1.6 వివాహం - GNANA SAMHITHA

GNANA SAMHITHA

DONT WORRY!!! WE HELP YOU TO REACH YOUR GOAL 😊

Breaking

Post Top Ad

Thursday, July 6, 2023

1.6 వివాహం

1.6 వివాహం


    మానవుడు తను నిర్వహించే పాత్రలలో మరియు సంబంధాలలో ప్రత్యేకమైనది, ఉద్వేగాలు, ప్రేమ మరియు అనురాగాలతో కూడిన వ్యక్తిగత అంశాలతో పాటుగా సామాజికమైన బాధ్యతలను కూడా నిర్వర్తించేలా చేసే ప్రాథమిక సామాజిక సంస్థ వివాహం. వివాహమనే సామాజిక సంస్థ వల్లనే మనుషులు జంతువుల వలె కాకుండా క్రమబద్ధమైన లైంగిక జీవనాన్ని, కుటుంబ జీవనాన్ని మరియు బంధుత్వాన్ని కలిగి ఉన్నారు. నాగరికత ప్రారంభం నుండి ఇప్పటివరకు వివాహ వ్యవస్థ సజీవంగా కొనసాగుతున్నది కాని మారుతున్న సామాజిక, ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా వివాహ వ్యవస్థలో మార్పులు వస్తున్నవి మరియు ప్రభుత్వాలు మరియు సంస్కర్తల కృషివల్ల వివాహ వ్యవస్థలో ఉన్న పురుషాధిక్య ధోరణులు తగ్గుతున్నవి అయినను అన్ని రంగాల్లో ఉన్నట్టుగానే స్త్రీల పట్ల వివాహానికి సంబంధించి వివక్షతలు కలవు. ఈ ఛాప్టర్ నందు వివాహానికి సంబంధించిన నిర్వచనాలు, భావనలు, రూపాలు, వివాహ నియమాలు మరియు లక్షణాలు వివిధ మతాలలో ఉన్నటువంటి వివాహ వ్యవస్థలు మరియు వివాహ వ్యవస్థలోనున్న లోపాలు సరిదిద్దేందుకు రాజ్యం తీసుకుంటున్న చర్యలను గూర్చి సవివరంగా తెలపడం జరిగింది.


    వివాహం భావన మరియు నిర్వచనాలు


    • వివాహం అనునది హిందీ పదం అయిన వి+వాహ నుండి తీసుకోబడింది. దీని అర్థం సామాజిక పరమైన & మతపరమైన క్రతువును నిర్వహించి వధువును తీసుకుని వెళ్ళడం.
    • వివాహం అనునది విశ్వవ్యాప్తంగా ఆచరించబడే ప్రాథమిక సామాజిక సంస్థ.
    • వివాహం ద్వారానే కుటుంబం ఏర్పడుతుంది అనగా కుటుంబ వ్యవస్థకు పునాది వివాహం మరియు వివాహం ద్వారా పొందిన సంతానానికి ఆమోదం లభిస్తుంది.


    నోట్: పాశ్చాత్తీకరణ మరియు ఆధునీకరణల ప్రభావంతో వివాహము లేకుండానే సహజీవనం అనే పద్ధతిలో కూడా జీవిస్తున్నవారిని చట్టాలు కుటుంబాలుగానే గుర్తిస్తున్నాయి.


    • వివాహమునకు సంబంధించి వెస్టర్ మార్క్, ముర్దాక్ల యొక్క నిర్వచనాలను సాంప్రదాయ నిర్వచనాలని మరియు గఫ్, స్టీఫెన్స్, లోవి, మజుందార్ మరియు మదన్ల యొక్క నిర్వచనాలను ఆధునిక నిర్వచనాలని భావిస్తారు.
    • మతాచారాలు, సాంప్రదాయాలు, చట్టం గుర్తించిన రీతిలో స్త్రీ, పురుషులు ఒకరిపై మరొకరు లైంగిక హక్కులను కలిగి ఉండే వ్యవస్థే వివాహం - వెస్టర్ మార్క్.
    • ఒకేచోట నివసిస్తూ పరస్పర ఆర్థిక సహాకారం కలిగియున్న వ్యక్తులు వ్యష్టి కుటుంబంగా ఏర్పడడానికి దోహదపడే విశ్వవ్యాప్త సంస్థే వివాహం - ముర్దాక్.
    • స్త్రీ,పురుషుల సంయోగం ద్వారా కలిగిన సంతానాన్ని చట్టబద్ధ సంతానంగా చేసేదే వివాహ వ్యవస్థ - సెల్లింగ్ మన్.
    • వివాహం ఒక స్త్రీకి సమాజంచే గుర్తించబడిన భర్తనీ, ఆమె పిల్లలకు సమాజంచే గుర్తించబడిన తండ్రిని ఇస్తుంది - మాలినోవ్స్కీ.
    • స్త్రీ, పురుషుల లైంగిక సంబంధాలు, వాటి పర్యవసనంగా ఏర్పడే సామాజిక, ఆర్థిక సంబంధాలలో పాల్గొనుటకు మత క్రతువు ద్వారా గాని లేదా పౌరచట్టం రూపొందించిన ఇతర పద్ధతులలో గాని ఒక్కటై సమాజం ఆమోదం పొందితే దానిని వివాహమని చెప్పవచ్చు - మజుందార్ & మదన్.


    • మానవుని యొక్క లైంగిక జీవనాన్ని క్రమబద్ధం మరియు నియమితం చేసుకునేందుకు మానవ సమాజం ఏర్పరుచుకున్న ప్రాథమిక సంస్థ వివాహం అందుకనే గిల్లిన్ & గిల్లిన్ అభిప్రాయం ప్రకారం కుటుంబం & సంతానాన్ని ఏర్పరిచేందుకు సమాజం ఆమోదించిన మార్గం.


    ఎడ్మండ్ లీచ్ అనే మానవశాస్త్రవేత్త వివాహమునకు విశ్వజనీనంగా గుర్తించబడిన నిర్వచనం సాధ్యం కాదని కాని వివాహమునకు ఈ క్రింది లక్షణాలుంటాయని తెలిపినాడు.

    1. చట్టబద్ధమైన తల్లిని, తండ్రిని పిల్లలకిస్తుంది.

    2. దంపతుల మధ్య లైంగిక హక్కులను కల్పిస్తుంది.

    3. దంపతుల మధ్య శ్రమవిభజనను కల్పిస్తుంది.

    4. ఆస్తులపై ఉమ్మడి బాధ్యతలు మరియు హక్కులను కల్పిస్తుంది.

    5. పిల్లల యొక్క సంరక్షణ మరియు పిల్లల కోసం నిధిని ఏర్పాటు చేయడం అనే విధిని ఏర్పాటు

    చేస్తుంది.

    6. సామాజిక బంధుత్వాలను విస్తరిస్తుంది.


    వివాహం ఆవిర్భవించుటకు ప్రధానంగా 3 అంశాలు దోహదపడినవి. అవి....

    1. స్త్రీ, పురుషులు శ్రమ ఫలితాలను పంచుకోవలసి రావడం

    2. సంతానం దీర్ఘకాలంపాటు తల్లిదండ్రులపై ఆధారపడాల్సి ఉండటం

    3. సమాజం నందు లైంగిక పోటిని క్రమబద్ధీకరించాల్సి రావడం

    • ఫిబ్రవరి 2వ ఆదివారంను అంతర్జాతీయ వివాహ దినోత్సవంగా జరుపుకుంటారు.
    • పిల్లలు దీర్ఘకాలంపాటు తల్లిదండ్రులపై ఆధారపడి రావడం, స్త్రీ, పురుషులు తమ శ్రమ ఫలితాలను పంచుకోవాల్సి రావడంతో మానవ సమాజంలో వివాహాం అనే సామాజికసంస్థ ఏర్పాటుకు దారితీసింది.
    • ముల్లర్ అనునతడు వివాహం నందు గల అంతర్లీనంగా ఇమిడి ఉన్న ఈ క్రింది 3 సూత్రాలు తెలిపాడు.

                         1. ప్రేమించుకోవడం 

                         2. సంతానం పొందడం

                         3. ఆర్థిక సంపదలు

    • మోర్గాన్ ప్రకారం, మానవ సమాజంలో వివాహం స్వైరితం, సామూహిక వివాహం, బహువివాహం అను దశలను దాటి ఏక వివాహం అనే రూపాన్ని సంతరించుకుంది.


    నోట్: ప్రస్తుతం సహజీవనం అనబడే పెడధోరణి కూడా కనపడుతున్నది.


    వివాహం యొక్క లక్షణాలు


    వివాహం యొక్క తీరుతెన్నులు మరియు సాంప్రదాయాలు వివిధ సమాజాలలో వివిధ రకాలుగా ఉన్నప్పటికి వివాహం అనే సామాజిక సంస్థకి విశ్వవ్యాప్తంగా ఈ క్రింది లక్షణాలు ఉంటాయి.


    1. వివాహం విశ్వవ్యాప్తమైనది:- అనగా ప్రతిసమాజం నందు వివాహవ్యవస్థ ఉంటుందని అర్థం


    2. స్త్రీ, పురుషుల మధ్యగల సంబంధం:- వివాహం అనేది భిన్న లింగాలకు చెందిన స్త్రీ, పురుషుల మధ్య జరగడం సర్వసాధారణం కాని ఈ మధ్యకాలంలో సమలింగ వ్యక్తుల మధ్య జరుగుతున్న వివాహాలను కూడా మనం గమనించవచ్చు వీటినే సమలింగ హెూమోసెక్సువల్ వివాహాలు అంటారు.


    3. వివాహ బంధం శాశ్వతమైనది:-ప్రస్తుత ఆధునిక యుగంలో చాలావరకు వివాహ బంధాలు శాశ్వతమైనవిగా ఉన్నప్పటికిని, వైయుక్తికత పెరగడం, పెడధోరణులు పెరగడం మరియు విడాకులు తీసుకోవడానికి అవకాశం రావడం లాంటి కారణాల వల్ల వివాహబంధం కొన్ని సందర్భాలలో శాశ్వతమైనదని చెప్పలేం.


    4. సామాజిక అంగీకారం ఉంటేనే వివాహం అంటారు:- ప్రతి వివాహానికి కుటుంబ సభ్యుల జోక్యం మరియు అంతర్వివాహ నియమాలు పాటించడం లాంటివి సామాజిక అంగీకారానికి దోహదపడుతున్నవి అయినను చట్టబద్ధమైన వివాహ వయస్సు లేనప్పుడు ఆ వివాహం నేరంగా పరిగణించబడుతుంది.


    కులాంతర మరియు మతాంతర వివాహాలు చేసుకున్నప్పుడు కుటుంబం మరియు సమాజం యొక్క అంగీకారం లేకపోయిన ఆయా చట్టాల ప్రకారం అవి వివాహాలుగానే గుర్తించబడుతున్నాయి.


    5. వివాహం పౌర మరియు మతపరమైన సంస్కారాలతో కూడి ఉంటుంది: వివాహ సందర్భంగా ఆయా మతాలను అనుసరించి చేసేవే మతపరమైన సంస్కారాలు.


    6. పరస్పర హక్కులను మరియు బాధ్యతలను తెలుపుతుంది:- వివాహ జీవితంలోకి అడుగిడిన తర్వాత స్త్రీ, పురుషులిద్దరికి పరస్పరం నిర్వహించుకోవల్సిన బాధ్యతలను అటు సమాజపరంగా సాంప్రదాయంలో భాగంగా తెలిసివస్తాయి మరియు వివాహ చట్టాల ప్రకారం కూడా పరస్పరం నిర్వహించవలసిన బాధ్యతలని మనం గమనించవచ్చు.


    7. ప్రతి వివాహం సామాజిక నియమావళిని మరియు చట్టపర నియమావళిని కలిగి ఉంటుంది: భార్య పట్ల భర్తకు అలాగే భర్తపట్ల భార్యకు గల భాద్యతలను మరియు సంతానం పట్ల దంపతులకు గల బాధ్యతలను, ఒక కుటుంబంగా సమాజం పట్ల బాధ్యతలను వివాహం తెలియజేస్తుంది. మానవుల యొక్క లైంగిక, ఆర్థిక, మానసిక అవసరాలను సరియైన పద్ధతిలో సమకూర్చుకునేవిధంగా ఈ బాధ్యతలుంటాయి.


