తూర్పు చాళుక్యులు (క్రీ.శ. 624 - 1076) - GNANA SAMHITHA

Breaking

Post Top Ad

Thursday, March 20, 2025

తూర్పు చాళుక్యులు (క్రీ.శ. 624 - 1076)

👉🏻క్రీ.శ.624లో కుబ్జవిష్ణువర్థనుడు వేంగి రాజధానిగా తూర్పు చాళుక్య రాజ్యాన్ని స్థాపించాడు. ఈ వంశం క్రీ.శ.1076 వరకు ఆంధ్రదేశాన్ని పరిపాలించింది.
👉🏻చాళుక్యులు క్షత్రియులు.
👉🏻వీరు మధ్య ఆసియాకు చెందినవారని లూయీరైస్ అనే చరిత్రకారుడు పేర్కొన్నాడు.
👉🏻ఈ వంశానికి చెందిన చిలికి రెమ్మణక అనే పాలకుడు ఇక్ష్వాకులకు సామంతుడిగా హిరణ్య ప్రాంతాన్ని (కడప, కర్నూలు) పాలించినట్లు నాగార్జున కొండ శాసనం తెలుపుతోంది.
👉🏻తూర్పు చాళుక్యులు హారితీ పుత్ర అనే మాతృసంజ్ఞను ఉపయోగించారు.
👉🏻చాళుక్యులు బ్రహ్మచుళకం నుంచి పుట్టారని బిల్వణుడి విక్రమాంక దేవ చరిత్ర గ్రంథం పేర్కొంది.
👉🏻తూర్పు చాళుక్యుల్లో గొప్పవాడు గుణగ విజయాదిత్యుడు కాగా చివరి చక్రవర్తి ఏడో విజయాదిత్యుడు.

రాజకీయ చరిత్ర

కుబ్జ విష్ణువర్థనుడు (క్రీ.శ. 624 - 642):
👉🏻బాదామి చాళుక్య రాజు రెండో పులకేశి సోదరుడు కుబ్జ విష్ణువర్థనుడు.
👉🏻రెండో పులకేశి కునాల, పిష్ఠపురం యుద్ధాల్లో తూర్పు ప్రాంతాలను జయించి కుబ్జ విష్ణువర్థనుడిని పాలకుడిగా నియమించాడు.
👉🏻రెండో పులకేశి మరణానంతరం కుబ్జ విష్ణువర్థనుడు స్వతంత్ర పాలన ప్రారంభించాడు.
👉🏻విషమసిద్ధి, మకరధ్వజుడు, మహారాజు, కాయదేవ లాంటి బిరుదులు ధరించాడు.
👉🏻చీపురుపల్లి, తిమ్మాపురం శాసనాలు వేయించాడు.
👉🏻తిమ్మాపురం శాసనంలో పరమ భాగవతుడు అనే బిరుదు ధరించినట్లు ఉంది.
👉🏻అటవీ దుర్జయుడు ఇతడి సామంతుల్లో ప్రధానమైనవాడు.
👉🏻కుబ్జవిష్ణువర్థనుడి రాజ్యాన్ని చైనా యాత్రికుడు హుయాన్‌త్సాంగ్ సందర్శించాడు.
👉🏻ఇతడి ఆస్థానంలో కాళకంప, బుద్ధవర్మ అనే సైన్యాధిపతులు ఉండేవారు.
👉🏻కుబ్జవిష్ణువర్ధనుడి భార్య అయ్యణ మహాదేవి విజయవాడలో జైనులకు నెడుంబవసది గుహాలయాలు నిర్మించి ముషినికొండ గ్రామాన్ని దానం చేసింది.
👉🏻కుబ్జవిష్ణువర్థనుడు పిఠాపురంలో కుంతీమాధవస్వామి ఆలయం నిర్మించాడు.

మొదటి జయసింహ వల్లభుడు (క్రీ.శ. 642-673)
👉🏻కుబ్జవిష్ణువర్థనుడి తర్వాత మొదటి జయసింహ వల్లభుడు రాజయ్యాడు.
👉🏻ఇతడు సర్వలోకాశ్రయ, సర్వసిద్ధి లాంటి బిరుదులు ధరించాడు.
👉🏻తూర్పు చాళుక్యపల్లవ ఘర్షణలు ఇతడి కాలంలోనే ప్రారంభమయ్యాయి.
👉🏻పొలమూరు, పెద్దమద్దాల శాసనాలు ఇతడి విజయాలను వివరిస్తాయి.
👉🏻ప్రాచీన తెలుగు శాననాల్లో ఒకటైన విప్పర్ల శాసనం వేయించింది మొదటి జయసింహ వల్లభుడే.
👉🏻ఇతడి తర్వాత ఇంద్రభట్టారకుడు, రెండో విష్ణువర్థనుడు, మంగియువరాజు, రెండో జయసింహుడు వరుసగా పాలించారు.
👉🏻ఇంద్ర భట్టారకుడు- త్యాగధేను, మకర ధ్వజ; మంగి యువరాజు సమస్త భువనాశ్రయ; రెండో విష్ణువర్థనుడు ప్రళయాదిత్య; రెండో జయసింహుడు నిరవద్య బిరుదుతో పాలన చేశారు.
👉🏻అతి తక్కువ కాలం (7 రోజులు మాత్రమే) పాలన చేసింది ఇంద్ర భట్టారకుడు.

మూడో విష్ణువర్థనుడు (క్రీ.శ. 718-752):
👉🏻రెండో జయసింహుడి తర్వాత క్రీ.శ.718లో మూడో విష్ణువర్థనుడు పాలకుడయ్యాడు.
👉🏻త్రిభువనాంకుశ, కవి పండిత కామధేనువు అనే బిరుదులు ధరించాడు.
👉🏻యలమంచిలి పాలకుడు కొక్కిలి విక్రమాదిత్యుడిని, పల్లవ రాజురెండో నందివర్మను ఓడించాడు.
👉🏻రెండో నందివర్మ నుంచి భోయకొట్టాలు (నెల్లూరు) ప్రాంతాన్ని ఆక్రమించాడు. మూడో విష్ణువర్థనుడి సేనాని ఉదయచంద్రుడు.

