క్రీ.పూ. 4వ శతాబ్దంలో మౌర్య సామ్రాజ్య స్థాపన ప్రాచీన భారతదేశ చరిత్రలో ఒక నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. మొదట్లో ఉత్తర భారతదేశంలోనూ, తర్వాతి కాలంలో భారతదేశమంతా రాజకీయ ఏకీకరణ సాధించడానికి మౌర్యుల యుగమే ప్రధాన కారణం. సమాజం, పరిపాలన, మతం, ఆర్థిక వ్యవస్థల్లో గుణాత్మకమైన మార్పులకు మౌర్యుల కాలం సాక్ష్యంగా నిలిచింది. మౌర్యుల రాకతో ప్రాచీన భారతదేశ చరిత్రలో కాలనిర్ణయం చేయడంలో ఎదురవుతున్న ఇబ్బందులు తొలగిపోయాయి.
మౌర్యుల చరిత్రకు ఆధారాలు:
మౌర్యుల రాజకీయ, సాంస్కృతిక చరిత్రను తెలుసుకోవడానికి అనేక రకాల ఆధారాలు ఉన్నాయి. సాహిత్య, పురావస్తు ఆధారాలుగా వీటిని విభజించవచ్చు.
సాహిత్య ఆధారాలు:
వీటిని స్వదేశీ, విదేశీ ఆధారాలుగా విభజించవచ్చు. స్వదేశీ ఆధారాలను తిరిగి వైదిక, బౌద్ధ, జైన ఆధారాలుగా విభజించవచ్చు.
వైదిక సాహిత్యం: మౌర్యుల పుట్టుక, తొలి చరిత్ర గురించి వాయు, విష్ణుపురాణాలు అమూల్యమైన సమాచారాన్ని తెలియజేస్తున్నాయి. నంద రాజు రాణి లేదా ఉంపుడుగత్తె 'ముర' నుంచి 'మౌర్య' అనే పేరు వచ్చినట్లు వీటిలో పేర్కొన్నారు. అయితే పురాణాల్లో ఈ రెండు రాజవంశాలకు సంబంధం ఉన్నట్లు చెప్పలేదు. నందవంశస్థులు శూద్ర కులానికి చెందడం దీనికి కారణమై ఉండవచ్చు. మౌర్యులు కూడా నీచ స్థాయికి చెందిన శూద్ర కులానికి చెందినవారుగా ఇవి పేర్కొన్నాయి. మొత్తం మీద పురాణాల్లో మౌర్యులను శూద్ర కులానికి చెందినవారిగా ప్రస్తావించారు.
బౌద్ధ సాహిత్యం: ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ ప్రాంతంలో మౌర్య అనే క్షత్రియ తెగ నివసిస్తున్నట్లు బౌద్ధ సాహిత్యంలో పేర్కొన్నారు. చంద్రగుప్తుడు కూడా ఇదే తెగకు చెంది ఉండవచ్చని తెలిపారు. బౌద్ధ గ్రంథాల్లో అశోకుడి తొలి జీవితం గురించి ప్రస్తావించారు. శ్రీలంకకు చెందిన బౌద్ధ గ్రంథాల్లో అశోకుడు తన తొంభై తొమ్మిది మంది సోదరులను చంపి సింహాసనం అధిష్ఠించినట్లు వివరించారు. ఇందులో వాస్తవం లేదు. అశోకుడు సింహాసనం అధిష్ఠించిన 18 సంవత్సరాల వరకు ఆయన సోదరులు, సోదరీమణులు జీవించే ఉన్నారని చెప్పడానికి ఆధారాలున్నాయి.
మహావంశం, దీపవంశం గ్రంథాల్లో బుద్ధుడి నిర్యాణం తర్వాత 218 ఏళ్లకు అశోకుడు రాజైనట్లు ప్రస్తావించారు. ఈ ప్రస్తావన మౌర్యులు, అశోకుడు సింహాసనం అధిష్ఠించిన కాలాన్ని నిర్ణయించడానికి బాగా ఉపయోగపడింది. బిందుసారుడి పాలనా కాలంలో తక్షశిలలో తిరుగుబాటు జరిగినట్లు 'అశోక వదన' అనే గ్రంథంలో తెలిపారు. ఈ సమయంలో ఆశోకుడు ఉత్తర పథానికి గవర్నర్‌గా వ్యవహరించేవాడు. బిందుసారుడు ఈ తిరుగుబాటును అణచివేయడానికి అశోకుడిని పంపాడు. అశోకుడు తనకు అప్పగించిన పనిని విజయవంతంగా పూర్తిచేశాడు.
బిందుసారుడి కాలంలో వారసత్వ యుద్ధాలు జరిగినట్లు బౌద్ధ గ్రంథాల్లో పేర్కొన్నారు. దివ్యవదన గ్రంథం ప్రకారం బిందుసారుడు తన చివరి రోజుల్లో పెద్ద కుమారుడు సుసిమను వారసుడిగా ప్రకటించాలని భావించాడు. అయితే బిందుసారుడి ముఖ్యమంత్రి రాధాగుప్తుడు ఇతర మంత్రులు అశోకుడిని రాజుగా చేశారు. దీని ద్వారా వారసత్వ యుద్ధం జరిగినట్లు తెలుస్తోంది. మహావంశ, దీపవంశ గ్రంథాల్లో ఇచ్చిన సమాచారం కూడా దీనికి బలాన్ని చేకూరుస్తోంది.
జైనసాహిత్యం: జైన సాహిత్యం చంద్రగుప్తుడి మతం గురించి ఆసక్తికరమైన సమాచారం తెలియజేస్తోంది. హేమచంద్రుడు రచించిన పరిశిష్ట పర్వన్ ప్రకారం చంద్రగుప్తమౌర్యుడు జైనమతాన్ని అనుసరించాడు. మగధలో కరవు సంభవించినప్పుడు చంద్రగుప్తుడు సింహాసనాన్ని బిందుసారుడికి అప్పగించి, మైసూరు దగ్గరలోని శ్రావణ బెలగోళకు వెళ్లి, జైన సంప్రదాయం ప్రకారం సల్లేఖనవ్రతం ద్వారా తనువు చాలించాడు. చంద్రగుప్తుడు దక్కన్ ప్రాంతానికి వలస వెళ్లడం అక్కడ జైనమతం వ్యాప్తికి దోహదపడింది.
లౌకిక సాహిత్యం: కౌటిల్యుడి అర్థశాస్త్రం మౌర్యుల కాలంనాటి పరిపాలన, సమాజం తదితర విషయాలపై అమూల్యమైన సమాచారాన్ని తెలియజేస్తోంది. ఇందులో వ్యవస్థీకృతమైన ఉద్యోగస్వామ్యంతో కూడిన ప్రభుత్వ విధానం గురించి విపులంగా వివరించారు.
అర్థశాస్త్రంలో పరిపాలనకు అధిపతి రాజు, అతడికి సహాయం చేయడానికి మంత్రి పరిషత్ ఉండేది. మౌర్య సామ్రాజ్యాన్ని అనేక రాష్ట్రాలు, జిల్లాలు, గ్రామాలుగా విభజించినట్లు పేర్కొన్నారు. రాష్ట్రాలు రాజవంశానికి చెందిన వైశ్రాయ్‌ల ఆధీనంలో ఉండేవి. జిల్లాలకు 'స్థానిక', గ్రామాలకు 'గోప' అధిపతులుగా వ్యవహరించేవారు. గ్రామానికి అధిపతి 'గ్రామణి'. వీరితో పాటు వివిధ శాఖలను పర్యవేక్షించడానికి అధ్యక్షులను నియమించేవారు. అర్థశాస్త్రంలో పన్నుల విధానం, సామాజిక, గూఢచారి, సైనిక వ్యవస్థల గురించి వివరంగా పేర్కొన్నారు. ఈ విధంగా కౌటిల్యుడి అర్థశాస్త్రం మౌర్యుల యుగానికి సంబంధించిన అన్ని విషయాలపై సమగ్ర సమాచారాన్ని తెలియజేస్తోంది.
విశాఖదత్తుడు రాసిన 'ముద్రారాక్షసం' మరో స్వదేశీ సాహిత్య ఆధారం. ఇది క్రీ.శ. 5వ శతాబ్దంలో రాసిన నాటకం. ఇందులో నంద వంశపాలనకు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటు వల్ల ఆ వంశం పతనం కావడం, మగధ సింహాసనాన్ని చంద్రగుప్తుడు అధిష్ఠించిన విషయం గురించి వివరించారు. ఈ గ్రంథంలో మౌర్యులను క్షత్రియ వంశానికి చెందినవారిగా పేర్కొన్నారు.
విదేశీ ఆధారాలు: మెగస్తనీస్ రచించిన ఇండికా (Indica) గ్రంథం విదేశీ ఆధారాల్లో చాలా ముఖ్యమైంది. ఈ పుస్తకంలో కొన్ని భాగాలు మాత్రమే ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నాయి. గ్రంథంలో ప్రస్తావించిన అనేక విషయాలు స్ట్రాబో, అరియన్, జస్టిన్ తదితర గ్రీకు, రోమన్ రచయితల పుస్తకాల్లో quotations రూపంలో కనిపిస్తాయి. మెగస్తనీస్ చంద్రగుప్తుడి ఆస్థానానికి సెల్యూకస్ పంపిన గ్రీకు రాయబారి.
ఇండికా గ్రంథం ద్వారా మౌర్య చక్రవర్తులు విలాసవంతమైన జీవితాన్ని గడిపినట్లు తెలుస్తోంది. వారు 6 లక్షల కాల్బలం, 30 వేల అశ్వక దళం, 9 వేల గజదళం, 8 వేల రథాలతో ఉన్న అతిపెద్ద సైన్యాన్ని పోషించారు. సైనిక వ్యవస్థను 30 మందితో కూడిన కమిటీ ద్వారా నిర్వహించేవారు. మొత్తం సైనికశాఖను 5 మంది సభ్యులతో 6 బోర్డులుగా విభజించారు.
