2.1 కులతత్త్వం (Casteism) - GNANA SAMHITHA

GNANA SAMHITHA

DONT WORRY!!! WE HELP YOU TO REACH YOUR GOAL 😊

Breaking

Post Top Ad

Friday, July 14, 2023

2.1 కులతత్త్వం (Casteism)

2.1 కులతత్త్వం (Casteism)


    కులం వేరు, కులతత్త్వం వేరు కాని కులం అనే భావన కులతత్త్వనకు పునాధిగా పనిచేస్తుంది. కుల ఆచరాలలో పాటించే గుడ్డి నమ్మకాలు, ఇతర కులాల పట్ల అసహ్య, ద్వేషపూరితభావం, తమ కులమే గొప్పదని, తమ కులమే సమాజంలోని అవకాశాలను పొందాలని చేసే ప్రయత్నంలో వివిధ కులాల మధ్య విభేదాలు తీవ్రరూపం దాల్చి సంఘర్షణంగా మారుతాయి. ఆయా సంఘర్షణ రూపాల యొక్క ప్రభావం, కుల తత్వానికి గల కారణాలు, కులతత్వం వల్ల కలిగే సామాజిక రుగ్మతలను రూపుమాపేందుకు రాజ్యం తీసుకుంటున్న చర్యలు మరియు సంఘసంస్కర్తల యొక్క కృషిని ఈ యొక్క పాఠ్యాంశం నందు వివరించడం జరిగింది.


    కులతత్వం నిర్వచనాలు మరియు అర్థం


    ♦ ఫణిక్కర్ గారి అభిప్రాయంలో కుల లాభదాయకమునకు పాటుపడే మనస్తత్వమే కులతత్త్వం (Castism) లేదా కులవాదం తీవ్రమయినప్పుడు రెండు కులాల మధ్య తలెత్తే వివాదాలు సంఘర్షణలుగా మారే అవకాశం కలదు. వీనినే కుల సంఘర్షణలు (Caste Conflicts) అందురు.

    ♦ తమ కులం పట్ల విపరీతమైన ఇష్టాన్ని కలిగి ఉండి ఆ యొక్క ఇష్టాన్ని రాజకీయంగా వినియోగించుకునే ప్రయత్నాన్నే కులతత్వం అంటారు- డి.ఎన్. ప్రసాద్.

    ♦ సమాజంలో ఒక కులం వారు తమ సొంత కులం యొక్క ప్రయోజనాన్ని ఆశించి ఇతర కులాల యొక్క అవకాశాలను దోచివేసి వారి అణచివేతకు కారణమవ్వడాన్నే కులతత్వం అంటారు.

    ♦ కులతత్త్వం వల్ల అంటరానితనం, కుల సంఘర్షణలు, అశాంతి, సామాజిక క్రమం దారితప్పడం విద్వేషాలు ప్రదర్శించడం లాంటివి చోటుచేసుకుంటాయి.

    ♦ ఒక కుల సమూహం వారికి ప్రత్యేక హెూదా, అంతస్థు, అవకాశాలు, ప్రాధాన్యత పొందుతూ, ఇతర కుల సమూహాలను వివక్షతకు గురిచేయడం వల్ల సంభవించే సామాజిక అశాంతి రూపమే 'కుల సంఘర్షణ'.

    ♦ ఒక కులంనకు చెందినవారు మరో కులం పట్ల ద్వేషం, ఈర్ష, అసూయలతో కూడి వారి జీవన విధానాలకు ప్రత్యక్షంగాను మరియు పరోక్షంగానూ ఆటంకాలను ఏర్పరచడంనే కుల సంఘర్షణలు అందురు.

    ♦ కులతత్వం నందు తమ కులం పట్ల గుడ్డివిధేయత మరియు తమ కుల ఆచారాల పట్ల తిరుగులేని విశ్వాసం ఉంటుంది. మరియు ఇతర కులాల పట్ల అయిష్టత, విద్వేషం మరియు అసూయలు ఉంటాయి.


    కులతత్వంనకు ప్రధాన కారణాలు


    కుల ప్రతిష్ఠ భావనలు కలిగి ఉండటం: తమ కులాలే గొప్పవని ఇతర కులాలు తమ కంటే హీనమైనవనే తప్పుడు ఆలోచనలు కలిగి ఉండటం.


    అంతర్వివాహ నియమాన్ని పాటించడం: ఈ నియమం వల్ల కులసభ్యులలో తమ కులం పట్ల విపరీతమైన అభిమానం ఇతర కులాల పట్ల ద్వేషం లేదా అయిష్టత పెరగడం జరుగుతుంది.


