1857 తిరుగుబాటు - GNANA SAMHITHA

Breaking

Post Top Ad

Thursday, March 20, 2025

1857 తిరుగుబాటు

        ఆధునిక భారతదేశ చరిత్రలో 1857 తిరుగుబాటు ఒక ముఖ్యమైన చారిత్రక ఘట్టం. ఈ తిరుగుబాటుకు దారితీసిన పరిస్థితులను రాజకీయ, ఆర్థిక, సాంఘిక, మత, సైనిక కారణాలుగా విభజించవచ్చు.

రాజకీయ కారణాలు

        భారతదేశంలో తమ సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికి ఆంగ్లేయులు అనేక పద్ధతులు అనుసరించారు. యుద్ధాలు, సైన్య సహకార పద్ధతి, పరిపాలన సరిగా లేదనే నెపంతో సామ్రాజ్యాన్ని విస్తరించారు. డల్హౌసీ మరో అడుగు ముందుకువేసి రాజ్యసంక్రమణం సిద్ధాంతం ద్వారా అయోధ్య, సతారా, నాగ్‌పూర్, ఝూన్సీ మొదలైన సంస్థానాలను బ్రిటిష్ సామ్రాజ్యంలో విలీనం చేశాడు. పీష్వా దత్తకుమారుడైన నానాసాహెబ్‌కు భరణాన్ని నిరాకరించాడు. కర్ణాటక, తంజావూర్, తిరువాన్కూర్ రాజుల బిరుదులు రద్దు చేశాడు. మొగలు చక్రవర్తి నివాసాన్ని ఎర్రకోట నుంచి కుతుబ్‌మీనార్‌కు దగ్గరగా మార్చాలని, బహదూర్ షా తర్వాత మొగల్ చక్రవర్తి బిరుదును రద్దు చేయాలని ప్రతిపాదించాడు. దీంతో స్వదేశీ రాజుల్లో భవిష్యత్తు గురించి ఆందోళన మొదలైంది. ఆంగ్లేయుల జాతి వివక్ష, వారు తమ పట్ల చూపిన నిరాదరణ ప్రజల్లో అసంతృప్తి కలిగించింది. ఇలాంటి వారంతా 1857 తిరుగుబాటులో పాల్గొన్నారు.

ఆర్థిక కారణాలు

        రాజ్య సంక్రమణ సిద్ధాంతం వల్ల అనేక రాజ్యాలు బ్రిటిష్ సామ్రాజ్యంలో విలీనమై ఆయా రాజ్యాల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, గాయకులు, కవులు, విద్వాంసులు నిరుద్యోగులై సిపాయిలుగా మారారు. వీరంతా పని లేక, తినడానికి తిండి లేక అలమటించారు. కంపెనీ ప్రభుత్వం భారతదేశంలో వ్యవసాయాన్ని, పరిశ్రమలను నిర్లక్ష్యం చేసింది. కుటీర పరిశ్రమలు దెబ్బతిన్నాయి. క్షీణించిన ఆర్థిక పరిస్థితి తిరుగుబాటుకు పురికొల్పింది.

సాంఘిక కారణాలు

        1829లో విలియం బెంటింక్ సతీసహగమనం నిషేధ చట్టం చేశాడు. లార్డ్ డల్హౌసీ 1856లో వితంతు పునర్వివాహ చట్టం చేశాడు. 1856లో మతం మార్చుకున్న వారికి ఆస్తి హక్తులను పరిరక్షిస్తూ భారతీయ వారసత్వ చట్టం వచ్చింది. బాల్యవివాహాల నిషేధ చట్టం లాంటి సంస్కరణలు తమ సనాతన ధర్మానికి విరుద్ధమని హిందువులు అభిప్రాయపడ్డారు. 1853లో లార్డ్ డల్హౌసీ రైల్వే, తంతి తపాల లాంటి ఆధునికీకరణ విధానాలు ప్రజల్లో సంచలనాన్ని సృష్టించాయి. తమ ఆచారబద్ధమైన జీవన విధానాన్ని నాశనం చేయడానికి బ్రిటిష్‌వారు ఈ ఆధునిక వ్యవస్థలను ప్రవేశపెట్టారని కొందరు భావించారు. ప్రభుత్వం చట్టాల ద్వారా తమ మతధర్మాలను నాశనం చేస్తోందని ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమైంది.

