2.4 మహిళలపై జరుగుతున్న నేరాలు - చట్టపరమైన చర్యలు (Crime against Women) - GNANA SAMHITHA

GNANA SAMHITHA

DONT WORRY!!! WE HELP YOU TO REACH YOUR GOAL 😊

Breaking

Post Top Ad

Saturday, July 15, 2023

2.4 మహిళలపై జరుగుతున్న నేరాలు - చట్టపరమైన చర్యలు (Crime against Women)

2.4 మహిళలపై జరుగుతున్న నేరాలు - చట్టపరమైన చర్యలు (Crime against Women)


    ఆదిమ సమాజం నందు ఆహారం, రక్షణ మరియు వేట కోసం పురుషుడిపై స్త్రీ ఆధారపడి ఉండవచ్చు కాని ప్రస్తుత ఆధునిక యుగంలో కండ బలంతో సంబంధంలేని వృత్తులు ఏర్పడిన సందర్భంలో కూడా లింగపరమైన వివక్షతలు, పాత్రలు మరియు శ్రమ విభజనలు కన్పిస్తున్నాయి. సామాజిక, సాంస్కృతిక హింసా స్థానంలో శారీరక హింసలు, లైంగిక హింసలు, పనిచేసే చోట వేధింపులు మరియు సైబర్ నేరాలు పేట్రేగిపోతున్నాయి. పుట్టినప్పటి నుండి చనిపోయేంత వరకు మహిళలు వివిధ రకాల హింసకు, సమస్యలకు మరియు వివక్షతలకు గురవుతున్నారు. భ్రూణ హత్యలు, శిశు హత్యలు, లైంగిక హింసలు, గృహహింసలు, లైంగిక వేదింపులు, దేవదాసీ, జోగినీ వ్యవస్థ, బాల్యవివాహాలు, వరకట్నం, లింగ అసమానతలు, రాజకీయ అవకాశాలు లేమి, ఆస్థి హక్కులు అమలుకాకపోవడం పురుషస్వామ్య సంప్రదాయాలు మరియు విలువలు లాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యకు సంబంధించిన ముఖ్యమైన వాస్తవాలు మరియు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఈచాప్టర్ నందు వివరించడబడినవి.


    మహిళలపై జరుగుతున్న హింసా రూపాలు


    ఐక్యరాజ్యసమితి మానవహక్కుల హైకమీషనర్ రూపొందించిన డిక్లరేషన్ ఆన్ ద ఎలిమినేషన్ ఆఫ్ వయోలెన్స్ అగెనెస్ట్ ఉమెన్ 1993 (డిసెంబర్ 20) ప్రకారం మహిళలపై జరుగుతున్న హింస అనగా: శారీరక, లైంగిక మరియు మానసిక హానికలిగించే చర్యలు మరియు మహిళలపై స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలను, వారి యొక్క ప్రజాజీవితాన్ని మరియు వ్యక్తిగత జీవితాన్ని ఇబ్బంది పెట్టే చర్యలు.


    గమనిక: 25 నవంబర్ని మహిళలపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవంగా జరుపుకుంటారు.


    స్త్రీలు, పురుషుల మధ్యగల అసమానతలు, అసమస్థాయి సంబంధాల వ్యక్తీకరణే హింసగా చెప్పవచ్చని ఐక్యరాజ్యసమితి వారు నిర్వచించారు.


    ప్రపంచ ఆరోగ్య సంస్థవారి ప్రకారం మహిళా జీవితంలో గల 5 ప్రధాన దశలలో హింస జరుగుతున్నది


    1. పుట్టుకకు ముందు జరుగుతున్న హింస: గర్భస్థ శిశు హత్యలు

    2. శైశవ దశలో జరుగుతున్న హింస: శిశు హత్యలు, ఆడపిల్లలని వదిలివేయడం లేదా అమ్మివేయడం

    3. బాలికదశలో జరుగుతున్న హింస: బాయ్ ఛైల్డ్ ప్రిఫరెన్స్ ఎక్కువగా ఉండటం, అవిద్యకు మరియు కుపోషణకు గురిచెయ్యడం, ఆడపిల్లల అమ్మకాలు మరియు బాల్యవివాహాలు

    4. కిశోర ప్రాయం మరియు యుక్తవయస్సులో జరుగుతున్న హింస: లైంగికపరమైన హింస, గృహహింస, పనిచేసే చోట లైంగిక వేధింపులు, గౌరవాన్ని భంగం కలిగించే చర్యలు, మనుషుల అక్రమరవాణాకు సంబంధించిన నేరాలు మరియు వరకట్న వేధింపులు మరణాలు మొదలగునవి.


    మహిళ పట్ల జరిగే హింసను నేరం యొక్క స్వభావాన్ని బట్టికూడా ఈ క్రింది విధంగా వర్గీకరించవచ్చు


    1. నేరపూరిత హింస (క్రిమినల్ వయోలెన్స్): వరకట్న హత్యలు, హత్యలు, కిడ్నాప్లు మరియు రేప్లు, ఆమ్లదాడులు మొదలైనవి.

    2 గృహసంబంధిత హింస: వరకట్నచావులు, గృహహింస, శారీరక హింస, వితంతువుల దుస్థితి, ఆడపిల్లల కుటుంబంలో వివక్షత, సాంస్కృతిక పరమైన ఆంక్షలు, వృద్ధమహిళల యొక్క అవస్థలు

    3. సామాజిక పరమైన హింస: సంస్కృతి మరియు సాంప్రదాయాలలో భాగంగా కొనసాగుతున్న బహుభార్యత్వం, బాల్యవివాహాలు, వరకట్నాలు, వారసత్వ హక్కులు లేకపోవడం మొదలగునవి.

    4. పై హింసలకు అదనంగా ప్రస్తుతం సైబర్ నేరాలు మహిళల పట్ల అశనిపాతంగా తయారైనవి.


    ప్రభుత్వం వారు మహిళ పట్ల జరుగుతున్న నేరాలను ప్రధానంగా (1) భారతీయ శిక్షా స్మృతి ప్రకారం (2) స్థానిక మరియు ప్రత్యేక చట్టాల ప్రకారం నమోదుచేసి చర్యలు తీసుకుంటున్నారు.


    1. భారతీయ శిక్షాస్మృతి ప్రకారం: మర్డర్ విత్ రేప్, గ్యాంగ్ రేప్, వరకట్న చావులు, ఆత్మహత్యకు ప్రేరేపించడం, ఫిటిసైడ్ (గర్భస్థశిశు హత్యలు), ఆమ్ల దాడులు, భర్త మరియు భర్త తరపు బంధువుల క్రూరత్వం, కిడ్నాప్ చేయడం, డబ్బులకోసం కిడ్నాప్డ్చేయడం, వివాహం కోసం కిడ్నాప్ చేయడం, బాలికలను కొనుగోలు చేయడం మరియు అమ్మడం, స్త్రీలు మరియు బాలికల అక్రమ రవాణా, మహిళా గౌరవానికి భంగం కలిగించడం.

