జైన మతం - GNANA SAMHITHA

Breaking

Post Top Ad

Monday, March 17, 2025

జైన మతం

👉🏻క్రీ.పూ. 6 వ శతాబ్దం భారతదేశంలోనే కాకుండా ప్రపంచ చరిత్రలోనే మతపరమైన ఉద్యమాల అవతరణకు దోహదం చేసింది.
👉🏻చైనాలో కన్‌ఫ్యూజియనిజం, టావోయిజాలు, పర్షియాలో జొరాస్ట్రియనిజం అనే మతాలు ఏర్పడ్డాయి.
👉🏻ఈ శతాబ్దంలోనే గంగానదీ పరివాహ ప్రాంతంలో ఎంతోమంది మతాచార్యులు ఆవిర్భవించారు.
👉🏻వైదిక మతాన్ని వ్యతిరేకించే వారి సంఖ్య కూడా క్రమక్రమంగా పెరిగింది.
👉🏻క్రీ.పూ. 6వ శతాబ్దంలోనే భారతదేశంలో 62 మత శాఖలు ఉన్నట్లు చరిత్రకారుల అంచనా.
👉🏻వీటిలో చాలావరకు ఈశాన్య భారతదేశంలో నివసించే ప్రజల మత సంప్రదాయాలు, క్రతువుల మీద ఆధారపడినవే.
👉🏻వీటిలో ముఖ్యమైనవి జైనమతం, బౌద్ధమతం. ఈ రెండు మతాలు భారతదేశ సంస్కృతిని గణనీయంగా ప్రభావితం చేశాయి.
👉🏻ముఖ్యంగా బౌద్ధం చైనా, జపాన్ లాంటి దేశాల్లో ఇప్పటికీ గొప్ప ఆదరణ పొందుతోంది.
👉🏻ఈ కాలంనాటి మత గురువుల్లో మొదటివాడు పురాణ కశ్శపుడు. ఇతడు మంచి నడవడిక మనిషి కర్మల మీద ఎలాంటి ప్రభావం చూపదని బోధించాడు.
👉🏻అజీవక శాఖకు నాయకుడైన గోసాల మస్కరిపుత్ర కూడా పురాణ కశ్శపుడి వాదనతో అంగీకరించి, నియతి వాదాన్ని బోధించాడు.
👉🏻మరో గురువు అజిత కేశ కాంబలిన్ 'ఉచ్ఛేద వాదం' అనే భౌతికవాద సిద్ధాంతాన్ని ప్రచారం చేశాడు. ఈ సిద్ధాంతం నుంచే లోకాయత, చార్వాక అనే మత శాఖలు ఏర్పడ్డాయి.
👉🏻మరో మతాధికారైన పకుధ కాత్యాయన భూమి, నీరు, వెలుతురు ఎలాగైతే సమూలంగా నాశనం చేయడానికి వీల్లేని అంశాలో, అదే విధంగా జీవితం, ఆనందం, విషాదం కూడా నాశనం చేయలేని అంశాలని అభిప్రాయపడ్డాడు. అతడి భావాల నుంచే వైశేషిక వాదం పుట్టిందని చరిత్రకారుల భావన.

జైనమతం - ఆవిర్భావం

👉🏻జైనమత స్థాపకుడు రుషభనాథుడు.
👉🏻రుగ్వేదంలో రుషభనాథుడు (మొదటి తీర్థంకరుడు), అరిష్టనేమి (22 వ తీర్థంకరుడు)ల ప్రస్తావన ఉంది.
👉🏻రుషభనాథుడి గురించి విష్ణుపురాణం, భాగవత పురాణాల్లో పేర్కొన్నారు. వీటిలో రుషభనాథుడిని విష్ణుదేవుడి అవతారంగా వివరించారు.
👉🏻జైనమతంలో 24 మంది తీర్థంకరులు (ప్రవక్తలు లేదా గురువులు) ఉన్నట్లు జైనులు విశ్వసిస్తారు.
👉🏻అయితే మొదటి 22 మంది తీర్థంకరులకు చెందిన చారిత్రక ఆధారాలు ఏమీ లేవు. చివరి ఇద్దరు మాత్రమే చారిత్రక పురుషులు.
👉🏻తీర్థంకరులందరూ క్షత్రియ వంశానికి చెందినవారే కావడం విశేషం.

