1.9 గిరిజనులు - GNANA SAMHITHA

GNANA SAMHITHA

DONT WORRY!!! WE HELP YOU TO REACH YOUR GOAL 😊

Breaking

Post Top Ad

Sunday, July 9, 2023

1.9 గిరిజనులు

1.9 గిరిజనులు


    భారతీయ సమాజ విశిష్ట లక్షణాలలో గిరిజన సంస్కృతి కూడా ఒకటి, ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలలో గిరిజనులు ఉన్నప్పటికి భారతదేశంలో ఉన్న గిరిజనులలో వైవిద్యం అధికంగా కలదు. భారత రాష్ట్రపతి తనకు రాజ్యాంగం ఇచ్చిన అధికారం ఆధారంగా ఇప్పటివరకు 730 రకాల గిరిజన తెగలని దేశవ్యాప్తంగా గల వివిధ రాష్ట్రాలలో గుర్తించారు. గిరిజనుల యొక్క ప్రత్యేక సాంస్కృతిక లక్షణాలు, వీరి విస్తరణ, జనాభాపరమైన అంశాలు, గిరిజన సముదాయ లక్షణాలు ఈ పాఠ్యాంశం నందు వివరించబడినవి.


    గిరిజనులు - నిర్వచనాలు


    • భౌగోళికంగా అరణ్యాలు, కొండప్రాంతాలు మరియు ఒంటరి ప్రాంతాలలో నివసిస్తూ అటవీ ఉత్పత్తులు లేదా పోడు వ్యవసాయంపై ఆధారపడుతూ ప్రత్యేకమైన భాషా సంస్కృతులు, వేషాధారణ మరియు జీవన విధానాన్ని కలిగి ఉన్న వారినే గిరిజనులు అని పిలుస్తారు.
    • గిరిజనులు అనే పదానికి విశేష ప్రచారాన్ని కల్పించినవారు - ' మహాత్మాగాంధీ.
    • గిరిజనులను వివిధ నామాలతో పిలుస్తారు. అందులో ముఖ్యమైనవి.
    • సర్ బయాన్స్ వీరిని The Hill tribes అని పిలిచారు.
    • Honుడు వీరిని Primitive tribes అని పిలిచారు.
    • Risley & Elvin లు వీరిని అబారిజినల్స్ లేదా దేశీయ ప్రజలు అని పిలిచారు.
    • Takar Bapa అనే సంఘ సంస్కర్త వీరిని Adhi Praja అని పిలిచారు.
    • Gharye అను సమాజ శాస్త్రవేత్త వీరిని Backward Hindus అని పిలిచారు.
    • I.L.O (International Labour Organisation) వారు గిరిజనులను Idigenious People లేదా అనుసుచిత ప్రజలు అని తెలిపారు.
    • గిరిజ జీవితంలోని మొత్తం సమాజంలో సంబంధాలు బంధుత్వంపై ఆధారపడి ఉంటాయి. బంధుత్వం కేవలం సామాజిక వ్యవస్థాపన సూత్రం మాత్రమే కాదు, ఇది ఆస్తి సంక్రమణ, శ్రమ విభజన మరియు విశిష్టాధికారాల పంపిణీ సూత్రం కూడా, గిరిజన సమాజాలు చిన్నవిగా ఉండి ప్రత్యేక నైతిక విలువలు మరియు ప్రత్యేక మతం మరియు ప్రత్యేక ప్రాపంచిక దృష్టిని కలిగి ఉంటాయి. (ఆధారం: డి.జి. మండేల్ బామ్, 26వ పేజి సామాజిక నిర్మితి - తెలుగు అకాడమీ).
    • వీరిని సూచించేందుకు రాజ్యాంగంలో షెడ్యూల్డ్ ట్రైబ్ అనే పదాన్ని ఉపయోగించారు. షెడ్యూల్ ట్రైబ్ అనే పదాన్ని మొదటి సారి సైమన్ కమీషన్ వినియోగించింది.
    • గిరిజనులకు ఉద్దేశించిన సంక్షేమ పథకాలను కాజేసే లక్ష్యంతో గిరిజనులుగా చలామణి అయ్యే ధోరణిని సూడో ట్రైబలిజం అంటారు. ఇది బ్రిటీష్ పాలనా కాలంలో అధికంగా ఉండేది.
    • బ్రిటీష్ పాలనా కాలంలో కొన్ని సమూహాలను నేర సమూహాలుగా ముద్రలు వేసి క్రిమినల్ ట్రైబ్స్ అని వ్యవహరించేవారు. వీరినే నోటిఫైడ్ ట్రైబ్స్ అనేవారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత నోటిఫైడ్ ట్రైబ్స్ అనే భావన సరైనది కాదని వారిని క్రిమినల్కాదు సాధారణ పౌరులేనని తిరిగి డీ నోటిఫై చేసి ఎక్స్ క్రిమినల్ ట్రైబ్స్ లేదా డీనోటిఫైడ్ ట్రైబ్స్ అని పిలిచేవారు. కాలక్రమంలో వీరు బి.సి.లు మరియు ఎస్.సి.లు మరియు ఎస్.టిలలో ఉపవర్గాలుగా మారినారు.
    • స్థిర నివాసాన్ని కలిగి ఉండకుండా సంచార జీవనాన్ని కలిగి ఉన్నటువంటి గిరిజనులను నొమాడిక్ ట్రైబ్స్ అని అంటారు.