మొదటి విజయాదిత్యుడు (క్రీ.శ. 753 - 770):
👉🏻మహా రాజాధిరాజా, భట్టారక లాంటి బిరుదులు పొందాడు.
👉🏻ఇతడి కాలంలోనే తూర్పుచాళుక్య రాష్ట్రకూట సంఘర్షణలు ప్రారంభమయ్యాయి.
👉🏻రాష్ట్ర కూటరాజు మొదటి కృష్ణుడి కుమారుడైన యువరాజు గోవిందుడి చేతిలో మొదటి విజయాదిత్యుడు ఓటమి పాలయ్యాడు.
👉🏻ఈ విషయాన్ని రెండో గోవిందుడి అలాస్ శాసనం వివరిస్తుంది.

నాలుగో విష్ణువర్థనుడు (క్రీ.శ. 771 - 806):
👉🏻మొదటి విజయాదిత్యుడి తర్వాత అతడి కుమారుడు నాలుగో విష్ణువర్థనుడు రాజ్యపాలన చేపట్టాడు.
👉🏻నాటి రాష్ట్ర కూటరాజు ధ్రువుడి చేతిలో ఓడిపోవడమే కాకుండా తన కుమారై శీలమహాదేవిని ధ్రువుడికి ఇచ్చి పెళ్లి చేశాడు.
👉🏻వేములవాడ చాళుక్య రాజైన మొదటి అరికేసరి ధ్రువుడి తరపున వచ్చి నాలుగో విష్ణువర్థనుడిని ఓడించినట్లు పంప రచించిన విక్రమార్జున విజయం గ్రంథం తెలుపుతోంది.
👉🏻నాలుగో విష్ణువర్థనుడు రాష్ట్రకూటులకు సామంతుడిగా వ్యవహరించాడు.

రెండో విజయాదిత్యుడు (క్రీ.శ. 813 - 846):
👉🏻నాలుగో విష్ణువర్థనుడి తర్వాత అతడి కుమారుడు రెండో విజయాదిత్యుడికి, భీమసలుకికి మధ్య వారసత్వ యుద్ధం జరిగింది.
👉🏻ఈ వారసత్వ తగాదాలో భీమసలుకికి రాష్ట్ర కూటరాజు మూడో గోవిందుడు సహాయం చేశాడు. ఫలితంగా రెండో విజయాదిత్యుడు ఓడిపోయాడు.
👉🏻అయితే మూడో గోవిందుడి ఆకస్మిక మరణంతో బాలుడైన అతడి కుమారుడు అమోఘవర్షుడు సింహాసనం అధిష్టించాడు. దీన్ని అవకాశంగా తీసుకున్న రెండో విజయాదిత్యుడు భీమసలుకికిని ఓడించి క్రీ.శ.813లో రాజ్యానికి వచ్చాడు.
👉🏻గుజరాత్ రాష్ట్ర పాలకుడైన సువర్ణ వర్ష కర్కరాజు రెండో విజయాదిత్యుడితో సంధి చేసుకుని తన కుమారైను విజయాదిత్యుడి కుమారుడు కలి విష్ణువర్థనుడికి ఇచ్చి వివాహం జరిపించాడు.
👉🏻ప్రతీహార వంశరాజు నాగభట్టు కూడా విజయాదిత్యుడి చేతిలో ఓడినట్లు తెలుస్తోంది.
👉🏻రెండో విజయాదిత్యుడు 108 యుద్ధాలు చేసి, 108 శివాలయాలు నిర్మించాడు. నరేంద్ర మృగరాజు, మహావీరుడు, చాళుక్యరామ, విక్రమధావళి అనే బిరుదులు పొందాడు.
👉🏻విజయాదిత్యుడి వల్లే బెజవాడ విజయవాడ అయిందని చరిత్రకారుల అభిప్రాయం.

అయిదో విష్ణువర్థనుడు (క్రీ.శ. 847 - 848):
👉🏻రెండో విజయాదిత్యుడి తర్వాత అతడి కుమారుడు కలి విష్ణువర్థనుడు/అయిదో విష్ణువర్థనుడు ఒక్క సంవత్సరమే పరిపాలించాడు.
👉🏻అయిదో విష్ణువర్థనుడు, శీల మహదేవి దంపతులకు విజయాదిత్య, నృపకాయ, యుద్ధమల్ల అనే ముగ్గురు కుమారులు జన్మించారు.

గుణగ విజయాదిత్యుడు/మూడో విజయాదిత్యుడు (క్రీ.శ. 848 - 891):
👉🏻తూర్పు చాళుక్య రాజుల్లో అత్యంత ప్రసిద్ధి చెందిన గొప్ప పాలకుడు గుణగ విజయాదిత్యుడు.
👉🏻అతడు వేయించిన తొమ్మిది శాసనాలు లభించాయి. వాటిలో మచిలీపట్నం శాసనం, గుంటూరు శాసనం, సాతలూరు శాసనం, సీసలి శాసనం (ఇవన్నీ తామ్ర శాసనాలు), అద్దంకి శిలా శాసనం ముఖ్యమైనవి.
👉🏻చాళుక్య భీముడి అత్తిలి శాసనం, అమ్మరాజు ఈడేరు, కలుచుంబర్రు శాసనాలు కూడా గుణగ విజయాదిత్యుడి విజయాలను వివరిస్తున్నాయి.
👉🏻ఇతడి సేనాని పాండురంగడు వేయించిన అద్దంకి శాసనంలో (తొలి పద్య శాసనం) తరువోజ వృత్తం ఉంది.
👉🏻పాండురంగడు బోయకొట్టాలను ఓడించి వారి రాజధాని కిరణపురం (నెల్లూరు)ను తగులబెట్టాడు.
👉🏻గుణగ విజయాదిత్యుడి నలుగురు బ్రాహ్మణ సేనానులు కడియరాజు, పాండురంగడు, వినయడి శర్మ, రాజ్యాదిత్యుడు.
👉🏻గుణగ విజయాదిత్యుడు మొదట రాష్ట్రకూట అమోఘవర్షుడికి సామంతుడిగా ఉండి పాలన చేశాడు.
👉🏻తర్వాత వింగవల్లి యుద్ధంలో అమోఘవర్షుడిని ఓడించాడు.
👉🏻అతడి సామంతులైన పశ్చిమ గంగరాజు రణవిక్రముడిని, వేములవాడ చాళుక్యరాజుబద్దెగుడు (సోలగదండ)ను ఓడించాడు.
👉🏻తర్వాత రాష్ట్రకూట రెండోకృష్ణుడిని ఓడించి పాళీధ్వజాన్ని, గంగాయమునా తోరణాన్ని తన ధ్వజంపై ముద్రించాడు. ఈ విషయాన్ని సాతలూరు శాసనం వివరిస్తుంది. కాబట్టి వేంగి చాళుక్యులను చండచాళుక్యులు అంటారు.
👉🏻గుణగ విజయాదిత్యుడు త్రిపురమర్త్య మహేశ్వర, దక్షిణాపతి, పరచక్రరామ, భువన కందర్ప, వీరమకరధ్వజ, రణరంగ శూద్రక, మనుజప్రకార బిరుదులు పొందాడు.
👉🏻ఇతడి రాజ్యాన్ని అరబ్ యాత్రికుడు సులేమాన్ సందర్శించాడు.