తీర్థంకరులుగుర్తు
రుషభనాథుడు ఎద్దు
నేమినాథుడు నీలి గులాబి
 అరిష్టనేమి శంఖం
 పార్శ్వనాథుడు పాము
 వర్ధమాన మహావీరుడుసింహం
పార్శ్వనాథుడు
👉🏻కాశీ (బెనారస్) రాజైన అశ్వసేనుడు, రాణి వామలకు జన్మించాడు.
👉🏻30 ఏళ్ల వయస్సు వరకు గృహస్థ జీవితాన్ని గడిపాడు.
👉🏻తర్వాత ఇహలోక సుఖాలను త్యజించి, 84 రోజులు తపస్సు చేసి జ్ఞానిగా మారాడు.
👉🏻అహింస, సత్యం, అస్తేయం(దొంగతనం చేయకూడదు), అపరిగ్రహం (ఆస్తి ఉండకూడదు) అనే నాలుగు సూత్రాలను బోధించాడు.
👉🏻అదనంగా ఐదో సూత్రమైన బ్రహ్మచర్యాన్ని మహావీరుడు జోడించాడు. పార్శ్వనాథుడు తన వందో ఏట బెంగాల్‌లో నిర్యాణం చెందాడు.

వర్థమాన మహావీరుడు (క్రీ.పూ. 540- 468)
👉🏻చివరి తీర్థంకరుడు వర్థమానుడు.
👉🏻వర్థమానుడు వైశాలి నగరానికి దగ్గరలో ఉన్న కుంద గ్రామం (ప్రస్తుత బిహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లా)లో క్రీ.పూ. 540 లో జన్మించాడు.
👉🏻ఇతడి తండ్రి సిద్ధార్థుడు.
👉🏻ఇతడు జ్ఞత్రిక తెగకు అధిపతి.
👉🏻తల్లి త్రిశల. ఈమె వైశాలి పాలకుడైన అచ్చవి రాజు చేతకుని సోదరి.
👉🏻మగధ రాజైన బింబిసారుడు చేతకుడి కుమార్తె అయిన చెల్లవను వివాహం చేసుకోవడం వల్ల మహావీరుడికి మగధను పాలించిన హర్యంక వంశంతో చుట్టరికం ఏర్పడింది.
👉🏻మహావీరుడి భార్య యశోద. వీరి కుమార్తె అనొజ్ఞ (ప్రియదర్శన), అల్లుడు జమాలి.
👉🏻జమాలి మహావీరుడి మొదటి శిష్యుడు.
👉🏻వర్థమానుడు తన తల్లిదండ్రులు మరణించిన తర్వాత సత్యాన్వేషణ కోసం ఇంటిని వదిలిపెట్టాడు. అప్పుడు అతడి వయసు 30 ఏళ్లు.
👉🏻మొదటి రెండు సంవత్సరాలు పార్శ్వనాథుని మతశాఖలో సభ్యుడిగా ఉన్నాడు.
👉🏻తర్వాత దాన్ని వదలి మరో 10 ఏళ్లపాటు అజీవక మతస్థాపకుడైన గోసాల మస్కరిపుత్రతో గడిపాడు.
👉🏻42 ఏళ్ల వయసులో తూర్పు భారతదేశంలోని జృంభిక గ్రామంలో సాల వృక్షం కింద కైవల్యం (సంపూర్ణ జ్ఞానం) పొందాడు. అప్పటి నుంచి జినుడు, జితేంద్రియుడు (జయించినవాడు), మహావీరుడని ప్రసిద్ధి చెందాడు.
👉🏻ఇతడి అనుచరులను జైనులు అంటారు.
👉🏻ఇతడు క్రీ.పూ. 468 లో తన 72 వ ఏట రాజగృహం దగ్గర ఉన్న పావపురిలో మరణించాడు.
👉🏻మహావీరుని బోధనలు:
•మహావీరుడు వేదాల ఆధిపత్యాన్ని ఖండించాడు.
•జంతు బలులకు ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వలేదు.
•ఇతడు ప్రతి చిన్న వస్తువుకు ఆత్మ ఉంటుందని చెప్పాడు. అందుకే జైనులు అహింసను కచ్చితంగా పాటిస్తారు.
•జైనమతం దేవుడి ఉనికిని ఖండించలేదు కానీ, విశ్వం పుట్టుక, కొనసాగడానికి దేవుడే కారణం అనే వాదాన్ని తిరస్కరించింది.
•దేవుడికి జైనమతంలో తీర్థంకరుల కంటే తక్కువ స్థానాన్ని కల్పించారు.
•వీరికి వర్ణవ్యవస్థపై విశ్వాసంలేదు.
•అందుకే వారు విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని పాటించారు.
•మహావీరుడు మోక్షసాధనకు పవిత్రమైన, నైతిక విలువలతో కూడిన జీవితాన్ని గడపాలని బోధించాడు. అలాగే కఠోర తపస్సు అవసరాన్ని నొక్కి చెప్పాడు.