    2. స్థానిక మరియు ప్రత్యేక చట్టాల ప్రకారం: వరకట్న వేధింపులు, వ్యభిచారం చేయించడం, గృహహింస, పనిచేసే చోట లైంగిక వేదింపులు, సైబర్ నేరాలు, పోక్సోచట్టం కింద నేరాలు, మహిళా గౌరవానికి భంగం కలిగించడం మొదలగునవి.


    మహిళలపై జరుగుతున్న నేరాల తీవ్రత


    National crime Records Bureau వారి యొక్క Crime in India - 2021 ప్రకారం మహిళలపై జరుగుతున్న హింస ఈ క్రింది విధంగా కలదు.


    • దేశవ్యాప్తంగా 4,28,278 హింసాత్మక సంఘటనలు నమోదైనవి. గత సంవత్సరంతో పోలిస్తే 15.3% నేరాలు పెరిగినవి. ఇందులో అధికశాతం కేసులు భర్త మరియు భర్త తరపు బందువులు చూపెట్టిన క్రూరత్వంనకు సంబంధించినవి ఉన్నవి, తర్వాత స్థానాలలో మహిళ గౌరవాన్ని భంగ పర్చడం, అపహరణ మరియు రేప్ కేసులు కలవు.
    • మహిళలపై జరుగుతున్న నేరాల రేటు జాతీయ స్థాయిలో 64.5 కలదు, గత సంవత్సరం ఇది 56.5గా కలదు.
    • అస్సాం రాష్ట్రం నందు అత్యధికంగా నేరాల రేటు కలదు (168.3), కాగా నాగాలాండ్ నందు నేరాల రేటు అత్యల్పంగా నమోదైనది (5.1). కేంద్ర పాలిత ప్రాంతాల పరంగా ఢిల్లీ నందు నేరాల రేటు అధికంగా నమోదైనది.
    • రాష్ట్రాల పరంగా ఉత్తర ప్రదేశ్ నందు, కేంద్ర పాలిత పరంగా ఢిల్లీ అత్యధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్నది. కాగా అత్యల్పంగా నాగాలాండ్ మరియు లక్ష్యద్వీప్లలో నమోదైనవి.
    • గ్యాంగ్ రేప్లు మరియు వరకట్న మరణాలు ఉత్తర ప్రదేశ్ మరియు ఢిల్లీలలో, ఆత్మహత్యకు ప్రేరేపించడాలు మహారాష్ట్రలో, ఆమ్ల దాడులు బెంగాల్లో, భర్త యొక్క కూరత్వం బెంగాల్, బాలికల కొనుగోలు మధ్యప్రదేశ్లో, మహిళల అక్రమ రవాణా మహారాష్ట్రలో, రేప్ కేసులు రాజస్థాన్ మరియు ఢిల్లీలో, వరకట్న కేసులు ఉత్తరప్రదేశ్లో, సైబర్ నేరాలు ఒడిశాలో, బాలలపై లైంగిక దాడులు మధ్యప్రదేశ్లో, పోక్సో నేరాలు ఉత్తర ప్రదేశ్లో మరియు పరువు హత్యలు జార్ఖండ్లో సంభవిస్తున్నవి.
    • మహిళలను ఆత్మహత్యకు ప్రేరేపించే సంఘటనలు అధికంగా మహారాష్ట్ర నందు నమోదవుతున్నవి.
    • భ్రూణ హత్యలు ఉత్తరప్రదేశ్ నందు అధికంగా నమోదవుతున్నవి.
    • ఆమ్ల దాడులు బెంగాల్ నందు అధికంగా జరుగుతున్నవి.
    • భర్త మరియు భర్త తరపు బంధువుల యొక్క క్రూరత్వం ఘటనలు పశ్చిమ బెంగాల్ నందు నమోదవుతున్నవి.
    • మైనర్ బాలికల కొనుగోలుకు సంబంధించిన కేసులు అస్సాం నందు అధికంగా నమోదవుతున్నవి.
    • స్త్రీల అక్రమ రవాణా కేసులు మహారాష్ట్ర నందు అధికంగా నమోదవుతున్నవి.
    • మైనర్ బాలికల అమ్మకాలు మధ్యప్రదేశ్ నందు అధికంగా నమోదైనవి.
    • రాజస్థాన్ రాష్ట్రం నందు రేప్ సంఘటనలు అధికంగా నమోదైనవి మరియు బాలికలపై రేప్లు కూడా ఈ రాష్ట్రం నుండే అధికంగా నమోదవుతున్నవి. వరకట్న నిషేధ చట్టం క్రింద అధికంగా కేసులు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నందు నమోదవుతున్నవి.
    • గృహహింస చట్టం క్రింద కేసులు అధికంగా మధ్యప్రదేశ్ రాష్ట్రం నందు అధికంగా నమోదవుతున్నవి.
    • మహిళలపై సైబర్ నేరాలు అధికంగా ఒడిషా నందు నమోదవుతున్నవి.
    • POCSO చట్టం క్రింద కేసులు అధికంగా ఉత్తరప్రదేశ్ నందు నమోదైనవి.


    ఆంధ్రప్రదేశ్లో మహిళలపై జరుగుతున్న నేరాలు


    • మహిళలపై 17,752 నేరాలు నమోదైనవి.
    • 108 వరకట్న మరణాలు, 7092 భర్త మరియు భర్త తరపు బంధువుల క్రూరత్వం, 75 మైనర్ బాలికల కొనుగోలు, 1188 రేప్ కేసులు నమోదైనవి. మహిళల పట్ల 73 సైబర్ కేసులు మరియు 466 పోక్సోకేసులు నమోదైనవి.
    • నేరాల రేటు 67.2 గా నమోదైనది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మహిళలపై జరుగుతున్న నేరాలలో అధికంగా భర్త మరియు భర్త తరపు బంధువుల క్రూరత్వమునకు సంబంధించిన కేసులు నమోదైతున్నాయి.


    గమనిక: మహిళలపై జరుగుతున్న అన్ని రకాల నేరాలలో అధికశాతం నేరాలు ఆ మహిళకు తెలిసిన వ్యక్తులు మరియు కుటుంబ సభ్యుల ద్వారానే జరుగుతున్నవి.