మెగస్తనీస్ మౌర్యుల రాజధాని నగరమైన పాటలీపుత్రం గురించి కళ్లకు కట్టినట్లు వర్ణించాడు. ఇది భారతదేశంలోని గొప్ప నగరాల్లో ఒకటి. పాటలీపుత్ర పరిపాలనను 30 మందితో ఉన్న కమిటీ పర్యవేక్షించేది. దీన్ని 5 మంది సభ్యులతో 6 బోర్డులుగా విభజించారు. ఈ బోర్డులు పరిశ్రమలు, విదేశీయుల సంక్షేమం, జనన మరణాల నమోదు, పన్నుల వసూలు, ఉత్పత్తి వస్తువుల పర్యవేక్షణ తదితర బాధ్యతలను నిర్వహించేవి. మౌర్యుల కాలం నాటి సమాజాన్ని తత్త్వవేత్తలు, వ్యవసాయదారులు, సైనికులు, పశువుల కాపరులు, కళాకారులు, న్యాయమూర్తులు, కౌన్సిలర్లు అనే ఏడు కులాలుగా విభజించినట్లు మెగస్తనీస్ పేర్కొన్నాడు. అయితే ఇది వాస్తవం కాదు. మెగస్తనీస్ పొరపాటున వృత్తులను కులాలుగా భావించి ఇలా విభజించినట్లు తెలుస్తోంది.
మౌర్యుల కాలం నాటి ప్రజలు నిజాయతీపరులని, సుఖసంతోషాలతో జీవించారని, రాజ్యంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నట్లు మెగస్తనీస్ పేర్కొన్నాడు. బ్రాహ్మణులు సమాజంలో ఉన్నత స్థానాన్ని ఆక్రమించారు. ఈ విధంగా ఇండికా గ్రంథం మౌర్యుల కాలానికి సంబంధించిన రాజకీయ, సామాజిక అంశాలను సమీక్షించడానికి బాగా ఉపయోగపడుతుంది.
గ్రీకు చరిత్రకారులు జస్టిన్, డియోడోరస్ ప్రకారం చంద్రగుప్తుడు సామాన్య కుటుంబంలో జన్మించి మౌర్య సింహాసనాన్ని అధిష్ఠించాడని తెలుస్తోంది.
పురావస్తు ఆధారాలు:
పురావస్తు ఆధారాలను శాసనాలు, కట్టడాలు, నాణేలు అని మూడు రకాలుగా విభజించవచ్చు.ఎ) శాసనాలు:
భారతదేశంలో శాసనాలను జారీ చేసిన మొదటి చక్రవర్తి అశోకుడు. ఈ విషయంలో అశోకుడు పర్షియా చక్రవర్తి మొదటి డేరియస్ నుంచి స్ఫూర్తి పొందినట్లు తెలుస్తోంది. అశోకుడు తన శాసనాల్లో చారిత్రక, రాజకీయ అంశాల కంటే నైతిక, మతపరమైన వాటికి ప్రాధాన్యం ఇచ్చాడు. ఈ శాసనాలు సమకాలీన రాజకీయ వ్యవస్థ, సంస్కృతి గురించి తెలుసుకోవడానికి బాగా దోహదపడుతున్నాయి.అశోకుడి శాసనాలను ప్రధానంగా రెండు రకాలుగా విభజించవచ్చు. అవి
1) శిలా శాసనాలు
2) స్తంభ శాసనాలు
శిలా శాసనాలు: అశోకుడు రాజ్య సరిహద్దుల్లో శిలాశాసనాలు (రాళ్ల పై) చెక్కించాడు.
స్తంభ శాసనాలు: ఒకే రాతి నుంచి మలచిన స్తంభాలపై చెక్కిన స్తంభ శాసనాలను అశోకుడి సామ్రాజ్యంలోని వివిధ ప్రదేశాల్లో వేయించారు.
శాసనాలు ప్రధానంగా బ్రాహ్మి లిపితో, ప్రాకృత భాషలో ఉన్నాయి. అయితే వాయువ్య సరిహద్దులోని శాసనాల్లో ఖరోస్తి (kharosthi) లిపిని ఉపయోగించారు. కాందహార్ శాసనం గ్రీకు, అరామిక్ (ద్విభాష) భాషల్లో వేశారు. అశోకుడి శాసనాలను 8 గ్రూపులుగా విభజించవచ్చు.
చిన్న శిలాశాసనాలు: ఈ గ్రూపులో రెండు శాసనాలు ఉన్నాయి. మొదటిది అశోకుడి వ్యక్తిగత చరిత్ర, రెండోది అశోకుడి దమ్మ (Dhamma) సారాంశాన్ని తెలియజేస్తున్నాయి.
బబ్రూ శాసనం: ఈ శాసనం గౌతమ బుద్ధుడి బోధనల పట్ల అశోకుడికి ఉన్న శ్రద్ధను తెలియజేస్తోంది. ఈ శాసనం బౌద్ధ మతస్థులకు చాలా ప్రధానమైంది.
పద్నాలుగు శిలాశాసనాలు: వీటిని మౌర్య సామ్రాజ్య సరిహద్దు రాష్ట్రాల్లో వేయించారు. ఇందులో అశోకుడి ప్రభుత్వ విధానం, నైతిక నియమాల గురించి వివరించారు. వీటన్నింటిలో చారిత్రక ప్రాధాన్యం దృష్ట్యా 13వ శిలాశాసనం చాలా ముఖ్యమైంది.
i) కళింగ ఆక్రమణ యుద్ధంలో సంభవించిన ప్రాణనష్టంతో పాటు అశోకుడి పశ్చాత్తాపం గురించి ఈ శిలాశాసనం తెలియజేస్తోంది.
ii) అశోకుడు బేరిఘోష స్థానంలో దమ్మ ఘోషకు ప్రాధాన్యమివ్వడం గురించి ఈ శాసనంలో ప్రస్తావించారు.
iii) దమ్మ ప్రచారం కోసం అశోకుడు సమకాలీన విదేశీ రాజుల ఆస్థానాలకు ప్రచారకులను పంపడాన్ని ప్రస్తావించారు. ఈ శాసనంలో పేర్కొన్న విదేశీ రాజులు - సిరియాకు చెందిన ఆంటియోకస్, ఈజిప్టుకు చెందిన టాలమి ఫిలడెల్ఫస్, ఎపిరస్‌కు చెందిన అలెగ్జాండర్, మాసిడోనియాకు చెందిన ఆంటిగోనస్ గొనటస్, సైరీన్‌కు చెందిన మెగస్ (Megas) తదితరులు ఉన్నారు.
iv) రెండు కళింగ శాసనాలు: ఈ శాసనాలు ఒరిస్సాలోని ధౌలి, జౌగడ్‌లో లభించాయి. కళింగ, దాని సరిహద్దు ప్రాంతాల్లో నివసిస్తున్న ఆటవిక తెగల పరిపాలన ఏవిధంగా ఉండాలో ఈ శాసనాల్లో పేర్కొన్నారు.
v) బరాబర్ కొండగుహ శాసనాలు: ఇక్కడ మొత్తం మూడు శాసనాలు ఉన్నాయి. ఇందులో జైనమతం అజీవక తెగకు చెందిన వారికి అశోకుడు చేసిన దానాల గురించి పేర్కొన్నారు. ఈ శాసనం పరమతసహనానికి నిదర్శనంగా నిలుస్తోంది.
vi) నేపాలీ తరై శాసనం: ఈ శాసనాలు రుమ్మిందై, నిగాలి సాగర్ లో ఉన్నాయి. అశోకుడు బుద్ధుడి జన్మస్థానమైన లుంబిని సందర్శించడం గురించి, నిగాలిసాగర్‌లో స్తూపాన్ని పునర్‌నిర్మించడం గురించి ఈ శాసనాల్లో తెలియజేశారు.
vii) ఏడు స్తంభ శాసనాలు: ఈ శాసనాలు అశోకుడి మత సామరస్యం ప్రచారం చేయడానికి, నైతిక విధాన
అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి ఆయన తీసుకున్న చర్యలను గురించి తెలియజేస్తాయి. రజుక అనే అధికారుల విధులైన న్యాయ పరిపాలన, సంక్షేమ కార్యక్రమాలు, బ్రాహ్మణులు, శ్రమణులు, అజీవకులు, నిగ్రంథుల నుంచి మహామాత్రల నియామకం తదితర విషయాల గురించి తోపారా శాసనం తెలియజేస్తుంది.
viii) చిన్న స్తంభ శాసనాలు: ఈ కోవకు చెందినవి నాలుగు శాసనాలు ఉన్నాయి. బౌద్ధ మతంలో చీలిక ప్రమాదం ఉందని గ్రహించిన అశోకుడు ఈ శాసనాలు వేయించినట్లు తెలుస్తోంది. బౌద్ధ సంఘంలో అనైతిక కార్యకలాపాలు పెరిగినట్లు ఈ శాసనాల ద్వారా అర్థమవుతోంది. ఇదే సమయంలో అశోకుడు పాటలీపుత్రంలో మూడో బౌద్ధ సంగీతిని నిర్వహించి బౌద్ధమతంలో చీలికను నివారించడానికి ప్రయత్నం చేశాడు.
కర్ణాటకలోని మస్కి, మధ్యప్రదేశ్‌లోని గుజ్జరి శాసనాల్లో అశోకుడి పేరును మాత్రమే ప్రస్తావించారు. ఇంగ్లిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి పదవీ విరమణ పొందిన అధికారి జేమ్స్ ప్రిన్సెస్ అశోకుడి శాసనాలపై అధ్యయనం చేశాడు.
