మినో పామిరియన్లు

ఇక్ స్టడ్ అనునతడు భారతదేశం నందు 4 రకాల జాతులున్నాయని తెలిపాడు. అవి...

1. వెడ్డిడ్లు 2. మెలనీడ్లు 3. ఇండిడ్లు 4. పేలియో మంగోలాయిడ్లు


బి.ఎస్.గుహ అనునతడు 1931 జనాభా లెక్కలను ఆధారంగా చేసుకొని భారతదేశం నందు 6 రకాల ప్రధాన జాతులు కలవని తెలిపారు.

1. నీగ్రిటోలు

2. ప్రోటో ఆస్ట్రలాయిడ్లు

3. మంగోలాయిడ్లు: ఇందులో గల రెండు ఉపజాతులు.

ఎ. పేలియో మంగోలాయిడ్లు      బి. టిబెట్ మంగోలాయిడ్లు

4. మెడిటేరియన్లు లేదా ద్రవిడియన్లు: ఇందులో గల మూడు ఉపజాతులు.

ఎ. పేలియో మెడిటేరియన్లు      బి. మెడిటేరియన్లు     సి. ఓరియంట్లు

5. వెస్ట్రన్స్ బ్రాకి సెఫల్స్: ఇందులో గల మూడు ఉపజాతులు

ఎ. ఆన్సినాయిడ్లు                        బి. డైనరిక్లు                 సి. ఆర్మినాయిడ్లు

6. నార్డిక్లు లేదా ఇండో ఆర్యన్లు


నలుపురంగు, దళసరి పెదాలు కలిగియున్న నీగ్రిటోలే భారతదేశం నందు స్థిరపడిన మొదటి జాతి అని అభిప్రాయం కలదు. కావున భారతీయ సామాజిక నిర్మాణం నందు గల మొదటి పురాతన జాతి నీగ్రిటోలు. వీరు దక్షిణ భారతదేశంలోని కడారులు, ఇరులాలు, పులియన్లు, అండమానీస్ గిరిజన తెగలు లాంటి రూపాలలో ప్రస్తుతం కూడా కనిపిస్తున్నారు. వీరు ఆఫ్రికా నుండి ఇరాన్ మీదుగా భారతదేశంలోకి చేరుకున్నారనే వాదన కలదు.


పశ్చిమ ఆసియా ప్రాంతాల నుండి వచ్చి స్థిరపడిన వారు ప్రోటోఆస్ట్రలాయిడ్స్ వీరు గోధుమ రంగును కలిగియుండి, దట్టమైన శిరోజాలు, వెడల్పాటి ముక్కు మరియు చిన్న గడ్డంతో ఉంటారు. ఉదా: సంతాలులు, ముండారీలు, లక్కాకోలులు, కొరవలు, గదబలు మరియు హెూలు. వీరే భారతదేశం నందు మొదటగా వ్యవసాయం ప్రారంభించాలనే వాదన కలదు.


భారతదేశ ఈశాన్య ప్రాంతాలలో స్థిరపడిన వారే మంగోలాయిడ్ జాతి వారు. ఉదా: అస్సాం, నాగాలాండ్, త్రిపుర, సిక్కిం లాంటి రాష్ట్రాలలో నివసిస్తున్న వారే.


మెడిటేరియన్లలో ఒక భాగమైన వారు ద్రవిడియన్లు వీరు ఆర్యులకు పూర్వమే స్థిర నివాసం మరియు నాగరికతను ఏర్పరిచినారు. వీరు మాట్లాడిన భాషయైన ద్రవిడ భాష పేరు మీద వీరికి ద్రావిడులు అనే పేరు వచ్చింది, వీరు దక్షిణ భారతదేశం అంతా వ్యాపించి ఉన్నారు. వీరు ఆర్యులచేత దస్యులు అని పిలువబడినారు.


భారతదేశ జనాభాలో అత్యల్ప సంఖ్యలో నివసిస్తున్న జాతి బ్రాకిసెఫల్స్, వీరు అండమాన్ ప్రాంతంలో నివసిస్తున్నారు. భారతదేశానికి మొదటగా వచ్చిన జాతి నీగ్రిటోలు మరియు చివరగా వచ్చి స్థిరపడిన వారు మంగోలాయిడ్లు. భారతదేశంలో అధిక సంఖ్యలో ఉన్నటువంటి జాతి - ఇండో ఆర్యన్లు (ఉత్తర భారతదేశమంతా విస్తరించి ఉన్నారు) మరియు 2వ స్థానంలో ఉన్నవారు -ద్రవిడియన్లు (దక్షిణ భారతదేశంలో విస్తరించారు).


భారతదేశం నందు స్థిరపడిన ఇండో ఆర్యన్లు నార్డిక్ జాతికి చెందినవారు. వీరు ఇక్కడ నాగరికతను ఏర్పరచి భారతదేశం నందు భాగమైనారు. వీరి రాకతోనే భారతీయ నాగరికతలో, సంస్కృతిలో విపరీతమైన మార్పులు జరిగినవి. వీరి సంస్కృతే హిందూ సంస్కృతికి మూలమైనది.


ఇలా భిన్నమైన జాతులు వివిధ ప్రాంతాల నుండి భారతదేశంను చేరుకొని ఇక్కడ స్థిరపడటం వల్ల జాతి పరమైన వైవిధ్యం సంతరించుకున్నది.


2. మతపరమైన భిన్నత్వం (Religious Diversity):


మానవుని యొక్క సామాజిక, మానసిక మరియు వైయుక్తిక ప్రవర్తనను తీవ్రతి తీవ్రంగా ప్రభావితం చేసేది మతం అందుకే మతంను కారల్ మార్క్స్ అనునతడు మత్తు మందు లాంటిదని తెలిపాడు.


ప్రతి సమాజం నందు ప్రజల యొక్క జీవన విధానం, సంస్కృతి, నాగరికత, అలవాట్లు, కట్టుబాట్లు మరియు ఆచార సాంప్రదాయాలు మతంచేత నిర్దేశించబడి మరియు అమలు చేయబడతాయి.


భారతీయ సమాజం విభిన్న మత సంస్కృతులకు నిలయం అందువల్లనే భారతదేశంను మతాలకు ప్రయోగశాల (ల్యాబ్ ఆఫ్ రిలిజియన్స్)గా పరిగణిస్తారు. ప్రస్తుతం అనుసరిస్తున్న మతాలలో అత్యంత పురాతన మతమైన హిందూమతం మరియు అత్యంత అధునాతన మతమైన సిక్కుమతం భారతదేశంలోనే ఉద్భవించినవి. వీటితో పాటు జైనం, బౌద్ధం, చార్వాక, అజీవక లాంటి ఇతర మతరూపాలు కూడా భారతదేశంలోనే జనించినవి.


భారతదేశం నందు భిన్న సంస్కృతులకు మరియు సాంప్రదాయ రీతులకు ప్రధాన కారణం సమాజం నందు వివిధ మతరూపాలు ఆచరించబడడమే. అధిక సంఖ్యాకులు హిందూ మతంను అనుసరిస్తున్నప్పటికి వీరితో పాటు ముస్లింలు, క్రిస్టియన్లు, జైనులు, బౌద్ధులు, పారశీకులు, సిక్కులు కూడా భారతదేశం నందు కలరు. ఆయా మతాల వారీగా జనాభా వివరాలు క్రింద తెలపబడినవి.


మత జనాభా వివరాలు: (2011 జనాభా లెక్కల ప్రకారం)

1. హిందువులు - 96.62 కోట్లు, మొత్తం జనాభాలో 79.8%

2. ముస్లింలు - 17.22 కోట్లు, మొత్తం జనాభాలో 14.23%

3. క్రిస్టియన్లు - 2.78 కోట్లు, మొత్తం జనాభాలో 2.30%

4. సిక్కులు - 2.08 కోట్లు, మొత్తం జనాభాలో 1.7%

5. బౌద్ధులు - 0.84 కోట్లు, మొత్తం జనాభాలో 0.7%

6. జైనులు- 0.45 కోట్లు, మొత్తం జనాభాలో 0.37%


ఇటువంటి మతపరమైన భిన్నత్వం సమాజంపై రుణాత్మకంగాను మరియు ధనాత్మకంగాను ప్రభావం చూపెడుతున్నది. మత సంఘర్షణలు, మైనారిటి ఓటుబ్యాంకు రాజకీయాలు, సాంస్కృతిక ఆధిపత్యం మరియు మతపరమైన తీవ్రవాదం లాంటివి రుణాత్మకమైన ప్రభావాలుగా కనిపిస్తున్నాయి. జాతీయ భావం, జాతీయ పతాకం, లౌకిక విధానం, రాజ్యాంగ పరమైన రక్షణలు ఉండటం వల్ల ఆయా వైవిధ్యాల మధ్య ఏకత్వంనకు దారితీస్తున్నది.