    కులపరమైన స్తరీకరణ మరియు కుల సంఘాల సంస్కృతి: కుల సంఘాలు నేడు కులాల మధ్య ఉన్న అంతరాలను తగ్గించడం కంటే కూడా ఆ అంతరాలను వివాదాలుగా మారుస్తున్నవి.


    అధిక ప్రయోజనాలు పొందాలని చూడడం: సమాజంలో ఉన్నటువంటి వనరులలో అధికభాగం తమ కులస్థులే పొందాలనే క్రమంలో ఇతరుల అవకాశాలను దెబ్బతీయడం.


    వివిధ కులాల మధ్య సాంస్కృతిక పరమైన వైరుధ్యం ఉండడం: ఆహారపు అలవాట్లలో, వేషధారణలో, జీవన విధానాలలో మరియు పూజా విధానాలలో కూడా కులాల మధ్య పరస్పర వైరుధ్యాలుండటం అనునది వివిధ కులాల మధ్య అయిష్టతను మరియు సంఘర్షణను పెంపొందిస్తున్నది.

    ఉదాహరణ: శాఖాహార కులాలు, మాంసాహార సంస్కృతి పట్ల తీవ్ర అయిష్టతను ప్రకటిస్తాయి.


    రిజర్వేషన్ ఫలితాలు ఉపకులాలకు అందకపోవడం: భారతదేశంలో కులాల మధ్య సంఘర్షణతో పాటు ఒకే కులంలోని ఉపకులాల మధ్య కూడా రిజర్వేషన్ ఫలితాలు మరియు ఇతర ప్రభుత్వ అవకాశాల ఫలితాలకు సంబంధించిన సంఘర్షణలు జరుగుతున్నవి.

    ఉదాహరణ: తెలుగు రాష్ట్రాలలో షెడ్యూల్డ్ కులాలకు అందిస్తున్న అవకాశాలు మరియు రిజర్వేషన్లు, షెడ్యూల్డ్ కులాలలోని అన్ని ఉపకులాలకు సమస్థాయిలో అందట్లేదని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉద్యమం ప్రారంభమయ్యింది.


    సామాజిక మాధ్యమాలలో విష ప్రచారాలు: సామాజిక మాధ్యమాలపై నియంత్రణ చాలా తక్కువగా ఉండటం మరియు అవి వ్యవస్థీకృతమైన ప్రసార మాధ్యమాలు కాకపోవడంతో కులపరమైన విషయాన్ని చిమ్మే వీడియోలు మరియు అంశాలు రోజురోజునకు ఈ మాధ్యమాల నందు పెరుగుతున్నవి.


    ప్రాబల్య కులాలు పెత్తనం చేయడం: ఒక ప్రాంతంలో పెత్తనం చెలాయిస్తున్న కులాన్నే ప్రాబల్య కులం అంటారు. సహజంగానే ప్రాబల్య కులాలకు వ్యతిరేకంగా ఆయా ప్రాంతాలలో ఇతర కులాలు ఏకమై నిరసన వ్యక్తం చేస్తాయి.


    కులపరమైన తీవ్ర వెనుకబాటుతనం: తరతరాల పాటు కొన్ని కులాలవారిని తీవ్రమైన వెనుకబాటు తనానికి మరియు వివక్షతలకు గురిచేయడం వలన సహజంగానే ఆయా కులస్థులు వారి దురావస్థకు కారణమైన వ్యవస్థపై మరియు కులాలపై వ్యతిరేక భావాన్ని కలిగి ఉంటారు. ఉదా: దళితులలో కనిపించే బ్రాహ్మణ మరియు అగ్రవర్ణ వ్యతిరేక ధోరణి.


    ఓటు బ్యాంకు రాజకీయాలు: భారతదేశంలో దాదాపు అన్ని పార్టీలు కులపరమైన రాజకీయాలు చేస్తుండడం ప్రజాస్వామ్యానికి పెను విఘాతంగా మారింది. క్యాస్ట్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ అనే గ్రంథంలో రజనీష్ కొఠారి గారు రాజకీయాల వల్ల కులవ్యవస్థ ఇంకా దృఢమవుతుందని అభిప్రాయపడ్డారు. మరియు ప్రాంతీయ పార్టీలన్ని కులాల ఓటుబ్యాంకు ప్రాతిపదికపైనే ఏర్పడుతున్నవి.