    వివాహం యొక్క ప్రకార్యాలు (Functions of Marriage)


    వివాహం అనే ప్రాథమిక సామాజిక సంస్థ మానవుల యొక్క జైవిక, ఆర్థిక, సామాజిక, మతపరమైన, ఉద్వేగ పరమైన మరియు వాత్సల్యపరమైన అవసరాలను ఒక క్రమపద్ధతిలో తీర్చుకునేందుకు ఏర్పడినటువంటిది అందులకై వివాహం ఈ క్రింది ప్రకార్యాలను నిర్వర్తిస్తుంది.

    1. మానవుల యొక్క లైంగిక జీవనాన్ని క్రమబద్ధం మరియు నియంత్రణ చేస్తుంది

    2. కుటుంబం ఏర్పాటునకు దారితీస్తుంది.

    3. కుటుంబ సభ్యులమధ్య ఆర్థికపరమైన సహకారం మరియు శ్రమవిభజనకు తోడ్పడుతుంది

    4. వివాహం ఉద్వేగపరమైన, మానసికపరమైన, శారీరకపరమైన మరియు సామాజిక పరమైన అవసరాలను తీర్చే కేంద్రంగా ఉంటుంది.

    5. వివాహ సంబంధాలు క్రమబద్ధీకరించడం వల్ల సామాజిక దృఢత్వం ఏర్పడుతుంది.

    6. వివాహం ద్వారా ప్రాథమిక అవసరాలైన పోషణ, లైంగిక అవసరాలు, ఆహారం, నివాసం, అనురాగం మరియు ఆప్యాయతలు లాంటివి లభిస్తాయి.

    7. కూన్స్ అనునతడి ప్రకారం మనిషి యొక్క జీవితాన్ని 2 ప్రధాన దశలుగా విభజించవచ్చు. అవి...

                   1. వివాహమునకు ముందు జీవితం

                   2. వివాహం తర్వాత జీవితం

    8. వివాహం సామాజిక వ్యవస్థను సమతుల్యంగా ఉంచుతుంది.


    వివాహం యొక్క లక్ష్యాలు (Objectives of Marriage)


    భోమన్ ప్రకారం వివాహం యొక్క ప్రాథమిక లక్ష్యాలు


    1. లైంగిక అవసరాలను సంతృప్తిపరుచుకోవడం

    2. పిల్లల్ని మరియు సహచరత్వాన్ని సంపాదించుకోవడం

    3. రక్షణ మరియు ఆర్థికఅవసరాలు తీర్చుకోవడం

    4. సామాజిక బాధ్యతలు నెరవేర్చుకోవడం


    పోపిన్ అనునతడు వివాహంనందు 5 మూలకాలు ఉంటాయని తెలిపాడు అవి..

    1. లైంగిక సహజాతం 

    2. శ్రమ విభజన 

    3. కుటుంబం మరియు సంతానాన్ని కలిగి ఉండాలనే కోరిక

    4. సామాజిక, ఉద్వేగపర మరియు మానసిక అంశాలతో ముడిపడి ఉండటం

    5. ఆర్థికపరమైన రక్షణలు


    మజుందార్ అనునతడు ఈ క్రింది వివాహ లక్ష్యాలు తెలిపాడు.

    1. లైంగిక తృప్తి

    2. సంతానం యొక్క సంరక్షణ

    3. సంస్కృతి ప్రసరణం

    4. ఆర్థిక అవసరాలు

    5. వారసత్వ కొనసాగింపులు


    వివాహ పరిణామం


    ప్రస్తుతం ఉన్నటువంటి వివాహ వ్యవస్థ వివిధ దశలను దాటి ప్రస్తుత రూపాన్ని సంతరించుకుందని మోర్గాన్ అనే పరిణామవాది తెలిపారు. వీరి ప్రకారం వివాహ పరిణామం ఈ క్రింది విధంగా జరిగింది.



    వివాహ రూపాలు (Forms of Marriages)


    వివాహం అనేది ప్రతి సమాజంలో ఉన్నప్పటికి ఆయా సమాజాల యొక్క సామాజిక, సాంస్కృతిక మరియు ఆర్థిక పరిస్థితులను బట్టి వివాహ రూపాలు, నియమాలు, వివాహ వయస్సు లాంటి అంశాలలో వైవిద్యత కన్పిస్తుంది.

    ప్రపంచ వ్యాప్తంగా వివాహాలు ఈ క్రింది 3 రూపాల్లో ఉంటాయని మాలినోవ్స్కీ అనునతడు తొలిసారిగా తెలిపాడు.

    1. ఏకవివాహం 

    2. బహుభార్యత్వ

    3. బహుభర్తత్వం



    వివాహాలు ప్రధానంగా: 1. ఏక వివాహం (మోనో గమి) 2. బహు వివాహం (పాలిగమి) గా చెప్పవచ్చు.


    ఏకవివాహం (మోనోగమి): ఒకే జీవిత భాగస్వామిని కలిగి ఉండే వివాహాలనే ఏక వివాహాలు అంటారు. ఇవి ప్రధానంగా 2 రూపాలలో ఉంటాయి.


    1. ఏకకాల ఏక వివాహం (నాన్ సీరియల్ మోనోగమి): ఒకసారి వివాహం జరిగిన తర్వాత విడాకులు తీసుకున్న తర్వాత గాని లేదా జీవిత భాగస్వామి మరణించిన తరువాత వివాహం చేసుకున్నట్లయితే దానిని ఏకకాల ఏక వివాహం అంటారు.

    •  ఏక వివాహాన్నే దంపతి వివాహం అని కూడా అంటారు.
    • వెస్టర్‌మార్క్ ప్రకారం, ఏక వివాహం అన్ని వివాహాలకంటే పురాతనమైనది.

    2. జీవితకాలం ఏక వివాహం (సీరియల్ మోనోగమి): ఒకసారి వివాహం జరిగిన తర్వాత విడాకులు తీసుకున్న తర్వాత గాని లేదా జీవిత భాగస్వామి మరణించిన తరువాత కూడా వివాహం చేసుకోనట్లయితే దానిని జీవితకాల ఏక వివాహం అంటారు.


    ఏక వివాహం యొక్క ఉపయోగాలు


    1. స్త్రీకి పురుషుడితో సమాన హెూదా లభిస్తుంది.

    2. విశ్వవ్యాప్తంగా ఆమోదం పొందింది.

    3. సంతానం యొక్క మూర్తిమత్వం సరైన దిశలో అభివృద్ధి చెందుతుంది.

    4. కుటుంబం సుస్థిరంగా ఉంటుంది.

    5. జనాభావృద్ధి సరైన దిశలో కొనసాగుతుంది.

    6. సమాజంలో అందరికీ వివాహం చేసుకునే అవకాశం లభిస్తుంది.


    బహు వివాహం (పాలిగమి)


    ఏక కాలంలో ఒకరి కంటే ఎక్కువ జీవిత భాగస్వామ్యులను కలిగియుండే విధానాన్నే బహు వివాహం అని అందురు. బహు వివాహం ప్రధానంగా క్రింది 3 రూపాల్లో కనబడుతుంది.

    1. బహు భార్యత్వం (పాలి గైనీ)

    2. బహు భర్తత్వం (పాలియాండ్రి)

    3. బహుభార్యాభర్తత్వం (పాలిగైనీయాండ్రీ)


    1. బహుభార్యత్వం (పాలిగైనీ): ఏకకాలంలో ఒకరికంటే ఎక్కువ భార్యలు కలిగి ఉండే వివాహ రూపం. ఇది ప్రధానంగా 2 రూపాల్లో కనబడుతుంది.


         ఎ. భగినీ బహుభార్యత్వం (సరోరల్ పాలీగైనీ): ఒక వ్యక్తి యొక్క భార్యలు సొంత అక్కా చెళ్ళుల్లు అయినప్పుడు, ఆ వివాహ రూపాన్ని భగినీ బహుభార్యత్వం అందురు.

    ఉదా: గోండులు, ముండాలు, ఇబల్స్


     బి. అభగినీ బహు భార్యత్వం (నాన్సరోరల్ పాలీగైనీ): ఒక వ్యక్తి యొక్క భార్యలు సొంత అక్కాచెళ్ళుల్లు

    కానప్పుడు ఆ వివాహ రూపాన్ని అభగినీ బహుభార్యత్వం అందురు.

    ఉదా: నాగాలు, బైగాలు, ఉరళీలు

    .

    బహుభార్యత్వంనకు కారణాలు


    • లింగ నిష్పత్తిలో పురుషుల సంఖ్య తక్కువగా ఉండడం.
    • అంతర్వివాహ నియమంను కఠినంగా పాటించడం.
    • మగ సంతానం కావాలనే ఆలోచన.
    • మొదటి భార్యకి సంతానం లేకపోవడం మరియు ఆరోగ్య కారణాలు.
    • భూస్వామ్య వ్యవస్థ మరియు రాచరిక వ్యవస్థలో బహుభార్యత్వం సర్వసాధారణం.
    • బహుభార్యత్వాన్ని హెూదాగా పరిగణించడం.


    బహుభార్యత్వం వలన కలిగే నష్టాలు


    • అధిక జనాభాకు దారితీస్తుంది.
    • కుటుంబంలో స్త్రీకి అధమ స్థానం.
    • పిల్లల పోషణ, సామాజీకరణ సరైన రీతిలో ఉండదు.
    • ఆర్థికంగా పెనుభారం.
    • ఆప్యాయత, అనురాగాల స్థానంలో గొడవలు ఉంటాయి.
    • కుటుంబంలో వృద్ధుల సంరక్షణ సరిగా ఉండదు.


    2. బహుభర్తత్వం (పాలియాండ్రీ


    ఒక స్త్రీ ఒకరికంటే ఎక్కువ మంది పురుషులను వివాహం చేసుకోవడాన్ని బహుభర్తత్వం అంటారు. ఇది 2 రూపాల్లో కనబడుతుంది.

    1. సోదర బహు భర్తత్వం (ఫ్యాటర్నల్ పాలియాండ్రీ)

    2. అసోదర బహు భర్తత్వం (నాన్ ఫ్యాటర్నల్ పాలియాండ్రీ)


    1. సోదర బహుభర్తత్వం (ఫ్యాటర్నల్ పాలియాండ్రీ) :


    ఉదా: నీలగిరి తోడాలు, హిమాలయ ఖాసీలు మరియు బోటీలు.

    ఒక స్త్రీ ఒకే కుటుంబానికి చెందిన సోదరులని భర్తలుగా కలిగి ఉంటే దానిని సోదర బహు భర్తత్వం అంటారు.

    నీలగిరి తోడాల యందు ఒక వ్యక్తిని ఒక స్త్రీ వివాహం చేసుకున్నప్పుడు అతని సోదరులు కూడా ఆమెకు భర్తలు గానే పరిగణించబడుతారు.

    సంతానంనకు తండ్రి ఎవరనే సంశయాన్ని తీర్చడానికి ధనుర్భానోత్సవాన్ని నీలగిరి తోడాల్లో నిర్వహిస్తారు. స్త్రీ 7వ నెల గర్భిణిగా ఉన్నప్పుడు ఆమె భర్తలలో ఎవరు ధనస్సుని & విల్లంబులను ఆమెకు బహుకరిస్తారో వారే పుట్టబోయే సంతానం యొక్క సామాజిక తండ్రిగా పరిగణించబడుతాడు.


    2. అసోదర బహు భర్తత్వం (నాన్ ఫ్యాటర్నల్ పాలియాండ్రీ): 


    ఉదా: మార్క్విజాన్ తెగలు, కేరళ నాయర్లు

    ఈ వివాహం నందు స్త్రీ యొక్క భర్తలు స్వంత సోదరులు కారు. వేరు వేరు కుటుంబాలకు చెందినవారు అయి ఉంటారు.


    నోట్: సోదర బహుభర్తత్వం నందు వైఫ్ షేరింగ్ కనపడుతుంది అదే అసోదర బహుభర్తత్వం నందు వైఫ్ లెండింగ్ కనపడుతుంది. అనగా అసోదర బహుభర్తత్వం నందు ఒక నిర్ధిష్ట కాలంపాటు ఎవరి దగ్గర ఉంటుందో ఆ సమయంలో వారికి మాత్రమే భార్యగా ఉంటుంది మిగతా భర్తలతో సంబంధం ఉండదు.