    పర్టిక్యులర్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్ (PVTG)


    దేశ వ్యాప్తంగా రాష్ట్రపతి గుర్తించిన 730 గిరిజన తెగలలో 75 గిరిజన తెగలని అంతరించడానికి సిద్ధంగా ఉన్న గిరిజన తెగలు లేదా పర్టిక్యులర్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్ గా పిలుస్తారు. వీరు కాలక్రమంలో అంతరించిపోయే దశలో ఉన్నారు. 2013 వరకు వీరిని పర్టిక్యులర్ ట్రైబల్ గ్రూప్ గా పిలిచేవారు. దేశ వ్యాప్తంగా ఇలాంటి 75 అంతరించడానికి దగ్గరగా ఉన్న గిరిజన తెగలు ఉండగా, అత్యధికంగా ఒరిస్సాలో ఇలాంటి తెగలు 13 కలవు మరియు ఆంధ్రప్రదేశ్లో 7 గిరిజన తెగలు ఇలాంటి స్థితిలోనున్నవి.


    పి.వి.టి.జి ల యొక్క ముఖ్య లక్షణాలు


    1. ఆదిమ జీవనాన్ని కలిగి ఉండటం

    2. కాలక్రమేణ జనాభా తగ్గుతూ ఉండటం

    3. అత్యంత మారుమూల ప్రాంతాలలో నివసించడం

    4. నాగరిక సమాజానికి చాలా దూరంగా ఉండటం

    5. గిరిజనుల యందు తీవ్రమైన వెనుకబాటు తనం కలిగియున్న గిరిజనులు.

    6. భాషా పరంగా, సంస్కృతి పరంగా మరియు జనసంఖ్య పరంగా రోజురోజుకు తగ్గుతూ ఉండటం.


    గిరిజన సముదాయం యొక్క లక్షణాలు (Features of Tribal Community)


    ఆదిమ జీవనాన్ని కలిగి ఉండటం, అటవీ ఆధారజీవనం, వేట మరియు పోడు వ్యవసాయంపై ఆధారపడటం, ప్రత్యేక భాషను లేక మాండలికాన్ని కలిగి ఉండటం, నాగరిక సమాజానికి దూరంగా పర్వతాలలో మరియు అడవులలో ఒంటరిగా జీవించడం, పోడు వ్యవసాయానికి నాగలిని కూడా ఉపయోగించుకోలేని స్థితిలో ఉండటం. ప్రత్యేక సంస్కృతి మరియు వేషధారణను కలిగి ఉండటం, వ్యక్తుల మధ్య గణనీయమైన ప్రాథమిక సంబంధాలు మరియు పరస్పర ఆధారంగా ఉండటం, సామాజికంగా, సాంస్కృతికంగా మరియు ఆర్థికంగా ఏకరూపకతను కలిగి ఉండటం అనునవి గిరిజనుల యొక్క లక్షణాలు.


    B.N. Majunder గారి ప్రకారం, ప్రతి గిరిజన సముదాయం ఒక ఉమ్మడి నామాన్ని, ఒక ఉమ్మడి నివాస ప్రదేశాన్ని, ప్రత్యేక మాండలికాన్ని కలిగి యుండి గిరిజన సభ్యుల మధ్య పరస్పర ఆధారం మరియు గణనీయమైన ప్రాథమిక సంబంధాలు కలిగి ఉంటుంది.


    డి.జి. మాండేల్ బామ్ భారతీయ తెగల లక్షణాలను ఈ క్రింది విధంగా పేర్కొన్నాడు అవి... (ఆధారం: 26వ పేజీ సామాజిక నిర్మితి - తెలుగు అకాడమీ).

    1. సామాజిక బంధాలతో కూడిన బంధుత్వ

    2. వ్యక్తులు, సమూహాల మధ్య క్రమానుగత శ్రేణి లేకపోవడం

    3. బలమైన సంక్లిష్టమైన మరియు నియత వ్యవస్థాపనలు లేకపోవడం

    4. భూ కమతాల సాముదాయిక ఆధారం

    5. విభాజిత స్వభావం

    6. మార్కెట్ తరహా వ్యాపారం, పెట్టుబడి దారి తనం మరియు మిగులు నిల్వ లాంటివి కనిపించవు.

    7. ప్రత్యేక మానసిక స్థితితో కూడిన జీవనాన్ని కలిగి ఉండడం

    8. పురాతన మత విధానాలను పాటించడం


    L.P. విద్యార్థి గారి ప్రకారం గిరిజనులు ఈక్రింది లక్షణాలను కలిగి ఉంటారు.