    కులం నిర్వహిస్తున్న కుల పంచాయితీలు: కుల పంచాయితీల ప్రభావం గణనీయంగా తగ్గినప్పటికి ఇంకా గ్రామాలలో కుల కట్టుబాట్లు, కుల పంచాయితీలు కొనసాగుతున్నవి. ఉత్తర భారతదేశంలో ఖాప్ పంచాయితీలనబడే కుల పంచాయితీల వలన కులాంతర వివాహం చేసుకున్న బాలికలను పరువు హత్యల పేరుతో చంపివేయడం జరుగుతుంది. ఈ ధోరణి హర్యానా రాష్ట్రంలో అధికంగా ఉంది.


    కులాల మధ్య అంటరానితనం అనే భావన ఉండటం: కుల సంబంధిత అంటరాని తనం అనేది కేవలం అగ్రవర్ణాలు మరియు నిమ్న వర్ణాలుగా భావింపబడుతున్న వారి మధ్యనే కాకుండా అగ్రవర్ణాలలో ఉన్న వివిధ కులాల మధ్య మరియు నిమ్న వర్ణాలుగా భావింపబడుతున్న కులాల మధ్యకూడా అంటరాని తనం కనిపిస్తుంది. ఉదాహరణ: (1) (బ్రాహ్మణులు ఇతర అగ్రకులాలు వండిన భోజన పదార్థాలను భుజించరు. (2) రెడ్డి, వెలమ, చౌదరి మరియు కమ్మ ఇలాంటి అగ్రకులాలు కూడా వర్ణవ్యవస్థ ప్రకారం శూద్రులే. (3) వెనుకబడిన వర్గాలు అనగా బి.సి. కులాలుగా భావింపబడుతున్న కులాల మధ్య కూడా అంటరాని తనం కనిపిస్తుంది.


    సమాజంపై కులతత్వం యొక్క ప్రభావం


    ♦ కుల తత్త్వం జాతి సమగ్రతకు మరియు సమైక్యతకు పెద్ద అవరోధం. ఇది ప్రజలను సంకుచితంగా ఆలోచించేలా చేస్తుంది, కుల సంఘర్షణలకు, అవినీతికి, పక్షపాతానికి దారితీస్తుంది.

    ♦ కుల సంఘర్షణల వల్ల సమాజంపై వివిధ రూపాలలో ప్రభావం ఉంటుంది. కులపరమైన దాడులు అధికమవుతాయి. 

    ♦ ముఖ్యమైన కుల సంఘర్షణలు.

    ఎ. జూలై 17, 1985న ప్రకాశం జిల్లాలోని కారంచేడులో దళితులపై దాడులు జరిగినవి.

    బి. ఫిబ్రవరి 14, 1981 పూలన్దేవి 22 మంది ఠాకూర్లను హతమార్చింది.

    సి. ఆగస్టు 6, 1991 చుండూరు నందు దళితులపై దాడి

    డి. మార్చి 19, 1990న జరిగిన కంచికచర్ల కోటేప్పై దాడి

    ఇ. బీహార్ రాష్ట్రంలో రణబీర్ సేన అనబడే కులపరమైన ప్రైవేట్ సైన్యాలు ఏర్పడినవి.

    ♦ కులాంతర వివాహాలు చేసుకున్నట్లయితే తమ కూతురును చంపేయడంనే పరువు హత్యలుగా పిలుస్తారు. ఇవి హర్యానా రాష్ట్రం నందు అధికంగా జరుగుతున్నవి. పరువు హత్యలకు ప్రధాన కారణం ఖాప్ పంచాయతులు.

    ♦ కుల ఓటు బ్యాంకుల ఏర్పాటు, కులపరమయిన పార్టీల ఏర్పాటు కూడా గమనించవచ్చు.

    ♦ మత మార్పిడులకు కూడా దారితీస్తుంది.

    ♦ కొన్ని కులాలకు సంబంధించి అంటరానితనం లాంటి దురాచారాలు.

    ♦ కుల ఉద్యమాలు, అశాంతి, సామాజిక అశాంతి, అసమానతలు లాంటి సంఘటనలు ఏర్పడతాయి.

    ♦ జాతి సమైక్యతకు ఆటంకం ఏర్పడుతుంది.

    ♦ మేధావుల వలసలకు దారితీస్తుంది.


    నోట్: షెడ్యూల్డ్ కులాలపై దాడులు అధికంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నందు మరియు గిరిజనులపై దాడులు అధికంగా రాజస్థాన్ రాష్ట్రం నందు అధికంగా చోటుచేసుకుంటున్నాయి.