    మహిళలపై జరుగుతున్న నేరాలకు గల కారణాలు


    • మహిళలపై జరుగుతున్న నేరాలకు సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక మరియు మానసిక కారణాలు కలవు.
    • లింగపరమైన వివక్షతలు, లింగపరమైన స్థరీకరణలు, సెక్సిజం, పురుషస్వామ్య విలువలు, భూస్వామ్య విలువల కొనసాగింపు మరియు సాంప్రదాయాలు, మహిళల యొక్క సమానత్వానికి వ్యతిరేకంగా ఉండటం.
    • నేటి ఆధునిక ప్రపంచంలో పోర్నోగ్రఫి, సినిమాలు, టి.వి. సీరియళ్ళు, రియాలిటీ షోలు లాంటి వాటిలో మహిళలను లైంగికతకు గుర్తుగా మరియు ఆకర్షించే వస్తువుగా చిత్రీకరించి డబ్బులు దండుకుంటున్నారు. ఉదా: ఐ.పి.ఎల్ క్రికెట్ లీగ్ నందు మహిళా ఉల్లాసినులు ఉంటారు కాని, పురుషులు ఉండరు. అనగా మహిళను వస్తీకరణ (కమోడిఫికేషన్) చేయడం జరుగుతున్నది.
    • బాల్యవివాహాలు, వరకట్నం తీసుకోవడం మరియు ఇవ్వడం, బహుభార్యత్వాన్ని కలిగి ఉండటం, భార్యను శారీరకంగా హింసించడం లాంటి సంఘటనలను సమాజం పెద్దగా పట్టించుకోవడం లేదు అసలు అది హింసగా భావించడం లేదు.
    • మహిళలపై జరుగుతున్న హింసకు సంబంధించిన నేరాలను నివారించుటలో మరియు నిందితులను శిక్షించుటలో చట్టాల అమలుతీరులో నిర్లక్ష్యపూరిత వైఖరి ఉండటం కూడా ఒక కారణమే.
    • గ్రామీణ ప్రాంతాలలో మరియు గిరిజన ప్రాంతాలలో జరుగుతున్న నేరాలు అసలు చట్టం దృష్టిలో రాకముందే స్థానిక పెద్దమనుషులు తమ తీర్పులతో కప్పిపుచ్చడం జరుగుతుంది కావున నేరాల నమోదు చాలా తక్కువగా ఉన్నది.
    • మహిళలపై తీవ్రమైన హింసకు పాల్పడే వ్యక్తులు మానసికపరమైన సమస్యలను మరియు లోటుపాట్లను కలిగి ఉండే అవకాశం ఉంది.


    మహిళలపై జరుగుతున్న హింస- దుర్భలత్వం (వల్నరబులిటి)


    అన్ని వర్గాల మహిళలపై హింస జరుగుతున్నప్పటికి సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, వెనుకబాటుకు లోనయిన మహిళలపై హింస అధికంగా జరిగే అవకాశం కలదు, అందుకుగల కారణాలు

    • ఆర్థిక నిస్సాయతగా ఉండటం.
    • నిరక్షరాస్యత మరియు వెనుకబాటుతనం వల్ల సులువుగా ట్రాఫికింగ్ లాంటి నేరాలకు గురవ్వడం.
    • ఉపాధి లేక జీవనోపాధి కోసం అనైతిక కార్యక్రమాలకు లోనుగావించబడటం.
    • అనాధలుగా లేదా ఒంటరి మహిళలుగా ఉండటం.
    • రకరకాల ఒత్తిడులకు లోనయ్యి సులువుగా మోసపోయే అవకాశాన్ని కలిగి ఉండటం.
    • లింగపరమైన మోసాలను మొదటిదశలోనే గుర్తించే సామాజిక నైపుణ్యాన్ని కలిగిలేకపోవడం.
    • తల్లిదండ్రుల తోడ్పాటుగాని, భర్తయొక్క తోడ్పాటుగాని లేదా ఇతర కుటుంబ సభ్యుల తోడ్పాటు లేకపోవడం.
    • భర్త లేదా కుమారుడు లేదా ఇంటిలోని వారు మధ్యపానానికి లేదా ఇతర వ్యసనాలకు బానిసలుగా మారడం.
    • విపత్తుల వలన ఒంటరిగా మారినవారు. తక్కువ సమయంలోనే ఎక్కువ గుర్తింపును మరియు డబ్బులను సంపాదించుకోవాలనే ఆతురత ఉన్నవారు. ఉదా: మోడలింగ్ రంగంలో మరియు సినిమా రంగంలో మోసపోతున్న మహిళలు.


    మహిళలపై హింసకు పాల్పడుతున్న వారియొక్క లక్షణాలు


    మహిళలపై తరచుగా హింసకు పాల్పడేవారు కొన్ని రుణాత్మకమైన లక్షణాలను కలిగిఉంటారు. అవి... మానసిక ఒత్తిడి కలిగి ఉన్నవారు, ఆత్మన్యూనభావన కలిగి ఉన్నవారు, మూర్తిమత్వపరమైన లోపాలు కలిగిఉన్నవారు (వీరినే సోషియోపాథ్స్ లేదా సైకోపాథాలు అని అంటారు), తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి సులువుగా డబ్బు సంపాదించాలనే ఆలోచన ఉన్నవారు, సెక్సిజం భావనలని ఉన్నవారు (ఎదుటిలింగం వారిపట్ల విద్వేశాన్ని కలిగిఉన్నవారు), నీలిచిత్రాలకు, మధ్యపానం మరియు మత్తుపదార్థాలకు బానిసలుగా ఉన్నవారు, చిన్నవయస్సులో బాధాకరమైన అనుభవాలు ఎదుర్కొన్నవారు తరచుగా మహిళలపై హింసకు పాల్పడే అవకాశం కలదు.


    ప్రపంచ ఆరోగ్య సంస్థవారి అంతర్జాతీయ వ్యాధుల వర్గీకరణ-10 (ఐ.సి.డి-10) ప్రకారం


    1. పురుషులు లేదా స్త్రీల యొక్క వ్యక్తిగత చర్యలను (అన్ డ్రెసింగ్) చర్యలను చాటుమాటుగా గమనించడం మరియు దానిని పోలిన ఇతర కార్యక్రమాలను తరచుగా చేపట్టడాన్ని వయోరిజమ్ అనే వ్యాధిగా పిలుస్తారు.

    2. చిన్నపిల్లలతో లైంగిక సంబంధమైన చర్యలను చేసే మానసిక స్థితిని పీడోఫీలియా అంటారు. ఇది పురుషులలో అధికంగా ఉంటుంది.

    3. సెక్సువల్ శాడిజం: లైంగికంగా ఎదుటివ్యక్తిని హింసకు గురిచేసి ఆనందించే క్రూరస్వభావం


    ముఖ్యమైన లింగపరమైన భావనలు


    • లింగం ఆధారంగా హెూదాలలో, అవకాశాలలో అసమానతలు చూపెట్టడాన్నే Feminism లింగపరమైన స్తరీకరణ అని అందురు.
    • ఒక లింగం వారి కంటే మరోలింగం వారు ఉన్నతులు అనే భావననే Sexism అందురు.
    • మహిళల కేంద్రీకృతంగా, మహిళల దృకోణంలో వారి సమస్యలను పరిశీలించడాన్నే Feminism అందురు.
    • జెండర్ అనగా సామాజికంగా మరియు సాంస్కృతికంగా స్త్రీలను మరియు పురుషులను గుర్తించడం మరియు Sex అనునది శారీరక తేడాలను సూచిస్తుంది.
    • లింగం ఆధారంగా పురుషులు చేసేపని మరియు స్త్రీలు చేసే పని అని విభజించడాన్నే Gender based division of labour అని అందురు.
    • పురుషులంటే అకారణ భయంను కలిగి ఉంటే Androphobia అని, స్త్రీల పట్ల అకారణ భయం ఉన్నట్లయితే Gynophobia అని, స్త్రీలను అకారణంగా ద్వేషించడంను Misogany అని మరియు పురుషులంటే అకారణంగా ద్వేషం చూపించడంను Misoandry అని అందురు.
    • బాల బాలికలను వారియొక్క లింగం ఆధారంగా సామాజీకరణకు గురిచెయ్యడాన్నే లింగ భేద సామాజీకరణ అంటారు.