    1. ఉమ్మడి భౌగోళిక (Common Territory)

    2. ఉమ్మడి సంస్కృతి (Common Culture)

    3. ఉమ్మడి నామము (Common Name)

    4. ఉమ్మడి నిషేధాలు /ఆజ్ఞలు (Common Taboos)

    5. స్వయం సిద్ధ ఆర్థిక వ్యవస్థ (Self relavent economy system)

    6. గిరిజన నాయకునిపై తిరుగులేని విశ్వాసం (Unlimited faith in traditional Leadership)

    7. ప్రత్యేక పాలన వ్యవస్థ (Unique Political System)


    గిరిజనులు మరియు రాజ్యాంగపరమైన గుర్తింపు


    • రాజ్యాంగంలోని Article 366 (25) అనునది గిరిజన తెగలను నిర్వచించినది.
    • రాజ్యాంగంలోని Article 342 (1) ప్రకారం గిరిజనులను గుర్తించే అధికారం రాష్ట్రపతికి గలదు.
    • ఈ అధికరణం ప్రకారం ఇప్పటివరకు దేశవ్యాప్తంగా రాష్ట్రపతి 705 గిరిజన తెగలను గుర్తించాడు. తెలంగాణలో 32 గిరిజన తెగలను గుర్తించాడు. అత్యధికంగా ఒరిస్సా రాష్ట్రం నందు 62 గిరిజన తెగలను అధికారికంగా గుర్తించారు.
    • రాజ్యాంగంలోని Article 342 (2) ప్రకారం రాష్ట్రపతి గుర్తించిన గిరిజనుల జాబితాను Parliament చట్టం ద్వారా సవరించవచ్చు.
    • ఎస్.టి.ల యొక్క వర్గీకరణ మరియు గుర్తింపు విషయంలో రాష్ట్రాలకి మరియు గవర్నరికి ఎలాంటి అధికారం లేదు.
    • ఒక గిరిజన తెగకి ఒక రాష్ట్రంలో గిరిజన హెూదా ఉండి మరొక రాష్ట్రంలో ఉండక పోవచ్చును. ఉదా: బంజారాలు తెలంగాణలో గిరిజనులు కాని కర్ణాటకలో బి.సి.లు.
    • ఆదిమ లక్షణాలు ప్రత్యేక సంస్కృతి, భౌగోళిక ఏకాంతము, తీవ్రమైన వెనుకబాటుతనం, నాగరిక సముదాయంతో కలవలేకపోవడం అనునవి గిరిజన సముదాయాన్ని గుర్తించుటలో రాష్ట్రపతి పరిగణలోనికి తీసుకుంటాడు కాని ఇవి రాజ్యాంగంలో రాసిలేవు.


    Article 244 ప్రకారం గిరిజన ప్రాంతాల యందు వారియొక్క సంస్కృతికి మరియు జీవన విధానానికి ఆటంకం కలగకుండా ప్రత్యేకమైన పాలన విధానం ఏర్పాటు చేయడం జరిగింది. అవి...


    1. నిబంధన 244(1) ప్రకారం అస్సాం, మేఘాలయ, త్రిపుర మరియు మిజోరాం రాష్ట్రాలు మినహాయించి మిగతా రాష్ట్రాలలో ఉన్న గిరిజన ప్రాంతాలలో పరిపాలనకు సంబంధించి రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్లోని నిబంధనలను అనుసరించి పరిపాలన కొనసాగించాలి.


    ఒక ప్రాంతాన్ని 5వ షెడ్యూల్ ప్రాంతంగా గుర్తించేందుకు ఈ క్రింది అంశాలు పరిగణలోనికి తీసుకుంటారు. అవి....


    1. ఆ ప్రాంతంలో అధిక మొత్తంలో గిరిజన జనాభా ఉండాలి.

    2. భౌగోళికంగా చిన్నదిగా మరియు కేవలం గిరిజనులతోనే కూడి ఉండాలి

    3. పరిపాలనకు కావలసిన కనీస భౌగోళికతను కలిగి ఉండాలి.

    4. చుట్టు ప్రక్కల ప్రాంతాలతో పోలిస్తే ఆర్థికంగా వెనుకబాటుకు గురయ్యి ఉండాలి.


    నోట్: రాష్ట్రపతి సంబధిత రాష్ట్ర గవర్నర్ని సంప్రదించి 5వ షెడ్యూల్డ్ ఏరియాలను ప్రకటిస్తారు.


    2. నిబంధన 244(2) ప్రకారం అస్సాం, మేఘాలయ, త్రిపుర మరియు మిజోరాం రాష్ట్రాల యందు 6వ షెడ్యూల్లో పొందుపరచిన నిబంధనల ఆధారంగా పాలన కొనసాగించాలి.


    నోట్: 1. 5వ షెడ్యూల్ ప్రకారం గిరిజన సలహా మండళ్ళు ఉండాలి. 6వ షెడ్యూల్ ప్రకారం స్వయం ప్రతిపత్తి గలిగిన గిరిజన జిల్లాలను ఏర్పాటు చేశారు.