అశోకుడి శాసనాల ప్రాధాన్యం:
అశోకుడి శాసనాల ద్వారా కింది విషయాలు తెలుస్తున్నాయి.
i) అశోకుడి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివరాలు.
ii) సమకాలీన విదేశీ రాజులతో ఉన్న సంబంధాలు.
iii) అశోకుడి దమ్మ సూత్రాలు.
iv) మౌర్యుల కాలంలో వాడిన వేర్వేరు భాషలు, లిపికి సంబంధించిన సమాచారం.
v) శాసనాలు లభించిన ప్రదేశాల ఆధారంగా అశోకుడి రాజ్య విస్తీర్ణం.
vi) 13వ శిలాశాసనం ద్వారా కళింగ ఆక్రమణ, బౌద్ధ సన్యాసి ఉపగుప్తుడి కోరిక మేరకు బౌద్ధమతంలోనికి
మారడం లాంటి విషయాలు.
vii) అశోకుడు చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు - సంక్షేమ రాజ్య భావనకు పితామహుడు లాంటి విషయాలు తెలుస్తున్నాయి.
viii) పరిపాలనలో ప్రవేశపెట్టిన కొత్త సంస్కరణలు, ధర్మ మహామాత్రుల నియామకం తదితర విషయాలు.
బి) కట్టడాలు:
మౌర్య సామ్రాజ్యంలో దొరికిన విహారాలు, చైత్యాల రూపంలోని గుహలు, స్తూపాలు, స్తంభాలు మొదలైనవి మౌర్యుల వాస్తు శాస్త్రం, కళల గురించి తెలుసుకోవడానికి ప్రధాన ఆధారాలు. మౌర్యుల కాలం నాటి స్తంభాలు చూనార్ నుంచి తెచ్చిన రాతితో తయారు చేశారు. ఇది నునుపుగా ఉండి ఇసుకరాయి రకానికి చెందింది. ఈ స్తంభాలు ఆ కాలంలో అభివృద్ధి చెందిన కళకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
వీటన్నింటిని ఏకశిలతో తయారు చేశారు. పెద్ద రాళ్లను క్వారీల నుంచి సుదూర ప్రాంతాలకు తరలించడం, వాటిని పాలిష్ చేయడం, అందంగా తీర్చిదిద్దడం ఎంతో శ్రమతో కూడుకున్న పని. ఇదంతా ఆ కాలం నాటి వృత్తిపని వారి నైపుణ్యానికి నిదర్శనం.
కట్టడాలను జాగ్రత్తగా అధ్యయనం చేస్తే మౌర్యుల కళపై పర్షియన్ల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. పాటలీపుత్రంలోని రాజప్రసాదం పర్షియా రాజధాని 'పెర్సొపోలిస్' (Persopolis) లోని మొదటి డేరియస్ రాజ ప్రసాదాన్ని పోలి ఉంది. దీన్ని బట్టి ఆ కాలంలో పర్షియా, భారత రాజ్యాల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది.
సి) నాణేలు:
మౌర్య చక్రవర్తులు విద్ధాంక నాణేలను (Punch market coins) జారీ చేశారు. వీటిని వెండి, రాగి లోహాలతో తయారు చేశారు. ఈ నాణేలపై నెమలి, కొండ, నెలవంక (Crescent) చిహ్నాలు ఉన్నాయి. ఇవి మౌర్యుల కాలం నాటి ఆర్థిక పరిస్థితులను తెలుసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఈ నాణేలు లభించిన ప్రాంతాల ఆధారంగా సామ్రాజ్య విస్తరణను తెలుసుకోవచ్చు. మౌర్య వంశ చివరి రాజులు తక్కువ విలువ ఉన్న నాణేలను జారీచేయడం ఆ కాలంలో దిగజారిన ఆర్థిక పరిస్థితిని తెలియజేస్తుంది.
ఈ విధంగా కౌటిల్యుడి అర్థశాస్త్రం, మెగస్తనీస్ ఇండికా, విశాఖదత్తుడి ముద్రారాక్షసం, పురాణాలు, బౌద్ధ, జైనమత సాహిత్యం, అశోకుడి శాసనాలు, వివిధ కట్టడాలు, నాణేలు మౌర్యుల కాలం నాటి చరిత్రను తెలుసుకోవడానికి ప్రధాన ఆధారాలుగా చెప్పవచ్చు.
రాజకీయ చరిత్ర
చంద్రగుప్త మౌర్యుడు(క్రీ.పూ. 321-298):👉🏻క్రీ.పూ.321 -చంద్రగుప్త మౌర్యుడు చాణుక్యుడు/కౌటిల్యుడు/విష్ణుగుప్తుడు సహాయంతో మగధపై మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు.
👉🏻క్రీ. పూ. 305 -చంద్రగుప్త మౌర్యుడు ఆసియా మైనర్ రాజు సెల్యూకస్ నికేటర్‌ను (అలెగ్జాండర్ యొక్కజనరల్) ఓడించాడు.
👉🏻 క్రీ.పూ. 303 -సెల్యూకస్ నికేటర్‌తో జరిగిన ఒప్పందం ప్రకారం హీరత్, కాబూల్, గాంధార, బెలూచిస్తాన్ ప్రాంతాలను చంద్రగుప్త మౌర్యుడు పొందాడు.
👉🏻దీనికి బదులుగా చంద్రగుప్త మౌర్యుడు 500 ఏనుగులను సెల్యూకస్‌కు ఇచ్చాడు.
👉🏻సెల్యూకస్ నికేటర్ కుమార్తె హేలన్‌ను చంద్రగుప్త మౌర్యుడు వివాహమాడాడు.
👉🏻సెల్యూకస్ మెగస్తనీసును తన రాయబారిగా చంద్రగుప్త మౌర్యుడు ఆస్టానానికి పంపాడు.
👉🏻చంద్రగుప్త మౌర్యుని కాలంలో అతని గుజరాత్ వైశ్రాయి పుష్యగుప్త సుదర్శన సరస్సును త్రవ్వించాడు. (ఈ సరస్సు గురించి రుద్రదాముని యొక్క జునాగఢ్ శాసనంలో పేర్మొనబడింది)
👉🏻క్రీ.వూ. 298లో చంద్రగుప్త మౌర్యుడు తన సామ్రాజ్యమును తన పెద్ద కుమారుడు బిందుసారునికి అప్పగించి కర్ణాటకలోని శ్రావణ బెళగొళకు చేరుకున్నాడు.
👉🏻శ్రావణ బెళగొళలో 'నల్లేఖన” (ఉపవాసంతో మరణించుట) ను పాటించి మరణించాడు. (పరిశిష్ట పర్వన్‌లో పేర్కొనబడింది)
👉🏻చంద్రగుప్త మౌర్యుని జ్ఞాపకార్ధం శ్రావణ బెళగొళలో చంద్రగిరిగుట్ట అను దేవాలయం నిర్మించబడింది.
బిందుసారుడు (క్రీ.పూ. 298-273):
👉🏻క్రీ. పూ. 298-273
👉🏻ఇతని అసలు పేరు - సింహసేన
👉🏻ఇతని బిరుదు - అమిత్రగధ(శత్రు విధ్వంసకుడు)
👉🏻ఇతను అజ్వికా మతాన్ని పోషించాడు.
👉🏻ఇతని ఆస్థానంలో పింగళి వాస్తవ అనే అజ్వికా సన్యాసి ఉండేవాడు.
👉🏻ఇతనే బిందుసారుని తర్వాత అశోకుడు పాలకుడు అవుతాడని పేర్కొన్నాడు. కానీ బిందుసారుడు సుసిమా తన తర్వాత రాజు అవ్వాలని కోరుకునేవాడు.
👉🏻ఇతని ఆస్థానంలో గ్రీకు రాయబారి డెమియోకస్ (డైమోకస్). ఇతన్ని ఆంటియోకస్ పంపాడని స్ట్రాబో పేర్కొన్నాడు.
👉🏻ఇతని ప్రధాని - ఖల్లాటకుడు
👉🏻తనకు మద్యం, అత్తిపళ్లు, ఒక తాత్వికుడిని పంపమని సిరియా రాజును కోరాడు. కానీ సిరియా రాజు ఆంటియోకస్-1 తాత్వికుడిని మినహాయించి మిగతావి పంపాడు.
👉🏻తారానాధ్ అను సన్యాసి బిందుసారుడు 2 సముద్రాల మధ్య (బంగాళాఖాతం, అరేబియా) భూభాగాన్ని ఆక్రమించాడని పేర్కొన్నాడు.
👉🏻క్రీ.పూ. 273లో బిందుసారుని మరణానంతరం 4 సం॥ల పాటు సింహాసనం కొరకు వారసత్వ పోరు జరిగింది.
👉🏻ఈ పోరులో అశోకుడు తన 99 మంది సోదరులను (మొగలి పుత్రతిస్యను మినహాయించి) హతమార్చి సింహాసనం అధిష్టించాడు (రాధాగుప్తుని సహాయంతో).
👉🏻దీని గురించి దివ్య వదనలో ప్రస్తావించబడింది.
👉🏻అశోకుని తల్లి పేరు-సుభద్రాంగి/జనపద కళ్యాణి
అశోకుడు (క్రీ.పూ. 269-232):
👉🏻క్రీ. పూ. 269-261- అశోకుడు చండ శాసనుడి వలె పాలించాడు.
👉🏻క్రీపూ. 261 - కళింగ యుద్ధంలో కళింగాధిపతిని ఓడించాడు. ఈ యుద్ధంలో లక్షమంది శత్రు సైన్యం హతమార్చబడింది. లక్షా 50 వేల మంది యుద్ధ ఖైదీలుగా పట్టుబడ్డారు.
👉🏻ఈ యుద్ధం దయా నది తీరాన జరిగింది.