    బహు భర్తత్వంనకు గల కారణాలు


    1. దీనినే పేదరికంతో రాజీపడి మగవాళ్ళు చేసుకునే పెళ్ళి అంటారు.

    2. లింగ నిష్పత్తిలో స్త్రీల జనాభా తక్కువగా ఉండడం

    3. స్త్రీ శిశు హత్యలు

    4. స్త్రీ భ్రూణ హత్యలు

    5. కన్యాశుల్కం, వోలి అనే సాంప్రదాయాలు ఉండడం మరియు వాటినే చెల్లించే ఆర్థిక స్థాయి వరుడికి లేకపోవడం.

    6. కుటుంబ ఆస్తి ఉమ్మడిగా ఉండాలనే అభిప్రాయం కలిగి ఉండడం.


    బహుభర్తత్వం వలన కలిగే నష్టాలు


    1. జైవిక పరమైన తండ్రి అనే స్థానంలో సామాజిక తండ్రి అనే భావన వస్తుంది.

    2. సమాజంలో మరియు కుటుంబంలో పురుషుడికి అధమస్థానం

    3. కుటుంబంలో జననరేటు తీవ్రంగా తగ్గుతుంది.

    4. కుటుంబం అశాంతికి నిలయంగా మారుతుంది.


    బహుభార్యా భర్తత్వం (పాలి గైనీయాండ్రి)


    కొన్ని తెగల యందు సొంతగా కుటుంబాన్ని కల్గి ఉంటూనే మరో పక్క ఉమ్మడి భార్యలు మరియు ఉమ్మడి భర్తలుగా ఈ వివాహాన్ని పాటిస్తారు. ఉదా: హిమాలయ ఖాసాలు, నీలగిరి తోడాల యందు చాలా అరుదుగా కనిపిస్తుంది.


    వివాహ నియమావళి


    ఏ వివాహమైన సమాజ అంగీకారాన్ని లేదా చట్టబద్ధమైనటువంటి అంగీకారాన్ని పొంది ఉండాలి. ప్రతి సమాజం తన సభ్యులకు వివాహం పట్ల ఆచరించ వలసిన నియమాలను తెలుపుతుంది. అవి ఆచరించనట్లయితే దానిని వివాహంగా సమాజం అంగీకరించదు.



    వివాహ నియమాలు ప్రధానంగా ఈ క్రింది 3 రూపాలలో కనబడుతాయి.


    1. నిషిద్ధ నియమాలు/అగమ్యాగమన నిషేదం (ప్రొహిబిటివ్ రూల్స్)

    2. సాంప్రదాయ విహిత నియమాలు (ప్రెస్క్రిప్టివ్ రూల్స్)

    3. అధిగణనా నియమాలు (ప్రిఫరెన్షియల్ రూల్స్)


    1. నిషిద్ధ నియమాలు/అగమ్యాగమన నిషేదం (ప్రొహిబిటివ్ రూల్స్)


    రక్త బంధువులుగా గుర్తించబడిన వ్యక్తుల మధ్య, లైంగిక సంబంధాలు నిషిద్ధం, అందువల్ల వివాహం కూడా నిషిద్ధం. ఈ నియమాన్నే నిషిద్ధ నియమం అని అంటారు. కావున ఈ మొదటి వివాహ నియమం ఎవరెవరిని వివాహం చేసుకోకూడదో తెలుపుతుంది. ఉదా: సోదరి, సోదరుల మధ్యలో వివాహం నిషేధం.


    బాల్యం నుండి సోదర సోదరీమనుల మధ్య సోదర వాత్సల్యం వల్ల లైంగికంగా ఆకర్షింపబడరని వెస్టర్ మార్క్ తన యొక్క బాల్య స్నేహ సిద్ధాంతం/శైశవ విధిత సిద్ధాంతం ద్వారా తెలిపాడు.



    నోట్: పై సాంప్రదాయ నియమాలతో పాటు ప్రస్తుతం వివాహం, విడాకులు మరియు వైవాహిక వివాదాలకు సంబంధించిన అంశాలపై చట్టపరమైన నియమాలు కూడా కలవు, ఆయా నియమాలు వివాహ చట్టాలు అనే అంశము నందు వివరించబడింది.


    • సమాజం మీద భయం వల్ల కుటుంబ సభ్యుల మధ్య లైంగిక ఆకర్షణలు అణచబడతాయని సిగ్మండ్ ఫ్రాయిడ్ తన మానసిక విశ్లేషణ సిద్ధాంతంలో తెలిపాడు.
    • కుటుంబ సభ్యుల మధ్య లైంగిక సంబంధాల వల్ల కుటుంబం విచ్ఛిన్నం అవుతుందని, అందువల్లనే ఈ నియమం పాటిస్తారని మలినోప్స్కి తన కుటుంబ చీలిక సిద్ధాంతంలో తెలిపాడు.
    • దగ్గరి బంధువుల మధ్య సంతానం జన్యుపరంగా బలహీనంగా ఉంటుందని, కావున అగమ్యాగమన నిషేధాన్ని పాటిస్తారని అబెరల్ తన స్వరాశిష్ట ప్రజననా సిద్ధాంతంలో తెలిపాడు.
    • కుటుంబ సభ్యుల మధ్య లైంగిక పోటీ సహకారానికి ఆటంకంగా ఉంటుందని అగమ్యాగమన నిషేధాన్ని పాటిస్తారని టేలర్ తన సహకార సిద్ధాంతంలో తెలిపాడు.
    • ఈ నిషేధం ఫలితంగా ఒక కుటుంబం వివాహం నిమిత్తం మరో కుటుంబంపై ఆధారపడటం వల్ల బంధుత్వాలు విస్తరిస్తాయి.


    2. సాంప్రదాయ విహిత నియమాలు (ప్రెస్ క్రిప్టివ్ రూల్స్)


    • దీనినే రెండవ వివాహ నియమం అంటారు. ఈ నియమం ఎవరిని వివాహం చేసుకోవచ్చో మరియు ఎవరిని చేసుకోకూడదో కూడా తెలిపే నియమం.
    • ఈ నియమాలనందు 2 ఉపనియమాలు కలవు. అవి.. ఎ. అంతర్వివాహం బి. బహిర్వివాహం.

    ఎ. అంతర్వివాహం (ఎండోగమి) : జీవిత భాగస్వామిని అన్య సమూహాల నుండి కాకుండా స్వంత సమూహం నుండే స్వీకరించాలని తెలిపే నియమంనే అంతర్వివాహ నియమం అంటారు.


    ఇది ప్రధానంగా ఈ క్రింది రూపాలలో కన్పిస్తుంది.


    1. కుల అంతర్వివాహం (క్యాస్ట్ ఎండోగమి): తన కులం వాళ్ళనే వివాహం చేసుకోవాలి.

    ఉదా: హిందూ సమాజం


    2. ఉపకుల అంతర్వివాహం (సబ్ క్యాస్ట్ ఎండోగమి): తన ఉపకులం వాళ్ళనే వివాహం చేసుకోవాలి.

    ఉదా: యాదవ ఉపకులాలు


    3. తెగ అంతర్వివాహం (ట్రైబ్ ఎండోగమి): తమ తెగవాళ్ళనే వివాహం చేసుకోవాలి.


    4. గ్రామ అంతర్వివాహం (విలేజ్ ఎండోగమి): తమ గ్రామానికి చెందిన వారినే వివాహం చేసుకోవాలి.


    5. మత అంతర్వివాహం (రిలిజియస్ ఎండోగమి): తమ మతానికి చెందిన వారినే వివాహం చేసుకోవాలి.


    అంతర్వివాహాన్ని పాటించుటకు గల కారణాలు

    • వివిధ సమూహాల మధ్య సాంస్కృతిక వైరుధ్యాలుండటం
    • మతపరమైన మరియు కులపరమైన విభజనలుండటం
    • భాషాపరమైన వైవిధ్యాలు మరియు కొత్తవారి పట్ల సహజం ఉండే అపోహలు


    అంతర్వివాహం వలన కలిగే ఉపయోగాలు


    1. సమూహ ఐక్యత పెరుగుతుంది.

    2. కులజాతి స్వచ్ఛ కాపాడబడుతుంది.

    3. కులాలకు సంబంధించిన వృత్తి రహస్యాలు కాపాడబడుతాయి.


    అంతర్వివాహం వల్ల కల్గు నష్టాలు


    1. సమాజం విడిపోతుంది మరియు కులవ్యవస్థ దృఢమవుతుంది.

    2. జీవిత భాగస్వామిని ఎంచుకునే అవకాశాలు తన సమూహం వరకే పరిమితం అవుతాయి.

    3. వరకట్నం, కన్యాశుల్కం లాంటి సమస్యలకు కారణం అవుతుంది.

    4. జన్యుపరంగా మేలైనది కాదు


    బహిర్వివాహం (ఎక్సోగమి)


    • దీనినే సంపద పద్ధతి వివాహం అని కూడా అంటారు.
    • వ్యక్తి తన బంధువర్గ సమూహం నుండి కాకుండా తన సామాజిక వర్గానికే చెందిన, ఇతర బంధువర్గ సమూహం నుండి వివాహం చేసుకోవడం.


    ఇది ప్రధానంగా ఈ క్రింది రూపాలలో కన్పిస్తుంది.


    1. గోత్ర బహిర్వివాహం. ఉదా: హిందూ సమాజం

    2. ప్రవర బహిర్వివాహం. ఉదా: బ్రాహ్మణులు

    3. గ్రామ బహిర్వివాహం. ఉదా: నాగాలు, గారోలు, ముండాలు

    4. పిండ బహిర్వివాహం. ఉదా: హిందూ సమాజం


    బహిర్వివాహాన్ని పాటించుటకు గల ప్రధాన కారణం: ఒకే గోత్రికులు మరియు ఒకే వంశీకుల మధ్య వివాహాలు ఉండకూడదు కాబట్టి పాటిస్తారు.


    3. అధిగణన నియమాలు


    • దీనినే వివాహానికి సంబంధించిన మూడవ నియమం అనికూడా అంటారు.
    • ఒక వ్యక్తికి ఎవరిని వివాహం చేసుకోవడానికి ప్రత్యేకమైన హక్కులుంటాయో తెలిపే నియమమే అధిగణన నియమం.
    • ఇది ప్రధానంగా 3 నియమాలను తెలిపినది.

                         1. పిత్రియ సంతతి వివాహ నియమం.

                         2. దేవర వివాహ నియమం

                         3. భార్య భగినీ వివాహ నియమం


    1. పిత్రీయ సంతతి వివాహం (కజిన్ మ్యారేజెస్)

    • ఒక తరం వారి సంతానం మధ్య జరిగే వివాహాల్ని పిత్రీయ సంతతి వివాహాలు అంటారు.
    • ఇవి ప్రధానంగా 2 రూపాల్లో ఉంటాయి.

    1. సమాంతర పిత్రీయ వివాహాలు (లినియర్ కజిన్ మ్యారేజెస్): అన్నదమ్ముల సంతానం/అక్కా చెల్లెల్ల సంతానం మధ్య జరిగే వివాహాలు. ఉదా: అరబ్బులు

    2. మేనరిక వివాహాలు (క్రాస్ కజిన్ మ్యారేజెస్): సోదర మరియు సోదరీమణుల సంతానం మధ్య జరిగే వివాహాలు 


  • మేనరిక వివాహాలు ప్రధానంగా 2 రూపాల్లో ఉంటాయి.
  • 1. సౌష్టవమేనరికం/ద్విపార్శ్వ మేనరికం (సిమెట్రిక్ కజిన్ మ్యారేజెస్)

    2. అసౌష్టవ మేనరికం/ఏక పార్శ్య మేనరికం (అసిమెట్రిక్ కజిన్ మ్యారేజెస్)


  • ఏక పార్శ్య మేనరికం 2 రూపాల్లో ఉంటుంది
  • 1. మాతృ పార్శ్య మేనరికం 

    2. పితృ పార్శ్వ మేనరికం


    2. దేవర న్యాయం (లావిరేట్)


    • ఒక వ్యక్తికి తన సోదరుడి మరణాంతరం, అతడి భార్యను స్వీకరించవచ్చు అనే నియమమే దేవర న్యాయం. ఉదా: భగతలు, సవరలు, గదబలు.
    • దేవర అనగా భర్త సోదరుడు అని అర్థం.
    • తమ్ముడు తన అన్న చనిపోయినప్పుడు అతని భార్యని చేపట్టడమును కనిష్ట దేవర న్యాయం (జూనియర్ లావిరేట్) అందురు.
    • అన్న తన తమ్ముడు చనిపోయినప్పుడు అతని భార్యని చేపట్టడమును జ్యేష్ట దేవర న్యాయం (సీనియర్ లావిరేట్) అందురు.


