1.5 కుటుంబం (Family) - GNANA SAMHITHA

GNANA SAMHITHA

DONT WORRY!!! WE HELP YOU TO REACH YOUR GOAL 😊

Breaking

Post Top Ad

Wednesday, July 5, 2023

1.5 కుటుంబం (Family)

1.5  కుటుంబం (Family)


    మానవ సమాజంలో కుటుంబం అనేది ఒక ప్రాథమిక సామాజిక సంస్థ, ప్రాథమిక సామాజీకరణ ఏజెన్సీ, ప్రాథమిక సోషల్ యూనిట్ మరియు మనుషులని జైవిక జీవులనుండి సామాజిక జంతువుగా మార్చే ఒక సామాజిక కర్మాగారం. శరీరం నందు కణం ఎలాంటి పాత్ర వహిస్తుందో సమాజం నందు కూడా కుటుంబం అలాంటి పాత్ర వహిస్తుంది. ఒక సమాజం యొక్క స్వభావం ఆ సమాజం నందుగల కుటుంబాల యొక్క నిర్మాణం మరియు ఆయా కుటుంబాలు నిర్వర్తిస్తున్న ప్రకార్యాలు లేదా విధులను బట్టి ఉంటుంది. కావున ఏ దేశ సామాజిక నిర్మితి అయిన ఆ దేశం నందున్న కుటుంబ వ్యవస్థను బట్టి ఉంటుంది. ఈ యూనిట్ నందు కుటుంబం యొక్క నిర్వచనాలు, లక్షణాలు, వివిధ కుటుంబ రూపాలు, శాస్త్రవేత్తల దృక్పథాలు భారతదేశం నందుగల కుటుంబ వ్యవస్థ రూపాలు మరియు కుటుంబ వ్యవస్థలో వస్తున్నటువంటి వివిధ రకాల మార్పుల గురించి కూలంకశంగా వివరించబడింది.


    కుటుంబం ప్రాథమిక భావనలు మరియు నిర్వచనాలు


    • Family అనబడే ఇంగ్లీష్ పదం సేవకుడు అనే అర్థం గల Famulous అనబడే రోమన్ పదం నుండి ఆవిర్భవించింది.
    • కుటుంబం, సేవకులు & బానిసలను కలిపి ఉమ్మడిగా పిలిచే Famila అనబడే లాటిన్ పదం నుండి ఉద్భవించినదనే వాదన కూడా కలదు.
    • వైవాహిక & రక్త సంబంధం ద్వారా మరియు దత్తత మార్గంలో బంధుత్వంను కల్గి ఉండి ఒకే గృహంలో నివసించే వ్యక్తుల సమూహాన్ని కుటుంబం అంటారు.
    • మకైవర్ దృష్టిలో లైంగిక సంబంధాలతో కూడి చాలినంతవరకు సంతానాన్ని పొంది వారిని పెంచడం కోసం శాశ్వతంగా ఏర్పడిన సమూహమే కుటుంబం.
    • ఇది ఒక ప్రాథమిక సామాజిక సంస్థ (వ్యక్తి యొక్క జీవితంపై మరియు సమాజంలోని వ్యక్తులపై ఉమ్మడిగా ప్రభావాన్ని చూపే మరియు ఉమ్మడిగా ఆచరింపబడే విధానాలనే సామాజిక సంస్థలు అంటారు. కుటుంబంతో పాటు వివాహం, బంధుత్వం, మతం లాంటి వాటిని కూడా ప్రాథమిక సామాజిక సంస్థలుగా పరిగణిస్తారు).
    • బాలల యొక్క సామాజికీకరణలో అతి ముఖ్యమైన సంస్థ కావున కుటుంబాన్ని ప్రాథమిక సామాజీకరణ సాధనంగా పిలుస్తారు.
    • మే 15 రోజున అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం జరుపుకుంటారు.


    ఎడ్మండ్ లీచ్ యొక్క ఈ క్రింది భావనని కుటుంబంనకు సంబంధించి సమగ్రమైన నిర్వచనంగా భావిస్తారు. ఇతని ప్రకారం, కుటుంబం:


    1. వివాహం ద్వారా ఏర్పడాలి

    2. చట్టబద్ధమైన పిత్వత్వ & మాతృత్వాలుండాలి.

    3. దంపతుల మధ్య లైంగిక పరమైన గుత్తాధిపత్యం ఉండాలి.

    4. దంపతుల మధ్య శ్రమ & సేవకులకై ఒకరిపై ఒకరికి హక్కులుండాలి.

    5. సంతానం ప్రయోజనం కోసం సమిష్టి నిధిని ఏర్పాటు చేయాలి.


    స్టీఫెన్ సన్, కుటుంబానికి ఉండవలసిన ఈ క్రింది 4 ప్రమాణాలను పేర్కొన్నాడు.

    1. వివాహ ఒప్పందం

    2. కలిసి నివసించడం

    3. భార్య భర్తల మధ్య పరస్పర ఆర్థిక బాధ్యతలు

    4. తల్లిదండ్రులుగా నిర్వర్తించవలసిన హక్కులు & బాధ్యతలు

    రేమండ్ ఫర్త్ అనునతడు కుటుంబాన్ని భర్త, భార్య & వారి సంతానంతో కలసి ఏర్పడిన త్రికోణంగా పేర్కొన్నాడు.



    • కుటుంబం ఒక సమూహం ఈ సమూహం లైంగిక సంబంధాలతో ఏర్పడి పిల్లల్ని కనడం మరియు పెంచడం కోసం శాశ్వత ప్రాతిపదికన కొనసాగుతుంది - మకైవర్
    • వివాహ సంబంధం ద్వారా కాని, రక్త సంబంధం ద్వారా కాని, దత్తత ద్వారా కాని ఒకే గృహమును ఏర్పాటు చేసుకొని పరస్పర క్రియలు, పరస్పర బాధ్యతల ద్వారా ఒక ఉమ్మడి సంస్కృతిని కలిగి ఉండిన నివాస సమూహాన్నే కుటుంబం అంటారు - బడ్జెక్ & లాక్.
    • వైవాహిక సంబంధాలు, బాధ్యతలు, విధులు, కలిసి నివసించడం, తల్లిదండ్రులు వారి సంతానం మధ్య పరస్పర సంబంధాలు అనే అంశాలపై ఆధారపడే సమూహమే కుటుంబం - రాబర్ట్ లూయి.
    • 1955నకు ముందు కేవలం లైంగిక మరియు ఆర్థిక సంబంధాల ఆధారంగా కుటుంబాన్ని నిర్వచించినారు. ఆ తర్వాత కాలంలో కుటుంబాన్ని సమగ్రంగా నిర్వచించినారు.