👉🏻అప్పటి కళింగ రాజు రాజా అనంతన్. అప్పటి కళింగ సైన్యాధిపతి పద్మనాభన్.
👉🏻యుద్ధం తర్వాత యుద్ధభూమిని సందర్శించిన అశోకుడు ఆ భీకర దృశ్యాలను చూసి హింన ద్వారా ఏమీ సాధించలేమని భావించి హింసను త్యజించుటకు నిర్ణయించాడు.
👉🏻ఉపగుప్తని సహాయంతో బౌద్ధ మతాన్ని స్వీకరించాడు.
👉🏻అశోకుడు బౌద్ద మతం స్వీకరించక ముందు శివుడు అతని ఇష్టదైవము అని కల్హణుడు తన 'రాజతరంగిణి'లో పేర్కొన్నాడు. .
👉🏻క్రీపూ. 259 - అశోకుడు అశోక ధర్మాన్ని ప్రకటించాడు.
👉🏻ఇది భారతదేశంలో మొట్టమొదటి లౌకిక మతము. దీని సిద్ధాంతాలు బౌద్ధ మతం, జైన మతం, హిందూ మతం నుంచి తీసుకోబడ్డాయి.
👉🏻అశోకుడు ధర్మవ్యాప్తి కొరకు ధర్మ మహామాత్రికులు, రాజుకల(మొదట్లో వీరు రెవెన్యూ అధికారులు)ను నియమించాడు.
👉🏻క్రీపూ. 251 - ౩వ బౌద్ధ సంగీతిని పాటలీపుత్రంలో నిర్వహించాడు.
👉🏻క్రీపూ. 232 - అశోకుడు మరణించాడు.
👉🏻అశోకుని ప్రధానమంత్రి రాధాగుప్పుడు. .
👉🏻అశోకుని ఆస్థానమునకు తిహాప లేదా తుసప్ప అనే గ్రీకు రాయబారి సందర్శించాడు. తరువాత కాలంలో తుసస్పను గుజరాత్ వైస్రాయిగా నియమించాడు.
👉🏻అశోకుడు, దశరథుడు బీహార్‌లోగల బరాబరా గుహలను (సుదామ గుహలు) అజ్వికా సన్యాసులకు ఇచ్చారు.
👉🏻అశోకుని యొక్క పట్టమహిషి -అసంధిమిత్ర
👉🏻అశోకుని యొక్క 2వ పట్టమహిషి -త్రిశ్య రక్షిత. త్రిశ్య రక్షిత బోధి వృక్షమునకు హాని చేసింది.
👉🏻అశోకుని 3వ భార్య - కారువాకి
👉🏻ఈమె అలహాబాద్ శాసనం లేదా రాణి శాసనంలో పేర్కొనబడింది. కుమారుడు తివారా కూడా ఈ శాసనంలో పేర్కొనబడ్డాడు.
👉🏻అశోకుని 4వ భార్య -పద్మావతి
👉🏻అశోకుని 5వ భార్య -దేవి (సంఘమిత్ర, మహేంద్రలకు తల్లి)
👉🏻అశోకుడు బౌద్ధ మత వ్యాప్తి కొరకై మహేంద్ర, సంఘమిత్రలను శ్రీలంకకు పంపాడు.
👉🏻అశోకుని మరణానంతరం సామ్రాజ్యం రెండుగా చీలిపోయింది.
1) తూర్పు
2) పశ్చిమ
👉🏻తూర్పు ప్రాంతాన్ని దశరథుడు పాలించాడు.
👉🏻పశ్చిమ ప్రాంతాన్ని కునలుడు పాలించాడు.
👉🏻సాంప్రాతి మరలా మౌర్యసామ్రాజ్యమును విలీనం చేశాడు.
👉🏻మౌర్యుల చివరి రాజు బృహద్రధను అతని మంత్రి పుష్యమిత్ర శుంగుడు హత్య చేశాడు. దీంతో మౌర్య సామ్రాజ్యము అంతమై మగథపై శుంగుల వంశం స్థాపించబడింది.
మౌర్యుల పరిపాలన
ప్రాచీన భారతదేశ పరిపాలనలో మౌర్యుల యుగం ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభించింది. వీరి కాలంలో బాగా వ్యవస్థీకృతమైన, కేంద్రీకృత పరిపాలనను ప్రవేశపెట్టారు. చిన్న రాజ్యాల సమాఖ్యలు లేదా గణతంత్ర రాజ్యాలు మౌర్యులకు ముందు భారతీయులకు బాగా పరిచయమున్న పరిపాలన విధానం. అయితే నందుల కాలంలో ఈ విధానం మారింది. వారు మొదటిసారిగా కేంద్రీకృత రాజరికాన్ని ప్రవేశపెట్టారు. మౌర్యుల కాలంలో దీన్ని చాలా పటిష్ఠంగా అమలు చేయగలిగారు.
కేంద్ర పరిపాలన: మౌర్యుల పరిపాలనకు కేంద్రం రాజు. రాజు అధికారాలు విపరీతంగా పెరిగాయి. అయితే రాజు నియంతలాగా వ్యవహరించలేదు. అశోకుడు తన శాసనంలో ''మానవులంతా నా బిడ్డలే" అని ప్రకటించాడు. అశోకుడు ఒక ఆదర్శ రాజరికాన్ని అనుసరించాడు. ''ప్రజల సంతోషంలోనే నా సంతోషం ఇమిడి ఉంది. వారి సంక్షేమంలో నా సంక్షేమం ఉంది. రాజుగా నాకు ఏదైతే సంతోషాన్నిస్తుందో దాన్ని మంచిగా భావించకూడదు. నా ప్రజలకు సంతోషం కలిగించే దాన్నే మంచిగా భావించాలి" అని అశోకుడు పేర్కొన్నాడు. దీన్నిబట్టి మౌర్యుల కాలంలో రాజు ప్రజలను కన్న బిడ్డల్లా చూసుకున్నట్లు తెలుస్తోంది.
రాజు అధికారాలపై నియంత్రణ: రాజును అదుపులో ఉంచడం ద్వారా రాజు నియంతృత్వ పోకడలను అడ్డుకోవడానికి అవకాశం కలిగింది. దీనికి కింది అంశాలు దోహదపడ్డాయి.
(i) రాజు బ్రాహ్మణుల పట్ల గౌరవంతో, భక్తితో వ్యవహరించాలి.
(ii) రాజుకు వ్యతిరేకంగా తిరుగుబాట్లు వస్తాయనే భయం మరో అంశం. అందుకే చంద్రగుప్తుడు కుట్రలకు వ్యతిరేకంగా నిరంతరం జాగ్రత్తగా వ్యవహరించడమే కాకుండా, ప్రతి రాత్రి తన పడకగదిని మార్చేవాడు.
(iii) ఒక చక్రం సహాయంతో బండి నడపడం సాధ్యం కాదని, అలాగే రాజు మంత్రుల సహాయం లేకుండా పరిపాలనను నిర్వహించలేడని కౌటిల్యుడు పేర్కొన్నాడు. విద్యార్థి గురువును, కుమారుడు తండ్రిని, సేవకుడు యజమానిని అనుసరించినట్లు రాజు మంత్రుల సలహాలను పాటించాలని కూడా కౌటిల్యుడు పేర్కొన్నాడు.
మౌర్యుల కాలంలో మంత్రి పరిషత్తు ఉన్నట్లు కౌటిల్యుడి అర్థశాస్త్రం, మెగస్తనీస్ 'ఇండికా' ద్వారా తెలుస్తోంది. మంత్రి పరిషత్తు రాజు నియంతగా మారకుండా ఉండటానికి తోడ్పడింది. దీని అధికారాలు రాజు బలం, మంత్రి పరిషత్తు సభ్యుల శక్తి సామర్థ్యాలమీద ఆధారపడి ఉండేవి. ఉదాహరణకు అశోకుడు ప్రధానమంత్రి రాధాగుప్తుడి సహాయంతో సింహాసనాన్ని అధిష్టించాడు. అశోకుడు తన శాసనాల్లో మంత్రి పరిషత్తు గురించి ప్రస్తావించాడు. రాజు నిర్ణయాలను మంత్రి పరిషత్తు చర్చించవచ్చు, అవసరమైతే సవరణలు చేయవచ్చు. అయితే తుది నిర్ణయం రాజు చేతిలో ఉండేది. అందువల్ల మంత్రి పరిషత్తును సలహా సంఘంగా భావించవచ్చు.
మంత్రి పరిషత్తు సభ్యులను రాజు స్వయంగా ఎన్నుకోవడంవల్ల మంత్రి పరిషత్తు మీద రాజు నియంత్రణ పెరిగినట్లు తెలుస్తోంది. మంత్రి పరిషత్తు సభ్యులకు ఉండవలసిన లక్షణాలను అర్థశాస్త్రం వివరించింది. మంత్రుల పుట్టుక, నిజాయితీ, తేలివితేటలకు ప్రాధాన్యత ఇచ్చింది. కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో మంత్రుల విధేయత, నిజాయితీలను పరీక్షించే విధానాలను పేర్కొన్నాడు. మంత్రి పరిషత్తులో సభ్యుల సంఖ్య కాలాన్ని, అవసరాన్ని బట్టి మారేది. మౌర్యుల కాలంలో ఎక్కువ మందితో కూడిన మంత్రి పరిషత్తు ఉన్నట్లు తెలుస్తోంది.