చాళుక్య భీముడు/ ఆరో విష్ణువర్ధనుడు (క్రీ.శ. 892 - 922):
👉🏻గుణగ విజయాదిత్యుడి మరణానంతరం వేంగి చాళుక్య రాజ్యంలో అంతఃకలహాలు చెలరేగాయి.
👉🏻చాళుక్య భీముడి దాయాదులు, పినతండ్రి యుద్ధమల్లుడు ఇతడిని అడ్డుకున్నారు. కాని చాళుక్య భీముడు శత్రువులను, రాష్ట్రకూట సైన్యాలను పారదోలి విజయం సాధించినట్లు అతడి పందిపాక శాసనం తెలియజేస్తుంది.
👉🏻రణమర్థ వంశస్తుల మంచికొండ నాడును రాష్ట్రకూట సైన్యం వేములవాడ బద్దెగ నాయకత్వంలో ఆక్రమించింది.
👉🏻''మొసలిని జలాయశయంలో బంధించినట్లుగా భీముడిని బద్దెగ బంధించాడు" అని పంప రచించిన విక్రమార్జున విజయం గ్రంథం తెలియజేస్తుంది. కానీ రణమర్థ వంశస్తుడైన కుసుమాయుధుడు రాష్ట్రకూట (రట్టడి) సైన్యాలను ఓడించి, చాళుక్య భీముడిని విడిపించాడు. కొరవి శాసనం ఈ విషయాన్ని తెలుపుతోంది.
👉🏻చాళుక్య భీముడు క్రీ.శ.892లో ఆరో విష్ణువర్థనుడు అనే నామాంతరంతో పట్టాభిషేకం జరుపుకున్నాడు. చాళుక్య భీముడు 360 యుద్ధాలు చేశాడని మల్లపదేవుడి పిఠాపురం శాసనం చెబుతుంది.
👉🏻వేంగి రాజ్యంపై దండెత్తి వచ్చిన రాష్ట్రకూట రెండో కృష్ణుడి సైన్యాన్ని చాళుక్య భీముడి కుమారుడైన ఇరుమర్తి గండడు నిరవద్యపురం, పెరువంగూరు యుద్ధాల్లో ఓడించాడు. ఈ దాడిలో రాష్ట్రకూట సేనాని గుండయ మరణించాడు.
👉🏻చాళుక్య భీముడి ఆస్థానంలో చల్లవ్వ అనే గాంధర్వ విద్యాప్రవీణురాలు ఉండేది. చాళుక్య భీముడు ఆమెకు అత్తిలి గ్రామంలో మాన్యాన్ని దానం చేశాడు.
👉🏻కావ్యాలంకార సూత్ర అనే గ్రంథాన్ని రచించిన భట్టవామనుడు భీముడి ఆస్థానంలో ఉన్నాడు. ఇతడి బిరుదు కవి వృషభ.
👉🏻ద్రాక్షారామ, చేబ్రోలు, చాళుక్య భీమవరం, భీమేశ్వరాలయాలను నిర్మించింది చాళుక్య భీముడే. పంచారామాలను (అమరారామం, కుమారారామం, ద్రాక్షారామం, క్షీరారామం, సోమారామం) చాళుక్య భీముడు అభివృద్ధి చేశాడు.
👉🏻భీముడి కాలంలోనే హల్లీశకం అనే కోలాట నృత్యరీతి అభివృద్ధి చెందింది. భీముడి సామంతుడు చట్టప బెజవాడ ఇంద్రకీలాద్రిపై పార్థేశ్వరాలయాన్ని నిర్మించాడు.
👉🏻బౌద్ధ ఆరామాలను పంచారామాలుగా మార్పు చేసింది భీముడే. దాది అనే స్త్రీ భీముడికి పాలిచ్చి పెంచినట్లుగా చెబుతారు.
👉🏻భీముడి తర్వాత అతడి కుమారుడు నాలుగో విజయాదిత్యుడు కొల్లభిగండ బిరుదుతో పాలనకు వచ్చాడు. కానీ కళింగపై దండెత్తి విరజాయుద్ధంలో మరణించాడు. తర్వాత మొదటి విక్రమాదిత్యుడు పాలనకు వచ్చినట్లు నూతిమడగు శాసనం తెలుపుతుంది.