మతాల మధ్య భిన్నత్వంతో పాటుగా భారతదేశం నందు గల ప్రతి మతంలో కూడా వివిధ భిన్నత్వాలతో కూడిన ఉప శాఖలు కలవు. ఉదాహరణకు....

1. హిందూమతం నందు శైవం, వైష్ణవం, పంచాయతనం లాంటి రూపాలు కలవు.

2. జైనం నందు శ్వేతాబరం మరియు దిగంబరం లాంటి శాఖలు కలవు.

3. బౌద్ధం నందు మహాయానం, హీనాయానం మరియు వజ్రాయానం లాంటి శాఖలు కలవు.

4. సిక్కుల యందు నాల్దరి మరియు నిరాకరి వ్యవస్థలు కలవు.

5. ఇస్లాం నందు షియాలు మరియు సున్నిలు అనే ప్రధాన శాఖలు కలవు.


నోట్: మతంనకు సంబంధించిన పూర్తి వివరాలు మతం అనే ఛాప్టర్లో పొందుపర్చడం జరిగింది.


3. సాంస్కృతిక పరమైన భిన్నత్వం (Culutral Diversity)


భారత సమాజం భిన్న సంస్కృతుల సమ్మేళనం. భారతదేశం నందు విభిన్న మతాలుండటం, విభిన్న కులాలుండటం, విభిన్న భౌగోళిక ప్రాంతాలుండటం, విభిన్న వృత్తులుండటం మరియు విభిన్న ఆవాస ప్రాంతాలు లాంటివి ఉండటం అనునవి సాంస్కృతిక పరమైన భిన్నత్వానికి దారితీసినది.


దేశం నందు ఆయా ప్రాంతాలు, మతాలననుసరించి మరియు ఉత్తర, దక్షిణ, తూర్పు మరియు పడమర ప్రాంతాల యందు వివిధ రకాల సాంప్రదాయాల అనుసరణ ఆయా సామాజిక రూపాలైన బంధుత్వం, వివాహం, పండుగలు, ఆహారపు అలవాట్లు మరియు వేశధారణ రూపాలలో గోచరమవుతుంది.


భారతదేశంలో 5 ప్రధాన సాంస్కృతిక సమూహాలు కానవస్తాయి. అవి..

1. ఉత్తర భారతదేశ సంస్కృతి

2. దక్షిణ భారతదేశ సంస్కృతి

3. తూర్పుభారతదేశ సంస్కృతి

4. పశ్చిమ భారతదేశ సంస్కృతి

5. గిరిజన తెగల సంస్కృతి మరియు వీటితో పాటు ప్రతిరాష్ట్రం తనదైన ప్రత్యేక సంస్కృతిని కలిగి ఉంది. మతపరమైన ప్రత్యేక సంస్కృతి కూడా దేశంలో వివిధ ప్రాంతాలలో కన్పిస్తుంది.


4. భౌగోళిక పరమైన భిన్నత్వం (Geographical Diversity)


భారతదేశం 32,87,263 చ.కి.మీ ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. భారతదేశం ఉత్తరార్ధ గోళం నందు 84 నుండి 37°6′ ఉత్తర అక్షాంశాల మధ్య సుమారు 30° మేర వ్యాపించి ఉంది మరియు రేఖాంశాల పరంగా పూర్వార్థ గోళంలో 68°7' ల తూర్పు రేఖాంశాల నుండి 97°25' తూర్పురేఖాంశాల మధ్య సువిశాలమైన ప్రాంతాల మధ్య విస్తరించి ఉంది కావున భౌగోళిక పరమైన భిన్నత్వం ఏర్పడింది. అందువల్లనే ఎడారి ప్రాంతాలు, మైదాన ప్రాంతాలు, తీర ప్రాంతాలు, వర్షాభావ ప్రాంతాలు, దట్టమైన అటవీ ప్రాంతాలు, పర్వతాలు, పీఠభూములు, లోయలు మరియు మడ అడవులు లాంటి భిన్నమైన భౌగోళిక పరిస్థితులు కలవు. అందువల్లనే ఆయా భిన్నమైన భౌగోళిక పరిస్థితులలో నివసించే ప్రజలు భిన్నమైన జీవన విధానాలు మరియు సంస్కృతులను కలిగియున్నారు.


5. వృత్తిపరమైన భిన్నత్వం (Occupational Diversity)


ప్రపంచంలో ఏ సమాజంలో కనపడనంత వృత్తిపరమైన భిన్నత్వం భారతీయ సమాజంలో కనిపిస్తుంది. సాంప్రదాయ వృత్తులు, కులవృత్తులు, చేతి వృత్తులు మరియు ఆధునిక వృత్తులు కూడా ఒకే కాలంలో భారతీయ సమాజం నందు కన్పిస్తాయి. భారతదేశంలో ఇలా సాంప్రదాయ వృత్తులు ఈ ఆధునిక కాలం వరకు కూడా కొనసాగడానికి ప్రధాన కారణం వృత్తులు అనునవి కులవ్యవస్థలో ఒక భాగంగా ఉండడమే.


6. ఆవాస పరమైన భిన్నత్వం (Habitational Diversity)


భారతీయ సామాజిక నిర్మాణం యొక్క మూలస్తంభాలు

1. ఉమ్మడి కుటుంబం                          2. కులం

3. గ్రామీణ సామాజిక నిర్మాణం.


భారతదేశం నందు నగరీకరణ చాలా తీవ్రంగా ఉన్నప్పటికిని అధికశాతం ప్రజలు గ్రామాల యందు నివసిస్తూ వ్యవసాయం మరియు వ్యవసాయ ఆధారిత రంగాల యందు జీవనాన్ని కొనసాగిస్తున్నారు. అందువల్లనే గ్రామస్వరాజ్యమే నిజమైన స్వరాజ్యమని మరియు భారతదేశం యొక్క ఆత్మ గ్రామాల యందే ఉంటుందని మహాత్మాగాంధి పేర్కొన్నాడు.


భారతదేశ సమాజం అధికంగా గ్రామీణ సామాజిక నిర్మాణంతో ఏర్పడినప్పటికీ సంచార జాతులు ఇతర ఆవాసపరమైన రూపాలు కూడా కనపడుతాయి. అవి....

1. పట్టణ సముదాయాలు లేదా నివాసాలు

2. గిరిజన సముదాయాలు

3. మెట్రోపాలిటన్ సముదాయాలు

4. సంచార జాతులు మరియు ఉపసంచార జాతులు లాంటి ఆవాస పరమైన భిన్నత్వాలు కూడా కనపడతాయి.


7. ఆర్థికపరమైన భిన్నత్వం (Ecnomical Diversity)


ప్రపంచంలోని మిలియనీర్ల జాబితాలో భారతీయులు ఉన్నప్పటికి అత్యధికంగా పేదరికం ఉన్న దేశాల్లో భారతదేశం ఒకటి. భారతీయ సమాజంలోని ప్రజలను ఆదాయం ఆధారంగా ఉన్నత వర్గాలు, మధ్యతరగతి వర్గాలు, నిరుపేదలుగా వర్గీకరించవచ్చు, ఇలాంటి వైవిధ్యత గల సమాజాలలో భారతీయ సమాజం ఒకటి.


8. కులపరమైన భిన్నత్వం (Caste Diversity)


భారతదేశ సామాజిక నిర్మాణానికి హిందూ సామాజిక నిర్మాణం మూలమైనది, హిందూ సామాజిక నిర్మాణానికి కులం ఉక్కు కవచమని ఎ.ఆర్.దేశాయ్ పేర్కొన్నారు. కులం అనేటువంటి సామాజిక సంస్థ భారతదేశంలోనే జన్మించింది మరియు భారతదేశానికే పరిమితమైంది, ఇలా భారతీయ సమాజంలో కన్పించే అదనపు సామాజిక సంస్థ కులం. భారతీయ సమాజంలో సుమారు 5,000 లకు పైగా కులాలు కలవు. ఈ కులాలు తిరిగి ఉపకులాలుగా మరియు ఆశ్రిత కులాలుగా వర్గీకరించబడినవి.


నోట్: కులవ్యవస్థ గురించి పూర్తి వివరాలు కులం అనే ఛాప్టర్ నందు వివరించబడినవి.