జైన పరిషత్లు:

మొదటి జైనపరిషత్: 

        ఇది పాటలీపుత్రంలో స్థూలభద్రుడి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో పూర్వాలు అనే జైన మత గ్రంథాలను సంస్కరించి, 12 అంగాలుగా సంకలనం చేశారు. ఇవి జైనమత ప్రామాణిక గ్రంథాలు. ఇవి ప్రాకృత భాషలో ఉన్నాయి. వట్టుకార, కార్తికేయ ఈ భాషకు చెందిన కవులు. తర్వాతి కాలంలో ఈ 12 అంగాలకు 'నిర్యుక్తులు' అనే వ్యాఖ్యాన గ్రంథాలను రాశారు. 

        స్థూలభద్రుడు, భద్రబాహుడికి మధ్య వస్త్రాలంకరణ విషయంలో వచ్చిన విభేదాల వల్ల జైనం శ్వేతాంబర (తెల్లటి వస్త్రాలు ధరించడం), దిగంబర (నగ్నంగా ఉండటం) అనే రెండు శాఖలుగా విడిపోయింది. శ్వేతాంబర శాఖకు స్థూలభద్రుడు, దిగంబర శాఖకు భద్రబాహుడు ప్రాతినిధ్యం వహించారు. భద్రబాహుడు 'కల్పసూత్రాలు' రచించాడు.

రెండో జైనపరిషత్: 

        గుజరాత్‌లోని వల్లభిలో దేవార్థి, క్షమాశ్రమణ అధ్యక్షతన జరిగింది. గుజరాత్ పాలకులైన సిద్ధరాజు, కుమార పాలుడు ఈ సమావేశాన్ని ఆదరించారు. ఈ సమావేశంలో 12 అంగాలకు వ్యాఖ్యానాలుగా ఉపాంగాలు రాశారు. ఇవి అర్థమాగథి భాషలో ఉన్నాయి. ఈ సమావేశంలో శ్వేతాంబర నుంచి థెరపంథీలు, దిగంబర నుంచి సమయానులు అనే మరో రెండు శాఖలు ఏర్పడ్డాయి.

మూడో జైనపరిషత్: 

        శ్వేతాంబర, దిగంబర శాఖల మధ్య ఐక్యత కోసం కళింగ రాజైన ఛేది వంశానికి చెందిన ఖారవేలుడు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. ఇతడికి సహకరించిన వర్తక-వ్యాపార వర్గం యాపనీయులు. ఖారవేలుడు ఒరిస్సాలోని ఉదయగిరిలో 17 జైనగుహలను నిర్మించినట్లు హతిగుంఫా శాసనం ద్వారా తెలుస్తోంది.
        ఉచితంగా ఆశ్రయం, భోజనం, విద్యను కల్పించడం, తాంబూలం ఇవ్వడం లాంటివాటిని జైనులు దాన ధర్మాలుగా భావించేవారు.