    మహిళలకు సంబంధించిన రాజ్యాంగ పరమైన ఏర్పాట్లు మరియు సామాజిక శాసనాలు


    అనాధిగా భారత సమాజంలో మహిళలు వివిధ రకాల వివక్షతలకు, అసమానతలకు, హక్కుల ఉల్లంఘనలకు గురవుతున్నారు కాబట్టి వీరి యొక్క స్థితిగతులను మెరుగుపరచేందుకు రాజ్యాంగ నిర్మాతలు స్త్రీలకు రాజ్యాంగం నందు ప్రత్యేకమైన నిబంధనలతో కూడిన హక్కులను కల్పించడం జరిగింది. ఈ యొక్క రాజ్యాంగ నిబంధనల ఆధారంగా ప్రభుత్వాలు కాలక్రమంలో అవసరమైన Gynophobia సామాజిక శాసనాల అమలు ద్వారా మహిళలకు రక్షణ కల్పిస్తున్నారు.


    మహిళా సంక్షేమం కోసం ఏర్పరచిన రాజ్యాంగపరమైన ఏర్పాట్లు



    గమనిక: 108వ రాజ్యాంగ సవరణ బిల్లుని లోక్సభలో మరియు రాష్ట్ర శాసనసభలలో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రవేశపెట్టారు కాని ఇంతవరకు చట్టరూపం దాల్చలేదు.


    మహిళా సంక్షేమం కోసం అమలుపరుస్తున్న సామాజిక శాసనాలు


                         

    సరోగసి నియంత్రణ చట్టం - 2021


    • ఈ చట్టం జనవరి 25, 2022 నుండి అమలులోకి వచ్చింది.
    • మార్చి 2022లో కేంద్రం సరోగసి నియమాలను రూపొందించింది.
    • ఈ చట్టం వ్యాపార కోణంలో సరోగసిని నిషేదించడం జరిగింది.
    • సెక్షన్ 4 ప్రకారం సరోగసిని నియంత్రిస్తున్నారు.
    • సెక్షన్ 4 ప్రకారం దగ్గరి బంధువు, 25 నుండి 35 సం॥రాల మధ్య ఉన్నవారు, ఇంతకు ముందు సరోగేట్ మదర్గా మారనివారు, ప్రభుత్వ వైద్యునిచే మానసిక ఆరోగ్యాన్ని ధృవీకరించుకున్న వారు మాత్రమే అర్హులు, మరియు ఏ మహిళా కూడా తన సొంత అండాన్ని సరోగేట్ మదర్ గా మారడానికి వినియోగించరాదు.
    • సెక్షన్ 4 ప్రకారం సరోగసిని పద్ధతిలో తల్లిదండ్రులుగా మారేవారు మహిళా అయితే 23 నుండి 50 సం॥రాల మధ్య మరియు స్త్రీ 26 నుండి 55 సం॥రాల మధ్య ఉండాలి, వివాహం అయ్యి ఉండాలి, ఇంతకు ముందు సంతానం ఉండకూడదు, మరియు సరోగసి తల్లిదండ్రులుగా మారేందుకుగాను జిల్లా మెడికల్ బోర్డు ద్వారా ఇన్ఫెర్టిలిటీ సర్టిఫికెట్ను పొంది ఉండాలి.
    • సెక్షన్ 6 ప్రకారం సరోగేట్ మదర్ యొక్క వ్రాత పూర్వక ముందస్తు అనుమతి తప్పనిసరి.
    • సెక్షన్ 8 ప్రకారం సరోగసి పద్ధతిలో జన్మించిన పిల్లలకు కూడా సాధారణ పిల్లలవలె అన్ని హక్కులు ఉంటాయి.
    • సెక్షన్ 15 ప్రకారం జాతీయ స్థాయిలో నేషనల్ అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజి & సరోగసి రిజిస్ట్రీ ఏర్పడుతుంది.
    • సెక్షన్ 17 ప్రకారం జాతీయ స్థాయిలో మరియు సెక్షన్ 26 ప్రకారం రాష్ట్ర స్థాయిలో నేషనల్ అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజి & సరోగసి బోర్డు ఏర్పడుతుంది.
    • సెక్షన్ 38 ప్రకారం వ్యాపార కోణంలో సరోగసిని నిర్వహించడం కాని ఆచరించడం కాని నేరం, ఇందుకుగాను 10 సం॥రాలు తగ్గకుండా జైలు శిక్ష మరియు 10 లక్షల వరకు జరిమానా విధించబడుతుంది.


    వివాహిత ముస్లిం మహిళ వివాహ హక్కుల పరిరక్షణ చట్టం- 2019


    ఈ చట్టంనే ట్రిపుల్ తలాఖ్ నిషేద చట్టం అని కూడా అందురు.

    షయరాబానో అనబడే ముస్లిం మహిళ కేసు సందర్భంగా ఆగస్టు 22, 2017న సుప్రీంకోర్టు ట్రిపుల్ తలాఖ్్న రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులకి మరియు సమానత్వంనకు విరుద్ధమని తీర్పుచెబుతూ నిషేధించింది, మరియు కేంద్ర ప్రభుత్వంను ఈ విధానంపై నిషేధిస్తూ శాసనపరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది.

    సుప్రీంకోర్టు తీర్పు మేరకు కేంద్ర కాబినేట్ తీర్మాణం ఆధారంగా రాష్ట్రపతి ట్రిపుల్ తలాఖ్ పాటించడంను నిషేధిస్తూ మరియు నేరంగా పేర్కొంటు సెప్టెంబర్ 18, 2018న ఆర్డినెన్సిని విడుదల చేశారు. ఈ యొక్క ఆర్డినెన్స్ సెప్టెంబర్ 19, 2018 నుండి అమలులోనికి వచ్చింది. మరియు ఈ యొక్క ఆర్డినెన్స్ స్థానంలో పార్లమెంట్ ఈ చట్టంను 2019వ సంవత్సరంలో రూపొందించినది.

    ఈ చట్టంలోని సెక్షన్ -3 ప్రకారం తలాఖ్-ఇ-బిదాత్ మరియు దీనిని పోలిన యితర తలాఖ్ విధానాలు నిషేదం మరియు పాటించినట్లయితే నేరంగా పరిగణించబడుతుంది.

    ఈ చట్టంలోని సెక్షన్-4 ప్రకారం ట్రిపుల్ తలాఖ్ని పాటించినవారికి 3 సంవత్సరాల జైలు శిక్ష మరియు జరిమానా విధించబడుతుంది.

    సెక్షన్ 5 ప్రకారం తలాఖ్ పాటించిన సందర్భంలో సదరు బార్లకు, భర్త మెయింటెనెన్స్ ఖర్చులు ప్రతి నెలా చెల్లించవలసి ఉంటుంది. మరియు మైనర్ పిల్లలను తల్లి వద్దే ఉంచుకునే హక్కు ఉంటుంది.