9. భాషాపరమైన భిన్నత్వం (Linguistics Diversity)


ప్రపంచంలో ఏ సమాజంలో లేనన్ని భాషలు మరియు మాండలికాలు భారతదేశంలో కలవు. 1971 జనాభా లెక్కల ప్రకారం భారతదేశం నందు 1652 రకాల మాండలికాలను వినియోగిస్తున్నారు (మాండలికం అనగా లిపి లేనటువంటి భాష, ఇది ప్రధానంగా గిరిజనుల యందు కనపడుతుంది) మరియు భారతరాజ్యాంగం తన యొక్క 8వ షెడ్యూల్ నందు 22 రకాల భాషలని గుర్తించింది.


ఎన్సైక్లోపీడియా ఆఫ్ సోషల్ సైన్సెస్ వారి ప్రకారం ఇండియాలో 5 ప్రధాన సమూహాలకు చెందిన భాషా కుటుంబాలు కలవు. అవి...

1. నీగ్రాయిడ్ భాషా కుటుంబం

2. ఇండో ఆర్యన్ భాషా కుటుంబం

3. ద్రవిడ భాషా కుటుంబం

4. ఆస్ట్రో ఏసియాటిక్ భాషా కుటుంబం 

5. సైనో టిబేటియన్ భాషా కుటుంబం


భారతదేశంలో 70 శాతం మంది ప్రజలు ఇండో ఆర్యన్ భాషలను మరియు 20 శాతం మంది ప్రజలు ద్రవిడియన్ భాషలు మాట్లాడుతారు.


పైన తెలిపిన భాషాకుటుంబాలన్నింటిలో కెల్లా నీగ్రాయిడ్ భాషా అత్యంత పురాతనమైనది, దీనినే అండమాన్ భాషా అని కూడా అంటారు. భారతీయ జనాభాలో సుమారుగా 70% మంది ప్రజలు ఇండో ఆర్యన్ కుటంబానికి చెందిన భాషలనే ఉపయోగిస్తారు, ఇందులో ముఖ్యమైన భాషలు హిందీ, మరాఠీ, గుజరాతి, పంజాబి, బీహారీ, బెంగాలి, కాశ్మీరీ మొదలగునవి. అధికంగా ఉత్తర భారతదేశం నందు ఈ భాషల వినియోగం కలదు.


భారతీయ జనాభాలో సుమారుగా 25% మంది ప్రజలు ద్రవిడియన్ భాషా కుటుంబానికి చెందిన భాషలను ఉపయోగిస్తున్నారు. వీరంతా దక్షిణ భారతదేశానికి చెందిన వారు. ద్రవిడియన్ భాషా కుటుంబానికి చెందిన ముఖ్యమైన భాషలు తెలుగు, తమిళం, కన్నడం మరియు మళయాళం. మిగతా భాషా కుటుంబాలకు చెందిన భాషలనే దేశంలో వివిధ ప్రాంతాల యందు వినియోగిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని భాషలలో కెల్లా అత్యంత పురాతనమైన సంస్కృత భాష కూడా భారతదేశం నందే ఉద్భవించింది.


భాషాపరమైనటువంటి వైవిద్యాల వల్ల మరియు అధికమైన భాషా వ్యామోహం వల్ల ఇతర భాషల పట్ల వివిధ సమూహాలలో అయిష్టత మరియు వ్యాకులత కనిపిస్తూ తద్వారా భాషా పరమైనటువంటి ఉద్యమాలు మరియు భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు డిమాండు లాంటి సంఘర్షణలు ఉద్భవిస్తున్నాయి. ఉదా: తమిళనాడులో సంభవించిన హిందీ వ్యతిరేక ఉద్యమం మరియు భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పాటు చేయడం.


భారతదేశం నందు రాజ్యంగం గుర్తించిన 22 భాషలతో పాటు 122 ప్రాంతీయ భాషలు కలవు (కేంద్ర సంస్కృతిక మంత్రిత్వశాఖ వారి ప్రకారం). రాజ్యంగంలోని 17వ విభాగం నందు గల అధికరణం 343 (1) ప్రకారం మన అధికార భాష దేవనాగరి లిపిలో ఉన్నటువంటి హింది. అఫిషియల్ లాంగ్వేజెస్ యాక్ట్ 1963 ప్రకారం హింది అధికార భాష కాగా ఇంగ్లీష్అ నునది సబ్సిడరి అఫిషియల్ లాంగ్వేజ్. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 6 భాషలను క్లాసికల్ లాంగ్వేజెస్ కేంద్రం గుర్తించింది, అవి తమిళం, సంస్కృతం, తెలుగు, కన్నడ, మలయాళం, ఒడియా.


పై రకాల భిన్నత్వాలు భారతీయ సమాజం నందు ఉండటం వలన ఈ క్రింది పర్యవసనాలు తలెత్తుతున్నాయి

ఎ. కులపరమైన భిన్నత్వం : కులతత్త్వం, కులం ఆధారిత రాజకీయాలు మరియు కులం సంబంధిత అనాచారాలు

బి. భాషాపరమైన భిన్నత్వం: భాషా ఉద్యమాలు మరియు భాషా సంబంధిత ప్రాంతీయ ఉద్యమాలు

సి. మతపరమైన భిన్నత్వం : మత సంఘర్షణలు, మత రాజకీయాలు మరియు మతపరమైన ఉగ్రవాదం

డి. జాతిపరమైన భిన్నత్వం : జాతుల మధ్య సంఘర్షణలు. (ఉదా: ఈశాన్య రాష్ట్రాలలో జరుగుతున్న సంఘర్షణలు), జాతులపరమైన రాష్ట్రాల ఏర్పాటు డిమాండు. (ఉదా: గారోల కోసం గారోలాండ్, కాసాల కోసం కాసాలాండ్, కూకీల కోసం కూకీలాండ్ లాంటి ఉద్యమాలు ఉద్భవిస్తున్నాయి).


II. ఏకత్వం (Unity)


ఏకత్వం అనగా వివిధ వైవిద్యాలు మరియు భిన్నత్వాలు కలిగిన ప్రజాసమూహాల మధ్య కనపడే సమగ్రత రూపం. ఏకత్వం అంటే మీమంతా ఒక్కటి అని భావించే సామాజిక మరియు మానసిక స్థితి.


ఏకత్వం అనునది విభిన్న వైవిద్యాలు అనగా భాషా, సంస్కృతి, మతాచారాలు, ఆహారపు అలవాట్లు, జీవన విధానాలు మరియు సాంప్రదాయాలు గల వ్యక్తులు మరియు సముదాయాలు ఒకే పౌరులుగా సౌభ్రాతృత్వంతో జాతీయ భావంను కలిగియుండి అందరూ దేశం యొక్క ముద్దుబిడ్డలుగానే తమకు తాముగా భావిస్తూ పరస్పరం సహకరించుకునే సామాజిక సహధర్మతగా భావింపవచ్చును.


భిన్న సాంస్కృతిక నేపథ్యం గల అందరూ భారతీయులు కూడా మనం, మన దేశ ప్రజలు, మనదేశం, మనరాజ్యాంగం, మన జాతీయ గీతం, మన జాతీయ గేయం, మన జాతీయ పండుగలు, మన జాతీయ భాషా లాంటి భావనలను కలిగి ఉండటం వలన ఏకత్వం గోచరిస్తుంది.


ఏకత్వం అనునది భారత సమాజంలో గల విశిష్ట లక్షణం. ప్రపంచంలో ఏ రాజ్యం, ఏ దేశం సాధించని ఏకత్వాన్ని భారతీయ సమాజంలో సాధించడం జరిగింది. ఇలా భిన్న సంస్కృతులతో వైవిధ్యం గల భారతదేశ సమాజం నందు ఏకత్వంనకు దోహదపడిన అంశాలు


ఎ. భారతీయ సంస్కృతికి గల సహనశీలత మరియు భారతీయకరణ అనే అంశాలు

బి. రాజ్యాంగం నందు పొందుపర్చబడిన ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, ఉమ్మడి పౌరస్మృతి మరియు సౌభ్రాతృత్వం,

సమానత్వం మరియు చట్టబద్ధ పాలన లాంటి అంశాలు పౌరులందరిని ఒకే తాటిపైకి తీసుకొని వచ్చినవి.

సి. ఎంతో మంది విదేశీయులు దండయాత్రలు చేసి వారితో పాటు వారి సంస్కృతులను ఇక్కడకు తీసుకొని వచ్చిన ఆయా సంస్కృతులు భారతీయ సంస్కృతిలో విలీనమైనవి, ఈ దృగ్విషయాన్నే సాంస్కృతిక విలినీకరణ అంటారు.

డి. వయోజన ఓటు హక్కు అందరికి కల్పించడం, మత మరియు కులపరమైన వివక్షతలు లేకుండా రాజ్యాంగ పరమైన మరియు శాసనపరమైన ఏర్పాట్లు చేయడం కూడా ఏకత్వానికి దారితీసినవి. 