మొదటి అమ్మరాజు (క్రీ.శ. 921 - 928):
👉🏻అమ్మరాజు ఈడేరు శాసనం ప్రకారం పినతండ్రి మొదటి విక్రమాదిత్యుడిని తొలగించి రాజ్యానికి వచ్చినట్లు తెలుస్తోంది.
👉🏻మొదటి అమ్మరాజుకు రాజమహేంద్ర అనే బిరుదు ఉంది.
👉🏻తన బిరుదు పేరు మీదగానే క్రీ.శ.921లో అమ్మరాజు రాజమహేంద్రవరంను నిర్మించినట్లు విన్నకోట పెద్దన రచించిన కావ్యాలంకార చూడామణి గ్రంథం తెలియజేస్తుంది. V 👉🏻మొదటి అమ్మరాజు నాలుగో విజయాదిత్యుడి కుమారుడు. మహాకాల, భండనాదిత్య లాంటి సేనానులు అమ్మరాజు విజయాల్లో సహాయపడ్డారు.
👉🏻చాళుక్య భీముడికి పాలిచ్చి పెంచిన దాది కుమార్తె గౌమకాంబ. ఈమె కుమారుడే మహాకాల.
👉🏻మొదటి అమ్మరాజు తర్వాత అతడి కుమారుడు కంటిక విజయాదిత్యుడు పాలనను వచ్చాడు. కానీ రెండో విక్రమాదిత్యుడు అతడిని 15 రోజుల్లోనే తొలగించి తనే పాలకుడయ్యాడు.
👉🏻అమ్మరాజు మరొక కుమారుడైన రెండో చాళుక్య భీముడు రెండో విక్రమాదిత్యుడిని సంహరించి ఎనిమిది నెలలు వేంగిని పాలించినట్లు తెలుస్తోంది.
👉🏻ఈ ఎనిమిది నెలల కాలంలో రాజ్యం ఎంతో అల్లకల్లోలమైనట్లు రెండో అమ్మరాజు వేయించిన మలియంపూడి శాసనం వివరిస్తుంది.
👉🏻రెండో విక్రమాదిత్యుడి తర్వాత మొదటి యుద్ధమల్లు రాజయ్యాడు. తర్వాత రెండో చాళుక్య భీముడు తిరిగి రాజయ్యాడు.
👉🏻మొదటి యుద్ధమల్లుడు క్రీ.శ.930 934 మధ్య పాలించాడు.
👉🏻తర్వాత రెండో చాళుక్య భీముడు క్రీ.శ.935లో రాజయ్యాడు. నాలుగో విజయాదిత్యుడు,
👉🏻వేలాంబల కుమారుడే రెండో చాళుక్య భీముడు. ఇతడు కోలవెన్ను శాసనం వేయించాడు. రెండో చాళుక్య భీముడి భార్యలు అంకిదేవి, లోకాంబిక. అంకిదేవి కుమారుడు దానార్ణవుడు కాగా లోకాంబిక కుమారుడు రెండో అమ్మరాజు.
👉🏻రెండో యుద్ధమల్లుడు: క్రీ.శ.940లో రెండో చాళుక్య భీముడు మరణించడంతో రెండో యుద్ధమల్లుడు రాష్ట్రకూటరాజు నాలుగో గోవిందుడి సహాయంతో రాజయ్యాడు.
👉🏻ఇతడు చేబ్రోలు రాజధానిగా పాలించినట్లు బెజవాడ శాసనం తెలియజేస్తుంది. కానీ, నేలటూరి వెంకట రమణయ్య అభిప్రాయం ప్రకారం రెండో యుద్ధ మల్లు రాజధాని బెజవాడ. ఇతడు వేయించిన బెజవాడ శాసనంలో తెలుగు చంధస్సుకు చెందిన మధ్యాక్కరలు ఉన్నాయి. ఇతడి కాలంలోనే నన్నెచోడుడు తెలుగులో కుమార సంభవం గ్రంథాన్ని రచించాడు.
👉🏻మొదటి యుద్ధమల్లు విజయవాడలో కార్తికేయ ఆలయం నిర్మించగా, రెండో యుద్ధమల్లు నాగమల్లీశ్వరి ఆలయాన్ని నిర్మించాడు.

రెండో అమ్మరాజు (ఆరో విజయాదిత్యుడు) (క్రీ.శ. 945 - 970):
👉🏻రెండో చాళుక్య భీముడు, లోకాంబికల పుత్రుడు రెండో అమ్మరాజు.
👉🏻ఇతడు క్రీ.శ.945లో రెండో యుద్ధమల్లుడిని వధించి పాలనకు వచ్చాడు.
👉🏻కానీ తన సోదరుడు దానార్ణవుడు, యుద్ధమల్లుడి కుమారులైన బాడపుడు, తాళరాజులు తిరుగుబాట్లు చేశారు.
👉🏻ఇతడి పాలన గురించి తాడికొండ, మలియంపూడి, కలుచుంబర్రు శాసనాలతో పాటు బాడపుడి ఆరుంబాక శాసనం, దానార్ణవుడి మాగల్లు శాసనం తెలియజేస్తున్నాయి.
👉🏻రెండో అమ్మరాజు పాలనలో రాష్ట్రకూట రాజు మూడో కృష్ణుడి దండయాత్ర జరిగింది.
👉🏻ఈ దండయాత్ర గురించి దానార్ణవుడి మాగల్లు శాసనం తెలుపుతుంది. రెండో అమ్మరాజు జైనమతాన్ని అవలంబించాడు.
👉🏻ఇతడి భార్య చామేకాంబ సర్వలోకాశ్రయ జైన ఆలయాన్ని నిర్మించి కలచుంబర్రు గ్రామాన్ని దానం చేసింది.
👉🏻ఇతడు ప్రకాశం జిల్లాలో కఠకాభరణ జినాలయాన్ని నిర్మించాడు. చామేకాంబ జైనమత గురువు పేరు అర్హనంది.
👉🏻రెండో అమ్మరాజు ఆస్థానంలో కవి చక్రవర్తి బిరుదాంకితుడైన పోతనభట్టు, మాధవభట్టు, భట్టుదేవుడు అనే కవులు ఉండేవారు.
👉🏻రెండో అమ్మరాజు కవిగాయక కల్పతరువు, పరమ బ్రాహ్మణ్య, పరమ మహేశ్వర, పరమ భట్టారక బిరుదులు పొందాడు.