మత కారణాలు

        క్రైస్తవులైన ఆంగ్లేయులు హిందువులందరినీ క్రైస్తవ మతంలోకి మారుస్తారనే అనుమానం ప్రజల్లో ఏర్పడింది. క్రైస్తవ మిషనరీలు తమ మత ప్రచారాన్ని ఉద్ధృతం చేశాయి. 1853 ఛార్టర్ చట్టంలో క్రైస్తవ మిషనరీలకు సౌకర్యాలు కల్పించటం, ఇంగ్లిష్ విద్యావ్యాప్తికి నిధులను కేటాయించడం లాంటివి ప్రజల్లో ఆందోళన కలిగించాయి. మత మార్పిడులను ప్రోత్సహించి భారతదేశాన్ని క్రైస్తవ రాజ్యంగా మార్చడానికి బిట్రిష్‌వారు ప్రయత్నిస్తున్నారనే భావన భారతీయుల్లో ఏర్పడింది. దీంతో ప్రజలు కంపెనీ పాలన పట్ల వ్యతిరేకతను ప్రదర్శించారు.
 

సైనిక కారణాలు

        ఈస్టిండియా కంపెనీలో రెండు రకాల సైనికులున్నారు. బతుకు తెరువు కోసం కంపెనీలో సైనిక ఉద్యోగులుగా చేరిన భారతీయులను సిపాయిలు అని పిలిచేవారు. ఆంగ్లేయులను సైనికులుగా పిలిచేవారు. వీరిద్దరి మధ్య హోదాలు, జీతభత్యాల్లో చాలా తేడా ఉండేది. సిపాయి, సైనికుల నిష్పత్తి 4 : 1 గా ఉండేది. 1856లో లార్డ్ కానింగ్ సామాన్య సేవా నియుక్త చట్టం (జనరల్ సర్వీసెస్ ఎన్‌లిస్ట్‌మెంట్ యాక్ట్) ప్రవేశపెట్టి సిపాయిలు ఏ ప్రాంతానికైనా వెళ్లి యుద్ధం చేయాల్సి ఉంటుందని పేర్కొన్నాడు. హిందూ ధర్మశాస్త్రం ప్రకారం సముద్ర ప్రయాణం నిషేధం. కులం, మతాన్ని సూచించే చిహ్నాలను తీసివేయాలనే ఉత్తర్వులు సిపాయిలను మరింత భయాందోళనకు గురిచేశాయి.
* కొన్నేళ్లుగా తీవ్ర అసంతృప్తికి లోనైన సిపాయిలు 1849, 1850, 1852లో తమ నిరసనలను తిరుగుబాట్ల రూపంలో ప్రదర్శించారు. 1857 నాటికి ఈ అసంతృప్తి తారస్థాయికి చేరుకుంది.
* మొదటి అఫ్గన్ యుద్ధంలో, సిక్కు యుద్ధాల్లో ఆంగ్లేయులకు సంభవించిన ఓటమి చూసి వారు అజేయులు అనే భావం పోయింది. కలిసి పోరాడితే ఆంగ్లేయులను ఓడించడం కష్టమేమీ కాదని సిపాయిలు భావించారు.

తక్షణ కారణం
        ఈస్టిండియా కంపెనీ ప్రభుత్వం 1856లో ఎన్‌ఫీల్డ్ తుపాకులను ప్రవేశపెట్టింది. వీటిలో ఉపయోగించే తూటాల చివరి భాగాన్ని సైనికులు నోటితో కొరికి తుపాకిలో అమర్చాల్సి ఉండేది. ఆ తూటాలకు ఆవు, పంది కొవ్వు పూసినట్లు ప్రచారం జరిగింది. ఆవు హిందువులకు పవిత్రమైంది. ముస్లింలు పందిని అపవిత్రంగా భావిస్తారు. దీంతో ఆంగ్లేయులు తమ మతాలను బుద్ధిపూర్వకంగా కించపరచడానికే ఈ పని చేశారని సిపాయిలు విశ్వసించారు.