దిగంబరులు, శ్వేతాంబరులు:
👉🏻మహావీరుడి మరణం తర్వాత చంద్రగుప్త మౌర్యుడి పాలనాకాలంలో క్రీ.పూ. 4వ శతాబ్ది చివరి కాలంలో బీహార్‌లో భయంకరమైన కరువు ఏర్పడింది. ఇది 12 ఏళ్లపాటు ఉంది..
👉🏻దాంతో జైన సన్యాసులు గంగాలోయ నుంచి దక్కనుకు వలస వెళ్లారు.
👉🏻ఈ వలస జైనమతంలో చీలికకు దారితీసింది.
👉🏻మహావీరుడు చెప్పినట్లు దిగంబరత్వాన్ని పాటించాలని భద్రబాహు పేర్కొన్నాడు.
👉🏻ఉత్తర భారతదేశంలో ఉన్న జైనులకు నాయకుడైన స్థూలభద్ర తన అనుచరులను తెల్లబట్టలు ధరించాలని కోరాడు.
👉🏻ఇది జైనమతం దిగంబరులు, శ్వేతాంబరులుగా చీలిపోవడానికి కారణమైంది.

పంచ మహావ్రతాలు:
👉🏻జైనమతంలో అయిదు ముఖ్య సూత్రాలున్నాయి. వీటినే పంచ మహావ్రతాలు అంటారు. అవి.
1) అహింస,
2) సత్యం,
3) అస్తేయం (దొంగిలించకూడదు),
4) అపరిగ్రహ (ఆస్తి కలిగి ఉండకూడదు),
5) బ్రహ్మచర్యం.
👉🏻అహింస, సత్యం, అస్తేయం(దొంగతనం చేయకూడదు), అపరిగ్రహం (ఆస్తి ఉండకూడదు) అనే నాలుగు సూత్రాలను బోధించాడు.
👉🏻అదనంగా ఐదో సూత్రమైన బ్రహ్మచర్యాన్ని మహావీరుడు జోడించాడు.
👉🏻ఈ అయిదు సూత్రాలను సన్యాసులు కఠినంగా ఆచరిస్తే మహావ్రతులని, సామాన్య అనుచరులు ఆచరిస్తే అనువ్రతులని పిలుస్తారు.

త్రిరత్నాలు
👉🏻కర్మను అంతం చేసి మోక్షం పొందాలంటే ప్రతి ఒక్కరూ మూడు సూత్రాలను పాటించాలని బోధించాడు. వీటిని త్రిరత్నాలు అంటారు. అవి..
1. సరైన విశ్వాసం అంటే మహావీరుడి భావనల్లో శ్రద్ధ, విశ్వాసం కలిగి ఉండటం.
2. సరైన జ్ఞానం అంటే మహావీరుడి బోధనల్లోని సత్యాన్ని గ్రహించడం.
3. సరైన నడవడి అంటే జైన పంచ వ్రతాలను ఆచరించడం.

జైనమత వ్యాప్తి, అభివృద్ధి:
👉🏻మహావీరుడు, జైన సన్యాసులు సంస్కృతానికి బదులు సామాన్య ప్రజలు మాట్లాడే భాషను వాడటం, సులభమైన నైతిక నియమావళి, జైన సన్యాసుల కార్యకలాపాలు, రాజుల ఆదరణ మొదలైనవి జైనమత వ్యాప్తికి తోడ్పడ్డాయి.
👉🏻మహావీరుడి అనుచరులు దేశమంతటా విస్తరించారు.
👉🏻అలెగ్జాండర్ భారతదేశంపై దండయాత్ర చేసినప్పుడు జైన సన్యానులు సింధు నది ఒడ్డున ఉన్నట్లు తెలుస్తోంది.
👉🏻జైన సంప్రదాయం ప్రకారం అజాతశత్రువు తర్వాత మగధను పాలించిన ఉదయనుడు జైనమతాభిమాని.
👉🏻నంద వంశరాజులు కూడా జైనమతాన్ని పోషించారు.
👉🏻క్రీ.పూ. 1 వ శతాబ్దంలో ఉజ్జయిని గొప్ప జైనమత కేంద్రంగా ఉండేది.
👉🏻క్రీ.పూ. 4 వ శతాబ్దం చివరినాటికి భద్రబాహు ఆధ్వర్యంలో కొంతమంది జైన సన్యాసులు దక్కనుకు వలస వెళ్లారు. దీంతో మైసూరులోని శ్రావణ బెళగొల కేంద్రంగా జైనమతం దక్షిణ భారతదేశమంతటా వ్యాప్తి చెందింది.