    3. భార్య భగినీ న్యాయం (సరోరేట్)


    • భార్య చనిపోయిన సందర్భాలలో ఆమె అవివాహిత సోదరిని వివాహం చేసుకునే హక్కునే భార్యభగినీ న్యాయం అందురు.


    హిందూ వివాహ వ్యవస్థ


    ఋగ్వేదం ప్రకారం హిందూ వివాహం సామాజిక, మతపరమైన సంస్కారం, తైత్తరీయ బ్రాహ్మణం ప్రకారం పురుషుడు సగమే, మిగతాది అతని భార్యనే. 4 వర్ణాశ్రమ ధర్మాలలోని గృహస్థాశ్రమం వివాహంతోనే ప్రారంభం అవుతుంది మరియు గృహస్థు చేయవలసిన ఈ క్రింది 5 యజ్ఞాలు వివాహం తర్వాతనే ఆచరించాలి. అవి....

    1. దైవయజ్ఞం 

    2. ఋషి యజ్ఞం

    3. భూత యజ్ఞ

    4. పితృయజ్ఞం 

    5. నర యజ్ఞం అనునవి వివాహం తరువాతనే ఆచరించాలి.


    • స్త్రీ తల్లిగా మారేందుకు, పురుషుడు తండ్రిగా మారేందుకు సృష్టింపబడ్డారని ఋగ్వేదం చెపుతుంది.
    • హిందువుల యందు వివాహం అనునది

         1. కుటుంబం పట్ల, సమాజం పట్ల వ్యక్తి నిర్వర్తించే విధి

         2. జాతి సంరక్షణ కోసం ఏర్పడింది.

         3. దంపతుల & కుటుంబ అవసరాల నిమిత్తం ఏర్పడింది.


    హిందూ వివాహ రూపాలు


    మనువు ప్రకారం 8 రకాల సాంప్రదాయ హిందూ వివాహ రూపాలు కలవు. అవి..


    4 ప్రశస్త వివాహా రూపాలు (సమాజం అంగీకరించినవి):

    1. బ్రహ్మ వివాహం

    2. దైవ వివాహం

    3. అర్య వివాహం

    4. ప్రజాపత్య వివాహం


    4 అప్రశస్త వివాహా రూపాలు (సమాజం అంగీకరించనవి):

    5. గాంధర్వ వివాహం

    6. అసుర వివాహం

    7. రాక్షస వివాహం

    8. పైశాచ వివాహం


    బ్రహ్మ వివాహం


    1. ఈ వివాహం పాటిస్తే 12 తరాలు పవిత్రం అవుతాయి.

    2. గుణము, విజ్ఞానం ఉన్న వరుడికి కన్యాదానాన్ని చేస్తే అది బ్రహ్మ వివాహం అవుతుంది.

    3. హిందూ వివాహ రూపాలలో అత్యున్నతమైనటువంటి వివాహ విధానం


    దైవ వివాహం


    1. ఈ వివాహం పాటిస్తే 10 తరాలు పవిత్రం అవుతాయి.

    2. వధువు తండ్రి వధువును అధిక దైవ చింతన గల యువకుడికి దక్షిణగా సమర్పించడాన్నే దైవ వివాహం అంటారు.


    అర్ష వివాహం


    1. ఈ వివాహం పాటిస్తే 8 తరాలు పవిత్రం అవుతాయి.

    2. వరుడి నుండి గోవును/గోవులను స్వీకరించి బదులుగా అతడికి తన కుమార్తెను దానం చేయడమునే అర్హ వివాహం అంటారు.

    3. ఈ వివాహం కృతజ్ఞతా రూపంతో కూడినది

    4. కన్యాశుల్కంతో పోల్చలేము.


    ప్రజాపత్య వివాహం


    1. ఈ వివాహం పాటిస్తే 7 తరాలు పవిత్రం అవుతాయి.

    2. దీనినే ఆదర్శ వివాహం అని కూడా అంటారు.

    3. వధు, వరూలిద్దరికి ధర్మం పాటించమని బోధించి వివాహం చేస్తారు.


    అసుర వివాహం


    1. ఇది కన్యాశుల్కాన్ని పోలినటువంటిది.

    2. ధనాశతో వధువును అమ్మడం గమనించవచ్చు.


    గాంధర్వ వివాహం


    1. ప్రేమ వివాహం లాంటిది.

    2. వధూవరులకు అపరిమితమైన స్వేచ్ఛ ఉంటుంది.

    3. ఈ వివాహంలో బంధువుల ప్రమేయం ఉండదు.

    4. ఈ వివాహంలో కన్యాదానం, దక్షిణ, కృతజ్ఞత లాంటి అంశాలకు తావులేదు.


    రాక్షస వివాహం


    1. కన్యను బలవంతంగా ఎత్తుకొని వెళ్ళి, వివాహం చేసుకోవడం

    2. యుద్ధం, గొడవలతో కూడుకొని ఉంటుంది.

    3. తల్లిదండ్రులు, బంధువుల ప్రమేయం లేదు.


    పైశాచిక వివాహం


    1. అత్యంత హేయమైన వివాహం

    2. వధువు నిద్రలో ఉన్నప్పుడు, మత్తుకు గురిచేసి మతిస్థిమతం లేనప్పుడు వధువును బలాత్కారం చేసి ఆపై వివాహం చేసుకోవడం.

    3. ఈ వివాహంలో వధువు, వధువు తల్లిదండ్రుల ప్రమేయం ఏ మాత్రం ఉండదు.


    పై వివాహ రూపాలతో పాటు అనులోమ & ప్రతిలోమ వివాహ విధానాలు కలవు.


    అనులోమ వివాహం (హైపర్ గమి)


    • పురుషుడు తనకంటే తక్కువ వర్ణం స్త్రీని వివాహం చేసుకోవడంనే అనులోమ వివాహం అంటారు.
    • ఇది బ్రాహ్మణ, క్షత్రియ & వైశ్యులకే పరిమితం
    • ఈ వివాహం వల్ల జన్మించిన సంతానంను శూద్రులుగా పరిగణించేవారు.
    • శూద్ర స్త్రీకి మరియు మిగతా వర్ణాల వారికి జన్మించిన సంతానాన్ని దాసీ పుత్రులనేవారు.


    అనులోమ వివాహం వలన ఈ క్రింది సామాజిక పరిణామాలు ఏర్పడినవి. అవి...

    1. తక్కువ వర్ణం వారిని ధర్మాచరణ కోసం కాకుండా వ్యక్తిగత అవసరాల కోసం వివాహం చేసుకోవడంతో బహుభార్యత్వ ప్రారంభం అయ్యింది.

    2. కులతత్వం, వర్ణతత్వం & అసమానత్వం లాంటి అంశాలకు పునాదులు పడినవి.


    విలోమ లేదా ప్రతిలోమ వివాహం (హైపోగమి)


    • తక్కువ వర్ణంనకు చెందిన పురుషుడు తనకంటే ఉన్నత వర్ణంగా భావింపబడుతున్న స్త్రీకి మధ్య జరిగే వివాహం.
    • ప్రతిలోమ వివాహాన్ని హిందూ సామాజిక వ్యవస్థ తీవ్రంగా వ్యతిరేకించింది.
    • మనువు అభిప్రాయం ప్రకారం, ప్రతిలోమ వివాహ సంతానమే అస్పృశ్యులుగా పిలువబడినారు.
    • ఇలా అంటరానితనానికి ఈ వివాహం పునాదులను వేసింది.


    నోట్: సమస్థాయి కలిగి ఉన్న వ్యక్తుల మధ్యజరిగే వివాహాన్ని ఐసోగమి అంటారు. ఉదా: డాక్టర్కి డాక్టర్కి మధ్య జరిగే వివాహం. అసమస్థాయి వ్యక్తుల మధ్య జరిగే వివాహాన్ని అనిసోగమి అంటారు. ఉదా: ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి మరియు నిరక్షరాస్యురాలికి మధ్య జరిగే వివాహం.


    హిందూ వివాహం యొక్క ప్రత్యేకతలు


    1. హిందువులలో వివాహం ఇస్లాంలో వలె సామాజిక ఒప్పందం కాదు. ఇది హిందువులలో మతపరమైన సంస్కారం మరియు సామాజిక విధి.

    2. Marriage & Family in India అనే గ్రంథంలో కపాడియా గారు 3 హిందూ వివాహ లక్ష్యాలని క్రింది విధంగా తెలిపారు.

    1. ధర్మ 2. ప్రజా (సంతానం) 3.కామ/రతి

    ♦ పై మూడింటికి అదనంగా ఋణ విముక్తిని కూడా లక్ష్యంగానే పేర్కొంటారు.

    ♦  హిందూ వివాహ ధర్మాలన్నింటిలో కెల్లా ధర్మం అత్యుత్తమమైన లక్షణం.


    హిందూ వివాహ ఆదర్శాలు


    1. వివాహం అనేది పవిత్ర బంధం

    2. వివాహమునకు పాతివ్రత్యం స్త్రీ, పురుషులిద్దరికి అత్యావశ్యకం

    3. ఏక పత్నీవ్రతం పాటించాలి.

    4. పునర్వివాహానికి అవకాశం లేదు

    5. వివాహం జన్మ జన్మల సంబంధం (విడాకులు తీసుకోకూడదు)

    6. వివాహం సామాజిక, మతపరమైన & వ్యక్తిగత సంస్కారం


    హిందూ వివాహ వ్యవస్థలోని ముఖ్య క్రతువులు


    1. వందనం


    • వివాహం చేస్తున్నామని మౌఖికంగా చేసే ప్రతిజ్ఞ. దీనినే పాణిగ్రహ సంకల్ప అని కూడా అందురు.
    • వధూవరుల యొక్క గోత్రాలు & వంశాలు, బంధువులందరి ముందు బిగ్గరగా చదువుతారు.


    2. భాసింగ ధారణ


    • వివాహ సుముహుర్తానికి వధు, వరుల యొక్క నుదుటి స్థానంలో దరింపజేస్తారు.


    3. వివాహ హెూమం


    • అగ్ని నమస్కార క్రతువు
    • దంపతులకు సంపదను & సంతానాన్ని ప్రసాదించమని అగ్నిదేవునికి నమస్కరిస్తారు.
    • ఇందులో 'పాశవిముక్తి' కోసం చేసే లాజా హెూమం ముఖ్యమైనది.


    4. కన్యాదానం


    వధువు తల్లిదండ్రులు/వధువు దగ్గరి బంధువులు నీటిని వరుడి చేతిలో పోస్తూ/వరుడి కాళ్ళు కడుగుతూ వధువుని దానం చేస్తారు.


    5. పాణి గ్రహణం


    వధువు కుడిచేతిని వరుడు పట్టుకొని, ఆమె చేతిని ఏ పరిస్థితులలోనూ వదలనని అన్ని బాధ్యతలు తీసుకుంటానని చేసే ప్రమాణం


    6. మాంగళ్య ధారణ


    వధువు మెడకి వరుడు కట్టే పసుపు తాడునే మాంగళ్య ధారణ అంటారు. మంగళ అనగా పవిత్రమైన మరియు సూత్ర అనగా తాడు అని అర్థం. కావున మంగళసూత్రాన్ని పవిత్రమైన తాడుగా భావిస్తారు. దీనిని వరుడు వధువు యొక్క మెడలో ధరింపజేయడాన్నే మాంగళ్య ధారణ అంటారు. వరుడు మూడు ముళ్ళతో కూడిన మాంగళ్యధారణ వధువు మెడకు చేస్తాడు.


    ఇందులో మొదటి ముడి మనసా, రెండవ ముడి వాచా, మూడవ ముడి కర్మణా ప్రమాణం చేసినట్టుగా భావిస్తారు. మంగళసూత్రం నందుండే రెండు సూత్రాలలో ఒకటి పార్వతిదేవికి, రెండవది శివుడికి ప్రతిరూపం మరియు ఒకటి పుట్టింటికి మరియు రెండవది మెట్టినింటికి ప్రతిరూపం.