    పై నిర్వచనాలు మరియు భావనల ఆధారంగా కుటుంబం అనునది వ్యక్తుల సమూహం ఇది వివాహం లేదా రక్త సంబంధం లేదా దత్తత ద్వారా ఏర్పడుతుంది మరియు కుటుంబం నందు గల వ్యక్తుల మధ్య పరస్పర బాధ్యతలు మరియు పరస్పర హక్కులు అనునవి ఉంటాయి.


    కుటుంబ పరిణామం


    ముర్దాక్ ప్రపంచంనందలి 250 సమాజాలని అధ్యయనం చేసిన తరువాత, కుటుంబం స్వైరత్వం బహు వివాహం, ఏక వివాహంగా పరిణమించిందని పేర్కొన్నాడు.

    ఇతని అభిప్రాయంలో మొదటగా స్వైరత్వం ఉంది కాబట్టి (వివాహం లేకుండానే లైంగిక సంబంధాలు కలిగి ఉండటం) లైంగిక సంబంధాల వల్ల జనించిన సంతానం తల్లితో ఉండవల్సిరావడం వల్ల మొదటగా మాతృస్వామ్య కుటుంబాలు ఏర్పడినవి.

    స్త్రీ,పురుషుల మధ్యగల జైవిక, సామర్థ్యం, నైపుణ్యాల తేడాల వల్ల కాలక్రమేణా ఒకరిపై ఒకరు ఆధారపడే ప్రస్తుత కుటుంబ వ్యవస్థ ఏర్పడింది.


    కుటుంబం లక్షణాలు


    ప్రపంచంలోని ప్రతి మానవ సమాజం కుటుంబాలతో కలిసి ఏర్పడి ఉన్నవి. ఆయా సమాజాలలో కుటుంబం యొక్క స్వరూపం మరియు అది నిర్వహించే ప్రకార్యాలు, పాటించే విలువలు వేరువేరుగా ఉండవచ్చు కాని సర్వసాధారణంగా అన్ని రకాల సమాజాలలో కుటుంబం ఈ క్రింది లక్షణాలను కలిగి ఉంటుంది.


    1. విశ్వవ్యాప్తం/సార్వజనీనం: అన్ని సమాజాలలో కన్పిస్తుంది.

    2. పరిమిత పరిమాణం: సమాజంలోని అన్ని సమూహాల కంటే కుటుంబం అనేది అతిచిన్న సమూహం, ప్రాథమిక సమూహం మరియు ప్రాథమిక సామాజిక సంస్థ, అన్ని రకాల సమూహాలలో కెల్లా కుటుంబం నందు మన అనే భావన (we feeling) అధికంగా ఉంటుంది.

    3. సమాజంలో కేంద్ర స్థానం: కుటుంబాల కలయికతోనే సమాజం ఏర్పడుతుంది. కుటుంబాల స్వభావంను బట్టి సమాజం యొక్క స్వభావం ఉంటుంది. సమాజం యొక్క ప్రాథమిక యూనిటే కుటుంబం.

    4. కుటుంబ సభ్యుల మధ్య పరస్పర బాధ్యతలు ఉంటాయి.

    5. శాశ్వతం & తాత్కాలికం: సమాజం నందు కుటుంబాలు శాశ్వతంగా ఉంటాయి కాని ఆయా కుటుంబాలలో సభ్యులు మరణం లేదా వివాహం లాంటి కారణాల వల్ల మారుతుండవచ్చు.

    6. నిర్ణీత/నిర్మిత ఆవాస స్థలం: రక్త సంబంధం మరియు వివాహ సంబంధం లేదా దత్తత వలన సంబంధాన్ని కలిగి ఉండి ఒక నిర్ణీత స్థలంలో నివాసం ఉంటే దానిని కుటుంబం అంటారు. కాని పారిశ్రామికీకరణ, నగరీకరణ మరియు ఆధునీకరణల వల్ల నివాస స్థలాలు వేరువేరుగా ఉన్నప్పటికి వేరువేరు ప్రాంతాలలో నివసిస్తున్నప్పటికీ ఒకే కుటుంబ ధర్మాన్ని నిర్వర్తిస్తున్న జీవన విధానాలు ప్రస్తుతం కన్పిస్తున్నాయి.


    మజుందార్ & మదన్లు ప్రకారం కుటుంబం ఈ క్రింది లక్షణాలు ఉంటాయి.

    1. వ్యవస్థీకృత లైంగిక సంబంధం 2. వంశానుక్రమం తోడ్పడడం

    3. కుటుంబ ఆర్థిక వ్యవస్థ


    మకైవర్ & ఫెజ్లు తమ సొసైటీ అనే గ్రంథం ఈ క్రింది 8 ముఖ్య లక్షణాలు తెలిపారు.

    1. ఆప్యాయత అనురాగాలు

    2. విశ్వవ్యాప్త

    3. అధ్యయన కేంద్రం

    4. కేంద్రస్థానం

    5. పరిమితమైన పరిమాణం

    6. సభ్యుల మధ్య బాధ్యతలు

    7. సాంఘీక క్రమం

    8. శాశ్వతం మరియు పరివర్తనాలు


    పై లక్షణాలతో పాటుగా కుటుంబం నందు వ్యక్తుల మధ్య దాంపత్య సంబంధాలు, సంతాన సంబంధాలు లేదా రక్త సంబంధాలు కనపడతాయి. ఒక కుటుంబం దంపతులకి దాంపత్య కుటుంబం లేదా స్వయం స్థాపిత కుటుంబం అవుతుంది అదే కుటుంబంలోని పిల్లలకు ఆ కుటుంబం జన్మప్రాప్త కుటుంబం అవుతుంది. పుట్టుకకు కారణమైన వారిని జైవిక తండ్రి మరియు జైవిక తల్లి అంటారు, పెంపకం ద్వారా సంతానాన్ని పొందితే ఆయా తల్లిదండ్రులను సామాజిక తండ్రి మరియు సామాజిక తల్లి అంటారు. సరోగసి విధానంలో తల్లిగా మారినప్పుడు గర్భాన్ని అద్దెకిచ్చిన స్త్రీని సరోగసి మదర్ అని మరియు ఎవరి అండం ఫలదీకరణం చెందించబడినదో వారిని జన్యుపరమైన తల్లి/జెనిటికల్ మదర్గా భావిస్తారు. కుటుంబం శ్రమ విభజనను పాటిస్తుంది, సంస్కృతిని ముందు తరాలకు అందిస్తుంది, కుటుంబంనకు ఇంటిపేరు ఉండటం వల్ల వంశానుక్రమం తెలుసుకోవడం సాధ్యమవుతుంది. ఉమ్మడి నివాసం అనేది కుటుంబం యొక్క అతిముఖ్యమైన లక్షణం.


    సమాజ వ్యవస్థాపనలో మౌలికమైన సమూహంగా ఏర్పడిన కుటుంబం ముఖ్యంగా 3 విధులను నిర్వహిస్తుంది. అవి...