రాజ్యాంగ పరంగా, చట్టపరంగా, ప్రభుత్వ విధానాల పరంగా మరియు శాంతి భద్రతల పరంగా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికిని కులతత్త్వం, మతతత్త్వం, ప్రాంతీయ తత్త్వం, భాషా తత్త్వం, వేర్పాటు వాదం మరియు ఉగ్రవాదం లాంటి సామాజిక రక్కసులు భారతదేశం నందు గల ఏకత్వ భావంనకు తీవ్రమైన ఆటంకంను నిరంతరం కలిగిస్తున్నవి.


III. భిన్నత్వంలో ఏకత్వం (Unity in Diversity)


భారతసమాజంలో విభిన్న మతాలు, భాషలు, సంస్కృతులు, కులాలు మరియు జీవన విధానాలు ఉన్నప్పటికిని ఆయా సమూహాలకు సంబంధించిన వ్యక్తులందరూ భారతీయులంతా సమానమనే సమగ్రత భావననే కలిగి ఉండేలా ప్రవర్తించడాన్నే భిన్నత్వంలో ఏకత్వం అని పిలుస్తారు. ఇలా భిన్నత్వంలో ఏకత్వం సాధించడానికి వివిధ రకాల పరిస్థితులు దోహదపడినవి. అవి.....

1. అందరం భారతీయులం అనే భావన

2. మనదేశం, మనరాజ్యాం, మనరాజ్యాంగం, జాతీయ జెండా, జాతీయ పండుగలు, జాతీయ గీతం మరియు సెక్యులర్ భావనలు

3. ప్రజాస్వామ్య యుత ప్రభుత్వాలు, చట్టబద్ధ పాలన, రాజ్యాంగాన్ని మూలశాసనంగా కలిగి యుండటం, చట్టం ముందు సమానత్వం మరియు రాజకీయ అవకాశాలు లాంటివి రాజకీయ పరంగా ప్రజలలో ఏకత్వానికి దోహదపడినవి.

4. నగరీకరణ, పారిశ్రామికీకరణ మరియు ఆధునీకరణ వల్ల మరియు ప్రజల మధ్య రోడ్డురవాణా సౌకర్యాలు పెంపొందడం లాంటి అవస్థాపనా సౌకర్యాలు వృద్ధిచెందడం వల్ల సంబంధ బాంధవ్యాలు ఏర్పడినవి.

5. సంఘ సంస్కరణ ఉద్యమాలు, భక్తి ఉద్యమాలు, సూఫీ ఉద్యమాలాంటివి ఏకత్వ భావనకు తోడ్పడినవి.

6. ప్రభుత్వాలు సంక్షేమ రాజ్యం లక్ష్యం దిశగా పయనించడం, ప్రజలందరిని ఒకేరకంగా ఆదరించడం కూడా భిన్నత్వంలో ఏకత్వంనకు దారితీస్తున్నది.

7. భారతదేశ జీవన విధానాలలో వైవిధ్యత ఉన్నప్పటికి ఆయా జీవన విధానాల మధ్య పోలికలు కూడా కలవు. అవే ఏకత్వానికి దారి తీస్తున్నాయి.


భిన్నత్వంలో ఏకత్వం ఉన్నప్పటికిని మతతత్త్వం, కులతత్వం, ప్రాంతీయతత్త్వం, భాషాతత్వం, వేర్పాటు వాదం, మతపరమైన ఉగ్రవాదం, వర్గ విభేదాలు, అసమానతలు మరియు సంకుచిత రాజకీయాల్లాంటివి భిన్నత్వంలో ఏకత్వంనకు ఆటంకంగా నిలుస్తున్నవి.


IV. కుల రూప సామాజిక స్థరీకరణ (Caste based Social Stratification)


సమాజం నందు గల వివిధ వర్గాల ప్రజలను నిమ్నం, ఉన్నతం లేదా అధమం మరియు మధ్యస్థ సమూహాలుగా హెూదాలను ఆపాదింపజేస్తూ సమాజం నందు గల వివిధ సమూహాలను నిట్టనిలువుగా వర్గీకరించడాన్నే సామాజిక స్థరీకరణ (సోషల్ స్టాటిఫికేషన్) అంటారు.


సామాజిక స్థిరీకరణ అనునది ప్రతి సమాజం నందు కూడా కనపడుతుంది. ప్రపంచ వ్యాప్తంగా సామాజిక స్థిరీకరణ ప్రధానంగా 4 రూపాలలో వ్యక్తమవుతుంది. అవి..

1. ఆదాయాల ఆధారంగా వర్గం

2. సమాజంలో నిర్వర్తించే పాత్రల ఆధారంగా సంస్థానం

3. శరీరం వర్ణం ఆధారంగా జాతి

4. లింగం ఆధారంగా స్త్రీ మరియు పురుష భేదాలు


పై నాలుగు రూపాల సామాజిక స్థిరీకరణలు ప్రపంచ వ్యాప్తంగా కనపడతాయి మరియు భారతదేశంలో కూడా కనపడతాయి, కాని భారతదేశంలో మాత్రమే కనపడే ప్రధాన సామాజిక స్థరీకరణ రూపం కులం.


కులం భారతదేశంలోనే జనించింది మరియు భారతదేశంలో మాత్రమే కనపడే అదనపు సామాజిక సంస్థ. భారతదేశం నందు మనుషుల మధ్య విభజన ప్రధానంగా కులం ఆధారంగా కనపడుతుంది. అందువల్లనే భారతీయ సమాజం నందు స్థిరీకరణ యొక్క ప్రధాన రూపం కులం.


నోట్: కులంనకు సంబంధించిన పూర్తి వివరాలు కులం అనే ఛాప్టర్ నందు వివరించబడినవి.


V. గ్రామీణ సామాజిక నిర్మాణం (Rural Social Structure)


భారతదేశం నందు పట్టణ ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలు, మెట్రోపాలిటన్ప్రాం తాలు, సంచార జీవన విధానాలు ఉన్నప్పటికిని 70%కు పైగా ప్రజలు గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తూ, వ్యవసాయం మరియు వ్యవసాయ అనుబంధిత జీవనోపాదుల ఆధారంగా జీవనం కొనసాగిస్తున్నారు. కావున భారతీయ సమాజం అనునది అధిక శాతం గ్రామీణ సామాజిక నిర్మాణంతో ముడిపడి ఉన్నది.


భారతదేశం యొక్క ఆత్మ గ్రామాల యందే ఉందనే నానుడి కూడా కలదు. గ్రామ స్వరాజ్యంలోనే భారతదేశ స్వరాజ్యం ఉందని, స్వయం స్వావలంబత కలిగిన గ్రామాలు ఉండాలని మహాత్మాగాంధి పేర్కొన్నాడు.


భారతదేశంలోని గ్రామీణ సామాజిక నిర్మాణం నందు ఈ క్రింది లక్షణాలు కనపడతాయి. అవి...

1. ప్రజల మధ్య దృఢమైన ప్రాథమిక సంబంధాలుంటాయి (Dominance of Primary Relations)

2. సామాజిక మరియు సాంస్కృతిక ఏకరూపకత లేదా సాధర్మత లేదా సాదృశ్యత (Social and Cultural Homogenity)

3. 2400 కిలోకాలరీల కంటే అధికంగా తలసరిశక్తి వినియోగం (High Colories Per Capita Consumption)

4. అల్ప సామాజిక గతిశీలత ఉంటుంది (Less Opportunities of Social Mobility)

5. ప్రాథమిక రంగం అనగా వ్యవసాయ మరియు వ్యవసాయ ఆధారిత రంగాలపై జీవనోపాధి కలిగి ఉండడం (Agriculture & Other Primary Sectors Livelihood)

6. కుల రూప సామాజిక స్తరీకరణ (Caste based social stratification)

7. సాంప్రదాయ ఉమ్మడి కుటుంబాలు (Traditional joint families)

8. ప్రజల మధ్య మేము అనే భావన (We - Feeling) ఉంటుంది

9. ప్రజల మధ్య ముఖాముఖి సంబంధాలుంటాయి (Face to face Relations)

10. ప్రజల మధ్య పరస్పర ఆధారం ఉంటుంది.

11. కమ్యూనిటీ సెంటిమెంట్ ఉంటుంది.

12. ఇరుగుపొరుగు అనే భావన ఉంటుంది (Sense of Neighbourhood)

13. గ్రామీణ సముదాయం నందు జనాభా 5000 కంటే తక్కువగా మరియు జనసాంధ్రత చదరపు కిలోమీటరుకు 300 కంటే తక్కువగా ఉంటుంది.