తిరుగుబాటు ప్రారంభం
        1857 ఫిబ్రవరి 26న బరాక్‌పూర్‌లోని 19వ పటాలం సైనిక కవాతులో పాల్గొనలేదు. 1857 మార్చి 29న బారక్‌పూర్‌లోని 34వ పటాలానికి చెందిన మంగళ్ పాండే అనే సిపాయి తూటాలను వాడటానికి నిరాకరించాడు. లెఫ్టినెంట్ బాగ్ అనే ఆంగ్లేయ సైనిక అధికారిని కాల్చిచంపాడు. దీంతో మంగళ్ పాండేని ఉరితీశారు. సిపాయిలు కొత్త రకం తూటాలను ఉపయోగించడానికి నిరాకరించడంతో అధికారులు వారందరినీ శిక్షించారు. ఆరుగురిని సైనిక న్యాయస్థానంలో విచారించి 10 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించారు.
* 1857 మే 10న మీరట్‌లో సిపాయిల తిరుగుబాటు ప్రారంభమైంది. ఆనాటి బిట్రిష్ ఇండియా గవర్నర్ జనరల్ లార్డ్ కానింగ్. సిపాయిలు దిల్లీ చేరుకుని చివరి మొగల్ చక్రవర్తి రెండో బహదూర్ షాను తమ నాయకుడిగా ఎన్నుకున్నారు. సిపాయిలు వీరోచితంగా పోరాడినా తిరుగుబాటు విఫలమైంది.

        తిరుగుబాటు కాలంలో వివిధ ప్రాంతాల నుంచి సిపాయిలకు మద్దతుగా తమ హక్కులు, వారసత్వం కోసం పోరాడినవారు:

ప్రదేశం

నాయకత్వం

బ్రిటిష్ సేనాని

దిల్లీ

భక్త్‌ఖాన్

నికోల్‌సన్

కాన్పూర్, ల‌ఖ్‌న‌వూ

నానాసాహెబ్

హేవ్‌లాక్, క్యాంప్‌బెల్

 