    1. భౌతిక విధులు:

    వివాహం ద్వారా స్త్రీ, పురుషుల యొక్క లైంగిక అవసరాలను సమాజం ఆమోదించిన రీతిలో తీరుస్తుంది, సహచరత్వంను ప్రేమానురాగాలను, సంతానం మరియు పెరుగుదల లాంటి అవసరాలైన శారీరక లేదా భౌతిక అవసరాలను తీరుస్తుంది.

    2. సామాజిక విధులు:

    కుటుంబ సభ్యుల యొక్క సామాజీకరణకు తోడ్పడుతూ సంస్కృతి, సాంప్రదాయాలను నేర్పుతూ తద్వారా సామాజిక క్రమాన్ని మరియు సామాజిక నియంత్రణను కుటుంబమే నిర్వర్తిస్తుంది.

    3. ఆర్థిక విధులు:

    కుటుంబ సభ్యుల యొక్క అవసరాలు తీరడానికి కావలసిన ఆర్థిక అవసరాలను కుటుంబమే తీరుస్తుంది. సమాజం నందు ప్రతికుటుంబం ఏదో ఒక ఉత్పత్తి ప్రక్రియలో మరియు వినియోగ ప్రక్రియలో పాల్గొంటుంది.


    పై విధులతో పాటుగా మతపరమైన, మానసికపరమైన, ఉల్లాసపరమైన మరియు వాత్సల్య పరమైన అవసరాలను కూడా కుటుంబమే నెరవేరుస్తుంది.


    'కింగ్స్ లే డెవిస్' అభిప్రాయంలో కుటుంబం యొక్క విధులు :

    1. పునరుత్పత్తి

    2. కుటుంబ నిర్వహణ

    3. సమాజంలో స్థానం కల్పించడం

    4. సామాజీకరణ


    అక్బర్ & నిమ్కాఫ్ ప్రకారం, కుటుంబానికి ఈ క్రింది 6 ముఖ్యమైన విధులు కలవు

    1. వాత్సల్య పూరితమైన విధులు

    2. ఆర్థికపరమైన విధులు

    3. ఉల్లాసభరితమైన విధులు

    4. రక్షణ భరితమైన విధులు

    5. మతపరమైన విధులు

    6. విద్యాపరమైన విధులు


    రీడ్ ప్రకారం, కుటుంబానికి గల 4 ముఖ్యమైన ప్రకార్యాలు:

    1. జాతి సంరక్షణ

    2. సామాజీకరణ

    3. క్రమబద్దీకరించిన లైంగిక సంబంధాలు

    4. ఆర్థిక పరమైన ప్రకార్యాలు


    కుటుంబ విధులని ప్రాథమిక విధులు & ద్వితీయ విధులుగా మకైవర్ అనునతడు వర్గీకరించాడు. ఇతని ప్రకారం లైంగిక అవసరాల, సంతానం, పిల్లల పెంపకం, సామాజీకరణ, వాత్సల్యం, మన కుటుంబం అనే భావనని పెంపొందించడం ప్రాథమిక విధులు కాగా విద్య, వినోద, మతపరమైన, ఆర్థికపరమైన అవసరాలు తీర్చడం లాంటివి ద్వితీయ విధులు. టాల్కార్డ్ పర్సన్ ప్రకారం విద్యనందించడం, మానసిక ప్రశాంతతను కల్పించడం కుటుంబానికి గల ముఖ్య విధులు.


    కుటుంబ రూపాలు (Forms or Types of Families)


    ముర్దాక్ 250 సమాజాలను పరిశోధించిన తర్వాత కుటుంబం పరిణామక్రమంలో అభివృద్ధి చెందుతూ స్వైరత్వం నుండి చివరగా ఏకవివాహ కుటుంబాలు ఏర్పడినవని తెలిపాడు. ఇతని ప్రకారం కుటుంబాలు ప్రధానంగా...

    1. కేంద్రక కుటుంబం

    2. కుటుంబం

    సంక్లిష్ట కుటుంబం నందు తిరిగి...

    1. బహు వివాహ కుటుంబం

    2. విస్తృత కుటుంబం అను రూపాలు కలవు.


    బహు వివాహ కుటుంబం నందు బహు భార్యత్వ మరియు బహు భర్తత్వ కుటుంబాలు అనే రూపాలుంటాయి. విస్తృత కుటుంబం నందు


    1. పతీ స్థానిక విస్తృత కుటుంబం

    2. పత్నీ స్థానిక విస్తృత కుటుంబం

    3. ఉభయ స్థానిక విస్తృత కుటుంబం

    4. మాతుల స్థానిక విస్తృత కుటుంబం

    5. పితృశ్వ (మేనత్త స్థానిక) విస్తృత కుటుంబం అనే కుటుంబ రూపాలుంటాయి.



    కుటుంబ రూపాలు అనునవి, వివాహం, నివాసం, వంశానుక్రమం, అధికారం, కుటుంబ సభ్యుల సంఖ్య & కుటుంబ సభ్యుల మధ్య గల సంబంధాల ఆధారంగా కూడా తెలుపవచ్చు.


    వివాహం ఆధారంగా కుటుంబాలు


    1. ఏక వివాహ కుటుంబం (మోనోగామస్ ఫ్యామిలిస్): ఏక వివాహం ద్వారా ఏర్పడిన కుటుంబాలు

    2. బహు వివాహ కుటుంబం (పాలిగామస్ ఫ్యామిలిస్): బహు వివాహం ద్వారా ఏర్పడిన కుటుంబాలు

    3. బహు భార్యత్వ కుటుంబం (పాలిగైనస్ ఫ్యామిలిస్): బహు భార్యత్వ వివాహం ద్వారా ఏర్పడ్డ కుటుంబాలు.

    ఉదా: చుక్సిలు, కెప్సిజీలు, బైగాలు మరియు లసూలు.

    4. బహు భర్తృత్వ కుటుంబం (పాలియాండ్రస్ ఫ్యామిలిస్): బహుభర్తత్వం వివాహం ద్వారా ఏర్పడ్డ కుటుంబాలు.

    ఉదా: నీలగిరి తోడాలు, హిమాలయ కాశీలు, థియాన్సాంగ్ తెగలు, లడాఖీ బోటీలు, గారోలు మరియు నాయర్లు.


    కుటుంబ సభ్యుల మధ్య గల సంబంధాల ఆధారంగా

    1. వైవాహిక కుటుంబం

    2. ఏకరక్త కుటుంబం


    వంశానుక్రమం ఆధారంగా కుటుంబ రకాలు


    1. పితృ వంశీయ కుటుంబం (పాట్రిలినియల్ ఫ్యామిలిస్): కుటుంబం యొక్క వంశానుక్రమం పురుషసభ్యుల ద్వారా పరిగణించినప్పుడు దానిని పితృవంశీయ కుటుంబం అంటారు.