దానార్ణవుడు (క్రీ.శ. 970 - 973):
👉🏻మాగల్లు శాసనం ప్రకారం క్రీ.శ.970లో దానార్ణవుడు రెండో అమ్మరాజును వధించి రాజ్యానికి వచ్చాడు.
👉🏻చోళుల సహాయంతో కల్యాణిచాళుక్యుల దాడులను ఎదుర్కోవాలని ప్రయత్నించాడు కాని వారి సహాయం లభించలేదు.
👉🏻క్రీశ.973లో జటాఛోడభీముడు దానార్ణవుడిని ఓడించి చంపాడు. శక్తివర్మ, విమలాదిత్యులు దానర్ణవుడి కుమారులు.

జటాఛోడ భీముడు (క్రీ.శ. 973 - 1000):
👉🏻కర్నూలు మండలంలోని పెద్దకల్లును పాలించిన తెలుగుఛోడ వంశస్థుడు జటాఛోడ భీముడు.
👉🏻కైలాసనాథ దేవాలయ శాసన ఖండం ఇతడి విజయాలను తెలుపుతుంది.
👉🏻ఏకవీర, బద్దెన, మహావీర అనేవారు జటాఛోడ భీముడి సేనానులు.
👉🏻దానార్ణవుడి మరణానంతరం శక్తివర్మ, విమలాదిత్యులు కళింగకు వెళ్లి తూర్పుగాంగుల ఆశ్రయం పొందారు కానీ, తూర్పు గాంగరాజు కామార్ణవుడు కూడా జటాఛోడ భీముడి చేతిలో ఓడిపోయాడు.
👉🏻జటాఛోడ భీముడు వైదంబుల రాజ్యంపై దండెత్తి భువన త్రినేత్రుడిని ఓడించి ఛోడత్రినేత్ర బిరుదును పొందాడు.
👉🏻చివరికి శక్తివర్మ చోళరాజరాజు సహాయంతో జటాచోఢ భీముడిని వధించి వేంగి పాలకుడైనాడు.

మొదటి శక్తి వర్మ:
రాజరాజు సహాయంతో జటాచోఢ భీముడిని వధించి చాళుక్య చంద్రుడు అనే బిరుదుతో మొదటి శక్తి వర్మ రాజ్యపాలన చేశాడు.
కల్యాణి చాళుక్యరాజు సత్యాశ్రయుడు (తైలపుని కుమారుడు) తన సేనాని బయలనంబి నాయకత్వంలో వేంగిపైకి సైన్యాన్ని పంపాడు.
కాని శక్తివర్మ రాజరాజు సహాయంతో విజయం సాధించినట్లు హొట్టూరు శాసనం తెలుపుతుంది.
కర్ణాటకలో బయల నంబి సైన్యాలను చోళ రాకుమారుడు రాజేంద్రచోళుడు ఓడించాడు. మొదటి శక్తివర్మ నాణేలు సయాం ప్రాంతంలో లభించాయి.

విమాలాదిత్యుడు (క్రీ.శ. 1011 - 1018):
శక్తివర్మ మరణానంతరం పాలనకు వచ్చింది అతని తమ్ముడు విమలాదిత్యుడు.
ఇతడు రాజరాజు కుమార్తె కుందవ్వను, జటాఛోడ భీముడి కుమార్తె మేళమను వివాహం చేసుకున్నాడు.
కుందవ్వ కుమారుడు రాజరాజ నరేంద్రుడు కాగా మేళమ లేదా మేళాంబిక కుమారుడు విజయాదిత్యుడు.
విమాలాదిత్యుడి గురువు సిద్ధాంతయోగి (జైనుడు). సిద్ధాంత దేవుడి బిరుదు త్రికాలయోగి.
విమలాదిత్యుడు తన గురువు త్రికాలయోగి కోసం రామతీర్థం (విజయనగరం జిల్లా)లో రామకొండ గుహాలయాన్ని నిర్మించాడు.

రాజరాజ నరేంద్రుడు (క్రీ.శ. 1019 - 1060):
👉🏻సవతి సోదరుడు విజయాదిత్యుడితో వారసత్వ తగాదా జరిగింది.
👉🏻విజయాదిత్యుడికి నాటి కల్యాణి చాళుక్యరాజు జయసింహుడు సహాయాన్ని అందించి చావణ్ణరసు సేనాని నాయకత్వంలో సైన్యాలను పంపాడు.
👉🏻కాని చోళుల సహాయంతో రాజరాజ నరేంద్రుడు కలిదిండి యుద్ధంలో వారిని ఓడించాడు. ఈ యుద్ధంలో చనిపోయిన చోళసేనానుల స్మృత్యర్థం రాజరాజనరేంద్రుడు మూడు శివాలయాలు నిర్మించాడు.
👉🏻మళ్లీ కల్యాణి చాళుక్య జయసింహుడి కుమారుడు సోమేశ్వరుడితో యుద్ధం చేయాల్సి వచ్చింది.
👉🏻చోళ రాజాధిరాజు ధరణికోట, కొల్లిపాక యుద్ధాల్లో వారిని ఓడించి కొల్లిపాకను ధ్వంసం చేశాడు.
👉🏻ఏతగిరిలో విజయస్తంభం నాటాడు. కాని రాజాధిరాజు సోమేశ్వరుడితో జరిగిన కొప్పం యుద్ధంలో ప్రాణాలు కోల్పోయాడు.
👉🏻దాంతో రాజరాజనరేంద్రుడు సోమేశ్వరుడికి సామంతుడిగా పాలన చేయాల్సి వచ్చింది. సోమేశ్వరుడు నారాయణభట్టును రాజరాజనరేంద్రుని ఆస్థానానికి పంపాడు.
👉🏻నారాయణభట్టు కుమార్తె కుప్పమ ద్రాక్షారామ శాసనం వేయించింది. రాజరాజనరేంద్రుడు రాజేంద్ర చోళుని కుమార్తె అమ్మాంగదేవిని వివాహం చేసుకున్నాడు.
👉🏻పశ్చిమ/కల్యాణి చాళుక్యులు సమస్త భువనాశ్రయ, సత్యాశ్రయ కులశేఖర లాంటి బిరుదులు పొందారు.
👉🏻నన్నయ కూడా తన ఆంధ్ర మహాభారత గ్రంథంలో ఈ బిరుదులు ప్రస్తావించాడు. కాబట్టే రాజరాజనరేంద్రుడు కల్యాణి చాళుక్యుల సామంతుడిగా ఉన్నట్లు భావిస్తున్నారు.
👉🏻రాజరాజ నరేంద్రుడు, అమ్మాంగ దేవిల కుమారుడు రాజేంద్రుడు (కులోత్తుంగ చోళుడు).
👉🏻ఇతడు 1075లో చోళచాళుక్య పాలన ప్రారంభించాడు. దాంతో వేంగి చోళరాజ్యంలో ఒక రాష్ట్రంగా చేరిపోయింది.
👉🏻రాజరాజ నరేంద్రుడు తన ఆస్థానంలో నన్నయ, నారాయణభట్టు, పావులూరి మల్లన కవులను పోషించాడు.
👉🏻నారాయణభట్టు సహాయంతో నన్నయ మహాభారతాన్ని తెలుగులో రాసి ఆదికవిగా పేరొందాడు. పావులూరి మల్లన గణితసార సంగ్రహం అనే గ్రంథాన్ని రచించాడు.
👉🏻తొలి తెలుగు వ్యాకరణ గ్రంథం ఆంధ్రశబ్ద చింతామణి లేదా ఆంధ్ర భాషానుశాసనం ను నన్నయ రాశాడు.
👉🏻రాజరాజనరేంద్రుడు నారాయణభట్టుకు నందంపూడి అగ్రహారాన్ని, పావులూరి మల్లనకు నవఖండవాడ అగ్రహారాన్ని దానం చేశాడు.
👉🏻నన్నయ నందంపూడి శాసనాన్ని వేయించాడు. రాజరాజ నరేంద్రుడు తన రాజధానిని వేంగి నుంచి రాజమహేంద్రవరానికి మార్చుకున్నాడు. ఇతడికి కావ్యగీతిప్రియుడు అనే బిరుదుంది.
👉🏻ఏడో విజయాదిత్యుడు: చివరి వేంగి చాళుక్యరాజు ఏడో విజయాదిత్యుడు. కల్యాణి చాళుక్యరాజు విక్రమాదిత్యుడితో పోరాటంలో తన కుమారుడు రెండో శక్తివర్మను కోల్పోయాడు.
👉🏻ఓడిపోయిన విజయాదిత్యుడు వారికి సామంతుడిగా పాలన చేశాడు. క్రీ.శ.1075లో ఇతడి మరణంతో వేంగి చాళుక్య రాజ్యం అంతరించి చోళరాజ్యంలో విలీనమైంది.