    2. దేశ వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ సహా ప్రస్తుతం 10 రాష్ట్రాలలోని ప్రాంతాలను 5వ షెడ్యూల్ ప్రాంతాలుగా ప్రకటించడం జరిగింది.


    గిరిజనుల జనాభా పరమైన వివరాలు


    • దేశవ్యాప్తంగా 2011 జనాభా లెక్కల ప్రకారం గిరిజన జనసంఖ్య 10కోట్ల 45 లక్షలు. దేశ జనాభాలో వీరి శాతం 8.6% మరియు దేశం నందు గల 15% భూవిస్తీర్ణంలో వీరు విస్తరించి ఉన్నారు.
    • 2001 మరియు 2011 నకు గాను గిరిజనుల యందు జనాభా పెరుగుదల శాతం 23.7%.
    • గిరిజనులలో లింగ నిష్పత్తి దేశవ్యాప్తంగా (2011 జనాభా లెక్కల ప్రకారం) 990, 0-6 సం॥ల వారిలో లింగ నిష్పత్తి 957.
    • దేశవ్యాప్తంగా గిరిజనులలో అక్షరాస్యత 58% కలదు. దీనిలో పురుష అక్షరాస్యత 68.5, స్త్రీ అక్షరాస్యత 49.4.
    • గిరిజనులపై అధికంగా దాడులు మరియు హింసకు సంబంధించిన కేసులు రాజస్థాన్ రాష్ట్రం నందు నమోదవుతున్నవి.
    • మధ్యప్రదేశ్ రాష్ట్రం నందు అన్నిరాష్ట్రాలలో కెల్లా గిరిజనులు అత్యధిక సంఖ్యలో ఉన్నారు, రెండవ స్థానం మహారాష్ట్ర మరియు గోవా రాష్ట్రం అతితక్కువ గిరిజన జనాభా కలిగిన రాష్ట్రం.
    • 100% ఎస్.టి.జనాభాను కలిగి యున్నది లక్షద్వీప్.
    • రాష్ట్ర జనాభాలో అధిక శాతం గిరిజనులు కలిగిన రాష్ట్రం, మిజోరాం (94.4%).
    • హర్యానా, పంజాబ్, ఛండీఘర్, ఢిల్లీ, పుదుచ్చేరిల యందు ఎస్.టి.లను అధికారికంగా గుర్తించలేదు.
    • అధికరణం 342 క్రింద గుర్తించిన తెగల సంఖ్య 730. వీరిలో ఒడిస్సాలో అత్యధికంగా 62 తెగలు మరియు ఆంధ్రప్రదేశ్ లో34 తెగలు కలవు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 75 పి.వి.టి.జిలలో అధికంగా ఒడిస్సా నందు (13) మరియు ఆంధ్రప్రదేశ్ లో (7) పి.వి.టి.జిలు కలవు.
    • అన్ని కేంద్ర పాలిత ప్రాంతాల్లో కెల్లా దాద్రానగర్ హవేలీలో గిరిజన తెగలు అధికంగా (7) కలవు.
    • దేశవ్యాప్తంగా అధిక సంఖ్యలో ఉన్నటువంటి గిరిజన తెగ - భిల్లులు. వీరు ఉత్తర భారతదేశమంతా విస్తరించి ఉన్నారు. రెండవ స్థానంలో సంతాల్స్ ఉన్నారు.
    • అరుణాచల్ ప్రదేశ్లో అత్యధికంగా 13 గిరిజన జిల్లాలు గుర్తించబడినవి.
    • దేశవ్యాప్తంగా అత్యల్ప సంఖ్యలో ఉన్నటువంటి గిరిజన తెగ సెంటినలిన్స్ వీరు అండమాన్ నికోబార్ దీవులలో జీవిస్తున్నారు.


    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నందు గిరిజనులు


    ♦ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నందు 2011 జనాభా లెక్కల ప్రకారం 27.39 లక్షల గిరిజనులు కలరు. రాష్ట్ర జనాభాలో వీరిశాతం 5.53%, గిరిజనుల యందు అక్షరాస్యత 48.83%.

    ♦ దేశ మొత్తంలోని గిరిజన జనాభాలో ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న షెడ్యూల్డ్ తెగల జనాభా శాతం 2.5

    ♦ ఆంధ్రప్రదేశ్ లోషెడ్యూల్డ్ తెగల అక్షరాస్యత 48.83%, ఇది స్త్రీలలో 39.40% మరియు పురుషులలో 58.37% కలదు.

    ♦ ఆంధ్రప్రదేశ్ నందు 34 గిరిజన తెగలు, 7 పి.వి.టి.జిలు కలవు. (సోర్స్ : ఎ.పి. ట్రైబల్ వెల్ఫేర్ శాఖ వారి ప్రకారం) వారు 

    1. కొండారెడ్డి

    2. సవర

    3. గడబ

    4. పోర్జా

    5. ఖోండ్

    6. చెంచు

    7. కోలమ్


    ♦ ఆంధ్రప్రదేశ్ లో బంజారాల నివాస స్థలాన్ని తండాలని, చెంచుల నివాస స్థలాలని పెంటలని మరియు కోయల నివాస స్థలాన్ని డెలు అని అంటారు.

