మగధ సామ్రాజ్యం - GNANA SAMHITHA

Breaking

Post Top Ad

Monday, March 17, 2025

మగధ సామ్రాజ్యం

మగధ సామ్రాజ్యం

👉🏻భారతదేశంలో మగధ తొలి సామ్రాజ్యంగా ఆవిర్భవించింది.
👉🏻షోడశ మహాజనపథాల్లో ఒకటైన మగధ మిగిలిన జనపథాలను జయించి విశాల సామ్రాజ్యంగా విస్తరించింది.
👉🏻దీని రాజధానులు రాజగృహం (గిరివ్రజం), వైశాలి, పాటలీపుత్ర.
👉🏻మగధను పాలించిన వంశాలు
1. హర్యంక వంశం
2. శైశునాగ వంశం
3. నంద వంశం
👉🏻మగధరాజ వంశాల చరిత్ర పురాణాల నుంచి, జైన, బౌద్ధ వాఙ్మయాల నుంచి, గ్రీకు రచనల నుంచి లభిస్తున్నాయి. ఈ వంశస్థులు 138 సంవత్సరాలు పాలించారు.

1. హర్యంక వంశం

బింబిసారుడు: 

         క్రీ.పూ. 6వ శతాబ్దంలో మగధ సింహాసనాన్ని అధిష్ఠించిన తొలి చక్రవర్తి బింబిసారుడు. బుద్ధుడికి సమకాలీకుడు. ఇతడు బౌద్ధమతాన్ని పోషించినప్పటికీ బౌద్ధ గ్రంథాల్లో ఇతడి వంశ చరిత్రకు సంబంధించిన చర్చ లేదు. ఈ గ్రంథాలు బింబిసారుడ్ని 'సేనియ (సైన్యం ఉన్నవాడు)' అని పేర్కొన్నాయి. దీన్ని బట్టి శాశ్వత సైన్యం ఉన్న మొదటి రాజు ఇతడే అయి ఉండొచ్చని అర్థమవుతుంది.
* వివాహ సంబంధాలు, దండయాత్రలు, దౌత్యనీతి ద్వారా రాజ్య విస్తరణ విధానానికి నాంది పలికాడు. కోసల రాజైన ప్రసేనజిత్తుడి సోదరిని వివాహమాడి పదివేలకు పైగా ఆదాయం వచ్చే 'కాశీ' గ్రామాన్ని కట్నంగా పొందాడు.
* లిచ్ఛవుల నాయకుడైన చేతకుడి కుమార్తె  'చెల్లన'ను, అలాగే పంజాబ్ ప్రాంతంలోని మద్ర దేశాధిపతి కుమార్తె 'ఖేమ'ను వివాహమాడాడు. ఇలా బింబిసారుడి వివాహ సంబంధాలు ఆనాటి రాజవంశాల మధ్య సఖ్యతతో పాటు, బింబిసారుడి ఆధిక్యతను పెంచాయి. బింబిసారుడు అవంతి రాజ్యాధిపతియైన ప్రద్యోధనుడితో కూడా మైత్రిని పెంచుకుని, అతడి ఆరోగ్యాన్ని బాగుచేయడానికి తన ఆస్థాన వైద్యుడైన జీవకుడిని ఉజ్జయినికి పంపాడు. బింబిసారుడు వైరం పెంచుకున్న ఒకే ఒక్క మహాజన పదం అంగరాజ్యం. అంగరాజైన బ్రహ్మదత్తుడిని ఓడించి దాన్ని మగధలో విలీనం చేశాడు. ఇతడి రాజధాని గిరివ్రజం (రాజగృహ). మంత్రుల నియామకం, పనితీరు, అధికార విధి నిర్వహణ, గ్రామ పరిపాలన, పంట భూముల సర్వే, పన్నుల వసూలు లాంటి విషయాల్లో శ్రద్ధ వహించి బింబిసారుడు మంచి పాలనను అందించాడు.