    7. మట్టెల ధారణ


    వధువు యొక్క కాలియొక్క వ్రేలుకు ఉంగరాన్ని ధరింపజేసే తంతునే మట్టెలధారణ అంటారు.

    ఇవ్వమని భర్త, భార్యను అడిగేందుకు సింబాలిక్ గా ఈ తంతును జరుపుతారు.


    8. అగ్ని పరిణయం


    అగ్ని హెూత్రం చుట్టూ వధువు & వరుడు సంయుక్తంగా చేసే ప్రదిక్షణలు


    9. సప్తపది


    వధూవరులిద్దరు ఈశాన్యం వైపుగా కలిసి 7 అడుగులు వేస్తారు.



    10. అరుంధతి దర్శనం

    ఇది చివరి వివాహ క్రతువు.


    జీవిత భాగస్వామి ఎంపిక


    భారతదేశంలో ఉన్నటువంటి గిరిజన తెగలలో వివిధ పద్ధతులలో జీవిత భాగస్వామి ఎంపిక కనిపిస్తుంది. గిరిజనులలో జీవిత భాగస్వామిని సంఘి అని పిలుస్తారు. గిరిజనేతరులలో సంప్రదింపుల ద్వారా జీవిత భాగస్వామి ఎంపిక అనే విధానం ప్రధానంగా కనపడుతుంది. ఈ క్రింది జీవిత భాగస్వామి ఎంపిక విధానాలు భారతీయ సమాజం నందు గిరిజనులలో ప్రధానంగా గోచరిస్తాయి.


    1. సంప్రదింపుల ద్వారా వివాహం: వధువరుల తల్లిదండ్రులు పరస్పరం సంప్రదించుకొని వివాహం చేయడం.

    ఉదా: భారతదేశంలో అధిక శాతం వివాహాలు ఈ పద్ధతిలోనే జరుగుతున్నాయి.


    2. సేవ ద్వారా: గిరిజనులలో వరుడు వధువు కుటుంబానికి కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. దానినే ఓలి అని అంటారు. ఓలి చెల్లించలేని సందర్భంలో వరుడు, వదువు కుటుంబానికి తన సేవను అందిస్తాడు.

    ఉదా 1: బైగాలు, పుళియన్లు, మన్నాలు, లెప్చాలు వివాహం తర్వాత సేవచేయాలి.

    ఉదా2: భగత & సవరలలో వివాహానికి ముందే సేవ చేయాలి


    3. వినిమయం ద్వారా రెండు కుటుంబాల మధ్య పరస్పర వధువరూల మార్పిడినే వినిమయం ద్వారా వివాహం అందురు. దీనినే కుండమార్పిడి వివాహం అనికూడా అందురు.

    ఉదా: ఉల్లాటనులు, నిషావనులు, భాటియాల


    4. పరీక్ష ద్వారా: వివాహానికి ముందు వరుడు వదువు కుటుంబం ఇంటి దగ్గర కొద్దికాలం పాటు పనిచేయాల్సి ఉంటుంది. ఆ సమయంలో వరుడి యొక్క గుణ, గణాలను వివిధ సందర్భాలలో పరీక్షిస్తారు.

    ఉదా: మణిపూర్ కుకీలు. ఇది డేటింగ్ని పోలినటువంటిది.


    5. అపహరణ ద్వారా: యుద్ధం ద్వారా లేదా కిడ్నాప్ చేయడం ద్వారా జీవితి భాగస్వామిని సంపాదించుకోవడం. కృష్ణుడు మరియు రుక్మిణిల యొక్క వివాహం.

    ఉదా: నాగ, గోండు, హెూ తెగల యందు కర పరిగ్రహణం జరుగుతుంది. అనగా పరిగ్రహించడానికి వరుడు వెల్లినప్పుడు వధువు సహకరిస్తుంది.

    ఉదా: ఖరియా, బిరర్ తెగలయందు ఆచార పరిగ్రహణం జరుగుతుంది. అనగా కొన్ని ప్రత్యేక దినాలలో మరియు కొన్ని ప్రత్యేక సంతల ప్రాంతాలలో వరుడు వివాహం కానటువంటి స్త్రీ యొక్క నుదిటిపై బొట్టు పెట్టినట్టయితే వివాహం అయినట్టుగా పరిగణిస్తారు.


    6. ఆనాహుతం: ఈ విధానంలో వదువు తనకు నచ్చిన వరుడి ఇంటిముందు కూర్చొని తనను పెళ్లిచేసుకోమని బతిమాలుతుంది. వారు చీదరించుకున్నప్పటికి పెళ్లి చేసుకునేంత వరకు పట్టుదలగా ఉంటుంది.

    ఉదా: హెూలు, కమార్లు, గదబలు & సవరలు


    7. ప్రయోగం: ఇది స్వయంవరాన్ని పోలినటువంటిది.

    ఉదా: రాజస్థాన్లోని భిల్లుల యందు కృష్ణాష్టమి రోజున ఆ గ్రామంలో ఉట్టికొట్టిన అవివాహిత పురుషుడికి ఆ గ్రామంలోని ఏ అవివాహిత స్త్రీనైన వివాహం చేసుకునే హక్కు లభిస్తుంది.


    8. పలాయణం: ఈ విధానంలో వదువరులిద్దరు తమ తల్లిదండ్రులకు తెలియకుండా వేరే ప్రాంతానికి వెళ్ళి వివాహం చేసుకోవడం జరుగుతుంది. ఉదా: భోయా, కొండదొర, జాతవులు, మరియా గోండులు


    వివాహ చెల్లింపులు


    వివాహ సందర్భంలో వధు, వరూల కుటుంబాల మధ్య పరస్పరం మార్పిడి చేసుకునే వస్తువులు మరియు ఇతర సంపదలనే వివాహ చెల్లింపులు అంటారు.


    ఇవి ప్రధానంగా ఈ క్రింది రూపాలలో కనిపిస్తాయి.


    1. వధు ధనం: వివాహ సందర్భంగా వధువు కోసం మాత్రమే బంధువులు, వధువు కుటుంబ సభ్యులు మరియు కాబోయే భర్త అందించిన వివిధ కానుకలు లేదా ఇతర సంపదనే వధుధనం అంటారు. దీనిపై ఆమెకే పూర్తి హక్కులుంటాయి.


    2. వరకట్నం: వివాహం సందర్భంగా వధువు యొక్క కుటుంబం వరుడికిచ్చే సంపద మరియు ఇతర కానుకలనే వరకట్నం అంటారు. వరకట్నం తీసుకోవడమనేది దురాచారంగా మారడం వల్ల 1961లోనే వరకట్న నిషేధ చట్టం ద్వారా నిషేధించారు. కావున ప్రస్తుతం వరకట్నం ఆచరించడం నేరం.


    3. వధు సేవ: ఇది ప్రధానంగా గిరిజనులలో కనపడుతుంది. గిరిజన సంప్రదాయంలో భాగంగా కాబోయే వరుడు వధువు యొక్క కుటుంబానికి సేవను అందించవలసి ఉంటుంది.


    4. పరస్పర కానుకలు: వివాహ సందర్భంగా వధువు మరియు వరుని యొక్క కుటుంబాలు పరస్పరం ఇచ్చిపుచ్చుకునే కానుకలు.


    5. ఓలి: గిరిజనులలో వివాహం సందర్భంగా వరుడు వధువు కుటుంబానికి పశువుల రూపంలో గాని లేదా మరే ఇతర రూపంలో గాని చెల్లించే మొత్తాన్నే ఓలి అంటారు. దీనిని వధువు కుటుంబం ఒక కుటుంబ సభ్యురాలి సేవలని కోల్పోతున్నందుకు గాను పొందే పరిహారంగా భావిస్తారు.


    6. కన్యాశుల్కం: ఒకప్పుడు తీవ్రంగా ఉండేది. వరుడు వివాహం కోసం బాలికను కొనుక్కునేందుకు బాలిక తల్లిదండ్రులకు చెల్లించే మొత్తాన్ని కన్యాశుల్కం అంటారు. వరకట్న నిషేధ చట్టం ప్రకారం దీనిని కూడా నిషేధించడం జరిగింది. దీనిపై గురజాడ అప్పారావు గారు కన్యాశుల్కం అనే నాటకం మరియు పుత్తడి బొమ్మ పూర్ణమ్మ అనే నాటకాలు రాయడం జరిగింది.


    7. మెహర్: ఇస్లాం సాంప్రదాయంలో వివాహ ప్రతిపాదన సందర్భంగా కాబోయే భార్యకు వరుడు డబ్బుల రూపంలో లేదా ఆస్తి రూపంలో ఆర్థిక భద్రతను కల్పించడాన్నే మెహర్ సాంప్రదాయం అంటారు.


    హిందూ వివాహ వ్యవస్థలో వస్తున్న మార్పులు మరియు కారణాలు


    • ప్రస్తుతం ఏకవివాహమును మాత్రమే చట్టబద్ధంగా మరియు సామాజికంగా అంగీకరిస్తున్నారు (ఇస్లాం సాంప్రదాయ చట్టంలో నలుగురు భార్యలను కలిగి ఉండేందుకు కూడా అనుమతి కలదు) మరియు బహుభార్యత్వంను గాని బహుభర్తత్వంను గాని ఆచరించడం హిందూవివాహం చట్టం ప్రకారం నేరంగా పరిగణింపబడుతుంది.
    • వివాహ లక్ష్యం ధర్మాచరణ కోసమే అనే ధోరణి తగ్గి వైయుక్తిక అవసరాల కోసమే వివాహం అనే ధోరణి పెరుగుతుంది.
    • కులాంతర వివాహాలు, ఉపకులాల మధ్య వివాహాలు మరియు వధు, వరూలు వ్యక్తిగత ఇష్టాలకు అధిక ప్రాధాన్యతలు ఇవ్వబడుతున్నది.
    • విడాకులకు అవకాశం లేని హిందూవివాహ వ్యవస్థలో ప్రస్తుతం సహేతుక కారణాల రీత్యా విడాకులు తీసుకోవడం హక్కుగా మారినది అనగా వివాహ వ్యవస్థ అనేది కొన్ని సందర్భాలలో లేదా కొందరి విషయాలలో జీవిత కాల బంధం కాకపోవచ్చు.
    • వివాహ వయస్సు మారినది మరియు బాల్యవివాహాలు తగ్గినవి కాని వరకట్నం రోజురోజుకు బలపడుతున్నది.
    • వివాహ సంబంధ వివాదాలలో బంధువులు మరియు కులం యొక్క జోక్యం తగ్గుతూ గృహ హింస నిరోధక కౌన్సిలింగ్సెం టర్లు మరియు ఇతర రూపాలలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది.


    నోట్: వివాహ చట్టాలు ఈ ఛాప్టర్ చివరలో వివరించబడినవి.


    ఇస్లాం వివాహ వ్యవస్థ


    • ఇస్లాం నందు వివాహాన్ని నిఖా అంటారు. నిఖా అనునది అరబిక్ పదం. ఇస్లాం నందు వివాహం సామాజిక ఒప్పందం & లౌకిక బంధం. ప్రతి పౌరుడు తప్పకుండా వివాహం చేసుకోవాలి. సంతానాన్ని పొందాలి.
    • వివాహం యొక్క ముఖ్య లక్ష్యం: క్రమబద్ధమైన జీవనం, లైంగిక నియంత్రణ, కుటుంబ స్థాపన, సంతాన ఉత్పత్తి.
    • జీవిత భాగస్వామి ఎంపిక నందు సమాంతర పిత్రీయ సంతతి వివాహాలకు మొదటి ప్రాధాన్యత.
    • పురుషుడు 4 గురు భార్యల్ని కలిగి ఉండేందుకు అవకాశాన్ని ఇచ్చినా ఏక వివాహాన్నే పాటించాలని తెలిపింది.
    • భార్య సోదరిని వివాహం చేసుకోవడం నిషిద్ధం (భార్య చనిపోయిన సందర్భాలలో మాత్రం చేసుకోవచ్చు).
    • షరియత్ చట్టాలను అనుసరించి జరిగిన వివాహాలను మాత్రమే న్యాయమైన వివాహాలు/సహినిఖా అందురు.


    ఇస్లాం వివాహ రూపాలు


    ఇస్లాం వివాహ రూపాలు ప్రధానంగా 3 రకాలుగా కన్పిస్తాయి. అవి...