    ♦ వీరిలో బాలల లింగనిష్పత్తి 964.

    ♦ ఆంధ్రప్రదేశ్ నందు 6,841.31 చ.కి.మీ, షెడ్యూల్డ్ ఏరియా ఇది మొత్తం రాష్ట్ర భూభాగంలో 8.82%, ఈ ప్రాంతం 3,512 గ్రామాలుగా పార్వతిపురం మన్యం, అల్లూరి జిల్లా మరియు ఏలూరు జిల్లాలలో విస్తరించి ఉంది.

    ♦ రాష్ట్రం నందు పార్వతిపురం మన్యం మరియు అల్లూరి జిల్లాలను గిరిజన జిల్లాలుగా ప్రకటించారు.

    ♦ రాష్ట్రం నందు 9 ITDA లు కలవు. అవి... చింతూరు, కోట రామచంద్రపురం/కె.ఆర్.పురం, నెల్లూరు, పాడేరు, పార్వతీపురం, రంపచోడవరం, సీతంపేట, శ్రీశైలం మరియు మైదాన ప్రాంతాలు.


    గిరిజనుల వర్గీకరణ మరియు భౌగోళిక విస్తరణ


    బి.కె. రాయ్బర్మన్ అనునతడు గిరిజనులను వారియొక్క చారిత్రక, జాతిపరమైన మరియు సాంస్కృతిక అంశాల ఆధారంగా 5 ప్రాదేశిక సమూహాలుగా వర్గీకరించారు. అవి... (ఆధారం: 27వ పేజి సామాజిక నిర్మితి - తెలుగు అకాడమీ)

    1. ఈశాన్య భారతదేశంలోని గిరిజనులు

    2. ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ మరియు సబామాలయన్ ప్రాంతాలలోని గిరిజనులు

    3. పశ్చిమబెంగాల్, బీహార్, ఒరిస్సా, మధ్యప్రదేశ్ మరియు ఆంధ్రప్రదేశ్లో గల గిరిజనులు

    4. ఆంధ్రప్రదేశ్ మినహాయించి మిగతా దక్షిణ భారతదేశంలోని గిరిజనులు

    5. రాజస్థాన్, గుజరాత్ మరియు మహారాష్ట్రలలో గల గిరిజనులు


    భారతదేశంలోని గిరిజనుల యందు అధిక సంఖ్యలో ప్రోటో ఆస్ట్రలాయిడ్ జాతి లక్షణాలు కనపడతాయి, హిమాలయ ప్రాంతాలలోని తెగలయందు మంగోలాయిడ్ లక్షణాలు కనపడతాయి.


    గిరిజనులను 3 ప్రధాన వర్గాలుగా బోస్ అనునతడు వర్గీకరించాడు. వారు..


    1. వేటగాళ్ళు, చేపలు పట్టేవాళ్ళు మరియు ఆహార సంగ్రాహకులు...

    ఉదా: చెంచులు, గుత్తికోయలు మరియు కొండరెడ్లు.

    2. మారక వ్యవసాయ దారులు... ఉదా: కోయలు

    3. నాగలిని ఉపయోగించి వ్యవసాయం చేసే స్థిర వ్యవసాయదారులు...

    ఉదా: సంతాలులు, గోండులు, బిల్లులు, ఒరాన్లు మరియు ముండాలు


    ఒరాన్లను మరియు ముండాలను గ్రామీణ రైతులని ఎన్.సి. రాయ్ పేర్కొన్నాడు మరియు ఆదిలాబాద్లోని రాజగోండ్లను రైతులుగా హైమన్దార్ఫ్ పేర్కొన్నాడు, అదేవిధంగా ఒరిస్సాలోని ఖోండులను కూడా ఎఫ్.జి.బేయిల్ అనునతడు పరిగణించాడు.


    వృత్తుల ఆధారంగా గిరిజనులను ఈ క్రింది విధంగా వర్గీకరించవచ్చు.


    1. వేటాడే తెగలు: ఉదాహరణ... చెంచులు, కురుంబలు, పలివాన్లు మరియు అండమాని తెగలు

    2. పోడు వ్యవసాయం చేసే తెగలు: ఉదాహరణ... గోండులు, భైగాలు

    3. మైదాన ప్రాంతంలో వ్యవసాయం చేసే గిరిజనులు: ఒరాన్లు, ముండాలు, సంతాలులు మరియు హెూలు

    4. కుటీర పరిశ్రమలు లేదా కొన్ని ప్రత్యేక వృత్తులను అనుసరిస్తున్న గిరిజనులు: ఎరుకుల, గుజ్జర, కిన్నెర, అగరాయ, కోళంలు మరియు ఇరులాలు.