అజాతశత్రువు

        కోసల - మగధ రాజ్యాల మధ్య ఘర్షణ అజాతశత్రువు కాలంలో మొదలైంది. ఇతడు పదవీకాంక్షతో తన తండ్రినే బంధించి వధించాడు. దీన్ని భరించలేక బింబిసారుడి భార్య (కోసల రాజవంశీయురాలు) మరణించింది. తన సోదరి మరణానికి ప్రతీకారంగా ప్రసేనజిత్తు తాను కట్నంగా ఇచ్చిన 'కాశీ'ని తిరిగి వశం చేసుకున్నాడు.

        వర్తకం వల్ల కాశీకి ప్రాధాన్యం ఏర్పడటంతో అజాతశత్రువు, ప్రసేనజిత్తుతో యుద్ధం చేశాడు. వీరిద్దరి మధ్య అనేక యుద్ధాలు జరిగాయి. చివరకు ప్రసేనజిత్తు మంత్రి అయిన ధీర్ఘాచరాయనుడు రాజును మోసం చేసి, అతడు బుద్ధుడిని చూడటానికి వెళ్లిన సమయంలో రాజముద్రికనూ, సైన్యాధికారాన్ని విదుదాబుడికి ఇచ్చాడు. రాజభ్రష్టుడైన ప్రసేనజిత్తు రాజగృహానికి చేరుకుని, కోట తలుపులు మూసి ఉండటంతో అలసట వల్ల అక్కడే మరణించాడు. అజాతశత్రువు అతడికి రాజోచితంగా దహన సంస్కారాలు జరిపించి, తాను మేనల్లుడైనందున కోసల రాజ్యంపై తనకు హక్కుందని అడిగాడు. అదే సమయంలో 'రాప్తి' నదికి అకస్మాత్తుగా సంభవించిన వరదల్లో విదుదాబుడు, అతడి సైన్యం కొట్టుకుపోయారు. ఈ విధంగా యుద్ధం లేకుండానే కోసల రాజ్యం మగధలో విలీనమైంది.

        అజాతశత్రువు ఉపయోగించిన నూతన యుద్ధ పరికరాలు మహాశిలకంఠక (శత్రువులపై బరువైన రాళ్లు విసిరే యంత్రం), రథ ముసలం (రథ చక్రాలకు కట్టిన ఇనుప దూలం). అజాతశత్రువును జైనులు జైనుడని, బౌద్ధులు బౌద్ధుడని పేర్కొన్నారు. వైశాలి నగరానికి చెందిన వేశ్య స్త్రీ ఆమ్రపాలిని ప్రేమించి వివాహమాడాడు. బుద్ధుడి రాక కోసం, దర్శనాల కోసం అజాతశత్రువు వేచి ఉన్నట్లు బార్హూత్ శిల్పం (మధ్యప్రదేశ్) చిత్రణలు నిరూపిస్తున్నాయి. పాటలీపుత్రాన్ని ప్రారంభించింది అజాతశత్రువు, పూర్తిచేసింది ఉదయనుడు. అజాతశత్రువు పాలనాకాలంలో రాజగృహంలో మొదటి బౌద్ధసంగీతికి అధ్యక్షుడు మహాకాశ్యప.

ఉదయనుడు

        రాజధానిని రాజగృహ నుంచి పాటలీపుత్రానికి మార్చాడు. అతడి తర్వాత సింహాసనం అధిష్ఠించిన నలుగురు రాజులు పితృహంతకులేనని చరిత్రకారులు భావించారు. ఈ విధంగా పితృహంతకులు రాజ్యాన్ని పాలించడంతో కోపించిన ప్రజలు క్రీ.పూ. 413లో వీరిలో ఆఖరివారిని గద్దెదించి, రాజ్య ప్రతినిధిగా ఉన్న 'శిశునాగుడి'ని మగధకు రాజుగా చేశారు.