పాలనాంశాలు

👉🏻వేంగి చాళుక్యులు తమ రాజ్యాన్ని విషయాలు, నాడులు, కొట్టాలు, గ్రామాలుగా విభజించారు.
👉🏻రాజు సర్వాధికారి, సప్తాంగ సిద్ధాంతాన్ని అనుసరించారు.
👉🏻రాజు, రాజ్యం, మంత్రి, దుర్గం, కోశం, సైన్యం, మిత్రుడు అనేవి సప్తాంగాలు.
👉🏻వీరికాలం నాటి మంత్రిమండలి గురించి మొదటి అమ్మరాజు మాగల్లు శాసనం తెలియజేస్తుంది.
👉🏻నాటి మంత్రి మండలిని అష్టాదశ తీర్థులు అనేవారు.
👉🏻యువరాజు లేదా ఉపరాజు, సేనాపతి, కోశాధికారులు సలహాలు ఇచ్చేవారు.
👉🏻రెండో అరికేసరి వేములవాడ శాసనంలో మహాసంధి విగ్రాహి, తంత్రపాల, సత్రాధిపాల అనే ఉద్యోగుల పేర్లున్నాయి.
👉🏻నాటి ఉద్యోగి బృందాన్ని నియోగాధిపతులు అనేవారు. రాజ్యంలో 30 విషయాలున్నట్లు ఆధారాలు లభిస్తున్నాయి.
👉🏻ఆస్థాన న్యాయాధికారులను ప్రాఢ్వివాక్కులు అని, న్యాయమూర్తులు చదివే తీర్పులను జయపత్రాలు అని వ్యవహరించేవారు.
👉🏻రెండో చాళుక్య భీముడి మచిలీపట్నం శాసనం అగ్రహారాల్లో బ్రాహ్మణ పరిషత్‌లున్నట్లు పేర్కొంటుంది.
👉🏻గ్రామసభను వారియం అని, గ్రామసభ కార్యనిర్వాహక మండలిని పంచ వారియం అని పేర్కొనేవారు.
👉🏻గ్రామ పెద్దలను (గ్రామణి), గ్రామేయకులు, కుటుంబీకులు, కాపులు అని పిలిచేవారు.
👉🏻శాసనాల్లో పేర్కొన్న నియోగాధికృత, నియోగవల్లభ అనే ఉద్యోగులు బహుశా పర్యవేక్షకులై ఉంటారని చరిత్రకారుల అభిప్రాయం.
👉🏻కాకతీయ శాసనాల్లోని బాహత్తర నియోగాధిపతులు (72 మంది) వీరి వారసులని చెప్పవచ్చు.
👉🏻కొరవి శాసనంలో శిక్షల ప్రసక్తి ఉంది.