    PCPNDT Act - 1994 (గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టం)


    • ఈ చట్టంనే The Pre - Conception and Pre-Natal Diagnostic Techniques (Prohibition of Sex Selection) Act అందురు. ఈ చట్టాన్ని 1994లో రూపొందించారు, 1 జనవరి 1996 నుండి అమలులోనికి వచ్చింది.
    • గర్భస్థ లింగనిర్ధారాన్ని చేసిన తరువాత, ఆడ శివువులను భ్రూణ హత్యలకు గురిచేయడం వల్లనే లింగనిష్పత్తి బాగా తగ్గిపోతున్నది. అందువల్లనే ఈ చట్టంను రూపొందించారు.
    • బేటి బచావో మరియు బేటి పడావో కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాల్లో లింగ నిర్ధారాన్ని పరీక్షల నిషేద చట్టంను సమర్థవంతంగా అమలు చేసి భ్రూణ హత్యలను నివారించడం అనునది ముఖ్యమైనది.
    • ఈ చట్టం ప్రకారం గర్భస్థ లింగ నిర్ధారాన్ని పరీక్షలు నిషేధం మరియు నేరుగా పరిగణించబడుతుంది. కాని జన్యుపరమైన వ్యాధులు ఉన్నప్పుడు, ఇంతకు మునుపు అబార్షన్ అయిఉంటే స్కానింగ్ చేసి శిశువు ఆరోగ్యంను తెలుసుకోవచ్చు.
    • ఈ చట్టంలోని సెక్షన్ 3ఎ ప్రకారం Sex Selective Abortions నిషేదం మరియు సెక్షన్ 4 ప్రకారం క్రింది సందర్భాలలో స్కానింగ్ చేయవచ్చును.

                              1. తల్లికి 35 సంవత్సరాలు దాటి ఉన్నప్పుడు

                              2. ఇంతకు మునుపు అబార్షన్ అయి ఉన్నట్లయితే

                              3. తల్లి తీవ్రమైన వ్యాధులు, రేడియేషన్లకు గురైనప్పుడు

                              4. కుటుంబంలో జన్యువ్యాధులు ఉన్నప్పుడు

    • ఈ చట్టం ప్రకారం, మొదటి సారి నేరం చేసినప్పుడు 3 సంవత్సరాల జైలు శిక్ష మరియు 10 వేల జరిమానాని మరియు రెండవసారి నేరంనకు పాల్పడితే 5 సంవత్సరాల జైలుశిక్ష మరియు 50 వేల జరిమానా విధించబడుతుంది మరియు ఆయా ఆస్పత్రులు మరియు వైధ్యుల గుర్తింపు రద్దుచేస్తారు. దేశంలో మొదటిసారి ఇలాంటి చట్టాన్ని 1988లో మహారాష్ట్ర రూపొందించింది.


    The Indecent Representation of Women (Prohibition) Act - 1986


    • దీనినే మహిళా అసభ్యకర చిత్రీకరణ నిరోధక చట్టం అందురు.
    • ఈ చట్టం ప్రకారం మహిళ యొక్క గౌరవంను మరియు ఔన్నత్యంను దెబ్బతీసే చర్యలు, రచనలు, అడ్వర్టైస్మెంట్లు మరియు ఇతర చర్యలు నిషేదం మరియు నేరంగా పరిగణింపబడుతాయి.
    • ఎవరైన పై చర్యల ద్వారా నేరంనకు పాల్పడితే రెండు సంవత్సరాల జైలుశిక్ష మరియు 2000/- జరిమానా విధించబడును. రెండవసారి నేరంనకు పాల్పడితే 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు 10 వేల నుండి లక్ష రూపాయల వరకు జరిమానా విధించబడుతుంది.


    గృహ హింస నుండి మహిళల సంరక్షణ చట్టం - 2005


    • దీనినే The Protection of Women from Domestic Violence Act అందురు.
    • ఈ చట్టం 26 అక్టోబర్ 2006 నుండి అమలులోనికి వచ్చినది.
    • ఈ చట్టం గృహహింసను సెక్షన్-3 నందు నిర్వహించింది. గృహహింస అనగా శారీరక హింస, మానసిక హింస, మాటల ద్వారా, బ్లాక్ మెయిల్ చేయడం ద్వారా మరియు ఉద్వేగపరమైన హింస కావున ఇవన్నీ కూడా గృహహింస పరిధిలోనికి వస్తాయి. కట్నం కోరడం లేదా ఆస్థిని కోరడం (చట్ట విరుద్ధంగా లేదా డిమాండ్ చేయడం కూడా గృహహింస పరిధిలోనికే వస్తుంది.
    • ఈ చట్టం ప్రకారం గృహహింస నుండి మహిళలను రక్షించేందుకై ప్రత్యేక అధికారిని నియమిస్తారు.
    • ఈ చట్టం ప్రకారం బాధిత మహిళలకు, నివాసహక్కు, రక్షణ హక్కు, వేరుగా ఉండే హక్కు మరియు న్యాయ సహాయం పొందే హక్కుతో పాటు పోషణ ఖర్చులను పొందే హక్కును మరియు వైద్య సహాయం పొందే హక్కును కలిగి ఉంటారు.
    • భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 498 ఎ ప్రకారం కేసులు నమోదు చేస్తారు.


    నిర్భయ చట్టం-2013


    • ఈ చట్టం యొక్క అసలు పేరు The Criminal Law (Amendment) Act - 2013 లేదా సవరించిన నేర న్యాయ చట్టం.
    • నిర్భయ సంఘటన తరువాత మహిళా సంరక్షణ చట్టాల విషయంలో తీసుకొనవలసిన చర్యలపై వేసిన జస్టిస్ వర్మ కమిటి యొక్క సూచనల మేరకు ఈ చట్టంను రూపొందించారు.
    • ఈ చట్టం 3 ఫిబ్రవరి, 2013 నుండి అమలులోనికి వచ్చింది.
    • ఈ చట్టం ద్వారా భారత శిక్షాస్మృతి - 1860, ఆధారాల చట్టం - 1872, నేర విచారణ ప్రక్రియ చట్టం - 1973, బాల న్యాయ చట్టం మరియు లైంగిక వేదింపుల నుండి బాలల సంరక్షణ చట్టం (POSCO Act) - 2012ని సవరించి, ఆయా చట్టాలను మరింత కఠినంగా మార్చారు.
    • నిర్భయ చట్ట ప్రకారం అత్యాచారానికి 7 సంవత్సరాల నుండి యావజ్జీవ జైలుశిక్ష, అత్యాచారం వలన మరణించిన లేదా వైఖల్యానికి గురైన యావజ్జీవం మరియు మరణశిక్ష, యాసిడ్ దాడి సంఘటనలో 10 సంవత్సరాల జైలుశిక్ష మరియు అక్రమ రవాణాకు పాల్పడితే 7 నుండి 10 సంవత్సరాల జైలు శిక్షను విధిస్తున్నారు.