2. శైశునాగ 

        శైశునాగ వంశ స్థాపకుడు శిశునాగుడు. అర్ధ శతాబ్దం పాటు మగధ సామ్రాజ్యాన్ని పాలించాడు. ప్రద్యోతనుడు అనే అవంతి రాజును నిర్మూలించింది శిశునాగుడు. శైశునాగ వంశంలో గొప్పవాడు కాలాశోకుడు. ఇతడు రాజధానిని పాటలీపుత్రం నుంచి వైశాలికి మార్చాడు . ఇతడి కాలంలో రెండో బౌద్ధ సంగీతి జరిగింది. అధ్యక్షుడు సభాకామి. కాలాశోకుడు తన పదిమంది కుమారులతో దుర్మరణం పాలైనట్లు తదనంతర సాహిత్యంలో వర్ణనలు ఉన్నాయి. కానీ శైశునాగ వంశాన్ని తుదముట్టించింది మహాపద్మనందుడు. ఇతడి వంశం మగధను క్రీ.పూ. 321 వరకు పాలించింది.


3. నందవంశం

        పురాణాల్లో పేర్కొన్న నందవంశ స్థాపకుడు మహా పద్మనందుడు (మహాభోది వంశం అనే బౌద్ధ గ్రంథం ప్రకారం నందవంశ స్థాపకుడు ఉగ్రసేనుడు). కొన్ని ఆధారాల ప్రకారం మహాపద్మనందుడు ఒక శూద్ర స్త్రీకి జన్మించినవాడు. మగధను పాలించిన ఒకే ఒక శూద్రవంశం నందులు. పురాణాల్లో మహాపద్మనందుడిని క్షత్రియవంశ నిర్మూలకుడిగా పేర్కొన్నారు. అపారమైన తమ సంపద, సైన్యం ద్వారా రాజ్య సరిహద్దులను సుదూర ప్రాంతాలకు విస్తరింపజేశారు. వీరిసైన్యంలో 20 వేలమంది అశ్వికదళం, 20 వేల మంది పదాతిదళం, రెండువేల రథాలు, మూడువేల గజబలం ఉంది.

        క్రీ.పూ. 1వ శతాబ్దానికి చెందిన ఖారవేలుడి 'హాథిగుంఫా శాసనం' ప్రకారం నందులు ఒరిస్సా లోని కళింగ ప్రాంతంపై కూడా అధికారం కలిగి ఉండేవారు. 12వ శతాబ్దికి చెందిన అనేక మైసూరు శాసనాలను బట్టి మహారాష్ట్రలోని కుంతల ప్రాంతంలో దక్షిణ భాగం నందుల అధికారంలో ఉందని తెలుస్తోంది. దక్కన్‌లోని కొన్ని ప్రాంతాలు కూడా వీరి అధికారంలో భాగంగా ఉండొచ్చు. కానీ ఈ ఆధారాలు విశ్వసనీయం కాదు. నంద సామ్రాజ్యానికి అసలు సరిహద్దులు నిర్ణయించటం కష్టం. కానీ క్రీ.పూ. 6వ శతాబ్దిలో ఆవిర్భవించిన 16 మహాజన పదాలన్నింటిలో గాంధార, కాంభోజ తప్ప మిగిలినవన్నీ మహాపద్మనందుడి సామ్రాజ్యంలో అంతర్భాగమే. (ఏకరాట్ బిరుదాంకితుడు మహాపద్మనందుడు).
* మహాపద్మనందుడి తదనంతరం ధననందుడు వచ్చాడు. నందవంశంలో చివరివాడు ధననందుడు. గ్రీకు రచయితలు ధననందుడిని 'అగ్రమిస్‌'గా వర్ణించారు. ధననందుడి అపార ధన సంపదను ప్రస్తావించింది బౌద్ధ వాజ్ఞయం.
* అమిత ధనకాంక్ష, అధిక పన్నులు, బలాత్కార వసూలు మొదలైన లోపాల వల్ల ప్రజాదరణ కోల్పోయాడు ధననందుడు. అలెగ్జాండర్‌కు సమకాలీకుడైన నందరాజు ధననందుడు. ధననందుడిని చంద్రగుప్తమౌర్యుడు కౌటిల్యుడి సహకారంతో ఓడించి మౌర్య రాజ్యస్థాపన చేశాడు.