    కుల అశక్తతలు తగ్గించుటలో రాజ్యాంగం పాత్ర


    కులవ్యవస్థ మరియు కులతత్త్వం వలన ఏర్పడిన సామాజిక కులరూప అశక్తతలైన అంటరానితనం, వెట్టిచాకిరి, కులపరమైన దాడులు, సామాజిక వెలి, సామాజిక ఆకృత్యాలు, దేవదాసీ మరియు జోగినీ వ్యవస్థలు, వారసత్వ పేదరికం, హక్కుల ఉల్లంఘనలు లాంటి వాటి నుండి రక్షించేందుకై రాజ్యాంగ రచన కర్తలు ఆయా ప్రభావ వర్గాలకు రాజ్యాంగం ద్వారా రక్షణ కల్పించారు.


    రాజ్యాంగ పీఠిక ప్రభావం


    ♦ రాజ్యాంగ పీఠికలో పొందుపర్చిన డెమోక్రసీ అనే పదం వల్ల రాజ్యం ఏర్పాటులో అన్ని కులాలకు సమాన అవకాశం కల్గింది.

    ♦ రాజ్యాంగ పీఠికలో ఉన్నటువంటి జస్టిస్ అనే పదం సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ న్యాయం అనే కొనసాగింపును కూడా కలిగి ఉంది. దీనివలన తరతరాలుగా కులవివక్షత వల్ల వీటిని పొందలేక పోయినవారికి అందించే ప్రయత్నం జరిగింది.

    ♦ నిమ్న కులాలుగా భావింపబడే వారు తరతరాలుగా వెట్టిచాకిరి మరియు ఇతర రూపాలలో వివక్షతలకు గురికావడం వల్ల లిబర్టీకి దూరమైనారు కావున రాజ్యాంగ పీఠిక దీనిని అందించడం గమనించవచ్చు.

    ♦ కుల రక్కసి వల్ల ఏర్పడిన అసమానతల తొలగింపుకై సమానత్వం అని పీఠికలో పేర్కొనబడిన అంశం దోహదపడుతుంది.

    ♦ కులరక్కసి వలన దేశప్రజల మధ్య విద్వేశాల స్థానంలో సోదరభావాన్ని తీసుకువచ్చేందుకై ఫ్యాటర్నిటి అనే పదాన్ని కూడా రాజ్యాంగ పీఠికలో చేర్చడం జరిగింది.


    రాజ్యాంగంలో పేర్కొన్న అధికరణల ప్రభావం


    అధికరణం 14 : ప్రకారం ఏ కులస్థులు అయిన చట్టం ముందు సమానమే మరియు అందరికి చట్టం సమాన రక్షణ కల్పిస్తుంది.

    అధికరణం 15(1) : ప్రకారం కులపరమైన వివక్షత నిషేధించడమైనది

    అధికరణం 15(2) : ప్రకారం కులప్రాతిపదికపై ఏ వ్యక్తిని ప్రజలకు అవసరమైన బహిరంగ ప్రదేశాలలోకి ప్రవేశించడాన్ని నిరాకరించరాదు.

    అధికరణం 15(2(ఎ)) : ప్రకారం దుకాణాలు, రెస్టారెంట్లు, హెూటళ్ళు లాంటి ఇతర బహిరంగ ప్రదేశాలలో కుల పరమైన వివక్షత ఉండరాదు.

    అధికరణం 15(2(బి)) : ప్రకారం బావులు, చెరువులు, స్నానఘట్టాలు, రహదారులు మరియు ఇతర బహిరంగ ప్రదేశాలలో కులపరమైన నిషేధాలు పాటించరాదు.

    అధికరణం 16(2) : ప్రకారం కులం ఆధారంగా ప్రభుత్వ రంగాలలో ఉద్యోగ విషయంలో వివక్ష చూపరాదు.

    అధికరణం 17 : ప్రకారం అస్పృశ్యత ఏ రూపంలో ఆచరించిన నేరంగా పాటించబడుతుంది.

    అధికరణం 19 : ప్రకారం ఆరు రకాల స్వేచ్ఛలు కులాలలకు అతీతంగా అందరికి అందించడం జరిగింది.

    అధికరణ 21 : ప్రకారం అందించబడిన జీవించే హక్కులో గౌరవంగా జీవించే హక్కు కూడా భాగమే

    అధికరణం 23 : ప్రకారం నిమ్న వర్గాలలో ఒకప్పుడు అధికంగా గోచరించబడిన మనుషుల అక్రమరవాణా మరియు జోగినీ, దేవదాసీ లాంటి దురాచారాలను నిషేధించడం జరిగింది.