    Sexual Harassment of women at Workplace (Prevention, Prohibition & Redressal) Act - 2013


    • ఈ చట్టంనే పనిచేసే చోట మహిళలపై లైంగిక వేదింపుల నిరోధక చట్టం అని అందురు. ఈ చట్టంనకు సంబంధించిన బిల్లును జాతీయ మహిళా కమీషన్ సహాయంతో రూపొందించారు.
    • ఈ చట్టం 9 డిసెంబర్ 2013 నుండి అమలులోనికి వచ్చింది.
    • చారిత్రక విశాఖ గైడ్లైన్స్ (భన్వరిదేవి అనే రాజస్థాన్కు చెందిన మహిళలపై జరిగిన హింసపై విశాఖ అనే ఎన్.జి.ఓ వేసిన ప్రజాప్రయోజన వాజ్యం కేసులో గైడ్లైన్స్ వెలువడినవి) ఆధారంగా ఈ చట్టంను రూపొందించారు.
    • ప్రభుత్వ మరియు ప్రభుత్వేతర మరియు Domestic సంస్థలకి కూడా ఈ చట్టం వర్తిస్తుంది.
    • ఈ చట్టం ప్రకారం వ్యవస్థీకృత రంగం నందు ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ (ఐ.సి.సి) ని మరియు అవ్యవస్థీకృత రంగం నందు లోకల్ కంప్లైంట్ కమీటీల (ఎల్.సి.సి.)ని నియమించి అక్కడ పనిచేసే మహిళలకు రక్షణను కల్పిస్తూ మరియు వారికి సంబంధించిన వేదింపుల కేసులను తక్షణమే పరిష్కరించాలి.
    • ICC లు వాటి యొక్క సంస్థల యందు మహిళా చట్టాలు మరియు జెండర్ సెన్సిటైజేషన్పై అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించాలి మరియు ఫిర్యాదు వచ్చిన 3 నెలలలోపు చర్యలు తీసుకోవాలి.


    లైంగిక దాడుల బాలుల సంరక్షణ చట్టం 2012


    • దీనినే పోక్సో చట్టం లేదా Protection of Children from Sexual Offenses Act, 2012.
    • ఈ చట్టం నవంబర్ 14, 2012 నుండి అమలులోనికి వచ్చింది. బాలలను లైంగిక దాడులు, వేదింపులు మరియు ప్రోనోగ్రఫి నుండి రక్షించడం మరియు నిందితులను త్వరితగతిన శిక్షించడం ఈ చట్టం యొక్క లక్ష్యం.
    • ఈ చట్టం ప్రకారం 18 సంవత్సరాల లోపు వారు బాలలు, ఈ చట్టం లింగ తటస్థతను పాటిస్తుంది అనగా ఒక మహిళ బాలుడిపై లైంగిక దాడిచేసిన లేదా ఒక పురుషుడు బాలికపై లైంగిక దాడి చేసిన లేదా ఒక స్త్రీ బాలికపై లైంగిక దాడిచేసిన లేదా ఒక పురుషుడు బాలుడిపై లైంగిక దాడి చేసిన శిక్షింపబడతారు.
    • ఈ చట్టం పై జరిగే లైంగిక దాడులను లైంగిక వేదింపులు, ప్రోనోగ్రఫి, అంగప్రవేశం జరిగిన నేరాలు మరియు అంగప్రవేశం జరగని నేరాలుగా నిర్వచించింది.
    • ఈ చట్టాన్ని 2019వ సంవత్సరంలో సవరించారు. ఈ చట్టం క్రింద విదిస్తున్న శిక్షలు.

            అంగప్రవేశంతో కూడిన లైంగిక వేదింపులకు కనీసం 7సం॥ నుండి 10 సం॥ జైలుశిక్ష మరియు 16 సంవత్సరాలలోపు బాలలపై దాడి జరిగినప్పుడు 20 సంవత్సరాల నుండి జీవితకాలం వరకు జైలుశిక్ష విధించవచ్చు.

    • తీవ్రమైన హింసతో కూడిన అంగప్రవేశ లైంగిక వేదింపులకు కనీసం 10 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల వరకు మరియు జీవిత కాలం జైలుశిక్ష కూడా విధించవచ్చు.
    • బాలలు నటించిన నీలిచిత్రాలను నిల్వచేసిన లేదా పంపిణీ చేసినా 3 నుండి 5 సంవత్సరాల వరకు జైలుశిక్ష మరియు జరిమానా విధించబడును.
    • పిల్లల్ని అశ్లీల చిత్రాల కోసం వినియోగించినట్లయితే కనీసం 10 సంవత్సరాల జైలుశిక్ష నుండి జీవిత ఖైదు విధించబడుతుంది. ఇదే నేరం తీవ్రంగా ఉన్నట్లయితే కనీస జైలుశిక్ష 20 సంవత్సరాల వరకు ఉంటుంది.
    • జాతీయ నేర నమోదు సంస్థవారి గణాంకాలు 2020 ప్రకారం బాలలపై జరుగుతున్న నేరాలలో 42.6% కిడ్నాప్లు కాగా 2వ స్థానంలో బాలలపై జరుగుతున్న రేపు కలవు, ఇవి బాలలపై జరుగుతున్న మొత్తం నేరాలలో 38.8% కలవు.
    • జాతీయ నేర నమోదు సంస్థవారి గణాంకాలు 2020 ప్రకారం 2222 మంది బాలలు మనుషుల అక్రమరవాణాకి గురయ్యారు.
    • దేశ వ్యాప్తంగా పోక్సోచట్టం కింద 47,221 కేసులు నమోదైనవి, ఇందులో అధికంగా రాష్ట్రాల పరంగా ఉత్తరప్రదేశ్ నందు, కేంద్రపాలిత ప్రాంతాల నందు ఢిల్లీ నందు నమోదైనవి.


    మాతృత్వ ప్రయోజనాల చట్టం (Maternity Benefit Act) 2017


    • ఈ చట్టంను మాతృత్వ ప్రయోజనాల చట్టం 1961 స్థానంలో రూపొందించారు. ఈ చట్టం ఏప్రిల్ 01, 2017 నుండి అమలులోకి వచ్చింది మరియు ఈ చట్టంలో పేర్కొన్న ఆలనా కేంద్రాల ఏర్పాటు మాత్రం జూలై 01, 2017 నుండి అమలులోనికి వచ్చినది.
    • ఈ చట్టం వ్యవస్థీకృత రంగంలో మరియు అవ్యవస్థీకృత రంగంలో పనిచేస్తున్న అందరు మహిళలకు వర్తిస్తుంది.


    ఈ చట్టం నందలి ప్రయోజనాలు.

    1. మొదటి రెండు సజీవ కాన్పులకు 26 వారాల వేతనంతో కూడిన మాతృత్వ సెలవులు యిస్తారు (8 వారాలు ప్రసూతినకు ముందు మరియు 18 వారాలు ప్రసూతి తరువాత), మూడవ కాన్పుకి 12 వారాలే ఇస్తారు.

    2. మూడవ కాన్పు నుండి మరియు దత్తత మరియు సరోగసి మార్గంలో తల్లిగా మారనున్న వారికి 12 వారాలు మాతృత్వ  సెలవులు యిస్తారు.

    3. 50 కంటే ఎక్కువ ఉద్యోగులు పనిచేసే చోట ఆలనా కేంద్రాల ద్వారా సేవలందిస్తారు మరియు రెండు సార్లు పని విరామ అవకాశం కల్పిస్తారు.

    4. 3500/- మెడికల్ బోనస్ని ఇవ్వాలి మరియు ఈ చట్టానికి సంబంధించిన సమాచారాన్ని ప్రతి మహిళా ఉద్యోగికి ఆయా కంపెనీలు ఆ ఉద్యోగి ఉద్యోగంలో చేరినరోజే తెలపాలి.