    5 పశుపాలక గిరిజనులు: తోడాలు, బంజారులు, గద్దెలు లాంటివారు

    6. జానపద తెగలు: కోటాలు

    7. కార్మిక తెగలు

    8. వస్తుమార్పిడి వ్యాపారం చేసే తెగలు


    గిరిజనులు దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్నారు. బి.ఎస్. గుహ గారు గిరిజన విస్తరణని 3 రకాలుగా వర్గీకరించారు.


    1. ఉత్తర ఈశాన్య ప్రాంతం నందు గిరిజనులు: లెప్చాలు, గారోలు, ఖాసిలు, చెమ్కాలు, నాగాలు, ఆంగామీలు, వీరిని మొదటి జోన్ గిరిజనులుగా పిలుస్తారు. వీరు ప్రధానంగా మంగోలాయిడ్ జాతికి చెందిన వారు.

    2. మధ్యభారత గిరిజనులు: గోండులు, ముండాలు, భైగాలు, భిల్లులు, కోలీలు, సవరలు, ఒరాన్లు, హెూలు, సంతాలులు వీరిని రెండవ జోన్ గిరిజనులుగా పిలుస్తారు. భారతదేశం నందు గల గిరిజనులలో 81% ఈ ప్రాంతంలోనే నివసిస్తున్నారు. వీరు ప్రధానంగా నర్మదా మరియు గోదావరి నదుల తీరాలలో మరియు మధ్యభారత పర్వత ప్రాంతాలలో నివసిస్తున్నారు.

    3. దక్షిణ భారతదేశంలోని గిరజనులు: కొండ రెడ్లు, కోయలు, చెంచులు, తోటీలు, కడార్లు, సుగాలిలు, ఉరలిలు, కురంబలు, బడగలు, ముత్తువాన్లు మొదలగువారిని మూడవ జోన్ గిరజనులుగా పిలుస్తారు.


    పై మూడు గిరిజనులకు అధనంగా సి.బి. మెమోరియా గారు అండమాన్ నికోబార్ ప్రాంతంలో నివసించేటువంటి గిరిజనులను (సెంటినలిన్స్, అండమాన్స్, జరావాస్) కలిపి 4వ జోన్ గిరిజనులుగా పిలిచారు.


    మెవర్ ఎల్విన్ అనునతడు గిరిజనుల యొక్క విస్తరణను ఈ క్రింది విధంగా తెలిపాడు.


    1. క్లాస్-1 గిరిజనులు: ఇతర సమూహాలతో సంబంధం లేకుండా అత్యంత ఏకాంతంగా జీవిస్తున్న గిరిజనులు.

    ఉదా: అండమాన్ గిరిజనులు

    2. క్లాస్-2 గిరిజనులు: నాగరిక సముదాయాలతో సంబంధాన్ని కలిగి ఉండి కొద్దికొద్దిగా మార్పుకు గురవుతున్నవారు.

    ఉదా: కోయలు

    3. క్లాస్-3 గిరిజనులు: తీవ్రమైన మార్పుకు లోనై హిందువులలో భాగంగా మారిన గిరిజనులు.

    ఉదా: సంతాలులు

    4. క్లాస్-4 గిరిజనులు: పూర్తిస్థాయలో నాగరికతకు గురై తమ సంస్కృతిని పరిరక్షించుకుంటున్న గిరిజనులు.

    ఉదా: సుగాలిలు లేదా బంజారులు.


    ఘర్యే అనునతడు గిరిజనులను ఈ క్రింది విధంగా వర్గీకరించాడు.

    1. హిందువులలో కలిసిపోయిన గిరిజనులు

    2. హిందువులను అనుకరిస్తున్న గిరిజనులు

    3. ఏకాంతంగా నివసిస్తూ తమ ప్రత్యేక సంస్కృతిని నిలబెట్టుకున్న గిరిజనులు అని వర్గీకరించాడు.


    గిరిజనుల యందు యువతను సామాజీకరణకు గురిచేసేందుకు ప్రతి గిరిజన తెగకు తమదైన ప్రత్యేక ప్రదేశాలుంటాయి వాటినే యువత నిద్రాశాలలు అంటారు. వీటిని నాగాలలో అంచులని, ముండాలలో గిట్టిమూర అని, ఒరాండ్లలో తమ్కురియా అని, గోండులలో గొట్టులని పిలుస్తారు.


    గిరిజనులు - యువత నిద్రశాలలు


    భారతదేశంలోని గిరిజనులలో ఒకప్పుడు వయస్సుని అనుసరించి సమవయస్కు బృందాలను ఏర్పాటు చేసేవారు. వీరిని యువత నిద్రశాలలు అనే కేంద్రాలకు పంపించేవారు. ఈ కేంద్రాలలో ప్రధానంగా ఆహార సేకరణ మరియు వేటనే జీవనాధారంగా చేసుకున్న గిరిజన సముదాయాలలో కనిపిస్తాయి.