        భారతదేశ రాజకీయ చరిత్రలో క్రీ.పూ. 6వ శతాబ్దం తర్వాత జరిగిన సంఘటనలు గణ, రాజరిక రాజ్యాల మధ్య జరిగిన పోరాటాన్ని తెలియజేస్తాయి. ఈ కాలంలో మల్ల, కురు - పాంచాల, శూరసేన, మత్స్య, కాంభోజ, గాంధార, శాక్య, కోలియ, విజ్జి రాజ్యాలు ప్రధాన గణ రాజ్యాలు. విజ్జి గణ సమాఖ్యలో ఎనిమిది తెగలు ఉండేవి. అందులో లిచ్ఛవీ రాజ్యం బలమైంది. దీని రాజధాని వైశాలి. ఈ గణ రాజ్యాలు గంగా హరివాణంలోని ఈశాన్య ప్రాంతంలో, హిమాలయ పర్వత పాద భూభాగాల్లో విస్తరించి ఉండేవి.
        క్రీ.పూ. 6వ శతాబ్దంలో మగధ, అంగ, అవంతి, కాశీ, కోసల, వత్స బలమైన రాజరిక రాజ్యాలు. ఇవి ఉత్తర భారతదేశంలో సారవంతమైన గంగా పరివాహ ప్రాంతానికి పరిమితమై ఉండేవి. గంగా హరివాణంపై ఆధిపత్యం కోసం గణ, రాజరిక రాజ్యాల మధ్య నిరంతరం యుద్ధాలు జరిగేవి. ఈ పోరాటంలో మగధ రాజ్యం తన సైనిక బలంతో మిగతా రాజ్యాలను అణచివేసింది. దీంతో మగధ రాజ్యం క్రీ.పూ. 6వ శతాబ్దంలో బలమైన సామ్రాజ్యంగా అవతరించింది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి.
భౌగోళిక కారణాలు: 

        సారవంతమైన గంగా హరివాణం వ్యవసాయ అభివృద్ధికి బాగా తోడ్పడింది. ఇది రాజ్యానికి స్థిరమైన ఆదాయ వనరులను అందించింది. రాజకీయ భద్రత, ఆర్థిక సుస్థిరత చేకూర్చింది. ఆర్థిక సుస్థిరత వల్ల మగధ రాజులు బలమైన సిద్ధ సైన్యాన్ని పోషించారు. నంద రాజైన మహాపద్మనందుడి వద్ద 2 లక్షల కాల్బలం, 2 వేల రథాలు, 3 వేల గజదళంతో బలమైన సైన్యం ఉన్నట్లు గ్రీకు చరిత్రకారులు పేర్కొన్నారు. అలెగ్జాండర్ దండయాత్ర పంజాబ్ ప్రాంతంలోనే ముగియడంతో నంద రాజులకు తమ సైనిక బలాన్ని ప్రదర్శించే అవకాశం రాలేదు.
        గంగానదికి అవతల ఉన్న దక్షిణ బీహార్ ప్రాంతం దట్టమైన అడవులతో ఉండేది. ఈ అడవుల్లో భవన నిర్మాణానికి, సైన్యంలో ఉపయోగించే రథాలను రూపొందించడానికి కావాల్సిన కలప లభించేది. మగధ ప్రాంతంలో రాగి, ఇనుప ఖనిజాలు ఎక్కువగా దొరికేవి. అంగ రాజ్యంలోనూ ఇవి విరివిగా లభించేవి. అంగ రాజ్యం మగధలో విలీనమవ్వడంతో రాగి, ఇనుప ఖనిజం లభ్యత మరింత పెరిగింది. ఇనుము వాడకం పెరగడంతో రక్షణ, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక పురోగతి కనిపించింది.
        మగధ రాజ్యానికి కొన్ని వ్యూహాత్మక ప్రయోజనాలు ఉన్నాయి. ఈ రాజ్యానికి రెండు రాజధానులు ఉండేవి. మొదటిది రాజగృహం, రెండోది పాటలీపుత్రం. ఈ రెండూ వ్యూహాత్మక ప్రదేశంలో ఉన్నాయి. గిరివ్రజం అని పిలిచే రాజగృహం అయిదు కొండల మధ్య శత్రు దుర్భేద్యంగా ఉండేది. పాటలీపుత్రాన్ని గంగా, గండక్, సోనా, సరయు నదుల సంగమ ప్రాంతంలో నిర్మించారు. పాటలీపుత్రం జలదుర్గంగా పేరు పొందడమే కాకుండా జల మార్గాలపై ఆధిపత్యం కలిగి ఉండేది.
         ఇలాంటి భౌగోళిక అంశాలు మగధ బలమైన రాజ్యాంగా అభివృద్ధి చెందడానికి దోహదం చేశాయి.
వాణిజ్య అభివృద్ధి: 