    5. ఇంటి దగ్గరి నుండి పనిచేసుకునే వెసులుబాటు మరియు తేలికపాటి పనిని మరియు సౌకర్యాలు కల్పిస్తారు.

    6. 26 వారాల వేతనంతో కూడిన సెలవులతో పాటు వైద్య కారణాలు ఉన్నట్లయితే సంవత్సరంపాటు వేతనం లేని సెలవులు కూడా పొందవచ్చు మరియు ఈ సమయంలోని సెలవులు కూడా సినియారిటి పరిగణలోనికి తీసుకుంటారు.

    7 ఈ చట్టం ప్రభుత్వ మరియు ప్రభుత్వేతర సంస్థలలో పనిచేస్తున్న మహిళలకు కూడా వర్తిస్తుంది.


    గమనిక: వివాహం, వరకట్నం, బాల్యవివాహంలకు సంబంధించిన శాసనాలు వివాహమనే చాప్టర్ దగ్గర వివరింపబడినవి. భారతీయ శిక్షాస్మృతి నందు గల ముఖ్యాంశాలు (Indian Penal Code 1860)




    CEDAW


    • మహిళలపై జరుగుతున్న అన్ని రకాల హింసలను రూపుమాపేందుకై CEDAW లు అనగా The Convention on the Elimination of All forms of Discrimination Against Women అనేటువంటి సంప్రదాయంను ఐక్యరాజ్యసమితి 1979వ సంవత్సరంలో రూపొందించింది.
    • CEDAW ని ఇంటర్నేషనల్ బిల్ ఆఫ్ రైట్ ఫర్ ఉమెన్ అని కూడా అంటారు. 1980 నుండి CEDAW లు అమలులోకి వచ్చింది. దీనిపై ఇండియా 1980న సంతకం చేసింది.


    మహిళలపై జరుగుతున్న హింస - చారిత్రక తీర్పులు


    భారతదేశంలోని న్యాయవ్యవస్థ మహిళలపై జరుగుతున్న హింసకు సంబంధించిన అతితీవ్రమైన హింసతో కూడిన కేసులలో చారిత్రక తీర్పులతో పాటు ప్రభుత్వాలకు మొట్టికాయలు వేస్తూ మార్గదర్శకాలను కూడా జారీచేసింది. ఈ కేసులలో విశాఖ కేసు, షాబానోకేసు మరియు షయరాబాను కేసులు చాలా ముఖ్యమైనవి.


    1. నిర్భయ సంఘటనపై తీర్పు


    16 డిసెంబర్, 2012న మునికా అనబడే ఢిల్లీ శివారు ప్రాంతంలో నడుస్తున్న బస్సులో దుండగులు నిర్భయపై లైంగిక దాడి చేశారు. ఈ క్రూరమైన అకృత్యం వల్ల నిర్భయ ప్రాణాలతో పోరాడి మరణించడం జరిగింది.


    ఈ దురాగతానికి పాల్పడిన నిందితులకు 2017వ సంవత్సరంలో సుప్రీంకోర్టు ఉరిశిక్షను విధించడం సరైనదేనని తీర్పునిచ్చింది. మార్చి 20, 2020న నిందితులను ఉరితీయడం జరిగింది.


    నిర్భయ సంఘటన జరిగిన తర్వాత కేంద్ర మహిళా మరియు శిశు శాఖ వారు లైంగిక వేదింపులకు సంబంధించిన అంశాలపై డిసెంబర్ 23, 2012న ముగ్గురు సభ్యులతో కూడిన జస్టిస్ వర్మ కమిటీని (ఇతర ఇద్దరు లీలాసేత్, గోపాల సుబ్రమణ్యం) ఏర్పాటుచేయడం జరిగింది. ఈ కమిటీ జనవరి 23, 2013న తమ నివేదికను సమర్పించింది. వర్మ కమిటీ సూచనల మేరకు 2013వరకు అమలులో ఉన్న చట్టాలను సవరించి నిర్భయ చట్టం లేదా సవరించిన నేరన్యాయ చట్టం 2013ను ఏర్పాటు చేశారు.


    కేంద్రం 2013లో 1000 కోట్లతో నిర్భయనిధిని ఏర్పాటుచేసి దీనిద్వారా సఖి సెంటర్లు లేదా వన్ స్టాప్ సెంటర్లను, సెంట్రల్ విక్టిమ్ కంపెన్సేషన్ ఫండ్ని మరియు ఇతర సహాయ కార్యక్రమాలను అందిస్తుంది.


    నోట్: నిర్భయ నిధికి సంబంధించిన వివరాలు ఉమెన్ & ఛైల్డ్ వెల్ఫేర్ పాఠ్యాంశం నందు పొందుపర్చబడినవి.


    2. విశాఖ కేసు


    ఈ కేసునే విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ (ఆగస్టు 13, 1997) అని అంటారు. రాజస్థాన్కు చెందిన బన్వరిదేవీ అనబడే మహిళా సంక్షేమ శాఖ ఉద్యోగురాలు బాల్యవివాహాన్ని జరగకుండ ఆపినందుకు గాను లైంగిక దాడికి గురవుతుంది, స్థానిక కోర్టులో కేసు నిలబడకపోవడంతో స్థానికంగా ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థలన్నీ కలిసి విశాఖ అనే పేరుతో సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఫలితంగా సుప్రీంకోర్టు నిందితులను శిక్షిస్తూ మరియు పనిచేసే చోట లైంగిక వేదింపులు లేకుండా చర్యలు తీసుకోవాలని మార్గదర్శకాలను విడుదలచేయడం జరిగింది, అవే విశాఖ గైడ్లైన్స్లోగా ప్రాచుర్యం పొందినవి, వీటి ఆధారంగానే పనిచేసే చోట లైంగిక వేదింపుల నిరోధక చట్టం రూపొందించడం జరిగింది.


    3.షాబానో కేసు


    ఈ కేసునే మహ్మద్ అహ్మదాన్ వర్సెస్ షాబానోభేగం & ఇతరులు (23 ఏప్రిల్, 1985) అని పిలుస్తారు. ఈ కేసులో సుప్రీంకోర్టు విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలకు భరణం చెల్లించాలని తీర్పునిచ్చింది. ఇండోర్ (మధ్యప్రదేశ్)కు చెందిన షాభానోభేగం గారు భర్తచేత విడాకులకు గురైనది, ఫలితంగా రక్షణ మరియు భరణం కోసం కోర్టును ఆశ్రయించగా సుప్రీంకోర్టు భరణం చెల్లించాలని తీర్పునిచ్చింది.


    ఇతర ముఖ్యమైన కేసులు


    1. మేరీరాయ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ: 1986వ సంవత్సరంలో సుప్రీంకోర్టు సిరియన్ క్రిస్టియన్ మహిళా అయిన మేరీరాయ్కి కూడా తండ్రిఆస్థిలో వారసత్వ ఆస్తిహక్కులు ఉంటాయని తీర్పునిచ్చింది.