    ఉదా: భారతదేశంలోని హిందూ కుటుంబాలు.


    2. మాతృ వంశీయ కుటుంబం (మాట్రిలినియల్ ఫ్యామిలిస్): కుటుంబం యొక్క వంశానుక్రమం స్త్రీ సభ్యుల ద్వారా పరిగణించినప్పుడు దానిని మాతృవంశీయ కుటుంబం అంటారు.

    ఉదా: నీలగిరి తోడాలు, హిమాలయ కాశీలు, థియాన్సాంగ్ తెగలు, లడాఖీ బోటీలు


    3. ఉభయ వంశీయ కుటుంబం: కుటుంబంలో తల్లి మరియు తండ్రి ఇద్దరి వంశానుక్రమాన్ని పాటిస్తారు.

    ఉదా: పినయ తెగలు.


    కుటుంబ అధికారం ఆధారంగా


    1. మాతృస్వామ్య /మాతృ మూలక కుటుంబం (మ్యాట్రియార్కల్ ఫ్యామిలిస్): సీస్వామ్య విలువలని పాటించే కుటుంబాలు.

    ఉదా: ఖాసీలు, గారోలు, నాయర్లు


    2. పితృస్వామ్య/పితృమూలక కుటుంబం (ప్యాట్రియార్కర్ ఫ్యామిలిస్): పురుషస్వామ్య విలువలని పాటించే కుటుంబాలు.

    ఉదా: భారతదేశంలోని అధిక శాతం కుటుంబాలు.


    నివాసం ఆధారంగా


    1. పతీ స్థానిక కుటుంబం (ప్యాట్రిలోకల్ ఫ్యామిలిస్): పెళ్లికొడుకు ఇంటి దగ్గర నివాసం ఉండే కుటుంబాలు.

    ఉదా: భారతదేశంలోని అధిక కుటుంబాలు.


    2. పత్నీ స్థానిక కుటుంబం (మ్యాట్రిలోకల్ ఫ్యామిలిస్): పెళ్లికూతురు ఇంటి దగ్గర నివాసం ఉండే కుటుంబాలు.

    ఉదా: ఖాసీలు, గారోలు, నాయర్లు


    3. ద్వంద్వ స్థానిక కుటుంబం (బై లోకల్ ఫ్యామిలిస్) ఉదా: అపినయ తెగలు


    4. మాతుల స్థానిక కుటుంబం (అవెంకు లోకల్ ఫ్యామిలిస్): భర్త యొక్క మేనమామ ఇంటివద్ద నూతన కుటుంబం ఏర్పాటు చేసుకోవడం. ఉదా: హైదాలు


    5. నూతన స్థానిక కుటుంబం (నియో లోకల్ ఫ్యామిలిస్) ఉదా: నగరీకరణ, పారిశ్రామికీకరణ వల్ల వివాహం తరువాత ఉపాధి దొరికే ప్రాంతాలలో స్థిరపడ్డ కుటుంబాలు.


    కుటుంబ సభ్యుల సంఖ్య ఆధారంగా కుటుంబాలు ప్రధానంగా రెండు రకాలు


    1. కేంద్రక కుటుంబం (న్యూక్లియర్ ఫ్యామిలిస్)

    2. ఉమ్మడి కుటుంబం (జాయింట్ ఫ్యామిలిస్)


    ఐ.సి. దేశాయ్ వర్గీకరణ


    ఐ.సి. దేశాయ్ ప్రకారం, సహనివాసం, ఉమ్మడి వంటశాల అనేవి ఉమ్మడి కుటుంబంనకు అంతర్ కుటుంబ సంబంధాల కంటే ముఖ్యమైన అంశాలేవి కావు. వీరి అభిప్రాయంలో ప్రస్తుత భారతీయ సామాజిక నిర్మాణంలో ఈ క్రింది 5 రూపాలలో కుటుంబాలు గోచరిస్తాయి.


    1. కేంద్రక కుటుంబం : రెండు కంటే తక్కువ తరాలు కలిసి జీవించే కుటుంబాన్ని కేంద్రక కుటుంబం అంటారు.


    2. సాంప్రదాయ ఉమ్మడి కుటుంబం : మూడు తరాలకు పైగా కుటుంబ సభ్యులు ఉమ్మడి ఆస్తిని, అధికారాన్ని, నివాసాన్ని మరియు వంటశాలను కలిగి ఉన్నట్లయితే దానిని సాంప్రదాయ ఉమ్మడి కుటుంబం అంటారు.


    3. ప్రకార్య ఉమ్మడి కుటుంబం : రక్త సంబంధం కలిగి ఉన్న రెండు కుటుంబాలు విడివిడిగా నివసిస్తూ ఒకే అధికారం కింద ఉమ్మడి కార్యకలాపాలు నిర్వహించుకుంటాయి.


    4. ప్రకార్య గణణీయ ఉమ్మడి కుటుంబం : మూడు తరాల కుటుంబ సభ్యులు ఉమ్మడిగా ఆస్తిని, అధికారాన్ని కలిగి ఉంటారు కాని వేరు వేరు నివాసాన్ని కలిగి ఉంటారు.


    5. ఉపాంత ఉమ్మడి కుటుంబం : రెండు తరాల కుటుంబ సభ్యులు ఉమ్మడి ఆస్తిని మరియు ఉమ్మడి అధికారాన్ని కలిగి ఉన్నట్లయితే ఆయా కుటుంబాలను ఉపాంత ఉమ్మడి కుటుంబాలు అంటారు.


    కుటుంబ రూపాలు


    వివాహం ఆధారంగా

    1. ఏక వివాహ కుటుంబం. ఉదా: భారతదేశంలోని అధికశాతం కుటుంబాలు

    2. బహువివాహ కుటుంబం. ఇవి రెండు రకాలు.

    ఎ. బహు భార్యత్వ కుటుంబం. ఉదా: భైగాలు, లసులు, ఛుక్సీలు

    బి. బహు భర్తత్వ కుటుంబం. ఉదా: తోడాలు, కాసీలు, భోటీలు, గారోలు


    కుటుంబ సభ్యుల మధ్యగల సంబంధం ఆధారంగా


    1. వైవాహిక కుటుంబం.