14. మత విశ్వాసాలు మరియు మూఢనమ్మకాలు దృఢంగా ఉంటాయి

15. అనియత సామాజిక నియంత్రణ ప్రభావం ఎక్కువగా ఉంటుంది

16. సాంప్రదాయ వృత్తులుంటాయి మరియు దృఢమైన సాంప్రదాయ వాదులుగా ఉంటారు.

17. వితండవాదం ఉంటుంది.

18. కొత్తవారి పట్ల అనుమానాస్పదంగా వ్యవహరిస్తారు.

19. సాంప్రదాయ వినోద కార్యక్రమాలు మరియు క్షేత్రాలుంటాయి

20. మధ్యపానం, అంటరానితనం, పేదరికం, నిరక్షరాస్యత, అవస్థాపన సౌకర్యత లేమి, గ్రామీణ ఋణ గ్రస్తత, ఆరోగ్య మరియు విద్యా సదుపాయాల లేమి లాంటి సమస్యలు గ్రామీణ సదుపాయాల యందు కనిపిస్తాయి.


VI. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ (Traditional Joint Family System)


భారతీయ సమాజం యొక్క ప్రధాన లక్షణాలలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కూడా ఒక లక్షణం. భారతీయ సమాజంలో కుటుంబ వ్యవస్థకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది, భారతీయ ఉమ్మడి కుటుంబం నందు 3 తరాలకు పైగా ఉమ్మడి నివాసం, ఉమ్మడి వంట, ఉమ్మడి ఆస్థి, ప్రధాన కర్త మరియు ఉమ్మడి ఆదాయాలు మరియు సంస్కారాలు అలాగే బలమైన సాంప్రదాయాలు లాంటివి గోచరిస్తాయి. ఇలాంటి నిర్మాణము మరియు ప్రకార్యాలు కలిగినటువంటి కుటుంబాలు ప్రపంచంలో ఏ సమాజాల యందు కనపడవు కాని ప్రస్తుత కాలంలో నగరీకరణ, పారిశ్రామికీకరణ, వలసలు, ఉన్నత విద్య లాంటి ఇతర కారణాల వల్ల సాంప్రదాయ ఉమ్మడి కుటుంబాల స్థానంలో నూతన స్థానిక కుటుంబాలు ఏర్పడుతున్నవి.


నోట్: కుటుంబంనకు సంబంధించిన పూర్తి వివరాలు కుటుంబం అనే ఛాప్టర్ నందు అందించబడినవి.


VII. జజమానీ వ్యవస్థ (Jajmani System)


భారతదేశ సమాజం నందు ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో వివిధ కులాల మధ్య కనిపించే కులపరమైన వృత్తి సేవల వినిమయాన్నే జజానీ వ్యవస్థ అంటారు. ఈ విధానంలో వివిధ కులాల మధ్య కులవృత్తి సేవలు పరస్పరం మార్పిడి చేసుకోవడం ద్వారా వినియోగించుకోబడతాయి. ఉదా: గ్రామీణ సమాజంలో వడ్రంగి, క్షురకుడు, కమ్మరి, కంసాలి మొదలగు వారు వ్యవసాయ దారులకు తమ యొక్క వృత్తిపరమైన సేవలను అందిస్తారు. ఫలితంగా వారు వ్యవసాయ దారుల నుండి ధాన్యం గాని, లేదా ఇతర వస్తు రూపంలో తమ సేవలకు ప్రతిఫలాన్ని పొంది జీవనం కొనసాగిస్తారు.


జజ్మాన్ అనే పేరును మొదటగా ఉపయోగించిన వారు 'వైజర్', వీరు ఈ వ్యవస్థపై హిందూ జజ్మాన్ విధానం అనే గ్రంథాన్ని రచించారు. జజ్మాన్ అనేది యజమాన్ అనే సంస్కృత పదం నుండి ఉద్భవించింది, యజమాన్ అనగా యజ్ఞం నిర్వహించే వాడు అని అర్థం. జజ్మానీ అనే పదం సాధారణంగా గ్రామంనకు చెందిన ప్రముఖుడు లేదా ప్రముఖులను సూచిస్తుంది, సహజంగానే వీరు భూస్వాములు అవడం వల్ల భూమిలేని మిగతా కుల సమూహాలు ఇతనికి వ్యవసాయంనకు మరియు ఇతర మతపరమైన సంస్కారాల నిమిత్తమై తమ సేవలను అందిస్తూ ఆ యజమాని నుండి తమ అవసరాలు తీర్చుకునేందుకై ధాన్యం, ఆహార పదార్థాలు మరియు రక్షణ లాంటి ప్రతిఫలాన్ని పొందుతాయి.


పై విధంగా యజమానికి వివిధ రకాల సేవలు అందించేవారిని ప్రజా లేదా కామిన్ అందురు. సాధారణంగా ధనవంతులైన ఉన్నత వర్గాల వారు యజమానులుగా మరియు భూమిలేని నిరుపేదలు, కులవృత్తులు పాటిస్తూ, కామిన్గా సేవలందించేవారు. కావున జజ్మానీ వ్యవస్థలో సేవలు అందించే వారిని కామిన్లని సేవలు పొందేవారిని జజ్మాన్ పిలుస్తారు.


జజ్మాన్ వ్యవస్థ వివిధ కులాలకు చెందిన రెండు కుటుంబాల మధ్య కూడా సంబంధాన్ని ఏర్పరుస్తుంది. ఉదా: వ్యవసాయధార కుటుంబంనకు మరియు వారి కుటుంబానికి వడ్రంగి సేవలు అందించే కుటుంబానికి మధ్య గల పరస్పర సంబంధం.


ఒక కామిన్స్ కుటుంబం వారసత్వంగా జజ్మన్కు సంబంధించిన ఒక కుటుంబంనకు సేవలందించే వారసత్వ హక్కును కలిగి ఉంటుంది. ఇలా కులాల మధ్య సేవాపరమైన పరస్పర ఆధారిత ఉన్నందువల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరియు గ్రామం సంఘటితంగా మరియు దృఢంగా ఉండేది.


హెరాల్డ్ గౌల్డ్ గారి అభిప్రాయంలో జజ్మానీ వ్యవస్థ అనేది కులాల మధ్య ఉన్న వృత్తిపర సేవల వినిమయ సంబంధమే కాకుండా ఇది వివిధ వృత్తులకు చెందిన కుటుంబాల మధ్య కూడా సంబంధాలను ఏర్పరుస్తుంది.


ఈ వ్యవస్థలో జజ్మాన్ యొక్క గృహం నందు జరిగే వివిధ మతపరమైన సంస్కారాలకు కూడా వివిధ కులాలకు సంబంధించిన వారి సేవలు అవసరమవుతాయి. అనగా కేవలం వ్యవసాయం చేయడానికి మాత్రమే కులపరమైన సేవలు అందించడమే కాకుండా కర్మకాండలు మరియు సాంప్రదాయాలు నిర్వహించడానికి కూడా కులపరమైన సేవలు అవసరమవుతాయి. ఉదా: పూజారి అందించే సేవలు, పండుగల యందు క్షురకుడు మరియు చాకలి అందించే సేవలు.


ఎడ్మండ్ లీచ్ గారి అభిప్రాయంలో జజ్మానీ వ్యవస్థ అనేది శ్రమ విభజనను మరియు కులాల మధ్య గల ఆర్థికపరమైన ఆధారత్వంను క్రమబద్ధం చేస్తుంది.


జజ్మానీ వ్యవస్థ నందు వృత్తిసేవల మార్పిడి కనపడుతుంది కావున దీనినే వస్తు మార్పిడి లేదా సేవల మార్పిడి ఆర్థిక వ్యవస్థగా పరిగణించవచ్చు. ఈ వ్యవస్థ వలన ఒక గ్రామంలో విభిన్న కులాల వారు ఒకరిపై ఒకరు ఆధారపడి జీవిస్తారు. ఫలితంగా స్వయం సమృద్ధి కలిగిన గ్రామాలు ఏర్పడినవి.


ప్రొఫెసర్ యోగేందర్ సింగ్ గారి అభిప్రాయంలో గ్రామీణ భారతంలో గల వివిధ కులాల మధ్య గల పరస్పర సంబంధాలే జజ్మానీ వ్యవస్థ.


ఒక్కొక్క కుల సమూహం ఒక్కో రకమైన వృత్తినైపుణ్యం కలిగి ఉండడం వలన ఒక్కొక్క కులం తమ కంటూ ఒక ప్రత్యేకమైన వృత్తిని వారసత్వంగా అందిపుచ్చుకొని మిగతా కులాలకు సేవలనందిస్తూ మరియు ఆయా కులాల నుండి తమకు కావలసిన సేవలను పొందుతాయి.


జజ్మానీ వ్యవస్థ వలన క్రింది దుష్పరిణామాలు ఏర్పడినవి.