రాజు యాత్రలు: అశోకుడు సామ్రాజ్యమంతటా స్వయంగా పర్యటనలు చేయడం ద్వారా పరిపాలన వ్యవస్థలో ఒక నూతన ఒరవడిని ప్రవేశపెట్టాడు. వీటిలో ప్రధానమైనవి.
i) ఈ యాత్రల ద్వారా చక్రవర్తికి ప్రజల స్థితిగతులను తెలుసుకునే అవకాశం కలిగింది.
ii) అశోకుడు ఈ యాత్రలను 'ధమ్మ' ప్రచారం కోసం వినియోగించుకున్నాడు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే అశోకుడు, మహామాత్యులు, యుక్త, రజుక అనే అధికారులను సైతం యాత్రలను చేపట్టి ప్రజల స్థితిగతులను తెలుసుకోవాలని ఆదేశించాడు.
iii) ఈ యాత్రలు అధికారుల పనితీరును పర్యవేక్షించడానికే కాకుండా పరిపాలన సామర్థ్యాన్ని పెంపొందించడానికి సహాయపడ్డాయి.
iv) ఈ యాత్రల వల్ల రహదారులు, ప్రసార సాధన వ్యవస్థలు బాగా మెరుగుపడ్డాయి. ఇది ప్రజలు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి సులభంగా వెళ్లడానికి సహాయపడింది.
రాజు తన అధికారులకు, ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉండాలని అర్థశాస్త్రంలో చెప్పారు. రాజు అందుబాటులో లేకుంటే అది గందరగోళానికి దారి తీస్తుందని కౌటిల్యుడు పేర్కొన్నాడు. ఈ సలహాను మౌర్య చక్రవర్తులందరూ పాటించినట్లు తెలుస్తోంది. రాజు శారీరక మర్ధన (Massage) సమయంలో సైతం అందుబాటులో ఉండేవాడనే విషయం 'ఇండికా' గ్రంథం ద్వారా తెలుస్తోంది. తాను ఎక్కడున్నా, భోంచేస్తున్నా, విశ్రాంతి తీసుకుంటున్నా, తోటలో ఉన్నా గూఢచారులు తనను కలుసుకోవచ్చని అశోకుడు ఒక శాసనంలో పేర్కొన్నాడు.
రాజు, మంత్రి పరిషత్తుతోపాటు సన్నిధాత (కోశాధికారి), సమాహార్త మొదలైన ఉద్యోగులు కేంద్ర పరిపాలనలో ప్రముఖ పాత్ర పోషించారు. సన్నిధాత, సమాహార్తలు ఆదాయానికి సంబంధించి గణాంకాలు చూసేవారు. సమాహార్త గుమస్తాల సహాయంతో వివిధరకాల పన్నుల వసూలుకు సంబంధించిన వివరాలను భద్రపరిచేవాడు. పరిపాలనను సాఫీగా నిర్వహించడానికి అధ్యక్షుల (Superintendents) నియంత్రణలో పనిచేసే వేర్వేరు శాఖలను సృష్టించినట్లు అర్థశాస్త్రంలో పేర్కొన్నారు. వర్తక వాణిజ్యాలు, అడవులు, తూనికలు - కొలతలు, గనులు, వ్యవసాయం, పన్నులు, సుంకాలు తదితర అనేక శాఖలు ఉండేవి.
రాష్ట్ర పరిపాలన: పరిపాలన సౌలభ్యం కోసం ఒకేరకమైన పరిపాలన విధానాన్ని ప్రవేశపెట్టడం కోసం సామ్రాజ్యాన్ని రాష్ట్రాలుగా విభజించారు. చంద్రగుప్తుడి కాలంలో నాలుగు రాష్ట్రాలు ఉండగా, అశోకుని కాలంలో వీటి సంఖ్య ఆరుకు పెరిగింది. ఈ రాష్ట్రాలు రాజు కుటుంబీకుల నియంత్రణలో ఉండేవి. వారిని 'కుమార' లేదా 'ఆర్యపుత్ర' అని పిలిచేవారు. 'కుమార' అనేవారు రాజకుమారులు, ఆర్య పుత్రులు రాజు దగ్గర బంధువులు అయి ఉండవచ్చు. వారు సాధారణంగా గవర్నర్లు, రాజ ప్రతినిధులుగా వ్యవహరించారు. రాకుమారులను గవర్నర్లు, రాజ ప్రతినిధులుగా నియమించడం వారికి పరిపాలనలో తగినంత శిక్షణ పొందడానికి ఉపయోగపడింది. అదే సమయంలో రాజ ప్రతినిధిగా పనిచేసే రాకుమారులు రాజుకు వ్యతిరేకంగా తమ స్థానాన్ని పదిలం చేసుకోవడానికి ప్రయత్నించారు. అశోకుడు మొదట్లో పశ్చిమ ఇండియా వైస్రాయిగా, తర్వాత తక్షశిల వైస్రాయిగా తన స్థానాన్ని పదిలం చేసుకుని, తన అన్నను కాదని, తండ్రికి ఇష్టం లేకున్నా సింహాసనాన్ని అధిష్టించాడు.
రాష్ట్ర స్థాయిలో మంత్రి పరిషత్తు: రాష్ట్ర గవర్నర్లు తమ సొంత మంత్రి పరిషత్తును కలిగి ఉండేవారు. రాష్ట్ర మంత్రి పరిషత్తు, కేంద్ర మంత్రి పరిషత్తుతో పోల్చినప్పుడు ఎక్కువ అధికారాలు కలిగి ఉండేది. వారు కొన్ని సందర్భాల్లో రాజును నియంత్రించడానికి ప్రయత్నించేవారు. బిందుసారుడి కాలంలో తక్షశిలలో తిరుగుబాటుకు కారణం స్థానిక మంత్రులపై వ్యతిరేకతే గానీ, రాకుమారుడి మీద వ్యతిరేకత కాదు.
తక్షశిలలో తిరుగుబాటుకు ఇతర కారణాలు
i) గాంధార గణతంత్ర రాజ్యానికి రాజధాని అయిన తక్షశిల మౌర్యుల పూర్వయుగంలో స్వాతంత్య్రాన్ని అనుభవించింది.
ii) ఆ ప్రాంతంలో ప్రజలు పర్షియా దేశస్తులు
iii) మౌర్య చక్రవర్తులు ప్రవేశపెట్టిన కేంద్రీకృత పరిపాలన స్వేచ్ఛను ప్రేమించే ఆ ప్రాంత ప్రజలకు నచ్చలేదు.
iv) మంత్రుల అణచివేత విధానం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది.
తక్షశిల తిరుగుబాటు గురించి తక్షశిల దగ్గరలోని సిర్‌కాప్ అనే ప్రదేశంలో ఒక ఇంటిలో లభ్యమైన అరమైక్ లిపిలో వేయించిన శాసనంలో పేర్కొనిఉంది. ఈ తిరుగుబాటును అణచివేయడానికి బిందుసారుడు అశోకుడిని పంపగా, అశోకుడు దాన్ని విజయవంతంగా అణచివేశాడు.
రాష్ట్ర గవర్నర్లు, వైస్రాయిలకు కొంతమంది అధికారులను నియమించుకునే అధికారం ఉంది. అయిదు సంవత్సరాలకు ఒకసారి యాత్రలు చేపట్టే మహామాత్యుల్లో కొందరిని రాజు నియమించగా, మరికొందరిని వైస్రాయిలు నియమించేవారు.
మహామాత్యులకు పరిపాలనలో వివిధ అంశాలపై నియంత్రణ ఉండటంతో వారికి కీలకస్థానం ఇచ్చారు. వారు సాధారణ పరిపాలకులుగా, న్యాయ అధికారులుగా వ్యవహరించేవారు. అశోకుడు రాజ్యానికి వచ్చిన 14వ సంవత్సంలో ధర్మ మహామాత్యులు అనే కొత్త అధికారులను నియమించారు. ధమ్మప్రచారం చేయడం వీరి బాధ్యత.
రాష్ట్రాలను ఆహారాలనే జిల్లాలుగా విభజించారు. వీటిని కొంతమంది అధికారుల బృందం పరిపాలించేది. ఆహారానికి అధిపతి ప్రాదేశిక. ఇతడు ప్రస్తుత జిల్లా కలెక్టరుకు సమానం. ఇతడి విధులు కిందివిధంగా ఉన్నాయి.
i) ఇతడు జిల్లా సాధారణ పరిపాలనకు బాధ్యుడు
ii) జిల్లాను క్రమం తప్పకుండా సందర్శించి, జిల్లా అధికారులు, గ్రామ అధికారుల పనులను పర్యవేక్షించి, ముఖ్య కలెక్టర్ అయిన సమాహార్తకు నివేదికలు పంపాలి.
iii) రజుక, రెవెన్యూ అధికారులను నియంత్రించాలి.
రెవెన్యూ వసూలును పర్యవేక్షించడం, గ్రామీణ ప్రాంతాల్లో, జిల్లాలోని పట్టణాల్లో శాంతిభద్రతలు కాపాడటం, అయిదు సంవత్సరాలకొకసారి జిల్లాలో పర్యటించి, తమ నియంత్రణలోని రజుక, యుక్త, ఉపయుక్త తదితర అధికారుల పనితీరును పర్యవేక్షించడం ప్రాదేశిక అనే అధికారుల ప్రధాన బాధ్యత.
అశోకుడు ఒక శాసనంలో పూర్తిగా రజుక విధులను గురించి పేర్కొన్నాడు. దీన్నిబట్టి వారు జిల్లాలోని రెవెన్యూ పరిపాలనలో కీలకపాత్ర పోషించినట్లు తెలుస్తోంది. వారు కింది అధికారాలను కలిగి ఉండేవారు.
i) బహుమతులు ఇవ్వడానికి, శిక్షలు విధించడానికి అధికారం ఉండేది.
ii) వ్యవసాయం, భూతగాదాలకు సంబంధించిన సమస్యలపై నియంత్రణ కలిగి ఉండేవారు.
iii) భూమి సర్వే చేయడానికి, భూమి శిస్తు నిర్ణయించడానికి అధికారం వారికి ఉండేది.