ఆర్థిక పరిస్థితులు

👉🏻తూర్పు చాళుక్యుల కాలంలో వ్యవసాయ, వాణిజ్య, పరిశ్రమల రంగాలు బాగా అభివృద్ధి చెందాయి.
👉🏻బ్రాహ్మణులు ఆలయాలు, భూములు అగ్రహారాలు పొంది భూస్వాములుగా రూపొందారు.
👉🏻తర్వాత కాలంలో బ్రహ్మదేయాల ప్రసక్తి తగ్గి సైనికులు, ఉద్యోగులకు గ్రామాలు దానం చేయడం పెరిగింది.
👉🏻రాజ్యానికి ప్రధాన ఆదాయం భూమి శిస్తు. దీంతోపాటు అనేక రకాల పన్నులు ఉన్నట్లు శాసనాలు వివరిస్తున్నాయి.
👉🏻వైదుంబరాజు భువన త్రినేత్రుడు సింహాసనం ఎక్కిన సందర్భంలో రేనాడు రైతులపై డేగరచ పన్ను, పడెవాలు పన్ను, పడియేరి పన్ను, సంధి విగ్రహం పన్ను మినహాయించాడు.
👉🏻కల్లనక్కం, విడనలి, విషయసుంకం, బీరదాయమ్ము చిట్టవాటం లాంటి పన్నులను నాటి శాసనాలు పేర్కొంటున్నాయి (రాయలసీమ ప్రాంత శాసనాల్లో కనిపిస్తున్నాయి).
👉🏻పన్నులు ధన రూపంలో, వస్తు రూపంలో చెల్లించేవారు. నాడు వర్తక సంఘాలను నకరములు అని, వర్తక సంఘాల నియమ నిబంధనలను సమయకార్యం అని పేర్కొనేవారు.
👉🏻వర్తక సంఘాలపై పన్నులు వసూలు చేసే అధికారులను సుంకప్రెగ్గడ అనేవారు. మాడలు, ద్రమ్మములు, గద్యాణాలు అనేవి నాటి ముఖ్య నాణేలు.
👉🏻మొదటి శక్తివర్మ బంగారు నాణేలు సయాం (బర్మా)లో లభించాయి. గ్రామాల్లో రట్టగుళ్లు అనే ఉద్యోగులు పన్నులు వసూలు చేసేవారు.
👉🏻భూ ఫలసాయంలో రాజుకు చెల్లించాల్సిన పన్ను (భూమిశిస్తు)ను కోరు అనేవారు. గ్రామరక్షణకు తలారులు అనే ఉద్యోగులను నియమించేవారు.
👉🏻విదేశాలతో వర్తకం చేసేవారిని నానాదేశి పెక్కుండ్రు అనేవారు.
👉🏻మాండలికుడు అనే అధికారి ప్రాంతీయంగా వర్తక నిర్వహణకు అనుమతి ఇచ్చేవాడు.
👉🏻మార్కెట్లు కూడళ్లకు, సరకుల రవాణా చేసేవారిని 'పెరికలు'గా పిలిచేవారు. చినగంజాం, కళింగపట్నం, కోరంగి, మచిలీపట్నం, మోటుపల్లి, కృష్ణపట్నం నాటి ప్రధాన ఓడరేవులు.
👉🏻చినగంజాం నాటి ముఖ్య రేవుపట్టణం అని అహదనకర శాసనం తెలియజేస్తుంది.
👉🏻చాళుక్య చంద్ర పేరుతో ఉన్న మొదటి శక్తివర్మ నాణేలు, రాజరాజనరేంద్రుడి నాణేలు బర్మా, థాయ్‌లాండ్ దేశాల్లో లభించాయి.
👉🏻తూర్పు చాళుక్యుల కాలంనాటి ప్రధాన నకర కేంద్రం పెనుగొండ. కల్లానక్కానం అంటే కల్లుపై విధించే పన్ను.
👉🏻కళ్యాణక్కానం అంటే వివాహపు పన్ను.
👉🏻కోరు అనేది పంటలో 1/6వ వంతు చెల్లించే భూమిశిస్తు. దొగరాజుపన్ను అంటే యువరాజు భృతికోసం చెల్లించే పన్ను.
👉🏻పడేవాళే పన్ను అంటే సైన్యాన్ని నిర్వహించడానికి ప్రజలు చెల్లించే పన్ను.
👉🏻యుద్ధ సమయంలో సైన్యాన్ని పోషించే గ్రామాలను జేతపుటూళ్లు అనేవారు.
👉🏻యుద్ధంలో రాజు ఓటమిని అంగీకరిస్తూ ఊదే కొమ్మును ధర్మధార అనేవారు.

మత పరిస్థితులు

👉🏻చాళుక్య యుగంలో ఆంధ్రదేశ చరిత్రలో ఆసక్తిదాయకమైన మత, సాంఘిక పరిణామాలు చోటు చేసుకున్నాయి.
👉🏻అందులో ముఖ్యమైంది బౌద్ధమతం క్షీణించి, దాని స్థానంలో జైనమతం అభివృద్ధి చెందడం.
👉🏻జైనానికి రాజాదరణ లభించింది. శూద్రులు, సామాన్యులు జైనమతాన్ని అనుసరించారు.
👉🏻అయ్యణ మహాదేవి విజయవాడలో నడుంబవసది జైన ఆలయాన్ని నిర్మించి ముషినికొండ గ్రామాన్ని దానం చేసింది.
👉🏻విమలాదిత్యుడు విజయనగరం జిల్లా రామతీర్థంలో ఒక జైన బసది నిర్మించాడు.
👉🏻కులోత్తుంగ చోళుడు మునుగోడు (సత్తెనపల్లి) వద్ద పృథ్వీతిలక బసది పేరుతో శ్వేతాంబర జైన బసది నిర్మించాడు.
👉🏻కడప జిల్లా దానవులపాడులో గొప్ప జైనక్షేత్రాన్ని అభివృద్ధి చేశారు. దీన్ని రాష్ట్రకూట మూడో ఇంద్రుడు నిర్మించాడు.
👉🏻బోధన్‌లోని గోమఠేశ్వర విగ్రహం నమూనాలోనే చాముండరాయుడు శ్రావణ బెళగోళాలో గోమఠేశ్వర విగ్రహాన్ని నిర్మించాడు.
👉🏻రెండో అమ్మరాజు కటకాభరణ జినాలయాన్ని ప్రకాశం జిల్లాలో నిర్మించాడు.
👉🏻పొట్ల చెరువు, కొలనుపాక, ఉజ్జిలి, వర్థమానపురం ప్రాంతాల్లో ఆరో విక్రమాదిత్యుడు జైనులకు దానధర్మాలు చేశాడు. పొట్ల చెరువులో 500 జైన వసదులు ఉండేవి.