రాజుల ఆదరణ
👉🏻చంద్రగుప్త మౌర్య జైనమతాన్ని పోషించిన వారిలో ప్రముఖుడు. భద్రబాహు దక్కనుకు వలస వెళ్లినప్పుడు, చంద్రగుప్తుడు అతడితోపాటు దక్షిణానికి వెళ్లాడు. ఇతడు ఒక కొండపై ఉన్న గుహను చంద్రగుప్తుడికి అంకితం చేయడంతోపాటు ఆ కొండకు చంద్రగిరి అని నామకరణం చేశాడు.
‣ క్రీ.పూ. 2 వ శతాబ్దంలో కళింగను పాలించిన ఖారవేలుడు జైన మతాన్ని స్వీకరించాడు. ఇతడు జైనుల విగ్రహాలను ఏర్పాటుచేసి జైనమత వ్యాప్తికి కృషి చేశాడు.
‣ కుషాణుల కాలంలో మధురలో, హర్షవర్థనుడి కాలంలో తూర్పు భారతదేశంలో జైనమతం ప్రధాన మతంగా ఉండేది. క్రీ.శ. ప్రారంభంలో ఉత్తర భారతదేశంలోని మధుర, దక్షిణ భారత దేశంలోని శ్రావణ బెళగొల ప్రధాన జైనమత కేంద్రాలుగా ఉండేవి. ఇక్కడ లభించిన శాసనాలు, విగ్రహాలు, ఇతర కట్టడాలే ఇందుకు నిదర్శనం.
‣ క్రీ.శ. 5 వ శతాబ్దంలో దక్షిణ భారతదేశానికి చెందిన గంగ, కదంబ, చాళుక్య, రాష్ట్రకూట రాజవంశాలు జైనమతాన్ని పోషించాయి.
‣ మాన్యఖేటను కేంద్రంగా చేసుకుని తమ పరిపాలనను సాగించిన రాష్ట్రకూటులు జైనమతంపై ప్రత్యేక అభిమానాన్ని ప్రదర్శించారు. వారు జైన కళలు, సాహిత్యం అభివృద్ధికి ప్రోత్సాహాన్ని అందించారు. రాష్ట్రకూట రాజైన అమోఘవర్షుడి కాలంలో జినసేనుడు, గుణభద్రుడు మహాపురాణం అనే గ్రంథాన్ని రచించారు. అమోఘవర్షుడు రత్నమాలిక అనే జైన గ్రంథాన్ని రచించాడు.
‣ క్రీ.శ. 1110 నాటికి గుజరాత్‌లో జైనమతం వ్యాప్తి చెందింది. అన్హిల్‌వారా (Anhilwara) పాలకుడు, జయసింహగా ప్రసిద్ధిచెందిన చాళుక్యరాజు సిద్ధరాజు, కుమారపాల జైనమతాన్ని ఆదరించారు. వారు జైనమతాన్ని స్వీకరించి, జైనుల సాహిత్యాన్ని, దేవాలయాల నిర్మాణ కార్యకలాపాలను ప్రోత్సహించారు. కుమారపాలుడి ఆస్థానంలోని జైనపండితుడు హేమచంద్రుడు రచించిన త్రిషష్టి సలక పురుష చరిత అనే గ్రంథం ప్రసిద్ధిచెందింది.

జైనమత పతనం:
👉🏻భారతదేశంలో జైనమతం పతనం కావడానికి ప్రధాన కారణం అహింసకు మితిమీరిన ప్రాధాన్యం ఇవ్వడమేనని చరిత్రకారుల అభిప్రాయం.
👉🏻అనారోగ్యం పాలైనప్పుడు మందులు వాడితే సూక్ష్మక్రిములు చనిపోతాయి కాబట్టి ఎవరూ మందులు వాడకూడదని జైనులు పేర్కొన్నారు.
👉🏻చెట్లు, కూరగాయల్లో కూడా ప్రాణం ఉంటుంది కాబట్టి వాటికి ఎలాంటి హాని చేయకూడదని నమ్మారు. ఇలాంటి పద్ధతులు సామాన్య ప్రజలకు అంతగా నచ్చలేదు.
👉🏻మొదట్లో జైనమతానికి రాజులనుంచి ఆదరణ లభించినా, తర్వాతికాలంలో ఈ మతానికి అంతగా ప్రాధాన్యం ఇవ్వలేదు.