జిల్లా పరిపాలనలో ఇతర ముఖ్య అధికారులు. యుక్త, ఉపయుక్తలు. యుక్త కిందిస్థాయి అధికారి. యుక్త అతడి సహాయకుడైన ఉపయుక్త జిల్లా కోశాధికారులు అయి ఉండవచ్చు.
ముఖ్య విధులు: జిల్లాలో రాజుకు సంబంధించిన భూములను చూసుకోవడం, రెవెన్యూ వసూలు, దానికి సంబంధించిన వివరాలను నమోదు చేయడం.
గ్రామం, జిల్లా మధ్య పరిపాలన విభాగం: మౌర్యుల కాలంలో గ్రామం, జిల్లా మధ్య ఒక మధ్యస్థాయి పరిపాలన విభాగం ఉండటం ఆసక్తికరమైన విషయం. అయిదు గ్రామాలకు ఒక విభాగం ఉండేది. గోప, స్థనిక అనే అధికారులు ఈ విభాగం బాధ్యతలను నిర్వహించేవారు. గోప అనే అధికారి గణాంక అధికారి. గ్రామ సరిహద్దులను నిర్ణయించడం, వివిధ రకాల భూములు, భవనాలు, బహుమానాలు, భూమి శిస్తు మినహాయింపు మొదలైన వాటిని నమోదు చేయడం ఇతని ప్రధాన విధులు. ఇతడు ప్రతి గ్రామానికి సంబంధించిన జనాభా లెక్కలు నమోదు చేసేవాడు. ఇందులో పన్ను చెల్లించే సామర్థ్యం, గ్రామ ప్రజల వృత్తులు, వారి వయసు, ఆదాయ, వ్యయాలు, పశు సంపద వివరాలను పొందుపరచేవాడు.
స్థనిక అనే అధికారి ముఖ్య విధి పన్నులు వసూలు చేయడం. ఇతడు ప్రాదేశిక అనే అధికారి సూచనల మేరకు పనిచేసేవాడు. గోప, స్థనికల పనితీరును సీనియర్ అధికారులు పర్యవేక్షించేవారు. స్థనిక ప్రస్తుత సహాయ కలెక్టర్‌తో సమానమైన హోదా కలిగి ఉండవచ్చు.
గ్రామ పరిపాలన: పరిపాలన వ్యవస్థలో గ్రామం చివరి విభాగం. గ్రామానికి అధిపతి గ్రామణి. ప్రతి గ్రామంలో గ్రామణితోపాటు మరికొంతమంది అధికారులు ఉండేవారు. వారిలో గణాంక అధికారి ఒకడు. ఇతడు గ్రామ సరిహద్దులు, భూమిని అమ్మడం, కొనడం, జంతు సంపద, జనాభా లెక్కలు మొదలైన రికార్డులను నిర్వహించేవాడు. మరో అధికారి భూమిశిస్తు వసూలు చేసేవాడు. ఈ అధికారులంతా గోప అధీనంలో ఉండేవారు. గ్రామాధికారులకు జీతానికి బదులు భూదానాలు లేదా పన్ను మినహాయింపు ఇచ్చేవారు. అధికారులు ఈ భూముల నుంచి వచ్చే పంటను మాత్రమే అనుభవించవచ్చు. వీరు భూమికి యజమానులు కారు. వారికి ఈ భూములు అమ్మడానికి లేదా తాకట్టు పెట్టడానికి వీలులేదు.
నగరపాలన: కౌటిల్యుడి అర్థశాస్త్రం, మెగస్తనీస్ రచించిన 'ఇండికా' గ్రంథాలు నగర పరిపాలనకు సంబంధించి ఆసక్తికరమైన సమాచారాన్ని తెలియజేస్తున్నాయి. మౌర్యుల రాజధాని అయిన పాటలీపుత్రం, ఇతర పెద్ద పట్టణాల పరిపాలనను అధికారులు నిర్వహించేవారు. పాటలీపుత్రం నగరాన్ని నాలుగు వార్డులుగా విభజించి ఒక్కో వార్డును స్థనిక అనే అధికారి అధీనంలో ఉంచినట్లు అర్థశాస్త్రం ద్వారా తెలుస్తోంది. ఇతడికి సహాయపడటానికి గోప అనే అధికారి ఉండేవాడు. నగరంలోని అనేక గృహాల పర్యవేక్షణ బాధ్యతలను గోప అనే అధికారులకు ఇచ్చారు. నగరిక అనే అధికారి నగర పాలనకు అధిపతి. నగరపాలనకోసం నియమించిన అధికారులు నగరంలోని స్త్రీ, పురుషులకు సంబంధించిన పూర్తి వివరాలను నమోదు చేయాలి.
మెగస్తనీస్ రచించిన ఇండికా గ్రంథంలో నగర పరిపాలనకు సంబంధించి ఆసక్తికరమైన, అదనపు సమాచారం ఉంది. పాటలీపుత్రం పరిపాలనను 30 మంది సభ్యులతో కూడిన ఒక కమిషన్‌కు అప్పగించారు. వీరిని అయిదుగురితో కూడిన 6 బోర్డులుగా విభజించారు. ప్రతిబోర్డుకు కొన్ని శాఖలను కేటాయించారు. దాంతో పాటు కమిషన్‌లోని సభ్యులందరూ ప్రజా సంక్షేమానికి సంబంధించిన రోడ్ల మరమ్మతులు, మార్కెట్ల నిర్వహణ, దేవాలయాలు, ఓడరేవులు, ధరలను అదుపు చేయడం మొదలైన విషయాలపై చర్చించేవారు.
6 బోర్డుల శాఖపరమైన విధులు ఇలా ఉన్నాయి..
i) మొదటి బోర్డు: ఇది పరిశ్రమలు, చేతివృత్తులను పర్యవేక్షించేది.
ii) రెండోబోర్డు: ఇది నగరాన్ని సందర్శించే విదేశీయులు, యాత్రికుల పట్ల శ్రద్ధ వహిస్తూ వారి సంక్షేమం కోసం పనిచేసేది. ఎవరైనా విదేశీ యాత్రికుడు మరణిస్తే, మరణించిన వ్యక్తి ఆస్తులను అతడి బంధువులకు జాగ్రత్తగా అప్పగించడం ఈ బోర్డు బాధ్యత.
మౌర్య సామ్రాజ్యం విదేశీ రాజ్యాలతో నిరంతరం సంబంధాలు కలిగి ఉండేదని, వ్యాపారరీత్యా అనేకమంది విదేశీయులు పాటలీపుత్ర నగరాన్ని సందర్శించేవారని చెప్పడానికి ఈ బోర్డే సాక్ష్యం.
iii) మూడో బోర్డు: ఈ బోర్డు జనన మరణాల నమోదును, పన్నుల విధింపు అవసరమైన సమాచారాన్ని పర్యవేక్షిస్తుంది.
iv) నాలుగో బోర్డు: వస్తువుల అమ్మకాన్ని నియంత్రించడం, తూనికలు, కొలతలను పరీక్షించడం, వ్యాపారులకు లైసెన్సులు జారీచేయడం ఈ బోర్డు ప్రధాన బాధ్యత.
v) అయిదో బోర్డు: తయారైన వస్తువులను పర్యవేక్షించడంతోపాటు కల్తీని నివారించడం ఈ బోర్డు ముఖ్యవిధి.
vi) ఆరో బోర్డు: నగరంలో అమ్మే అన్ని వస్తువులపై 1/10వ వంతు పన్ను వసూలు చేయడం ఈ బోర్డు ముఖ్యవిధి.
ఈ బోర్డులు చేపట్టిన శాఖాపరమైన విధులను జాగ్రత్తగా గమనిస్తే పాటలీపుత్రంలో చక్కగా వ్యవస్థీకృతమైన పరిపాలన అమల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఉజ్జయిని, తక్షశిల, మొదలైన ఇతర పెద్ద పట్టణాల్లో కూడా ఇదేవిధమైన పరిపాలన విధానం ఉండేదని చెప్పవచ్చు.
న్యాయపరిపాలన: చక్రవర్తి న్యాయ పరిపాలనకు అధిపతి. నగరాల్లో, ఇతర రాష్ట్రాల్లో న్యాయ పరిపాలనకోసం మహత్తరులు, రజుక అనే అధికారుల ఆధ్వర్యంలో స్పెషల్ ట్రైబ్యునళ్లు ఉండేవి. విదేశీయులకు సంబంధించిన కేసులను పరిష్కరించడానికి రాజు ప్రత్యేక న్యాయమూర్తులను నియమించాడు. గ్రామణి, గ్రామంలోని ఇతర పెద్దలు గ్రామాల్లోని కేసులను పరిష్కరించేవారు. రజుక అనే అధికారులకు న్యాయ పరిపాలనలో తగినంత స్వేచ్ఛను ఇవ్వడం ద్వారా అశోకుడు న్యాయపరిపాలనను సంస్కరించాడు. రెవెన్యూ విషయాలకు సంబంధించిన కేసులను పరిష్కరించే అధికారం వారికి ఇచ్చాడు.
రాష్ట్రాల్లో న్యాయ పరిపాలనను చక్కదిద్దడానికి సమర్థులైన న్యాయాధికారులను మూడేళ్లు లేదా అయిదేళ్లకోసారి రొటేషన్ పద్ధతిలో పంపేవారు. నేర చట్టం కఠినంగా ఉండేది. శిక్షలు కఠినంగా ఉంటే నేరాలు తగ్గుతాయనే సిద్ధాంతాన్ని మౌర్య చక్రవర్తులు బలంగా నమ్మారు. వివిధ నేరాలకు శిక్షలు చిన్న అపరాధ రుసుం మొదలు అంగవిచ్ఛేదనం, ఉరిశిక్ష వరకు ఉండేవి.