హజ్రత్ మహల్

హేవ్‌లాక్, క్యాంప్‌బెల్

గ్వాలియర్

తాంతియా తోపే

విండ్‌హామ్

ఝాన్సీ

లక్ష్మీబాయి

సర్ హ్యురోజ్

బరేలి

ఖాన్‌బహదూర్‌ఖాన్

క్యాంప్‌బెల్

బిహార్

కున్వర్‌సింగ్

విలియం టేలర్

ఫైజాబాద్

మౌల్వీ అహ్మదుల్లా

విలియం టేలర్

  1857 తిరుగుబాటు విఫలమవడానికి కారణాలు:
1) కేంద్రీకృత నాయకత్వం లేకపోవుట
2) బ్రేక్‌ వాటర్స్‌ (1857 తిరుగుబాటు కాలంలో భారతీయులను ఆంగ్లేయులకు మద్దతు పలికిన అప్పటి గవర్నర్‌ జనరల్‌ కానింగ్‌ బ్రేక్‌ వాటర్స్‌ అని పేర్కొన్నాడు)
3) సమాచార వ్యవస్థ లోపం
4) తిరుగుబాటు కలసికట్టుగా జరగకపోవుట, కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమై ఉండుట
5) అన్ని వర్ణాల వారు పాల్గొనకపోవుట. ప్రధానంగా మేధావి వర్గం దీనిలో పాల్గొనలేదు.
6) భారతీయ సిపాయిలు సంప్రదాయ ఆయుధాలను ఉపయోగించుట, ఆంగ్లేయులు ఆధునిక ఆయుధాలు ఉపయోగించుట.
7) క్రమశిక్షణ కలిగిన బ్రిటీష్‌ సైన్యం
8) తిరుగుబాటు నాయకుల్లో జాతీయభావాలు లోపించుట
ఫలితం :
•1858 చట్టం ప్రకారం బ్రిటీష్‌ ఈస్ట్‌ ఇండియా పాలన అంతం చేయబడినది.
•భారతదేశం బ్రిటీష్‌ సామ్రాజ్యంలో ఒక భాగం అని ప్రకటించబడినది. ఈ విషయాన్ని అప్పటి గవర్నర్‌ జనరల్‌ లార్డ్‌ కానింగ్‌ అలహాబాద్‌ దర్చార్‌ నుండి ప్రకటించాడు.
•భారతదేశాన్ని పరిపాలించుటకు 15 మంది సభ్యులతో లండన్‌లో ఒక ఇండియా కౌన్సిల్‌ ఏర్పాటు చేయబడినది. దీనికి అధ్యక్షుడు బ్రిటీష్‌ సెక్రటరీ ఆఫ్‌ స్టేట్స్‌.
•భారతదేశ సాంఘిక సాంప్రదాయాలలో జోక్యం చేసుకోకూడదని బ్రిటీష్‌ వారు నిర్ణయించారు. భారతదేశంలో బ్రిటీష్‌ ‌ సైన్యం పూర్తిగా వునర్‌ వ్యవస్థీకరించబడింది.
•కలసికట్టుగా పోరాటం చేయుటకు వ వర్గం నిర్ణయించినది. ఇది తరువాత కాలంలో ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ ఏర్పాటుకు తోడ్పడినది.
•1857 తిరుగుబాటుకు ప్రధాన కారణము ముస్లింలు అని భావించి బ్రిటీష్‌వారు ముస్లిం వ్యతిరేక విధానాలను చేపట్టారు.
•భారతదేశంలో బ్రిటీష్‌ సైన్యం పునర్‌వ్యవస్థీకరించబడింది.

స్టేట్‌మెంట్స్‌:
•భారతదేశ ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం - వి.డి.సావర్కర్‌ (వినాయక్‌ దామోదర్‌), కారల్‌ మార్క్స్‌
•దీనికి విరుద్ధంగా ఆర్‌.సి. మజుందార్‌ దీన్ని ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామం కాదు అని పేర్కొన్నాడు.
•సిపాయిల తిరుగుబాటు - సర్‌ సయ్యద్‌ అహ్మద్‌ఖాన్‌, చార్లెస్‌ రేక్‌
•ముస్లింల తిరుగుబాటు -కుప్లాండ్‌, రాబర్ట్స్‌
•జహిందూ ముస్తింల తిరుగుబాటు - కాయే, మాలీసన్‌, టేలర్‌
•నల్లజాతి వారు తెల్లజాతి వారికి వ్యతిరేకంగా చేసిన యుద్ధం -కాయే
•అనాగరిక ప్రజలు నాగరికులకు వ్యతిరేకంగా చేసిన యుద్ధం -హోమ్స్‌
•సాంప్రదాయ శక్తులు క్రీస్టియానిటీకి వ్యతిరేకంగా చేసిన యుద్ధం - రీస్‌
•జాతీయ తిరుగుబాటు -డిజ్రాయిలీ

1857 తిరుగుబాటుపై పుస్తకాలు:
1. The Causes of Indian Mutiny - సర్‌ సయ్యద్‌ అహ్మద్‌ఖాన్‌
2. ప్రధమ భారత స్వాతంత్ర్య సంగ్రామం-వి.డి. సావర్కర్‌
3. The Sepoy Mutiny & The Revolt of 1857 -ఆర్‌.సి. మజుందార్‌
4. 1857 The Great Revolution -అశోక్‌ మెహతా
5. జాఫర్‌ -బహదూర్‌ షా జాఫర్‌
6. The History of Sepoy War in India -కాయే
7. History of Indian Mutiny -టి. ఆర్‌. హోమ్స్‌
8. Indian Mutiny of 1857 -మాలీసన్‌

No comments:

Post a Comment

Post Bottom Ad