        వ్యవసాయ అభివృద్ధి, మిగులు ఉత్పత్తి వ్యాపార అభివృద్ధికి తోడ్పడ్డాయి. దీంతో మగధ ఒక ప్రధాన వ్యాపార, వాణిజ్య కేంద్రంగా అభివృద్ధి చెందింది. వ్యవసాయ మిగులు, వాణిజ్య అభివృద్ధి పట్టణాలు, నగరాల అభివృద్ధికి దారితీసింది. వ్యాపారం బాగా అభివృద్ధి చెందడం వల్ల పన్నులు, సుంకాల రూపంలో రాజ్యానికి అదనపు ఆదాయం సమకూరింది.

మగధ ప్రజల దృక్పథం: 

        మగధ ప్రజల ప్రత్యేక దృక్పథం కూడా మగధ రాజ్య అభ్యున్నతికి తోడ్పడింది. మగధ రాజ్యంలో అనార్య తెగలకు చెందిన ప్రజలు నివసించేవారు. వారిని సనాతన బ్రాహ్మణులు చిన్న చూపు చూసేవారు. అయితే ఆర్యుల రాకతో మగధ సమాజంలో వర్ణ సంక్రమణం జరిగింది. ఇది మగధ ప్రజలను సామ్రాజ్య స్థాపనకు పురిగొల్పేలా చేసింది.
సమర్థమైన రాజుల పాలన: 