ఉద్దేశపూర్వకంగా పవిత్ర వృక్షాలను నాశనం చేయడం, నగరంలో అమ్మే వస్తువులపై చెల్లించవలసిన పన్నులను చెల్లించకపోవడం, రాజు వద్ద పనిచేసే చేతివృత్తుల వారికి హానిచేయడం, ఆనకట్టలను నాశనం చేయడం 40 పణాలను దొంగిలించడం మొదలైన వాటిని తీవ్రమైన నేరాలుగా పరిగణించేవారు. బ్రాహ్మణులు, స్త్రీలు, చిన్నపిల్లలు, వృద్ధులు మొదలైన వారికి కఠిన శిక్షల నుంచి మినహాయింపు ఉండేది.
అశోకుడు బౌద్ధమతాన్ని అవలంభించినా, మరణశిక్షను రద్దుచేయలేదు. అయితే మరణశిక్ష విధించిన వారికి మూడురోజుల సమయాన్ని ఇచ్చేవారు. ఈ కాలంలో నేరస్థుడు న్యాయమూర్తికి చివరి అప్పీలు చేసుకునే అవకాశాన్ని కల్పించారు.
సైనిక వ్యవస్థ: మౌర్యుల సైనిక వ్యవస్థ గురించి కౌటిల్యుడు, మెగస్తనీస్ తగినంత సమాచారాన్ని ఇచ్చారు. మౌర్యుల సైన్యంలో కాల్బలం, అశ్వికదళం, గజదళం, రథాలు ఉండేవి. మౌర్యులు సిద్ధసైన్యాన్ని పోషించారు. సైనికులకు రాజ్యమే జీతాలు చెల్లించి, వారికి కావలసిన సదుపాయాలను కల్పించింది. మౌర్యులు సైన్యంలో ఇండో-ఆర్యుల సంప్రదాయమైన నాలుగు విభాగాలను నిర్వహించారు. సైనిక పరిపాలన 30 మంది సభ్యులతో కూడిన ఒక కమిషన్ ఆధ్వర్యంలో ఉండేది. ఈ కమిషన్‌ను అయిదుగురు సభ్యులతో కూడిన 6 బోర్డులుగా విభజించారు. ఈ బోర్డులు కాల్బలం, అశ్వికదళం, గజదళం, రథాలు, నౌకాదళం, రవాణాలను నియంత్రించేవి. సైన్యానికి అవసరమైన ఆయుధాలను తగినంతగా సమకూర్చేవారు. సైన్యానికి కావలసిన శిక్షణ, క్రమశిక్షణ పట్ల మౌర్య చక్రవర్తులు ప్రత్యేక శ్రద్ధ వహించారు.
యుద్ధసమయంలో గాయపడిన సైనికులకు సహాయం చేయడానికి డాక్టర్లు, మందులు, నర్సులు, ఆహారంతో కూడిన అత్యవసర చికిత్సా విభాగం నిరంతరం శ్రమించేది.
మెగస్తనీస్ ఇచ్చిన సమాచారాన్ని బట్టి సమాజంలో రైతుల తర్వాత సైనికులు ఎక్కువ సంఖ్యలో ఉన్నట్లు తెలుస్తోంది. వారు రాజ్యంనుంచి క్రమం తప్పకుండా జీతాలు పొందేవారు- స్వేచ్ఛ, సుఖంతో కూడిన జీవితాన్ని అనుభవించారు. సైనిక విధులు మాత్రమే నిర్వహించేవారు. యుద్ధంలేని సమయంలో సంతోషకరమైన జీవితాన్ని గడిపారు. యుద్ధసమయంలో వారి గుర్రాలను చూసుకోవడానికి ఆయుధాలను శుభ్రం చేయడానికి, ఏనుగులను నడపడానికి, రథాలు తయారు చేయడానికి, వాటిని నడపటానికి అవసరమైన సేవకులు ఉండేవారు.
మౌర్యుల కాలంనాటి ఆర్థిక పరిస్థితులు
1) వ్యవసాయం: మలివేదకాలంలో అమల్లోకి వచ్చిన వ్యవసాయం నందులు, మౌర్యుల కాలంలో బాగా అభివృద్ది చెందింది. మౌర్యుల కాలంలో వ్యవసాయం కింది విధానాల చుట్టూ కేంద్రీకృతమై ఉండేది.i) గంగా హరివాణంలోని సారవంతమైన ఒండ్రు నేలను వినియోగించుకోవడం
ii) వృథాగా ఉన్న భూమిని వ్యవసాయం కిందికి తీసుకురావాలనే కాంక్ష
iii) నీటిపారుదల సౌకర్యాలను మెరుగుపరచడం
క్రీ.పూ. 3వ శతాబ్దం నాటికి ఉత్తర భారతదేశ ఆర్థిక వ్యవస్థ వ్యవసాయంపై ఎక్కువగా ఆధారపడింది. వ్యవసాయం, నీటిపారుదల సౌకర్యాలను మెరుగుపరచడం పట్ల మౌర్యులు ప్రత్యేక శ్రద్ధ చూపించారు. నీటిపారుదల సౌకర్యాలను అభివృద్ధి చేయడానికి మౌర్యులు తీసుకున్న చర్యలను కౌటిల్యుడు, మెగస్తనీస్ ప్రత్యేకంగా పేర్కొన్నారు. నీటిపారుదల కింద ఉన్న భూమిని కొలవడం, కాలువలను నిర్వహించడం, నీటి సరఫరాను నియంత్రించడం, నీటి పన్ను వసూలు చేయడం మొదలైన బాధ్యతలను నీటిపారుదల శాఖకు అప్పగించారు.
కౌటిల్యుడి ప్రకారం నీటిపన్ను మొత్తం ఉత్పత్తిలో 1/5 నుంచి 1/3 వరకు ఉండేది. రుద్రదాముని జునాగడ్ శాసనం ద్వారా మౌర్యులు కథియవార్ లాంటి మారుమూల రాష్ట్రంలో కూడా నీటిపారుదల నిర్వహణకు ఎక్కువ కృషిచేసినట్లు తెలుస్తోంది. చంద్రగుప్తుడి గవర్నర్ అయిన పుష్యగుప్తుడు సుదర్శన సరస్సును నిర్మించినట్లు ఈ శాసనం తెలియజేస్తోంది. అశోకుడి కాలంలో ఈ సరస్సు నుంచి అనేక కాలువల ద్వారా నీటిని సరఫరా చేసినట్లు కూడా తెలుస్తోంది. ఈ సరస్సుకు శకరాజు రుద్రదాముడు, గుప్తరాజు స్కందగుప్తుడు మరమ్మత్తులు చేశారు. దీన్నిబట్టి పశ్చిమ ఇండియాలో, ముఖ్యంగా కథియవార్ ప్రాంతంలో వ్యవసాయ అభివృద్ధిలో ఈ సరస్సు ప్రాధాన్యతను అర్థం చేసుకోవచ్చు.
మౌర్య చక్రవర్తులు బంజరు భూమిని వ్యవసాయం కిందకు తీసుకురావడానికి ప్రత్యేక ఆసక్తిని ప్రదర్శించారు. అడవులను నరికించి, కొత్త భూభాగాలలో ప్రజలు స్థిరపడడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జనాభా ఎక్కువగా ఉండే ప్రాంతాల నుంచి వచ్చిన శూద్రులను, కళింగ యుద్ధంలో యుద్ధ ఖైదీలుగా తీసుకువచ్చిన ఒక లక్ష యాభైవేల మందిని అటవీభూములను వ్యవసాయ యోగ్యంగా మార్చే పనిలో వినియోగించారు. వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడమే వీరిపని. ప్రభుత్వం మిగులు ఉత్పత్తిని తీసుకునేది. రాజే సామ్రాజ్యంలోని మొత్తంభూమికి యజమాని. అయితే ఈ కాలంలో కొద్దిభూమి వ్యక్తిగత యాజమాన్యం కింద కూడా ఉండేది. భూములను రైతులే స్వయంగా పండించడం లేదా కూలీలతో పండించడం జరిగేది. భూసారం, పంట దిగుబడి, పండించిన పంట రకాన్ని బట్టి భూమి శిస్తు నిర్ణయించేవారు. రాజు పండిన పంటలో 1/4 వ వంతు శిస్తుగా స్వీకరించేవాడు. కొన్ని సందర్భాల్లో రాజు 1/6వ వంతు శిస్తుగా వసూలు చేసే వాడు. రైతులు భూమి శిస్తును నేరుగా రాజాధికారాలకు చెల్లించేవారు.
సాగుకింద ఉన్న భూమి, రాజుకు చెల్లించవలసిన శిస్తు మొదలైన సమాచారాన్ని తెలుసుకోవడం కోసం రజుక లేదా రజ్జుగాహక అనే ఉద్యోగిని నియమించారు. రాజులు బ్రాహ్మణులు, మత సంస్థల నిర్వహణ కోసం గ్రామాలను దానంగా ఇచ్చేవారు. వీటిని భోగ గ్రామాలు అనేవారు. ఈ గ్రామాలకు పన్ను చెల్లింపు నుంచి మినహాయింపు లేదు. అయితే దానం పొందిన వ్యక్తి ఆ గ్రామాల నుంచి వచ్చే ఆదాయాన్ని అనుభవించవచ్చు. అవసరమైనపుడు రాజు రైతులను ఎక్కువ పండించాల్సిందిగా బలవంత పెట్టినట్లు, మత సంస్థలకు ఇచ్చిన భూమిని వెనక్కు తీసుకున్నట్లు కౌటిల్యుని అర్థశాస్త్రం ద్వారా తెలుస్తోంది.