ప్రాంతీయ భాషల అభివృద్ధి

        ప్రాంతీయ భాషలను మొదట అభివృద్ధి చేసింది జైనులే. వర్థమానుడు అర్థమాగథిని వాడుకభాషగా చేసుకున్నాడు. జైన గ్రంథాలన్నింటినీ ప్రాకృత భాషలో రాశారు.
        నేటి బీహారి భాష (అర్థమాగథి), కన్నడ భాష (కనరాసి), మరాఠి భాష (సౌరసేని) లాంటి ప్రాంతీయ భాషలను జైనులే అభివృద్ధి చేశారు. అమోఘవర్షుడు కన్నడ భాషలో కవిరాజమార్గం, రత్నమాలిక అనే గ్రంథాలను రచించాడు.
విద్యాలయాలు: జైనుల విద్యాలయాలను గచ్ఛలు, సరస్వతి గచ్ఛలు, పుష్పమేషాణ గచ్ఛలు లాంటి పేర్లతో పిలుస్తారు. 

        వీటి స్థాపకుడు కొనకుందాచార్యులు. ఢిల్లీ, కొల్హాపూర్, కంచి, పెనుగొండ లాంటి ప్రాంతాల్లో విద్యాలయాలు స్థాపించారు. కొనకుందాచార్యులు, ఉమాస్వాతి, గృథపింఛ, బాలకపింఛ, సింహనంది వీటికి ఉపకులపతులుగా పనిచేశారు. చివరివారైన సింహనంది పేరూరు (కడప) ప్రాంతవాసి.


జైన నిర్మాణాలు (బసదీలు)

* చాముండరాయలు మైసూరు (కర్ణాటక)కు సమీపంలోని శ్రావణ బెళగొళలో గోమఠేశ్వర (బాహుబలి) విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఇక్కడే చంద్రగుప్త మౌర్యుడు సల్లేఖన వ్రతాన్ని స్వీకరించి పరమపదించాడు.
* కుమారపాల, సిద్ధపాల, తేజపాల రాజస్థాన్‌లోని మౌంట్ అబూ శిఖరంలో పాలరాతితో 'దిల్వారా దేవాలయాలను' నిర్మించినట్లు ఆధారాలున్నాయి. ఈ దేవాలయంలో జైనుల స్త్రీ దేవత 'విద్యాదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.
* మధ్యప్రదేశ్ చందేల రాజులు నిర్మించిన ఖజురహో దేవాలయాల్లోనూ 'విద్యాదేవి' విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.
* మహారాష్ట్రలోని ఎల్లోరాలో ఉన్న 34 గుహల్లో 17 వైదిక మతానికి, 12 బౌద్ధానికి, 5 జైనమతానికి చెందినవి. ఇవి పరమత సహనానికి నిదర్శనంగా ఉన్నాయి.
* ఒరిస్సాలోని ఉదయగిరిలో ఉన్న 17 గుహలు జైనమతానికి సంబంధించినవే.
ఆంధ్రప్రదేశ్: అనంతపురంలోని 'కొండాంద కొండాపురం'లో జైనుల నిర్మాణాలున్నాయి. ఇక్కడి ప్రధాన ఆచార్యులు 'పద్మనంది' (కొనకొందాచార్యులు). ఇతడు 'సమయసారం' గ్రంథాన్ని రచించాడు. పశ్చిమగోదావరి - పెనుగొండలో వైశ్యుల కులదేవతగా ప్రసిద్ధి చెందిన (వేంగి చాళుక్యుల కాలంలో) 'వాసవీ కన్యకా పరమేశ్వరి' దేవాలయం ఉంది. నల్లగొండ జిల్లాలోని కొలనుపాకలో జైన దిగంబర క్షేత్రం ఉంది. మెదక్‌లోని పొట్లచెరువులో 500 జైన బసదులున్నాయి. ఆంధ్రదేశంలో జైనం ఉన్నట్లు 'ముషినికొండ తామ్ర శాసనం' ద్వారా తెలుస్తోంది. దీన్ని మూడో విష్ణువర్థనుడు వేయించాడు.


No comments:

Post a Comment

Post Bottom Ad