    2. ఏకరక్త కుటుంబం

    3. స్వయం స్థాపిత కుటుంబం

    4. జన్మ ప్రాప్త కుటుంబం


    వంశానుక్రమం ఆధారంగా


    1. పితృ వంశీయ కుటుంబం. ఉదా: భారతదేశంలోని అధికశాతం కుటుంబాలు

    2. మాతృ వంశీయ కుటుంబం. ఉదా: తోడాలు, కాసీలు, భోటీలు, గారోలు

    3. ఉభయ వంశీయ కుటుంబం. ఉదా: అపినయ తెగలు


    కుటుంబంలో అధికారం ఆధారంగా


    1. మాతృస్వామ్య కుటుంబం. ఉదా: తోడాలు, కాసీలు, భోటీలు, గారోలు

    2. పితృస్వామ్య కుటుంబం. ఉదా: భారతదేశంలోని అధికశాతం కుటుంబాలు


    దంపతుల నివాసం ఆధారంగా


    1. పతిస్థానిక కుటుంబం. ఉదా: భారతదేశంలోని అధికశాతం కుటుంబాలు

    2. పత్ని స్థానిక కుటుంబం. ఉదా: తోడాలు, కాసీలు, భోటీలు, గారోలు

    3. ద్వంద్వ స్థానిక కుటుంబం. ఉదా: అపినయ తెగలు

    4. మాతుల స్థానిక కుటుంబం. ఉదా: హైదాలు

    5. నూతన స్థానిక కుటుంబంఉదా:వలసల వల్ల పట్టణాలలో ఏర్పడుతున్న కుటుంబాలు


    కుటుంబ నందు గల తరాల ఆధారంగా


    1. కేంద్రక కుటుంబం

    2. ఉమ్మడి కుటుంబం


    భారతదేశంలో కేంద్రక కుటుంబం/ప్రాథమిక కుటుంబం


    దీనినే చిన్నకుటుంబం, అణు కుటుంబం, ఏక కుటుంబం, ప్రాథమిక కుటుంబం అని కూడా అంటారు. దంపతులు & వారి వివాహం కాని సంతానం ఉండే కుటుంబం. ఈ కుటుంబం భార్యా మరియు భర్తలకి వైవాహిక కుటుంబం, దంపతి కుటుంబం అలాగే సంతానానికి ఇదే కుటుంబం జన్మప్రాప్త కుటుంబం అవుతుంది.


    ఈ కుటుంబంలో 2 తరాలు మాత్రమే ఉంటాయి. జిమ్మర్ మెన్ అనునతడు వీటిని....

    1. Domestic Families

    2. Automestic Families 

    3. Trusty Families గా వర్గీకరించాడు.


    సాధారణంగా ప్రాథమిక కుటుంబాలు ఈ క్రింది రూపాల్లో ఉంటాయి


    1. ఆధార ప్రాథమిక కుటంబాలు ఉదా: భారతదేశం

    2. స్వతంత్ర ప్రాథమిక కుటుంబాలు. ఉదా: యు.ఎస్.ఎ


    ప్రాథమిక కుటుంబాలు ఏర్పడడానికి ప్రధాన కారణాలు


    1. స్వేచ్ఛా పిపాసులై ఉండడం 

    2. వైయుక్తీకరణం

    3. పారిశ్రామికీకరణ

    4. ఆధునిక విద్య

    5. బహిర్వివాహాలు

    6. ద్వితీయ & తృతీయ రంగాలకు చెందిన ఆర్థిక సమాజం వృద్ధిచెందడం


    ప్రాథమిక కుటుంబం యొక్క ఉపయోగాలు


    1. జనాభా నియంత్రణలో ఉంటుంది.

    2. కుటుంబ సభ్యులకు స్వేచ్ఛ అధికంగా ఉంటుంది.

    3. కుటుంబ సభ్యులలో సృజనాత్మకత అధికంగా ఉంటుంది.

    4. ప్రాథమిక & ద్వితీయ అవసరాలు సంపూర్ణంగా నెరవేరే అవకాశం ఉంటుంది.

    5. భార్య, భర్తల మధ్య అన్యోన్నత మరియు అధిక సమయం గడిపే అవకాశం దొరుకుతుంది.

    6. తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్య స్నేహపూర్వక సబంధాలు ఉంటాయి.

    7. మహిళకు సమానహక్కులు & ప్రాధాన్యతను కల్గించే అవకాశం ఉంటుంది.

    8. కుటుంబ సభ్యులకు అధిక గతిశీలతకు అవకాశం ఉంటుంది మరియు కుటుంబ సభ్యుల వైయుక్తిక వృద్ధి వేగంగా ఉండే అవకాశం ఉంటుంది.


    ప్రాథమిక కుటుంబం యొక్క నష్టాలు


    1. ఆర్థికంగా ఇబ్బందికరం

    2. కుటుంబంలోని వృద్ధులకు, వికలాంగులకు, సామాజిక రక్షణ మరియు భద్రత ఉండదు

    3. వృద్ధాప్య సమస్యలు సమాజంలో తీవ్రమవుతాయి.

    4. బాలల సంరక్షణా కేంద్రాలు, ఆలనా కేంద్రాల లాంటి సంస్కృతి వ్యాపిస్తుంది.

    5. విడాకుల రేటు ఎక్కువగా కేంద్రక కుటుంబాలలో ఉంటున్నది.

    6. సాంప్రదాయాలు, సంస్కృతి స్థానంలో ఆధునిక జీవన విధానం & భౌతిక సంస్కృతికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం


    సాంప్రదాయ భారతీయ ఉమ్మడి కుటుంబాలు


    వీటినే ఉమ్మడి కుటుంబం, అవిభాజ్య కుటుంబం మరియు విస్తృత కుటుంబం అని కూడా అంటారు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అనునది భారత సమాజం యొక్క ప్రత్యేక మరియు విశిష్ట లక్షణం ఈ వ్యవస్థ యందు ఉమ్మడి ఆస్థి, ఉమ్మడి నివాసం, ఉమ్మడి వంట మరియు ఉమ్మడి సాంప్రదాయాలు అనేవి ప్రధాన లక్షణాలుగా ఉంటాయి. ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో 3 తరాలకు మించిన బంధువులు కలిసి ఒకే ఇంటిలో నివసించడం వల్ల ఆయా వ్యక్తుల మధ్య పరస్పర ఆధారిత పెరుగుతుంది.


    హిందూ సామాజిక వ్యవస్థకు ఉమ్మడి కుటుంబం పునాదిలాంటిది. వేద యుగం నుండి ఇప్పటి వరకు కూడా భారతదేశంలో పితృస్వామిక ఉమ్మడి కుటుంబ వ్యవస్థే ప్రధానంగా గోచరిస్తుంది.


    మూడు తరాలు ఆ పైగా ఒకే గృహంలో, ఒకే అధికారం కింద నివసించి ఉన్నట్టయితే దానిని ఉమ్మడి కుటుంబం అంటారు. భారతీయ సమాజంలో మాతృస్వామిక ఉమ్మడి కుటుంబం, పితృస్వామిక ఉమ్మడి కుటుంబం అనే రెండు ప్రధాన కలవు.