        మగధ రాజ్యాన్ని సమర్థులైన, దూరదృష్టి ఉన్న రాజులు పరిపాలించారు. బిందుసారుడు ఉత్తర భారతదేశంలోని తూర్పు ప్రాంతంలో హర్యంక వంశ పాలనను ప్రారంభించాడు. సైనికబలం, చతురతతో బిందుసారుడు సామ్రాజ్యాన్ని విస్తరించాడు. మొదట ఆర్థికంగా అభివృద్ధి చెందిన అంగరాజ్యాన్ని ఆక్రమించాడు.
        ఈ విజయం వల్ల అంగరాజ్యం మగధ రాజ్యంలో విలీనమైంది. దీంతో అంగ రాజ్యంలో లభించే రాగి, ఇనుప ఖనిజంపై కూడా ఆధిపత్యం సంపాదించాడు. బింబిసారుడు కూడా మగధ సామ్రాజ్య విస్తరణలో ప్రముఖ పాత్ర పోషించాడు. అతడు ప్రసిద్ధి పొందిన రాజరిక రాజ్యాలతో వైవాహిక సంబంధాలు ఏర్పరుచుకోవడం ద్వారా తన బలాన్ని పెంచుకున్నాడు. కోసల రాజు ప్రసేనజిత్తు సోదరి కోసలదేవిని పెళ్లి చేసుకోవడం ద్వారా కాశీ పట్టణాన్ని వరకట్నంగా పొందాడు. బింబిసారుడు లిచ్ఛవీ, మద్ర రాజ్యాలతో సైతం వైవాహిక సంబంధాలు ఏర్పరచుకున్నాడు. ఇదే సమయంలో గంగా హరివాణంలో బౌద్ధ, జైనమతాలు బాగా ప్రచారంలో ఉండేవి. బింబిసారుడు పరమత సహనాన్ని పాటించి, రాజ్యంలో శాంతిని నెలకొల్పాడు.
        బింబిసారుడి తర్వాత అతడి కుమారుడు అజాతశత్రువు రాజ్యానికి వచ్చాడు. ఇతడు కూడా తన సమర్థ పాలనతో తండ్రిలా పేరు పొందాడు. తండ్రి అవలంబించిన విధానాలను కొనసాగించాడు. రాజగృహాన్ని పటిష్టం చేయడమే కాకుండా 'పాటలీపుత్రం' అనే నగరాన్ని నిర్మించాడు. ఇది ఉత్తర భారతదేశంలో గొప్ప నగరంగా అభివృద్ధి చెంది క్రీ.శ. 7వ శతాబ్దం వరకు తన ఖ్యాతిని నిలబెట్టుకుంది.
        తర్వాతి కాలంలో అజాతశత్రువు కోసల రాజ్యాన్ని ఆక్రమించాడు. విజ్జి సమాఖ్యను విడగొట్టి గంగా మైదానంలోని చాలా భూభాగాల్లో తన ఆధిపత్యాన్ని సుస్థిరం చేశాడు.
        హర్యంక వంశం తర్వాత శిశునాగ వంశం మగధను 50 ఏళ్ల పాటు పరిపాలించింది. శిశునాగ వంశం పాలనా కాలంలో జరిగిన ప్రధాన సంఘటన - వైశాలిలో రెండో బౌద్ధ సంగీతిని నిర్వహించడం.
        శిశునాగ వంశం తర్వాత మగధ నంద వంశ పాలన కిందకు వచ్చింది. నంద వంశ పాలనా కాలంలో వ్యవసాయ, ఆర్థిక వ్యవస్థ ఆధారంగా ఒక సామ్రాజ్యాన్ని నిర్మించాలనే ఆలోచన భారతీయుల్లో పుట్టింది. మహాపద్మనందుడు కురు-పాంచాల, ఇక్ష్వాకు, శూరసేన, అస్మక లాంటి క్షత్రియ రాజవంశాలను నిర్మూలించి గంగా హరివాణంలో చాలా భాగం ఆక్రమించినట్లు తెలుస్తోంది. దీంతో అతడు శక్తిమంతమైన సైన్యాన్ని ఏర్పాటు చేయగలిగాడు. ఈ సైన్యమే అలెగ్జాండర్ ఆధ్వర్యంలోని గ్రీకు సైనికుల్లో భయాన్ని కలిగించింది. మహాపద్మనందుడి తర్వాత నంద వంశ ప్రతిష్ఠ దిగజారింది. ధననందుడి నిరంకుశ పాలనతో విసుగు చెందిన ప్రజలు మార్పు కోసం ఎదురు చూశారు.
        మౌర్యుల రాకతో ప్రాచీన భారతదేశ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైంది. వీరి పాలనలో మగధలో సామ్రాజ్యవాదం వాస్తవిక రూపం దాల్చింది. భారతదేశంలో రాజకీయ ఏకీకరణ సాధించి, నిజమైన సామ్రాజ్య స్థాపన చేసిన ఘనత మౌర్యులకే దక్కుతుంది.


No comments:

Post a Comment

Post Bottom Ad