    ఇవి గిరిజన ఆవాసాల మధ్యలో ఉంటాయి. ఇందులో చేరిన బాలలు వివాహమయ్యేంత వరకు అక్కడే ఉండాలి. ఇక్కడే గిరిజన బాలలు సామాజీకరణకు గురవుతారు మరియు వేట ఇతర రక్షణ విద్యలు నేర్చుకుంటారు. యువత నిద్రశాలలు ఒక రకంగా సామాజీకరణ కేంద్రాలుగా, విద్యాకేంద్రాలుగా పనిచేస్తాయి.


    కొన్ని ముఖ్యమైన గిరిజన తెగలలో గల యువత నిద్రశాలలు, వాటికి గల పేర్లు



    బంజారాలుకు సంబంధించిన ముఖ్యాంశాలు


    వీరు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా విస్తరించి ఉన్నారు. వీరినే సుగాలిలు లేదా లంబాడాలు అని కూడా అంటారు. వీరిని 1977వ సంవత్సరంలో షెడ్యూల్డ్ ట్రైబ్లో చేర్చడం జరిగింది. కర్ణాటకలో వీరు బి.సి.లు గా పరిగణించబడతారు. సుగాలి అనగా పశువుల కాపరులు అని అర్థం. వీరు రాజస్థాన్ నుండి వలస వచ్చినారు అని మరియు మొఘల్ సైనికులకు సరుకులు సరఫరా చేసేందుకు సహాయపడుతూ దక్షిణ భారతదేశంనకు వచ్చినారనే వాదనలు కలవు. బంజారా అనే పదం బెంజ్ మరియు ఆరింద్ పదాల కలయిక వల్ల ఏర్పడింది. దీని యొక్క అర్థం వరిధాన్యపు డీలర్.


    లంబాడి అనగా పొడవాటి దేహాన్ని కలిగిఉన్నవారని కూడా అర్థం కలదు. వీరు ఉత్తర భారతదేశంలో ధాన్యం వర్తకులుగా ఉండేవారు. బంజారాలకు ఆశ్రిత కులంగా దాడియాలు లేదా డాడీలు అనేవారు ఉంటారు. బంజారాలు మధుర, లభాణి, ధాడియా మరియు చరణ్ అనే నాలుగు ప్రధాన వర్గాలుగా ఉంటారు. ఒకప్పుడు వీరు దేవరన్యాయం మరియు వధుసేవను పాటించేవారు. వీరు షీధా భవాణి మాత మరియు హనుమాన్, బాలాజీలను ఆరాధిస్తారు. వీరి నివాస స్థలాలను తండాలు అంటారు. వీరి యొక్క ప్రధాన పండుగలు తీజ్ మరియు దాటుడు పండుగలు. మహారాష్ట్రలోని తుల్జాపూర్లో ఉన్నటువంటి తుల్జా భవాణి గుడిని తరచుగా సందర్శిస్తారు. వీరు నాయక్, రాథోడ్, సింగ్ లాంటి నామాంతాలను కలిగి ఉంటారు. వీరిలో సేవాలాల్ అనునతడు ప్రముఖ ఆధ్యాత్మికవాది మరియు సంఘసంస్కర్త. వీరు పశువుల ప్రేమికులు.


    గిరిజనులు మరియు వారు విస్తరించి ఉన్న ప్రాంతాలు


           

    గిరిజనులకు సంబంధించిన ముఖ్యమైన కమీషన్లు


    1. దేబర్ అధ్యక్షుడిగా ఏప్రిల్ 28, 1960న రాష్ట్రపతి నియమించిన షెడ్యూల్డ్ ఏరియాలు మరియు షెడ్యూల్డ్ తెగల కమీషన్ గుర్తించేందుకు ఏర్పాటుచేశాడు.

    2. డిసెంబర్ 12, 1968న షెడ్యూల్డ్ కులాలు మరియు తెగల సంక్షేమ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటుచేశాడు.

    3. మార్చి 26, 1969న చందా అధ్యక్షతన పార్లమెంటరీ సంయుక్త కమిటీ ఏర్పాటుచేశాడు.

    4. జూన్ 01, 1965న బి.ఎన్. లోకూర్ అధ్యక్షతన ఎస్.సి, ఎస్.టి. ల జాబితాలలో మార్పులు చేయడానికి కమిటీలు ఏర్పాటు చేశారు.

    5. మే 01, 1959న ఎల్విన్ అధ్యక్షతన ప్రత్యేక బహుళార్థ సాధక గిరిజన సమితుల వ్యవహారాల కమిటీని ఏర్పాటు చేశాడు.

    6. ఏప్రిల్ 09, 1980న బి.కె. రాయ్బర్మన్ అధ్యక్షతన అడవులు మరియు గిరిజన స్థితిగతులపై కమిటీని నియమించారు.

    7. డిసెంబర్ 05, 1966న పి. షీలువో అధ్యక్షతన గిరిజనాభివృద్ధి పథకాలపై అధ్యయన బృందాన్ని ఏర్పాటు చేశారు.