    ఉమ్మడి కుటుంబం యొక్క ముఖ్య లక్షణాలు


    1. 3 అంతకంటే ఎక్కువ తరాలు ఒకే ఇంటిలో నివసించడం

    2. కర్త యొక్క అధికారం

    3. ఉమ్మడి వంటశాల

    4. ఉమ్మడి నివాసం

    5. ఉమ్మడి మతపరమైన & సామాజిక పరమైన కార్యక్రమాలు

    6. ఉమ్మడి ఆస్తులు సంపదలు

    7. సంప్రదాయ వివాహాలు

    8. స్వయం సమృద్ధి

    9. సరైన శ్రమ విభజన


    ఉమ్మడి కుటుంబంపై శాస్త్రవేత్తల వాఖ్యలు


    • మెమోరియా గారి అభిప్రాయంలో సపిండత్వం అనునది ఉమ్మడి కుటుంబం యొక్క ప్రాథమిక లక్షణం.
    • ఉమ్మడి కుటుంబాన్ని హెన్రీ మెయిన్ అనే శాస్త్రవేత్త గ్రేట్ హెూమ్ అని పిలిచాడు.
    • ఐరావతి కార్వే అభిప్రాయంలో ఒకే నివాసం, ఒకే వంటగది, ఒకే ఆస్థి, ఒకే ప్రార్థన కల నివాస సమూహాన్ని ఉమ్మడి కుటుంబం అంటారు.
    • మెల్లీ గారి అభిప్రాయంలో ఉమ్మడి కుటుంబం అనునది సహకారంతో కూడిన Joint Stock Company లాంటిది.
    • కుటుంబ సభ్యులకు సంబంధించిన అన్ని అంశాలపై, ఆస్థులపై కుటుంబ కర్తకి సర్వాధికారాలు ఉంటాయి.


    భారతదేశం నందు గోచరించే తారావాడ్ మరియు ఇల్లూమ్లు అనబడే కుటుంబాలు


    భారతదేశంలో అసాధారణ లక్షణాలతో కూడిన తారావాడ్ అనబడే మాతృస్వామ్య ఉమ్మడి కుటుంబాలు కేరళలోని నాయర్ల యందు కన్పిస్తాయి. ఇల్లామ్లు అనబడే పితృస్వామ్య ఉమ్మడి కుటుంబాలు కేరళలోని నంబూద్రిల యందు గమనించవచ్చు.


    1.తారావాడ్ మాతృవంశీయ ఉమ్మడి కుటుంబం


    మహిళలకు అధికారం, అధిక ప్రాధాన్యత, వంశానుక్రమం మహిళల ద్వారా కొనసాగడం, బహుభర్తత్వాన్ని పాటించే అధికారం ఉండటం, పత్నిస్థానిక నివాస విధానాన్ని పాటించడం మరియు కుటుంబ కర్తగా స్త్రీ వ్యవహరించడం అనునవి మాతృవంశీయ లేదా మాతృస్వామ్య ఉమ్మడి కుటుంబాల యొక్క లక్షణాలు.


    కేరళలో నివసించే నాయర్ల యందు గల మాతృవంశీయ కుటుంబాలను తారావాడు అని అంటారు. ఈ విధమైన కుటుంబాలలో సంతానంపైన హక్కులు స్త్రీలకే ఉంటాయి. కుటుంబ పెద్దగా, కుటుంబ కర్తగా స్త్రీనే వ్యవహరిస్తుంది. తారావాడ్ కుటుంబం నందు గల పురుషులు వివాహమయ్యేంత వరకు మాత్రమే తమ యొక్క తల్లి కుటుంబానికి సంబంధించిన వారిగా ఉంటారు. వివాహం తర్వాత ఆయా పురుషులు తమ తల్లి కుటుంబం నుండి వేరుపడి తమ భార్యయొక్క కుటుంబానికి చెందినవారుగా పరిగణింపబడతారు.


    కేరళలోని నాయర్లకు సంబంధించిన కుటుంబాల యందు నంబూద్రి బ్రాహ్మణులు సందర్శనా భర్తలుగా పరిగణించబడతారు మరియు సంతానంపై ఈ యొక్క సందర్శనా భర్తలకు ఎలాంటి హక్కులు ఉండవు.


    నోట్: సామాజిక సంస్కరణలో భాగంగా ఈ దురాచారాలన్ని రూపుమాపడం జరిగింది.


    2. పితృవంశీయ ఉమ్మడి కుటుంబాలు


    వంశానుక్రమం పురుషులకుండటం, కర్తగా, కుటుంబ పెద్దగా పురుషుడు వ్యవహరించడం అధికారాలు మరియు వారసత్వ ఆస్తిహక్కులు పురుషులకుండటం మరియు వివాహం తర్వాత పతిస్థానిక నివాసాన్ని కలిగి ఉండటం అనునవి పితృవంశీయ ఉమ్మడి కుటుంబం యొక్క లక్షణాలు. భారతదేశం నందు గల ఉమ్మడి కుటుంబాలలో అధికశాతం ఈ కోవకి చెందిన ఉమ్మడి కుటుంబాలే కలవు.


    నోట్: నంబూద్రిల యొక్క పితృవంశీయ ఉమ్మడి కుటుంబాన్నే ఇల్లూమ్ అని అంటారు.


    ఉమ్మడి కుటుంబం యొక్క ఉపయోగాలు


    • పిల్లల సామాజీకరణం సరైన రీతిలో కొనసాగుతుంది.
    • సంస్కృతి సాంప్రదాయాలు పరిరక్షించబడుతాయి.
    • కుటుంబ సభ్యులకు సాంఘిక భద్రత & రక్షణ కల్పిస్తుంది.
    • విడాకుల రేటు తక్కువగా ఉంటుంది.
    • వ్యక్తుల ప్రవర్తన అదుపులో ఉంటుంది.
    • స్థిరమైన కుటుంబం తద్వారా స్థిరమైన సమాజం ఏర్పడడానికి దోహదం చేస్తుంది.
    • సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణ కొనసాగుతుంది.
    • వృద్ధాశ్రమాలు, ఆలనాకేంద్రాల యొక్క అవసరం ఏర్పడదు.
    • దంపతుల గొడవలకు సహజ సిద్ధ కౌన్సిలింగ్ కేంద్రాలుగా పనిచేస్తాయి.
    • కుటుంబం పట్ల నిర్వర్తించవలసిన విధులకు సంబంధించి సరైన శ్రమ విభజన కన్పిస్తుంది.
    • సమూహ జీవనం కన్పిస్తుంది.
    • కుటుంబ సామ్యవాదం కన్పిస్తుంది.
    • కుటుంబంలోని వికలాంగులకు సరైన భద్రత మరియు సహాయత లభిస్తుంది.
    • స్థిరమైన కుటుంబాల వల్ల స్థిరమైన సమాజం ఏర్పడే అవకాశం ఉంటుంది.