    1. చట్టబద్ద వివాహాలు 

    2. అపసవ్య వివాహాలు 

    3. చెల్లని వివాహాలు


    1. చట్టబద్ధ వివాహాలు


    • క్రింది పద్ధతుల ప్రకారం జరిగిన వివాహాలని చట్టబద్ధ వివాహాలు అంటారు.

          ఎ. వివాహ అంగీకారం & ప్రతిపాదన జరగాలి

    • ఇద్దరు సాక్షులు & మౌళ్వి /ఖాజీ సమక్షంలో పెళ్ళికుమారుడు వివాహ ప్రతిపాదన చేస్తాడు. దీనినే 'ఇజాబ్' అంటారు.
    • దీనికి ప్రతిగా వధువు ఒకే సారి వరుసగా 3 సార్లు అంగీకారం తెలపాలి. దీనినే కుబూల్ హే అందురు.
    • వివాహ ప్రతిపాదన & అంగీకారం ఏకకాలంలోనే జరగాలి.

          బి. మానసిక ఆరోగ్యం ఉన్న వ్యక్తుల మధ్య జరిగే వివాహం

     సి. పలాయనం ద్వారా చేసుకునే పెళ్ళి - 'ఖిఫా' గుర్తింపబడదు

          డి. విగ్రహారాధన చేసుకునే వారిని వివాహం చేసుకోరాదు.


    2. అపసవ్య వివాహాలు


    వీటినే ఫాసిద్ వివాహాలు అందురు.

    ఈ క్రింది సందర్భాలలో వివాహాన్ని ఫాసిద్ వివాహాలందురు.

    1. సాక్షులు లేకుండా జరిగే వివాహం

    2. 5వ స్త్రీని చేసుకోవడం

    3. ఇద్దత్ (ఇతద్) కాలాన్ని పాటిస్తున్న స్త్రీని వివాహం చేసుకోవడం

    4. మతాంతర వివాహాలు చేసుకోవడం

    5. అనుకోకుండా & తెలియకుండా వివాహంలో చిన్నచిన్న పొరపాట్లు దొర్లడం


    3. చెల్లని వివాహాలు


    • వీటినే బాతిల్ వివాహాలందురు
    • ఇస్లాం సాంప్రదాయం ప్రకారం ఈ క్రింది సందర్భాలలో వివాహాన్ని చెల్లదని పేర్కొంటారు.


    1. ముస్లిం మహిళ విగ్రహారాధికులను పెళ్ళిచేసుకోవడం

    2. పెంపుడు సంబంధం ఉన్న వారి మధ్య జరిగే వివాహాలు

    3. మానసిక ఆనారోగ్యం ఉన్నప్పుడు జరిగే వివాహాలు

    4. రక్త సంబంధీకుల మధ్య జరిగే వివాహాలు

    ఉదా: సోదరీ, మేనకోడలు, సోదరుని కూతురు

    5. వైవాహిక బంధుత్వ రీత్యా వివాహ నిషేధం ఉన్నవారి మధ్య జరిగిన వివాహం

    ఉదా: అత్త, తల్లి, కుమారుడి భార్య


    • బాతిల్ వివాహం ద్వారా జనించిన సంతానం చట్టబద్ధ సంతానంగా గుర్తించబడరు.


    పురాతన అరబ్ వివాహాలు


    ఇది ప్రధానంగా 3 రూపాలలో కన్పిస్తాయి.

    1. ముఠా వివాహం

    2. బీనా వివాహం

    3. బాల్ వివాహం


    1. ముఠా వివాహం

    • ముఠా అనునది అరబిక్ పదం. దీని అర్థం : ఆనందపడు (సుఖించు).
    • ఇది తాత్కాలిక వివాహ రూపం.
    • ఈ వివాహంలో బంధువుల జోక్యం ఉండదు.
    • ఒక ముస్లిం పురుషుడు ముస్లిం, క్రిస్టియన్ & జ్యుయిస్త్రీని ఈ విధానంలో వివాహం.
    •  చేసుకోవచ్చు. కానీ ముస్లిం మహిళ అన్య మతస్థులని చేసుకోరాదు.
    • ఈ వివాహం ద్వారా పొందిన భార్య 'సిగహ్' అందురు.
    • షియాలలో మాత్రమే ఈ వివాహానికి అంగీకారం కలదు.
    • ఈ క్రింది సందర్భాలలో ముఠా వివాహం చెల్లదు.

             1. సహవాసం ఖచ్చితంగా నిర్ధారించకుండా ఉండడం

             2. ముందస్తు మొహర్ పేర్కొనకపోవడం

             3. ముఠా వివాహాల యందు మాతృవంశానుక్రమం, పత్నీ స్థానిక నివాసం అనునవి సాధారణాంశాలు.


    2. బీనా వివాహం


    • ఈ పద్ధతిలో స్త్రీ తన అభీష్టం మేరకు పురుషుడ్ని తన జీవితంలోనికి ఆహ్వానిస్తుంది. తనకు అయిష్టత ఏర్పడినప్పుడు సంబంధాన్ని తెంచుకుంటుంది.
    • ఈ విధానంలో స్త్రీ సర్వాధికారి, సంతానంపై స్త్రీకే హక్కులు ఉంటాయి.


    3. బాల్ వివాహం


    దీనిలో కూడా స్త్రీ చొరవతో సంబంధం ఏర్పడుతుంది. కానీ అధికారం పురుషుడికి ఉంటుంది. సంతానం అతడికి చెందుతుంది.


    మెహర్


    • వివాహంను పురస్కరించుకొని మహిళకు కాబోయే భర్త ఇచ్చే డబ్బు/ఆస్థినే మెహర్ అంటారు.
    • మెహర్ పై సర్వాధికారాలు వధువుకే ఉంటాయి. కనుక దీనిని కన్యాశుల్కంతో పోల్చలేము.
    • ముస్లిం ధర్మశాస్త్రం ప్రకారం భార్యపై గౌరవంతో భర్త ఇచ్చే ధనమే మెహర్. 


    మెహర్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం


    1. స్త్రీకి ఆర్థికపరమైన సాధికారత కల్పించడం

    2. పురుషుడు విడాకులు తీసుకోకుండా చేయడం

    3. స్త్రీకి గౌరవాన్ని ఇస్తున్నామని తెలపడం. వివాహ ప్రతిపాదన & మెహర్ ప్రతిపాదన కలిపే చేస్తారు.

    4. పెళ్ళికూతురు దగ్గరి బంధువు 'వలి' ఇందులో కీలకపాత్ర పోషిస్తారు.

    5. వివాహం ముందుగానీ వివాహం తర్వాత 3వ రోజుగానీ 1/3 మెహర్ని చెల్లిస్తారు. మిగతా మొత్తం భర్త చనిపోయినప్పుడు లేదా పురుషుడు విడాకులు తీసుకున్నప్పుడు చెల్లించవలసి ఉంటుంది.

    6. మెహర్ చెల్లించకపోతే అప్పుగా మారుతుంది. పైగా స్త్రీ సహనివాసానికి నిరాకరించవచ్చు కూడా.

    7. మహిళే విడాకులు తీసుకున్నట్లయితే పురుషుడు 'మెహర్' చెల్లించవలసిన అవసరం లేదు.

    8. ముందుగా నిర్ధారించిన మెహర్ని నిర్ధారింపబడిన మెహర్ అని, న్యాయస్థానాల చేత నిర్ధారించబడినట్లయితే సమంజస హేతుబద్ధ మెహర్ అందురు.


    ముస్లింల యందు విడాకుల విధానం


    • ప్రధానంగా విడాకులు క్రింది 3 విధానాలలో అనుమతించబడును.

    1. కోర్ట్ సంబంధం లేకుండా, ఇస్లాం సాంప్రదాయం ప్రకారం తీసుకునే విడాకులు

    2. షరియా చట్టం - 1937 ప్రకారం, తీసుకునే విడాకులు

    3. కోర్టు జోక్యంతో తీసుకునేవి. (ముస్లిం వివాహల రద్దు చట్టం - 1939 & 1959)


    సాంప్రదాయ విధానంలో


    • స్త్రీ విడాకుల ప్రతిపాదన చేయగా దానిని పురుషుడు అంగీకరించి విడాకులు తీసుకున్నట్లయితే 'ఖుల' విడాకులు అని అందురు.
    • స్త్రీ/పురుషుడు ఎవరైనా విడాకులు ప్రతిపాదన చేయగా పరస్పర అంగీకారంతో తీసుకునే విడాకులు ముబారత్ విడాకులు అందురు.
    • పై 2 విధానాలతో పాటుగా, పురుషుడికి మాత్రమే విడాకులు ఇవ్వడానికి వీలు కల్పించిన విధానం 'తలాక్'.


    తలాక్


    • మతి భ్రమించిన వారు, చిన్న పిల్లలు దీనిని పాటించరాదు.
    • మౌఖికంగా కాని లేదా రాతపూర్వకంగా కాని ఉండవచ్చు. రాతపూర్వకంగా పాటిస్తే ఆ పత్రాన్ని తలాక్నామా అందురు.
    • మౌఖిక తలాక్ని 2 రూపాలలో పేర్కొంటారు.

                     1. సాంప్రదాయ తలాక్ (తలాక్ - ఉ- సన్నత్)

                     2. సాంప్రదాయ రహిత తలాక్ (తలాక్ - ఉ - బీదత్)


    1. సాంప్రదాయ బద్ద తలాక్

    • ప్రవక్త ప్రవచనాలే దీనికి ఆధారం.
    • ఇది తిరిగి ప్రధానంగా 2 రూపాలలో అనుసరించబడుతున్నది.

                        1. అహసన్ తలాక్

                        2. హసన్ తలాక్

              1. అహసన్ తలాక్

               ♦ చాలా మంచిదని అర్ధం.

               ♦  స్త్రీ యొక్క 2 'తుర్ద్' కాలాల మధ్యలో ఒకసారి తలాక్ని ఉద్ధరించి, అప్పటినుంచి 3 నెలల పాటు దాంపత్య జీవితానికి దూరంగా ఉంటే ఈ విధానంలో విడాకులు మంజూరు చేయబడతాయి.

          ♦ ఈ సమయం మొత్తం దంపతులు ఒకే దగ్గర నివసిస్తారు.

             2. హసన్ తలాక్ 

                 ♦ మంచిదని అర్థం

                 ♦ 3 తురుకాలాల మధ్యలో 3 సార్లు తలాక్ని ఉచ్ఛరించి 3 నెలల పాటు ఒకే నివాసంలో ఉన్న దాంపత్య జీవనాన్ని పాటించినట్లయితే విడాకులు మంజూరు చేయబడతాయి.

            ♦ పై 2 సందర్భాలయందు తలాక్ ఉచ్చరించిన తర్వాత దాంపత్య జీవనానికి పాల్పడితే ఆ తలాక్ రద్దవుతుంది.


    2. బిదత్ తలాక్ / సాంప్రదాయ రహిత తలాక్


    • దీనినే బియాన్ తలాక్ లేదా తిరుగులేని తలాక్ అనికూడా అంటారు.
    • సునిలలో మాత్రమే అధికంగా ఆచరిస్తున్నారు.
    • బిదాత్ అనగా అపసవ్యమైన లేదా సక్రమం కాని అని అర్థం.
    • ఈ తలాఖ్ విధానం ఖురాన్లో లేదనే అభిప్రాయం కలదు.
    • ఈ విధానంలో ఒకేసారి తలాఖ్ అని ఉచ్ఛరించి తలాక్ను ఇవ్వడం లేదా 3 సార్లు వరుసగా తలాక్ని చెప్పి వెంటనే సంబంధాన్ని రద్దు చేసుకోవడం జరుగుతుంది.


    నోట్: ఈ యొక్క బిదాత్ తలాఖ్ విధానాన్నే సుప్రీంకోర్టు రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించడం వలన కేంద్రం ఈ తలాఖ్ని వివాహిత ముస్లిం మహిళా వివాహ హక్కు చట్టం 2019 ద్వారా రద్దు చేసింది.