2) వర్తక వాణిజ్యాలు: మౌర్యుల పూర్వ యుగంలో వర్తక వాణిజ్యాలు కొంత అభివృద్ది చెందాయి. మౌర్యుల కాలంలో ఈ రంగంలో విశేష అభివృద్ధి జరిగింది. దీనికి ఈ కింది అంశాలు దోహదపడ్డాయి.
i) మౌర్యులు మొట్టమొదటి సారిగా భారతదేశంలో రాజకీయ ఐక్యతను సాధించారు.
ii) మౌర్యుల కాలంలో శాంతియుత పరిస్థితులను నెలకొల్పారు.
iii) మౌర్య సామ్రాజ్యంలో ఒకేరకమైన తూనికలు-కొలతలు, నాణేలు ప్రవేశపెట్టారు.
iv) మౌర్య చక్రవర్తులు చేతివృత్తుల వారికి రక్షణ కల్పించారు. వారి పని సామర్థ్యాన్ని బట్టి జీతాలు నిర్ణయించారు. వారికి ప్రోత్సాహకాలు ఇచ్చారు.
v) వ్యవసాయ మిగులు రాజు చేతిలో ఉండేది.
vi) కేంద్రీకృత పరిపాలన, మెరుగైన రవాణా, ప్రసార సాధనాలు వర్తక వాణిజ్యాల అభివృద్ధికి తోడ్పడ్డాయి.
చేతివృత్తుల వారు మౌర్యుల కాలంలో శ్రేణులుగా ఏర్పడినట్లు స్వదేశీ, విదేశీ రచనల ద్వారా తెలుస్తోంది. మౌర్య చక్రవర్తులు వ్యాపార నియమాలను జాగ్రత్తగా రూపొందించి అమలు చేశారు. వస్తువుల అమ్మకాన్ని రాజ్యమే పర్యవేక్షించేది. ఒక వస్తువు ధర నిర్ణయించేటప్పుడు డిమాండు, సప్త్లె, ధరల పెరుగుదల, తగ్గుదల, రవాణా సాధనాలు, వస్తువు ఉత్పత్తికి అయిన ఖర్చు మొదలైన వాటిని పరిగణనలోకి తీసుకునే వారు. వ్యాపారస్థుడికి అందవలసిన లాభాన్ని నిర్ణయించి, మిగిలిన లాభాన్ని ఖజానాకు పంపేవారు. ఈ కాలంలో భూమార్గం, సముద్ర మార్గం ద్వారా వ్యాపారం జరిగేది. తక్షశిల నుంచి పాటలీపుత్రం వరకూ గంగా హరివాణం ద్వారా వెళ్లే మార్గం భూమార్గాల్లో ప్రధానమైంది.
ప్లిని తాను రచించిన 'హిస్టోరియ నేచురాలిస్' అనే గ్రంథంలో ఈ మార్గాన్ని గురించి ప్రస్తావించాడు. సముద్రమార్గం ద్వారా వ్యాపారం అభివృద్ధి చెందడానికి ముందు పశ్చిమ దేశాలతో వ్యాపారం చేయడానికి ఇదే ప్రధానమార్గం. జాతక కథల్లో ఇచ్చిన సమాచారాన్ని బట్టి మౌర్యుల కాలంలో సముద్రమార్గం ద్వారా వ్యాపారం బాగా అభివృద్ధి చెందినట్లు తెలుస్తోంది. కాకులు భూభాగం దిశగా ప్రయాణిస్తాయి కాబట్టి సముద్ర మార్గం ద్వారా వ్యాపారం చేసే వర్తకులు, నావికులు తమ ఓడలకు ముందు కాకులను దారి తెలుసుకోవడానికి పైలట్లుగా పంపేవారు. ఈ పద్ధతిని భారతీయులు బాబిలోనియన్ల నుంచి గ్రహించినట్లు తెలుస్తోంది.
మౌర్యుల కాలంలో భారతదేశం నుంచి పశ్చిమదేశాలకు ఎగుమతి చేసిన వస్తువుల్లో ప్రధానమైనవి- మిరియాలు, దాల్చినచెక్క, సుగంధ ద్రవ్యాలు, ముత్యాలు, వజ్రాలు, నూలుబట్టలు, నెమళ్లు, దంతపు వస్తువులు మొదలైనవి. పశ్చిమదేశాల నుంచి ప్రధాన దిగుమతులు- గుర్రాలు, పగడాలు, గాజులు మొదలైనవి.
మౌర్యులకు తూర్పు రాజ్యాలతో, ఉత్తర బర్మా తీర ప్రాంతంతో వర్తక సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. తామ్లుక్ (తామ్రలిప్తి), బర్యాగజ ( బ్రోచ్), సోర్‌పరాకే (సోపారా) మొదలైనవి ఆ కాలం నాటి ప్రధాన ఓడరేవులు. ఆ కాలంలో భారతదేశం ఆగ్నేయ ఆసియా, పశ్చిమ దేశాలతో సంబంధం కలిగి ఉండేది. ఇవి ప్రధానంగా వ్యాపార సంబంధాలు అయినప్పటికీ, దీని ద్వారా భారతదేశ సంస్కృతి ఆ దేశాలకు వ్యాప్తి చెందడానికి, అక్కడి సంస్కృతి భారతదేశంలో వ్యాప్తి చెందడానికి దోహదపడింది.
మౌర్యుల పరిపాలనలో కొన్ని ప్రధాన అంశాలు:
గూఢచారి వ్యవస్థ:మౌర్యుల కాలంలో పటిష్ఠమైన గూఢచారి వ్యవస్థ ఉండేది. రాజ్యంలో జరుగుతున్న విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి రాజు తరచుగా గూఢచారులను వినియోగించాడని, గూఢచారులు గృహస్తులు, వ్యాపారులు, రుషులు, విద్యార్థులు, స్త్రీలు, వ్యభిచారుల వేషంలో పనిచేయాలని అర్థశాస్త్రంలో పేర్కొన్నారు. రాజులు రాష్ట్రాల్లో నియమించిన వార్తాహరుల నుంచి రహస్య నివేదికలను పొందేవారు. అశోకుడి శాసనాలు, అర్థశాస్త్రంలో పేర్కొన్న పులిసాని, ప్రతివేదిక, చరాస్, గూఢ పురుష మొదలైన వారిని గూఢచారులుగా పేర్కొనవచ్చు.
జనాభా లెక్కల విధానం: మౌర్యులు ప్రతి సంవత్సరం జనాభా లెక్కలు సేకరించారు. మౌర్యులకు ముందు ఏ దేశంలోనూ శాస్త్రీయ పద్ధతిలో జనాభా లెక్కలు సేకరించలేదు. ఈ జనాభా లెక్కలను రాజకీయ, ఆర్థిక, సైనిక అవసరాల కోసం వినియోగించేవారు. కుటుంబంలోని ప్రతివ్యక్తి వయసు, లింగం, కులం, ఆదాయం, వ్యయం, వృత్తి మొదలైన వివరాలను నమోదు చేసేవారు. ఆధునిక కాలంలోలాగా పదేళ్లకోసారి కాకుండా, ప్రతి ఏడాది జనాభాలెక్కలు సేకరించడం మౌర్యుల గొప్పదనానికి నిదర్శనం.
జీతాలు, ప్రజాపనులు: సామ్రాజ్యంలోని వనరుల్లో ఎక్కువ భాగం ఉద్యోగుల జీతాలు; ప్రజాపనుల కోసం వినియోగించేవారు. ఉన్నతాధికారులకు పెద్ద మొత్తంలో జీతాలు చెల్లించడంవల్ల ఖజానాపై భారం అధికంగా పడేది. పురోహితుడు, సేనాపతి 48000 పణాలు, కోశాధికారి, ముఖ్య కలెక్టర్ 24,000 పణాలు, మంత్రులు 12,000 పణాలు ఏడాది జీతంగా పొందేవారు. ప్రజాపనుల కింద ముఖ్యంగా రోడ్ల నిర్మాణం, నిర్వహణ, బావులు, విశ్రాంతి గృహాలు, నీటిపారుదల పనులు చేపట్టేవారు. అలాగే సైన్యం నిర్వహణ, గనుల నిర్వహణ, ప్రభుత్వం చేపట్టే ఉత్పత్తులు, పండితులకు, మత సంస్థలకు రాజులు ఇచ్చే దానాలు, ఇతర ప్రజాపనుల కిందికి వస్తాయి. మౌర్యుల పరిపాలనలో ముఖ్యలక్షణం- అధికారులు ప్రభుత్వానికి చేసిన సేవలకు బదులుగా వారికి భూమిని ఇచ్చే సంప్రదాయం వీరి కాలంలో లేదు.
మౌర్యుల పరిపాలనలో బలాలు, బలహీనతలు:
బలాలు:
i) పౌర, సైనిక శాఖలను వేరు చేయడం.
ii) పటిష్ఠమైన జనాబా లెక్కల సేకరణ విధానాన్ని ప్రవేశ పెట్టడం.
iii) అభివృద్ధి చెందిన గూఢచారి వ్యవస్థ
iv) వ్యవస్థీకృతమైన పన్నుల విధానం, అభివృద్ధి చెందిన వ్యవసాయ, ద్రవ్య ఆర్థిక వ్యవస్థ, ఉద్యోగులకు జీతాలు నగదు రూపంలో చెల్లించడం, అభివృద్ధి చెందిన శ్రేణి విధానం మొదలైనవి మౌర్యుల పరిపాలన ప్రధాన లక్షణాలు.
బలహీనతలు:
i) నేర చట్టం చాలా కఠినంగా ఉండటం.
ii) గూఢచారులు రాజుకు కళ్లు, చెవుల్లా ఉండేవారు. అందువల్ల ప్రజలు రాజుకంటే గూఢచారులను చూసి ఎక్కువగా భయపడేవారు.
iii) కేంద్రీకృత పరిపాలన వ్యవస్థ.
iv) మౌర్యులు ఉద్యోగస్వామ్య వ్యవస్థను కలిగి ఉండేవారు. దీనివల్ల వివిధ పథకాలను రూపొందించి, అమలు చేయడంలో ఆలస్యం జరిగేది.
No comments:
Post a Comment