జజ్మానీ వ్యవస్థ వల్ల నిమ్న కులాల వారి యొక్క కులపరమైన సేవలకు విలువలను నిర్ణయించే స్థాయిలో ఉండే వారు కాదు, వీరి యొక్క జీవన స్థితిగతులన్ని కూడా యజమాని యొక్క దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉండటం వల్ల ఆయా వృత్తిదారుల యొక్క జీవన స్థితిగతులు దయనీయంగా ఉండేది.

కులపరమైన వృత్తిసేవలు అందివ్వాలి అనే భావన వల్ల నిరక్ష్యరాస్యత, నిరుద్యోగం, సామాజిక గతిశీలత లేమి, కుల పరమైన ఆచారాలు కొనసాగింపు, ఆర్థిక అసమానతలు, ఇతర ఉపాధి మార్గాలు లేకపోవడం, కుల పరమైన వృత్తిసేవలకు సరైన ప్రతిఫలాన్ని పొందలేకపోవడం, పేదరికం లాంటి రుణాత్మకమైన ప్రభావాలు ఉండేవి.


గ్రామాలలో భూస్వాములు మరియు యజమానుల యొక్క నిరంకుశ పోకడల వల్ల వెట్టిచాకిరి, సరియైన వేతనాలు చెల్లించకపోవడం, బాలకార్మికత మరియు కులపరమైన వివక్షతలు, విద్యా వకాశాలు లేకపోవడం మరియు కులవ్యవస్థ మరింత దృఢంగా తయారవడం లాంటి దుష్పరిణామాలు సంభవించినవి.


ఈ వ్యవస్థలో యజమానులు సేవకుల యొక్క వృత్తిపరమైన సేవలకు తమకు తోచిన రీతిలో పైకం చెల్లిస్తే మోసం చేసేవారు, ఫలితంగా సేవకుల యొక్క ఆర్థిక స్థితి దయనీయంగా ఉండేది. ఈ దురావస్థలకు కారణం సేవకులకు ఇతర జీవనోపాధులు లేక కులవృత్తులను నమ్ముకోవడం మరియు భూములన్ని యజమానుల చేతిలో ఉండడం.


పైన వివరించిన జజామానీ వ్యవస్థ ప్రస్తుతం అంతరించే దశలో ఉన్నది. ఈ వ్యవస్థ అంతరించడానికి దారితీసిన పరిస్థితులు.


1. బ్రిటీష్ వారి రాకతో సమాజంలో పారిశ్రామికీకరణ, సహజ వనరుల వెలికితీత వంటి వాటి వల్ల నూతన జీవనోపాధులు వచ్చి కులపరమైన సేవలు అందించే అవసరం లేకుండా పోయింది.

2. విద్యా మరియు రవాణా సౌకర్యాల అభివృద్ధి, వలసలు, నూతన వృత్తుల ఆవిర్భావం లాంటివి కూడా జజ్మానీ వ్యవస్థ పతనానికి కారణమయ్యింది.

3. వస్తుమార్పిడి నుండి కరెన్సీని మాధ్యమంగా వినియోగించే సమాజం ఏర్పడడం కూడా ప్రధాన కారణమే.

4. భూసంస్కరణలు, భూముల పంపిణీ, భూదానోద్యమం, జమిందారీ వ్యవస్థ రద్దు మరియు భూ గరిష్ట పరిమితి చట్టం లాంటి వల్ల భూ సంపద అన్ని వర్గాలకు అందుబాటులోనికి రావడం. ఫలితంగా కులవృత్తులు వదిలి వ్యవసాయదారులుగా మారడం జరిగింది.

5. నగరీకరణ మరియు పారిశ్రామికీకరణ వల్ల ప్రజలు గ్రామాలలో అసమానతలతో కూడిన వృత్తులను వదిలి పట్టణాలలో నూతన వృత్తులను చేపట్టారు.

6. వ్యవసాయ రంగం నందు యాంత్రీకరణ పెరగడం కూడా జజ్మానీ వ్యవస్థ పతనానికి కూడా దారితీసింది.

܀ అయినను మారుమూల గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ రంగం నందు ఈ జజ్మానీ వ్యవస్థ ఇంకా కొనసాగుతున్నది.


VIII. హిందూ సామాజిక నిర్మాణం (Hindu Social Organization)


భారతదేశం నందు వివిధ మతరూపాలు ఉన్నప్పటికి కూడా అధిక శాతం హిందూ సామాజిక నిర్మాణంతోనే రూపుదిద్దుకున్నది.


హిందూ సామాజిక నిర్మాణం అనునది భారతదేశం యొక్క ప్రధాన లక్షణంగా చెప్పవచ్చు. ఎందుకంటే మతాలకతీతంగా భారతదేశంలో నివసించే వారందరిపై ఈ ప్రభావం కనిపిస్తుంది.


హిందూ సామాజిక నిర్మాణం యొక్క ముఖ్యలక్షణాలు:

1. వర్ణవ్యవస్థ

2. కులవ్యవస్థ

3. పురుషార్థాలు

4. కర్మలు

5. వర్ణాశ్రమ ధర్మాలు

6. విగ్రహారాధన

7. బహుదేవతారాధన

8. మతపరమైన ఉపశాఖలు

9. గ్రామదేవతలు

10. కులపరమైన దేవతలు


ప్రతి సభ్యుడు ఆచరించవలసిన విధి విధానాలను పైన తెలిపిన వివిధ రూపాలలో పొందుపరిచారు, అవి ఆచరించవలసిన విధి విధానాలకు సంబంధించి హిందూ మత మూలగ్రంథాలైన వేదాలు, స్మృతులు, ఉపనిషత్తులు, వేదాంగాలు, ఉపవేదాలు మరియు పురాణాల యందు తెలుపబడినవి.


హిందూ సామాజిక వ్యవస్థల మూలం చాలా వైవిధ్యతో కూడిన వేద సాహిత్యం నందు కలిగి ఉంది. ఇందులో ప్రధానంగా వ్యక్తి మరియు సమాజం యొక్క నైతికత మరియు ధర్మశీలత లాంటి విషయాలను ఎలా ఆచరించారో తెలుపబడింది.


పురుషార్ధాలు: జీవితమనేది ధర్మబద్ధంగా కొనసాగాలంటే ప్రతి వ్యక్తి 4 పురుషార్థాలను పాటించాలి. అవి..

1. ధర్మ

2. అర్థం

3. కామం

4. మోక్షం


మానవుని ప్రవర్తనను క్రమబద్ధం చేసేదే ధర్మం, దృ అనే సంస్కృత పదం నుండి ఇది తీసుకోబడింది. దీని యొక్క అర్థం కలిపిఉంచడం లేదా నిలబెట్టడం. ఈ ధర్మమే వ్యక్తికి క్రమశిక్షణను తెలుపుతూ, తద్వారా సమాజ క్రమమునకు ఒక దారిని ఏర్పాటు చేస్తుంది.


మానవుని అంతిమ లక్ష్యాలు, జీవన గమ్యాలు అయిన 4 పురుషార్థాలలో ధర్మం మొదటిది. ధర్మం లేని అర్థం మరియు కామం వ్యక్తిని అధమ స్థానానికి తీసుకెళ్తాయి.


అర్థం అనగా జీవితాన్ని కొనసాగించడానికి కావలసిన ఆర్థికపరమైన అంశాలు, కామం అనగా ప్రాపంచిక సుఖాలు. ఈ యొక్క అర్థ మరియు కామాలను ధర్మం బద్ధంగా నిర్వర్తించినప్పుడు మోక్షం లభిస్తుంది.


మొదటి మూడు పురుషార్థాలకు 3 గ్రంథాలు కలవు. అవి.....

1. ధర్మశాస్త్రం

2. అర్థశాస్త్రం

3. కామశాస్త్రాలు కలవు


ధర్మం, అర్థం మరియు కామాలను కలిపి త్రివర్గాలు అందురు. ఇందులో అర్థం మరియు కామాలు ప్రాపంచికాలు కాగా ధర్మం అనునది మాత్రం పురుషార్థాలలో కెల్లా ఉన్నతమైనది.


రెండవ పురుషార్ధం అర్థం అనగా సంపద అని భావన. సంపద వల్లనే వ్యక్తి యొక్క ధర్మాలను అనుసరించడానికి మరియు జీవనం కొనసాగించడానికి వీలవుతంది అయితే ధర్మంను మీరి సంపద సమీకరించకూడదు.


