దివ్య వాణి పార్ట్ 1 - GNANA SAMHITHA

GNANA SAMHITHA

Telugu lo fast, simple, and reliable updates on education, technology, jobs, current affairs, lifestyle and daily useful information. Trusted news & knowledge platform.

Breaking

Post Top Ad

Friday, December 5, 2025

దివ్య వాణి పార్ట్ 1

ఆధ్యాత్మిక విద్య ముఖ్యంగా భక్తి, జ్ఞానం, యోగ — ఈ మూడు మార్గాలనే బోధింపబడుతుందన్న విషయం చాలామందికి తెలుసు. సాధకుల్లో మూడు వర్గాల వారుంటారు: ఉత్తమ, మధ్యమ, మందాధికారులు అన్న విధంగా వారి విభజన జరుగుతుంది.

ఉత్తమాధికారులు జన్మతః సద్భక్తి కలిగి ఉంటారు. వారికి మార్గం అత్యంత సులభం. వారు సత్వగుణ ప్రధానమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు.

మధ్యమాధికారులు — కొంత ప్రయత్నంతో శ్రవణ, మనన, నిధిధ్యాసలు అభ్యసిస్తే చాలు! వారికి జ్ఞానోదయం ఔతుంది. వీరు రజోగుణ ప్రభావం అధికంగా కలవారు.

ఇక తమోగుణ ప్రభావ పీడితులైన వారు మందాధికారులు. వీరికి యోగ మార్గమే శరణ్యం! యోగం ద్వారా ఎట్టి మనిషికైనా మానవ జీవిత గమ్మమైన స్వస్వరూప సంధానం సాధ్యమేనని నిరూపించబడింది.

అందుకే ఆధునిక యుగంలో “యోగం వినా శరణ్యం నాస్తి” అని చెప్పబడుతోంది. అంతేకాక భక్తి, జ్ఞాన సాధనలు కూడా యోగాలుగానే చెప్పబడుతున్నాయి. భక్తుడూ, జ్ఞానీ కూడా యోగి ఐనప్పుడే అపరోక్షానుభవం కలుగుతుంది.

యోగ మార్గంలో ముఖ్యమైందిగా చెప్పబడుతున్నది కుండలినీ యోగం. కుండలినీ ప్రబోధానికి నాద, బిందు, కళలు వేర్వేరు కారణాలైనప్పటికీ, కుండలినీ శక్తి చక్రభేదన మోనర్చుకుంటూ సహస్రారానికి ప్రయాణించే సమయంలో కలిగే అనుభవాలు మాత్రం ఇంచుమించు ఒకే రీతిలో ఉంటాయి.

ఎందుకంటే ఒక్కో చక్రం ఒక్కో తత్వాన్ని పరివేష్టించి ఉండడంవల్ల, కుండలినీ ప్రబోధన సమయంలో వాటివాటి గుణాలు ప్రభావితమై ప్రతిభా ప్రకాశాన్ని పొందుతాయి.

ఉదాహరణకు:
మూలాధారంలో కుండలిని జాగరూపమైనప్పుడు పృథివీ తత్వం కు సంబంధించిన "ఘ్రాణశక్తి" మీద నియంత్రణ కల్గుతుంది. స్వాధిష్టాన చక్రం దగ్గరకి వచ్చినపుడు జలతత్వ సంబంధితమైన "రుచి" మీదను, మణిపూరకం దగ్గర అగ్నితత్వ సంబంధితమైన “దృష్టి" మీదను, అనాహతం దగ్గర వాయుతత్వ సంబంధితమైన “స్పర్శ” మీదను, విశుద్ధి దగ్గర ఆకాశతత్వ సంబంధితమైన "శ్రవణము" మీదను, ఆజ్ఞాచక్రం దగ్గర మనోతత్వ సంబంధిత మైన "భావనాశక్తి" మీదను నియంత్రణ కలుగుచున్నవి.

ఈ విధంగా మనిషిని ఒక్కో మెట్టు పైకి తీసుకు వెళుతూ జంతుప్రకృతి నుండి సాధారణ మానవ, విశిష్ట వ్యక్తిత్వాలనుదాటి పైకి ఎదిగేలా చేస్తూ — దైవంగా మార్చే శక్తి కల్గియుంటుంది కుండలినీ అభ్యాసం!

మనిషిని దైవంగా మార్చే ఈ యోగ లక్షణాలను గురించి హఠయోగ ప్రదీపికలో ఈ విధంగా వ్రాయబడింది:

దేహేంద్రియులు వలన గలుగు వైరాగ్యమే యమము.
పరతత్వమునందు ఎడతెగక గలుగు నట్టి అభిలాష — నియమము.
సర్వవస్తువుల యందు ఉదాసీనముగా నుండుటయే ఆసనము.
ఈ సకల జగమును మధ్యగా దోచుటయే ప్రాణాయామము.

చిత్తము యొక్క అంతర్ముఖత్వమే ప్రత్యాహారము.
చిత్తము యొక్క నిశ్చయ స్థితియే ధారణ.
చిన్మాత్రమే నేనని చింతించుటయే ధ్యానము.
ధ్యానమును చక్కగా మలచుటయే సమాధి యని వివేకులు చెప్పెదరు.

కాబట్టి యోగం యొక్క ఆదర్శం మనిషిని పరిపూర్ణునిగా తీర్చిదిద్దడమే అని చక్కగా ప్రతియొక్కరు గుర్తించి, అట్టి సద్భావంతో యోగాన్ని అభ్యసిస్తే గమ్యం అతి శీఘ్రంగా లభించగలదు.


No comments:

Post a Comment

Post Bottom Ad