    8. ఏప్రిల్ 15, 1972న ఎల్.పి. విద్యార్థి అధ్యక్షతన ప్రణాళిక సంఘం వారు గిరిజన ప్రాంతాలపై కార్యాచరణ బృందాన్ని ఏర్పాటుచేశారు.


    గిరిజనులకు సంబంధించిన ముఖ్యమైన తేదీలు


    • ఆగస్టు 09 ని అంతర్జాతీయ గిరిజన దినోత్సవంగా జరుపుకుంటారు.
    • ఆగస్టు 09, 1982న మొదటిసారి ఐఖ్యరాజ్యసమితి గిరిజన హక్కులపై సమావేశం నిర్ణయించింది.
    • 1993వ సంవత్సరాన్ని అంతర్జాతీయ గిరిజన సంవత్సరంగా గుర్తించారు.
    • 13 సెప్టెంబర్ 2007న ఐఖ్యరాజ్యసమితి గిరిజన హక్కుల డిక్లరేషన్ని రూపొందించింది.
    • 1957వ సంవత్సరంలో అనుసూచిత ప్రజలు మరియు గిరిజనులకు సంబంధించిన కన్వెన్షన్ని ఐఖ్యరాజ్యసమితి రూపొందించగా దీనిపై భారతదేశం 1958లో సంతకం చేసింది.
    • 2007లో మొదటి సారి మధ్యప్రదేశ్లోని అమరకంటక్ నందు జాతీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటుచేశారు.
    • నిజాం రాజ్యంలోని గిరిజనుల స్థితిగతులపై అధ్యయనం చేసినవారు హైమండార్ఫ్.


    పునశ్చరణ


    • గిరిజనులు అనే పదానికి విశేష ప్రాచుర్యం కల్పించిన వారు - మహాత్మాగాంధీ.
    • గిరిజనులకు ఉద్ధేశించిన కార్యక్రమాలను గిరిజనేతరులు పొందడాన్నే సూడో ట్రైబలిజం అంటారు.
    • బ్రిటీష్ వారి సమయంలో నేర తెగలుగా గుర్తించిన గిరిజనులను ప్రస్తుతం ఎక్స్ క్రిమినల్ ట్రైబ్స్ లేదా డీనోటిఫైడ్ తెగలు అని పిలుస్తున్నారు.
    • దేశవ్యాప్తంగా భారత రాష్ట్రపతి ఇప్పటి వరకు 730 గిరిజన తెగలను గుర్తించారు. వీరిలో 75 తెగలను పర్టిక్యులర్ వల్నరబుల్ బాగా కేంద్రం గుర్తించింది.
    • ఆంధ్రప్రదేశ్లో 34 గిరిజన తెగలు కలవు, ఇందులో 7 తెగలు పర్టిక్కులర్ వల్నరబుల్ ట్రైబ్స్.
    • ఉమ్మడి నామం, ఉమ్మడి సంస్కృతి, సాంప్రదాయ నాయకత్వం, ధృఢమైన మేము అనే భావన, ప్రాథమిక సంబంధాలు ప్రత్యేకమైన భాష లేదా మాండలికము, పోడు వ్యవసాయం లేదా అటవీ ఉత్పత్తుల లేదా వేట ఆధారిత జీవనోపాధి అనునవి గిరిజన సమాజం యొక్క ముఖ్య లక్షణాలు.
    • ఒరిస్సా రాష్ట్రం నందు అత్యధికంగా 62 గిరిజన తెగలు కలవు మరియు ఒరిస్సా రాష్ట్రం నందే అత్యధికంగా 13 పర్టిక్యులర్ వల్నరబుల్ తెగలు కలవు.
    • దేశ జనాభాలో గిరిజనులు 8.6 శాతాన్ని మరియు విస్తీర్ణంలో 15 శాతాన్ని కలిగి ఉన్నారు.
    • రాజస్థాన్ రాష్ట్రం నందు గిరిజనులపై అధికంగా దాడులు జరుగుచున్నవి.
    • హర్యానా, పంజాబ్, ఛండీఘర్, ఢిల్లీ మరియు పుదుచ్చేరిలలో గిరిజనులు లేరు.
    • మధ్యప్రదేశ్ రాష్ట్రం నందు గిరిజన జనాభా అధికంగా కలదు.
    • దేశ వ్యాప్తంగా అధిక సంఖ్యలో ఉన్న గిరిజనులు - భిల్లులు.
    • టెండుల్కర్ మెథడాలజీ ప్రకారం భారతదేశంలో గ్రామీణ గిరిజనులలో 45.3% మరియు పట్టణ ప్రాంతాలలోని గిరిజనులలో 24.1% దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారు.




Tags: Caste system, gender roles, joint families, arranged marriages, diversity, cultural festivals, social hierarchy, economic disparities, religious practices, education system, urbanization, rural traditions, globalization, modernization


1 comment:

  1. It's excellent useful material sir ...sir if u don't mind could you please provide this information to pdf material sir

    ReplyDelete

Post Bottom Ad