    అధికరణ 24 : ద్వారా నిమ్నవర్గాలలో ఒకప్పుడు అధికంగా కన్పించిన బాలకార్మికతను నిషేధించడం జరిగింది.

    అధికరణం 326 : ప్రకారం కులాలకు అతీతంగా వయోజన ఓటు హక్కు కల్పించడం జరిగింది.


    కుల అశక్తతలపై సంఘసంస్కర్తల పోరాటం


    రాజ్యాంగం అమలునకు ముందు కులపరమైన అశక్తతలు, దురాచారాలు అనునవి తీవ్రతి తీవ్రంగా మరియు అమానవీయంగా ఉండేవి. దళితులు రోడ్లపై నడవడాన్ని, బావులను మరియు చెరువులను వినియోగించుకోవడాన్ని, పాఠశాలలు మరియు దేవాలయాలలో ప్రవేశాన్ని నోచుకోలేకపోయేవారు. వీటితో పాటు వారిపై రకరకాల ఆకృత్యాలు జరిగేవి.


    ఆధునిక విద్యను నేర్చుకున్న భారతీయ మేధావులు మరియు హిందూ మత సంఘసంస్కర్తల కృషివలన హిందూమతంలోని లోపాలపై సంస్కరణ ఉద్యమాలు జరిగి కొద్దివరకు మార్పుకు కారణమయ్యాయి. వీటితో పాటు ఆయా బలహీన వర్గాలకు సంబంధించిన మొదటితరం విద్యావంతులు అయిన పూలే, అంబేద్కర్, భాగ్యరెడ్డివర్మ లాంటి వారి కృషి వలన ఆయా వర్గాలలో చైతన్యానికి పునాదాలు పడినవి.


    కుల నిర్మూలనకై సమాజశాస్త్రవేత్తల సూచనలు


    • యం.ఎన్. శ్రీనివాస్ గారి ప్రకారం పంచవర్ష ప్రణాళికలు, సార్వజనీన ఓటు హక్కు ఉన్నత విద్య మరియు సంక్షేమ పథకాల ద్వారా కులం నిర్మూలన సాధ్యమవుతుంది.
    • ఘర్యే గారి ప్రకారం కులాంతర వివాహాలు మరియు Co-Education ద్వారా కులంను నిర్మూలించవచ్చు.
    • ఐరావతి కార్యే ప్రకారం ఆర్థిక మరియు సాంస్కృతిక సమానత్వం ద్వారా కులంను నిర్మూలించవచ్చును.
    • ప్రొ॥ లక్ష్మన్న గారి ప్రకారం కులం క్రమక్రమంగా అంతరిస్తుంది.
    • పి.ఎన్. ప్రభూ గారి ప్రకారం నూతన విలువల సృష్టి ద్వారా కులాన్ని నిర్మూలించవచ్చును.
    • రజనీష్ కోఠారి సారు తన గ్రంథం 'Caste in Indian Politics' అనే గ్రంథం నందు విద్య, ప్రభుత్వ ప్రోత్సాహం ద్వారా కులతత్త్వ నిర్మూలన సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు.


    పునశ్చరణ


    • కుల లాభదాయమునకు పాటుపడే మనస్తత్వమే కులతత్వం అని తెలిపినది - ఫణిక్కర్.
    • తమ కులం పట్ల గర్వం, గుడ్డివిధేయతను కలిగి ఉండి ఇతర కులాల పట్ల ఘర్షణ పూరిత వైఖరిని కలిగి ఉండడమే కులతత్త్వం.
    • క్యాస్ట్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ అనే గ్రంథాన్ని రచించిన వారు రజనీష్ కొఠారీ.
    • కులపంచాయితీలైన కాప్ పంచాయితీలు, హర్యానా రాష్ట్రం నందు అధికంగా కలదు, ఇవే పరువు హత్యలకు కారణమవుతున్నవనే వాదనలు కలవు.
    • షెడ్యూల్డ్ కులాలపై హింసాపూరిత దాడులు అత్యధికంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నందు సంభవిస్తున్నవి.
    • కులపరమైన వివక్షత ఉండరాదనే అధికరణ 15 తెలుపుతున్నది మరియు అంటరానితనం ఏ రూపంలో ఉన్న అది నిషేధమే అని అధికరణ 17 తెలుపుతున్నది.


Tags: Caste system, gender roles, joint families, arranged marriages, diversity, cultural festivals, social hierarchy, economic disparities, religious practices, education system, urbanization, rural traditions, globalization, modernization


No comments:

Post a Comment

Post Bottom Ad