    ఉమ్మడి కుటుంబం యొక్క పరిమితులు


    • వ్యక్తుల యొక్క గతిశీలతకు అవకాశం లేకుండా పోతుంది.
    • స్వేచ్ఛకి, సృజనాత్మకతకి అవకాశం లేదు.
    • వ్యక్తిగత ఆస్థి, వ్యక్తిగత పొదుపులు ఉండవు.
    • దంపతుల మధ్య గోప్యత, సాన్నిహిత్యం తక్కువగా ఉంటుంది.
    • మహిళకు కుటుంబంలో ద్వితీయ స్థానం.
    • జననరేటు ఎక్కువగా ఉంటుంది.
    • సహకారం స్థానంలో కొన్నిసార్లు జగడాల కూడలిగా ఉండే అవకాశం కలదు.


    ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో వస్తున్న మార్పులు దోహదపడిన అంశాలు


    కుటుంబంలో నివసించే సభ్యుల సంఖ్య మరియు కుటుంబంలో నివసించే తరాల సంఖ్య తగ్గుతుంది. కుటుంబం నందు ఒకప్పుడు కుటుంబ కర్త నిర్వహించిన బాధ్యతలను కుటుంబ సభ్యులందరూ పంచుకుంటున్నారు.


    మహిళలకు విద్యా మరియు ఉద్యోగావకాశాలు రావడం అనునవి కూడా కుటుంబ వ్యవస్థలో లింగ పరమైన పాత్రలలో మార్పులను తీసుకొనివచ్చినవి. కుటుంబ సభ్యుల మధ్య అధికారయుతమైన మరియు బాధ్యాతాయుతమైన సంబంధాల స్థానంలో స్నేహ పూర్వక మరియు ఆధునిక భావాలతో కూడిన సంబంధాలు ఏర్పడుతున్నవి. ఉమ్మడి నివాసం అనే భావన సడలుతున్నది. నూతన విలువల ఆధారంగా పిల్లల పెంపకం మరియు సామాజీకరణ జరుగుతున్నది.


    సాంప్రదాయ కుటుంబాలు కాస్తా పరివర్తన చెందుతూ ఆధునిక కుటుంబాలుగా మారుతున్నవి. సాంప్రదాయ ఉమ్మడి కుటుంబాల స్థానంలో ప్రాథమిక కుటుంబాలు లేదా అణు కుటుంబాలు ఏర్పడుతున్నవి. మరియు నూతన స్థానిక కుటుంబాలు ఏర్పడుతున్నవి. కుటుంబం తను నిర్వర్తించేటటువంటి విధుల నుండి వైదొలగడం వల్ల వృద్ధాశ్రమాలు, వికలాంగుల హాస్టళ్ళు మరియు చిన్నపిల్లల ఆలనా కేంద్రాలు ఏర్పడుతున్నవి. ఉద్యోగ కారణాల వల్ల ఒకే కుటుంబ సభ్యులు వేర్వేరు ప్రాంతాలలో నివసిస్తున్నారు.


    ప్రస్తుతం కుటుంబం ఏర్పాటుకు వివాహం అనేది ప్రాతిపదికన తీసుకోకుండా లివింగ్ టుగెదర్ అనే ఆధునిక పోకడలు కన్పిస్తున్నాయి. గృహ హింసలు మరియు విడాకుల రేటులు అధికంగా కన్పిస్తున్నాయి. కుటుంబం నందు మహిళలకు ఆస్తి మరియు వారసత్వ హక్కులు, ఉద్యోగం చేసుకునే అవకాశాలు మరియు విడాకులు పొందే అవకాశాలు లాంటి మార్పులు సంభవిస్తున్నాయి.


    Melton అనునతని ప్రకారం ఈ క్రింది 5 కారకాలు ఉమ్మడి కుటుంబంలోని మార్పులకు దోహదపడినవి.

    1. సాంఘిక శాసనాలు 

    2. పారిశ్రామికీకరణ

    3. పట్టణీకరణ

    4. విద్య 

    5. వివాహ వ్యవస్థలో వచ్చిన మార్పులు

    పై కారకాలతో పాటు, మహిళ సాధికారత, పశ్చిమదేశాల విలువలు, భార్య, భర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేయడం లాంటి అంశాలు కూడా మార్పునకు దోహదపడినాయి.


    ఈ క్రింది సామాజిక శాసనాలు కుటుంబ వ్యవస్థలో మార్పులకు దోహదపడినాయి.


    1. వైవాహిక మహిళ ఆస్థి చట్టం 1874 ప్రకారం మహిళలకి స్త్రీ ధనంతో పాటు, ఆమె సంపాదన పైన పూర్తిగా ఆమెకే హక్కులను ఇచ్చింది.


    2. The Hindu Womens Right to Property Act 1937 ప్రకారం మహిళకు తన యొక్క చనిపోయిన భర్త ఆస్థిలో కుమారులతో సమానంగా వాటాను పొందే హక్కును కల్పించింది.


    3. The Hindu Adoption and Maintanance Act - 1956 ప్రకారం భర్త నుండి భరణం పొందే హక్కు & స్వంతంగా పిల్లలను పెంచుకునే హక్కు మహిళలకు కల్పించడం జరిగింది.


    4. కుటుంబ న్యాయస్థానాల చట్టం -1984 ప్రకారం, కుటుంబ తగాదాలన్నీ గోప్యంగా విచారించే అవకాశం కలిగింది.


    5. హిందూ వారసత్వ చట్టం - 1956

    6. హిందూ వివాహ చట్టం - 1955

    7. హిందూ దత్తత చట్టం - 1956

    8. వివాహిత ముస్లిం మహిళ, వివాహ హక్కుల చట్టం - 2019

    9. గృహ హింస నుండి మహిళల సంరక్షణ చట్టం - 2005


    మరికొన్ని.......

    • మాతుల స్థానిక విస్తృత కుటుంబాలపై అధ్యయనం చేసినవారు - ముర్దాక్
    • మోర్గాన్ ప్రకారం మాతృస్వామిక కుటంబమే పురాతనమైనది.
    • హెన్రీ మేయిన్ ప్రకారం పితృస్వామిక విధానమే పురాతనమైనది.
    • మానవుడు ప్రకృతి పరంగానే ఏకవివాహి అని తన రచన అయిన హిస్టరీ ఆఫ్ హ్యుమన్ మ్యారెజ్ ద్వారా తెలిపినవారు వెస్టర్ మార్క్.