మూడవ పురుషార్థం కామం. అర్థ మరియు కామాలు అనునవి గృహస్థాశ్రమంలో వ్యక్తికి అవసరం, కామా అనగా కోరిక మరియు ఇంద్రియ వాంఛలని తృప్తి పరుచుకోవడం. కామం అనునది శారీరక వాంఛలకు సంబంధించింది కావున ఇది అన్ని పురుషార్థాల్లో కెల్లా అధమమైనది. అయినను కామం వల్లనే ప్రజా అనగా సంతానం ఏర్పడుతుంది. మరియు వివాహం, కుటుంబం లాంటి వ్యవస్థలు ఏర్పడుతాయి. కావున కామాన్ని ధర్మబద్ధంగా మాత్రమే అనుసరించాలి.


నాల్గవ పురుషార్ధం మోక్షం. ధర్మ, అర్థ, కామాల యొక్క పరిపూర్ణతల వల్ల వ్యక్తి ఉన్నత స్థానంనకు చేరుకుంటాడు. ఫలితంగా అజ్ఞానం నశించడం, మనస్సు, ఇంద్రియాలు మరియు సామర్థ్యాలు ఆధీనంలో ఉండడం కలుగుతుంది దీనినే మోక్షం అంటారు. పురుషుర్ధాలన్నింటిలో అత్యున్నమైనది మోక్షం.


ఛాతుర్వర్ణ వ్యవస్థ ఋగ్వేదం నందలి 10వ ఖండమైన పురుష సూక్తం నందు ఈ సృష్టియొక్క ఆవిర్భావం గురించి వివరించబడింది. అందులో భాగంగా ఛాతుర్వర్ణ వ్యవస్థను తెలుపడం జరిగింది. పురుషసూక్తం ప్రకారం ప్రజాపతి యొక్క శరీరం నుండి 4 వర్ణాలకు సంబంధించిన ప్రజలు ఆవిర్భవించారు. వారు...

ఎ. తల నుండి బ్రాహ్మణులు

బి. భుజాల నుండి క్షత్రియులు

సి. తొడల నుండి వైశ్యులు

డి. పాదాల నుండి శూద్రులు ఆవిర్భవించినారని తెలుపుతుంది.


నోట్: వర్ణ వ్యవస్థ గురించిన పూర్తి వివరాలు మతం అనే ఛాప్టర్ నందు వివరించడం జరిగింది.


వర్ణాశ్రమ ధర్మాలు: వ్యక్తి తన జీవితంను వివిధ దశల గుండా పూర్తి చేసుకుంటాడు. వాటినే వర్ణాశ్రమ ధర్మాలు అని అంటారు. వర్ణాశ్రమ ధర్మాలు ఒక వ్యక్తి తన జీవితంలో ఆచరించవలసిన క్రియలను చెబుతాయి.

వర్ణాశ్రమ ధర్మాలు 4 కలవు. అవి... 

1. బ్రహ్మ చర్యాశ్రమం

2. గృహస్థాశ్రమం

3. వానప్రస్థాశ్రమం

4. సన్యాసాశ్రమం


వ్యక్తి తల్లి గర్భం నుండి జన్మించడం మొదటి జన్మ, జ్ఞానం సంపాదించినప్పుడు అతడు రెండవ జన్మని పొందుతాడు. మరియు ద్విజుడు అని పిలువబడతాడు, ఇలా ద్విజుడుగా మారాలంటే క్రమశిక్షణతో కూడిన బ్రహ్మచర్యం అవసరం.


పుట్టిన తర్వాత ప్రతివ్యక్తి కూడా శూద్రుడే. విద్యాభ్యాసాన్ని పూర్తిచేసిన తర్వాతే ద్విజుడవుతాడు. బ్రాహ్మణం 8వ ఏటా, క్షత్రియుడు 10వ ఏటా మరియు వైశ్యుడు 12వ ఏటా విద్యాభ్యాసాన్ని ప్రారంభిస్తారు.


బ్రహ్మచర్యం అనునది మొదటి వర్ణాశ్రమ ధర్మం, ఇక్కడ వ్యక్తి గురువును మెప్పించి అర్థం మరియు కామంతో సంబంధం లేకుండా జ్ఞానసముపార్జన లక్ష్యంగా జీవిస్తాడు. తద్వారా మిగతా వర్ణాశ్రమ ధర్మాలకు సిద్ధమవుతాడు.


విద్యాబుద్ధులు నేర్చుకొని గురుకులం నుండి ఇంటికి బయల్దేరే సమయంలో విద్యార్థులు తమ విద్యలను ప్రదర్శిస్తారు. దీనినే సమవర్తనం అందురు, దీని తర్వాత గృహస్థాశ్రమంలోకి ప్రవేశిస్తారు. గృహస్థాశ్రమంలో వివాహం చేసుకొని కుటుంబాన్ని ఏర్పరచి పురుషార్థాలను సాధించుకునేందుకు ప్రయత్నిస్తాడు. వివాహం అనేటువంటి ధర్మ మార్గంలో కామాన్ని, అర్థాన్ని మరియు సంతానాన్ని పొందుతాడు.


గృహస్థాశ్రమంలోనే ప్రతివ్యక్తి యజ్ఞాలు నిర్వహించాలి. వాటినే పంచమహాయజ్ఞాలంటారు. అవి...

1. బ్రహ్మయజ్ఞం :   వేద అధ్యయనం చేయడం జ్ఞానాన్ని సంపాదించడం

2. దైవయజ్ఞం     :   దైవ కార్యాలు నిరంతరం కొనసాగించడం

3. పితృయజ్ఞం   :   శ్రాద్ధకర్మలు, పితృతర్పణాలు మరియు కర్మకాండలు నిర్వర్తించడం

4. భూతయజ్ఞం : ప్రకృతి మరియు జంతువులని పూజించడం, కాపాడటం మరియు ఆదరించడం

5. నరయజ్ఞం      :   తోటి మనుషులకు మరియు అతిధులకు సేవలు చేయడం.


వర్ణాశ్రమాలలో మూడవది వానప్రస్థాశ్రమం. ఇక్కడ వ్యక్తి త్యాగమును వ్యక్తపరచాలి. ఈ సమయంలో సంసారిక సుఖాలను వదిలి అడవులలో నివాసం ఏర్పర్చుకొని హెూమాలు చేస్తూ ఉండాలి. ఈ దశలో ఆత్మ నిగ్రహం, దానం, దయ లాంటి ఉన్నతమైన సుగుణాలను అలవర్చుకోవాలి.


వర్ణాశ్రమ ధర్మాలలో చివరిది సన్యాశ్రమం. ఈ దశలో వ్యక్తి తన యొక్క పేరు, తనయొక్క ఇంటి పేరు వదిలేసి కుటుంబంతో సంబంధాలను తెంచుకొని, పూర్తిగా ప్రాపంచిక సుఖాలను త్యజించి భిక్షాటనం ద్వారా మితంగా తింటూ, రాగద్వేశాలు లేకుండా దేశాటనం చేస్తూ ధర్మాన్ని ప్రజలకు బోధిస్తూ ఉండాలి.


IX గిరిజనులు (Tribals)


నాగరిక ప్రపంచంతో సంబంధం లేకుండా కొండ ప్రాంతాలలో, దట్టమైన అటవీ ప్రాంతాలలో నివసిస్తూ తీవ్రమైన వెనుకబాటుతనాన్ని కలిగిఉండి ప్రత్యేకమైన భాషా సంస్కృతులను కలిగిఉండి, అటవీ ఉత్పత్తుల మీద లేదా పశుపోషణ మీద లేదా వేటమీద ఆధారపడి జీవనాన్ని కొనసాగించే సమూహాలను గిరిజనులు అంటారు. ప్రపంచంలో గిరిజనులతో కూడిన సామాజిక నిర్మాణాన్ని కలిగియున్న అతి కొన్ని సమాజాలలో భారతీయ సమాజం ఒకటి. భారతదేశంలో 730 గిరిజన తెగలు అధికారికంగా గుర్తించబడినారు, వీరిలో 75 గిరిజన తెగలు అంతరించడానికి సిద్ధంగా ఉన్న గిరిజన తెగలు. భారతదేశ సామాజిక నిర్మాణంలో జనసంఖ్యాపరంగా మొత్తం దేశం జనాభాలో 8.6% జనాభా గిరిజన జనాభే కలదు. దేశం యొక్క భౌగోళిక విస్తీర్ణంలో 15% వీరు విస్తరించి ఉన్నారు.


భారతదేశంలో నివసిస్తున్న ప్రతి గిరిజన తెగ తమదైన ప్రత్యేక సంస్కృతిని మరియు జీవన విధానాన్ని కలిగి ఉన్నది.


నోట్: గిరిజనులకు సంబంధించిన పూర్తి వివరాలు గిరిజనులు అనే పాఠ్యాంశం నందు వివరించడం జరిగింది.