సాంఘిక పరిస్థితులు

👉🏻వేంగి చాళుక్యుల కాలంలో చాతుర్వర్ణ వ్యవస్థ ప్రధానమైంది. అయినప్పటికీ కులవ్యవస్థ అత్యంత జఠిలమైంది.
👉🏻బ్రాహ్మణుల్లో వైదికులు, నియోగులు ఏర్పడ్డారు. వైశ్యులు జైనమతాన్ని అవలంభించారు.
👉🏻వారి కులదేవత వాసవీ కన్యకా పరమేశ్వరి. పెనుగొండలో కన్యకా పరమేశ్వరి దేవాలయం ఉంది.
👉🏻తెలికలకు, సాలెవారికి వృత్తి సంఘాలున్నాయి. విశ్వకర్మలు పంచాననం లేదా పంచాణం వారిగా అవతరించారు.
👉🏻పంచాణం అంటే కంసాలి, కమ్మరి, కంచరి, కాసె, వడ్రంగి అనే అయిదు తరగతులుగా విశ్వకర్మలు అవతరించారు.
👉🏻బోయలు, పుళిందులు లాంటి ఆటవిక జాతులవారు నాగరిక సంప్రదాయ సమాజంలో భిన్న కులాల్లో చేరారు.
👉🏻నాడు వైశ్యుల్లో 714 గోత్రాలవారున్నారు. శాసన, పత్రికాకారులుగా, లేఖకులుగా విశ్వకర్మలు పనిచేస్తూ, తమ పేరు చివరన ఆచార్య అనే పదాన్ని ధరించారు.

సాంస్కృతిక పరిస్థితులు

👉🏻తూర్పుచాళుక్యుల కాలంలో విద్యా సారస్వతాలు, వాస్తుకళా రంగాలు ఎంతో అభివృద్ధి చెందాయి.
👉🏻తెలుగు, సంస్కృత భాషలను పోషించారు.
👉🏻రెండో అమ్మరాజు ఆస్థానంలో భట్టిదేవుడు (కవి చక్రవర్తి), మాధవ భట్టు, పోతన భట్టు లాంటి కవులను పోషించారు.
👉🏻అందుకే రెండో అమ్మరాజు కవిగాయక కల్పతరువుగా పేరొందాడు.
👉🏻మూడో విష్ణువర్థనుడు కవి పండిత కామధేనువు అనే బిరుదు పొందాడు.
👉🏻రాజరాజ నరేంద్రుడు నన్నయ, నారాయణభట్టు, పావులూరి మల్లన లాంటి కవులను పోషించాడు.
👉🏻కల్యాణి చాళుక్యరాజు ఆస్థానం నుంచి నారాయణభట్టు.
👉🏻నారాయణభట్టు కుమార్తె కుప్పమ ద్రాక్షారామ శాసనంలో తన తండ్రి సోమేశ్వరుడి మంత్రి అని పేర్కొంది.
👉🏻నారాయణభట్టు సహాయంతోనే నన్నయ మహాభారతాన్ని తెనిగించాడు.
👉🏻రామతీర్థ వాసియైన ఉగ్రాదిత్యుడు కళ్యాణ కార అనే వైద్య గ్రంథం రచించాడు.
👉🏻పద్మ ప్రభ మలదరి దేవుడు కుంద కుందాచార్యుడి సమయసార (నియమసార)పై తాత్పర్య వృత్తి అనే భాష్యం రాశాడు.
👉🏻పావులూరి మల్లన తెలుగు భాషలో గణితసార సంగ్రహం అనే గ్రంథాన్ని రాశాడు.
👉🏻సంస్కృత భాషలో దీన్ని రచించింది మహా వీరాచారి అనే జైన కవి.
👉🏻సంస్కృత భాషలో యశస్తిలక, నీతి వాక్యామృత, యుక్తి చింతామణి సూత్ర లాంటి గ్రంథాలను రాసిన సోమదేవ సూరి కవిరాజు, శాద్వాదాచల సింహ, తార్కిక చక్రవర్తి లాంటి బిరుదులు పొందాడు.
👉🏻నాటి శాసనాల్లో తెలుగు భాషాభివృద్ధిని గురించి వివరణలు కనిపిస్తాయి.
👉🏻అతిప్రాచీన తెలుగు శాసనం కలమళ్ల శాసనాన్ని (కడప జిల్లా) ఎరుకుల ముత్తురాజు ధనుంజయుడు వేయించాడు.
👉🏻మరో ప్రాచీన తెలుగు శాసనమైన విప్పర్ల శాసనాన్ని మొదటి జయసింహ వల్లభుడు వేయించాడు.
👉🏻పంప సోదరుడు జినవల్లభుడు తన గంగాధర శాసనంలో తెలుగు కందపద్యాలు రాశాడు.
👉🏻రెండో యుద్ధమల్లు బెజవాడ శాసనంలో మధ్యాక్కరలు కనిపిస్తాయి.
👉🏻అద్దంకి శాసనంలో తరువోజ వృత్తం, సాతలూరు శాసనంలో చంపకమాల, కందకూరు, ధర్మవరం శాసనాల్లో సీస పద్యాలు దర్శనమిస్తాయి.
👉🏻బాడపుని ఆరుంబాక శాసనంలో కంద పద్యాలు కనిపిస్తాయి.
👉🏻కుమారిలభట్టు పూర్వమీమాంస పద్ధతిని ప్రచారం చేశాడు.
👉🏻రాజ్యవ్యాప్తంగా అనేక శైవ, వైష్ణవ ఆలయాలు నిర్మాణం విరివిగా సాగింది. పంచారామాలు అభివృద్ధి చెందాయి.
👉🏻ద్రాక్షరామ, చేబ్రోలు భీమేశ్వర ఆలయాలను మొదటి చాళుక్యభీముడు నిర్మించాడు. బిక్కవోలు (బిరుదాంకని ప్రోలు) దేవాలయాలను గుణగ విజయాదిత్యుడు నిర్మించాడు.
👉🏻నాటి శిల్పాల్లో వీణ, పిల్లనగ్రోవి, మృదంగం, తాళాలు లాంటి వాద్య పరికరాలు కనిపిస్తున్నాయి. నాటి ముఖ్య వినోదం కోలాటం.
👉🏻చాళుక్య మొదటి భీముడి కాలంలో హల్లీశకం అనే కోలాట నృత్య రీతి అభివృద్ధి చెందింది.



No comments:

Post a Comment

Post Bottom Ad