    షరియా చట్టం ప్రకారం విడాకులు


    • దీని ప్రకారం విడాకులు 'ఇలా', జీహార్ & లియాన్ అను రూపాల్లో పొందవచ్చు.
    • 4 నెలలు వరుసగా ఆధ్మాత్మిక జీవనంలో గడుపుతూ, దాంపత్య జీవనాన్ని వదిలి ఆ తర్వాత కూడా అలాగే కొనసాగిస్తే భార్య విడాకులు కోరవచ్చుననే సాంప్రదాయాన్నే 'ఇలా' అందురు.
    • దగ్గరి బంధువులా భావిస్తున్నానని, ప్రత్యేకించి మాతృరూపంలో కనిపిస్తున్నావని పురుషుడు తన భార్యతో వివాహ బంధాన్ని తెంచుకోవడాన్నే జీహార్ అందురు. ప్రస్తుతం ఇది ఆచరణలో లేదు. భార్య యొక్క శీలాన్ని శంకించినపుడు భార్య విడాకులు పొందడాన్నే లియాన్ అందురు.
    • పై రూపాలతో పాటు వివాహ సమయంలో పురుషుడు తలాక్ అధికారాన్ని త్యాగం చేసి తన భార్యకు గానీ/ మరెవరైనా బంధువుకి గానీ తలాక్ అధికారాన్ని అప్పగిస్తారు. దానిని ఉపయోగించి విడాకులు తీసుకున్నట్లయితే తఫివీజ్ తలాక్ అందురు.


    ముస్లిం వివాహ రద్దు చట్టం - 1939 ప్రకారం


    • ఈ చట్టంను 1959 లో సవరించారు.
    • 1939 మార్చి 17 నుండి అమలులోకి వచ్చింది.
    ♦ క్రింది సందర్భాలలో ముస్లిం మహిళ విడాకులను పొందవచ్చు.

    1. 4 సంవత్సరాలు కనబడకుండా పోతే

    2. 2 సంవత్సరాలు వరుసగా పట్టించుకోకపోతే

    3. 7 సంవత్సరాలు జైలు శిక్షకు గురైతే

    4. 2 సంవత్సరాలకు పైగా నయముగాని పిచ్చితో ఉన్నట్లయితే

    5. లెప్రసి, ఎయిడ్స్, సుఖ వ్యాధులు ఉన్నట్లయితే

    6. సాడిజం కల్గి ఉన్నట్లయితే

    7. వివాహ సమయం నుండే నపుంసకత్వం ఉన్నట్లయితే


    వివాహిత ముస్లిం మహిళ వివాహ హక్కుల పరిరక్షణ చట్టం- 2019


    • ఈ చట్టంనే ట్రిపుల్ తలాఖ్ నిషేద చట్టం అని కూడా అందురు.
    • షయరాబానో అనబడే ముస్లిం మహిళ కేసు సందర్భంగా ఆగస్టు 22, 2017న సుప్రీంకోర్టు ట్రిపుల్ తలాఖ్ని రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులకి మరియు సమానత్వంనకు విరుద్ధమని తీర్పుచెబుతూ నిషేధించింది, మరియు కేంద్ర ప్రభుత్వంను ఈ విధానంపై నిషేధిస్తూ శాసనపరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది.
    • సుప్రీంకోర్టు తీర్పు మేరకు కేంద్ర కాబినేట్ తీర్మాణం ఆధారంగా రాష్ట్రపతి ట్రిపుల్ తలాఖ్ పాటించడంను నిషేధిస్తూ మరియు నేరంగా పేర్కొంటు సెప్టెంబర్ 18, 2018న ఆర్డినెన్సిని విడుదల చేశారు. ఈ యొక్క ఆర్డినెన్స్ సెప్టెంబర్ 19, 2018 నుండి అమలులోనికి వచ్చింది. మరియు ఈ యొక్క ఆర్డినెన్స్ స్థానంలో పార్లమెంట్ ఈ చట్టంను 2019వ సంవత్సరంలో రూపొందించినది.
    • ఈ చట్టంలోని సెక్షన్ -3 ప్రకారం తలాఖ్-ఇ-బిదాత్ మరియు దీనిని పోలిన యితర తలాఖ్ విదానాలు నిషేదం మరియు పాటించినట్లయితే నేరంగా పరిగణించబడుతుంది.
    • ఈ చట్టంలోని సెక్షన్-4 ప్రకారం ట్రిపుల్ తలాఖ్ని పాటించినవారికి 3 సంవత్సరాల జైలు శిక్ష మరియు జరిమానా విధించబడుతుంది.
    • సెక్షన్ 5 ప్రకారం తలాఖ్ పాటించిన సందర్భంలో సదరు భార్యకు, భర్త మెయింటెనెన్స్ ఖర్చులు ప్రతి నెలా చెల్లించవలసి ఉంటుంది. మరియు మైనర్ పిల్లలను తల్లి వద్దే ఉంచుకునే హక్కు ఉంటుంది.


    పర్సనల్ లా సవరణ చట్టం 2019


    • ఫిబ్రవరి 21, 2019 నుండి అమలులోనికి వచ్చింది.
    • ఈ చట్టం ద్వారా భారతీయ విడాకుల చట్టం 1869, ముస్లిం వివాహ రద్దు చట్టం 1939, ప్రత్యేక వివాహాల చట్టం 1954, హిందు వివాహ చట్టం 1955 మరియు హిందు దత్తత మరియు పోషణ చట్టం 1956ని సవరించారు.
    • ఈ చట్టం ద్వారా లెప్రసి సాకుతో విడాకులు తీసుకోవడాన్ని నిషేధిస్తూ పై చట్టాలను సవరించారు.


    క్రిస్టియన్ వివాహ వ్యవస్థ


    వీరి యందు వివాహానికి పునాది - ప్రేమ మరియు సమానత్వం, అంతర్వివాహాన్నే పాటిస్తారు, దహనం చేయడం కంటే వివాహం చేయడం మేలు అని సెయింట్ పాల్ అన్నారు. వివాహానికి అధికారి - దేవుడు, వివాహం చేసుకోవడం మతపరమైన విధి, సనాతన క్రిస్టియన్ సాంప్రదాయంలో విడాకులు తీసుకోవడం నిషేధం & బహువివాహం వ్యభిచారంతో సమానం.


    ఐసోగమికి ప్రాధాన్యం ఉంటుంది, ఐసోగమి అనగా సమస్థాయి వ్యక్తుల మధ్య వివాహం జరగడం. మరియు అనిసోగమి అనగా అసమస్థాయి వ్యక్తుల మధ్య వివాహం జరగడం.


    లైంగిక జీవనం క్రమబద్ధం చేసుకోవడం, కుటుంబాన్ని స్థాపించడం, పరస్పర ప్రేమ, సహకారం అనునవి వివాహ లక్ష్యాలు. 1563 నుండి చర్చి ఆమోదం పొందడం అనివార్యం అయ్యింది. మతమార్పిడి చేసుకున్న వారిని వివాహం చేసుకోవచ్చు. వధూవరుల పరస్పర అంగీకారం & కుటుంబ యజమాని అనుమతితోనే వివాహం జరగాలి. బాప్టిజం ఇచ్చేవారికి & పుచ్చుకునే వారి మధ్య వివాహం నిషేధం. క్రైస్తవ వివాహ చట్టం - 1872 ప్రకారం, వివాహం జరగాలి.


    క్రైస్తవ వివాహ చట్టం - 1872 లోని ముఖ్యాంశాలు


    • 1928లో సవరించబడింది.
    • బహుభార్యత్వాన్ని, బహుభర్తత్వాన్ని నిషేధించింది.
    • సెక్షన్ 5 ప్రకారం, చర్చి ఫాదరికి & స్కాట్లాండ్ మతాధికారులకు వివాహం జరిపించే అధికారం కలదు.
    • సెక్షన్ 10 ప్రకారం, ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 7 గంటల మధ్యలోనే వివాహం జరగాలి.
    • సెక్షన్ 11 ప్రకారం, చర్చి ఆవరణలోనే వివాహం జరగాలి.
    • సెక్షన్ 12 ప్రకారం, నిర్దేశించిన నమూనాలో వధూవరులలో ఎవరో ఒకరు వివాహం కోసం దరఖాస్తు చేసుకోవాలి.
    • సెక్షన్ 7 ప్రకారం, వివాహ రిజిస్ట్రార్ మెయిన్ యిన్ చేయడం జరుగుతుంది.
    • సెక్షన్ 13 ప్రకారం, జరగబోయే వివాహం గురించి వరుసగా 3 ఆదివారా పాటు చర్చిలో అందరికి తెలపాలి (నోటీస్ బోర్డులో ప్రదర్శించాలి).
    • సెక్షన్ 60 ప్రకారం, వివాహ వయస్సు వధువుకు 18 మరియు వరుడికి 21.
    • సెక్షన్ 25 ప్రకారం, వివాహ ప్రకటన & వధూవరుల యొక్క ప్రతిజ్ఞ చేయాలి.


    భారతీయ విడాకుల చట్టం 1869 ప్రకారం: భార్య క్రింది సందర్భాలలో విడాకులు కోరవచ్చు


    1. క్రూరత్వం

    2. మతం వదలిపెట్టడం

    3. జారత్వం (Extra Marital Relation)

    4. 2వ వివాహం చేసుకున్నప్పుడు

    5. మానభంగం కేసులో దోషిగా తేలినప్పుడు

    6. అసహజ లైంగిక కార్యకలాపాలు (Sodomy)

    7. రెండు సం||లు ఇల్లు వదలిపెట్టి వెల్లడం


    సెక్షన్ 18 ప్రకారం, ఈ క్రింది సందర్భాలలో భార్యగానీ, భర్తగానీ వివాహాన్ని రద్దు చేయవలసిందిగా కోరవచ్చు


    1. వివాహ సమయానికే నపుంసకత్వం ఉండటం

    2. మూర్ఖమైన ప్రవర్తన, నయముకాని పిచ్చి ఉన్నప్పుడు తీసుకోవచ్చు.


    భారతదేశంలోని వివాహ వ్యవస్థలో గల లోపాలు


    భారతదేశంలోని అన్ని మతాలలో వివాహ వ్యవస్థలో లోపాలు కలవు. అన్ని మత విశ్వాసాలు వివాహం విషయంలో స్త్రీల పట్ల అణచివేత ధోరణిని, అసమాన అవకాశాలని ప్రదర్శించినవి. ఇందుకు ప్రధానకారణం అన్ని మతాలు పితృస్వామ్య విలువలను పాటించడమే. ఈ క్రిందివి వివాహ వ్యవస్థలో గల ముఖ్యమైన లోపాలు.

    1. బాల్య వివాహాలు

    2. వితంతు పునర్వివాహ అవకాశం లేకపోవడం

    3. విడాకుల విషయంలో స్త్రీలకు అవకాశం లేకపోవడం

    4. బహుభార్యత్వం

    5. కన్యాశుల్కం

    6. వరకట్నం

    7. గృహహింస

    8. తలాఖ్ వ్యవస్థ

    9. కులాంతర మరియు మతాంతరవివాహాలకు రక్షణ లేకపోవడం


    వివాహ వ్యవస్థలో వస్తున్న మార్పులు- దోహదపడిన కారణాలు


    సంఘ సంస్కర్తల కృషి, బాలికలకు విద్యావకాశాలు కల్పించడం, భూస్వామ్య వ్యవస్థ అంతరించడం, వివాహ సంబంధిత శాసనాలు, నగరీకరణ, ఆధునీకరణ, పారిశ్రామికీకరణ మరియు మహిళలకు విద్యావకాశాలు లాంటివి వివాహ వ్యవస్థలో మార్పులకు దోహదపడినవి. ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు వివాహం జరగకపోయినా కలిసి ఉన్నట్లయితే వారికి గృహహింస చట్టం వర్తిస్తుందని పలు సందర్భాలలో పేర్కొనడం జరిగింది.


    వివాహ వ్యవస్థపై సామాజిక శాసనాల ప్రభావం


    వివాహ వ్యవస్థలో గల ప్రధాన లోపాలైన బాల్య వివాహాలు, వరకట్నం, స్త్రీ పురుష అసమానతలు, పునర్వివాహానికి అవకాశం లేకపోవడం, బహుభార్యత్వం, తలాఖ్ వ్యవస్థ, సతీసహగమనం లాంటి అంశాలలో మార్పును తీసుకొచ్చేవరకే ఈ క్రింది చట్టాలు చేశారు.