    • ఘణ దేశం నందు గల ఆషాంటి తెగల యందు పిల్లల పెంపకంలో మేనమామదే కీలకపాత్ర.
    • లువీ అనే శాస్త్రవేత్త కుటుంబం విశ్వజనీనమైనది అని, కుటుంబం మరియు వివాహం అనునవి నాణెంనకు గల బొమ్మ మరియు బొరుసు లాంటివని తెలిపాడు.
    • ఛటోపాద్యాయ అనునతడు 3 రకాల కుటుంబాలను తెలిపాడు. అవి....
                       1. సింపుల్ ఫ్యామిలి
                       2. కాంపౌండ్ ఫ్యామిలి
                       3. కాంపోజిట్ ఫ్యామిలి
    • భర్జెస్ అనునతడు కుటుంబాలను 2 రకాలుగా తెలిపాడు.
        1. ఇన్స్టిట్యూషనల్ ఫ్యామిలిస్:సంప్రదాయాలకు మరియు సామాజిక ఆచారాలకు అధిక ప్రాధాన్యతనిచ్చే కుటుంబాలు.
         2. కంపానియన్షిప్ ఫ్యామిలీస్ : పరస్పర ఇష్టాలకు మరియు వ్యక్తిగత ఇష్టాలకు అధిక ప్రాధాన్యతనిచ్చే కుటుంబాలు.
    • కుటుంబం స్వైరత్వ జీవనం నుండే ప్రారంభమైనదని ప్లీస్ అనునతడు అభిప్రాయపడ్డాడు.
    • అరిస్టాటిల్ మరియు ప్లేటో కూడా పితృవంశీయ కుటుంబాలే పురాతనమైనవని అభిప్రాయపడ్డారు.
    • బ్రిఫాల్టీస్ అనునతడు కూడా మాతృవంశీయ కుటుంబాలే పురాతన కుటుంబాలని అభిప్రాయపడ్డాడు.
    • ప్రస్తుత కుటుంబాలు వివిధ దశలను దాటి పరిణామ క్రమంలో ఏర్పడినాయని మోర్గాన్ అభిప్రాయపడినాడు.
    • ప్రస్తుతం కుటుంబ వ్యవస్థ ఇలా రూపుదిద్దుకోవడానికి చాలా కారకాలు దోహదపడినాయని మకైవర్ అనునతడు తెలిపాడు.


    పునశ్చరణ


    • కుటుంబం అనేది ప్రాథమిక సామాజిక సంస్థ, ప్రాథమిక సామాజీకరణ సాధనము, ప్రాథమిక సామాజిక అంగము మరియు ప్రాథమిక సమూహం.
    • వివాహం ద్వారా, రక్తసంబంధం ద్వారా మరియు దత్తత ద్వారా కుటుంబ సభ్యత్వం లభిస్తుంది.
    • ఫ్యామిలీ అనే ఇంగ్లీషు పదం ఫ్యాన్లెస్ అనే రోమన్ పదం నుండి ఆవిర్భవించింది, దీనికి అర్థం సేవకుడు.
    • ఫ్యామిలీ అనబడే ఇంగ్లీషు పదం ఫెమిలియా అనబడే లాటిన్ పదం నుండి తీసుకోబడింది. దీని యొక్క అర్థం కుటుంబం, సేవకులు మరియు బానిసలు.
    • మే 15 - అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం.
    • కుటుంబానికి సమగ్రమైన నిర్వచనమును ఇచ్చినవారు - ఎడ్మండ్ లీచ్.
    • కుటుంబానికి సంబంధించిన 4 ముఖ్యమైన ప్రమాణాలు తెలిపినవారు - స్టీఫెన్ సన్.
    • కుటుంబ త్రికోణాన్ని తెలిపినవారు - రేమండ్ ఫర్త్.
    • వివాహం & కుటుంబం అనునవి నాణెంనకు ఇరువైపుల ఉన్న బొమ్మ, బొరుసు లాంటివని తెలిపినవారు - లూయి.
    • కుటుంబ పరిణామాన్ని తెలియజేసిన వారు ముర్దాక్.
    • కుటుంబానికి సంబంధించిన 8 ముఖ్య లక్షణాలు తెలిపిన వారు - మకైవర్ & ఫేజ్.
    • కుటుంబానికి సంబంధించిన 6 విధులను తెలిపిన వారు - అక్బర్ & నిమఫ్.
    • కుటుంబ విధులను ప్రాథమిక మరియు ద్వితియ విధులుగా వర్గీకరించినవారు - మకైవర్.
    • భారతదేశంలో అధిక శాతం కుటుంబాలు ఏకవివాహ కుటుంబాలు.
    • బహుభార్యత్వ కుటుంబాలు అధికంగా చుక్సీలు, కెప్సిజీలు, భైగాలు మరియు లసులలో కనిపిస్తాయి.
    • బహుభర్తత్వ కుటుంబాలు అధికంగా నీలగిరి తోడాలు, హిమాలయ ఖాసాలు, తియాన్సంగ్ తెగలు మరియు లఢాఖ్ భోటీల యందు కనిపిస్తాయి.
    • భారతదేశంలో అధిక శాతం కుటుంబాలు పితృవంశీయ కుటుంబాలే.
    • మాతృవంశీయ కుటుంబాలకు ఉదాహరణలు నీలగిరి తోడాలు, హిమాలయఖాసాలు మరియు లఢాఖీ భోటీలు.
    • అపినయ తెగలు ఉభయవంశీయ కుటుంబాన్ని పాటిస్తాయి.
    • భారతదేశంలో అధిక కుటుంబాలు పితృస్వామ్య కుటుంబాలే.
    • హిమాలయ ఖాసాలు, మేఘాలయ గారోలు, కేరళ నాయర్ల యందు మాతృస్వామ్య కుటుంబాలు కనిపిస్తాయి.
    • పత్నిస్థానిక కుటుంబ జీవన విధానం ఖాసాలు, గారోలు మరియు నాయర్లలో కన్పిస్తుంది.
    • నూతన స్థానిక కుటుంబాలు ఏర్పడడానికి ప్రధాన కారణం - పారిశ్రామికీకరణ, వలసలు, నగరీకరణ మరియు ఆధునీకరణ.
    • కుటుంబం నందు 3 కంటే తక్కువ తరాలు నివసిస్తే అది ప్రాథమిక కుటుంబం అవుతుంది, 3 కంటే ఎక్కువ తరాలు నివసిస్తే అది ఉమ్మడి కుటుంబం అవుతుంది.
    • ఉమ్మడి కుటుంబాన్ని గ్రేటాం అని పిలిచినవాడు - హెన్రీమెయిన్.
    • ఉమ్మడి కుటుంబాన్ని జాయింట్ స్టాక్ కంపెనీ అని పిలిచిన వారు - మెల్లీ.
    • సంపిడత్వం అనునది ఉమ్మడి కుటుంబం యొక్క ప్రాథమిక లక్షణం అని తెలిపినది మెమోరియా.
    • కేరళ నాయర్ల యందు తారావాడ్ మాతృవంశీయ ఉమ్మడి కుటుంబం ఉంటుంది.
    • కేరళ నంబూద్రీల యందు ఇల్లుమ్ అనబడే పితృవంశీయ ఉమ్మడి కుటుంబాలు ఉంటాయి.


Tags: Caste system, gender roles, joint families, arranged marriages, diversity, cultural festivals, social hierarchy, economic disparities, religious practices, education system, urbanization, rural traditions, globalization, modernization


No comments:

Post a Comment

Post Bottom Ad