    2. లలితాసింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ (7 జూలై, 2006): మెజార్టీ వయస్సు కలిగిన స్త్రీకి ఎవరినైనా వివాహం చేసుకునే హక్కు ఉంటుందని తీర్పునిచ్చింది.

    3. రొక్సాన్ శర్మ వర్సెస్ అరుణ్ శర్మ (17 ఫిబ్రవరి, 2015): కుటుంబానికి దూరంగా ఉంటున్న తండ్రికి పిల్లలపై హక్కు ఉండదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.

    4. సుహాస్ కట్టి వర్సెస్ తమిళనాడు (2004): మహిళలకి సంబంధించిన అసభ్యకరమైన సందేశాలు మహిళల యొక్క గౌరవాన్ని భంగపరిచేందుకు వివిధ ప్రసారమాధ్యమాలలో సర్కులేట్ చేయడానికి సంబంధించినది.

    5. లక్ష్మి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా: 2013వ సంవత్సరంలో యాసిడ్ దాడికి గురయిన లక్ష్మి అనే బాధితురాలి కేసులో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీచేసింది.

    6. షయిరాబాను వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (22 ఆగస్టు 2017): షయిరాబాను అనే మహిళా ట్రిపుల్ తలాఖ్ప సుప్రీంకోర్టును ఆశ్రయించగా ట్రిపుల్ తలాఖ్ని పాటించడం ఆర్టికల్ 14, ఆర్టికల్ 15 నకు విరుద్ధమని 5గురి జడ్జీలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం 3-2 తేడాతో ట్రిపుల్ తలాఖ్్ను లేదా తలాఖ్ ఇ బిదాత్ను లేదా దీనిని పోలిన ఇతల తలాఖ్ రూపాలను రాజ్యాంగ విరుద్ధమని తేల్చింది మరియు సంబంధించిన చట్టాన్ని రూపొందించాలని కేంద్రానికి సూచనలు చేసింది. దీనితోపాటుగా ట్రిపుల్ తలాఖ్ అనునది ఆర్టికల్ 25 క్రింద లభించే మతసంరక్షణ హక్కుల కిందికి రాదని తెలిపింది.

    7. మధుర కేసు (మార్చి 26, 1979): కస్టోడియల్ రేప్నకు సంబంధించినది.

    8. హాజిఅలీ దర్గా కేసు: ఆగస్టు 26, 2016 సంవత్సరంలో ముస్లిం మహిళలకు కూడా ప్రార్ధనామందిరాల యందు ప్రవేశం ఉంటుందని తీర్పునిచ్చింది.

    9. భూమాత బ్రిగేడియర్కు చెందిన తృప్తిదేశాయ్ అనే కార్యకర్త మహారాష్ట్రకు చెందిన శనిసింగనాపూర్ దేవాలయంలోకి బాంబే హైకోర్టు తీర్పుమేరకు ప్రవేశించింది.

    10. శబరిమల (యంగ్ ఇండియన్ లాయర్స్) కేసు: సెప్టెంబర్ 28, 2018న శబరిమల దేవాలయంలోకి మహిళలను ప్రవేశించకుండ ఆపడమనేది వారికున్న ప్రాథమిక హక్కులకు విరుద్ధమని 4-1 తేడాతో 5గురు జడ్జీల సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొన్నది.


    పునశ్చరణ


    • నవంబర్ 25ని మహిళలపై జరుగుతున్న హింసకు వ్యతిరేక దినంగా జరుపుకుంటారు.
    • ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు మహిళా జీవితంలో 5 ప్రధాన దశలలో హింస జరుగుతుందని తెలిపారు.
    • NCRB 2021 నివేదిక ప్రకారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నందు మహిళలపై హింస అధికంగా జరుగుతున్నది.
    • NCRB 2021 నివేదిక ప్రకారం మహిళలపై జరుగుతున్న అన్ని రకాల నేరాలలో భర్త మరియు భర్త తరపు బందువులు చూపెడుతున్న క్రూరత్వంనకు సంబంధించిన కేసులు అధికంగా కలవు.
    • NCRB 2021 నివేదిక ప్రకారం జాతీయస్థాయిలో క్రైవేటు 64.5 ఉండగా, అత్యధికంగా అస్సాం నందు 168.3 కలదు.
    • మహిళపై జరుగుతున్న హింసకు సామాజిక ఆర్థిక కుటుంబ కారణాలు కలవు.
    • ఒకలింగం వారు మరోలింగం వారి పట్ల చూపించే ద్వేషాన్నే సెక్సిజం లేదా లింగతత్వం అంటారు.
    • స్త్రీల కోణంలో సమాజాన్ని అవగాహన చేసుకోవడాన్నే ఫెమినలిజం అంటారు.
    • పురుషులంటే ఉండే అధిక భయాన్ని యాండ్రోఫోబియా అని, స్త్రీలంటే అధికమైన భయాన్ని కలిగి ఉండడాన్ని గైనోఫోబియా అంటారు.
    • వివాహిత ముస్లిం మహిళ వివాహ హక్కుల పరిరక్షణ ఆర్డినెన్స్ మొదటగా సెప్టెంబర్ 18, 2018న విధించబడింది, మరియు ఇది చట్టంగా 20196⁹ మార్పు చేయబడింది.
    • పై చట్టం ప్రకారం ట్రిపుల్ తలాఖ్ పాటించినట్లైతే జైలుశిక్ష విధిస్తారు.
    • గృహ హింస నుండి మహిళల సంరక్షణ చట్టం 2006 నుండి అమలులోనికి వచ్చింది.
    • నిర్భయ చట్టం యొక్క అసలు పేరు సవరించిన నేరన్యాయ చట్టం.
    • పనిచేసే చోట లైంగిక వేదింపుల నుండి మహిళలను రక్షించే చట్టం డిసెంబర్ 09, 2013 నుండి అమలులోనికి వచ్చింది. ఈ చట్టం సుప్రీంకోర్టు విశాఖ కేసులో విడుదల చేసిన గైడ్లైన్స్ ఆధారంగా రూపొందించబడింది.
    • మాతృత్వ ప్రయోజనాల చట్టాన్ని 2017లో సవరించారు. దీని ద్వారా పనిచేసే మహిళకు 26 వారాల వేతనంతో కూడిన మాతృత్వ సెలవులు అందిస్తారు.
    • CEDADWని ఇంటర్నేషనల్ బిల్ ఆఫ్ రైట్ ఫర్ ఉమెన్ అని కూడా పిలుస్తారు.
    • భూమాత బ్రిగేడియర్ అనే సంస్థను స్థాపించిన తృప్తిదేశాయ్ శనిసింగనాపూర్, శబరిమల మరియు హాజీ అలీ దర్గాలో మహిళల ప్రవేశం కోసం పోరాటం చేసారు.

    • సెప్టెంబర్ 28, 2018న సుప్రీంకోర్టు శబరిమల ఆలయంలోనికి మహిళలకు ప్రవేశం అనునది వారి యొక్క ప్రాథమిక హక్కు అని తీర్పునిచ్చింది.


Tags: Caste system, gender roles, joint families, arranged marriages, diversity, cultural festivals, social hierarchy, economic disparities, religious practices, education system, urbanization, rural traditions, globalization, modernization


No comments:

Post a Comment

Post Bottom Ad