    శారద చట్టం (1929)


    • దీనినే బాల్యవివాహ నిరోధక చట్టం అని కూడా అంటారు. ఈ చట్టం 1927లో ఏర్పాటు చేసిన హరబిలాస్ శారదా కమిటీ సూచనల మేరకు ఏర్పాటు చేశారు.
    • ఏప్రిల్ 01, 1930న అమలులోకి వచ్చినది.
    • బాల్య వివాహాలపై సూచనలు చేసిన శారద కమిటీకి అనుగుణంగా రూపొందించారు.
    • వివాహ వయస్సు బాలికకు 14, బాలుడికి 18.
    • బాలికకు దాంపత్య వయస్సు 15 సంవత్సరాలు.
    • 1949లో బాలిక వివాహ వయస్సు 15 సంవత్సరాలుగా మార్చారు.
    • 1978లో సవరించి వివాహ వయస్సుని 18,21 గా మార్చారు.
    • సెక్షన్ 16 ప్రకారం, బాల్య వివాహ నిరోధక అధికారి ఎంపిక జరుగుతుంది.
    • 3 నెలలు & 1000/- జరిమానా.


    వరకట్న నిషేధ చట్టం (1961)


    • మే 20, 1961 నుండి అమలులోకి వచ్చినది.
    • రూ॥ 2,000 లకు మించి సొమ్ముని వరకట్నంగా పరిగణిస్తారు.
    • వరకట్నం ఇచ్చినవారికి & తీసుకున్న వారికి 6 నెలల జైలు శిక్ష & 15,000 జరిమానా.
    • దీనిని 1986లో సవరించి, జైలు శిక్షని 5 సంవత్సరాలకు పెంచడం జరిగింది.


    బాల్య వివాహ నిషేధ చట్టం (2006)


    • 10 జనవరి, 2007 నుండి అమలులోకి వచ్చినది.
    • వివాహ వయస్సు - బాలికలకు 18, మరియు బాలురకు 21.
    • చట్టం అతిక్రమించిన వారికి 2 సం॥ జైలు శిక్ష & 1,00,000/- జరిమానా (వరుడు మేజర్ అయినప్పుడు మాత్రమే వర్తిస్తుంది. కానీ వరుడి తండ్రి వధువు తండ్రి + అయ్యగారు అందరూ శిక్షార్హులే).


    హిందూ వివాహ చట్టం - 1955


    ♦ హిందువుల్లో బహుభార్యత్వాన్ని & బహు భర్తత్వాన్ని నిషేధించిన మొదటి చట్టం.

    ♦ 18 మే, 1955 నుండి అమలులోకి వచ్చినది.

    ♦ మహ్మదీయులు, క్రైస్తవులు, పార్శీలు మరియు యూదులు కాని వారందరూ ఈ చట్టం పరిధిలోనికి వస్తారు.

    ♦ సెక్షన్ 05 ప్రకారం, వివాహానికి ఈ క్రింది అర్హతలు ఉండాలి.

                1. అవివాహితులై ఉండాలి / జీవిత భాగస్వామి జీవించి ఉండరాదు.

                2. వివాహ సమయానికి మానసిక అస్వస్థత, మూర్ఛ వ్యాధి ఉండరాదు.

                3. 18 సంవత్సరాలు నిండి ఉండాలి.

                4. సపిండీకులై ఉండరాదు.

    ♦ సెక్షన్ 7 ప్రకారం, సప్తపదితో వివాహం జరిగినట్టుగా భావిస్తారు.

    ♦ సెక్షన్ 8 ప్రకారం, వివాహాన్ని రిజిస్ట్రేషన్ చేయించాలి. (ఏప్రిల్ 2002 నుండి)

    ♦ సెక్షన్ 11 ప్రకారం, వివాహ సమయం నాటికే నపుంసకత్వం ఉండడం, గర్భవతి అయి ఉండడం & వజెనిస్మిస్ లాంటి కారణాలతో వివాహం రద్దవుతుంది.

    ♦ సెక్షన్ 13 ప్రకారం, క్రింది సందర్భాలలో విడాకులు కోరవచ్చు.

                1. మతమార్పిడి

                2. నయం కాని పిచ్చి

                3. STD, HIV లెప్రసీ

                4. సన్యాసం స్వీకరించడం

                5. 7సం॥లు దేశాటనం లో ఉన్నప్పుడు

    ♦ సెక్షన్ 14 ప్రకారం వివాహం జరిగిన తర్వాత సంవత్సరం వరకు విడాకులు కోరరాదు, కాని తీవ్రమైనటువంటి హింసతో కూడిన సందర్భంలో తీసుకోవచ్చు.

    ♦ ఐ.పి.సి. 494 ప్రకారం, జీవిత భాగస్వామి ఉండగా పునర్వివాహానికి పాల్పడితే 7 సం||ల జైలు శిక్ష

    ♦ ఐ.పి.సి. 495 ప్రకారం, మొదటి వివాహాన్ని రహస్యంగా దాచిపెడితే 10 సం॥ల జైలు శిక్ష

    ♦ 1976 నుండి చట్టబద్ద ఎడబాటు మరియు పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు.


    గమనిక : వివాహం విషయంలో బాలిక వయస్సును 18 నుండి 21 సంవత్సరాలకు పెంచుతూ కేంద్ర కేబినేట్ 16 డిసెంబర్ 2021న నిర్ణయం తీసుకుంది.

    సమస్థాయి వ్యక్తుల మధ్య జరిగే వివాహాన్ని ఐసోగమి అని, అసమ స్థాయి వ్యక్తుల మధ్యజరిగే వివాహాన్ని అనిసోగమి అని అంటారు. ఒక వ్యక్తి తనకు తానే పెళ్ళి చేసుకొనే విధానాన్ని సెల్ఫ్ మ్యారేజ్ లేదా ఆటోగమి అని అంటారు. వివాహం జరగకుండా ఒక దగ్గర నివాసం ఉంటూ లైంగిక సంబంధాన్ని కలిగి ఉన్నట్లయితే సహజీవనం అని అందురు.


    పునశ్చరణ


    • వివాహం అనేది ప్రాథమిక సామాజిక సంస్థ.
    • వివాహం అనే పదం వి + వాహ అనే పదాల కలయిక వల్ల ఏర్పడింది.
    • పిల్లలకు చట్టబద్ధమైన తల్లిదండ్రులను ఇచ్చేదే వివాహం అని తెలిపినది - మలినౌస్కి.
    • ఎడ్మండ్ లీచ్ యొక్క వివాహ నిర్వచనాన్ని సమగ్రమైన వివాహ నిర్వచనంగా పరిగణిస్తారు.
    • ఫిబ్రవరి 2వ ఆదివారమే అంతర్జాతీయ వివాహ దినోత్సవం.
    • వివాహానికి గల 3 సూత్రాలను తెలిపినవారు - ముల్లర్.
    • వివాహ పరిణామ క్రమాన్ని తెలిపినవారు - మోర్గన్.
    • భారతదేశంలో స్త్రీ, పురుషుల మధ్యతో పాటుగా వివాహం అనునది గ్రామ దేవతలకు మరియు బాలికలకు జరుగుతుంది, యుక్తవయస్సులో చనిపోయిన అవివాహితులకు జిల్లేడు చెట్టుతో వివాహం చేసి అంత్యక్రియలు నిర్వహిస్తారు.
    • వివాహం నందు 5 ప్రధాన మూలకాలను తెలిపినవారు - పోపిన్.
    • వివాహ రూపాలను గురించి మొదటిసారిగా వివరించినవారు - మలినోస్కి.
    • ఏకవివాహాన్ని దంపతి వివాహం అని కూడా అంటారు.
    • వెస్టర్మార్క్ ప్రకారం ఏక వివాహమే అత్యంత పురాతనమైనది.
    • గోండులు, ముండాలు మరియు ఇబల యందు భగినీ బహుభార్యత్వం గోచరిస్తుంది.
    • నాగాలు, భైగాలు మరియు ఉరలీల యందు అభగినీ బహుభార్యత్వం గోచరిస్తుంది.
    • అన్ని వివాహ రూపాలలో కెల్లా బహుభార్యత్వం వలన జనాభా విపరీతంగా పెరుగుతుంది మరియు బహుభర్తత్వం వల్ల జనాభా విపరీతంగా తగ్గిపోతుంది.
    • నీలగిరి తోడాలు మరియు హిమాలయ ఖాసాలలో సోదర బహుభర్తత్వం కనిపిస్తుంది.
    • నీలగిరి తోడాలలో ధనుర్భానోత్సవం ద్వారా సామాజిక తండ్రిని గుర్తిస్తారు.
    • కేరళ నాయర్ల యందు అసోదర బహుభర్తత్వం కనిపిస్తుంది.
    • బహుభర్తత్వంనే పేదరికంతో రాజీపడి చేసుకునే పెండ్లిగా పరిగణిస్తారు.
    • బహిర్వివాహాన్నే సంపద పద్ధతి వివాహం అని అంటారు.
    • దేవర న్యాయం భగతలు, సవరలు మరియు గదవలలో కన్పిస్తుంది.
    • హిందువులలో వివాహం అనేది సామాజిక, మతపరమైన సంస్కారం అని ఋగ్వేదం పేర్కొంది.
    • పురాతన 8 రకాల హిందూ వివాహ రూపాలను తెలిపినవాడు -మనువు.
    • పురాతన హిందూ వివాహ రూపాలలో అత్యంత శ్రేష్ఠమైనది బ్రహ్మవివాహం మరియు అత్యంత నీచమైనది పైశాచిక వివాహం.
    • సమస్థాయి వ్యక్తుల మధ్య జరిగే వివాహాన్ని ఐసోగమి అని మరియు అసమస్థాయి వ్యక్తుల మధ్య జరిగే వివాహాన్ని అనిసోగమి అంటారు.
    • విలోమ లేదా ప్రతిలోమ వివాహ సంతానాన్ని పంచములు అని మరియు అనులోమ వివాహ సంతానాన్ని దాసీపుత్రులు లేదా శూద్రులని పిలిచేవారు.
    • అరుందతి దర్శనం అనునది వివాహ క్రతువులలో చివరిది.
    • భగతలు, సవరలు, భైగాలు మరియు లెప్చాలలో సేవద్వారా జీవిత భాగస్వామిని పొందుతారు.
    • ఉల్లాటనలు, నిషావనులు మరియు భారియాలు వినిమయం ద్వారా జీవిత భాగస్వామిని పొందుతారు.
    • మణిపూర్ కూకీల యందు పరీక్ష ద్వారా జీవితభాగస్వామిని పొందుతారు.
    • నాగా, గోండు, మరియు హెూళలో కరపరిగ్రహణం ద్వారా జీవిత భాగస్వామిని పొందుతారు.
    • ఖరియా మరియు బిరర్ తెగల యందు ఆచార పరిగ్రహణం గోచరిస్తుంది.
    • నిఖా అనునది అరబిక్ పదం.
    • ఇస్లాంలో చెల్లని వివాహాలను బాతుల్ వివాహాలు అంటారు మరియు అపసవ్య వివాహాలను ఫాసిద్ వివాహాలంటారు.
    • ముతా, భినా మరియు బాల్ అనునవి పురాతన అరబ్బు వివాహ రూపాలు.
    • ముతా అనునది అరబిక్ పదం, దీని యొక్క అర్థం ఆనందపడు లేదా సుఖించు.
    • వివాహిత ముస్లిం మహిళ, వివాహ హక్కుల పరిరక్షణ చట్టం 2019 లోని సెక్షన్ 3 ద్వారా తలాఖ్-ఇ-బిధాత్ పాటించడాన్ని నేరంగా భావిస్తారు. ఈ తలాఖ్్న ముమ్మారు తలాఖ్ అనికూడా పిలుస్తారు.
    • క్రైస్తవ వివాహ చట్టం 1872 ప్రకారం వరుస 3 ఆదివారాల పాటు నోటీస్ బోర్డులో వధూ, వరుల యొక్క వివరాలను ఉంచాలి.
    • బాల్యవివాహ నిరోధక చట్టానే శారదా చట్టం అని కూడా అంటారు.


Tags: Caste system, gender roles, joint families, arranged marriages, diversity, cultural festivals, social hierarchy, economic disparities, religious practices, education system, urbanization, rural traditions, globalization, modernization


1 comment:

  1. Bible lo paul ekkada kuda dahanam cheyyatam kante vivaham cheyyatam melu Ani cheppaledhu mam....vivahamu Anni vishayamulalo ganamainadhi Ani chepparu... Please correct it

    ReplyDelete

Post Bottom Ad