X. మైనారిటీ వర్గాల ప్రత్యేక సామాజిక వ్యవస్థీకరణ (Minority Social Organization)


భారతీయ సమాజం అత్యధికంగా హిందూ సామాజిక నిర్మాణంతో కూడుకొని ఉన్నప్పటికి ఇతర మతాలకు చెందిన జీవన విధానాలు కూడా భాగంగా కనిపిస్తాయి, ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాల నుండి ఆయా మతాలకు సంబంధించిన ప్రజలు భారతదేశం నందు స్థిరపడి భారతీయ ఆత్మ నందు భాగమైనారు. కావున భారతీయ సమాజం నందు హిందూ మతానికి చెందిన కట్టడాలు, సాంప్రదాయాలు, ఆచారాలతో పాటుగా, వివిధ మైనారిటీ వర్గాల జీవన విధానాలు కూడా కనిపిస్తాయి.


నోట్: మతం అనే ఛాప్టర్ నందు అన్ని మతాలకు సంబంధించిన వివరాలు పొందుపర్చడమైనది.


XI. పురుషస్వామ్య సమాజం (Patriarchal Society)


ఏ సమాజం నందైతే పురుషులకు ఆధిపత్యాన్ని, అధికారాన్ని ఉద్యోగ అవకాశాన్ని, వంశానుక్రమాన్ని, ఆర్థిక అవకాశాలను మరియు రాజకీయ అవకాశాలను కల్పించి స్త్రీలకు పురుషుల తర్వాత స్థానాన్ని ఆయా రంగాలలో ఆపాదిస్తుందో ఆ సమాజాన్ని పురుష స్వామ్య సమాజం లేదా పితృస్వామ్య సమాజం అంటారు.


ప్రపంచంలోని దాదాపు అన్ని సమాజాలు కూడి పురుషస్వామ్య సామాజిక లక్షణాలనే కలిగియున్నవి.


పురుష స్వామ్య సామాజిక లక్షణాలను అనుసరిస్తున్నప్పుడు సమాజం నందు స్త్రీలపై హింస, బాల్య వివాహాలు, బహుభార్యత్వం, వితంతువులు పునర్వివాహం లేకపోవడం వరకట్నం, గృహహింస మరియు స్త్రీల యందు మనుషుల అక్రమరవాణా, బ్రూణ హత్యలు లాంటి సమస్యలు కనపడతాయి.


భారతదేశం పురుషస్వామ్య సమాజం అయినప్పటికి కొంతమంది గిరిజనులలో స్త్రీస్వామ్య సమాజం కూడా కనపడుతుంది.

ఉదాహరణ: నీలగిరి తోడాలు, హిమాలయ ఖాసీలు


భారతీయ సమాజం నందు పై లక్షణాలతో పాటు సామాజిక మరియు ఆదాయ పరమైన అసమానతలు, ఉన్నత వర్గం, నిమ్నవర్గం మరియు మధ్యతరగతి వర్గం అనే విభజన కూడా కనపడుతుంది.


పునశ్చరణ


  • అధికరణం 1 ప్రకారం మనదేశం పేరు ఇండియా దటీజ్ భారత్.
  • భారతదేశంలో 7 రకాల వర్గాలున్నాయని మెగస్తనీస్ అభిప్రాయపడ్డారు.
  • భిన్నత్వంలో ఏకత్వం, వ్యవసాయిక గ్రామీణ, సామాజిక నిర్మితి, కులరూపస్థరీకరణ, సంప్రదాయ ఉమ్మడి కుటుంబాలు, మత, భాష, భౌగోళిక, సాంస్కృతిక, ఆవాసపరమైన మరియు ఆదాయ పరమైన భిన్నత్వాలు మరియు పితృస్వామ్య వ్యవస్థ అనునవి భారతదేశ సమాజం యొక్క ప్రధాన లక్షణాలు.
  • వ్యక్తుల మధ్య ఉమ్మడిగా గోచరించే భేదాలే భిన్నత్వం.
  • భారతదేశంను భిన్న జాతుల ప్రదర్శన శాల అని పిలిచినది ఎ.వి. స్మిత్.
  • భారతదేశం నందు గల జాతులను బ్లూమెన్ బాచ్ 5 రకాలుగా, రిస్లే 7 రకాలుగా, ఇక్టెడ్ 4 రకాలుగా, బి.ఎస్.గుహ 6 రకాలుగా మరియు రుగ్గరి 6 రకాలుగా వర్గీకరించారు.
  • భారతదేశంలో అత్యధికంగా ఉన్న జాతి ఆర్యన్లు, అత్యల్పంగా ఉన్న జాతి బ్రాకిసెఫల్స్.
  • భారతదేశంనందు 5 ప్రధాన సాంస్కృతిక సమూహాలు గోచరిస్తాయి.
  • స్థిరనివాసం లేకుండా జీవించే వారిని సంచార జాతులు అంటారు.
  • హిందూ సామాజిక నిర్మాణమునకు కులం ఉక్కు కవచంలా పనిచేస్తుందని ఎ.ఆర్.దేశాయ్ గారు తెలిపారు.
  • రాజ్యాంగం నందు గల 8వ షెడ్యూల్ ద్వారా 22 భాషలను గుర్తించారు.
  • ఎన్సైక్లోపీడియా ఆఫ్ సోషల్ సైన్సెస్ వారి ప్రకారం భారతదేశం నందు 5 ప్రధాన భాషా కుటుంబాలు కలవు.
  • భారతదేశం నందు ఇండో ఆర్యన్ భాషా కుటుంబానికి చెందిన భాషలను అధికంగా వినియోగిస్తారు.
  • సమాజం నందు గల ప్రజలను నిమ్న, ఉన్నత మరియు మధ్యస్థ హెూదాలు గల సమూహాలుగా వర్గీకరించడాన్నే సామాజిక స్థరీకరణ అంటారు.
  • వ్యక్తి యొక్క పాత్ర మరియు హెూదాలలో వచ్చే మార్పునే సామాజిక గతిశీలత అంటారు.
  • సామాజిక గతిశీలత అనే పదాన్ని మొదటగా ఉపయోగించినవారు - సోర్కిన్.
  • కులాల మధ్యగల సేవల వినిమయాన్నే జజ్మానీ వ్యవస్థ లేదా యాజమాన్య వ్యవస్థ అంటారు. ఈ వ్యవస్థలో వస్తు లేదా సేవల మార్పిడి కనపడుతుంది.
  • జజ్మానీ అనగా యజమాని లేదా యజ్ఞం చేసేవాడు అని అర్థం
  • జజ్మానీ వ్యవస్థలో సేవలు అందించే వారిని ప్రజా లేదా కామిన్ అని పిలుస్తారు.
  • వైజర్ అనునతడు మొదటిసారి హిందూ జజ్మాన్ అనే గ్రంథంలో జజ్మాన్ అనే పదాన్ని వినియోగించారు.
  • హెరాల్డ్ గౌల్డ్ గారి అభిప్రాయంలో జజ్మాన్ వ్యవస్థ అనేది కులాల మధ్య సంబంధంతో పాటు కుటుంబాల మధ్య సంబంధం కూడా.
  • ఎడ్మండ్ లీచ్ గారి అభిప్రాయంలో శ్రమ విభజన మరియు ఆర్థికపరమైన పరస్పర ఆధారత్వం అనునవి జజ్మాన్ వ్యవస్థ యొక్క ప్రధాన లక్షణాలు.
  • ఆధునిక వృత్తులు, నగరీకరణ మరియు పారిశ్రామీకరణల వల్ల కులవృత్తుల ప్రాధాన్యత తగ్గి జజ్మాన్ వ్యవస్థ బలహీనమైనది ధర్మ, అర్థ, కామ మరియు మోక్షాలను పురుషార్థాలు అంటారు.
  • ఛాతుర్వర్ణ వ్యవస్థ అనునది ఋగ్వేదంలోని 10వ కాండం అయిన పురుష సూక్తం నందు మొదటగా తెలుపబడింది.
  • బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ మరియు సన్యాస ఆశ్రమాలనే వర్ణాశ్రమ ధర్మాలు అందురు.
  • బ్రహ్మ, దైవ, పితృ, భూత మరియు నరయజ్ఞాలను పంచమహాయజ్ఞాలు అంటారు.
  • పురుషాధిక్య విలువలను పాటించే సమాజాలను పితృస్వామ్య సమాజాలు అంటారు.



Tags: Caste system, gender roles, joint families, arranged marriages, diversity, cultural festivals, social hierarchy, economic disparities, religious practices, education system, urbanization, rural traditions, globalization, modernization


1 comment:

  1. Please make this pdf and entire aap in English

    ReplyDelete

Post Bottom Ad